సూర్య(నిఖిల్) తన మిత్రులతో(పూజ,కమెడియన్ సత్య) కలిసి ప్రొఫెషనల్ గా ప్లాన్ చేసి జేబులు కొట్టేయడం ఇంకా చిన్న చిన్న దొంగతనాలూ చేస్తుంటాడు. చూడ్డానికి చాలా డీసెంట్ గా కనపడే ఈ బ్యాచ్ చేసే దొంగతనాలను గుర్తించడం ఎవరితరమూ కాదు. స్వాతి(స్వాతి) జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా స్వాతిని కలిసిన సూర్య ఆమెతో ప్రేమలో పడి తనో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నని ఆమెకి అబద్దాలు చెప్తూ దగ్గరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా ఉండగా ఎన్నో ఏళ్ళ తర్వాత బయటపడ్డ అనంతపద్మనాభస్వామి సంపదని లెక్కించే సమయంలో ఒక చిన్న వినాయకుడి విగ్రహం దొంగిలించబడుతుంది. ఒక మంత్రిగారు ఆ విగ్రహం తనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్మి అది సంపాదించే పనిని దుర్గ(రవిబాబు) అనే లోకల్ గ్యాంగ్ స్టర్ కి అప్పచెప్తాడు. ఆ విగ్రహం తెచ్చిపెడ్తే తనపైనున్న కేసులన్నీ కొట్టేయించి రాజకీయలలో చేర్చుకుంటాననడంతో దుర్గ ఎలాగైనా ఆ విగ్రహం సంపాదించాలని ప్రయత్నిస్తుంటాడు.
ఎక్కడో కేరళలోని తిరువనంతపురంలో చోరీకాబడిన ఆ విగ్రహం హైదరాబాద్ ఎలా చేరుకుంది సూర్య, స్వాతి, దుర్గల జీవితాలలో ఎలా కల్లోలాన్ని రేపింది చివరికి ఏమైంది తెలుసుకోవాలంటే “స్వామిరారా” సినిమా చూడాలి.
“నాకు నచ్చిన ప్రతి సినిమా నుండీ నేను కాపీ కొడతాను” అని నిర్భయంగా టైటిల్స్ కి ముందే చెప్పిన దర్శకుడు సుధీర్ వర్మ సినిమా అంతా అదే మాట మీద నిలబడ్డాడు. అలాగని ఇదంతా ఎప్పుడో చూసిన సినిమానే కదా అనే ఫీల్ రాకుండా ఒక ఫ్రెష్ లుక్ తో ట్రీట్మెంట్ తో ప్రేక్షకులని కట్టిపడేయడంలో సఫలీకృతుడయ్యాడు.
కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా పాత్రలు సంఘటనలు కూడా క్షణక్షణం, అనగనగా ఒకరోజు, ఇంకా ఇదే జెనర్ లో వచ్చిన కొన్ని ఆంగ్ల చిత్రాలనుండీ సంగ్రహించినా కూడా తనకున్న ఎఫిషియెంట్ టెక్నికల్ టీం సపోర్ట్ తో ఆ మొత్తాన్ని చక్కని కథనంతో పంచ్ ల కోసం ప్రయాస పడకుండా అక్కడక్కడ ఛమక్కుమనిపించే సంభాషణలతో, కథాకథనాలలో కలిసిపోయే సునిశితమైన హాస్యంతో కలిపి ఆద్యంతమూ ప్రేక్షకుడు సినిమాలో లీనమయి చూసేలా చేశాడు.
హ్యాపీడేస్ తర్వాత నిఖిల్ నాకు ఏ సినిమాలోనూ అంతగా నచ్చలేదు. రవితేజ డేట్స్ దొరకని చిన్న నిర్మాతలంతా అతనితో సినిమాలు తీస్తే అతనుకూడా వాళ్ళకు కావలసినట్లు రవితేజని ఇమిటేట్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తూ గడిపేశాడు. మధ్యలో అతను చేసిన “యువత” అండ్ “ఆలశ్యం అమృతం విషం” సినిమాలు కొంచెం పర్లేదనిపిస్తాయి. అయితే ఈ సినిమాలో సుధీర్ తనని పూర్తిగా మార్చేశాడు. సూర్య అన్న దొంగోడి పాత్ర తప్ప నిఖిల్ హైపర్ యాక్షన్ ఏమాత్రం కనిపించదు ఇందులో.
అలాగే స్వాతి కూడా చాలా సటిల్ గా చేసింది, నిజానికి అక్కర్లేకపోయినా బోలెడంత హైపర్ ఎనర్జీతో నటించే హీరో హీరోయిన్లు ఇద్దరినీ కంట్రోల్ చేసిన క్రెడిట్ సుధీర్ కే దక్కాలేమో వీరిద్దరి నటన ఇందులో పాత్రోచితంగా మెచ్చుకోదగినట్లుగా ఉంది. సూర్య ఫ్రెండ్ గా చేసిన పూజ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్ స్వాతి కన్నా ఈ అమ్మాయికే ఎక్కువ ఫూటేజ్ ఉందనిపిస్తుంది.
అలాగే కమెడియన్ సత్యకూడా ఆకట్టుకుంటాడు. సునీల్ హీరోగా స్థిరపడడంతో ఇలాంటి ప్రతిభ ఉన్న మంచినటులంతా వెలుగులోకొస్తున్నారు. ఇక రవిబాబు, అతని బండ అసిస్టెంట్, జీవా, జోగిబ్రదర్స్, సూర్య బాచ్ ని అపుడపుడు కలిసే హోటల్లో పనిచేసే చిన్న కుర్రోడు అంతా పాత్రోచితంగా చేశారు.
సన్నీ మ్యూజిక్ లో వెస్ట్రన్ టచ్ ఎక్కువున్నా పాటలు బాగున్నాయి, పాటలన్నీ
కూడా సంధర్బానుసారం నేపధ్యంతో కలిసిపోయి వస్తుంటాయి తప్పించి
హీరోహీరోయిన్లు లొకేషన్స్ కి వెళ్ళో భారీ సెట్టింగులేస్కునో పాడుకునే
పాటలేం లేవు. సన్నీ సినిమా మూడ్ కి తగినట్లు చేసిన స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్
మ్యూజిక్ ఆకట్టుకుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ వర్క్ కూడా
ఇంట్రెస్టింగ్ ఫ్రేమింగ్ అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ తో సినిమాకి స్టైలిష్ లుక్
తీసుకొస్తూ చాలా బాగుంది. స్లోమోషన్ లో చిత్రీకరించిన కొన్ని షాట్స్
ఆకట్టుకుంటాయి.
ఈ తరహా చిత్రాలకు థ్రిల్స్ చాలా ముఖ్యం, ఉండీ ఉండీ
ప్రేక్షకుల చేత వహ్వా అనిపించి చప్పట్లు కొట్టించగల సీన్లు ఈలలు వేయించగల
సీన్లు ఉండడం చాలా అవసరం రెండుగంటల నిడివి ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకులనుండి
అలాంటి స్పందనను చాలాసార్లే గమనించాను.
సినిమా చూసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు ఈ క్రింది స్పాయిలర్ బటన్ పై క్లిక్ చేయకండి. దానిలోని కంటెంట్ చదివితే మీకు థ్రిల్ మిస్సవ్వచ్చు. ఫర్వాలేదనుకున్నవాళ్ళు సినిమా చూసే అవకాశం లేనివాళ్ళు క్లిక్ చేసి చదవండి.
సహజంగా ఇలాంటి సినిమాలకి చేసినట్లు దొంగతనం సీన్ తో సినిమా ఓపెన్ చేయకుండా జోగీబ్రదర్స్ సీన్ తో చేసి ఆ సీన్ ని ప్రేక్షకులు మర్చిపోయే దశలో ఇంటర్వెల్ తర్వాత ఎక్కడో స్క్రీన్ ప్లేలో కలపడం బాగుంది. ఆంగ్ల చిత్రాలతో పరిచయమున్నవారికి ఇది Quentin Tarantino స్టైల్ అని తెలిసే ఉంటుంది.
అలాగే విగ్రహం విలువ గుర్తించే కొద్దీ దాని ధర సున్నానుండి మెల్లమెల్లగా ఎలా పెరుగుతుంది అనేది స్క్రీన్ పై లొకేషన్ ప్లస్ ధర డిస్ప్లేతో చూపించిన విధానం బాగుంది. విగ్రహం కొనేవారు ఆషామాషీగా నోటిమాటమీద నమ్మకం ఉంచినట్లుకాక ఖచ్చితంగా పరీక్ష చేసుకుని కొనడం లాంటి సన్నివేశాలను చూపించడం బాగుంది. రాహుకాలం వర్జ్యం లాంటి నమ్మకాలవలన నష్టంకూడా జరగచ్చంటూ కమెడియన్ సత్యద్వారా అండర్ కరెంట్ గా వేసిన సెటైర్ కూడా బాగుంది.
రొటీన్ లవ్ స్టోరీలు, పాటలు, ఫైట్లతో కలిపి కర్చీఫులు పిండేసే ఎమోషనల్ సీన్స్ లేని సినిమా సినిమానే కాదనుకునే ప్రేక్షక వర్గంలో మీరుంటే మీరీ సినిమా చూడడం వేస్ట్. అలాకాకుండా పెద్దగా కథ ఏమీ లేకపోయినా ఇన్వాల్వ్ చేయగల కథనంతో సునిశితమైన హాస్యంతో ఆకట్టుకునే వైవిధ్యమైన సినిమాలు చూసే అభిరుచి మీదైతే ముఖ్యంగా ఇలా దొంగతానాలు దోపిడీలు అంటూ క్రైం థ్రిల్లర్ కామెడీ సినిమాలు నచ్చే వారైతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకుండా చూడవలసిన సినిమా “స్వామిరారా”
మాకు ఈ శుక్రవారం రిలీజవుతోంది చూసేస్తా ;)
రిప్లయితొలగించండిఎప్పటిలాగే పద్దతైన రివ్యూ
అబ్బే ఇంకెవ్వరూ పనికి రారండి మీ ముందు రివ్యూలు రాయటానికి. టోపీ తీసేసా.
రిప్లయితొలగించండిసినిమా కేక. మీ రివ్యూ కేకన్నర
రిప్లయితొలగించండిహ హ రివ్యూ చదువుదాం అని ఇక్కడికోస్తున్నా ఆ బటన్ తో ఆది వెళ్తున్నా :-)
రిప్లయితొలగించండిసూపర్ ఐడియా మాష్టారు !
రాజ్, జయ గారు, మురళీ, శ్రావ్యా థాంక్స్ ఫర్ ద కామెంట్.
రిప్లయితొలగించండివిజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి వేణు గారు.
రిప్లయితొలగించండిథాంక్స్ జలతారు వెన్నెల గారు,
తొలగించండిమీకు కూడా విజయ నామ సంవత్సరాది శుభాకాంక్షలు.