బుధవారం, జులై 24, 2013

అత్తారింటికి దారేది – Audio My view.


మనమందరం చిన్నపుడు ఆడుకునే ఆటగుర్తుందా. అరచేతిని తీస్కుని అందులో సున్నాలు చుడుతూ ఆకేసి అని చెప్పి ఆ తర్వాత ఒక్కో వేలు ముడుస్తూ అన్నమేసి, పప్పేసి, నెయ్యేసి అని చెబుతూ అన్ని వేళ్ళు ముడవడం అయ్యాక మన వేళ్ళతో అవతలి వాళ్ళ చేతిమీదుగా నడకసాగిస్తూ అత్తారింటికి దారేది దారేది అని భుజం వరకూ తెచ్చి కితకితలు పెట్టి నవ్వించేవాళ్ళం. చివర్లో కితకితలు పెడతారని తెలుసుకాబట్టి చివరి వరకూ నవ్వకుండా ఉండడమనేది అసాధ్యం ఆట మొదలెట్టగానే ఆటోమాటిక్ గా నవ్వొచ్చేస్తూ ఉంటుంది ఆ విధంగా అద్యంతం నవ్వులు కురిపించే ఆట అది.

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కథ ప్రకారం ఆ ఆటలోని మాట “అత్తారింటికి దారేది” అని టైటిల్ గా పెడదామని అనుకున్నారుట త్రివిక్రం, కానీ పవర్ స్టార్ సినిమాకి పంచ్ అండ్ ఫోర్స్ ఉన్న టైటిల్ కాకుండా ఇలాంటి సాఫ్ట్  ఫామిలీ టైటిల్ పెడితే ఎలా ఒప్పుకుంటారు ఫాన్స్ అయినా హీరోగారైనా అని సందేహిస్తూనే పవన్ కి సజెస్ట్ చేస్తే “మనం సినిమాలో అదే కదా చెప్తున్నాం సందేహించడమెందుకు పెట్టేయండి” అని సెలవిచ్చారుట హీరోగారు. సాధారణ పరిస్థితులలో ఇది పెద్ద విషయమేం కాదు కానీ ఫామిలీలు వారసత్వపు హవా నడుస్తున్న ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో అంత ఫాలోయింగ్ ఉన్న ఒక వారసత్వపు హీరో ఆభేషజాలను వదిలేసి ఇలా ఆలోచించడం బాగుందనిపించింది నాకు.

అలాగే ఆడియో ఫంక్షన్ అనగానే పరిశ్రమ పెద్దలంతా వచ్చి ఈ సినిమా అంతా ఇంతా ఈ హీరో తోపు తురుము వందరోజులు వెయ్యిరోజులు ఆడుద్ది అని హోరెత్తించేసి పాటల గురించి సంగీత దర్శకుడి గురించి కానీ ఇతర క్రూ గురించిగానీ లిరిక్ రైటర్స్ గురించి కానీ ఒకరిద్దరు మొక్కుబడిగా చెప్పడం తప్ప అసలు పట్టించుకోరు. కానీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఫ్యామిలీలను వందిమాగధులను పక్కనపెట్టి సినిమాకి పని చేసిన తారాగణం మరియూ టెక్నీషియన్స్ ని మాత్రం పిలిచి పండగ చేస్కుని సినిమా గురించి ప్రేక్షకులకు పరిచయం చేయడం నాకు నచ్చింది.

అలాగే స్టేజ్ మీద సైతం కోటా, ఎమ్మెస్, నదియా, రఘుబాబు లాంటి వారికి విలువనిచ్చి ఆడియో సిడిని సైతం  దేవీశ్రీప్రసాద్ తోనే ఓపెన్ చేయించడం నాకు భలే నచ్చింది. పాపం అన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన దేవీ కూడా ఇలా తనే ఓపెన్ చేయడం ఇదే మొదటి సారవడంతో కాస్త తడబడడం మనం గమనించవచ్చు. మిగిలిన సినిమాలు కూడా ఈ ట్రెండ్ ని అందిపుచ్చుకుంటే  బాగుంటుంది. ఈ ఫంక్షన్స్ లో విసుగొచ్చే మరో అంశం కొత్తపాటలకి రికార్డ్ డాన్సులని తలపించే స్టేజ్ డాన్సులు, అవికూడా తీసేస్తే బాగుంటుంది.
 
సరే ఇక పాటల విషయానికి వస్తే జల్సా, గబ్బర్ సింగ్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని వాటిని మించి ఉంటాయని ఆశిస్తున్న అభిమానులను ఒక రకంగా ఈపాటలు నిరాశ పరిచాయనే చెప్పచ్చు. కానీ సినిమా కంటెంట్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే పాటలు వాటికి ఇచ్చిన సాహిత్యం అన్నీకూడా సరదాగా సాగి సినిమా కూడా ఎలా ఉండబోతున్నది అనేదానిపై ఒక అంచనాను ఏర్పరచాయి. మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ ఆర్కెస్ట్రేషన్ ను కూడా తగ్గించి సంధర్బానుసారంగా కథలో ఒదిగిపోయేలా కంపోజ్ చేశారని అనిపించింది. సినిమా చూశాక ఈ పాటలకు కనెక్ట్ అయి అవి మరింత సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది.

ఆరడుగుల బుల్లెట్టూ : శ్రీమణి రాసిన ఈ పాటను విజయప్రకాష్ పాడాడు మొదట వచ్చే సాకీ మాత్రం కార్తికేయన్ పాడాడు. పదునైన పదాలతో అంతే పదునైన మ్యూజిక్ తో సాగిన ఈ పాట ఈ ఆల్బంలో అన్ని పాటలకంటే ఎక్కువ అలరిస్తుంది. హీరోని కీర్తిస్తూనే కథలో తన పాత్ర ఏంటో స్పష్టం చేసే పాట. మూలాలను మరచి వదిలి వెళ్ళిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిన కథానాయకుడి పాత్ర గురించిన పాట. నాకు చాలా నచ్చింది.  

నిన్ను చూడాగానే : దేవీశ్రీ ప్రసాద్ రాసి, స్వరపరచీ, పాడిన గీతమిది. మరదల్ని చూసి తన పరిస్థితేమైందో తెలియజేస్తూ తనతో వచ్చేయమని పిలుస్తూ టీజ్ చేస్తూ అల్లరిగా సాగే పాట. “కృష్ణా రాధలా నొప్పీ బాధలా కలిసుందాం” అంటూ “కాల్చే ప్రమిదలా ముంచే వరదలా చంపావే మరదలా” అంటూ సాగే లైన్స్ నవ్విస్తాయి. మెలొడీలోనే స్లోగా క్రేజీగా సాగే పాట ఇది.

దేవ దేవం భజే : ఇక మిగిలిన నాలుగు పాటలు రామజోగయ్య శాస్త్రిగారే రాశారు. ఒకటిన్నర నిముషం పాటు సాగే ఈ బిట్ సాంగ్ లో సైతం రాముడ్ని కీర్తిస్తూనే హీరో గుణగణాలను వర్ణిస్తూ సాగుతుంది. ఫాన్స్ కి అప్పీలింగ్ గా లేకపోవచ్చేమో కానీ సినిమాలో సందర్బానుసారంగా అర్దవంతంగా ఉంటుందని అనుకుంటున్నాను.

బాపు గారి బొమ్మో : ఆరడుగుల బుల్లెట్ తర్వాత ఆకట్టుకునేది ఈ పాటే. రామజోగయ్య శాస్త్రిగారు రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. మాంచి మెలోడీ ఇది కూడా కథానాయిక గురించి వర్ణిస్తూ టీజింగ్ గా తను ఎలాంటి మాయ చేసిందో తనని ఎలా కట్టిపడేసిందో చెప్తూ సాగే పాట. మాంచి మెలోడియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది.

కిర్రాకు పుట్టించావే : ట్రాక్ లిస్ట్ విన్నపుడు తెలంగాణాలో కత్తి/కేక లాంటి పదాలకు బదులుగా వాడే కిరాక్ అనే పదాన్ని ఉపయోగించి రాశారనిపించింది కానీ పాట పూర్తి సాహిత్యం ముఖ్యంగా పిచ్చెంకించావే అంటూ కిర్రాకు పుట్టించావే అనడం చూస్తే క్రాక్ ని అలా కిర్రాకు అని పలుకుతూ రాసుకున్నారేమో అనిపించింది. మొత్తానికి హుషారైన బీట్ తో సాగే ఈ పాట కుర్రకారుని ఒక ఊపు ఊపే ఆవకాశం మెండుగా ఉన్నపాట. పాడింది నరేంద్ర. అత్తరేదొ చల్లినావె అత్తగారి పిల్లా.. సిత్తరాల నవ్వుపైన రత్తనాలు జల్లా.. లాంటి లైన్స్ పాడినపుడు వాయిస్ లైట్ గా మార్చి హుషారు తెప్పించేలా పాడాడు.    

టైం టు పార్టీ : ఈ పాటకు మాల్గాడి శుభ స్వరం ఎసెట్ అయింది. మంచి పార్టీ సాంగ్, హెవీ ఆర్కెస్ట్రేషన్ లేకుండానే హుషారు తెప్పించే పాట. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ సరదాగా క్రేజీగా సాగాయి. రాప్ తో పాటు పాటలో కూడా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడారు. కుర్రకారుని అలరించే మంచి పార్టీ సాంగ్ ఇది.  

ఈ పాటలు వినడానికీ సాహిత్యం (లిరిక్స్) తెలుసుకోడానికి నా పాటల బ్లాగ్ “పాటతో నేను” లో ఇక్కడ చూడండి.

13 కామెంట్‌లు:

  1. మీ రివ్యూ బావుంది వేణూ గారూ. నేను ఆ పాటలు వినలేదు (వినాలని అనిపించలేదు) కాని ప్రోగ్రాం చూశాను. నాదీ సేం ఫీలింగ్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks ప్రియ గారు, ఫంక్షన్ జరిగిన తీరుపై చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారండీ.

      తొలగించండి
  2. పొద్దునే మీ ఇంకో బ్లాగ్ లో విన్నాను పాటలు ! నాకు దేవ దేవం భజే ఇది నచ్చింది :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ శ్రావ్యా :-) అది మాత్రమే నచ్చిందా :-)) ఏం చేస్తాంలెండి ఈసారికి ఇలా సర్దుకు పోతాం :)

      తొలగించండి
  3. please see my 4 blogs - పన్తుల వేంకట రాధాకృష్ణ బ్లాగు పేరు_______ యు .ఆర్ .ఎల్____
    శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,
    సాధన ఆరాధన : http://parakrijaya-parakri.blogspot.in/,
    పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/,
    తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/ ,
    https://www.facebook.com/parakrijaya

    రిప్లయితొలగించండి
  4. మీరు చెప్పిన తేడాలు నేనూ గమనించానండి .నిజంగానే అవి రికార్డింగ్ దాన్సుల్లానే కాదు వాటికంటే కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి .నాకు రెండుపాటలు బాగానచ్చాయి .వినగా వినగా మిగిలినవి కుడా నచ్చాయనుకోండి .సినిమా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ రాధిక గారు, అవునండీ సినిమా పూర్తిగా త్రివిక్రం స్టైల్లో ఎంటర్టైన్మెంట్ తో కూడిన కుటుంబ కథా చిత్రం అయి ఉంటుందని అనుకుంటున్నాను.

      తొలగించండి

  5. అబ్బా, ఈ పాటలూ అవీ ఇవ్వీ కాదు కానీ నాకో విషయానికి మాత్రం గుండె రగిలిపోతోంది వేణూ!!
    నదియా ఏంటీ.. తల్లి పాత్ర ఏంటీ!?!? అసలు మొన్న మిర్చి చూస్తున్నప్పుడే తెగ ఫీలయ్యాను.. అందులో అనుష్క కంటే ఈఅమ్మాయి బోల్డు బావుంది!! మళ్ళీ ఇంకోసారి తల్లిలా చూడాల్సివస్తుందంటే తెగ బాధగా ఉందసలు. :))))

    ఐ థింక్, నదియాకి కూడా ఇదే మొదటి ఆడియో ఓపెనింగ్ ఇన్సిడెంట్ అనుకుంటా.. తనూ చాలా తడబడింది :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ నిషీ మరే నిజమే కానీ ఈ సినీమాయాలోకంలో తప్పదుకదా మరి :) ఇందులో సమంతాకి అమ్మ అయినా ఏదో అనుకోవచ్చుకానీ మిర్చిలో ప్రభాస్ కే మరీ టూమచ్ :)
      థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి
  6. చివరి రెండు తప్పా అన్ని నచ్చాయి నాకు .

    ఆరడుగుల, బాపు గారి బొమ్మ లిరిక్స్ భలే ఉన్నాయి వేణు గారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ బంతి.. ఎస్సో ఆ రెండిటి లిరిక్స్ నాక్కూడా చాలా నచ్చేశాయి.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.