బుధవారం, ఫిబ్రవరి 12, 2020

జాను...

రామ్ (శర్వానంద్) ఒక ట్రావెల్ ఫోటోగ్రాఫర్. ప్రకృతితో మమేకమై తిరుగుతూ తనలోని ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూంటాడు. అనుకోకుండా ఒక రోజు తను చిన్నపుడు చదువుకున్న వైజాగ్ కి చేరుకుంటాడు. అక్కడ తాను తిరిగిన ప్రదేశాలు అన్నీ చూస్తూ తాను టెంత్ వరకూ చదివిన స్కూల్ కీ వెళ్తాడు. అక్కడ నుండి అలా కనెక్ట్ అయిన క్లాస్మేట్స్ ఒక రీ యూనియన్ ప్లాన్ చేస్తారు. ఆ రీయూనియన్ కి వెళ్ళి దాదాపు పదిహేనేళ్ళ తర్వాత కలిసిన అందరితో జ్ఞాపకాలు కలబోసుకుంటున్న రామ్ కి జాను(సమంతా) కూడా అక్కడకి వస్తుందని తెలుస్తుంది.

చిన్నప్పటినుండీ కలిసి చదువుకున్న జాను అన్నా తను పాడే పాటలన్నా రామ్ కి ప్రత్యేకమైన ఇష్టం. తనని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. తనకీ రామ్ అంటే అంతే ఇష్టం. జాను కి ఏం కావాలన్నా రామ్ నే అడుగుతుంది. తన నోటి వెంట మాట రావడం ఆలశ్యం ఆ మాట పూర్తయే లోపే రామ్ ఆ పని చేసి పెట్టేసెవాడు.

తనకి జాను మీదున్న ఫీలింగ్ ప్రేమో ఏంటో కూడా సరిగా తెలియదు కానీ జాను అంటే రామ్ కి ఓ అద్భుతం, అపురూపం, అపూర్వం. తనని చూసినా తను తాకినా అతని గుండె వెయ్యి రెట్లు వేగంగా కొట్టుకుంటుంది, తనమీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నా కానీ ఎదురు పడితే మాత్రం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు మాట్లాడడానికి నోరు కూడా పెగలదు.

ఇష్టాన్ని అపుడపుడు ప్రదర్శించడమే తప్ప తమ ప్రేమ గురించి ఒకరికొకరు చెప్పుకోకుండానే స్కూల్ శలవలకు విడిపోయిన ఆ ఇద్దరూ అనుకోని పరిస్థితులలో తిరిగి కలుసుకోలేరు. దదాపు పదిహేడేళ్ళ తర్వాత రామ్ కి రీయూనియన్ ద్వారా మళ్ళీ జాను ని కలిసే అవకాశం వస్తుంది. జానూ అప్పుడేం చేస్తుంది, ఎలా ఉంది, రామ్ అపుడైనా తన ప్రేమ గురించి చెప్పగలిగాడా. ఆ రాత్రి ఎలా గడిచింది చివరికి ఏమైంది. అసలు ఎందుకు విడిపోయారు ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు "జాను" సినిమా చూడాలి.
 
ఈ సినిమాలో చూపించినది స్వచ్చమైన ప్రేమ, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్. అందుకే జాను మన మనసుల్లో శాశ్వతమైన ముద్ర వేసుకుని నిలిచి పోతుంది. ఎన్నేళ్ళైనా ప్రేమ ప్రస్తావన రాగానే గుర్తొచ్చే సినిమాగా మిగిలి పోతుంది. అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తామో అంతగా గౌరవమూ ఇవ్వాలి అని నేర్పించే సినిమా. రామ్ జాను ని చూస్కునే పద్దతి చూస్తే ఇలాంటి వాళ్ళు ఇలాంటి మెచ్యూర్డ్ ప్రేమలు ఉంటాయా అని ఆశ్చర్యపరిచే ప్రేమ.

సినిమా ప్రారంభంలో దర్శకుడు ఒక స్లైడ్ వేస్తాడు "మార్పులు ప్రశ్న.. మార్పులే సమాధానం" అని. ఈ కథలోలా పరిస్థితుల ప్రభావంతో జరిగిన మార్పులు ప్రశ్నగా ఎదురైనపుడు దానికి సమాధానంగా వాస్తవాన్ని అంగీకరించి ఆ మార్పులకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుంటూ మనమూ మారుతూ జీవించాలనీ అక్కడే ఆగిపోకూడదని నేర్పించే కథ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవ్ ఆన్ అని నేర్పించే ప్రేమ కథ. నిజానికి ఇన్నేళ్ళ తర్వాత జాను వచ్చింది రామ్ కి ఈ విషయం చెప్పడానికేనేమో అని అనిపించక మానదు.
   
నిజమే కొన్ని క్లాసిక్స్ ని ముట్టుకోకూడదు, రీమేక్ చేయడానికి ట్రై చేయకూడదు. అలాగే కొన్ని క్లాసిక్ కథలని చెప్పకుండా వదిలేయకూడదు, ఎంత ఎక్కువమందికి చెప్పగలిగితే అంతమందికి చెప్పి తీరాలి. జానూ అలాంటి క్లాసిక్ కథ కథానాలున్న సినిమానే. ఫాస్ట్ ట్రాక్ ప్రేమలు ఎక్కువైన ఈ తరానికి ఇలాంటి ప్రేమ కూడా ఒకటుంటుంది అసలు ప్రేమంటే ఇలాగే ఉండాలి అని చూపించాలి.

బహుశా అందుకేనేమో ఎందరు వద్దన్నా నిర్మాతగా తన ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో ఎప్పుడూ రీమేక్ జోలికి వెళ్ళని దిల్ రాజు గారు ఈ సినిమాని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. లాభనష్టాల లెక్కలు ఎలా ఉన్నా నిర్మాతకు "ఇంత మంచి సినిమాని నేను నిర్మించాను" అని గర్వంతో కూడిన ఆనందాన్ని మాత్రం తప్పకుండా మిగిల్చే సినిమా జాను.

ఈ సినిమా నిర్మాణంలో సగం విజయం ఒరిజినల్ వర్షన్ తీసిన దర్శకుడిని, సంగీత దర్శకుడిని ఈ సినిమాకి కూడా పని చేయడానికి ఒప్పించడం. 96 సినిమా అంత అందంగా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం వీళ్ళిద్దరే.

ఇక విజయ్ సేతుపతి, త్రిషలను రీప్లేస్ చేయడం దదాపు అసాధ్యమైనా కానీ రామ్, జాను పాత్రలకు న్యాయం చేయగల శర్వానంద్ అండ్ సమంతాలను ఎన్నుకోవడం మిగిలిన సక్సెస్. అనౌన్స్ చేసినపుడు అంత నమ్మకం లేకపోయినా సినిమా చూశాక వీళ్ళిద్దరూ కూడా ఆ పాత్రలకు ప్రాణం పోశారనిపించింది.

ఒరిజినల్ వర్షన్ లో పాటలు నేపథ్య సంగీతం చేసిన మ్యాజిక్ అచ్చుగుద్దినట్లుగా ఇందులోనూ అలానే రిపీట్ అయింది. ఈ సినిమాలోని సన్నివేశాలు మన మనసు లోతుల్లో ముద్రపడిపోవడానికి సంగీతం వహించిన ముఖ్య పాత్ర మరిచిపోలేనిది. ముఖ్యంగా జాను రామ్ ఎదపై చేతితో తాకినపుడు బట్టర్ ఫ్లైస్ ఇన్ స్టమక్ ఎఫెక్ట్ ని చూపించేలా వచ్చే ఆ నేపథ్య సంగీతం మరిచి పోలేనిది. 
 
అలానే జాను ఎంట్రీ సీన్ లో బీజీఎమ్ ఇప్పటికే చాలా మంది సెల్ఫోన్స్ రింగ్ టోన్ గా స్థిరపడిపోయింది ఆ ట్యూన్ గుండెల్ని మెలిపెట్టేస్తుంది. ఇంకా జాను పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్న సీన్ లోనూ సన్నగా మొదలైన మంగళ వాద్యాలు హోరులా మారడం. మరికొన్ని సీన్స్ లో నేపధ్యమంతా మెల్లగా మాయమవుతూ నిశ్శబ్దమవడం. ఇలా ఒకటేమిటి చాలా సీన్స్ లోని ఎమోషన్ ని సంగీతం మరింత ఎలివేట్ చేసి మన గుండెలోతుల్లోకి చేర్చింది. ఇక కథనంలో భాగంగా అక్కడక్కడా వచ్చే ఇళయరాజా పాటల బోనస్ ఎలాగూ ఉండనే ఉంది. 

సగటు మాస్ సినిమాలు మాత్రమే ఎంజాయ్ చేసేవారికి జాను నచ్చకపోవచ్చు. మూడు ఫైట్లు ఆరు పాటలు కాసిని కామెడీ సన్నివేశాలతో చుట్టేసిన సినిమా కాదు ఇది. కౌగిలింతలు ముద్దులే కాదు కనీసం హీరో హీరోయిన్ని ముట్టుకునే సన్నివేశాలు కూడా లేని ప్రేమ కథ జాను. ఒక్క ఫైట్, ఒక్క డాన్స్ మూవ్ మెంట్, ఇరికించిన కామెడీ ట్రాక్స్ లేని జాను ఒక ప్యూర్ ఎమోషనల్ రైడ్. మెల్లగా ఒక్కో సీన్ నూ ఆస్వాదిస్తూ, ఆ అనుభూతిని ప్రేమను అనుభవిస్తూ, వారి పెయిన్ ని అర్ధం చేసుకుంటూ నిదానంగా తీరికగా చూడవలసిన సినిమా. అలాగే సినిమా చూసినంత సేపూ మన స్కూల్ డేస్, అప్పట్లో మనం చూసిన ప్రేమ కథలు జ్ఞాపకాలు మనని చుట్టుముట్టేస్తాయి. 

కథా కథనాలు తీసిన సన్నివేశాలు కూడా దానికి అనుగుణంగా నెమ్మదిగా ఒక కవిత చదువుతున్నట్లు ఉంటాయి. చిన్నప్పటి రామ్ బిడియం, జాను చొరవ, పెద్దయ్యాక కూడా అవి అలాగే కంటిన్యూ అవడం, రామ్ రాత్రి గడిచే కొద్దీ మెల్లగా మాటల్లో ఓపెనప్ అవడం. జాను రామ్ ని ఫ్యామిలీ మాన్ గా ఎలా చూడాలనుకుంటుందో చెప్పే సన్నివేశాలు, హెయిర్ కట్ సీన్, మెట్రోలో మైండ్ ది గాప్ షాట్, రాత్రంతా కలిసి తిరిగినా ఇద్దరి మధ్యా ఉన్న గౌరవ ప్రదమైన దూరాన్ని చూపే సన్నివేశాలు, మంగళ సూత్రాలను రామ్ కళ్ళకద్దుకునే సన్నివేశం, అన్నీ బావుండి ఉంటే ఎలా ఉండేదో అని ఊహించుకుంటూ జాను చెప్పే సన్నివేశం. వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేస్తే ఏమౌతుందో అంటూ మిత్రులు పడే టెన్షన్, జాను కూతురు ఫోటో చూడడానికి రామ్ పడే తపన అన్నీ కూడా క్యూట్ గా అందంగా ఉంటాయి.

అలాగే ఎస్ జానకి పాడిన పాటలు మాత్రమే పాడే జాను తన కోసం దళపతి సినిమాలో స్వర్ణలత పాడిన ’యమునా తటిలో’ పాట పాడితే వినాలని రామ్ ఆశపడడం, ఆసక్తిగా ఎదురు చూడడం. ఆ థ్రెడ్ ని అలానే సినిమా అంతటా కొనసాగించి దాన్ని ముగించిన తీరు ముచ్చటగా అనిపిస్తుంది. ఇలాంటి ముచ్చట గొలిపే చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి సినిమా అంతటా.    
 
నటీనటులలో శర్వానంద్ అండ్ సమంతా రామ్ అండ్ జానులుగా తమ పాత్రలకు ప్రాణం పోశారు. తమిళ్ లో ఉన్న మాజిక్ ఇక్కడ కూడా రిపీట్ చేయగలిగారు. ఇక అందులో యంగ్ జాను గా చేసిన గౌరీ ఇక్కడ కూడా చేసింది తన నటనా బావుంది. యంగ్ రామ్ గా చేసిన కుర్రాడు కూడా ఆకట్టుకుంటాడు. ఫెండ్స్ గా ఫిదా ఫేమ్ శరణ్య ప్రభాకరన్, వెన్నెలకిషోర్, తాగుబోతు రమేష్ అంతా చక్కగా సరిపోయారు.

తమిళ్ వర్షన్ కి తెలుగుకి ముఖ్యమైన తేడా టైమ్. తమిళ్ లో నైంటీ సిక్స్ బ్యాచ్ గా చూపిస్తే తెలుగులో బహుశా నటీనటుల వయసు వల్లో లేక గ్లామర్ దృష్టిలో పెట్టుకునో కానీ 2004 బ్యాచ్ గా చూపించారు. దానితో కథకు సంబంధించిన ముఖ్యమైన నేపధ్యం తాలూకు సెటప్ కొంత దెబ్బతిన్నట్లైంది. ఇంత స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వం, పసిపిల్లలాంటి మనస్తత్వం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అదీ వైజాగ్ లో ఉన్నాయంటే నమ్మబుద్ది కాదు. కాకపోతే ఒకసారి ఎమోషన్ కి కనెక్ట్ అయిన తరువాత సినిమాలోని కథా కథనాలు ఈ లోపాన్ని మర్చిపోయేలా చేస్తాయి.   

మొత్తం మీద ’జాను’ ’96’ కి ఒక ఫెయిత్ ఫుల్ రీమేక్, యథాతథంగా తెరకెక్కించారు. తమిళ్ అర్ధమై 96 చూసిన వాళ్ళకి జాను కొత్తగా ఆఫర్ చేసేదేం ఉండదు కనుక కేవలం నటీ నటులకోసం చూడాలనుకుంటే చూడవచ్చు. సబ్ టైటిల్స్ పై ఫోకస్ చేసి చూసిన వాళ్ళు కూడా ఒక సారి ఆ స్ట్రెయిట్ అనుభూతి కోసం మళ్ళీ చూడవచ్చు. ఇక  ఒరిజినల్ వర్షన్ చూడని వాళ్ళు మాత్రం ఒక సారి తప్పక చూసి తీరవలసిన చిత్రం జాను. స్వచ్ఛమైన ప్రేమని మనసారా అనుభూతి చెందాలంటే మిస్ అవకూడని సినిమా జాను. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. మరికొన్ని ప్రోమోస్ ఇక్కడ చూడవచ్చు.

10 కామెంట్‌లు:

  1. 96..యెన్నిసార్లు చూసినా..సినిమా అని మర్చిపోతాము..మన ఙాపకాల డైరీలోకి వెళ్ళిపోతాము..విజయ్ సేతుపతి ని చూసిన కళ్ళతో శర్వానంద్ ని యాక్సెప్ట్ చెయ్యలేనేమో అనిపించింది..అందుకే తెలుగు వెర్షన్ చూడలేదండి..ఆర్టికల్ చాలా బావుంది..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు... నిజమేనండీ ఒరిజినల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఈ రివ్యూ రాస్తున్నపుడు కూడా ఒరిజినల్ గుర్తొస్తూనే ఉంది నాకు.

      తొలగించండి
  2. మీ సమీక్ష బాగుంది.

    లాజిస్టిక్స్ బదులు లాజిక్ అని ఉండాలి చూడండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థ్యాంక్స్ అజ్ఞాత గారూ.. నా ఉద్దేశ్యం లాజిక్ కాదండీ లాజిస్టిక్స్ అనే.. ఐనా కన్ఫ్యూజన్ లేకుండా ఆ వాక్యం ఇపుడు మార్చిరాశాను.

      తొలగించండి
  3. ఫేస్ బుక్ విరమించుకోవడం వల్ల ఈ సినిమా నా నుండి తప్పించుకుంది. :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహహహ రవి గారు సినిమా అదృష్టం బావున్నట్లుందండీ :-) చాలా రోజుల తర్వాత మీ కామెంట్స్ చూడ్డం బావుందండీ.. అప్పుడప్పుడైనా ఫేస్బుక్ కి వస్తూ ఉంండండి.. మిస్సింగ్ యువర్ ఇన్ సైట్స్..

      తొలగించండి
  4. కథ తెలీదు కానీ, స్టోరీ లైన్ తెలుసు. అందుకనే, మీ రివ్యూ ఇవాళ (ఫిబ్రవరి 14) చదవాలని ఆగాను :)) వెంటనే సినిమా చూడాలనిపించేలా రాశారు, ఎప్పటిలాగే. 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహహ థాంక్స్ ఫర్ ద కామెంట్ మురళి గారూ.. తప్పక చూడండి మీకూ నచ్చుతుందని అనుకుంటున్నాను.

      తొలగించండి
  5. ఎన్ని సినిమాలు చూసినా నాకెన్నడూ బోరు కొట్టని జాన్రా ఇది . 'జాను' ప్రోమో ఫంక్షన్ చూసి అర్జెంటుగా వెతికిమరీ యుట్యూబ్ లో '96' చూసాను. తమిళ్ సినిమాని హిందీ డైలాగులతో లో చూడడంవల్లో లేక సేతుపతిని మొదటిసారిగా చూడటంవల్లో తెలీదుగాని అంతగా నన్నాకట్టుకోలేదు. 96 మళ్ళీ ఇంకోసారి చూడాలి. కుదిరితే తెలుగు వర్షను కూడా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ ఉమాశంకర్ గారూ.. ఈ రోజు సాయంత్రం మా ఫ్రెండ్స్ మధ్య కూడా ఇదే టాపిక్ అండీ.. ఎన్ని సినిమాలొచ్చినా ఈ జాన్రా ఎవర్ గ్రీన్ అని. విజయ్ సేతుపతి కి కొంచెం అలవాటు పడితే తన సినిమాలు వదలబుద్దికాదండీ, మంచి నటుడు. ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ కుదిరి ఉండదండీ రీరీకార్డింగ్ ప్రాణం దీనికి. తమిళ్ వర్షన్ సబ్ టైటిల్స్ తో యూట్యూబ్ లో ఉండాలి. జాను కూడా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ కి వచ్చేయవచ్చులెండి.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.