శుక్రవారం, జులై 26, 2013

హాస్టల్ – 11 (ఇంటిదొంగను ఈశ్వరుడైనా...)


ఇది నా హాస్టల్ కబుర్లు టపాల సిరీస్ కు కొనసాగింపు. ఆ సిరీస్ గురించి తెలియని వారు ఇక్కడ క్లిక్ చేసి ముందు పది టపాలు చదవచ్చు. 

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత మీరు వినే ఉంటారు కదా... ఆ ఈశ్వరుడు పట్టలేడేమోకానీ మా AO గారు తలుచుకుంటే మాత్రం పట్టేస్తారు. AO అంటే మా ఇంటర్మీడియెట్ కాలేజ్ Administrative Officer. నిజానికి ప్రిన్సిపల్ అనే పిలవాలి కాకపోతే ఆయనే మా కాలేజ్+రెసిడెన్షియల్ హాస్టల్+పక్కన ఉన్న చిన్న హైస్కూల్ అడ్మినిస్ట్రేషన్ పనులు అన్నీ కూడా చూసుకుంటుంటారు కనుక AO అని ఫిక్స్ చేశారు.

ఆయనపేరు ప్రభాకర్, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు, నిండైన రూపం, కళ్ళద్దాలుపెట్టుకుని, గుబురుమీసాలతో అప్పుడప్పుడు కొన్నిరోజులు నిండుగా గడ్డంపెంచి, ఎక్కువ రోజులు క్లీన్ షేవ్‌తో, ఎప్పుడూ మడతనలగని ఇస్త్రీబట్టలతో లైట్‌కలర్ షర్ట్‌ని డార్క్‌కలర్ ట్రౌజర్‌లోకి నీట్‌గా టక్‌ చేసి చూపులకి కొంచెం పొట్ట పెంచిన మళయాళ హీరో మమ్ముట్టీలా కనిపిస్తారు.

చూడటానికి హీరోలాగా కనిపిస్తారు కానీ మాపాలిట పెద్ద విలన్, ఛండశాసనుడు. అసలు నేను అక్కడ చదివిన రెండేళ్ళలో ఆయన నవ్వుతుండగా ఓ పదిసార్లకన్నా ఎక్కువ చూసి ఉండను. నేనేమిటీ ఎవ్వరూ చూసి ఉండరు ఇక ఆయన చేతిలో దెబ్బలు తినని స్టూడెంట్ అంటూ ఎవరూ ఉండేవారు కాదు, ఏదోరకంగా అందరమూ ఆయన కోపాన్ని చవిచూసినవాళ్ళమే. పైకి ఆయన్ని అందరమూ తిట్టుకున్నా చాలామందికి సీక్రెట్ గా ఆయనంటే ఒక హీరోవర్షిప్ ఉండేదని నా అనుమానం.

సరే ఇక మన కథానాయకుడు అదేనండీ మా తీఫ్ తిరుమలై దగ్గరకి వస్తే మావాడు ఓ మోస్తరు పొడవు, బక్కపలచని పర్సనాలిటీ, తెల్లటి తెలుపు చటుక్కున చూస్తే బాలీఉడ్ బడ్డింగ్ హీరోలా ఉంటాడు దానికి తోడు పరమ అమాయకమైన ఫేస్. కానీ మావాడు శివలో నాగార్జునలా ఒక గ్యాంగ్ ని వేస్కుని తిరుగుతుండేవాడు. ఆయన గ్యాంగ్ అన్నీ మంచి పనులు చేస్తే మా వాడి గ్యాంగ్ రాత్రుళ్ళు హాస్టల్ గోడదూకి వెళ్ళి పరోఠాలు, బిర్యానీ తెచ్చి అమ్మడం, మధ్యలో తగిలిన చెరుకు తోటలో చెరుకు గడలు కొట్టుకొచ్చి ఇవ్వడం, ఇంకా ఇలాంటి కృష్ణలీలలు కొన్ని చేసేవాడు.


మా క్యాంపస్ మొత్తానికి ఒక చిన్న క్యాంటీన్ కమ్ ప్రొవిజినల్ స్టోర్ ఒకటి ఉండేది పక్కన ఫోటోలో చూపించినంత పోష్ సెటప్ కాకపోయినా అప్పట్లో మా రేంజ్ కి అది పోష్ సెటప్ తోనే ఉండేది ఒక వైపు కౌంటర్ అందులోనే ఒక వైపు కుర్చీలు టేబుల్స్ వేసి ఉండేవి కౌంటర్ లో బేకరీ ఐటంస్ తో పాటు స్టూడెంట్స్ కి అవసరమయ్యే చిన్న చిన్న వస్తువులు సబ్బులు, షాంపూలూ, పేస్టులు, బ్రష్షులు, బుక్స్, పెన్సిల్స్ ఇతరత్రా అన్నీ స్టాక్ మెయింటెయిన్ చేసేవాళ్ళు. ఆ ఓనర్స్ రాత్రి ఎనిమిది గంటలకు క్యాంటీన్ మూసేసి పక్కన ఉండే పల్లెకి వెళ్ళిపోయేవాళ్ళు.

క్యాంటీన్ మెయిన్ గేట్ కి దగ్గరలో ఉండడంతో అక్కడి సెక్యూరిటీనే క్యాంటీన్ కు సైతం సెక్యూరిటీ అనమాట. ఐతే వాళ్ళు గేట్ దగ్గర కూర్చుంటారు కదా బయటనుండి వచ్చే వాళ్ళని ఆపగలరు కానీ క్యాంటీన్ వెనక వైపు హాస్టల్ నుండి ఈజీ యాక్సెసిబుల్ గా ఉండేది కనుక హాస్టల్ నుండి ఎవరైనా ఎంటర్ అయితే ఏం చేయలేరు. మా తీఫ్ తిరుమలై ఈ విషయం గమనించాడు ఆలశ్యం చేయకుండా ఒక రోజు ప్లాన్ గీసేశాడు. విజయవంతంగా అమలు పరిచాడు. ఎంత విజయవంతంగా అంటే చోరీ జరిగినట్లు వాళ్ళకే తెలియనంతగా మానేజ్ చేశారా గ్యాంగ్.


ఎలా ఎంటరయ్యే వాళ్ళో తెలీదు కానీ దొంగతనం జరిగిన ఆనవాలేవీ మిగిల్చే వారు కాదు, వెళ్ళినవాళ్ళు కూడా స్వల్పంగా తీస్కొచ్చేవాళ్ళట అంటే కేవలం ఒక వారం పదిరోజులకు సరిపడా స్టఫ్ మాత్రమే తెచ్చేవాళ్ళు. ఎంత జాగ్రత్తగా అంటే ఓనర్స్ సరుకులో తేడా వచ్చినా లెక్కల్లో ఏదో తేడా జరిగిందని అనుకునే వాళ్ళే కానీ దొంగతనం అనుకునే వాళ్ళుకాదు. అలా అవసరమైనపుడల్లా స్టోర్ రూంకి వెళ్ళి తెచ్చుకుంటున్నట్లు తెచ్చుకోవడం మొదలెట్టారు ఇలా కొన్ని రోజులు జరిగాక ఓసారి ఎక్కువ తేవడం జరిగిందో లేక రిపిటీషన్ వల్లనో ఓనర్ వాళ్ళకి అనుమానం వచ్చి మా A.O. గారికి కంప్లైంట్ చేశారు. 

మా చండశాసనుడు గారికి ఒక అలవాటుంది పిల్లలు అక్రమమైన పనులేమన్నా చేస్తున్నారేమో అని చెప్పకుండా  ఉన్నట్లుండి హాస్టల్ లో రూంస్ మొత్తం మెరుపు తనిఖీలు చేయిస్తుంటారు. వాటిల్లో మా వాళ్ళు తెచ్చే దొంగ సరుకు ఎపుడూ బయటపడేది కాదు. సరే తక్కువ తెస్తున్నారు కదా అందుకే దొరకట్లేదేమోలే అనుకునే వాళ్ళం మేము. ఆరోజు కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి రూముల్లో గోలగోలగా టైంపాస్ చేస్తున్నాం ఉన్నట్టుండి “రేయ్..” అంటూ సింహఘర్జన వినిపించింది. అరక్షణంలో అందరం కలుగులో నుండి బయటపడ్డ చిట్టెలుకల్లా రూముల్లోనుండి కారిడార్ లోకి వచ్చేశాం.

పొడవాటి కారిడార్ చివర నుంచుని ఉన్న మా ఛండశాసనుడు “అందరూ ఒక్క నిముషంలో మీ ట్రంకులు తాళాలు తీసి అక్కడే పెట్టి బయటకి వెళ్ళి నుంచోండి, ఒక్కొక్క రూం వాళ్ళని పిలుస్తాను” అని చెప్పారు. సాథారణంగా ఇలాంటి తనిఖీలు వార్డెన్స్ మీద, కొందరు ముఖ్యులైన స్టూడెంట్స్ మీదా వదిలేసి సూపర్వైజ్ చేసే ఆయన ఈ రోజు స్వయంగా రంగంలోకి దిగి ఒకో రూంలో తను కూడా నుంచుని అన్నీ తీయించి చూస్తున్నారు. మాకెవరికీ క్యాంటీన్ ఓనర్ కంప్లైంట్ చేసిన విషయం తెలీదు. నింపాదిగా నుంచుని వేడుక చూస్తున్నాము.


మా తీ.తి గాడి రూం తనిఖీ మొదలైంది, అప్పటికే ఆ రూం వాళ్ళమీద అనుమానముందేమో మరింత జాగ్రత్తగా ఎక్కువ సమయం తీస్కుని వెతికారు కానీ ఏవీ దొరకలేదు పక్కరూం అయిన మమ్మల్ని ఆల్రెడీ పిలవడంతో మేం వెళ్ళి రూం బయట నుంచుని ఎదురు చూస్తున్నాము. A.O. గారు బయటకు వస్తూ యథాలాపంగా తల ఎత్తి గుమ్మం పైకి చూసి ఒక్క నిముషం ఆగి వార్డెన్ గారిని పైన ఉన్న ఎలెక్ట్రిక్ స్విచ్ బోర్డ్ ఓపెన్ చేయమన్నారు.

ఇప్పుడంటే ఎలెక్ట్రిక్ వైరింగ్ అంతా కన్సీల్డ్ గా గోడల్లోంచే లాగేస్తున్నారు కానీ పాత బిల్డింగులకి బయటనుండే ఇచ్చే వారు ఆ వైర్లన్నీ ఒక స్విచ్ బోర్డ్ లోనికి వెళ్ళేవి అది ఒక పెద్ద సూట్ కేస్ తరహాలో తెరచి మూయగల గొళ్ళెం ఉన్న చెక్కబాక్స్ దాని పైన అన్ని రకాల స్విచ్ లు ప్లగ్ పాయింట్స్ బిగించి ఉండేవి. ఆ బోర్డ్ తెరిచినపుడు లోపల వైర్లు ఉన్నాకానీ బోలెడంత ఖాళీ కూడా ఉండేది పైనున్న బొమ్మలో చూపించినట్లు. సో వార్డెన్ మా తీ.తి గాడి రూంలోని ఆ స్విచ్ బోర్డ్ తెరవగానే పైనుండి చాక్లెట్లు, బిస్కట్లు, సబ్బులు, బ్రష్షులు, పేస్టులు వర్షంలా కురవడం మొదలైంది. సో ఇన్ని రోజులు ఆ బోర్డ్ లో దాచడం వల్ల ఎవరికీ దొరకలేదన్న విషయం ఛండశాసనుడితో పాటు మాక్కూడా అర్ధమైంది.

ఇక తనిఖీలు ఆపేసి ఆయన రెగ్యులర్ ఫార్ములా ఉపయోగించారు. “ఎవరు చేశారో చెప్తారా లేక రూంలో ఉన్న అరడజను మందికీ కోటింగ్ ఇచ్చి సస్పెండ్ చేయమంటారా” అని అడిగేసరికి దొంగల గ్యాంగ్ బయటపడింది. ఇక వాళ్ళని అక్కడికక్కడే ఉతికారు చూడండీ.. నా సామిరంగా.. ఒక్కొక్కళ్ళ ఒళ్ళు వాతలు తేలి రంగుమారిపోయింది ఆ తర్వాత పదిరోజులు సస్పెండ్ కూడా చేశారు. ఇంతా చేసి వాళ్ళంతా కూటికి లేక చేస్తున్నారా అంటే కాదు అందరూ లక్షాధికారుల పిల్లలే డబ్బుకు కొదవలేదు కేవలం థ్రిల్ అండ్ సరదా. ఇంకా చెప్పాలంటే క్లెప్టోమానియా ఏమో అని నాకు ఒక డౌట్. అదేంటో మీకు తెలియకపోతే వికీలో ఇక్కడ చూడండి.

ఈ గ్యాంగ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యానేమో తెలీదు కానీ ఈ క్లెప్టోమానియా పురుగు తర్వాత రోజుల్లో ఒకసమయంలో నన్నుకూడా కుట్టింది... సో నాలో ఉన్న ఆ తీఫ్ తిరుమలై గురించి త్వరలో...

18 కామెంట్‌లు:

  1. హ హ...మా AO గారు గుర్తొచ్చారండీ మీ టపా చదువుతుంటే...రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన...వొక్క చూపు చూస్తే చాలు...వంద అర్ధాలు వెతుక్కోవచ్చు..ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లో చేతులు వెనక్కి పెట్టుకుని తీక్షణం గా చూస్తూ వుండే వారు. హాస్టల్ లో వుండే అబ్బాయిలకి ఆయన చేతుల్లో బడిత పూజలు బాగానే జరిగేవట. A సత్యమూర్తి ఆయన పేరు...తెలుగులో రాసుకుంటే అస్త్యమూర్తి అవుతుంది నా పేరు అని ఆయనే జోకేసేవారు మీటింగుల్లో...:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ స్ఫురిత గారు, హహహ మీ ఏఓ గారి పేరు బాగుందండీ అసత్యమూర్తి :-) మీరు చెప్తే గుర్తొచ్చింది నరసరావుపేటలో మాకో కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉండేవారు G.Umamaheswar rao గారని. ఆయన్ని మేం అంతా సరదాగా GUM(గమ్) గారు అని పిలుచుకునే వాళ్ళం :-)

      తొలగించండి
  2. ఒక కథలా బాగా చెప్పారు విద్యార్జన జ్ఞాపకాలు!

    రిప్లయితొలగించండి
  3. హా హ బావుంది ! ఎన్నాళ్ళకి మళ్ళీ మీ స్టైల్ పోస్ట్ రాసారు :-)
    Waiting for next part eagerly :-))))))))))))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ శ్రావ్యా నిజమేకదా చాన్నళ్ళగ సినిమా రివ్యూలు తప్ప ఏంలేవు. మనసులోని మౌనరాగం బ్లాగర్ ప్రియ గారి "చిన్ననాటి దొంగతనాలు" పోస్ట్ చూసి ఈ సంగతులన్నీ గుర్తొచ్చాయి :-)

      తొలగించండి
  4. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.... ;) బాగుందండీ.

    ఇంటర్లో పెట్టే చాకిరేవుల గురించి చెప్పొద్దు మాషారూ... పీడకలలు.
    అయితే మీలోనూ ఓ తీతి ఉన్నాడన్న మాట..వెయిటింగ్ సేస్తా ఉన్నాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ రాజ్ :-) హహహ మరే పీడకలలు అప్పుడలా ఉండబట్టే ఇప్పుడిలా ఉన్నామేమో :-)) హహహ చేస్తా చేస్తా తీతి ని తొందర్లోనే పరిచయం చేస్తా :-)

      తొలగించండి
  5. హహ్హహ.. చాలా బావుంది వేణూ గారు. నా పోస్ట్ చూసి మీరు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం సంతోషంగా ఉంది.
    పెద్దగా వెయిట్ చేయించకుండా నెక్స్ట్ పార్ట్ కూడా త్వరగా రాసేయండి :)

    తీఫ్ తిరుమలై.. హహ్హహ

    రిప్లయితొలగించండి
  6. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ మేము పక్క వాడివి దోచుకోడం అయితే లేదుకానీ మా కాలేజ్ బుక్ స్టోర్స్ లో పుస్తకాలూ అవీ కోనేసుకున్నట్టు బిల్ రాయించుకుని బిస్కట్ల డబ్బాలు తెచ్చేసుకునేవాళ్ళం (తిండి కి కొన్నాం అనేకంటే పుస్తకాలకి అంటే ఇంట్లో కొట్టరు కదా మరి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ పప్పుగారు, హహహ నిజమేనండోయ్ ఈ ఐడియా బాగుంది :-)

      తొలగించండి
  7. తీఫ్ తిరుమలై కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ....

    రిప్లయితొలగించండి
  8. బావుంది వేణూ.. ఎంతైనా అబ్బాయిల అల్లరి రేంజ్ వేరు! అమ్మాయిలైతే ఎంతసేపూ దొంగతనంగా జాంకాయలు, గులాబీలు, గోరింటాకులు కోసుకుని మురిసిపోతుంటాం. :)))
    మా హాస్టల్లో ఈ ఆకస్మిక తనిఖీ జరిగేది కానీ అది రూమ్స్ నీట్‌గా పెట్టుకున్నారో లేదో చూడ్డానికి.. సూపర్ బోరింగ్ వ్యవహారం!
    నిజమే, ఈ క్లెప్టోమానియా పురుగుతో లైఫ్‌లో ఒక్కసారైనా కుట్టించుకోవాలి.. నాకు మళ్ళీ ఆనాటి రేనాల్డ్స్ పెన్నులు, నెయిల్ పాలిష్‌లు గుర్తొస్తున్నాయ్ ;) ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ నిషీ :-) హహహ మా వాళ్ళు అంతకన్నా గొప్ప సామాగ్రేం కాదులే కొట్టేసింది :-)
      ఓహ్ అవునా మా ఏఓ గారు అప్పుడప్పుడూ ఒక్కరే అలా ఈ చివరనుండి ఆ చివరికి ఒక రౌండ్ వేసి ఏదైనా రూం మరీ శుభ్రంగా లేకపోతే గదిమేవారు అంతే.. ఈ తనిఖీలు మాత్రం ప్రొఫెషనల్ రేంజ్.. బటన్ నైఫ్ లూ, వాక్మన్ లు, వీక్లీలు, సినిమా పుస్తకాలు, గట్రా బయటపడేవి.
      హహహ ఆనాటి రేనాల్డ్స్ పెన్నులు నెయిల్ పాలిష్‌లూనా... కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్... అయినా ఇప్పుడంతా సిసి కెమేరాల కాలంకదా అప్పటితో పోలిస్తే ఎంతైనా కష్టమే :-P

      తొలగించండి
  9. స్విచ్ బోర్డ్ లో దాచేసి, వాళ్ళు తణిఖీ చేస్తుంటే మనసులో నవ్వుకుంటూ ఉండి వుంటారు. దొరికితే ఒక్కసారేగా ఈ మధ్యలో బోలెడు ఎంజాయ్ మెంట్..:))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ జ్యోతిర్మయి గారు :) హహహ మరే అలాగే నవ్వుకుని ఉంటారండీ.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.