గురువారం, జనవరి 22, 2015

అమ్మా అమ్మా..

కాలం ఎంతటి బాధనైనా మరిపిస్తుందని అందరూ అంటూ ఉంటారు కానీ అది కొంతమేరకే నిజం. అంతకంతకూ పెరిగే మధ్యాహ్నపు నీడలా కాలం గడిచే కొద్దీ బాధ కూడా పెరుగుతుంది... అమ్మ మాకు దూరమై నేటికి ఆరేళ్ళు గడిచినా ఆ దిగులు మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు సరికదా తను దూరమైనప్పటి కన్నా తను వదిలి వెళ్ళిన శూన్యం ప్రశ్నిస్తూ తను లేని లోటు అనుక్షణం గుర్తొస్తూ ఉండేకొద్దీ ఆ బాధ మరింత పెరుగుతూనే ఉంది తప్ప తరగడంలేదు. తన అడుగు జాడల్లో నడవాలని ప్రయత్నిస్తూ తను అపురూపంగా నిర్మించిన పొదరింటిని పదిలంగా కాపాడుకుంటూ తన జ్ఞాపకాల ఊతంతో ఎలాగో కాలం గడుపుతున్నాను. 

ఇటీవల విడుదలైన రఘువరన్ బి.టెక్ చిత్రంకోసం రామజోగయ్య శాస్త్రి గారు రాసిన ఈ పాట నాకు చాలా నచ్చింది. ఒకరకంగా నా బాధకే అక్షర రూపమిచ్చారనిపించింది. ముఖ్యంగా రెండవ చరణంలో తను దూరమైనందుకు బాధ పడుతున్న బిడ్డను అమ్మ ఎలా ఊరడిస్తుందో రాసిన వాక్యాలు చక్కగా ఉన్నాయి. అవి జానకమ్మ గారు పాడడం మరింత బాగుంది. అమ్మకు నివాళిగా ఈ రోజు ఈ పాట ఇక్కడ పంచుకోవాలనిపించింది. ఎంబెడ్ చేసినది ఒక నిముషం పాటు సాగే వీడియో ట్రైలర్ మాత్రమే పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ లేదా మ్యూజిక్ సైట్ లో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

అమ్మకు నివాళిగా తన గురించి ఈ బ్లాగులో ఇదివరకు వ్రాసిన పోస్టులు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రఘువరన్ బి.టెక్ (2014)
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : దీపు, జానకి

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా..
మాటే లేకుండా నువ్వే మాయం
కన్నీరవుతోంది ఎదలో గాయం
అయ్యో వెళ్లిపోయావే
నన్నొదిలేసి ఎటుపోయావే
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
నేపాడే జోలకు నువు
కన్నెత్తి చూశావో అంతేచాలంటా.. 

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా..

చెరిగింది దీపం కరిగింది రూపం
అమ్మా నాపై ఏమంత కోపం
కొండంత శోకం నేనున్న లోకం
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం.
నాకే ఎందుకు శాపం
జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైనా నడిరేయి ముసిరింది
కలవరపెడుతోందీ పెను చీకటీ
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది
బ్రతికీ సుఖమేమిటీ..

ఓ అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా..

విడలేక నిన్ను విడిపోయి ఉన్నా
కలిసే లేనా నీ శ్వాస లోనా
మరణాన్ని మరచి జీవించి ఉన్నా
ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా
నిజమై నే లేకున్నా
కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా
కలతను రానీకు కన్నంచునా
కసిరే శిశిరాన్నే వెలివేసి త్వరలోనా
చిగురై నిను చేరనా... 

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా..
అడుగై నీతోనే నడిచొస్తున్నా
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా 
అయ్యో వెళ్లిపోయావే
నీలో ప్రాణం నా చిరునవ్వే 
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
వెన్నంటీ చిరుగాలై జన్మంతా
జోలాలీ వినిపిస్తూ ఉంటా...
ఈ పెయింటింగ్ చిత్రించిన వారు Mitra Shadfar ఇక్కడ నుండి సేకరించబడినది, వారికి ధన్యవాదాలు.

2 కామెంట్‌లు:

 1. వేణూ..మీరు "అమ్మంటే మెరిసే దీపం-కురిసే వానా" అని యెందుకన్నారో అర్ధమైంది..నేనీ పాట యెప్పుడూ వినలేదు..బహుశా మరోసారి వినే ధైర్యం కూడా లేదు..వింటున్నంత సేపూ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయండీ..మరి మీరి ఇది వింటూ, రాస్తూ, పోస్ట్ వెయ్యడమంటే..అసలు ఆ క్షణం లో మీరెలా వుండి ఉంటారో ఊహకే అందట్లేదు..మా అమ్మ మమ్మల్ని వదిలి రెండేళ్ళయ్యింది..మీ గుండె పడే బాధ తెలుస్తోంది..అమ్మ యెప్పుడూ తన బిడ్డ గుండెల్లో బాధగా, కంటి లో కన్నీరు గా ఉండాలని కోరుకోదట..గుండెల్లో దీపంగా, కంటిలో వెలుగుగా ఉండాలనుకుంటుందిట..మా నాన్నగారు చెప్పారు..అదే మాటని మీతో పంచుకోవాలనిపించింది..గాడ్ బ్లెస్..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. >>అమ్మ యెప్పుడూ తన బిడ్డ గుండెల్లో బాధగా, కంటి లో కన్నీరు గా ఉండాలని కోరుకోదట..గుండెల్లో దీపంగా, కంటిలో వెలుగుగా ఉండాలనుకుంటుందిట.<<

   థాంక్స్ ఎ లాట్ శాంతి గారు... ఎంత బాగా చెప్పారో.. మీ వ్యాఖ్యలెపుడూ నేను రాసే పోస్ట్స్ కన్నా బాగుంటాయండీ.. థాంక్యూ.. మీ అమ్మగారి గురించి తెలిసి బాధనిపించింది.. అది ఎవరూ తీర్చలేని లోటు.

   తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.