సోమవారం, నవంబర్ 16, 2009

టీవీ ఛానళ్ళూ - సృజనాత్మక తలలు !

ఏమిటీ చిత్రమైన శిర్షిక అని హాశ్చర్యపడిపోతున్నారా? ఏంలేదండీ creative heads ని ఆంధ్రీకరించాను అంతే. గత ఏడాది బ్లాగులు, వార్తలు, టీవీ కార్యక్రమాలని ఫాలో అయిన వారెవరికీ ’ఈటీవి’ కి పట్టిన చీడ సుమన్ మరియూ క్రియేటివ్‍హెడ్ ప్రభాకర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను (మీ మనోభావాలు ఏమాత్రం దెబ్బతిన్నా ఈ టపా చదవడం ఇంతటితో ఆపేయమని నా సలహా!! ఇహ ముందుకు చదవడం అనవసరం అని నా ఉద్దేశ్యం, ఆపై మీ ఇష్టం). ఆ చానల్ ను ఇంచుమించు నాశనం చేసేయబోయిన ఈ చీడ భారినుండి రామోజీ గారు ఆలశ్యంగానైనా మేలుకుని, కొడుకు అని కూడా చూడకుండా వీళ్ళ ఇద్దరి భారి నుండి జనాన్ని, ఈటీవీ ని ఏకకాలం లో రక్షించేశారు. ఇప్పుడు మాటీవి నీ అదే దారిలో నడిపించనున్నాడా అని అనిపిస్తున్న మరో క్రియేటివ్ హెడ్ ’ఓంకార్’ అని పిలవబడే ఓ వికార్ గురించే ఈ టపా.

"అసలెవరీ ఓంకార్ ఒకప్పుడు 90 లలో టివీ సీరియల్స్ లోనూ కొన్ని సినిమాలలోనూ తన వైవిధ్యమైన గొంతుతో వెటకారపు సంభాషణలతో కనిపించేవాడు అతనేనా?" అని అడుగుతున్నారా.. కానే కాదు. ఇతను మొదట జీతెలుగు చానల్ లో డ్యాన్స్ కాంపిటీషన్ ద్వారా కెరీర్ మొదలు పెట్టాడనుకుంటా ప్రస్తుతం మాటీవీ జీ రెండిటిలోనూ కొన్ని ప్రోగ్రాంస్ చేస్తున్నాడు. ఈ టీవీ అంతరంగాలకు సుమన్ కధ, మాటలు, పాటలు దర్శకత్వం అని పేరేసుకోడంతో మొదలుపెట్టినట్లు ప్రస్తుతం ఇతను కూడా కాన్సెప్ట్, రచన, నిర్మాత, దర్శకత్వం ఇలా నాలుగైదు విభాగాలకు పేరు వేసుకోవడం మొదలు పెట్టాడు. కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఇతనివి సీరియల్స్ కాదు కేవలం టాలెంట్ షోస్ కే పరిమితమైనట్లున్నాడు ప్రస్తుతం. ఇతని ఓవర్ యాక్షన్ చూడాలంటే ప్రఖ్యాత మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి గారు ఇతన్ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఈ కింది వీడియో చూడండి. ఇందులో బ్లాక్ డ్రస్ లో ఏంకరింగ్ చేస్తూ కనిపించే వ్యక్తే ఓంకార్.



ఇతను మొదట్లో జీటీవీ లో ఆట పేరుతో ఒక డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలు పెట్టారు, పిల్లలతో సైతం చిత్రవేషధారణ కుప్పిగంతులు వేయించేవాడు. తర్వాత ఇంకేదో చిత్రమైన పిల్లల ప్రోగ్రాం ఒకటి చేశాడు అందులో కూడా ఎలిమినేషన్ పేరుతో పిల్లల్ని ఏడిపించి నానా యాగీ చేసేవాడు. ఇక ప్రస్తుతం మాటీవీ లో ఛాలెంజ్ పేరుతో ఓ డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తున్నాడు, ఇంత కాలం ఇలాటి ప్రోగ్రాంలో వీళ్ళ వింత వేషధారణ, డ్యాన్స్ పేరుతో చేసే వికృత చేష్టలు, న్యాయనిర్ణేతల ఓవర్ యాక్షన్ మాత్రమే భరించాల్సి వచ్చేది, ఇపుడు ఛాలెంజ్ పేరుతో డ్యాన్సర్లు వాళ్లల్లో వాళ్ళే మరీ చెత్తకుండీల దగ్గర కుక్కల కన్నా ఘోరంగా కొట్టుకుంటున్నారు. పోలిక కాస్త ఘాటుగా ఉన్నా ఒకటి రెండు ఎపిసోడ్స్ చూసిన నాకు అలానే అనిపించింది. అది చాలదన్నట్లు ఈ కొట్లాటనే ప్రోమోస్ గా చూపిస్తుంటే ఏం చేస్తాం.

ఇతని మరో ప్రోగ్రాం మాటివి లో అదృష్టం, అమెరికా లోని డీల్ నో డీల్ ప్రోగ్రాం కి కాసిని మార్పులు చేసి ప్రసారం చేసే ఈ ప్రోగ్రాం లో ఇతని ఓవర్ యాక్షన్ చూసి తీరాల్సిందే.. మొదట్లో కాస్త సెలబ్రిటీస్ ని పిలిస్తే వాళ్ళు ఇతన్ని ఆడుకుని మొత్తం ప్రోగ్రాం ని హాస్యభరితం చేసారు, దానితో ఇలా లాభం లేదు అని పిల్లలను అతని మిగిలిన ప్రోగ్రాంస్ లో పార్టిసిపెంట్స్ ని పిలిచి వాళ్ళతో ఆడుకోడం మొదలు పెట్టాడు. అలా అని ఇతనిమీద అన్నీ కంప్లైంట్స్ లేవు నాకు, ఉదాహరణకి ఛాలెంజ్ పేరుతో వస్తున్న ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ అప్పొనెంట్ కోసం పాట సెలెక్ట్ చేసి ఇవ్వడం. ఇద్దరిమధ్య ఒకే పాటకి పోటీ పెట్టడం లాంటి మంచి ఐడియాలు కూడ ఉన్నాయి. చేతిలో అవకాశం విద్య రెండూ ఉన్నపుడు కాస్త తెలివిగా వ్యవహరించి సక్రమంగా ఉపయోగిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం.

టీవీ అంటే గుర్తొచ్చింది. జూడాలు గురించి విన్నారా... వినే ఉంటారు లెండి ’జూనియర్‍డాక్టర్’ అన్న పదానికి వచ్చిన తిప్పలు ఇవి. నిన్న వార్తలు చూస్తుంటే లైన్ కి మూడు నాలుగు సార్లు జూడాలు అని చదువుతుంటే వినడానికి చాలా అసహనంగా అనిపించింది. కంపోజర్ కన్వీనియన్స్ కోసం అలా జూ.డా లు అని రాసిస్తే దాన్ని యధాతధంగా చదివేస్తున్నాడా లేక టీవీ వాళ్ళు కొత్త పదాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే విషయం అర్ధంకావడం లేదు. వార్తల్లో ఈమధ్య గమనించిన మరో అంశం వార్తలు వేగంగా చదవడం. ప్రయత్న పూర్వకంగా అలా హడావిడిగా చదివేయడం ప్రత్యక్షంగా తెలుస్తూంటే విసుగొస్తుంది. క్వాలిటీ కన్నా క్వాంటిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వచ్చిన తిప్పలు కావచ్చేమో.

27 కామెంట్‌లు:

  1. ఈ సబ్జక్ట్ మీద మీకున్న ఆసక్తికి అబ్బురం కలుగుతోందండీ...good observation !!

    ఎందుకో నాకు ఈ రియాల్టి షోలూ,ఆట, డాన్స్ షోలు,పసి పిల్లలతో సినిమా పాటలకు స్టెప్పులు వేయించే డాన్స్ షోలు అంటే మంట అండీ...somehow i can't appreciate..
    .

    రిప్లయితొలగించండి
  2. ఈ ఓంకార్ జీ తెలుగు కన్నా ముందు జెమిని టీవీ వాళ్లకు ఒక 24 గంటల మ్యూజిక్ చానెల్ ఉండేది (పేరు గుర్తు రావటం లేదు ) అందులో యాంకర్ గా చేసినట్టు నాకు గుర్తు. మరీ "అదృష్టం" లో మాత్రం ఈయన మరీ తన టాలెంట్ చూపిస్తున్నాడు:)

    రిప్లయితొలగించండి
  3. నిజమే వేణుగారు, నేను అప్పుడప్పుడు తెలుగు న్యూస్ ఛానల్స్ చూస్తూ వుంటాను. ఒకప్పుడు శాంతి స్వరూప్ గారు 15 నిముషాలు చెప్పే స్క్రిప్ట్ (గుర్తుండిపోయేలా) ఇప్పుడు 5 నిమిషాలలో అయింది అనిపిస్తున్నారు. న్యూస్ కూడా మారింది అనుకోండి. పేరుకు తెలుగు ఛానల్స్ గా ఉన్నా వాళ్ళది ఏ భాష అనాలో నాకు అర్ధం కాదు.
    రియాల్టీ shows, ఈ anchor గురుంచి నాకు తెలియదు కానీ, parents ఐనా పిల్లల్లా చేత పిచ్చి steps వేయించకుండా వుంటే బావుంటుంది.
    అన్నట్టు ఎప్పటి లానే మీ view చాలా బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  4. అతను ఆ అదృష్టం ప్రోగ్రాం లో ఒకసారి గీతా మాధురితో ప్రవర్తించిన విధానం చూసి ఏవగింపు కలిగి ఆ తర్వాత చూడటం మానేసాను. ఈ జూడాల గురించి నాదో ముక్క, నేను పేపర్లో కానీ,టీ వీలో కానీ అంతగా వార్తలు ఫాలో అవ్వను, మొన్నెప్పుడో ఏదో వార్తా చానెల్ లో జూడాల వివాదం అంటే నేను అదేదో బాబ్లీ టైపు వివాదం అనుకున్నా, అరగంట తర్వాత తెలిసింది అది నీళ్ళ గొడవ కాదు, డాక్టర్ ల గొడవ అని

    రిప్లయితొలగించండి
  5. హతోస్మి!
    ఆ ఓంకార్ టి.వి.లో కనిపించినప్పుడల్లా, నేను ఛానెల్ మార్చేస్తా.. అంత చిరాకు అతనంటే... నేను అతని కార్యక్రమాలు ఏమీ చూడను కానీ, ఒక్కోసారి ఆ ప్రోమోస్ కి బలయిపోతూంటా...

    ఆ జూడా ల గురించి కూడా నిన్న నేను తమ్ముడు ఇదే డిస్కషన్..

    రిప్లయితొలగించండి
  6. ఇతను మాయాద్వీపం అనే ప్రొగాం లొ చిన్న పిల్లాడిలా మాట్లాడేవాడు కదా!అప్పుడే తెగ చిరాకేసేది. హటాత్తుగా చానెల్ మార్చేసి అదృష్టం ప్రోగ్రాం మొదలు పెట్టాడు. గంట సేపు వెధవ చూపులు చూస్తూ .....ఆ ప్రోగ్రాం పార్టిసిపెంట్స్ ని తినేస్తాడు. సుమ ఎపిసోడ్ బావుంది అదీ సుమ వల్ల , తనే వీడినో ఆట ఆడించింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ ప్రోగ్రాం చూళ్ళేదు. ఇక డాన్సుల సంగతి.....మా చిన్నప్పుడు రికార్డింగ్ డాన్సులని వీధుల్లో వేసేవారు . సాధారణంగా మర్యాదస్తులెవరూ వాటికి వెళ్ళేవారు కాదు, కానీ ఇప్పుడు అవి నట్టింట్లోకి వచ్చేసాయి ఈ కార్యక్రమాల రూపంలో .

    రిప్లయితొలగించండి
  7. నేను టీవీయే చూడ. బాధలే లేవు. ఎప్పుడైనా మరీ పొద్దుపోక అలా తిప్పుతుంటే, ఈ డాన్స్ ప్రోగ్రాములు కనిపించి, కడుపు తిప్పుతుంది. అందుకే నాదో ఉచిత సలహా. మీరూ ఇయన్నీ ఒగ్గేసి, ఏ దూరదర్శనో, టీటీడీయో అని ఫిక్స్ అవండి.

    రిప్లయితొలగించండి
  8. అసలు ఓంకార్ యాంకరింగ్ అంటేనే నాకు చిరాకు.జెమినీ మ్యూజిక్ లో వచ్చేవాడు .తరువాత జీ తెలుగు కి వచ్చి,ఆచానల్ అంటేనే విరక్తి వచ్చేలా చేసాడు.ఇప్పుడు మాటీవి లోఅదృషం,ఏదో పిచ్చి డాన్స్ల ప్రోగ్రాంకి యాంకరింగ్ చేస్తున్నాడు.అసలు అదృష్టం లో ఐతే పార్టిసిపెంట్స్ మీదమీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు తన ఫేస్ చూసేవారికి ఇక జన్మలో టీవి చూడకూడదు అన్నంతవిరక్తివస్తుంది.

    రిప్లయితొలగించండి
  9. ఓంకార్ గారి ఆంకరింగ్ విషయంలో అందరిదీ ఒకే మాటగా ఉంది.

    రిప్లయితొలగించండి
  10. జూడా లు గురించి నేనూ అలాగే అనుకున్న మొన్న tv9 లో విని.. అవును ఈ ఓంకార్ ని ఇంతకు ముందు ఏంకర్ గా చూసిన గుర్తు చాలా రొజుల క్రిందట

    రిప్లయితొలగించండి
  11. ఈ "జూడా" ఝాడ్యం ప్రింటు మీడియాలో కూడా ఉందండి. ఆ మాట చూసినప్పుడల్లా నాకు ఎంత ఒళ్ళు మండుద్దో!

    రిప్లయితొలగించండి
  12. +1

    నేను కూడా ఓంకార్‌ను అసహ్యించుకునే వాళ్లలో మరొకడిని. వాడి మొహం కనపడితే చాలు చానల్ మార్చడమే. వాడు మాటీవిలోకి వచ్చినప్పటి నుండి ఆ చానల్ చూడడమే మానేశా.

    రిప్లయితొలగించండి
  13. జు.డా అని వింటే నాకు కూడా చిరాకొస్తుంది....ఏదో జడ్డి వెదవ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే....
    ఇంక ఆ ఓంకార్ ని చూస్తేనే నాలుగు అంటిచ్చబుద్దవుతుంది నాకు.....
    >>>ఛాలెంజ్ పేరుతో డ్యాన్సర్లు వాళ్లల్లో వాళ్ళే మరీ చెత్తకుండీల దగ్గర కుక్కల కన్నా ఘోరంగా కొట్టుకుంటున్నారు.
    నేను చానల్స్ ఫ్లిప్ చేస్తూండగా ఇది చూశానండీ...అక్కడ పోటీదారులు సహ పోటీదారుల లేదా ఓంకార్ జుట్టు పీకటం ఒక్కటే తక్కువయింది....మిగిలినవన్నీ చేస్తున్నారు.....

    రిప్లయితొలగించండి
  14. :)) Siva Reddy is hilarious! Thanks for the video Venu..
    అయితే మన కొత్త క్యాప్షన్ 'నా బ్లాగ్ కి నేనే ఓంకార్ ని ' అన్న మాట :-)
    'జుడా' విషయంలో అందరి అభిప్రాయమే నాదీను.. అసలు కుదించి చెప్పడానికి/ప్రింట్ చేయడానికి అవేమైనా నోరు తిరగని పదాలా లేక చాలా పొడవైన పదాలా!!

    రిప్లయితొలగించండి
  15. జుడా ప్రయోగం బాగుంది. JD అని పిలిస్తే మీకు ఓకే అయ్యేదా?

    రిప్లయితొలగించండి
  16. కుక్కల పోలిక బ్రహ్మాండం. అప్పుడెప్పుడో ఓ హిందీ పోటీ కార్యక్రమం చూస్తే అక్కడా ఇలాగే అనిపించింది. పైగా ఓడిపోయినోళ్లు జీవితం ముగిసిపోయినట్లు ఏడుపులూ పెడబొబ్బలూ!

    మూడు వారాల కిందటనుకుంటా, జీటీవీ (హిందీ) లోనో ఎక్కడో ఏదో డాన్సాట కార్యక్రమం వస్తుంటే కాసేపు చూశాను. అందులో ఒకమ్మాయ, గౌన్ లాంటిదేదో తొడుక్కుని పల్టీలు కొడుతూ గంతులేస్తుంది (గౌన్‌తో పల్టీలు! ఊహించుకోండి) ఎంత రోతగా అనిపించిందో. అంతలో ఆ గౌన్ కాస్తా ఊడిపోయింది. ఇవన్నీ లైవ్ షోస్ కావు, అలాంటి అపశృతులు కత్తిరించేయొచ్చు కదా. వాళ్లు మాత్రం అది శుభ్రంగా చూపించేశారు. ఇక, ఆ పిల్ల కన్నీళ్లు - ఏదో దారుణం జరిగిపోయినట్లు. ఆ డ్రస్‌తో అటువంటి గంతులేయటానికి సిద్ధపడ్డప్పుడే తెలిసుండదా - ఆమెకీ, ఆమెకా కాస్ట్యూమ్ సూచించినవాళ్లకీ, ఆ స్టెప్స్ నేర్పినవాళ్లకీ - ఇలాంటిదేదో జరగొచ్చని? లెక్కప్రకారం ఆమె డిస్‌క్వాలిఫై అవ్వాలి. కానీ జడ్జ్‌లు మాత్రం వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకుని ఆ తర్వాత గంభీర వదనాలతో ఆమెకి మరో అవకాశమిచ్చారు. దానికి వాళ్లు చెప్పిన కారణం - అది 'ఔరత్ కీ ఇజ్జత్ కా సవాల్' అట. గుడ్డ పీలికలతో కోట్లాది వీక్షకుల ముందు గంతులేయటానికి సిద్ధపడ్డప్పుడు ఇజ్జత్ ఏమైపోయిందో!

    ఎక్కడికి దిగజారాయి మన కార్యక్రమాలు?

    రిప్లయితొలగించండి
  17. నా బ్లాగ్ కి నేనే ఓంకార్ ని ' :)

    రిప్లయితొలగించండి
  18. మంగిడీలు వేణు గారు .... TV programmes పైన మీ బ్లాగ్ చదివాను... మీరు వెంటనే .. ఓంకార్ బాధిత సంఘం ఒకటి మొదలు పెట్టచ్చేమో... ఎందుకంటే ఆ బాధితుల్లో నేను కూడా ఉన్నాను ...
    అంచేత నేను చేపోచ్చేది ఏంటి అంటే ... మీరు ముందర ఆ పని మీద ఉండండి

    రిప్లయితొలగించండి
  19. తృష్ణ గారు నెనర్లు. నాకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు పై అసంతృప్తి ఉందండీ. ఇలాటి టాలెంట్ షోస్ చాలా అవసరమని ఫీల్ అవుతుంటాను కాకపోతే క్వాలిటీ పై మరింత శ్రద్ద పెట్టాలి నిర్వాహకులు. ఉదాహరణకి మాటీవీ లోని రేలారెరేలా చూసారా ఎపుడైనా ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న ఆణిముత్యాలను వెలుగు లోకి తెస్తుంది ఈ కార్యక్రమం అలాటి టాలెంట్ షోస్ రావాలి. దాని యాంకర్ ఉదయభాను కూడా విసిగిస్తుంది ఒకోసారి కాని తను చేసిన ఇతర ప్రోగ్రాంస్ తో పోలిస్తే ఇది చాలా నయం.

    శ్రావ్యగారు నెనర్లు. ఓ అవునా ఈయన మొదట జెమిని మ్యూజిక్ నుండి వచ్చాడా... ఆ అదృష్టం ప్రోగ్రాం చూసాకే ఇతని మీద ఆక్రోశం వెళ్ళ గక్కాలన్న ఆలోచన వచ్చిందండీ. నిజంగా సహనానికి పరీక్ష ఇంతా చేసి నెను రెండు మూడు ఎపిసోడ్స్ అక్కడక్కడా మాత్రమే చూసాను, ఇక తరచుగా చూడాలని ప్రయత్నించే వాళ్ల పరిస్థితి ఏమిటో మరి.

    ఫణి గారు నెనర్లు. నాకు తెలిసి పిల్లల స్టెప్స్ విషయం లో తల్లిదండ్రులకు ఏ విధమైన కంట్ర్లోల్ ఉంటుంది అనుకోనండీ.. డ్యాన్స్ మాష్టర్, దర్శకులు ఇలాటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి. తల్లిదండ్రులు మహా అయితే పిల్లల్ని పంపించడం మానేయగలరు అంతే.. శాంతి స్వరూప్ గారిని భలే గుర్తు చేశారు కానీ ఆయన మరీ నెమ్మది లెండి.

    లక్ష్మిగారు నెనర్లు. గీతామాధురి ఎపిసోడ్ నేను చూడలేదండీ అప్పుడపుడు ఒకటి రెండు ఎపిసోడ్స్ చూశాను అవి కూడా పూర్తి ఎపిసోడ్ చూసే ధైర్యం చేయలేకపోయాను. ఛాలెంజ్ విషయం లోకూడా అంతే సరిగ్గా ఇలాటి విపరీతమైన సీన్ లే నా కంట పడుతుంటాయి నాఖర్మ కొద్ది. హ హ మరే నేను కూడా మొదట అలాగే తికమక పడ్డాను విజువల్స్ చూడకుంటే అర్ధమయ్యేది కాదు.

    మేధ గారు నెనర్లు. నేను సాధారణంగా అలానే తిప్పేస్తుంటాను కానీ ఒకోసారి చూసేసి బలవుతుంటాను. ఓ జూడాలు నాకొక్కడికే నచ్చలేదు అనుకున్నాను గమనించిన వారు చాలామందే ఉన్నారనమాట.

    లలిత గారు నెనర్లు. నిజమే నండీ మాయాద్వీపం పేరు గుర్తు రాలేదు. హైస్కూల్ పిల్లలతో కూడా చంటిపిల్లల భాషమాటాడి విసుగెత్తించేవాడు. సుమ & మనో గార్ల ఎపిసోడ్స్ కొన్ని చూసి ఇదేదో కామెడి ఎంజాయ్ చేయచ్చు కదా అని ఈ షో చూడటం మొదలుపెట్టానండీ, నా ఖర్మేమో కానీ అన్నీ విసిగించే ఎపిసోడ్సే ఆ తర్వాత. హ హ రికార్డింగ్ డ్యాన్స్ లు బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  20. వేణు గారూ.. ఓంకార్ జెమిని మ్యూజిక్ కి ముందు లోకల్ చానల్ 'సి' లో చేసినట్టు గుర్తు.. మరి ఒకవేళ అతను వేరేమో.. నేను ఇతని కార్యక్రమాలు ఒకటి రెండు ఎపిసోడ్స్ చూసి ఆ తర్వాత కనిపిస్తే చానల్ మార్చేయడం మొదలుపెట్టాను.. మీరు రాసినవేవీ చూడలేదు. శివారెడ్డి క్లిప్పింగ్ మాత్రం అద్భుతం.. అదొక్కటి చాలు ప్రోగ్రామ్స్ ఎందుకు చూడక్కర్లేదో చెప్పడానికి.. ఎక్కడా అవకాశాలు రాని వాళ్ళని తీసుకొచ్చి జడ్జీలుగా కూర్చోపెట్టడం ఏమిటో.. ఏ చానల్లో చూసినా అంతే.. రిటైరైపోయాక ఏదైనా చానల్లో జడ్జీ ఉద్యోగానికి ప్రయత్నించొచ్చు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.. ఎందుకంటె చేసేది ఏమీ ఉండదు కదా.. వాళ్ళు కూడా స్క్రిప్టు ప్రకారమే మాట్లాడతారనిపిస్తుంది.. మంచి టాపిక్..

    రిప్లయితొలగించండి
  21. రవిగారు నెనర్లు, అదృష్టవంతులు సార్ మా కేబుల్ వాడు నాకు మా,తేజ,జెమిని,ఈటీవి తప్ప వేరే తెలుగు ఛానల్స్ ఇవ్వడండి TTD, DD కి స్కోప్ లేదు ఏంచేస్తాం కొన్ని జీవితాలు ఇంతే.. ఇల్లు మారాక శాటిలైట్ కి షిఫ్ట్ అవ్వాలి.

    రాధిక గారు నెనర్లు, నా బాధ కూడా అదేనండీ ఇతన్ని చూడలేక జనాలు ఆ ఛానల్ వైపు చూడటం మానేస్తారు. ఇదివరకు నేను సుమన్ బాధ పడలేక ఈటీవి పెట్టేవాడ్ని కాదు అతని వెళ్ళాక ఇపుడు కాస్త చూడగలుగుతున్నాను.

    విజయమోహన్ గారు నెనర్లు. ఇందరు బాధితులు ఉన్నారని నేనుకూడా ఊహించలేదండీ.. మొదట అభిమానులు నాపై దాడికి దిగుతారేమోనని సంశయించాను.

    నేస్తం గారు నెనర్లు, జూడాల విషయం లో అందరిదీ ఒకేమాట లా ఉంది, ఓంకార్ ఇపుడు కూడా యాంకరింగ్ తోనే బుర్రలు తింటున్నాడండీ.. కాకపోతే మిగిలిన భాద్యతలుకూడా తీసుకుని మరింత పేట్రేగిపోతున్నాడు.

    సిరిసిరిమువ్వ గారు నెనర్లు, ఓ ప్రింట్ మీడియా లోకూడా వాడుతున్నారా హతవిధీ కనీసం జూ.డా. లు అని వాడుతున్నారా దాన్నో తెలుగుపదం చేస్తున్నారా.. నేనింకా సమయా భావం వల్ల వేగంగా చదవడానికి టీవీ లో మాత్రమే వాడుతున్నారు అనుకుంటున్నాను.

    వెంకటరమణ గారు నెనర్లు, హ్మ్ నేను హెచ్చరించేది కూడా అదే విషయం మీదండీ.. మాటివీ కూడా ఈటీవీ లా కేవలం ఒకవ్యక్తి వలన చూసేవాళ్ళ సంఖ్య తగ్గించుకుంటుంది. వాళ్ళు త్వరలో ఈ విషయాన్ని గ్రహిస్తే బాగుండు.

    శేఖర్ గారు నెనర్లు. నేనుకూడా ఈ కొట్లాటను ఛానల్స్ తిప్పుతుండగానే చూశాను. జడ్డివెధవ :-) ఇది కూడా నాకువాళ్ళని కాదు చూస్తున్న మనని తిడుతున్నట్లు అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  22. నిషిగంధ గారు నెనర్లు, హ హ మరే కొత్త క్యాప్షన్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఇతను అంతటి సమర్ధుడే.. శివారెడ్డి ఇతరుల గొంతుననుకరించే మిమిక్రీ ఒక ఎత్తైతే మేనరిజమ్స్ ని అనుకరించడం లో ఇతనికి సాటి ఎవరూ రారు అనిపిస్తుంది. అతని వీడియో ఎప్పుడు చూసినా నవ్వుకోకుండా ఉండలేను. "అవేమైనా నోరు తిరగని పదాలా లేక చాలా పొడవైన పదాలా!!" కదా ఏంచేస్తాం అండీ ఇంత చిన్న పదాన్ని కూడా కుదించేస్తున్న మీడియాని తిట్టుకోడం తప్ప.

    కిరణ్ గారు నెనర్లు, జూడా అయినా JD అయినా ఇంత చిన్న పదాన్ని కూడా కుదించి రాయాల్సిన/పలకాల్సిన అవసరం ఏమిటా అని ప్రశ్నిస్తున్నానండీ అంతె.

    అబ్రకదబ్ర గారు నెనర్లు, మీరు చెప్పిన ఇన్సిడెంట్ మరీ ఘోరంగా ఉంది, అది అలానే టెలికాస్ట్ చేయడం చూస్తుంటే ఇలాటి వార్డ్ రోబ్ మాల్ ఫంక్షనింగ్ ఒకోసారి స్టేజ్‍డ్ ఎమో అని అనుమానం వస్తుంటుందండీ... మీ ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమే..

    ఛంఛం గారు నెనర్లు, మీ పేరు భలే ఉంది ఏదో బెంగాలీ స్వీట్ ఉన్నట్లుంది అనుకుంటా ఈ పేరు మీద :-)

    అజ్ఞాత గారు నెనర్లు, అంచేత నేచెప్పొచ్చేదేంటంటే పెజలారా.. ఈయాల్టి రోజున ఎక్కడ చూసినా సంఘాలు కనపడిపోతన్నాయ్ కనుక మనం కూడా ఓ ఓంబాసం పెట్టేయాలని తెలియచేసుకుంటున్నాను. అదేదో సినిమా లో రావుగోపాల్రావుగారిని గుర్తు చేశారు :-)

    మురళి గారు నెనర్లు, మీరు భలెపట్టేశారు శివారెడ్డి క్లిప్పింగ్ పెట్టడం లో ముఖ్యోద్దేశ్యం. ఇతను జడ్జిలను కూడా ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. జడ్జిల విషయం లో మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది వాళ్ళు కూడా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతూ ఉండచ్చు. అవకాశాలు ఉన్నవాళ్ళు మరి వాళ్ళపనిలో బిజీగా ఉంటారు కదండీ మిగిలిన వాళ్ళనే ఇలాటి ప్రోగ్రాంస్ కి లాక్కురాగలిగేది. మీ రిటైర్మెంట్ ఐడియా సూపరు :-)

    రిప్లయితొలగించండి
  23. "రేలారెరేలా" బావుంటుందండి. మావారు, మా పాప ఇద్దరూ ఎంతో ఇష్టంగా చూస్తూంటారు ఆ కార్యక్రమాన్ని. నేనూ పనుల్లో ఉన్నా... ఓ చెవి అటు వేసి ఉంచుతాను...ఆమధ్యన ఒక చిన్న పిల్లవాడు ఎంత బాగా పాడాడో కదండీ...

    రిప్లయితొలగించండి
  24. Hahaha. BTW who is Omkar? I have no previlege of watching the television shows of telugu. Moreover not much time too. My present time pass is reading blogs. One of my fav ones is yours.

    రిప్లయితొలగించండి
  25. తృష్ణ గారు మీరు చెప్పేది రషీద్ గురించేనా కళ్ళు లేని కుర్రాడు. అతని పాట ఒక ఎత్తైతే అతని యాటిట్యూడ్ మరొక ఎత్తు. నాకు భలే నచ్చేశాడు.

    అగా గారు నెనర్లు. మీలాటి వారు ఈ ప్రశ్న వేస్తారు అనే వీడియో ఇచ్చాను మాష్టారూ :-) నేను టీవీ చూసేది తక్కువే కానీ నాకు కుదిరిన కాస్త టైం లో ఇలాటి ప్రోగ్రాంస్ వస్తుంటే బలైపోక తప్పడం లేదు.

    రిప్లయితొలగించండి
  26. వేణు గారు, మీ పాత టపాలు చదువుతున్నాను. ఈ టపా చదివిన వెంటనే అర్ధమయ్యిన విషయం ఏంటంటే నాలాగే చాలా మంది బాధితులు ఉన్నారని. నేనెప్పుడో ఈటివి, మాటివి ఇవ్వన్ని చూడ్డం మానెసానండీ. ఈటివి ప్రారంభం అయ్యిన కొత్తలో కార్యక్రమాలు బాగుండేవి. తరువాత దాన్లో కార్యక్రమాలు చెత్తగా తయారయ్యాయి. ఈ ఛానెల్లో ప్రోగ్రాంస్ ఇలా తగలెడ్డాయి అనుకుంటుండగా మాటివి కార్యక్రమాలు మొదలయ్యాయి.ఇంతలో జీ తెలుగువి కూడా అనుకుంటా..పర్లేదే కొంచానికి కొంచెం కార్యక్రమాలు బాగున్నాయి అని అనుకునేంతలో ఆట ,ఛాలెంజ్ లాంటి మహత్తర కార్యక్రమాలు మొదలయ్యాయి. దెబ్బకి తెలుగు ఛానెల్స్ చూడ్డం మానెసాను.ఏదైనా సినిమాలు వస్తే తప్ప వీటి జోలికి వెళ్లడం లేదు. మన ఛానెల్స్లోని కార్యక్రమాలు ఎప్పటికీ బాగుపడతాయో ...

    రిప్లయితొలగించండి
  27. స్నిగ్ధ గారు ఓపికగా పాత టపాలు కూడా చదివి కామెంట్ రాస్తున్నందుకు నెనర్లు. నాది ఇంచుమించు అదే పరిస్థితి సినిమాల కోసం తప్ప టివి చూడటం మానేశాను.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.