మంగళవారం, జనవరి 19, 2010

స్పాములూ - స్కాములూ (Spam & Scam)

ఈ టపా ఎవర్నీ వేలెత్తి చూపడానికి ఉద్దేశించినది కాదు. కేవలం విషయం అందరికి తెలియచేయటానికి మాత్రమే ఉద్దేశించి రాయడమైనది. దయచేసి మీ వ్యాఖ్యలలో సైతం వ్యక్తుల పేర్లను ఉదహరించకండి.

జాల ప్రపంచంలో మీ ఈమెయిల్ ఐడి, ఇంటి అడ్రస్, బ్యాంక్ అక్కౌంట్ నంబర్ లాటి వివరాలు బయల్పరిచే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా ఈమెయిల్ కన్నా మిగిలిన రెండిటి విషయం లోనూ మరింత జాగ్రత్త అవసరం ఈమెయిల్ ఐడిది ఏముంది అనుకుంటాం, కానీ మీ ఈ మెయిల్ ను మీరు సమర్ధవంతంగా వినియోగించుకోగలుగుతున్నపుడు మాత్రమే అది నిజం. ఈ మెయిల్ ద్వారా జరిగే రక రకాల మోసాల గురించి అవగాహన లేని వారు మీ ఈమెయిల్ సైతం జాగ్రత్తగా కేవలం నమ్మదగిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వటం మంచిది. ముందుగా ఆయా వ్యక్తుల అనుమతి తీసుకోకుండా ఒక పెద్ద గ్రూప్ ఈమెయిల్ అందరి ఈమెయిల్ ఐడి లను బయల్పరుస్తూ పంపించడం ప్రోత్సాహకరమైన విషయం కాదు. కావాలనో, ఒక మంచి ఉద్దేశ్యం తోనో, అవగాహనా రాహిత్యం వల్లనో పంపించే ఇటువంటి మెయిల్స్ తరువాత సమస్యగా మిగులుతాయి. విలువైన వ్యక్తుల సమయాన్ని హరించడమే కాక మెయిల్ సర్వర్ల పై అధిక లోడ్ తద్వారా బోలెడు ఎనర్జీ వేస్ట్. 

ఉదాహరణకు మీరు మీ అడ్రస్ బుక్ లోఉన్న అందరికీ ఒక ఈ మెయిల్ పంపిద్దాము అనుకున్నపుడు ’బిసిసి(Bcc)’ ఉపయోగించడం ఉత్తమమైన పద్దతి. దీనివలన మిగిలినవారికి ఎవరెవరికి మెయిల్ పంపబడినదో తెలిసే అవకాశం లేదు అలానే ఇతరుల ఐడి లు ఎవరికి కనిపించనందున స్పామ్ ను నివారించవచ్చు. ముందుగా అందరికీ బిసిసిలో ఈమెయిల్ పంపించి ఫలానా డిస్కషన్ మొదలు పెడదాము అనుకుంటున్నాను మీకు పాల్గొనడం ఇష్టమైతే జవాబివ్వండి అని అడిగి స్పందించిన వారి ఐడి లను బయల్పరుస్తూ అప్పుడు 'To' లో పొందుపరిచి మెయిల్ ఇవ్వడం చాలా మంచి అలవాటు.

అలానే కొందరు ఫార్వర్డ్ చేసే ఈ మెయిల్స్ సైతం వందల సంఖ్యలో ఈమెయిల్ ఐడిలు ఉన్న మెయిల్ ను మరో వందమందికి ఆ ఐడిలతో సహా పంపిస్తారు. ఇది కూడా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది మీదే కాక అందరి ఈమెయిల్స్ జాలం లో బయటపడటం వలన స్పామరులకు స్కామరులకు మరింత ఆస్కారమిచ్చినట్లు అవుతుంది. కనుక ఇటువంటి మెయిల్స్ ఫార్వర్డ్ చేసేప్పుడు సైతం Bcc ఉపయోగించండి అలానే మెయిల్ లో ఇదివరకే ఈమెయిల్ ఐడి లు ఉన్న విషయం మీరు గమనిస్తే వాటిని డిలీట్ చేసి పంపించండి. ఇలా అత్యల్ప సమయాన్ని కేటాయించి బాధ్యతాయుతమైన ఈమెయిల్ వినియోగదారులవండి.

సరే ఈ విషయాలు తెలియక పొరపాటున మీ ఐడిని మీకు ఇష్టం లేని ఒక డిస్కషన్ త్రెడ్ లో మీ అనుమతి లేకుండా కలిపారనుకుందాం. డిస్కషన్ టాపిక్ తో వచ్చే మెయిల్స్ రెండు ఉంటే "Please remove my id from this discussion" అంటూ గ్రూప్ అందరికీ పంపించే మెయిల్స్ ఒక ఇరవై వస్తుంటాయ్. ఇటువంటి మెయిల్స్ స్పామింగ్ కు ముఖ్య కారణం. మీకు ఇటువంటి మెయిల్స్ వచ్చినపుడు ఉత్తమమైన పని జవాబివ్వకుండా వదిలేయడం. లేదంటే "reply all" or "అందరికి సమాధానమివ్వు" ఆప్షన్ ఉపయోగించక కేవలం ఎవరైతే మీకు మొదట ఈమెయిల్ పంపారో వారికి మాత్రమే జవాబివ్వడం ఉత్తమమైన పద్దతి. మీకు ఓపిక ఉంటే ఇలాంటి మెయిల్స్ ని మీ మెయిల్ సెట్టింగ్స్ లో ఫిల్టర్ ఆప్షన్ ఉపయోగించి పూర్తిగా నివారించవచ్చు. GMAIL లో నేను ఫిల్టర్ ఉపయోగించి విజయవంతంగా ఇటువంటి మెయిల్స్ ను నిరోధించగలిగాను. మీరు చేయవలసిందల్లా ఆ మెయిల్ యొక్క సబ్జెక్ట్ లైన్ ను కాపీ చేసి ఈ సబ్జెక్ట్ తో ఉన్న మెయిల్స్ ను తొలగించు అని ఫిల్టర్ క్రియేట్ చేయడమే. ప్రతి మెయిల్ సిస్టం ఈ ఆప్షన్ ను ఇస్తుందనే అనుకుంటున్నాను.

అసలు ఈ మెయిల్ ఐడి బయట పెట్టడం గురించి ఇంత టపా అవసరమా అనుకుంటున్నారా అయితే మీ ఈమెయిల్ ఐడి తెలుసుకుని అంచెలంచెలుగా మీ నెట్ బ్యాంకింగ్ ఐడి లను, బ్యాంక్ అకౌంట్ వివరాలను సైబర్ నేరస్తులు ఎలా సంగ్రహిస్తారో తద్వారా మీ డబ్బు ఎలా దోచుకుంటారో సవివరంగా వివరిస్తూ మంచు పల్లకీ గారు ఈ మధ్యే "నైజీరియా టు శ్రీకాకుళం" అంటూ ఒక టపా రాసారు అది ఒక సారి చూడండి. జాల ప్రపంచంలో మీ వ్యక్తిగత వివరాలను కాపాడుకోవలసిన ఆవశ్యకతను ఆ టపా మరింత వివరిస్తుంది.



Photos courtesy www.solarpowerrocks.com, http://sayiamgreen.com/

12 కామెంట్‌లు:

  1. నాకు తెలియని మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  2. మంచి విషయం చెప్పారు. నాకు మమ వాడితే మిగిలిన వారికి తెలియదన్న విషయం ఇప్పుడే తెలిసింది. ఈఆప్షన్ కోసం ఇదివరలో తెగ వెతుకులాడా.

    రిప్లయితొలగించండి
  3. Good info Venu.. గ్రూప్ ఈమెయిల్స్ పంపేప్పుడు కాస్త కామన్ కర్టెసీని పాటిస్తే మిగతా వారి ప్రైవసీకి కూడా మనం విలువ ఇచ్చినట్లు ఉంటుంది :-)

    రిప్లయితొలగించండి
  4. నిషిగంధ,
    మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఇంత మంచి మాట చెప్పినందుకు!

    రిప్లయితొలగించండి
  5. ఈ మధ్య మన బ్లాగర్లలో వచ్చిన గ్రూపు ఈమెయిల్స్ కి విసుగేసి నేనే ఓ టపా వ్రాదామనుకున్నాను - మీరే వ్రాసేసారు. సంతోషం.

    రిప్లయితొలగించండి
  6. రాజశేఖరుని విజయ్ శర్మ గారు నెనర్లు.

    సత్య సాయి కొవ్వలి గారు నెనర్లు.

    నిషిగంధ గారు నెనర్లు. చాలా మంచి వాక్యం :-) కలిపినందుకు ధన్యవాదాలు.

    సుజాత గారు నెనర్లు.

    శరత్ గారు నెనర్లు. మీ శైలిలో మీరూ ఒకటి రాసేయండి, మరికొంతమంది తెలుసుకుంటారు.

    తెలంగాణ నాయుడు గారు నెనర్లు. మేము ప్రకాష్ నగర్ లో స్టేషన్ దగ్గర ఉన్న స్వామి కాన్వెంట్ పక్కన ఉండే వాళ్ళం. ఇపుడు గుంటూరులో సెటిల్ అయ్యాం.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. ఎంటా అనుకుంటున్నా ..ఇదా విషయం.. ఇప్పుడే ఈ పొస్టు చూస్తున్నా.. థాంక్సండి వేణుగారు..

    రిప్లయితొలగించండి
  9. అందరికీ ఉపయోగపడే మంచి విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలండీ !

    రిప్లయితొలగించండి
  10. మొన్నామధ్యే గ్రూప్ మెయిల్స్ ఫార్వర్డ్ చేసే మిత్రులకి మెయిల్ ఐడీలు తొలగించమని చెప్పానండీ.. ఇంత కథ ఉందని తెలీదు.. నాలుగైదు మెయిల్ ఐడీ లు మైంటైన్ చేస్తే మంచిదని నా అనుభవం..

    రిప్లయితొలగించండి
  11. మంచుపల్లకి గారు నెనర్లు, మీకే థాంక్స్ చెప్పాలండీ అంత వివరంగా టపా రాసినందుకు.

    పరిమళం గారు, మురళి గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.