గురువారం, ఆగస్టు 01, 2013

దొంగా - పోలీసూ - ఓ కోర్టు.

6th April-2013:
సమయం తెల్లవారుఝామున సుమారుగా మూడున్నరై ఉంటుంది, అప్పటికి గంటక్రితమే పడుకున్న నేను నాన్నగారి పిలుపుకు ఉలికిపడి నిద్రలేచాను. తను “వెనుకవేపు తలుపేయడం మరచిపోయావా తీసుంది” అని అడిగారు. నేను “లేదండీ గంటక్రితమే మంచినీళ్ళు తాగుతూ కూడా చెక్ చేశాను వేసే ఉండాలే” అనుకుంటూ హాల్ లోకి వచ్చి తలుపు చూస్తే బార్లా తెరచి ఉంది.

ఒకడుగు బయటకి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూసి వచ్చి తలుపు వేసి ఎందుకో అనుమానం వచ్చి ఇంట్లో సామాన్లు చెక్ చేయడం మొదలెట్టాను. టేబుల్ మీద ఉండాల్సిన లాప్ టాప్ లేదు, టీవి మీద పెట్టిన స్మార్ట్ ఫోన్, కప్ బోర్డ్స్ లో ఉండాల్సిన మరో మూడు సెల్ఫోన్స్ కూడా లేవు, కొన్ని అల్మారాలలో వస్తువులు చిందరవందర చేసి ఉన్నాయ్. దాంతో ఇంట్లో దొంగతనం జరిగిందని అర్ధమైంది.

వెంటనే మిస్సింగ్ ఫోన్స్ కి రింగ్ ఇవ్వడం మొదలెట్టాం. మూడు ఫోన్లు స్విచ్చాఫ్ అని మెసేజ్ వచ్చింది నాలుగో ఫోన్ రింగ్ ఇంటి బయటనుండి వినిపించడం మొదలైంది. దానితోపాటే ప్లాస్టిక్ షీట్ మీద ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. మాకు దొంగ అక్కడే ఉన్నాడేమోనన్న అనుమానం వచ్చింది. వెంటనే పోలీసుల కోసం 100 కి ఫోన్ చేసి విషయం చెప్పి అడ్రస్ ఇచ్చి ఎదురు చూడ్డం మొదలెట్టాం.

అడుగుల చప్పుడు ఆగిపోయింది కానీ ఫోన్ రింగ్ మాత్రం అక్కడనుండే వినిపిస్తుంది. ఐదునిముషాలకి కొంచెం ధైర్యం వచ్చి సేఫ్టీకోసం పక్కనే ఉన్న పచ్చడిబండ తీస్కుని మెల్లగా తలుపు తీసి ఫోన్ రింగ్ వచ్చిన వైపు వెళ్ళాను. అక్కడ కాంపౌండ్ వాల్ మీద ఒక ఫోన్ ఉంది. లైట్ వేసి ఆ చుట్టు పక్కల ఇతర ఫోన్లు కానీ లాప్ టాప్ కానీ దొరుకుతుందేమోనని వెతికాను. ఇంకేవీ లేవు, ఫోన్ ఉన్న ప్రదేశాన్ని చాక్ పీస్ తో మార్క్ చేసి దాన్ని లోపలికి తెచ్చేసాను. పదినిముషాలకి పోలీసులు వచ్చారు.

ఇవే టవర్ బోల్ట్స్, మా తలుపు కిటికి ఇంతే ఉంటై.
వాళ్లకి విషయమంతా వివరించాక వాళ్ళు మేమూ కలిసి నిర్ణయించిందేమంటే వెనక వైపు తలుపు పక్కన ఉన్న కిటికీ తెరచి దానిలోనుండి చేయి/ఊస ద్వారా తలుపుకు పెట్టిన టవర్ బోల్ట్ తీసి దొంగ లోపలికి అడుగుపెట్టాడు అని (మీ ఇంట్లో కూడా తలుపు పక్కన కిటికీ ఉంటే దానితో సరిపెట్టకుండా తాళాలు జాగ్రత్తగా వేసుకోడం మరువకండి). వాళ్ళు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయ్యాక “ఫింగర్ ప్రింట్స్ దొరకచ్చు కనుక అల్మారాలలో వస్తువులను కదల్చవద్దు” అని చెప్పి ఇంటి చుట్టుపక్కల అంతా వెతికి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక పదింటికి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు. వేరే ప్రాంతంలో ఉన్నపుడు ఒకసారి రైటర్ గారితో మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పటికీ కేసుపెట్టడానికి వెళ్ళడం అదే ప్రధమం.

పోలీస్ స్టేషన్ లోని క్రైం డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ గారికి విషయమంతా వివరించాక అతనూ మరో కానిస్టేబుల్ కలిసి ఇంటికి వచ్చి వివరాలు నోట్ చేస్కుని వెళ్ళారు. ఉన్న వస్తువులేవీ కూడా వేలి ముద్రలు తీస్కోడానికి అనువుగా లేవని వదిలేశారు. ఆ సాయంత్రం మళ్ళీ స్టేషన్ కు రమ్మని చెప్పారు. ఆ సాయంత్రం నేను తెలుగులో రాసిచ్చిన రిపోర్ట్ తోపాటు దానిని వాళ్ళు ఆంగ్లంలోకి తర్జుమా చేసి కంప్యూటర్ లో  టైప్ చేసిన FIR కాపీ ఒకటి ఇచ్చారు. కేస్ లో పురోగతి ఉంటే మేమే కాల్ చేస్తామని చెప్పి నంబర్ నోట్ చేస్కుని పంపించేశారు. ఓవరాల్ గా పోలీసుల రెస్పాన్స్ నాకు చాలా బాగా నచ్చింది.

21st April 2013:
మధ్యాహ్నం ఒంటిగంట దాటింది, భోజనానికి కూర్చోబోతుండగా ఒక అన్నోన్ నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఎవరా అనుకుంటూ మాట్లాడితే “మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నాం, మీ లాప్ టాప్ దొరికింది వచ్చి ఐడెంటిఫై చేయండి” అని చెప్పారు. నేనూ తమ్ముడూ భోజనం కూడా చేయకుండా పరుగున పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. ఒక లాప్ టాప్ ఆరో ఏడో సెల్ఫోన్స్ తీసుకువచ్చి వీటిలో మీ వస్తువులు గుర్తుపట్టండి అని అడిగారు. లాప్ టాప్, ఒక సెల్ఫోన్ మావే అని చెప్పాం. దొంగ దగ్గర ఈ మాత్రమే రికవర్ చేయగలిగామని నోకియా ఫోన్ లాక్ ఓపెన్ చేయలేక ఫ్రస్టేషన్ తో పగలగొట్టాడనీ మరో ఫోన్ పోయిందంటున్నాడనీ చెప్పారు.

"సర్లెండి ఈ మాత్రమైనా వచ్చాయి మా వస్తువులు మేం పట్టుకుపోతాం" అని చెప్పాం. ఆయన మమ్మల్ని పిచ్చివాళ్ళని చూసినట్లు చూసి నవ్వి అదంత వీజీకాదు దానికో ప్రొసీజరుంది అని మొదలెట్టారు. ఇక అక్కడ నుండి మా కష్టాలు మొదలయ్యాయ్ కేస్ బబుల్ గమ్ లా సాగడం మొదలైంది, సామాన్లు పోలీస్ స్టేషన్ లో లాకర్ లో భద్రంగా దాచారు. ఆ పక్కనే మరో సెల్ లో దొంగని కూడా పెట్టి మేపుతున్నారు. నేను మాత్రం పోలీస్ స్టేషన్ కి ఇంటికీ మధ్య చక్కర్లు కొట్టడం మొదలెట్టాను.

లీగల్ సిస్టం ఎంత చిత్రమైందంటే పోలీసులు ఇన్ఫార్మర్స్ ద్వారానో అనుమానితులపై నిఘా వేసో దొంగలను పట్టుకున్నామని చెప్తే కోర్ట్ నమ్మదట. వాళ్ళని సక్రమంగా పట్టుకున్నట్లు కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించాలిట. ముందుగా అలాంటి ఇద్దరు సాక్షులను అరేంజ్ చేయిస్తే రెండు మూడు వారాలలో మీ సామాను మీకు ఇప్పిస్తామని చెప్పారు కానీ అలా చెప్పగలిగిన వాళ్ళు నాకు ఎవరూ తెలియరని చెప్పాను. అయితే బాగా ఆలశ్యమవుతుంది ముద్దాయి కూడా శిక్ష తప్పించుకోవచ్చు అన్నారు. నేను చేయగలిగింది ఏమీలేదని చెప్పడంతో సాధారణంగా ఎప్పటిలాగే వారి పద్దతులలో కేస్ ఫైల్ చేస్తామని చెప్పారు.

కేస్ ఫైల్ చేశాక నేను ఒక లాయర్ ని పెట్టుకుని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కేస్ ఫైల్ చేయాలట దానికి లాయర్ ప్లస్ కోర్ట్ ఫీజులూ చెల్లించాలి అదీకాక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి శాలరీ సర్టిఫికెట్ తో వస్తువుల ధరకి హామీ ఇప్పించాలిట. అంటే నేను కేస్ హియరింగ్ కి వచ్చినరోజున వస్తువులని మళ్ళీ కోర్ట్ లో హాజరుపరచాలి అలా కాని పక్షంలో ఆ ఆఫీసర్ కోర్టుకు డబ్బులు కట్టాలన్నమాట. లేదా కేస్ హియరింగ్ కి వచ్చిన రోజున కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి మీ వస్తువులు మీరు తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. కేస్ కోర్ట్ లో ఫైల్ చేయడానికి కొన్ని రోజులు ఆలశ్యం అయింది. ఆ తర్వాత ఒక లాయర్ ని మాట్లాడాలని చెప్పి మరికొన్ని రోజులు తాత్సారం చేసి తిప్పుకున్నారు. అంతలో హియరింగ్ దగ్గర పడింది.

26th July 2013
అంతకు నాలుగు రోజుల ముందే ఈరోజు మీ కేస్ హియరింగ్ అని చెప్పడంతో పదిన్నరకు కోర్ట్ ఆవరణకు చేరుకున్నాను. నా జీవితంలో మొట్ట మొదటి సారి అక్కడికి వెళ్ళడం, కోర్ట్ అనగానే సినిమాలలో చూపించినట్లు ఎత్తైన మెట్లు భారీ సెట్టింగ్ ఊహించుకున్న నాకు మాములు భవన సముదాయం కనిపించి నిరాశపరిచింది. సరే ఇక్కడిలాగే ఉంటుందేమో అని కాస్త లోపలికి నడవగానే చెడు వినకు, అనకు, కనకు అంటూ బక్కచిక్కిన మూడు కోతి బొమ్మలు వెల్కం చెప్పాయ్. నాకు కావలసిన కోర్ట్ రూం ఎక్కడుందో వాకబు చేస్తూ మరికొంచెం ముందుకు వెళ్ళగానే న్యాయదేవత ఎదురైంది ఆవిడని తప్పుకుని ముందుకు వెళ్తే నేను వెతుకుతున్న కోర్ట్ హాల్ కనిపించింది అక్కడే ఉన్న మా పోలీస్ స్టేషన్ HC(Head constable) ని పలకరించాను. ఆయన నాతరఫున వస్తువులను రిటర్న్ చేయమంటూ లెటర్ రాసి సంతకం పెట్టించుకుని కోర్ట్ లో సబ్మిట్ చేసి "మీ పేరు పిలుస్తారు ఎదురు చూడండి" అని చెప్పారు.

మాములు పాత యూనివర్సిటీ/గవర్నమెంట్ బిల్డింగ్స్ లాగా పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన భవనం అది. ముందు కొన్ని నీడనిచ్చేచెట్లున్నాయ్ వాటికింద నాలుగైదు సిమెంట్ బల్లలు ఉన్నాయి. వాటిమీద ముద్దాయిలు సంకెళ్ళతో కూర్చుని ఉన్నారు వారిపక్కన వారికి ఎస్కార్ట్ గా వచ్చిన పోలీసులు గన్నులతో ఉన్నారు. సంకెళ్ళనీ గన్నునీ కూడా అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. వీళ్ళేకాక రకరకాల పనులమీద వచ్చిన ఇతర వ్యక్తులు కూర్చుని ఉన్నారు. కులం జాతి మతం ప్రాంతం అనే బేధాలకి అతీతంగా అందరూ కలిసి కూచుని జడ్జిగారికోసం ఎదురు చూస్తున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పసిపిల్లలని వెంట తీస్కొని వచ్చిన వాళ్లు, యువకులు, పండు ముదుసలులు అందరూ ఉన్నారు.

ఆవేళ కాస్త ఆలశ్యంగా పదకొండుముప్పావుకి వచ్చారు జడ్జిగారు. ఆవిడ వచ్చీ రాగానే అప్పటివరకూ రిలాక్స్ గా ఉన్న వాతావరణం మారిపోయింది. ముందుగా వాయిదాలు ఇచ్చే కేసులను ఒకదాని తర్వాత ఒకటి పిలిచి పెద్దగా చర్చలేకుండానే తరువాతి వాయిదా తారీఖుని ఇచ్చి పంపించి వేస్తున్నారు. అలా ఒక పది హేను కేసులు ఇచ్చి ఉంటారు వాటిలో కొన్ని 2005 అంటే ఎనిమిదేళ్ళక్రితం పెట్టినవి కూడా ఉన్నాయ్. కాసేపటికి నా పేరు పిలిచారు లోపలికి అడుగు పెట్టాను.

బహుశా ఇది పబ్లిక్ హియరింగ్ కోర్ట్ కాదేమో పబ్లిక్ గాలరీ లాంటివి ఏవీ లేవు. ఒక పొడవైన హాలు ఉంది దానికి ఒక చివర న్యాయమూర్తి అచ్చంగా సినిమాలో చూపించినట్లే పెద్ద డస్క్ కి అవతల వైపు ఒక ఎత్తైన ధర్మాసనంపై కూర్చుని ఉన్నారు. పక్కనే ఒక గుమస్తా నిలబడి ఉన్నారు. ఆ బెంచ్ కి కింద దానిని ఆనుకుని కోర్ట్ క్లర్క్ టేబుల్ ఉంది దానికి ఒక వైపు క్లర్క్ గారు కూచుని ఉన్నారు ఇంకోవైపు సాక్షి కోసం కుర్చీ వేసి ఉంది. నేను కోర్ట్ హాలులోకి ఎంటరైన గుమ్మం అక్కడే ఉంది.

నన్ను ఆ కుర్చీలో కూర్చోమన్నారు. నా పక్కనే పిపి(పబ్లిక్ ప్రాసిక్యూటర్) నుంచున్నారు ఆయనకి కాస్త అవతల డిఫెన్స్ లాయర్ ఉన్నారు. ఈ టేబుల్ తర్వాత వీళ్ళ వెనుక కాస్త ఖాళీ వదిలి పొడవాటి టేబుల్స్ రెండువైపులా వేసి ఉన్నాయ్ వాటిముందు న్యాయవాదులు కూర్చుని ఉన్నారు. ఆ టేబుల్స్ తర్వాత హాలుకు రెండో చివర మరో గుమ్మం ఉంది దాని దగ్గరగా ఖాళీ స్థలం ఉంది అక్కడ ఎస్కార్ట్ గా వచ్చిన పోలీస్ తో కలిసి ముద్దాయి నిలబడ్డాడు.

కోర్టు బంట్రోతు వచ్చి నాతో ప్రమాణం చేయించింది, భగవద్గీత ఏవీ లేదు కానీ చేతులు కట్టుకుని సేం డైలాగ్ “దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్దం చెప్పను” అని చెప్పాను. ఆ తర్వాత పిపి గారు ముందుగా నా పర్సనల్ వివరాలు ఆ తర్వాత జరిగిన అఫెన్స్ గురించి ఏవేవి పోయాయి ఏవి దొరికాయి ఇతరత్రా వివరాలు అడుగుతూంటే నేను చెప్పిన వాటిని తన దగ్గర ఉన్న రిపోర్ట్ తో టాలీ చేస్కుంటూ జడ్జిగారు ఆమోదం తెలపడం మొదలెట్టారు. నేను అంతా పూర్తిచేసి వస్తువులు ఐడెంటిఫై చేశాక డిఫెన్స్ లాయర్ ని ఏవైనా అభ్యంతరాలున్నాయా అని అడిగారు తను లేవని చెప్పాక అతని వస్తువులు అతనికి ఇచ్చేయమంటూ జడ్జిగారు ఆర్డర్ పాస్ చేశారు.

నేను చెప్పిన వివరాలను కోర్ట్ క్లర్క్ అక్కడికక్కడే ఒక పేపర్ మీద రాసి ఇస్తే దాని మీద ప్లస్ ఆరోజు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్లుగా ఒక రిజిస్టర్ లోనూ నేను సంతకం చేయాల్సి ఉంటుంది బయట వెయిట్ చేయమన్నారు. నాతో ప్రమాణం చేయించిన బంట్రోతు వచ్చి సంతకాలు పెట్టించుకుని “డబ్బులు ఇవ్వు” అని డైరెక్ట్ గా అడిగింది. ఒక్క క్షణం స్టన్ అయిన నేను “అదేంటమ్మా పదడుగుల దూరంలో గుమ్మం అవతల న్యాయమూర్తిని పెట్టుకుని ఇలా అడగడానికి భయమేయట్లేదా?” అని అడిగాను. ఇక్కడ ఇదంతా కామనే సార్ కాఫీకైనా ఒక ఇరవై రూపాయలివ్వండి అంటూ దబాయించి మరీ తీస్కుంది.

ఈ ప్రొసీజర్ అంతా అయిన ఒక గంటకి న్యాయవాదుల సంతకాలతో కోర్ట్ ఆర్డర్ విడుదలయ్యాక దాన్ని తీస్కుని అదే ఆవరణలో ఉన్న క్లరికల్ ఆఫీస్ కి వెళ్ళి వస్తువులు హాండోవర్ చేస్కున్నట్లు ఒక పర్సనల్ బాండ్ మీద రెవెన్యూ స్టాంపులపై సంతకాలు చేసాక నా వస్తువులు నా చేతికి వచ్చాయి. రికవర్ చేయని రెండు సెల్ఫోన్స్ పై ఆశలు వదిలేసుకోవడమే తప్ప ఇక చేయగలిగింది ఏం లేదని చెప్పారు. ఐతే లాప్ టాప్ చెక్కుచెదరకుండా ఎలా ఉన్నది అలానే చేతికి రావడం మాత్రం బోలెడంత సంతోషాన్నిచ్చింది.

అదండీ నేను చూసిన ఒక సీరియస్ దొంగతనం సంగతి. ఈ సిరీస్ లో ఇదే ఆఖరి పోస్ట్. కేవలం టవర్ బోల్ట్ వేసి తాళం మర్చిపోయి పడుకోవడమనే చిన్న పొరపాటు వల్ల వాడెవడో మా ఇంటికొచ్చి దొంగతనం చేస్తే నాలుగు నెలల పాటు టెన్షన్, తిప్పట, కొంత అనవసర ఖర్చు, రెండు సెల్ఫోన్స్ నేను చెల్లించిన మూల్యం కాగా దాని మూలంగానే జీవితంలో మొదటిసారి పోలీస్ స్టేషన్, కోర్టు లకు వెళ్ళి సిస్టం గురించి తెలుసుకుని కొత్త అనుభవాన్ని చవి చూశాను. విచిత్రం ఏవిటంటే దొంగలని పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేయడానికి పోలీసులకి పదిహేను రోజులు పడితే, కోర్టుకు సబ్మిట్ చేసి నా వస్తువులు నాకు ఇప్పించడానికి మూడునెలలు పట్టింది.    

12 కామెంట్‌లు:

 1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. నాకూ కొత్తగానే ఉందండీ...

  మన తప్పు లేని ఒక చిన్న దొంగతనానికే ఇన్ని ఇబ్బందులు పడితే, పెద్ద పెద్ద కేసులకి ఏమయిపోవాలో? ఇందుకు కాదా కోర్ట్లు, కేసులు అంటే జనాలు భయపడి చచ్చేదీ? మొత్తానికి కధ సుఖాంతం అయ్యిందన్న మాట.

  ఇంతకీ ఖర్చు ఎంతయ్యిందో చెప్పేరు కారు. అది కూడా తెలిస్తే ఇలాంటి వాటికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలో వద్దో డిసైడ్ అవుతాము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ రాజ్.. మరే కథ సుఖాంతమే అయిందనుకోవాలి నోకియా కూడా దొరికితే పూర్తిగా సుఖాంతమని ఒప్పుకునే వాడ్ని :-)) ఖర్చులకి రిసీట్లుండవుకదా ఇంతని ఏముండదు రాజ్ అంతా మనం నెగోషియేట్ చేయడం పై ఆధారపడి ఉంటుంది.

   తొలగించండి
 2. పోయిన వస్తువులు కొన్నైనా దొరికాయన్నా ఆనందం కాస్తా ,వాటిని తెచ్చుకోవడానికి పట్టిన తిప్పలు వల్ల తగ్గిందన్నమాట .పోనిలెండి అన్నీ నెలలు పట్టినా ,తిరిగినా ,కొన్నైనా చేతికొచ్చాయి.ఈ మధ్య మా చుట్టాలింట్లో ,ఐదు లక్షల విలువ చేసే బంగారం ,లాప్టాప్ ,ఇంకా చాలా దోచుకున్నారు.పోలీసులు,పోలిసుకుక్క అన్నీ వచ్చాయి .పాపం ఇంకా ఏమి దొరకలేదు ,తెలిలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ రాధిక గారు, అవునండీ నిజమే నేను అలాంటి కేసులు చాలా విన్నాను. మొదట అసలు ఆశలుపూర్తిగా ఒదిలేసుకున్నాను ఏదో అదృష్టంబాగుండబట్టి దొరికిందంతే అనుకున్నాము :)

   తొలగించండి
 3. అందుకేనండీ, ప్రజలు కోర్టు మెట్లు ఎక్కడానికి ఇష్టపడరు (ఎలాగూ లేవంటారా? ). ఏదేమైనా మీ వస్తువులు తిరిగి వచ్చాయి కదా, సంతోషం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హహహ థాంక్స్ బాల గారు, మరే ఈ పోస్ట్ టైటిల్ "కోర్టు మెట్లెక్కించిన ఓ దొంగతనం" అని పెడదామనుకుని కూడా అసలు మెట్లే లేవు కదా అని మార్చేశానండి :-) చిన్న చిన్న వస్తువులైతే వదిలేసుకునేవాళ్ళని నేనూ చాలామందిని చూశానండీ.

   తొలగించండి

 4. Tell me about it!!
  అవును, నాక్కూడా ఇలాంటి కోర్ట్ ఎక్స్ప్‌పిరియన్స్ ఉంది.. మొత్తం ప్రోసెస్‌లో నేనెప్పటికీ మర్చిపోలేని విషయం, కోర్ట్‌లో ఒక పది పదిహేనుమంది నిందితులు/అనుమానితులు నిల్చుని ఉంటే వాళ్ళల్లో మా వస్తువు కొట్టేసినవాడిని ఐడెంటిఫై చేయమనడం! అప్పుడు వాళ్ళ చూపులున్నాయీ!! దేవుడా.. తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది!
  అన్నిటికంటే హైలైట్, మా వస్తువు మా చేతికొచ్చేసరికి నాలుగైదు సంవత్సరాలు పట్టింది! చేతితైలం కూడా బానే వదిలింది! :)))

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ నిషీ... కెవ్వ్వ్వ్వ్ నాలుగైదు సంవత్సరాలా ? అయితే నాపని తొందరగానే అయినట్లే. ఊ నన్ను కూడా ముద్దాయిని గుర్తుపడతావా అని అడిగారు, అబ్బే నాకసలు అతనెవరో తెలీదు అని చెప్పేప్పటికి వదిలేశారు. నిజమే అలా ఐడెంటిఫై చేసేప్పుడు ఫరదర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో అనే టెన్షన్ కూడా ఒకటి ఉంటుంది కదా.

   తొలగించండి
 5. చదువుతుంటేనే కొత్తగా అనిపించింది...కానీ మొత్తం ప్రాసెస్ కళ్ళకు కట్టినట్టుగా భలే వ్రాసారు.... 21 ఏప్రిల్ న వస్తువులు దొరికినట్టు వ్రాసిన లైన్ చదవగానే..మిగతా మ్యాటర్ చదవకుండా ముందు "తదుపరి " డేట్ కోసం చూసాను..(వస్తువులు చేతికి అందిన తేదీ ఎప్పుడా అనే కుతూహలం తో) .. ఊహించిందే నిజమైంది... పట్టుకోడని కంటే తిరిగివ్వడానికే ఎక్కువ టైం పట్టింది..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ మోహన్ గారు, అవునండీ అందుకే చాలామంది కేసులు పెట్టడానికి వస్తువులు క్లెయిమ్ చేయడానికి ఆసక్తి చూపడంలేదు.

   తొలగించండి

 6. "నా జీవితంలో మొట్ట మొదటి సారి అక్కడికి వెళ్ళడం, కోర్ట్ అనగానే సినిమాలలో చూపించినట్లు ఎత్తైన మెట్లు భారీ సెట్టింగ్ ఊహించుకున్న నాకు మాములు భవన సముదాయం కనిపించి నిరాశపరిచింది. సరే ఇక్కడిలాగే ఉంటుందేమో అని కాస్త లోపలికి నడవగానే చెడు వినకు, అనకు, కనకు అంటూ బక్కచిక్కిన మూడు కోతి బొమ్మలు వెల్కం చెప్పాయ్"..

  ఈవాక్యాలు చదివినప్పుడు చాలా నవ్వొచ్చిందండీ..మొత్తానికి కోర్టులందు సినీ కోర్టులు వేరయా అని మీ అనుభవం చదివాక తెలిసింది..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవును శాంతి గారూ.. నాకూ అపుడే మొదట తెలిసింది.. పాతకాలపు రాతి భవనాలలో తప్ప లోపల కోర్ట్ రూమ్ సెటప్ విషయంలో కూడా సినీ కోర్టుకు అసలు కోర్టుకు సంబంధమే లేదు. పాత పోస్ట్ ని వెలికి తీసి కామెంట్ చేసినందుకు థాంక్సండీ..

   తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.