శనివారం, మే 18, 2013

కవుల రైలు - తిలక్

తిలక్ గారు ఈ కథని ఎపుడు రాశారో తెలియదు కానీ ఇప్పటికీ ఎప్పటికీ అన్వయించుకోవచ్చునేమో. ఒక్క కవిత్వానికేనా? రచనలకీ, సినిమాలకీ, ఆ మాటకొస్తే అసలును వదిలేసి గమ్యం తెలియని ప్రయాణం చేసే ఎన్నో రంగాలలోని ఎంతో మందికి నిస్సంకోచంగా అన్వయించుకోవచ్చు. ఈ చిన్న కథ చదవగానే నచ్చి బ్లాగ్ లో మీ అందరితో పంచుకోవాలనిపించి ఇలా...
 

~*~*~
 
తెలుగుదేశం కవులతో నిండి మూడవతరగతి రైలు పెట్టె లాగ క్రిక్కిరిసిపోయింది. “ఇంక జాగా లేదు” అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టిక్కెట్లు కొనుక్కొని కొత్త కవులు తోసుకు లోపలి కెగబడుతున్నారు. కొందరు ఫుట్‌బోర్డుల మీద నిలబడీ, కొందరు కమ్మీలు పట్టుకుని వేలాడుతున్నారు.

ఒకావిడ మేలిముసుగు వేసుకుని వచ్చింది. సుతారంగా అందంగా వుంది. కళ్ళల్లో అపూర్వమైన వెలుగు. ఎర్రని పెదవుల్లో తియ్యని సిగ్గు వొంపులు. వెన్నెలనీ, ఉషఃకాంతినీ, మల్లెపువ్వుల్నీ, మంచిగంధాన్నీ, రత్నాలనీ కలబోసి మనమీద జల్లినట్లు అనిపిస్తుంది ఆవిడను చూస్తే... అక్కడ దగ్గరలో నిలుచుంటే…

ఆవిడ నిస్పృహగా చూసింది రైలుపెట్టె కేసి. లోపలి బొగ్గు పులుసు గాలీ, చుట్టపొగా వాగుడూ కలసి పెట్టెలోంచి బయటకి దుర్భరంగా వ్యాపిస్తున్నాయి.

“ఇక్కడ చోటులేదు దయచేయవమ్మా. నువ్వు కూడానా మా ఖర్మ వగలొలకబోసుకుంటూ” అన్నాడొక చుట్ట ఆసామీ కాండ్రించి ఉమ్మివేస్తూ. ఆయన కవి శార్దూల బిరుదాంకితుడు. అప్పకవీయం అడ్డంగా బట్టీ వేశాడు.

“నో ప్లేస్ మేడం వెరీసారీ” అంటూ కన్ను గీటాడొక నవ యువకుడు గాగుల్సు తీసి, సెకండ్‌హాండ్ బీడీ నోట్లో ఉంచుకునే.

కొందరు వెకిలిగా నవ్వారు. కొందరు దగ్గారు. మరికొందరు ఈలలు వేశారు. పాపం ఆవిడ వెనక్కి తిరిగి జాలిగా వెళ్ళిపోయింది. రైలు కదిలిపోయింది. 


స్టేషన్‌మేష్టర్ వచ్చి ఆమెను చూచి “పాపం చోటు లేదా అమ్మా, నీ పేరు?” అని అడిగాడు.

“కవిత” అందా సుందరి.

కవుల రైలు గమ్యం తెలీకుండా వడివడిగా వెళ్ళిపోతోంది.


~*~*~

29 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది. హ్యాట్సాఫ్ టు తిలక్!

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడైతే తిలక్ ఇద్దరికి చోటులేదని వ్రాసేవారేమో, రెండో ఆవిడ పేరు భాష.

    రిప్లయితొలగించండి
  3. నమస్కారం !

    బెంగుళూరు లో తెలుగు భాషాభిమానులని సమావేశపరచే ప్రయత్నం లో మిమ్మలిని సంప్రదిస్తున్నాను. మరిన్ని వివరాలకి veera.sj@rediffmail.com కి టెస్ట్ మెయిల్ పంపండి.

    ఇట్లు
    -శశి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశిగారు నా లొకేషన్ వివరాలు అప్డేట్ చేయాలనే విషయం గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. మీ సమావేశమ్ విజయవంతమవాలని కోరుకుంటున్నాను.

      తొలగించండి
  4. రాజ్, కిషోర్ గారు, మధుర, రహ్మాన్, జ్యోతిర్మయి గారు వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. :)
    "నేను తరుచుగా చూసే బ్లాగులు".....హ.హ.హ..వేణూ నేను ఈ వేళే మీ ఈ లిస్టు గమనించాను..ఇందులో లేని బ్లాగు లేదుగా. ఇక ఏ ఆగ్రిగేటరు వైపు చూడక్కరలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ ఉన్న కొన్ని వందల తెలుగు బ్లాగుల్లో ఇక్కడ ఉన్నవి ఒక వందో పైనో పాతికో ఉంటాయంతేనండి అగ్రిగేటర్లకు బదులుగా ఏం కాదు, కేవలం అప్డేట్ ఉంటే నాకు వెంటనే తెలియాలని ఇక్కడ యాడ్ చేశాను :)

      తొలగించండి
    2. >ఇందులో లేని బ్లాగు లేదుగా.
      చాలా చాలా బ్లాగులే చూస్తున్నారు. అయినా అన్నీ అందరూ చూడరుగా, ఫరవాలేదు. ఎవరికి నచ్చినవి వారు చూస్తారు!

      తొలగించండి
  6. ఇంకా సరస్వతి అమ్మ వారేమో ననుకున్నాను నేను :) బావుందండీ !

    రిప్లయితొలగించండి
  7. కథ చాలా బాగుంది. ధన్యవాదాలు . (చిన్న సందేహం; కథ మొదటి వాక్యంలో "లాగ " టైపింగ్ పొరపాటు కావచ్చు అనుకుంటున్నాను )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది టైపింగ్ పొరపాటు కాదు రావుగారు, తిలక్ గారు అదే రాశారు. ఆయన తెలుగుదేశాన్నే మూడోతరగతి రైలు పెట్టెతో పోల్చి రాశారు.

      తొలగించండి
  8. మువ్వగారు, శ్రావ్యా, వంశీ గారు, రావుగారు, బంతి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు :-)

    రిప్లయితొలగించండి
  9. బాగుందండీ..ఈ రోజు మా వారి మిత్రులొకాయన "ఇన్ని రోజులు తెలీదండీ మీరు వ్రాస్తారని, ఏ పత్రిక్కి వ్రాస్తుంటారు" అనడిగారు. అబ్బే మనకంత లెవెల్ లేదండీ..నా బ్లాగ్ లోనే అన్నా..ఆయనొక్క లుక్కు ఇచ్చారు. బహుశా అంతకు ముందే యీ కథ చదివారేమో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఎన్నెల గారు :) హహహ పత్రికలో ప్రచురించపడటమే కొలమానం అనుకోలేములెండి.

      తొలగించండి
  10. మనకు బావుంది కానీ తిలక్ ఇలాంటివి రాయడం ఎందుకో అంతగా నాకు సబబనిపించలేదు. :))

    ఇక్కడ మరో ప్రమాదం ఉంది. చాలా మంది అభిమానులు ఆ 'కవిత ' తమకు తెలిసిన అమ్మాయేననుకుంటారు. చివరికి ఆ చుట్ట ఆసామీ బంధువులు కూడా 'కవిత ' తమదేనంటారు. :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ రవి గారు, ఆయన రాయడమ్ ఎందుకని సబబుగా లేదంటారు :) ఆయనా కవికనుకనా...

      అభిమానులు బంధువులు :-) బాగా చెప్పారు.

      తొలగించండి
    2. ఆయనా ఛందోబద్ధకవియే. ఈ మాటలో అప్పుడేప్పుడో వేశారు ఆ పద్యాలు. అయితే నేనన్నది అందుక్కాదు. ఆయన మనకున్న చాలా మంచి కవుల్లో ఒకరు. వేరే వాళ్ళపై వ్యాఖ్యానించి తనను తాను పాడు చేసుకొనే హక్కు మంచి కవులకు ఉండకూడదు. :)

      తొలగించండి
    3. హ్మ్.. అలా అంటారా... వాళ్ళపై ఆకతాయితనంగా వ్యాఖ్యానించడం కన్నా అందమైన కవితకు జరుగుతున్న అన్యాయంపై ఆయన ఆవేదన ఇలా వ్యక్తపరిచారనిపించిందండీ నాకు.

      అయినా విమర్శించగల అర్హత మంచికవులకు మాత్రమే ఉంటుందని ప్రజాభిప్రాయమేమో కదా? మీరు భిన్నంగా చెబుతున్నారే :-)

      తొలగించండి
  11. తిలక్ కథలా మజాకా! చాలా బావుంది.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.