సోమవారం, జనవరి 04, 2010

(ఇం) కోతి కొమ్మచ్చి

సాహితీలోకం లో నేను ఇంకా పాకడం కూడా రాని పసివాణ్ణి, నేనేదో రాయడం గురించి చెప్తున్నాను అనుకునేరు నే చెప్పేది చదవడం గురించే, ఇక రాయడం సంగతి మీరే అర్ధంచేసుకోండి. యండమూరి గారి నవలల్ని, ఆంగ్ల నవలల్ని మినహాయిస్తే నేను చదివిన పుస్తకాలు ఓ పాతిక ముప్పై మించవు. కాకపోతే అన్నప్రాసన నాడే ఆవకాయ రుచి చూసినట్లుగా నే తెలుగు పుస్తకాలు మొదలు పెట్టిందే ’అమరావతికథలు’ పుస్తకంతో, ఆ తర్వాత నాకున్న అసక్తి వలన అయితేనేమీ, ఓపికవలన అయితేనేమీ వెతికి వెతికి అన్నీ మంచి పుస్తకాలు మాత్రమే చదివాను. అయినా నాకు పుస్తకాలపై సమీక్షలూ పరిచయాలూ రాసే అర్హత లేదనే ఘాట్టి నమ్మకం, అందునా ముళ్ళపూడి వారి పుస్తకం గురించి పరిచయం చేయడం అంటే సూరీడ్ని దివిటీ పట్టుకు చూపించడమన్న మాటే, అన్నమాటేమిటిలే ఉన్న మాటే.. అయినప్పటికీ నాకు బాగా నచ్చేసిన, ప్రతి తెలుగువారి ఇంట ఖచ్చితంగా ఉండాల్సిన (ఇం)కోతికొమ్మచ్చి గురించి నాలుగు మాటలు చెప్పాలని ఈ చిన్ని ప్రయత్నం.

అసలు ఆటోబయోగ్రఫీ కి కోతికొమ్మచ్చి అని పేరు పెట్టాలన్న ఆలోచన రావడమే రమణ గారి చమత్కార శైలికి నిదర్శనం. మొదట నవ్వొచ్చినా వెంటనే ఎంత నిజం అనిపిస్తుంది. ఒకసారి గమనించి చూస్తే మనసు గతంలోకి పయనించినపుడు ఒక క్రమ పద్దతిలో తేదీల వారీగా అసలు ఆలోచించదు అని అర్ధమవుతుంది. చంచలమైన మనసు కోతిలాటిది అది గతమనే చెట్టుపై ఙ్ఞాపకాల కొమ్మలమీద ఒకదాని మీదనుండి ఇంకో దాని మీదకు దూకుతూ కోతికొమ్మచ్చి ఆట ఆడేసుకుంటుంది కదా, రమణగారు ఎంతబాగా చెప్పారు అని అనుకుంటాం. అసలు ఈ పేరు పెట్టడం తోనే రమణ గారు జీవితాన్ని చూసే దృక్కోణం ఎలా ఉంటుందో మనకి ఒక అవగాహన తెప్పించేస్తారు. మొదటి భాగమైన కోతికొమ్మచ్చిలో ఎక్కువగా బాల్యం, ఇష్టంగా చూసిన ఆకలి కష్టాలు, స్నేహాలు, పెళ్ళికబుర్లు, రచనా వ్యాసంగం, పత్రికలో ఉద్యోగం లాటి వివరాలు గుప్పించి చివరికి ఆంధ్రపత్రిక లో ఉద్యోగానికి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా రెండో రాజీనామా చేయడంతో ముగించారు. ఇంతకూ మీరా మొదటిభాగం చదివారా ? లేదంటే ముందు మీ కంప్యూటర్ కట్టేసి వెళ్ళి కోతికొమ్మచ్చి కొని తెచ్చుకుని చదివేసి తర్వాత ఈ టపా తెరవండి.

ఇక రెండో భాగం మొదలుపెట్టడమే "రెండో రాజీనామాతో సంపాదన కుళాయిధార సన్నబడింది.." అంటూ మొదలుపెట్టి నిరుద్యోగిగా పొట్టకూటికోసం చేసిన అనువాదాలు, సాధించిన విజయాలు, "నావల్ల కాదు.. నే సినిమా రంగానికి పనికి రాను" అనుకుంటూనే పెద్దల ప్రోత్సాహంతో అడుగుపెట్టిన సినీరంగ విశేషాలు, అక్కడ అందుకున్న సత్కారాలు, ఛీత్కారాలు, అభిమానాలు, అవహేళనలు గురించి చెప్తారు. ఇంకా ఒకడికింద పనిచేయడం విసుగువచ్చి బాపుతో కలిసి నడిపిన జ్యోతి పత్రిక గురించి, అది మేలుచేయడం మానేయడంతో తిరిగి సినీ ప్రపంచంలోకి నిర్మాతగా అడుగిడి చేసిన సాహసాల గురించి చెప్తారు. హ హ కోతి కొమ్మచ్చి అని చెపుతూనే నేను ఏ భాగం లో ఏమేం రాశారో విడదీయడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే టూకీగా ఇదే అయినా రమణ గారు ఇలా ఓ క్రమ పద్దతిలో రాయరు అక్కడక్కడా కొమ్మలు పట్టుకుని ఎక్కడికో వెళ్ళి మళ్ళీ "మర్కట శ్రేష్టా కోతికొమ్మచ్చి వలదు.." అని తనని తనే అదిలించుకుని కథ కొనసాగిస్తూ క్రమపద్దతిలోనే రాసినట్లు భ్రమింపచేస్తారు.

నాకు ఎందుకో మొదటి భాగం కంటే ఇందులో బాపు బొమ్మలు కాస్త తక్కువే ఉన్నాయనిపించింది. ఎక్కువభాగం సినిమా విశేషాలు ఆక్రమించుకోవడంతో సినిమా ఫోటోలు, వాటి పబ్లిసిటీ కోసం గీసిన బొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. అయినా ఉన్న కొద్ది బుల్లి కార్టూన్లలో బాపుమార్క్ గీతలు ఉల్లిపాయ పకోడీలు నముల్తుంటే మధ్య మధ్య కరకర లాడుతూ వేగిన కరివేపాకులా కమ్మగా రుచిగా తగుల్తూనే ఉంటాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఈ టపాలో పెడుతున్నాను. బియ్యం బస్తా లంచం అడిగిన సెన్సార్ ఆఫీసరు గురించి చెప్తూ "పాపం అడగడం కూడా చాతకాని ఆఫీసరు.." అని రమణ జాలి పడుతుంటే పక్కన బాపు గారు పరిగెడుతున్న కత్తెర నెత్తిమీద ఓ బియ్యం గింజలాటి బస్తా వేసి ఆ కత్తెరకు దొంగకోళ్ళ చూపు పెట్టి మనల్ని ఫక్కున నవ్వించేస్తారు. బుద్ధిమంతుడు సినిమాలోని అన్నదమ్ముల మధ్య వైవిధ్యాన్ని విడమరిచి చెప్పడానికి రమణ ప్రయత్నిస్తుంటే పక్కనే ఓ అద్భుతమైన బుల్లి బొమ్మ గీసి ఇదీ విషయం అని బాపుగారు ఒక్క గీతతో మనకు సర్వం బోధపడేలా చెప్పేస్తారు. అంతెందుకు ఒక్కమాటలో చెప్పాలి అంటే ఈ పుస్తకాలకు బాపు గారి గీతలు, బంగారు నగలకు పొదిగిన వజ్రపు తునకలు.

"ఆ! సాధించిన నాలుగు విజయాల గురించి, కల్పించి రాసే కష్టాల గురించీ తప్ప ఆత్మకథల్లో ఏముంటుంది లే.." అని కొట్టిపారేయడానికి వీలులేని పుస్తకం ఇది. తినడానికి తిండి లేకపోయినా ఆత్మ గౌరవానికి విలువిచ్చి తృణ ప్రాయంగా ఉద్యోగాలకు రాజీనామా లివ్వడం చూస్తుంటే ఇంత ఆత్మ స్థైర్యం ఈతని సొంతం ఎలా అయింది అని అశ్చర్యమేస్తుంది. కష్టాలను ఓర్పుగా ఎలా ఎదుర్కోవాలో తెలియచెప్పే బ్రతుకు పాఠాలను చెప్పినట్లు తెలియకుండానే మనకి కూడా నేర్పించేస్తారు. "బాకీ కాస్త అటు ఇటుగా ఎలాగైనా తీర్చేసుకోవచ్చు కానీ ఋణం తీర్చుకోలేం.." అంటూ జీవితంలో మేలు చేసిన వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్పిస్తారు. "నువ్వు సినిమాకి పనికొస్తావు, సినిమాకే పనికి వస్తావు.. చచ్చినట్టు పనికి రా పైకిరా.." అంటూ తనను తిట్లుచ్చుక్కొట్టి సవరదీసి సినిమారంగంలో పడేసిన డిబియన్ గారి గురించి చెప్తూ అప్పట్లో ప్రతిభను ఎలా గుర్తించేవారో ఇప్పటికీ ఆ అవసరం ఎంత ఉందో స్పష్టంగా తెలియచేస్తారు. తను గడువుకన్నా ముందుగానే రాసిపెట్టినా డబ్బులు ఇవ్వక ఏడిపించిన తీతగాడి(దర్శక నిర్మాత) గురించీ రాశారు, తను నిర్మాతగా మారి అప్పటి పారితోషికంకన్నా ఎక్కువ ఇచ్చినా పాటరాసి ఇవ్వక ఏడిపించిన పాటగాడి గురించీ రాశారు. తను అఙ్ఞానంతో చేసిన పొరపాట్లను ఆనాటి పెద్దలు క్షమాస్త్రంతో ఎలా ఎదుర్కొన్నారో చెప్తూ వారు ఎందుకు అంత పెద్దలయ్యారో వివరించేస్తారు. "కూరల కావిడి గాళ్ళకి ఉన్నపాటి కిమ్మత్తు కవిగాళ్లకి లేదోయ్" అని అంటూ విప్లవం వర్ధిల్లాలి అని తను తిరగబడిన వైనం వివరించి యువతలోధైర్యాన్ని నింపుతారు.

పాఠకులని టైంమెషీన్ లోఎక్కించి 1960 లలోకి అవలీలగా తీసుకు వెళ్తారు, తన చమత్కార దృష్టితో అప్పటిలోకాన్ని చూపిస్తారు, 85 రూపాయల విమాన టిక్కెట్టుగురించీ, అప్పటి రైలులో మొదటి తరగతి కూపేలలోని సౌకర్యాల గురించీ, 45 రూపాయల టిక్కెట్టు ఉండే హిందూ వార్తాపత్రికల డకోటా ఏరో ప్లేన్ ప్రయాణ విశేషాలను వివరిస్తారు. అప్పట్లో పేముకుర్చీలు ఒక్కోటి 27 రూ.లు ఇప్పుడు పన్నెండు వందలట అని ఆశ్చర్యపడి లేస్తారు :-) ఆశ్చర్య’పడి’ లేచి, ఉలికి’పడి’ లేచి, పొరపాటుమాటకు బదులుగా ’పొరమాట’, సెన్సార్ పెద్దల వరుస వివరిస్తూ ’సెన్సా-రింగ్ సర్కస్’ లాటి పద ప్రయోగాలకు ఈ పుస్తకం లోనూ కొదవ లేదు. అలా అని ఇదంతా ఏదో 1960 ల నాటి గోల అనుకోడానికివీలులేదు మధ్య మధ్యలో అలవోకగా "యాంకర్ స్వప్నగారన్నట్లు "చౌ.వండీ.. చౌ.తూనే ఉండండీ.."" ఆని అంటూ సున్నితంగా నేటి యాంకరమ్మలకు ఓ చురక అంటించేస్తారు. అలానే సెన్సారు వాళ్ళకి దొరకకుండా ద్వంద్వార్ధాలతో రాసే మహాశిల్పులుంటారు అనిచెప్తూ  "ఆరేసుకోబోయింది ఏంటో పారేసుకుంది ఏంటో", "అబ్బనీ తీయని దెబ్బ" ఏంటో అంటూ వేటూరిమహాశిల్పిగారికి తనువారవందనాలు అని ప్రైవేటు చెప్పేస్తారు. 

అంతేనా తను ఫారిన్ సరుకు తప్ప ముట్టుకోను అన్న మందుబాబుకు ఫారిన్ సీసాలో నాటు సరుకు పోసి ఇచ్చి చేసిన అల్లరులు నెమరేసుకుంటారు. సావిత్రి గారి వీణను విమానంలో తీసుకురానిచ్చారని విన్న సూర్యకాంతమ్మ "అయ్యో తెలిస్తే నా రుబ్బురోలు కూడా తెచ్చుకుందును కదమ్మా" అంటే ఉరిమిచూసిన సావిత్రిగారితో "తేడా ఏముందమ్మా వీణ సరస్వతీ, రోలు అన్నపూర్ణ, ఇద్దరూ దేవతలే" అంటూ చేసిన చమత్కారాన్ని గుర్తు చేసుకుంటారు. ఇంకా అలనాటి జ్యోతి పత్రికతో తము చేసిన ప్రయోగాలు గురించి వివరిస్తారు ఆనాటి పత్రికనుండి ఇచ్చిన క్లిప్పింగ్స్ పాఠకులకు ప్రత్యేక బోనస్.. "తెలుగువాళ్ళను తిట్తిపోసి అరవవాళ్ళను, బెంగాలీవాళ్ళను మెచ్చుకునేవాడు తెలుగువాడు.." అంటూ ఆనాటి టెల్గువాడు చెప్పిన తెలుగోపనిషత్ తో తెలుగువాడిపై చురకలు. ఫన్‍చాంగం, "దురాలోచనకి దూరాలోచనకి తేడా దీర్ఘమైనది" అంటూ చెప్పే చతురోక్తులు, శ్రీశ్రీగారి పంచపదులు అన్నీ అప్పటి ప్రింట్లో చదవడం ఆసక్తిదాయకం. మచ్చుకు ఒక శ్రీశ్రీ పంచపది.

"అరిచే కుక్కలు కరవవు
కరిచే కుక్కలు మొరగవు
కరవక మొరిగే కుక్కలు తరమవు
అరవక కరిచే కుక్కలు మరలవు
అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు."

అదండీ మరి విషయం ఇంకా నే స్పృశించని అంశాలు చాలా ఉన్నాయి నేను మచ్చుకు ఓ నాలుగైదు చెప్తేనే టపా చాంతాడంత అయింది. వెంటనే మీరు కొని చదివేసేయండి. ఈ పుస్తకం ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశ పరచదు. ఈ పుస్తకం "కొనడం మీవంతు ఆకట్టుకొనడం మావంతు" అనే నినాదంతో ముందుకు సాగుతున్న హాసం వారి ప్రచురణ. ఇది అన్ని విశాలాంధ్ర పుస్తకాలయాలలోను దొరుకుతుంది వెల 150.


అన్నట్లు కోతికొమ్మచ్చి పేరు బాగుంది, (ఇం)కోతి కొమ్మచ్చి ఇంకాబాగుంది మరి మూడో భాగానికి ఏం పేరు పెడతారో!? అని ఆలోచిస్తున్నారా ఆసందేహాన్ని కూడా నివృత్తి చేశారు అది ’ము-క్కోతికొమ్మచ్చి!!’ట దానికి బాపుగారు గీసిన బొమ్మ ఇక్కడ చూడండి, ఈ బొమ్మ చూసి నవ్వని వారికి ఒక చక్కలిగింత ఫ్రీ :-)

19 వ్యాఖ్యలు:

 1. చక్కని రచనలని ఇంకాస్త బాగా ప్రజంట్ చేసి మరింక్కాస్త చదవాలన్న ఆత్రుత పెంచారు వేణు. కొన్ని కొన్ని బాగా ఉటంకించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. దివిటీ.. అంటూనే అందమైన సూర్యోదయాన్నే చూపించేసారుగా...బావుందండీ బాగా రాసారు....
  నేనింకా కొనుక్కోలేదు..:(

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగా రాసారు. అవును. అన్నీ ఎందుకు చదవడం ? నాణ్యతకూ, మన్నికకూ (హృదయాహ్లాదాన్ని కలిగించడంలో, మనసు పొరల్లో మధురంగా మిగిలిపోగలగడంలో) పేరెన్నిక గన్న పుసతకాలు చదివితే సరి ! ఇంకోతికొమ్మచ్చి కూడా కొనుక్కునేసేయాలి !! బాగా ఊరించేసారు. ఈ వ్యాసం చదివితే, నేను ఏదో మిస్స్ అయిపోయాను అన్న అనుభూతి కలిగింది. దురదృష్టవశాత్తూ, జీవితంలో నా సాహిత్యోపాసన (Reading!!) ఎటూ కదలక, అటకెక్కి కూచుంది. దాన్ని ఒక దోవకి తెచ్చుకునే వేళ ఎప్పటికో ?!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వేణు గారు...ఆసక్తి కలిగేలా చక్కగా రాసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాలా చక్కగా ప్రెజెంట్ చేసారు..బాగుందండి!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నేను మొదటి భాగం చదవలేదు, అందుకే కంప్యూటర్ కట్టేశా, కానీ కోతి బుర్రకి క్యూరియాసిటీ ఎక్కువ కదా.....చివరిన బొమ్మ చూసి కంటే మీరన్న "ఈ బొమ్మ చూసి నవ్వని వారికి ఒక చక్కలిగింత ఫ్రీ :-)"
  చూసి ఎక్కువ నవొచ్చింది ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఏమిటీ? అప్పుడే చదవడం కూడా అయిపోయిందా?నేనింకా మొదలే పెట్టలేదు. ఈ రోజుతో "పాకుడు రాళ్ళు"! అయిపోతుంది. కాబట్టి రేపు శ్రీకారం చుడతాను!మీ టపా చదివాక ఇవాళ రాత్రికే మొదలెడితే ఎలా వుంటుందని ఆలోచన కూడా వస్తోంది.

  అదీ కాక ఇది ఏకబిగిన ఒక చోట కూచుని చదివే పుస్తకం కాదు! రోజూ కొంచెం కొంచెం ఊరించుకుంటూ చదవాలి.

  చదివేస్తా చదివేస్తా!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చదివినదే ఐనా , మీ పరిచయం చాలా బాగుంది .బాగా రాసారు .
  happy new year

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఉష గారు, తృష్ణ గారు నెనర్లు.

  Sujata గారు నెనర్లు, హ హ "నాణ్యతకూ మన్నికకూ" నాకేదో వాణిజ్య ప్రకటన గుర్తొస్తుంది. మరి వెంటనే కొనేసి చదివేయండి.

  శేఖర్ గారు, పద్మార్పిత గారు, సునీత గారు, నేను గారు నెనర్లు.

  సుజాత గారు నెనర్లు. పొయిన సోమవారం గుంటూరులో కొని ఆ రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో బస్ లోనే ఓ 80 పేజీలు చదివేశానండీ ఇక్కడికి వచ్చాక ఉదయం అఫీసుకి లేటైనా పట్టించుకోకుండా ఓ 60 పేజీలు, సాయంత్రం ఇంటికి రావడంతోనే మిగిలిన 60 పేజీలు అవగొట్టేశాను. టపా రాయడానికే నాల్రోజులు సమయం పట్టింది. మీరు అలా చదువుతారా.. నేను మొత్తం ఒకసారి చదివేసి అప్పుడప్పుడూ మధ్యలో రివిజన్ చేస్తూ ఆస్వాదిస్తాను :-)

  మాలాకుమార్ గారు, అగా గారు నెనర్లు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. చాలా బాగా పరిచయం చేశారు. మొన్న హైద్రాబాద్ బుక్ ఎక్షిబిషన్ లో కొనుక్కొచ్చుకున్నాను. కాని, ఏం లాభం. ఇంకా మొదలు పెట్టందే. మెల్లిగా చదవాలి. బాపు,రమణ నాకు చాలా ఇష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నేనూ నిన్ననే చదవడం పూర్తి చేసానండీ... కాని ఒక్కసారి గబగబా చదివేసి, మళ్ళీ రెండోసారి నెమ్మదిగా చదవడం నా అలవాటు. ఈ పుస్తకం ఎన్నిసార్లైనా చదవచ్చనుకోండి.. మీరు బాగా చెప్పారు పుస్తకం గురించి..

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నిన్ననే కొన్నానండీ.. చదవాలి.. మీరు చదివిన పుస్తకాల జాబితా చూస్తె 'గంగిగోవు పాలు..' పద్యం గుర్తొచ్చింది.. ఆ ప్రకారం ముందుకు సాగిపొండి మరి..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. జయ గారు నెనర్లు. బాపు రమణలను ఇష్టపడని తెలుగు వారు అరుదుగా కనిపిస్తారేమోనండీ. మరెందుకాలశ్యం వెంటనే చదివేయండి.

  శ్రీలలిత గారు నెనర్లు. నేను కూడా కొన్ని పుస్తకాలు అలాగే చదువుతానండీ... ఒకసారి స్పీడ్ గా ముగించి మళ్ళీ మళ్ళీ రివ్యూ చేస్తుంటాను.

  మురళి గారు నెనర్లు. హ హ గంగి గోవు పాలు.. బాగా చెప్పారు కాని ఆపాలను వేరు చేసిచ్చిన గొప్పతనం అంతా మంచి పుస్తకాల రివ్యూలు రాసి చదవమని ప్రోత్సహించే మీలాటి పుస్తక ప్రియులకు ఇంకా కొందరు నా ఆన్ లైన్ స్నేహితులకు చెందాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మీ తెలుగు పుస్తక ప్రేమని అబినందిస్తున్నాను ,మీ బ్లాగులని ఆస్వాదిస్తున్నాను . నేను బుడుగు , నా పేరు చాల పొడుగు చదివాను కానీ ఈ కోతి కొమ్మచి అడలేదండి . నాలో నిద్రపోతున్నతెలుగు సాహితి పిపాసిని నిద్ర లెపినందుకు శతకోటి బ్లాగుస్కారాలు . ఎవరో మహానుభావుడు చెప్పినట్లు సంగీతం ,సాహిత్యం ఆస్వాదించలేనివారి కి అదియే శిక్ష వేరొక శిక్ష ఏల
  కొస మెరుపుగా కన్యశుల్కం ఎన్ని సార్లు చదివారు ఎమిషి ?

  ప్రత్యుత్తరంతొలగించు
 15. శిరీష గారు నెనర్లు, "ఆ శిక్ష చాలదేమిటి" మరే మరే చాలా బాగా చెప్పారు. నేను కన్యాశుల్కం ఒక్కసారి కూడా చదవలేదండీ. ఈ పోస్ట్ లో చెప్పినట్లుగా నేను చదివిన పుస్తకాలు తక్కువే. కానీ కన్యాశుల్కం సినిమా ఒక పది సార్లు చూసుంటాను :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. వేణు గారు, చాల బాగా రాసారండీ.నేను కోతి కొమ్మచ్చి కోసమే స్వాతిని కొనే దానిని.తెలుగు ఇంత వయ్యరాలు పొతుందా అని వీరిది చదివాక అనిపించింది.రమణ గారు వాడిన నుడికారాలు,పదప్రయోగాలు వారికే ప్రత్యేకం అనిపించారు.
  హాసం వారు కోతి కొమ్మచ్చిని పుస్తకం గా ప్రచురించారని తెలుసు. కాని నేను ఇంకా కొనలేదు :(
  టపా చాలా బాగుంది.

  అభినందనలు...

  ప్రత్యుత్తరంతొలగించు
 17. ధన్యవాదాలు స్నిగ్ధ గారు, నిజమే రమణ గారి శైలి గురించి చక్కగా చెప్పారు. వీరివి రెండు పుస్తకాలు వచ్చాయండీ బహుశా మూడోది కూడా త్వరలో వస్తుందేమో.

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.