ఆదివారం, ఆగస్టు 18, 2013

చీమలు దోమలు ఈగలు - చిట్కాలు

ఈ రోజు నేను మీకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు/హోం రెమెడిస్ గురించి చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఇవన్నీ కొందరు పెద్దలు, మరి కొందరు ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకుని నేను ప్రయత్నించి ఫలితం చూసినవి.

చీమలు : ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేక బండలమధ్యో కొంత ప్లేస్ చేస్కుని చీమలు మనమీద దండయాత్ర చేసేవి అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సినో ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది. కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ మామూలు ఇళ్ళలోకూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ నుండి వస్తాయో తెలీదు. ఒకసారి దాడి మొదలెట్టాక స్వీటూ, హాటు, అన్నం, పప్పు, ఫర్నిచర్, లాప్ టాప్ అని తేడా లేకుండా ఎడతెరిపి లేకుండా ఎక్కాడపడితే అక్కడ తిరిగేస్తాయ్.

నిజానికి నేను మా వంటగది కిటికీలో వీటికోసం చిన్న ప్లేట్లో పంచదార వేసి విడిగా పెడతాను ఎపుడూ, సాధారణంగా బుద్దిగా అది మాత్రం తిని మిగతా చోట్లకి దాడిచేయవు. అక్కడ అదిపెట్టడానికి కారణం అదే అబండెంట్ సోర్స్ ఉన్నపుడు వెతుక్కుని మిగిలిన చోట్లకి రావుకదా అని. కానీ మొన్న వేసవిలో మాత్రం మమ్మల్ని బానే ఇబ్బందిపెట్టాయి ముఖ్యంగా సోఫాలకి కూడా పట్టేసేవి అవి ఎండలో పెట్టి దులిపినా రెండురోజులకి మళ్ళీ సిద్దం. వాటిమీద గమాక్సిన్ లాంటివి కూడా చల్లలేము, సోఫాలో కూర్చుంటే కుట్టి అల్లాడిస్తాయి కనుక వదిలేయనూలేము.

అలాంటి టైంలో ఓ చిట్కా గురించి తెలిసింది, ఇల్లు తుడిచేప్పుడు ఆ నీళ్ళలో ఉప్పుకలిపితే ఫలితం బాగుంటుందని అన్నారు. నేను ఆల్రెడీ ఖరీదైన క్లీనర్స్ కలుపుతాను అనో, మేం అసలు ఇల్లు తుడిచేదే బోరింగ్ లో వచ్చే ఉప్పునీళ్ళతో అనో చెప్పకండి :-) ఇపుడందరూ వాడే అయొడైజ్డ్ టేబుల్ సాల్ట్ కాకుండా ఒకప్పుడు వాడే సాధారణ ఉప్పు కల్లుప్పు తెలిసే ఉంటుంది కదా. షాప్ లో క్రిస్టల్ సాల్ట్ / కల్లుప్పు అని అడిగితే ఇస్తారు. పేరు చూసి ఖంగారుపడకండి అది కల్లునుంచి ఏం తయారుచేయరు సముద్రపు నీటినుండే తయారుచేస్తారు. ఈ ఉప్పు కొంత నీళ్ళలో కలిపి ఒక వారం రోజులు తుడిస్తే చాలా ఆశ్చర్యకరంగా చీమలు అన్నీ మాయం వాటిని చంపామన్న బాధ లేకుండా వాటంతటవే వెళ్ళిపోయాయి.

దోమలు : చీమలు మనకి హాని చేసేది తక్కువే కనుక వాటి పట్ల జాలి చూపించినా దోమల పట్ల మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకపోతే అనేక జబ్బులకు కారకమవుతాయి. ఇంటిచుట్టూ మురుగు నీటి నిలవలు లేకుండా జాగ్రత్త పడడం ఇంట్లో కూడా దోమలు చేరగలిగేలా చెమ్మతో కూడిన చీకటి ప్రదేశాలు లేకుండా చూసుకోవడం ద్వారా కొంత నివారించవచ్చు. కిటికీకి మెష్ లూ, మంచాలకి దోమ తెరలూ, మార్కెట్లో రకరకాల బ్రాండ్ల మస్కిటో కాయిల్సూ, రిపెల్లెంట్సూ, వెతికి పట్టుకుని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపే మస్కిటో జాపర్స్ ఇన్ని పరికరాలున్నా అవి అందుబాటులో లేని సమయంలో కానీ కాయిల్స్ రిపెల్లెంట్స్ పడని వాళ్లుగానీ ఈ సింపుల్ హోం రెమెడీ వాడచ్చు.

దోమలు మనుషులు వదిలే కార్బన్ డై ఆక్సైడ్ వాసనని బట్టి మన ఉనికిని కనిపెడతాయట. సో ఆ ఎబిలిటీని మనం నిర్వీర్యం చేయడం ద్వారా దోమలు మనల్ని కనిపెట్టకుండా చేయచ్చు. ఇదే ఫార్ములా ఉపయోగించుకుని షర్టుకి అంటించుకు తిరిగే ఒక పాచ్ తయారు చేస్తున్నారు ఆ వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చూడచ్చు. అయితే ఇంచుమించు ఇదే పనిని హారతి కర్పూరం (Camphor) కూడా చేస్తుంది. షర్ట్ గుండీల పరిమాణంలో దొరికే కర్పూరం టాబ్లెట్స్ రెండు తీస్కుని వాటిని ఒక చిన్న వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసి అందులో వేసి బెడ్ దగ్గర పెట్టుకుంటే రాత్రంతా అవి నీటితో పాటు ఆవిరై కర్పూర పరిమళాన్ని గదంతా వ్యాపింప చేస్తూ దోమలను ఇంకా వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న కీటకాలను కూడా దూరంగా తరిమేస్తుంది.

లేదంటే పాత మస్కిటో మాట్ పరికరాలుంటే బొమ్మలో చూపినట్లు రెండు టాబ్లెట్స్ వేసి వేడి చేయడం ద్వారా కూడా ఇదే ఫలితాన్ని పొందచ్చు. ఐతే కర్పూరానికి మండే గుణం ఉంది కనుక ఈ పరికరం వాడేప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. నీటిలో వేయడం సేఫ్ నేను ప్రయత్నించి చూశాను బాగా పని చేస్తుంది. అలమారలలో వేసే మాత్/నాఫ్తలిన్ బాల్స్ వేరు ఈ హారతి కర్పూరం వేరు కన్ఫూజ్ అవకండి నేను చెప్పేది కర్పూరం గురించి. అలాగే యూకలిప్టస్, మెంథాల్, లవంగ వాసనలంటే కూడా దోమలకు పడదంటారు అవికూడా ఉపయోగించ వచ్చట.  

ఈగలు : వానాకాలంలో ఇవి కూడా ఎక్కువే వస్తాయి, ఫినాయిల్ లేదా లైసాల్ లాంటి క్లీనింగ్ లిక్విడ్స్ చాలా వరకూ పని చేసినా ఒకోసారి అలా శుభ్రం చేసే వీలు లేని కొండొకచో ఎంత శుభ్రంగా ఉన్నాకూడా ఫర్నిచర్ పైన మనుషుల పైనా వాలుతూ ఈ క్లీనింగ్ సొల్యూషన్ ఎఫెక్ట్ మాకేమాత్రం లేదని విర్రవీగుతుంటాయి. అలాంటి సమయంలో ఒక చిన్న బౌల్ లో పుదీనా ఆకులని నలిపి పెడితే మంచి వాసన రావడమే కాక ఈగలు బయటకు వెళ్ళిపోతాయి. ఒకవేళ వీటికి అలవాటు పడ్డాయనిపిస్తే లవంగాలు పొడిచేసి కొంచెం వార్మ్ వాటర్ లో వేసి ఉంచితే ఆ వాసనకి కూడా ఈగలు పోతాయని అంటారు. ఈ చిట్కాలు ఈగ సినిమాలో విలన్ సుదీప్ కి ఎవరూ చెప్పినట్లు లేరు పాపం :-) ఈమధ్య ఈ సమస్య ఫేస్ చేయలేదు కానీ లాస్ట్ ఇయర్ వేరే ఇంట్లో ఉన్నపుడు ఇవి నేను ప్రయోగించి చూశాను విజయవంతంగా పని చేశాయి. 

పై మూడూ నేను ప్రయత్నించి చూసిన చిట్కాలైతే మరో చిన్న చిట్కా ఇంకా ప్రయత్నించనిది ఇది ఎలుకలకి పని చేస్తుందట. ఎలుకని బోన్ లో బంధించాలన్నా మందుపెట్టి చంపాలన్నా అయ్యో పాపం అనుకునే వాళ్ళు ఈ చిట్కా ప్రయత్నించి చూడచ్చు. ఎలుకలకు కూడా స్ట్రాంగ్ స్మెల్ పడదట ఒక చిన్న కాటన్ బాల్ ని పెప్పర్ మింట్ ఆయిల్ లో ముంచి దాన్ని ఎలుకలు ఇంట్లోకి వస్తున్నాయి అన్న అనుమానమున్న చోట ఉంచితే రావట. అలాగే పలావు ఆకులని కిచెన్ లో ఉంచడం ద్వారా కూడా వీటిబాధను తప్పించుకోవచ్చట, బట్టల కప్ బోర్డ్స్ లో వేసే మాత్/ నాఫ్తలిన్ బాల్స్(కలరా ఉండలు) ఉన్నచోటకు కూడా ఎలుకలు రావని అంటారు. అలాగే అవి మీఇంటి బయట గోడల దగ్గర ఎక్కువ తిరుగుతున్నాయనిపిస్తే అవి తిరిగే చోట పుదీనా మొక్కలు పెంచినా కూడా వీటిభారినుండి తప్పించుకోవచ్చు అని విన్నాను. అవండీ ప్రస్తుతానికి నాకు గుర్తొచ్చినవి మీకేవైనా తెలిసినవి ఉంటే కామెంట్స్ లో పంచుకోండి. 

14 కామెంట్‌లు:

 1. ఆ ఉప్పు కళ్ళెలుగా ఉంటుంది కాబట్టీ అది కళ్ళుప్పు-కళ్లుప్పు-కల్లుప్పు అయింది. అంతా మన ప్రచురణకర్తల మహిమ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హ్మ్.. థాంక్స్ రహ్మాన్..
   రాత్రి సందేహపడుతూనే రాశాను ఎవరైనా మిత్రులు సరిచేస్తారులే అని ఎదురు చూస్తున్నా..
   నువ్ చెప్పిన కళ్ళెలు అన్నపదం నాకు నిఘంటువులలో కనిపించలేదు.
   ఆంధ్రభారతిలో(http://www.andhrabharati.com) కల్లుప్పు అనే ఉంది.
   బహుశా సముద్రపు ఒడ్డున కల్లము/కళ్ళము(బెడ్స్) పై చేస్తారు కనుక ఎలా అన్నా సరైనదేమో. ఇది కూడా నా ఊహే. కల్లము/కళ్ళము కి అర్ధం ఇలా ఉంది నిఘంటువులో 1. A couch or bed. పాన్పు.

   తొలగించండి
 2. దోమల చిట్కా , ఈగల చిట్కా నేను వాడుతాను . బాగానే పని చేస్తాయి కాని కొద్ది రోజులయ్యాక దోమలు కర్పూరం సువాసంకు అలవాటు పడి యదేశ్చగా తిరిగేస్తూ వుంటాయి :) అప్పుడు లవంగాలు పెడతాను కాని లవంగాలు కర్పూరం అంత పని చేయవు :)
  ఎలుకల చిట్కా నాకిప్పుడు చాలా అవసరం :) ప్రయోగించి చూస్తాను .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ మాల గారు, తప్పకుండా ప్రయోగించి ఫలితాలు చెప్పండి :-)

   తొలగించండి
 3. బాగున్నాయి మీ చిట్కాలు. మీరు ఉపయోగించి పనిచేస్తున్నాయని సర్టిఫై చేశారు కనుక వీటిని వాడవచ్చు అనిపిస్తుంది. థాంక్స్.

  రిప్లయితొలగించండి
 4. నాకు తెలిసినంత వరకు రాళ్ళ ఉప్పుని "కల్లుప్పు" అంటారు. కల్లు అంటే రాయి అని కూడా అర్ధం. అందుకే "ఉప్పు కల్లు" అనే పదం కూడా వాడుకలో ఉంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు నరసింహారావు గారు. నేను ఈ దిశలో ఆలోచించలేదు, మీరన్నట్లు కల్లు అన్నపదానికి రాయి/పార్టికల్ అనే అర్ధం కూడా ఉందట ఉప్పుకల్లు, మంచుకల్లు అనే వాడుక పదాలు ఉన్నాయని చెబుతున్నాయి నెట్ నిఘంటువులు.

   తొలగించండి
 5. బాగున్నాయి చిట్కాలు ..దోమలకి కాదుకాని కర్పూరం ఈగలకి వాడతాము పరవాలేదు అనిపిస్తుంది .దోమలకి కూడా కర్పూరం ట్రై చేయాలి (రాధిక

  రిప్లయితొలగించండి
 6. ballulaku(lizards) ki kuda edaina chitka unte chepandi venu garu :(

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అనుపమ గారు ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు మన్నించండి.. బల్లులకు నేను ప్రయత్నించి చూసినదైతే కోడిగుడ్డు పెంకు బాగా పని చేస్తుందండీ. ఆమ్లెట్ వేసినపుడు పెంకుకి అంటుకుని పలచని పొరలాగా గుడ్డు సొన ఉంటుంది కదా అది అలాగే ఉంచి (కడగకుండా) బల్లులు వచ్చే గూటిదగ్గర పెడితే రావు. ఇది రెండుమూడు వారాలకోసారి మార్చాలి. అలాగే పైన చెప్పిన జాగ్రత్తలు తీస్కున్నా కీటకాలుండవుకనుక బల్లులకి తిండి దొరకక వేరే చోటికి పోతాయి.

   ఇంకా ఒకసారి ఈ లింక్ లో చూస్తే మీకు మరిన్ని చిట్కాలున్నాయి అవి మరింత ఎఫెక్టివ్ గా పనిచేయచ్చేమో ప్రయత్నించి చూడండి. బల్లులు పోవడానికి చిట్కాలు

   తొలగించండి
 7. నీటిలో కర్పూరం వేసుంచితే... దోమలు పోతాయని అద్భుతమైన చిట్కా చెప్పారు. థ్యాంక్స్ వేణు గారూ...

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.