మంగళవారం, మే 21, 2013

మణిప్రవాళం - తిలక్


తిలక్ గారు 1963 వ సంవత్సరంలో రాసిన కథ మణిప్రవాళం. కథల సంకలనంలో ఈ కథ చివరలో స్వాతి, 1963 అని రాశారు కానీ ఇప్పటి స్వాతి ప్రారంభమైనది 1970 లో కనుక అప్పటి స్వాతి వేరైనా అయిఉండాలి లేదా పత్రిక పేరో/సంవత్సరమో పొరపాటుగా అచ్చయి ఉండాలి, ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పగలరు. 

మణిప్రవాళము అంటే రెండు భాషలు కలగలిసిన కవిత్వమట. సంస్కృత శబ్దాలకు సరిపోలగల మళయాళ అక్షరములు లేక మొదట్లో వైష్ణవాచార్యులు కొన్ని మాటలు గ్రాంధీకంలోనే రాసి ఇటువంటి శైలి ఉపయోగించారని, అలా కలగలసిపోగల పదాలను గుర్తించి నిర్ధుష్టమైన నియమావళిని ఏర్పాటు చేశారనీ. ఆ తర్వాత అదే కవిత్వ శైలిని కేరళలోని నంబూద్రి వంశస్థులు కొనసాగించారని అంటారు. 

మళయాళంలో “మణి” అనగా ‘కెంపు(Ruby)’, “ప్రవాళము” అనగా సంస్కృతంలో ‘పగడము(Coral)’ ఈ రెండిటినీ కలగలిపి అల్లిన మాలని కూడా మణిప్రవాళం అంటారుట.

ఈ కథలో ఇటువంటి శైలిని నేను గుర్తించలేకపోయాను కానీ కథ చదివాక మాత్రం ఆలోచింప చేసింది. మణిప్రవాళం అంటే ఏమిటో వెతికి తెలుసుకునేలా చేసింది. అర్ధం తెలుసుకున్నాక కథలోని శైలికి అన్వయించుకోవాలో కథలోని విషయానికి అన్వయించుకోవాలో అర్ధంకాలేదు. అసలు కథకే అనేకానేక అర్ధాలున్నట్లు అనిపించింది. చివరికి కొన్ని కథలకి ఎందుకు కనెక్ట్ అవుతామో అర్ధంచేసుకోవడం కష్టమనిపించింది. 

ఎందుకో నా మనసుకు బాగా నచ్చిన ఈ కథని గుర్తొచ్చినపుడల్లా చదువుకోడానికి బ్లాగ్ లో ఉంచాలని మీ అందరితోనూ పంచుకోవాలనీ ఇలా. అన్నట్లు ఈ కథ చదువుతుంటే లీలామాత్రమైన పోలికతో ఆమధ్య ఆంధ్రజ్యోతిలో చదివిన ఒక కథ గుర్తుకువచ్చింది, మీకేమైనా గుర్తొచ్చిందా? చదివి చెప్పండి.

~*~*~

మణిప్రవాళం
--తిలక్


చీకట్లో గదిలో పడుకుని వుంది లత. ఏకాకిగా ఏ హృదయమూ స్పందించని ఏకాంతంలో, ఎవరూ చూడని నరకంలో చిక్కుకుని వుంది లత.

అతను మెరుపులాగా వచ్చాడు. అటు దక్షిణానిలం వీచే దారినుండి దయాసరస్సులలో విహరించే రాజహంసనెక్కి నక్షత్రకిరణం మీదుగా జారుతూ వచ్చాడు.

అతను పాట పాడాడు. పాటకి చీకటి చీకాకుపడి నల్లగా కోప్పడింది.

అతను పాట పాడాడు. చీకటిని చెరిపివేస్తూ వేయి పువ్వుల తావి వింతగా కమ్ముకుంది.

అతను పాట పాడాడు. జాలిగా తియ్యగా లత గుండెలో కోర్కెలా హాయిగా తెరతెరల్లాగ కదిలింది.

ఆమె కళ్ళు తెరిచింది. అతను నవ్వాడు. అతను వెళ్ళిపోయాడు.

అతను మళ్ళీ మరో రోజున వచ్చాడు. “లతా” అని పిలిచాడు. అతని గొంతులో మాధురీ మందాకిని జలజలించింది.

“ఇంకోసారి పాడు” అంది లత రెప్పల్ని కొంచెం ఎత్తి. నల్లని పొడుగాటి ఆమె తలవెంట్రుకలు చీకట్లో తరంగాలలా కదులుతున్నాయి.

అతను పాడాడు. చీకటి చికాకు పడింది. గుడ్లగూబలు దిగులుగా ఏడ్చాయి. అతను వెళ్ళిపోయాడు.

అతను మళ్ళీ ఇంకోరోజున వచ్చాడు. లత పెదవుల మీద సన్నని చిరునవ్వు విరిసింది. ఆప్యాయంగా అడిగింది, “ఒక్క పాట పాడవూ?” పాడాడు.

లత కళ్ళలో నీళ్ళు. నీళ్ళలోంచి చావును దాటిన వెలుగు. అతను నిట్టూర్చాడు.

కొన్నాళ్ళకి మాలతీ సౌరభం వీచిన రాత్రి –

“స్వామీ” అంది లత. అతను మాట్లాడలేదు.

“కవీ” అంది లత. అతను మాట్లాడలేదు.

“ప్రియా” అంది లత. అతను పలికాడు.

నక్షత్రాలు మెరిశాయి. వెన్నెల కురిసింది. అతని చేయి ఆలంబనగా లత లేచి నిలుచుంది. అతని వొళ్ళో వాలింది. కిటికీ అవతల మందారం ఎర్రగా నవ్వి తల పక్కకు తిప్పుకుంది.

వకుళ వృక్షం విరిసిన రాత్రి –

“ప్రియా” అంది లత.

“లతా” అన్నాడతను.

“మిమ్మల్ని వదలలేను.”

జవాబుగా ఆమె ఫాలభాగాన్ని ముద్దాడాడు అతను.

“ఎక్కడనుంచి వచ్చారు?”

“మంచు పర్వతాల అంచున దయాసరస్సుకి దక్షిణాన మంత్ర విహంగాలు మసలే చోటున - రంగు రంగుల చెట్ల నీడలలో పాడుకుంటూ ఉంటాను”

“అక్కడికి దగ్గరగా మాయాలోకం ఉంది. భయం లేదా” అంది లత. అతను నిట్టూర్చాడు.

మొగలిచెట్టు మొదటిరేకు తొడిగిన రాత్రి –

“ప్రియా” అంది లత.

“ప్రియతమా” అన్నాడతను.

“ఏమిటాలోచిస్తున్నారు?”

అతను నిట్టూర్చాడు. అతను వెనక్కి చూశాడు. అతని వెనకాల మబ్బులు…

“పాట పాడవూ” అతని వొడిలో తల పెట్టుకుని అడిగింది లత. అతను పాడాడు - లత పులకరించింది. పరవశించింది. అరమోడ్పు కన్నులతో అతన్ని గుండెలకి హత్తుకుంది. అతను బరువుగా నిట్టూర్చాడు.

అతను వస్తున్నాడు. లత చిగురుపట్టింది. మొదటి పువ్వు పూసింది.

అతను వస్తున్నాడు. అతనితోటి మబ్బులు వస్తున్నాయి. మబ్బుల వెనక రాక్షసులు దాక్కున్నారు.

నక్షత్రం రాలిపోయిన రాత్రి –

అతను వచ్చాడు. అతని గుండె మీద రాక్షసుల మొదటి గోటి గీత - ఎర్రని చార.

“నన్ను కాపాడగలవా?” అన్నాడతను.

“ఓ” అంది లత.

“అయితే నీ దగ్గరున్న మణిప్రవాళం ఇవ్వు.”

“నా దగ్గర లేదు”

“అయితే - ”

“ఇంకోటి ఇస్తాను”

ఆమె ఏదో ఇచ్చింది. రక్తపుచార కనపడలేదు. అతను నవ్వాడు. ఎప్పటిలాగే వెన్నెల…

కొన్నాళ్ళు గడిచాయి. అతను వచ్చాడు. ఈసారి అతని గుండె మీద రెండు ఎర్రని చారలు. అతను కొంచెం వడలాడు.

“నన్ను కాపాడగలవా?” అన్నాడతను.

“ఓ” అంది లత.

“అయితే నీదగ్గరున్న మణిప్రవాళం ఇవ్వు.”

“నా దగ్గర లేదు”

“మరి - ”

“ఇంకోటి ఇస్తాను”

ఆమె ఏమిటో ఇచ్చింది. రక్తపుచారలు కనపడలేదు. అతను నవ్వాడు. కాని ఆ నవ్వులో నీరసం వుంది.

లత రెండవ పువ్వు తొడిగింది. అతని కోసం చూసింది. రాత్రీ పగలూ ‘ప్రియా’ అని పిలిచింది. ఆ పిలుపుకి ఆకాశపు అంచున ఒక రెల్లు రాలిపడింది.

అతను వచ్చాడు. ఈసారి గుండె అంతా రక్తం. ఎర్రని మడుగులాగా వుంది. అతని వెనుక నల్లటి మబ్బులు. నల్లని మబ్బుల వెనక రాక్షసుల వికటాట్టహాసాలు.

“నన్ను బ్రతికించు. నన్ను చంపేస్తున్నారు” అన్నాడతను.

“ఏం చెయ్యను నేను?” ఏడ్చింది లత. మూడవ పువ్వుతో సహా.

“మణిప్రవాళం ఇవ్వు”

“లేదు”

“ఉంది. నాకు తెలుసును”

“దానిమీద నాకు అధికారం లేదు”

“అయితేనేం - మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానుగా.”

లత ఊగిపోయింది. బాధ పడింది. విహ్వలించింది. కళ్ళు తెరిచి జాలిగా ఇలా అంది: “నా పెద్దల అభిమానం నా వాళ్ళ అనురాగం అన్నీ పోతాయి. నా వాళ్ళు నాకు కాకుండా పోతారు…”

“వాళ్ళందర్నీ వొదిలెయ్యి”

“వదలలేను”

“అయితే మరి…”

“ఇంకోటి ఇస్తాను”

“లాభం లేదు”

ఈసారి అతని కళ్ళల్లో చీకటి. అతని పెదవుల పైన చీకటి. నిర్దయ లాంటి చావు లాంటి చీకటి.

“వెళ్ళిరానా?” అన్నాడు. అతని స్వరం సన్నగా మెలికలు తిరిగి చీకట్లో గిలగిలలాడింది. గుండె నుండి కారే రక్తాలు పిండుకుంటూ అతను వెళ్ళిపోయాడు. అతని వెనక మబ్బులరచుకుంటూ, రాక్షసులరుచుంటూ వెళ్ళిపోయారు.

లత ఏడుస్తూ కూలబడింది. మూర్ఛ పోయింది.

మళ్ళీ అతను రాలేదు.

లత మళ్ళీ పూయలేదు.

అతని జాడ తెలియదు.

చీకటి లతని ముసుగులా మూసుకుంది.

అతను మళ్ళీ రాలేదు.

అతను మళ్ళీ పిలవలేదు.

అతని పాట అర్ధరాత్రి మబ్బులలోంచి జాలిగా–

ఆమె మూలుగు పాతాళ కుహరంలోంచి బాధగా –

పువ్వులు రాలిపోయాయి. మంచు దట్టంగా పడి మనసులూ, ఆకులూ మూసుకుపోయాయి.

బావురుమనే నిశ్శబ్దం అంతటా…

దేవతలు ఏడుస్తున్న వర్షం. మనుష్యులు కాలుతున్న వాసన.

అతన్ని వెతకడానికి వెళ్ళినవారికి దారిపొడుగునా అతని గుండె రక్తపు మరకలే కనిపించాయి. కాని అతడు మాత్రం కనపడలేదు.

ఆమెను చూడడానికి వెళ్ళినవారికి గదిలో ఆమె కనపడలేదు. కటిక చీకటి తప్ప.

ఇది ప్రళయం - అంది రాలిపోయిన పువ్వు.

ఇది విలయం - అంది జారిపోయిన చుక్క.

పెట్టె లోపల - గదిలో మూలగా పెట్టె లోపల్లోపల్లోపల - మణిప్రవాళం మెరుస్తోంది. ఫక్కున నవ్వింది. ఇలా అంది.

“నా శక్తి అనంతమైనది. నేను కరుణనీ, ప్రేమనీ, సౌందర్యాన్నీ, నశింపచేస్తాను. దైవీయ శక్తుల్ని ఓడిస్తాను. ఈ జగత్తు నాకు బానిస - అవునా?”

అవును అన్నాయి మబ్బులు.

అవును అన్నారు రాక్షసులు.

అవును అన్నాయి చెట్లూ, చెట్టు మీద పిట్టలూ భయంకరంగా.

అవును అన్నాయి పువ్వులు ఏడుస్తూ.

ఒక్కసారిగా నిశ్శబ్దం. కఠినశాసనంలాగా నిశ్శబ్దం. 
యుగాల దాకా మళ్ళీ ఏ హృదయమూ పలుకలేదు. పలవరించలేదు.

(స్వాతి, 1963).
~*~*~

14 కామెంట్‌లు:

  1. కధ బాగుందండీ.. కానీ నాకు అర్ధం కాలా.. ;(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ రాజ్ ఫర్ ద కామెంట్ రాజ్. ఇటువంటి కథలు అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే.

      తొలగించండి
  2. నాకు పుష్పవర్ణ మాసం గుర్తుకొచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ మువ్వగారు అవునండీ నాకూ ఆకథే గుర్తుకు వచ్చింది.

      తొలగించండి
  3. చాలా బాగుంది వేణూ కథ. నిజమే.. చాలా రకాల ఆలోచనలని తెప్పిస్తోందీ కథ. Thanks for sharing Venu!
    మీరు చెప్తున్న ఇలాంటి ఇంకో కథ వరూధిని గారు చెప్పిందేనా? అయితే అది కూడా చదివెయ్యాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ మధురా. అవును ఆ కథే చదివి ఎలా ఉందో చెప్పండి :)

      తొలగించండి
  4. వేణు గారు ...అర్థం చేసుకోవటానికి కథ క్లిష్టం గా ఉన్నా కూడా ... నా బుర్ర కి అర్థమైనంతలో చాల బాగుందండి. ..అసలు మొత్తం అర్థం ఐతే ఇంకెంత బాగుంటుందో... నేను ఇప్పుడిప్పుడే బ్లాగ్ ప్రపంచo లోకి అడుగుపెట్టాను..ఇలాంటి కథ ను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ. ఇలాంటి కథలలో సౌలబ్యమదేనండి చదివిన ప్రతిసారి ఏదో కొత్త అర్ధం స్ఫురిస్తుంటుంది. బ్లాగ్ ప్రపంచానికి స్వాగతం.. గుడ్ లక్ విత్ బ్లాగింగ్ :-)

      తొలగించండి
  5. ఈ కథ చదివితే తిలక్ రాశినదే "నువ్వు లేవు నీ పాట వుంది" అనే కవిత ఙ్ఞాపకం వచ్చింది.
    శారద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ శారద గారు, అమృతంకురిసిన రాత్రి తీయించారు :-) ఆ కవిత ఆమెపాట గురించి కదా. అచ్చులో ఉన్న సంవత్సరాలు కరెక్టే అయితే ఈ కథే ముందండీ. థాంక్స్ ఎగైన్.

      తొలగించండి
  6. థాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ వేణు గారు :) మీ బ్లాగ్ లో చాల విభాగాలు ఉన్నాయ్ రోజు కి ఒకటి చొప్పున చదివేస్తాను..ఏదో ఒక రోజు నేను కూడా ఇన్ని విభాగాలు నా బ్లాగ్ లో కూడా పొందుపరచడానికి ప్రయత్నిస్తాను:) అప్పుడప్పుడు మీరు కూడా నా బ్లాగ్ ని చూస్తూ ఉండండి .. ఎంతైనా ఎక్స్పర్ట్ కామెంట్స్ ఆర్ వాల్యూబుల్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ ఎక్స్పర్ట్ అంత లేదులెండి కానీ తప్పకుండా మీబ్లాగ్ చూస్తాను.

      తొలగించండి
  7. థాంక్సండి వేణు శ్రీకాంత్ గారు. కథ అర్థం కాకపోయినా ఒక మంచి కళాత్మక విలువలతో పాటు కంటెంట్ కూడా ఉన్న విషాదాంత సినిమా చూసిన అనుభూతి కలిగించింది.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.