ఆదివారం, ఆగస్టు 04, 2013

ఓ ప్రయాణం

సమైఖ్యాంద్రా గొడవలూ, బంద్ ల వలన మూడురోజులుగా వాయిదా వేస్కుంటూ వస్తున్న తెనాలి ప్రయాణానికి  నిన్నటి రోజున ముహుర్తం పెట్టాను. కాస్త చల్లబడబోయే గొడవలకి మొన్న కే.సి.ఆర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లై మళ్ళీ నిన్న పొద్దున్న కాస్త హడావిడి ఎదురైంది. వాళ్ళని తప్పించుకుని ఎలాగైతేనేం గుంటూరు బస్టాండ్ చేరుకుని తెనాలికి నాన్ స్టాప్ టికెట్ తీస్కుని డీలక్స్ బస్సెక్కాను, బస్ కాస్త ఖాళీగానే ఉందికానీ ఉన్న కొందరూ విండో సీట్స్ ఆక్రమించుకునేసరికి నిండుగానే ఉన్నట్లు కనిపించింది. 

ఖాళీగా ఉన్న ఒక సీట్ కాస్త మురికిగా ఉందనిపించి ఒకసారి చేత్తో దులిపాను, బంద్ మహిమ అనుకుంటాను ఒక పెద్ద ధూళి మేఘం ఇంతెత్తున ఎగసింది, ఖర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డం పెట్టుకుని మళ్ళీ దులిపాను అదే రేంజ్ లో మళ్ళీ దుమ్మొచ్చింది. నేను ఓపికగా ఎన్ని సార్లు దులిపినా నన్నుసవాల్ చేస్తున్నట్లు అదే రేంజ్ లో దుమ్ము వస్తుండేసరికి వెనక సీట్ లో కూర్చున్న ఒక పెద్దాయన “ఎంత దులిపినా అంతే వస్తుంది దానికన్నా అలాగే కూచుని ఇంటికెళ్ళాక మీ ఫాంట్ శుభ్రంగా దులుపుకోడం బెటర్” అని నవ్వుతూ సలహా ఇచ్చారు, బదులుగా నేనూ ఓ నవ్వు నవ్వి కొంచెం శుభ్రంగా కనిపించిన వెనక సీట్లో కూలబడ్డాను.

డ్రైవర్ ఎక్కాక “బస్ చెంచుపేట వరకే వెళ్ళుద్దండీ బంద్ కదా తెనాలి బస్టాండ్ కి తాళాలేశారుట” అని అనౌన్స్ చేశాడు. “హ్మ్ అక్కడనుండి ఎలా వెళ్ళాలో ఆటోలన్నా తిరుగుతున్నాయో లేదో” అనుకుంటూ కాస్త ఉక్కగా చిరాకుగా ఉండటంతో గాలికోసం కిటికీ సాధ్యమైనంత మేర తెరచి పాటలు పెట్టుకుని వింటూ సీట్ కి చేరగిలబడి పైన లగేజ్ ర్యాక్ కేసి చూస్తూ అలా ఆలోచనలలోకి వెళ్ళిపోయాను. తీరా తెనాలి వెళ్ళాక ప్రశాంతంగానే ఉందని తెలియడంతో నేను ఎప్పుడూ దిగే పాయింట్ దగ్గరే దించేశాడు.

బస్సు దిగి వంతెన మీద నడుస్తుంటే రోడ్డుకిరు వైపులా చిన్న చిన్న గంపలలో పెట్టుకుని పుట్టగొడుగులు/ పుట్టకొక్కులు/ మష్రూంస్ అమ్మే వాళ్ళు స్వాగతం పలికారు. నాకు వానాకాలం అనగానే గుర్తొచ్చే వాటిలో ఇవి కూడా ఒకటి, ఈ కూరంటే నాకు బోలెడంత ఇష్టం అయితే మాములుగా ఫాంస్ లో పెంచిన పుట్టగొడుగులు నాకు నచ్చవు. వానాకాలంలో ఇలా పల్లెల్లో కోసుకుని వచ్చి అమ్మేవి పూర్తిగా విచ్చని మొగ్గలు చిన్న చిన్నగా ఉండి మహా రుచిగా ఉంటాయి.

సూపర్ మార్కెట్స్ లో దొరికే పెద్ద పుట్టగొడుగులు వండుకుని ప్లస్ రెస్టారెంట్స్ లో దొరికే కూరలు ప్రయత్నించి అనేకసార్లు భంగపడ్డాక ఇక ఇలా లాభంలేదని వానాకాలం కోసం ఎదురు చూడడానికి అలవాటుపడ్డాను. దారిన మాములుగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు సైతం ఆగి అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ గంపల వేపు నడిచి బేరాలాడడం చూసి నవ్వుకుని ముందుకు సాగాను. చిన్నపుడు వర్షం పడిన ప్రతిరోజు “అమ్మా ఈరోజు పుట్టగొడుగులు మొలిచి ఉంటాయంటావా” అంటూ అమ్మని వేధించిన రోజులు గుర్తొచ్చాయి.   

అక్కడ పని అయిపోయాక అయిదున్నరకే కాస్త చల్లబడడంతో బస్టాండ్ వైపు నడక సాగించాను, సాధారణంగా క్యూలేకుండా టిక్కెట్ తీస్కునే అవకాశం ఎపుడూ కల్పించని తెనాలి బస్టాండ్ బంద్ వలన అనుకుంటాను ఖాళీగా ఉంది డైరెక్ట్ గా వెళ్ళి టిక్కెట్ తీస్కుని బస్సెక్కాను. ఈ సారి పట్టుమని పదిమంది కూడా లేరు కానీ చెంచుపేట స్టాప్ దగ్గరకి వచ్చే సరికి బస్సు నిండిపోయింది. వాతావరణం చల్లగా చాలా ఆహ్లాదంగా ఉంది మెత్తని గాలులు వీస్తూ తన సృష్టినంతటినీ భగవంతుడు సంప్రోక్షణము చేస్తున్నాడా అన్నట్లు ఆగి ఆగి కురుస్తున్న చిరుజల్లులు శరీరాన్నే కాదు మనసును కూడా పులకరింప చేస్తున్నాయి.

వాతావరణం ప్లస్ మనసు కూడా ప్రశాంతంగా ఉండటం వల్లో లేక ఈ మధ్య బయట ఎక్కువ తిరగకపోవడం అదీ పల్లెల మీదుగా ప్రయాణం చేయకపోడం వలనో తెలియదు కానీ ఈ తిరుగు ప్రయాణంలో బస్సు ముందుకు వెళ్ళేకొద్ది కనిపించే ప్రతి చిన్న దృశ్యం కూడా ఒక్కో జ్ఞాపకాన్ని కదిలిస్తూ నన్ను వెనక్కి గతంలోకి ప్రాయాణం చేయించింది. కాలవలలో సమృద్దిగా నీరు నిండి ఉండడం చూసి మనసు నిండిపోయింది. చెట్లమధ్య బస్సు పరుగులు తీస్తుంటే అప్పటివరకూ ఉన్న ఎండకి తోడు పచ్చని చెట్లపై అప్పుడే పడిన వర్షంవల్ల కాబోలు గాలి నాకు ఇష్టమైన కమ్మటి మట్టి వాసనతో పాటు మొక్కల నుండి వచ్చే ఒకరకమైన పసరు వాసనని కూడా మోసుకొస్తుంది ఆ గాలినీ ఆ పరిమళాన్నీ గుండెనిండుగా ఎంత పీల్చినా తనివి తీరలేదు.

ఇక ఊళ్ళోనే ఏదో ఒక సెంటర్ లో బోలెడన్ని పనసకాయలు పదులు ఇరవైలలో కాదు వందల కొద్దీ పనసకాయలు ఒకే చోట గుట్టగా పోసి అమ్ముతుండడం చూస్తే భలే అనిపించింది. వైజాగ్ లో చదువుకునే రోజుల్లో కాలేజ్ కి వెళ్ళేప్పుడు గోదారి జిల్లాల్లోనో విశాఖ జిల్లాలోనో దారిమధ్యలో రోడ్ పక్కన గుట్టలుగా పోసి అమ్మేవారు అవి గుర్తొచ్చాయి. అంతెందుకు అప్పట్లో మా డిపార్ట్మెంట్ లో ఒక పనస చెట్టు ఉండేది క్లాస్ బయటకు వస్తే ఎదురుగా కనిపిస్తూ పలకరించేది. ఇదివరకు గుంటూర్లోనే క్వార్టర్స్ లో ఉన్నపుడు మా కాంపౌండ్ లో కూడా పనసచెట్టు ఉండేది, శలవలకి వచ్చినపుడు ఎన్నికాయలు వచ్చాయి వివరాలు కనుక్కుని దానిని మురిపెంగా ఒకసారి చూసుకునే వాడ్ని, అవన్నీ వరుసగా గుర్తొచ్చాయ్.

నేను చూసిన గంపలు ఇంకా వెడల్పుగా ఉన్నయ్.
మరో చోట పెద్ద వెడల్పాటి గంపలలో రంగు రంగుల బుజ్జి కోడిపిల్లలని పెట్టి అమ్మడం కనిపించింది. ఇవి నేను చూసి పాతికేళ్ళుపైనే అయుంటుంది ఇంకా ఇలా అమ్ముతున్నారా అని ఆశ్చర్యమనిపించింది. చిన్నపుడు అవి కొనమని తెగ గొడవ చేసే వాడ్నట ఆ బుజ్జి బుజ్జి కోడిపిల్లలని చేతుల్లోకి తీస్కుంటే లోపలున్న వాటి శరీరభాగాలు కదులుతూ కితకితలుపెడుతూండే వెచ్చటి ఆ స్పర్శ భలే మురిపెంగా ఉండేది. అసలు అంత పెద్ద గంపలని నెత్తిన పెట్టుకుని ఎలా నడుస్తారో అనుకుని ఆశ్చర్యపోయేవాడ్ని. ఇక ఆ గంపల్లో రకరకాల రంగుల్లో కువకువలాడుతూ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ అవి చేసే సందడి ఎంత సేపు చూసినా తనివి తీరేది కాదు.

ఇక అలా కొంచెం ముందుకు వెళితే కొంత దూరం వెళ్ళాక ఒక చోట కట్టెల అడితి కనిపించింది, దీనిని కూడా నేను చూసి చాలా ఏళ్ళవుతుంది, ఈరోజుల్లో పూర్తిగా వీటి వాడకం పోయిందనుకున్నాను కానీ పెద్ద అడితి చూస్తే ఆ ఏరియాలో బాగానే డిమాండ్ ఉన్నట్లనిపించింది. నేను చిన్నపుడు మాది కట్టెలపొయ్యే అప్పట్లో వీధికో అడితీ ఉండేది చిన్నపిల్లలం కనుక మనకి ముట్టుకోడానికి నిషిద్దం కానీ ఆటలాడడానికి ఇంట్లో చూడకుండా వాటిని తీయడం చేతుల్లో ఎక్కడో అక్కడ పేళ్ళు గుచ్చుకుపోతే పడేబాధ తర్వాత తినే తిట్లూ ఇప్పటికీ గుర్తున్నాయ్. ఈ పొయ్యిల్లోకే పిడకలు కూడా వాడేవాళ్ళం.

ఇందులోనే ఊదుగొట్టం కూడా గమనించవచ్చు
కళ్ళాపితో చక్కగా అలికి ముగ్గులు పెట్టిన గాడి పొయ్యిలో ముందు కట్టెలు పేర్చి వాటి మీద పిడకలు పెట్టి వాటిమీద కిరసనాయిలు పోసి అంటిస్తే అపుడు బాగా మంట వచ్చి పేళ్ళుకూడా బాగామండేవి. పేళ్ళు పూర్తిగా కాలిపోయి మంట తగ్గే కొద్దీ కట్టెలని మెల్లగా ఇంకొంచెం ముందుకు లోపలికి జరుపుతూ ఉండాలి. ఇంకా మంట తగ్గేప్పుడు ఇనుముతో చేసిన ఊదుగొట్టం ఒకటి ఉంటుంది దానిలోనుండి గాలి ఊదితే మంట రేగి తిరిగి రాజుకుంటుంది. ఆ ఊదుగొట్టాలని పొయ్యిదగ్గరలోనే పెట్టేస్తే సెగకి వేడెక్కిపోయేది చూస్కోకుండా అది పట్టుకుని చేతికి బొబ్బలెక్కించుకున్న రోజులు కూడా ఉన్నాయ్.

ఇక వంటయ్యాక ఉండే నిప్పులలో గెణుసుగెడ్డలు/ చిలకడదుంపలు మొక్కజొన్న పొత్తులు, ఉల్లిపాయలు కాల్చుకుని తింటూంటే ఆహా ఆ రుచి అమోఘం. ఇక రాత్రుళ్ళు ఆ బూడిదలో వెచ్చగా ఉంటుందికదా పిల్లులు వచ్చి చేరి పడుకునేవి. అందుకే తిండిలేక పస్తులుండటాన్ని చెప్పడానికి "రెండ్రోజులుగా పొయిలో పిల్లిలేవలేదు" లాంటి వాడుక సామెతలు పుట్టాయి. అలాంటి పొయ్యిల మీదే ఒకప్పుడు పెద్ద పెద్ద వంటలు కూడా ఎలా చేసేసేవాళ్ళో తలచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. పిడకలంటే గుర్తొచ్చింది కొన్ని ఊర్లలో పాడి సంపదా, చెట్లకీ గోడలకీ కొట్టిన పిడకలు కూడా నా కళ్ళకి ఇంపుగా కనిపించాయండోయ్.

మరికాస్త ముందుకెడితే బుడంపాడు చెరువు దగ్గర అనుకుంటా బస్టాపు పక్కనే కూరగాయల మార్కెట్టు కూడా చిన్నపుడు నరసరావు పేటలో నాన్నతో కలిసి తిరిగిన మార్కెట్టుని గుర్తుచేసింది. పెద్దాయ్యాక సూపర్ బజార్ కి వెళ్ళడమే కానీ కూరగాయల మార్కెట్టుకో రైతుబజార్ కో వెళ్ళడం తక్కువే నేను. ఒక వేళ వెళ్ళినా అక్కడ ఇరుకు సందులు మురికి మధ్యలో కొనడం కొంచెం చిరాకుపెట్టేవి. కానీ ఈ మార్కెట్ వాటికి భిన్నంగా వరుసగా చక్కగా పక్కాగా కట్టిన కొట్లలో నీట్ గా అరలు అరలుగా కూరగాయలను సర్ది శుబ్రత కూడా పాటిస్తూ చూడగానే దిగి కొనుక్కోవాలనిపించేంత అందంగా స్పేషియస్ గా ఉండి భలే నచ్చేసింది.
 
ఇక వీటితో పాటుగా మబ్బులు పట్టిన ఆకాశంలో చిత్ర విచిత్రమైన వర్ణాలు రూపాలు ఆవిష్కృతమై దారిపొడుగునా ఆకాశంలోకి చూసినపుడల్లా కొత్త కొత్త రూపాలతో అలరిస్తూ నాకు తోడు వచ్చాయి. నిజానికి ప్రయాణంలో నాకు చాలా ఇష్టమైన హాబీ ఇదే, బస్ కిటికీలోనుండి మేఘాలను చూస్తూ వాటికి రకరకాల రూపాలనాపాదించడం. నిన్న నాకు బోర్లా పడుకుని పుస్తకం చదువుకుంటున్న అమ్మాయినుండి డాబాపై ఆరబెట్టిన బియ్యం వడియాల దాకా రకరకాల రూపాలలో కనిపించాయి మేఘాలు. అవండీ నిన్నటి నా బస్సు ప్రయాణం నాతో చేయించిన జ్ఞాపకాలలోకి ప్రయాణం విశేషాలు.

నాతో కెమేరా తీస్కుని వెళ్ళని కారణంగా ఫోటోలేవి తీయలేదు ఇక్కడ పెట్టిన ఫోటోలన్నీ గూగులమ్మనడిగి తెచ్చినవే. ఆయా ఫోటోలను తీసిన ఒరిజినల్ ఫోటోగ్రాఫర్లకు ధన్యవాదాలు. వీటికి సంబంధించినవే నచ్చిన మరికొన్ని ఫోటోలు.

నను గాభరాపెట్టే ఇరుకు మార్కెట్
 38 కామెంట్‌లు:

 1. Did you start from Hyderabad or Guntur? I ask because Tenali is very close to Guntur. You can easily go by car or motor cycle, isn't it?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ జయ్ గారు, గుంటూరునుండేనండీ అవును మీరన్నది నిజమే చాలాదగ్గర.

   తొలగించండి
 2. మీ వ్యాసం చదువుతూ, నేను కూడా మీతో ప్రయాణిస్తున్న అనుభూతి కలిగించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. హ హ బావుంది ! ఆ పుట్టకొక్కులు రావటానికి మామూలు వర్షం కాదనుకుంటా కొంచెం ప్రత్యేకంగా ఎక్కువ మెరుపులు పిడుగులు తక్కువ వర్షం ఉండేట్లుగా ఉండాలి అని గుర్తు నాకు :-)

  పొతే ఆ కూరగాయల షాపులు గట్టిగా గుర్తు తెచ్చుకోండి అది నారాకోడూరు కాదు ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ శ్రావ్యా. అవును చిన్నప్పుడు నాకూ అదే విన్న గుర్తు వర్షం పడిన ప్రతిసారి రావురా అని అమ్మ చెప్పేది పైగా అలాంటి వర్షం కురిసాక కొంతకాలం చల్లగా కూడా ఉండాలి.
   నిజం చెప్పాలంటే చెరువు షాపులు చూస్తూ ఊరు పేరు చూడడం మర్చిపోయాను, చివర్లో చూస్తే బి తో స్టార్ట్ అయినట్లు అనిపించింది. ఈసారి వెళ్ళినపుడు పక్కాగా చూసి చెప్తాను :-)

   తొలగించండి
 4. పటపట....వినపడిందా పళ్ళు కొరుకుతున్న శబ్దం:)) తెనాలితో నా చుట్టరికం అలాంటిది మరి:))

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హహహ సునీత గారు ధన్యవాదాలు, అలా మనకి ఇష్టమైన ఊరుని మరోసారి గుర్తు చేస్తే ఆనందించాలండీ అలా కోపగిస్తే ఎలా :-))

   తొలగించండి
 5. మీ ప్రయాణం కబుర్లు బావున్నాయండి :)

  రిప్లయితొలగించండి
 6. బాగున్నాయండి కబుర్లు...ఫొటోలు..'బోర్లా పడుకుని పుస్తకం చదువుకుంటున్న అమ్మాయి...' కూడా..:-)

  రిప్లయితొలగించండి
 7. బాగున్నాయి.మీ తెనాలి ప్రయాణం కబుర్లు .కొన్ని మీరు తీసిన ఫోటోలనుకున్నాను .అన్నీ గుగులమ్మవే అనుకోలేదు.పుట్టకొక్కులు మాకు తెస్తున్నారు పొలం నుండి .ఎర్రమట్టి పుట్టలపై బాగా లేస్తాయి వర్షం పడినప్పుడల్లా...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు రాధిక గారు. అవునండీ ఇపుడు మంచి సీజన్ కదా పుట్టకొక్కులకి గుంటూర్లో కూడా బానే దొరుకుతున్నాయి.

   కెమేరా కొన్న కొత్తలో తెగ ఫోటోలు తీసే వాడ్ని కానీ ఒక స్టేజ్ దాటాక ఫోటోలు తీయాలన్న ఆసక్తి తగ్గిపోయిందండీ ఎంత సేపటికి మనస్ఫూర్తిగా ఆస్వాదించి మదిలో భద్రపరచుకోడమే అలవాటైంది. నిజానికి మొన్న ఫోన్ కెమేరా ఉంది కానీ బస్ లో కదా ఎలాగూ సరిగా రావులే అని తీయలేదు. ఓపికగా గూగుల్ లో వెతికి పట్టాను ఫోటోలన్నీ :)

   తొలగించండి
 8. ఫోటోలూ, కబుర్లూ దేనికవే.. బోల్డు మెమొరీస్ కెలికేశారండీ..
  అద్భుతః

  సంప్రోక్షణము> అనిన?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ రాజ్ :-)
   సంప్రోక్షణము అంటే శుద్ధముచేయుట, మంత్రములతో నీళ్ళు చిలుకరించుట.
   పూజలు చేసేప్పుడు కలశారాధన తర్వాత పూజా ద్రవ్యాలపై మనపై తమలపాకుతో నీళ్ళు చల్లుతారు కదా అదనమాట. ఆగి ఆగి చిలకరిస్తున్నట్లుగా సన్నని జల్లులు కురిసేప్పటికి నాకు అలా అనిపించింది :)

   తొలగించండి
 9. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు దారిలో చూశాను ఆ రంగుల కోడి పిల్లలని.
  ఇంకా అమ్ముతున్నారా? అని అనిపించింది. బింగో

  చిన్నప్పుడు సంతలో రూపాయికి ఒకటి చొప్పున కొని, నిర్మా సబ్బుల అట్ట పెట్టికి కిటికీలు పెట్టి, అగ్గిపుల్లలతో.. అందులో వాటిని పెట్టేవాడిని. తాగడానికి చిన్ని గిన్నెతో నీళ్ళు ;)
  ఇక అవి చేతికి దొరికేస్తాయేమో.. తెగ ఆడుకునే వాడిని. కాకపోతే కొంచెం ఎదిగాక ఇల్లంతా పాడుజేసేస్తున్నాయని నానమ్మ కి ఇచ్చి ఊరికి పంపేశారు మా మాతాశ్రీ ;)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హహహ బింగో నేను కూడా సేంటుసేం... చిన్నపుడు అలా అట్టపెట్టెలో కొన్నాళ్ళు పెంచిన తర్వాత అమ్మమ్మవాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం అక్కడ మిగిలిన వాటితో పాటు పెరిగేవి. ఇక ఆ కోళ్ళగంపతో ఎన్ని ఆటలాడేవాళ్ళమో ఐదునిముషాలకోసారి గుడ్డుపెట్టిందేమోనని సందుల్లోంచి చూసిరావడం అమ్మమ్మేమో "మీరలా వెళ్ళి బెదరగొడితే అది పెట్టదురా" అని కేకలేయడం భలే ఉండేది :)

   తొలగించండి
 10. మీ ప్రయాణం కబుర్లు బాగున్నాయండి.

  రిప్లయితొలగించండి
 11. "అప్పుడే పడిన వర్షంవల్ల కాబోలు గాలి నాకు ఇష్టమైన కమ్మటి మట్టి వాసనతో పాటు మొక్కల నుండి వచ్చే ఒకరకమైన పసరు వాసనని కూడా మోసుకొస్తుంది ఆ గాలినీ ఆ పరిమళాన్నీ గుండెనిండుగా ఎంత పీల్చినా తనివి తీరలేదు"exlnt.
  మీతోపాటు మేము బస్సు లో తెనాలి వెళ్లి వచ్చేసాము.చక్కని జ్ఞాపకాలు ,రంగురంగుల కోడిపిల్ల లతో మేము ఆడుకున్న రోజుల్లోకి పంపేసారు

  రిప్లయితొలగించండి
 12. గుంటూరు-తెనాలి ప్రయాణంలో ఇన్ని సంగతులున్నాయన్నమాట!!!బావున్నాయి మీ కబుర్లు.. :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హహహ థాంక్స్ మేధ గారు :-) ఆరోజు అలా అన్ని సంగతులు కనిపించాయండీ, బహుశా ఏ ఊళ్ళ మధ్య తిరిగినా కనిపించి ఉండేవేమో ఇవే సంగతులు :)

   తొలగించండి
 13. కొత్త లోకాన్ని చూపించారు వేణు గారు మీ మాటలతో. మీరు చెప్పిన వాటితో నాకు పెద్దగా పరిచయంలేనందుకు బాధగా అనిపించినా, మీరు వాటిని ఆస్వాదిస్తూ ఎంత ఆనందించి ఉంటారో తలుచుకోగానే ఆనందంగా అనిపించింది. కాని ఆ చిన్న పుట్టగొడుగుల కూరయితే, ఒకసారి స్నేహితురాలి ఇంటికి వెళ్ళినపుడు తిన్నాను. ఆహా అద్భుతం. ఇక్కడ మార్కెట్ లో దొరికే మష్రూమ్స్ తో దొరికే వాటితో కొన్ని సార్లు వండాను కాని హూం ఇంటి దగ్గర పెరిగిన వాటితో చేసిన రుచి కాలి గోటికి కూడా సరిపోలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ ప్రియ గారు. హ్మ్ నిజమేనండీ పల్లెల్లో ఎర్లీ 80's లో బాల్యాన్ని చూసిన నాతరం ఒకరకంగా లక్కీ అనే చెప్పుకోవాలి మేం ఒక హ్యూజ్ ట్రాన్సిషన్ కి సాక్షులుగా మిగిలాం. ఈ పోస్ట్ లో చెప్పినట్లు ఇప్పుడూ ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా తగ్గిపోతున్నాయి. అప్పట్లో సెల్ఫోన్ అనేదాని గురించి ఊహించడం కూడా కష్టం ఇపుడు అవి లేకపోవడాన్ని ఊహించలేం :-) హహహ "కాలిగోటికి కూడా సరిపోవంటూ" పుట్టగొడుగుల గురించి ఒక్కమాటలో భలే చెప్పారు :-)

   తొలగించండి
 14. నా చిన్నప్పటి రోజులు గుర్తుకువచ్చాయి, ఆ పుట్టగొడుగులు, కోడిపిల్లలూనూ..............

  రిప్లయితొలగించండి
 15. Hai Venu, Are you the one use to come to andhrafolks/ This is Anu from uk. its been long we spoke. Nice blog, i came across this yesterday. very Good narration of the situation. Anu

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Thanks for your comment అను గారు. లేదండీ ఆంధ్రాఫోక్స్ నేనెపుడూ ఉపయోగించలేదు సో మీకు తెలిసిన వేణుని నేను కాదు.

   తొలగించండి
 16. Venu garu meeru maa tenali vachi velli natle nenu radhika gari Gandhi nagaram ninnane velli vachanandi chala baavundi chit chor cinema song lo la

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెరీ ఇంట్రెస్టింగ్ అండీ.. మొత్తానికి రాధిక గారిని సర్ ప్రైజ్ చేశారనమాట :-) చిత్ చోర్ లాగా అంటూ భలే పోల్చారండీ నిజమే కదా వాళ్ళ ఊరు అంతే అందంగా ఉంటుంది. మీరు విజిట్ చేసిన విషయాన్ని ఇక్కడ పంచుకున్నందుకు థాంక్స్ అండీ :-))

   తొలగించండి
 17. "బోలెడన్ని పనసకాయలు పదులు ఇరవైలలో కాదు వందల కొద్దీ పనసకాయలు ఒకే చోట గుట్టగా పోసి అమ్ముతుండడం చూస్తే భలే అనిపించింది".

  అబ్బా..అసలు ఆ పనసపళ్ళు చూస్తుంటే నోరూరిపోతోంది సుమండీ..రెండ్రోజులు కొద్దిగా ఖాళీ దొరికింది..నిన్న పాటల పల్లకి యెక్కి తిరిగా..ఈ రొజు మాటల వెల్లువ లో మునిగిపోయా..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాత పోస్టును వెలికి తీసి కామెంట్ చేసినందుకు థాంక్సండీ.. మీ పుణ్యమా అని మళ్ళీ ఓసారి ఆ రోజుల్లోకి వెళ్ళి అప్పటి ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నానండీ.. పనసకాయలు అద్భుతహ అంతే :-)

   తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.