గురువారం, ఏప్రిల్ 01, 2010

హాస్టల్ - 3 ( చెఱకు తోట )

మా కాలేజ్ బిల్డింగ్ పొడవుగా ఉండేది మొత్తం నాలుగు అంతస్థులు. ఈ పక్కన ఫోటోలో ఉన్నది మాకాలేజే :-)  కింది ఫ్లోర్ లో హాస్టల్ రూంస్ పై ఫ్లోర్స్ లో కొన్ని క్లాస్ రూంస్ మరియూ హైస్కూలు క్లాసులు జరిగేవి వాటికి పైన డాబా మీద ఒకవైపు వరుసగా మా క్లాస్ రూములు వాటికి ముందు బోలెడంత ఖాళీ స్థలమూ ఉండేది. పగలు రూముల్లో క్లాసులు జరిగితే ఉదయం సాయంత్రం ఆ ఆరుబయట డాబా మీద స్టడీ అవర్ జరిగేది. మొదట్లో కిందే కూర్చునే వాళ్ళం డాబా చుట్టూ నాలుగడుగుల ఎత్తు పిట్ట గోడ ఉండేది. పైన ఆర్చిల్లా కనబడుతున్నాయ్ కదా అవి నా ఫస్టియర్ లాస్ట్ లో కట్టారు లేండి. ఒక రోజు రాత్రి స్టడీ అవర్ లో ఎనిమిది గంటల సమయంలో ఆ గోడ వెంబడి కూర్చొని చదువుకుంటూ మధ్యలో ఎందుకో తలఎత్తి అవతలకి పొలాల వైపు చూశాను. దూరంగా ఎకరాలకి ఎకరాలు తగలబడి పోతూ కనిపించాయి ఫారెస్ట్ ఫైర్ అంటారు అలా చేలల్లో కూడా ఏదో పేద్ద అగ్నిప్రమాదం ఏర్పడింది కాబోలు ఇపుడు అది అంతా పాకి చుట్టు పక్కల పొలాలు అన్నీ తగలబడి అలానే మా కాలేజ్ కూడా తగలబడి పోతుందేమో అని సందేహం వచ్చింది. ఎవర్నన్నా అడుగుదామంటే వార్డెన్ తో పాటు ఏఓ ప్రభాకర్ గారు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. ఇపుడు పక్క వాడితో మాట్లాడుతూ దొరికిపోతే మక్కెలిరగతంతారు. అయినా నించుని ఉన్నారు కదా వాళ్ళకు కూడా అవి కనపడుతుంటాయ్ కదా మరి ఎందుకని వాళ్ళేం మాట్లాడటం లేదు అని నాలో నేను అనుకుని ఆ మంటల వైపు ఒక కన్నేసి క్షణానికో మారు పక్కలకి పాకాయేమో గమనిస్తూ కాసేపు గడిపాను. కానీ అశ్చర్యంగా గిరి గీసినట్లు ఒకే చోట ఆగకుండా మండుతున్నాయ్ తప్ప ఎటూ కదలట్లేదు అనిపించింది. కాసేపటికి భయం స్థానాన్ని కుతూహలం ఆక్రమించింది.

ఆ తర్వాత ఎవర్ని దాని గురించి అడిగినా అదో పేద్ద కధ అని చెప్పేవారే కాని అసలు కథేంటో చెప్పేవారు కాదు. చివరికి నే తెలుసుకున్నది ఏమిటంటే... మా కాలేజ్ విజయవాడ దగ్గరలో ఉన్న ఈడ్పుగల్లు లో ఉందని ముందే చెప్పుకున్నాం కదా. అది కూడా ఊరు చివర్లో పొలాల మధ్య లో ఉండేది. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ పుణ్యమా అని మా చుట్టు పక్కల ఆ ఏరియాలో అంతా చెఱకు పంట ఎక్కువగా వేసే వారు.. చెఱకు కోసేసాక దాని చివర ఉండే ఆకులూ, చెత్తా, చెదారం అన్నీ చేనులోనే తగలపెట్టేస్తారుట అదంతా తర్వాత వేసే పంటకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుందట అందుకనే అవన్నీ కావాలని రగిలించిన మంటలు అని అటు ఇటు పాకకుండా తగు జాగ్రత్తలు తీసుకుని తగల బెడతారనీ మనకొచ్చిన ప్రమాదమేమీ లేదని తెలుసుకుని స్థిమిత పడ్డాను. మా కాలెజ్ వెనకాలే గోడకి ఆనుకుని ఒక ఎకరం చేను ఉండేది. సరిగా నేను చేరిన సంవత్సరమే మా కాలేజ్ పక్కన చేనులో చెఱకు పంట వేసుకున్నాడు ఆ రైతు. మా కాలేజ్ మొదలయ్యే సరికి పంట మంచి ఏపుగా ఎదిగి చక్కని చెఱుకులు నోరూరిస్తూ ఉండేవి. ఇక మా కోతి మూక భారిన పడకుండా వాటిని ఏడడుగుల ప్రహరీ గోడ ఏమాత్రం కాపాడ గలదు చెప్పండి. ఆ ప్రహరీకి పైన ఉన్న పదునైన గాజు పెంకులు సైతం ఏమాత్రం ఆపలేకపోయేవి.

అసలు చెఱకు తో నా ప్రణయం ఈనాటిది కాదు మొదటి సారి కోటప్ప కొండ తిరునాళ్ళలో మొదలైంది. ఆరోజు నుండీ ఈ రోజు వరకు ఆ ప్రేమ దిన దిన ప్రవర్ధమానమౌతున్నదే కానీ కొంచెం కూడా తగ్గలేదు. మా ఊరు తిరునాళ్ళకు అప్పట్లో ఎక్కడ నుండి తెప్పించే వారో కానీ చెఱకు గెడలు భలే ఉండేవి. నిలువెత్తు పెరిగి నిలువెల్లా నల్లగా నిగనిగలాడుతూ ఆభరణాల్లా కణుపుల దగ్గర మాత్రం తెల్లగా మెరిసిపోతూ చూడటానికే అధ్బుతంగా ఉండేవి. ఇక వాటిలో ఒక మాంచి గడలు ఒక రెండు మూడు నాన్న ఎన్నుకుని వాడికి చెప్పగానే వాడు పదునైన కొడవలితో వాటిని ముక్కలు కొడుతుంటే.. కొడవలి జారుతుందమ్మా అని నన్నో మూడు అడుగులు దూరంగా నించో బెట్టేవారా అయినా అంతదూరం రసం చిమ్మి ఎగిరి వచ్చి మీద పడేది దానికి తోడు కమ్మని వాసన కూడా చుట్టు ముట్టేది. ఇక ఆ ముక్కలని పొడవాటి ఆకుతో కట్టకట్టించుకుని ఎప్పుడెపుడు ఇంటికి చేరతామా అని ఎదురు చూసే వాడ్ని.

ఇక ఇంటికి వచ్చాక చెత్త వేయడానికి ఎదురుగా ఒక న్యూస్ పేపర్ పరచుకుని, మఠంవేసుకు కూర్చుని. చెఱకు ఒక చివర కచక్ మని కొరికి సర్ర్‍ర్‍ర్ర్ మంటూ చప్పుడొచ్చేలా ఒకేసారి 3-4 కణుపులు మీదుగా ఊడొచ్చేలా చెక్కును లాగేసి. ఆ క్రమంలో దానికి ఎక్కడైనా ఎక్కువ కండ పట్టిందేమో చూసుకుని ఒక వేళ పడితే దాన్ని కూడా నమిలేసి, రసం పీల్చేసి, అలా చెఱకు అంతా ఒలిచాక ఓ చివర ఒక లావుపాటి ముక్కను కొరికి దవడ పళ్ళ మధ్యలో పెట్టి గాట్టిగా ఒక సారి నొక్కగానే... నా సామిరంగా... పళ్లమధ్య నుండి చెఱకురసం దాని కమ్మదనం ఒక్కో చినుకులా రాలి, నదులుగా మారి, వరదలై పొంగి ప్రవాహమై నాలుకపై టేస్ట్ బడ్స్ ని నిలువెల్లా ముంచెత్తుతుంటే... ఆహా... ఆ ఆనందం అనుభవించాలే కానీ మాటలలో చెప్పతరమా...

మరి అలాంటి చెఱుకులు ఏపుగా పెరిగి తాజాగా ఉన్న తోటలో నుండి తెంపుకు వచ్చి తినడం అంటే ఏఓ లు వార్డేన్ల మీద ఉన్న భయం ఏమాత్రం ఆపగలదు చెప్పండి. మేము కాలేజి లో చేరిన నెల లోపే ఒక ఉదయం 8 గంటల ప్రాంతంలో బిల్డింగ్ బయట ముఖద్వారం దగ్గర మా ఏఓ ప్రభాకర్ గారు నిలబడి తన గంభీరమైన కంఠస్వరం తో "రేయ్.. అందరూ బయటకి రండ్రా.." అని ఒక్క అరుపు అరిచారు. అంతే దెబ్బకి మంట పెడితే కలుగుల్లోనుండి బయటపడ్డ ఎలుకల్లా భయం భయం గా బిల బిల మంటూ అందరం బయటకి అసెంబ్లీ ఏరియాకి వచ్చి నిలుచున్నాం. ప్రభాకర్ గారు స్టాఫ్ కొందరు వార్డెన్లూ మరి కొందరు కొత్త వ్యక్తులు లోపలకి మా రూముల వైపుకి వెళ్ళారు. అందరం ఏమై ఉంటుందా అని గుస గుసలాడుకోవడం మొదలెట్టాం.. ఇంతలో మా బిబిసి గాడు మోసుకొచ్చిన వార్త ఏంటంటే "పక్కన చెఱుకు తోట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాడుటరా మనవాళ్ళు రాత్రి గోడదూకి తోటలో నానా వీరంగం వేశారుట" అని.

కాసేపటికి లోపలికి వెళ్ళిన మా స్టాఫ్ కొన్ని బక్కెట్లు రూం బయట పెట్టారు ఆ రూముల వాళ్ళని లోపలిక్ పిలిచారు. ఏమిటా ఆ బక్కేట్ల ప్రత్యేకత అని చూస్తే రాత్రి గోడదూకి చెఱుకులు కోసుకొచ్చిన బ్యాచ్ చక్కగా తినేసి ఆ పిప్పి ఎక్కడ పడేయాలో అర్ధంకాకో బద్దకించో చక్కగా బక్కేట్ల నిండుగా నింపి ఎవడు చూడొచ్చారు లే అన్నట్లు వాళ్ళ  మంచాల కిందే దాచేశారు :-) అలా దొరికి పోయారనమాట. పాపం ఆ తోటతను సార్ వీళ్ళు తినేది రెండు పాడు చేసేది బోల్డు విత్తనం కోసం వేసిన పంటంతా తొక్కి ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు మాకు బోల్డు నష్టం వస్తుంది అని గోల. ప్రభాకర్ గారు ఏదో సర్ది చెప్పి పంపేశారు. ఇంకోసారి ఇలా చేస్తే తాటతీస్తాను అని చెప్పి మాకందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మా వాళ్ళంతా బుద్దిగా ఉన్నారు అని మీరు భ్రమ పడుతున్నారా :-) కాస్త బద్దకం మాత్రం వదిలించుకున్నారు. ఎలా అంటే శుబ్రంగా తినేసి మా బిల్డింగ్ కి కాస్త దూరంగా ఆ పిప్పి అంతా తిరిగి వాళ్ల తోటలోనే పారవేయడం మొదలెట్టారనమాట :-) పాపం ఆ రైతు ఒకటి రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చి విసుగొచ్చి ఇక మానుకున్నాడు.

మా వాళ్ళు కూడా మెల్లగా చెఱుకు తోట మీద దాడి తగ్గించారులెండి తర్వాత తర్వాత. ఎందుకనో అంటారా.. చిన్న పిల్లల్లా ఇంకా తీయని చెఱుకు లు ఏం తింటాం ప్రస్తుతం మనం కుర్రాళ్ళం కదా మాంచి కారం కారంగా ఏదైనా తినాలి అని పరోఠాల వెంట పడ్డారు లెండి అందుకు. ఆ పరోఠాల కథ కమామిషు ఏమిటో త్వరలో తరువాయి భాగంలో చెప్తాను, అంతవరకూ శలవ్ :-)

12 కామెంట్‌లు:

 1. పళ్లమధ్య నుండి చెఱకురసం దాని కమ్మదనం ఒక్కో చినుకులా రాలి, నదులుగా మారి, వరదలై పొంగి ప్రవాహమై నాలుకపై టేస్ట్ బడ్స్ ని నిలువెల్లా ముంచెత్తుతుంటే... ఆహా... ఆ ఆనందం అనుభవించాలే కానీ మాటలలో చెప్పతరమా...

  :-)))))

  రిప్లయితొలగించండి
 2. హ హ నేను గారు నెనర్లు :-) అసలా రుచి గురించి నే చాలా తక్కువ చెప్పానండీ :-)

  శంకర్ గారు నెనర్లు :-)

  రిప్లయితొలగించండి
 3. పరాఠా కధ కోస౦ ఎదురుచూస్తూ.........

  రిప్లయితొలగించండి
 4. మా ఊరి మీంచి చెల్లూరు చెరకు ఫ్యాక్టరీకి బోలెడు ట్రాక్టర్లు,లారీలు వెళ్తూ వుండేవి.సైకిల్ తొక్కడానికి బద్దకం అనిపించినప్పుడు చెరకు ట్రాక్టర్లోని రెండు గెడలను పట్టుకుంటే అదే లాక్కుపోయేది.పెద్దోళ్ళేమో అలా వద్దు అని ఎంత మొత్తుకున్నా వినేవాళ్ళం కాదు.అలాగే వెళుతున్న ట్రాక్టర్లోంచి గెడలను లాగేవాళ్ళం తినడానికి.అలా లాగడంలో ఆ ట్రాక్టర్ టైర్ కిందే పడి ఒక అబ్బాయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.అప్పట్నించీ భయం తో మానేసాము.కొన్నాళ్ళు మాపొలం లో కూడా చెరకు పండించారు.జెడలేసిన చెరకుతోట చూడడానికి భలే వుంటుంది.
  మొన్న ఉగాది రోజున పెద్ద పెద్ద గెడలు పట్టుకొచ్చి స్టేజ్ ని అలంకరించారు.సెలబ్రేషన్స్ అయిపోయాకా వాటిని ఎలా తినాలని ఆలోచిస్తున్నవాళ్ళు, పళ్ళతో చెక్కు లాగి తింటున్న నన్ను చూసి నోరెళ్ళబెట్టారు :)

  రిప్లయితొలగించండి
 5. బాగుంది! ఈ చెరుకుతోటల్లో పాములు ఎక్కువ అని విన్నాను నిజమేనంటారా ?

  రిప్లయితొలగించండి
 6. చెరుకు గెడ తినడంలో నేనూ అచ్చం మీలాగే.. చాకుల కోసం వెతుక్కునే జనాలంతా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు.. ఇంతకీ పరాఠాల కథ ఎప్పుడండీ??

  రిప్లయితొలగించండి
 7. కవితలొచ్చేస్తున్నాయే చెరుకు రసం తలచుకుంటే. :-) ఇలా కంకిపాడు చెరుకు తోటలను హఠం హఠం చేసేరన్నమాట. హన్నా.
  అవును చెరుకు గడ ను చాకు లతో కూడా తీసి తింటారా మురళి, రాధికా??????????

  రిప్లయితొలగించండి
 8. venuram గారు నెనర్లు

  సుభద్ర గారు నెనర్లు :-)

  రాధిక గారు నెనర్లు :-) మీరు చెప్పినట్లు చెఱుకు బళ్ళ ఆసరా తీసుకుని వెళ్ళే సైకిళ్ళను నేనూ చూసానండీ. చాలా భయపడేవాడ్ని. హ హ కదా చెఱుకు అసలు అలా తింటేనే మజా అండీ చాకులతోనో మరోలానో తీసి తింటే తిన్నట్లే ఉండదు కానీ బాగా పండిన చెఱుకు అయితేనే ఇలా తినడం సులువు గా ఉంటుంది.

  శ్రావ్య గారు నెనర్లు :-) ఏమోనండీ మాకెప్పుడు ఇవి అడ్డుపడలేదు. నాకు తెలీదు ఈ విషయం.

  మురళి గారు నెనర్లు :-) మరే అలా తింటేనే మజా అండీ.

  భావన గారు నెనర్లు :-) ఆ రచి మహత్యం అలాంటిదండీ మరి, నేను ఇంజనీరింగ్ చదివేప్పుడు మొదటి సారి ఒక స్నేహితుని ఇంట్లో చెఱుకును ఇలా చాకు తో ఒలిచి ముక్కలు చేసి ఇస్తే నేనూ బోల్డంత ఆశ్చర్యపడిపోయాను.

  రిప్లయితొలగించండి
 9. నమిలిన చెఱుకు పిప్పి తీపిని గుర్తుకు తెచ్చారు.

  చెఱుకు తీపి అనకుండా, నమలిన అంటున్నానంటే, చెఱుకు గెడ పళ్ళతో పీకి తింటూ అలౌకికమైన అనుభూతిని పొందిన గతం అంతలా గుర్తుకు వచ్చింది.

  తిండిపోతుల అనుభూతులు ఇంతేనేమో.

  గెడ తిని ఓ ఇరవై ఏళ్ళు అయ్యిందేమో . ఇప్పుడు దంతాలు కూడా సహకరించవేమో.

  రిప్లయితొలగించండి
 10. బాటసారి గారు నెనర్లు :-) ఆ అనుభూతి అలాంటిదండీ :-)

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.