శుక్రవారం, మార్చి 26, 2010

ఆనందం.. అంతలోనే అంతర్ముఖం !

I have a dream.. ఇది సరైన ప్రయోగమేనా.. MLK గారి స్పీచ్ గుర్తొచ్చి ఆవేశంగా మొదలెట్టాను కానీ సరైన ప్రయోగం కాదేమో, ఎందుకంటే ఈ కల ఇప్పుడు రావడం లేదు, అదీకాక తీరిన ఈ కల గురించే ఈ టపా కనుక ఈ ప్రయోగం సరికాదనే అనుకుంటున్నా. ఏమో లెండి ఇంగ్లీష్ గ్రామర్లో ఈ టెన్స్ లు ఎప్పుడూ నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాయ్. ఏదేమైనా గ్రామర్ సంగతి ఇంగ్లీష్ టీచరమ్మలకి వదిలేసి అసలు విషయానికి వస్తే, ఈ బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో నేనో కలగనే వాడ్ని. నేనేదో బిజినెస్ లంచ్ కో, లేదూ డిన్నర్ పార్టీ కో, పెళ్ళికో, పుట్టినరోజు వేడుకకో వెళ్ళి పదిమందితో కలిసి మాట్లాడుతున్నపుడు హఠాత్తుగా ఒక పరిచయం లేని వ్యక్తి వచ్చి "మీరు ఫలానా కదా ఫలానా బ్లాగ్ రాస్తారు కదా నేను తరచుగా చదువుతుంటాను, బాగా రాస్తారు..బ్లా.. బ్లా.." అని నన్ను పరిచయం చేసుకుని మాట్లాడేస్తున్నట్లూ... నేనేమో అందరి మధ్యలో మొహమాట పడిపోతూ, ఒక పక్క కాస్త గర్వ పడుతూ చిరునవ్వులు చిందిస్తూ అతనితో మాట్లాడుతున్నట్లు.. ఇలా సాగిపోతుంది ఆ కల :-)

మొన్న ఓ రోజు మధ్యాహ్నం ఇంచుమించు ఇలాంటి సంఘటనే జరిగింది. నేను మా ఆఫీస్ కేఫెటీరియాలో టీ తాగుతుండగా ఒకరు వచ్చి మీరు వేణూశ్రీకాంత్ కదా? నాతోనేను నాగురించి బ్లాగ్ రాస్తారు కదా? నేను క్రమం తప్పక చదువుతానండీ మీరు చాలా బాగా రాస్తారు అంటూ పలకరించి మాట్లాడారు. అంతే ఒక్కసారిగా నా మనసులో "కల నిజమాయెగా..", "గాల్లో తేలినట్లుందే" ఇత్యాది పాటలు నేపధ్యంలో మోగుతుండగా అతి కష్టం మీద మొహంలో ఆ భావాలను కనపడనివ్వకుండా కాసేపు మాట్లాడి వచ్చేశాను. అతను నా బ్లాగ్ చూసి నే ఐబియం లో పని చేస్తున్న విషయం తెలుసుకుని మా ఆఫీస్ లోకల్ చాట్ రూం లో నా ఫోటో చూసి నన్ను గుర్తు పట్టాడుట. ఇంట్రెస్టింగ్ అనుకుంటూ అక్కడ నుండి డెస్క్ దగ్గరకు వస్తుంటే దారిలో మరో అపరిచితుడు తన కంప్యూటర్ లో నా బ్లాగ్ ఓపెన్ చేసి చదువుతూ కనిపించాడు. నే వెళ్ళేప్పుడు సాక్షిపేపర్ చదువుతున్న అతన్ని చూసి నవ్వుకున్నాను ఆహా !! ఆఫీస్ టైం మాబాగా ఉపయోగిస్తున్నాడు అని. వచ్చేప్పుడు నా బ్లాగ్ చదువుతున్న అతని గురించి ఏమనుకున్నానో మరి ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు కదా :-) కాకపోతే తనని కదిలించడమెందుకు లే అని నేనేం అడగలేదు. మొత్తం మీద ఒకే రోజు ఆఫీస్ లో ఇలా డబుల్ ధమాకా నా సొంతమైందనమాట.

ఈ సంధర్భంగా మీకో విషయం చెప్పాలి. నిజంగా మీ ఙ్ఞాపకాలను పదిల పరచుకోవాలంటే డైరీ చాలు కదా బ్లాగెందుకు అని ఈ మధ్యే అడిగిన ఓ నేస్తానికి నాకు సంతృప్తి కలిగే జవాబు చెప్పలేకపోయాను. నిజమే కదా అనిపించింది. కానీ నా బ్లాగ్ మొదలెట్టినపుడు నాకు పరిచయమున్న పదుగురిలో ఓ నాలుగురైదుగురు కంప్యూటర్ ఇంటర్నెట్ తో పరిచయమున్న వారు మాత్రమే చూస్తారు లే అని మొదలెట్టాను. కేవలం నాకు బాగా పరిచయమైన ఆత్మీయమైన ఒకరిద్దరు విజిటర్స్ తో ఇంచుమించు నాడైరీ లా సాగుతున్న నా బ్లాగ్ ను ఎలా పట్టుకున్నారో కానీ చావాకిరణ్ గారు మొదటి కామెంట్ రాసి తన ప్రొఫైల్ కి, బ్లాగ్ కి రప్పించుకుని అక్కడ నుండి నన్ను జల్లెడ కీ కూడలికి పరిచయం చేశారు. ఇక అక్కడ నుండి నాకు హిట్ కౌంటర్లు కామెంట్లు ఇత్యాదులు అలవాటైయ్యాయి.

నాతో కాస్త పరిచయమున్న వారెవరైనా నాకు కాస్త కీ.క. అదేనండీ కీర్తి కండూతి ఎక్కువే అని ఒప్పుకుంటారు. అంటే పైకి కాస్త మాడెస్టీ ప్రదర్శించినా పొగడ్తలకి పడిపోని మనిషెవరుంటారు చెప్పండి :-) ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు మీడియాలో మన పేరు చూసుకోవడం అనుకోని ధ్రిల్ ను మనసొంతం చేస్తాయి. బహుశా అవే నన్ను బ్లాగ్ కు అడిక్ట్ చేసేసి నన్ను అడ్రినలిన్ జంకీ ని చేశాయేమో అనిపించింది. చాలా మంది ఫేమస్ బ్లాగర్స్ తో పోలిస్తే నా రాతలు  చాలా సబ్ స్టాండర్డ్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అలానే నా టపాల సంఖ్య కానీ కామెంట్ల సంఖ్యకానీ విజిటర్స్ సంఖ్యకానీ చాలా ఇతర బ్లాగులతో పోలిస్తే అతి తక్కువ కనుక నేను బ్లాగ్ కు ఎడిక్ట్ అయ్యాను అన్నమాట నిజం కాదేమో అనికూడా అనిపిస్తుంది.

కానీ బ్లాగ్ నాకు తెలియకుండానే నా జీవితం లో ఒక సింహ భాగం అయిపోయింది. ఫ్యామిలీ ని, ఆత్మీయ నేస్తాలనీ మించి కేవలం నాకుమాత్రమే స్థానం కలిగిన నాకంటూ ఒక ప్రపంచం సృష్టించుకుని దానిలో సోలోగా బతికేస్తున్నాను అనిపిస్తుంది. బ్లాగ్ ద్వారా పరిచయమైన మితృలు బాహ్య ప్రపంచంలో పరిచయం కాకపోవడం బాహ్యప్రపంచంలోని మితృలు సన్నిహితుల దగ్గర బ్లాగ్ గురించి అతి తక్కువ మాట్లాడటం వారికి నా బ్లాగ్ లో వ్యక్తపరిచే అభిప్రాయాలలో చోటులేకపోవడం ఒక కారణం కావచ్చు. బ్లాగ్ పూర్తిగా వ్యక్తిగతమైన అభిప్రాయాల వేదిక అని అందులో ఇతరులకు చోటు లేదనీ ఒక అభిప్రాయంలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఆ  ఇతరులు ఎవరు అనేది నిర్ణయించుకోవడం లో కూడా ఒక చిన్న పొరపాటు చేసి ఆత్మీయులను నొప్పించాను ఆ విషయం అర్ధమయ్యాక  చాలా బాధ పడ్డాను. 

ఇదిగో ఈ పైన రాసినటువంటి అంతర్మధనం జరిగినపుడు ఎపుడైనా బ్లాగ్ మూసేయాలి అనిపిస్తే ఆఆలోచన కు స్వస్తి చెప్పేలా చేసేది బ్లాగ్ మితృల ప్రోత్సాహమే. ఈ బ్లాగ్, చదివిన వారిని కాసేపు వారి కష్టాలను మరిచి ఙ్ఞాపకాలలోకి వెళ్ళి ఓ చిన్న చిరునవ్వును వారి మొహంపై పూయించ గలిగితే ఈ బ్లాగ్ ఓపెన్ గా అందరూ చదివేలా ఉంచడం వెనుక ధ్యేయం నెరవేరినట్లే. ఏదేమైనా నేను రాసినది ఓపికగా చదివి కామెంట్లు రాస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మితృలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. కామెంట్ రాయకపోయినా క్రమం తప్పక చదివే పాఠకులకు కూడా పేరు పేరునా ధన్యవాదాలు. అలానే మొదటి కామెంట్ రాసిన చావా కిరణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.

అసలు నేను రాసినది మరొకరు చదవగలరు, చదివి ఆస్వాదించగలరు అనే నమ్మకాన్ని నాలో కలిగించి ఈ బ్లాగ్ ప్రారంభించడానికి ముఖ్య  కారణమై నా వేలు పట్టుకుని నా బ్లాగు రూపు రేఖలను దిద్దించి. తను మాత్రం, తను మాటలు నేర్పిన కొడుకు పెద్ద పెద్ద డిబేట్లు గెలుస్తుంటే దూరం నుండి మురిపెంగా చూసుకుని ఆనందించే అమ్మలా. తన వేలు పట్టుకుని నడక నేర్చుకున్న కొడుకు ఆ వేలు విడిపించుకుని తోటి పిల్లలతో ఆటలాడు కోవడానికి పరిగెడితే ఆ ఆటలలో తనకే భాగస్వామ్యం లేకపోయినా దూరం నుండి ముచ్చటగా చూస్తూ మురిసిపోయే నాన్నలా. దూరం నుండి చూస్తూ నిరంతరం ప్రోత్సహిస్తున్న నా ఆత్మీయ నేస్తానికి ఈ సంధర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. బ్లాగ్ ప్రపంచంలో మునిగిపోయి నాకే తెలియకుండా నే చేసిన పొరపాట్లను తను మనస్ఫూర్తిగా మన్నిస్తారని తలుస్తూ...

ఈ టపాను తనకి అంకితమిస్తూ...
ప్రస్తుతానికి శలవు...

24 కామెంట్‌లు:

 1. నాణానికి ఆ వైపు ఈ వైపు అంటారుగా వేణూ.. ఇదీ అంతేనండి. మనసు అంతే... మీరిలాగే ముందుకు సాగాలని ఆశిస్తూ..

  రిప్లయితొలగించండి
 2. ఇదంతా ఓకే కానీ, సడెన్ గా ఇప్పుడే ఎందుకు అనేది ప్రశ్న.. మొన్నేమో నిషిగంధ గారు, ఈ రోజు మీరు..
  ఏంటి, అసలేం జరుగుతోంది.. నాకు తెలియాలి!!!

  రిప్లయితొలగించండి
 3. డిన్నర్ పార్టీ కో, పెళ్ళికో, పుట్టినరోజు వేడుకకో వెళ్ళి పదిమందితో కలిసి మాట్లాడుతున్నపుడు హఠాత్తుగా ఒక పరిచయం లేని వ్యక్తి వచ్చి "మీరు ఫలానా కదా ఫలానా బ్లాగ్ రాస్తారు కదా నేను తరచుగా చదువుతుంటాను, బాగా రాస్తారు..బ్లా.. బ్లా.." అని నన్ను పరిచయం చేసుకుని మాట్లాడేస్తున్నట్లూ... నేనేమో అందరి మధ్యలో మొహమాట పడిపోతూ, ఒక పక్క కాస్త గర్వ పడుతూ చిరునవ్వులు చిందిస్తూ అతనితో మాట్లాడుతున్నట్లు.. ఇలా సాగిపోతుంది ఆ కల .....  అన్యాయం ....ఇదీ నా కల :O

  రిప్లయితొలగించండి
 4. వేణుశ్రీకా౦త్ గారు,
  బాగు౦ది..అ౦తా ఇలానే అనుకు౦టాము కాబోలు..నేను బ్లాగ్ లో మునిగిపోతాను..నాకు బ్లాగ్ ఓ ముఖ్యబాగ౦ అయ్యిపోయ్యి౦ది..కోపాన్ని,స౦తోషాన్ని మన౦ మన:పూర్తిగా ప౦చుకోగలచోటు కదా మరి..ఆ స్దాన౦ సముచితమే మరి బ్లాగ్ ని అని నేను అనుకు౦టా!!
  మీ అ౦తర్ముఖ౦ చదువుతున్నప్పుడు చాలా మటుకు నాలానే,నా పీలి౦గ్స్ చదివినట్లుగానే అనిపి౦చి౦ది..బ్లాగర్స్ డే నాడు కూడలిచాట్ రుమ్ లో నన్ను మీ బ్లాగ్ తెలుసు చుశాను అ౦టేనే నేను గాలిలో ఎగిరిపోయా!!!!మరి ఎవరో వచ్చి గుర్తుపడితే ............ఇ౦క మాటల్లో చెప్పలేను..మీ మాటలలో మీ ఆన౦ద౦ చూశాను..నాకైతే ముఖ్య౦ తెలిసిన బ్లాగర్స్ ని కలవాలని అనుకు౦టూ ఉ౦టాను..మీరు మ౦చి బ్లాగర్..ఇ౦కా ఇ౦కా ఎన్నో రాసి మాతో ప౦చుకోవాలి..ఇ౦క ఇలా౦టి ఎన్నో ఆన౦దపుఅ౦చులని తాకాలి..ఆల్ ది బెస్ట్.

  రిప్లయితొలగించండి
 5. భాస్కర్ రామరాజు గారు నెనర్లు :-))

  ఉషగారు నెనర్లు, నిజమే నండీ నాణానికి రెండువైపులు.. అదేదో సినిమాలో అన్నట్లు "కళ్ళున్నాయని సంతోషించేలోపే కన్నీళ్ళున్నాయని గుర్తు చేస్తాడు ఆ దేవుడు".

  మేధగారు నెనర్లు :-) ఏమీ జరగట్లేదండీ :-) మొన్న నిషిగంధ గారు ఇపుడు నేను ఇలా రాయడం కేవలం కాకతాళీయం అంతే అంతకు మించి ఏమీలేదు :-) ఇటువంటి టపా రాయడానికి ప్రోత్సహించిన పరిస్థితులు/సంఘటనలు ఖచ్చితంగా వేర్వేరు అనుకుంటున్నాను :-)

  మంజు గారు నెనర్లు :-) బ్లాగ్ మూసేసే ఉద్దేశ్యం ప్రస్తుతమైతే ఏమీ లేదండీ.

  నేస్తం గారు నెనర్లు :-) హ హ మీదీ ఇటువంటి కలేనా శుభం :-) త్వరలో నిజమవ్వాలని కోరుకుంటున్నాను :-)

  సుభద్ర గారు నెనర్లు :-) నిజమేనండీ చాలా మందికి డైరీలా, అంతకన్నా ఎక్కువగా అయిపోయింది బ్లాగ్ కానీ ఒకోసారి మాత్రం ఇది సరైన పనేనా మరీ ఎక్కువైందా అని అనిపిస్తుంటుంది అంతే.. హ హ నిజమే మనం మన సొంతంగా రాసినది మెచ్చుకుంటే ఆ మాత్రం పొంగిపోవడం సహజమే కదా :-) మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. I agree with మేధ . Whats going on?! Anything to do this month/year? :)

  రిప్లయితొలగించండి
 7. అభినందనలు.

  నేను వ్రాసిన "బగ్గు" వద్గీత టపా కూడా, మెయిల్స్ లొ సర్క్యులేట్ అవుతూ, నాకే ఫార్వర్డ్ మెయిల్ లాగా వచ్చింది. అప్పుడు నేను కూడా ఇలానే "గాల్లో తేలినట్టుందే" అని ఫీల్ అయ్యా ;)

  ఇలాగే మంచి పోస్ట్ లు వ్రాస్తు మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నా.

  రిప్లయితొలగించండి
 8. S గారు నెనర్లు :-) మేధ గారికి ఇచ్చిన జవాబే మీకునూ :-)

  బహ్మి గారు నెనర్లు. ఔనా సూపర్బ్ :-) భలే అనుభూతిని ఇస్తాయి అటువంటి సంఘటనలు. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు :-)

  రిప్లయితొలగించండి
 9. మీ డబుల్ ధమాకాకి డబుల్ కంగ్రాచ్యులేషన్స్ :-)

  ఇలా ఎక్కడినించో మనల్ని గుర్తుపట్టే సంఘటన నాకైతే ఎదురవ్వలేదు కానీ మా ఫ్రెండ్ కి జరిగింది.. తను ఏదో పార్టీకి వెళ్తే బ్లాగుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో నా బ్లాగు ఇష్టమని చెప్పారంట.. నా స్నేహితురాలని తెలియగానే ఆ చెప్పినవాళ్ళు మా ఫ్రెండ్ ని ఇక అస్సలు వదలలేదంట :-)
  ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా మన కాళ్ళు కొన్ని రోజులపాటు భూమ్మీద ఆనవేమో కదా :))

  "... అంతర్మధనం జరిగినపుడు ఎపుడైనా బ్లాగ్ మూసేయాలి అనిపిస్తే..."
  ఎప్పుడూ ఇలాంటి ఆలోచన రానివ్వద్దండీ.. కావాలంటే నాలాగా 2,3 నెలలు బ్రేక్ తీసుకోండి.. అప్పుడు బ్లాగు, వ్యక్తిగత ప్రపంచాన్ని బ్యాలన్స్ చేసుకునే శ్రమ కాస్త తగ్గుతుంది :-)

  వేణూ మీ శైలి బావుంటుంది.. అలానే మీరు రాసే విషయాలు కూడా చాలా బావుంటాయి.. చక్కగా ఇలానే కంటిన్యూ అయిపోండి.. మంచి మంచి టపాలు మాకందించండి :-)

  @ మేధ & S, ఈ థాంక్స్ గివింగ్ సిరీస్ ఖచ్చితంగా కాకతాళీయమే అని వేణూ గారితో పాటూ నేనున్నూ బల్లగుద్ది మరీ చెప్తున్నాను :))

  రిప్లయితొలగించండి
 10. అందరు వినండహొ...నేనే ఆ అభిమానిని.నేనే వేణూ గారిని మా ఆఫీసులో కలిసింది.
  @వేణూ గారు, నేనే అనుకుంటున్నాను.కాదనకండే..:)
  ఇంతకు ముందే మిమ్మల్ని కలిసిన విషయం నేస్తం గారి టపలో కామెంటాను...:)

  రిప్లయితొలగించండి
 11. @ నేస్తం: మిమ్మల్ని ఎక్కడ కలవాలో చెప్పండి అక్కడికి వచ్చేసి మీ కలని కూడా నిజం చేసేస్తాను. ఒక పనైపోతుంది...ఏమంటారు ?

  రిప్లయితొలగించండి
 12. మీ కల నిజమయినందుకు కంగ్రాట్స్
  మరి నాకూ ఓ కలవస్తుంటుంది.
  నేనూ ఏదో పెళ్ళికో పార్టికో వెళితే....అక్కడ ఇద్దరో నలుగురో గుసగుసగా చెప్పుకుంటున్నారు." అవును ఆవిడే...." అని నాకేసి అనుమానంగా చూస్తూ చుట్టూ వున్న పదిమందికి చెప్పారు." అవును....డవుట్లేదు " అనుకుంటూ అంతా కల్సి నన్ను చుట్టుముట్టీ నీ స్పందనకి ఇదిగో మా ప్రతిస్పందన అని ... వా............
  మీకల నిజం అయినందుకు మీకు ఆనందం . నా కల నిజం అవుతుందేమో అని నా భయం .హేవిటో....

  రిప్లయితొలగించండి
 13. మొత్తం మీద ఒకే రోజు ఆఫీస్ లో ఇలా డబుల్ ధమాకా మీ సొంతమైనందుకు అభినందనలు :)

  రిప్లయితొలగించండి
 14. నిజమే..అలాంటి ఓ చిన్నపాటి గుర్తింపు చాలు..మనల్ని భూమ్మీద నడవనీకుండా చెయ్యడానికి... :)
  నాకు కూడా అప్పుడప్పుడు ఓ కల వస్తుందండి...అదేమంటే "ఓ సారి నేను ఆఫీస్ నుండి ఇంటికెళ్ళే టైంలో ఓ చోట బండి స్టార్ట్ అవ్వక ఇబ్బంది పెట్టి ఆగిపోతుంది..నేనేమో బండిని నలభై అయిదు డిగ్రీలు వంచి స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను...అయినా స్టార్ట్ కాలే..ఇంతలో ఓ పిల్లగాలి నా మోముకు చల్లగా తాకింది...గాలికి రోడ్డు పక్కన ఉన్న చెట్ల మీంచి కొన్ని పూలు క్రిందకు పడుతూ ఉన్నాయి...గాలి తాలుకూ చల్లని తాకిడికి నా తల పైకెత్తాను...ఇంతలో ఓ అందమైన అమ్మాయి('ఏ మాయ చేశావో' సినిమాలో జెస్సీ టైపు :)) నా వైపుకు మెల్లగా నడుస్తూవస్తుంది...వచ్చేసింది..మీరు శేఖర్ కదా అని అడుగుతుంది. నా బ్లాగు రెగ్యులర్ గా చదువుతుందని, అభిమాని అని చెబుతుంది...తన హోండా ఏక్టివాలో నాకు లిఫ్ట్ ఇస్తానని కూడా అంటుంది...దారి పొడవునా నా బ్లాగు గురించే మాట్లాడుతుంది...ఈ సారి పిల్ల గాలి,ఆమె కురులు నా మోమును తాకటానికి పోటీ పడుతున్నాయి.."

  అదన్నమాట నా కల..ఇదిగోండి ఇప్పుడే చెప్పేస్తున్నాను.. ఈ కలను నేను కాపీరైటు చేసుకున్నాను. ఎవరైనా కందామనుకుంటే నా కల నాకు తీరిపోయాక అప్పుడు కనుకోండి. :-)

  రిప్లయితొలగించండి
 15. వేణుశ్రీకా౦త్ గారు మీ కల నిజమైనందుకు అభినందనలు ! కాని మీ అంతర్మధనం ఎందుకో అర్ధం కాలే :(
  @శేఖర్ గార మీరు చూడబోతే ఏదో సినిమా డైరెక్టర్ అయ్యేట్లున్నారు తొందరలో :)

  రిప్లయితొలగించండి
 16. నిషిగంధ గారు నెనర్లు :-) తప్పకుండా అలాంటి ఆలోచన వస్తే మీ సలహా పాటించడానికి ప్రయత్నిస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు :-)

  రాజేంద్ర ప్రసాద్ (రాజు) గారు నెనర్లు :-) మిమ్మల్ని వెంటనే గుర్తుపట్టకపోయినా తర్వాత గుర్తొచ్చారండీ :-) మనం మీ బ్లాగ్ మొదలు పెట్టే విషయమై ఈమెయిల్ ద్వారా ముందే మాట్లాడుకున్నాం కదా. ఇపుడు క్యాంటీన్ లో కలిసిన అతను పూర్తిగా అపరిచితుడు :-) నాకు తన గురించి ఇదివరకు తెలియదు. అయినా మనం కలిసింది డెస్క్ దగ్గరే కదా కేఫెటీరియాలో కాదుగా :-) మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందాన్నిచ్చింది కానీ ఈ టపా లో చెప్పినది మీ గురించి కాదు :-) డిజప్పాయింట్ చేసినందుకు సారీ :-)

  లలిత గారు నెనర్లు :-) "నీ స్పందనకి ఇదిగో మా ప్రతిస్పందన" హ హ మీ కామెడీ టచ్ తో అదరగొట్టేశారండీ :-) మీ కలకి వ్యతిరేకంగా జరగి మిమ్మల్ని మెచ్చుకుంటారు లెండి :-)

  నేను గారు నెనర్లు :-) మరే మరే డబుల్ ధమాకా డబుల్ ఆనందాన్ని సొంతం చేసిందండీ. మీ అభినందనలకు ధన్యవాదాలు.

  శేఖర్ గారు నెనర్లు :-) హ హ మీ కల అదిరిందండీ :-) త్వరలో నిజమవ్వాలని ఆశిస్తున్నాను :-)

  శ్రావ్య గారు నెనర్లు :-) సూటిగా చెప్పాలంటే నా అంతర్మధనం ఈ కింది పాయింట్ల మీదండీ..
  నేను నా బ్లాగ్ కు అడిక్ట్ అయ్యానా ??
  బ్లాగ్ లో పడి బాహ్య ప్రపంచాన్ని అందులో ఆత్మీయులను స్నేహితులను నెగ్లెక్ట్ చేస్తున్నానా ??
  ఒక వేళ ఈ బ్లాగ్ డిలీట్ చేయవలసి వస్తే నేను ఇప్పటిలాగానే ఆనందంగా ఉండగలనా ??
  did blog became my extended identity ??

  రిప్లయితొలగించండి
 17. ఈ టపా లో చాలా వరకు నా ఆలోచనలను ప్రతిబిమ్బించేడట్టు ఉంది (ఈనాడు పేపర్, గుర్తు పట్టడం మినహా :) ) . చూడబోతే చాలా మంది బ్లాగర్లు ఇలాగే ఫీల్ అవుతున్నారు. కాకపోతే నేను ఇంత అందంగా చెప్పలేను అనిపించింది. అనుకున్నది అందంగా చెప్పే కళ అందరికీ ఉండదు కదా.

  ఈ రోజు కొన్నాళ్ళ పాటు బ్లాగ్ రాయకూడదు అని అనుకున్నాను. రాసిన ఎవరూ చూడనపుడు, హాయిగా మనసులోనే తలుచుకోవచ్చు కదా, ఆత్మీయులని అందరినీ పక్కన పెట్టి, నెగ్లెక్ట్ చేసి ఇంత సమయం వెచ్చించి ఎవరి కోసం రాస్తున్నాను అని అనిపిస్తుంది ఇలాటప్పుడు. కానీ రాయకుండా ఉండలేను. ఎవరూ చూసినా చూడకపోయినా రాయగానే ఏదో ఒక ఆనందం.
  ఆ ఆనందం ఎవరయినా భుజం తట్టినపుడు రెండింతలు, ఒక్కోసారి వెయ్యింతలు అవుతుంది. ఇంకా బోలెడు విషయాలు పంచుకోవాలని ఉత్సాహం ఇస్తుంది.

  "బాహ్యప్రపంచంలోని [Photo]మితృలు సన్నిహితుల దగ్గర బ్లాగ్ గురించి అతి తక్కువ మాట్లాడటం వారికి నా బ్లాగ్ లో వ్యక్తపరిచే అభిప్రాయాలలో చోటులేకపోవడం"
  ఇది మాత్రం ఎందుకో నాకూ అర్థం కావట్లేదు. చాలా మంది మీద "వీళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు" అని ఒక ఫీలింగ్ వచ్చేసింది.
  ఇంకా చాలా అనిపించాయి. నా గోల ఇక్కడ పెద్ద టపా అయిపోయే డట్టు ఉంది .

  మరోసారి మాట్లాడతా.

  మీకు బోలెడు ధన్యవాదాలు.
  వాసు

  రిప్లయితొలగించండి
 18. వాసు గారు నెనర్లు :-) "ఈ రోజు కొన్నాళ్ళ పాటు బ్లాగ్ రాయకూడదు అని అనుకున్నాను." నా టపా వలన మీకు ఇలా అనిపించలేదు అని తలుస్తాను. లేదంటే మీ బ్లాగ్ అభిమానులు నన్ను కొట్టేయగలరు :-)

  నిజానికి నేను వీరంత అందంగా రాయలేను అని అనుకునే వాళ్ళలో మీరు ఒకరండి. మీ ఙ్ఞాపకాల టపా ఐనాపురం కథలు చాలా బాగా రాస్తారు మీరు. కాని ఎవరి శైలి వారిది. ఈ టపా లోని ఆలోచనలు చాలా మంది బ్లాగర్ల మదిలో ఎపుడో అపుడు వచ్చేవే :-)

  బ్లాగులు రాసే వాళ్ళందరూ కూడా రచన మీద ఆసక్తి కలిగి రాయాలనే దుగ్ద ఉన్నవాళ్ళే అయి ఉంటారు అందుకే ఎవరు చూసినా చూడకపోయినా రాయగానే తెలియని ఒక ఆనందం :-) అలాంటిది ఇక ఆ రాసినదాన్ని నలుగురు మెచ్చుకుంటే ఇంక ఆ ఆనందానికి అవధులు ఎక్కడ ఉంటాయి :-)

  మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు :-)

  రిప్లయితొలగించండి
 19. .మీకల చాల బాగుంది అలానే మీ అంతర్మధనం కూడా.....బ్లాగ్ ఒకరకంగా డైరీ లాటిదే కాని ఇక్కడ డైరీలో రాసుకున్నట్లు యధాతధంగా రాయలేము .ఏదొకటి రాయాలి (పత్రికల్లో అందరివి ప్రచురించరుగా)అని సరదాపడే వర్ధమాన రచయిత(త్రు )ల కి మంచి అవుట్ లెట్ ఈ 'బ్లాగ్ '.కచ్చితంగా నిజజీవితం పై ప్రభావం చూపుతుంది (నా అనుభవం) పని మీద రిలేషన్స్ మీదకూడా.లిమిటెడ్ గా చూడాలనే ఎంతో ప్రయత్నిస్తున్న...ఇంటా బయట కళ్ళెదురుగా కంప్యూటర్లు పెట్టుకుని కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే ఎందుకు బ్లాగ్స్ అలవాటు చేసుకున్నాన అని మధనపడని సందర్భం లేకపోలేదు..

  రిప్లయితొలగించండి
 20. చిన్ని గారు నెనర్లు, మీరు చెప్పింది చాలా నిజం. ప్రతిఒక్క బ్లాగర్ ఏదో ఒక సమయం లో ఆ ఫేజ్ లో ఉన్నవారేనేమో...

  రిప్లయితొలగించండి
 21. వేణు శ్రీకాంత్ గారు చాలా బాగా రాసారండి. మొదటి పార్టులో నన్ను ఐడెంటిఫై చేసుకొన్నాను. ఐ థింక్ ఐ హావ్ ద సేం కైండ్ ఆఫ్ డ్రీం నౌ. మీ మిగిలిన పోస్టులు కూడా కొన్ని చదివాను. ఎప్పటికైనా మీలా రాయగలనా!

  రిప్లయితొలగించండి
 22. కిషోర్ వర్మ గారు ధన్యవాదాలండీ... మీ బ్లాగ్స్ లో కొన్ని టపాలు చదివాను మీరు బాగారాస్తున్నారండీ.. నిజానికి నాకే ఒక శైలి పాడులేదు ఎప్పుడు ఏది తోస్తే అది ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తున్నట్లు వాగేస్తుంటాను అంతే.

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.