శుక్రవారం, జూన్ 27, 2008

గుల్మొహర్

ఈ టపా టైటిల్ చూసి ఇదేదో ఈనాడు వారి విపుల పుస్తకం లో అనువాద కధ లా ఉందే అని వచ్చిన వారికి సారీ అండీ, మిమ్మల్ని disappoint చేసినందుకు. ఏదో నోటికి వచ్చినట్లు బ్లాగమంటే సరే కానీ మనకీ కధలూ కవితలు రాసే అంత దృశ్యము లేదు. అప్పటికీ ఆ మధ్య హైస్కూల్ లో చదువుకునే రోజులలో "ఆకుపచ్చని కన్నీరు", "మెత్తని గుండ్రాయి" అని కొన్ని తవికలు రాసాను కానీ జంధ్యాల గారు ఆయన చంటబ్బాయి సినిమా లో వాడుకుంటాను అంటే కాదనలేక ఇచ్చేసాను, మళ్ళీ ప్రయత్నించలేదు :-)
సరే ఇక నా టపా విషయానికి వస్తే, ఇదిగో పైన కనిపిస్తున్న గుల్మొహర్ చెట్టు గురించి, దాని పువ్వుల అందం గురించి వాటి మొగ్గలతో మేము ఆడుకునే కోడి పందెం ఆట గురించీ నా కారంపుడి టపా లో చదివి ఈ చెట్టుపై నాకున్న ఇష్టాన్ని అర్ధం చేసుకుని, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ ఊరిలో ఉన్న ఈ చెట్టూ, పువ్వులూ ఫోటో లు తీసి నాకు పంపించిన నా నేస్తం "బుడిగి" కి బోలెడు నెనర్లూ థాంక్స్ లూ (పేపర్‌కాయితం లా) చెప్పుకుంటూ ఆ ఫోటో లు నా బ్లాగు లో భద్రపరచుకొని అప్పుడప్పుడూ చూసుకోవచ్చు కదా అని ఈ రోజు టపా లో అవి పోస్ట్ చేస్తున్నా.అశోకుడు రోడ్లకి ఇరువైపులా నాటించింది ఈ చెట్లో అశోక చెట్లో నాకు తెలీదు కానీ మా కాలనీ రోడ్ లో ఇవి మాత్రం గొడుగులా పెద్దగా పెరిగి మంచి నీడనిచ్చేవి. కొన్ని చెట్లకి కింద చెట్టు చుట్టూ అరుగులు కట్టి ఉండేవి పిల్లలం వాటి మీద కూర్చుని మరీ ఆడుకునే వాళ్ళం. మా ఇంట్లో మాత్రం అది Main Road కావడం తో బాబోయ్ బస్సులు వస్తాయ్ అని ఒక్కడ్నే వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు ఎవరో ఒకరు ఎస్కార్ట్ ఉండాల్సిందే లేదంటే ఒకో రోజు వాళ్ళే వెళ్ళి కాసిన్ని మొగ్గలు తెచ్చి ఇచ్చి ఇంట్లోనే ఆడుకొమ్మనే వాళ్ళు.

నాకు పేరు గుర్తు రాక కోడిపుంజు చెట్టు అని పరిచయం చేసిన ఈ చెట్టుకు అసలు "గుల్మొహర్, అగ్నిపూలచెట్టు, పొగడపూలచెట్టు, Flame of the forest (Botanical : delonix regia)" అని బోలెడు పేర్లు ఉన్నాయిట వీటిలో ఏవైనా కరెక్ట్ కాదనిపించినా... ఇంకేదైనా కొత్త పేరు మీకు తెలిసినా వ్యాఖ్య ద్వారా తెలియ చేయండేం. ఎందుకంటే నా ఙ్నాపక శక్తి మీద నాకు పెద్ద గా నమ్మకం లేదు కాని గుల్మొహర్ పేరు మాత్రం గుర్తొచ్చింది తర్వాత ఓ నేస్తం గుర్తు చేస్తే.అప్పట్లో పుష్పవిలాపం గురించి తెలియక పోయినా చెట్టుకి ఉన్నవి ఎక్కువ తెంపే వాళ్ళం కాదు. గాలికి మొగ్గలు పువ్వులూ రాలి కింద పడేవి, బహుశా మా లాంటి పిల్లలు ఆడుకుని ఆనందిస్తారనే చెట్టు మరిన్ని రాల్చేదేమో. అలా కింద పడినవి మాత్రమే ఏరుకుని ఆడుకునే వాళ్ళం. చెట్టు నుండి నేరుగా పువ్వులు కోయకూడదు అని నియమం కాదు లే కాని మొగ్గలు పువ్వులూ మాకు అందనంత ఎత్తులో ఉండేవి అందుకే బుద్ది గా ఉండే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది కర్కశం గా మొగ్గని చిదిమి ఆడుకుని ఆనందించే వాళ్ళమని తెలిస్తే కరుణశ్రీ గారు ఏమని అని ఉండేవారో !!
ఇదిగో ఇలా మెలేసి లాగితే ఎవడి కోడి తల తెగితే వాడు ఓడిపోయినట్లు :-) ఇందులో ఓ చిన్న టాక్టీసు ఉందండోయ్ మనం సెలెక్ట్ చేసుకునే ముందే కొంచెం జాగ్రత్త గా చూసి తలలు కొంచెం స్ట్రాంగ్ గా ఆటాచ్ అయి ఉన్నవి సెలెక్ట్ చేసుకుని రంగం లోకి దిగాలి అప్పుడు కానీ కొంచెం నిలబడలేం.
సరే మరి బొమ్మలు చూసి ఆ ఙ్నాపకాలు మళ్ళీ ఓ సారి గుర్తొస్తే అలా ఓ సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళి వచ్చి ఓ పదేళ్ళు వయసు తగ్గించుకోండి :-)

ఈ రోజుకి ఇక శలవా మరి.
--మీ వేణు.

23 కామెంట్‌లు:

  1. ఈ కోడి పందాలాట మేమూ చిన్నప్పుడు ఆడుకునేది. ఈ చెట్టుని మొన్న మొన్నటి వరకూ నేనూ కోడి పందాలాట చెట్టనే చెప్పేది :)
    ఫ్లేం ఆఫ్ ఫారెస్ట్ ఇది కాదనుకుంటాను, అది మోదుగ చెట్టు అనుకుంటాను.

    అన్నట్టు పొగడ పూల చెట్టంటే ఇదేనా? రవీంద్ర నాథ్ గోరా లో పొగడ పూల దండలతో హీరో పెళ్లి చేసుకుంటే ఏమిటో అనుకుంటున్నాను ఇన్నాళ్లూ

    రిప్లయితొలగించండి
  2. వేణూ శ్రీకాంత్,
    పొగడ పూలు ఇవి కావు! ఇవి అగ్నిపూలే, అనగా గుల్మొహర్లే! రోడ్డుకిరివైపులా ఈ చెట్లు ఉన్నప్పుడు ఆ రోడ్డు అందం చెప్పనలవి కాదు! ఇంకో పేరు ఒరెమున గారు చెప్పారు..మోదుగ పూలు!

    చిన్నప్పుడు కోడిపందాలాట ఆడుకునే పూలు ఇవి కాదని గుర్తు! ఆ చెట్టు ప్రహరీ గోడలు, రోడ్ల పక్కన పెరుగుతుందనుకుంటా, చిన్న చెట్టే..పూలు మాత్రం అచ్చం ఇలాగే ఉంటాయి.

    మొత్తానికి ఫోటోలు బాగున్నాయి.
    (మీ కారం పూడి టపాకి కామెంటాను చూడండి)

    రిప్లయితొలగించండి
  3. మా తాతగారి ఊరికి వెళ్ళేటప్పుడు రోడ్డంతా ఇవే చెట్లు.. చూడడానికి ఎంత బావుండేవో...

    రిప్లయితొలగించండి
  4. @ oremuna, పొగడ పూల చెట్టు అంటే ఇది కాదు. రెండు వేరు వేరు. పొగడ పూలు తెల్లగా ఉంటాయి. మోదుగ, అగ్నిపూలు, కోడిపందాలాట చెట్టు, ఫ్లేం ఆఫ్ ఫారెస్ట్, గుల్మొహర్ అంటే మాత్రం ఇదే.

    రిప్లయితొలగించండి
  5. గుల్మోహర్ పూలంటే ఇవే...పొగడ పూలు వేరే....
    వీటిని అగ్గిపూలు OR "the fire of the forest"...అని కూడా అంటారు...ఈ చెట్టు బాగా పూసినపుడు..ఆకులు ఏమాత్రం కనిపించవు...అంతా ఎర్రగా భలే అందంగా కనిపిస్తాయి...
    అన్నట్టూ.....ఈ పూలు చాలా బాగుంటాయి....
    కాని ఈ చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి కాబట్టి...ఆ పూలు అందవు....కాని...పూలు రాలినప్పుడు
    చూడాలి భలేగా ఉంటాయి....అన్నట్టూ
    చెప్పడం మరిచా....nice pics....mee karam podi tapa ki comment chudandi..bhale sangatulu chebutunnaru thankssssssss

    రిప్లయితొలగించండి
  6. వేణూ గారూ, ఫోటోలు చాలా బావున్నాయి..

    మేమూ కోడిపుంజు చెట్టు అనే పిలిచేవాళ్ళం.. రోజూ స్కూల్ కి వెళ్ళేప్పుడూ, వచ్చేప్పూడూ ఈ పందేలు ఆడుకుంటూ నడిచేవాళ్ళం.. ఇదీ ఇంకా చీమచింతకాయల్లో ఉండే నల్ల గింజని ఎవరు ఫస్ట్ వలిచి లోపల ఉన్న పప్పుని రెండుగా వేరు చేస్తారనే పందెం కూడా వేసుకునేవాళ్ళం..

    రిప్లయితొలగించండి
  7. @సిరిసిరిమువ్వ,@oremuna, మోదుగ వేరు, గుల్మొహర్ వేరు,ఇక్కడున్నవి గుల్మొహర్.

    మోదుగ్ లాటిన్‌ పేరు butea mono sperma, butea frondosa. మోదుగ ఆకులు గుండ్రంగా పెద్దగా ఉంటాయ్,(తెలంగాణ వైపు)వాటితో విస్తర్లు కూడా కుడతారు. పూర్వ కాలం లో గొడుగులూ కుట్టేవారట.ఒక రెమ్మకు మూడు ఆకులుంటాయి, ఎండిన తరువాత bronze green రంగు లోకి మారతాయి.

    వాటి పూలు ఆరెంజ్ రంగులో ఉంటాయి,రెండు మూడు అంగుళాల పొడవుతో చిలక ముక్కు లా ఉంటాయి. వీటి పూలతో హోళీ రంగు తయారు చేసి హోళీ ఆడతారు.
    english name,Flame of the forest parrot tree.
    సంస్కృతం లో కింశుక అంటారు. మోదుగ చంద్రునికి పవిత్రమైనది అంటారు...

    రిప్లయితొలగించండి
  8. @oremuna గారు
    నెనర్లు, నాకూ పొగడపూల చెట్టు ఇదేనా అని అనుమానం వచ్చిందండి, మొత్తానికి మిత్రులు కాదని confirm చెసేశారు. ఇక Flame of the forest అని 3-4 రకాలు వున్నాయండి ఇండియన్, చైనీస్, అమెరికా లో రెండు రకాలు. మోదుగ పూలు కూడా ఆరెంజ్ రంగులో ఉండటం వల్ల దానిని కూడా Flame of the forest అంటారుట. ఈ లింక్ లో మోదుగ ఫోటో లు చూడచ్చు. http://forest.ap.nic.in/Sparks%20of
    %20Success%20APFD-02-05/009-Sushmeer.htm

    @సుజాత గారు,
    పొగడ పూల గురించి చెప్పినందుకు థాంక్స్, నిజమేనండీ ఇవి రోడ్ ప్రక్కన వృక్షాలు గా పెరిగితే, మరి వీటి లోనే నో అవి వేరే జాతో తెలీదు కాని ప్రహరీ గోడల పక్కన చిన్న చిన్న తీగలు గా పెరిగే మొక్కల పువ్వులతో కోడా ఆడే వాళ్ళం. నేను NRT లో చూసాను వాట్ని కాని అవి బుజ్జి గా వుండి పట్టుకోడానికి కూడా కష్టం గా ఉండేవి. కారంపుడి కామెంట్ చూసానండీ అక్కడే జవాబిస్తాను.

    @మేధ గారు
    థాంక్స్ అండీ, అవును రోడ్ కి వీటి వల్ల వచ్చే అందం మాటల్లో చెప్పలేం.

    @సిరిసిరిమువ్వ గారు
    పొగడ పూల గురించి confirm చేసినందుకు థాంక్స్ అండీ.

    @మీనూ
    థాంక్స్, అవును నిండుగా పూసినప్పుడు చూడటానికి రెండు కళ్ళూ చాలవు. నీ కారంపుడి కామెంట్ చూసాను అక్కడే జవాబిస్తాను.

    @నిషిగంధ గారు
    థాంక్స్ అండీ..చీమ చింతకాయలు భలే గుర్తు చేసారు మొన్నా మధ్య వీటి పేరు గుర్తు రాకా చాలా ఆలోచించి వదిలేసాను :-)

    @రమ్య గారు
    థాంక్స్ అండీ చాలా ఓపికగా వివరించారు. నేను పొగడ పూల గురించి గూగుల్ లో వెతికితే దొరకలేదు మీకు దాని బొటానికల్ పేరు తెలుసా. వాటి ఫోటో లు ఎక్కడన్నా దొరికితే కామెంట్ లో లంకె ఇవ్వ గలరా శ్రమ అనుకోకుండా...

    రిప్లయితొలగించండి
  9. వేణూ శ్రీకాంత్ గారు, పొన్న చెట్టు ఐతే నాకు తెలుసు, మరి పొగడ అదేనో కాదో.(కొన్ని ప్రాంతాలలో పారిజాతం చెట్టు నూ పొగడ అని వ్యవహరిస్తారు)

    ఇక పొన్న చెట్టు విషయానికొస్తే పేరు -Alstonia Scholaris. తెల్లని గుత్తులుగా సువాసన కలిగిన పూలు ఉంటాయి.
    ఇక్కడో లంకే-http://en.wikipedia.org/wiki/Alstonia_scholaris

    రిప్లయితొలగించండి
  10. @రమ్య గారు,
    చాలా థాంక్స్ అండీ లంకె ఇచ్చినందుకు.

    రిప్లయితొలగించండి
  11. మా వూర్లో వీటిని తురాయి పూలు
    ఆంటారు అనుకుంటాను.
    ఆవేనా ఇవీ లేక వేరేనా

    రిప్లయితొలగించండి
  12. na peru chaitanya..
    ee roju me blog chusa andi..
    pictures collection bagundi venu garu..chala bagunnay andi..

    రిప్లయితొలగించండి
  13. వేణూ శ్రీకాంత్ గారూ గుల్ మొహర్ అంటే కాగితం పూల చెట్లు. నాకు ఈ మధ్యనె తెలిసింది. కోది పందేలు మళ్ళీ గుర్తు చేశారు. నిజంగానే జ్ఞాపకాల దొంతరలు కదిలించారు. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  14. శృతి గారు, ముందుగా పాత పోస్ట్ చదివి వ్యాఖ్య రాసినందుకు నెనర్లు. గుల్‌మొహర్ చెట్టు, కాగితం పూల చెట్టూ వేరు వేరు. ఇక్కడ పోస్ట్ లో ఉంది గుల్‌మొహర్. కాగితం పూల చెట్టంటే వంగపండు రంగులో చాలా పలచని రేకులతో పూచే పువ్వుల చెట్టు.

    రిప్లయితొలగించండి
  15. నాకు గానీ అవకాశం వస్తే దేశం అంతటా ఈ మొక్కలే నాటించేస్తాను.కానీ ఇది గుల్మొహర్ కాదనుకుంటాను.గుల్మొహర్ పొదలా గా పెరుగుతుంది.వాటినే కాగితం పూల మొక్కలు అంటాము.బంతి,చామంతుల కాలం లో గుచ్చుకునేలా వుండి చిన్నగా వుండే పువ్వు ని మేము పొగడ పూలు అనేవాళ్ళం.అవి వంగపండు రంగులోను,గులాబీ రంగులోను వుంటాయి.వీటిని ఎక్కువగా పువ్వుల దండల్లో,మండపాల డెకరేషన్ లోనూ ఉపయోగిస్తారు.

    రిప్లయితొలగించండి
  16. అష్టపదిలో "కింశుక" అన్న పదానికి అర్థం వెతుకుతూ పొగడ, పొన్న, మోదుగ ఇవన్నీ చూడాలని గూగులమ్మని అడిగితె చివరికి మీ టపాకు చేర్చింది...మళ్ళీ మా గుల్మొహర్ ఆట ద్వారా బాల్యాన్ని రాప్పించినందుకు చాలా థాంక్స్ వేణూ!

    రిప్లయితొలగించండి
  17. రాధిక గారు కామెంట్ కి నెనర్లు. కాగితం పూల చెట్టూ గుల్మొహర్ వేరు వేరు, కాగితం పూలు అంటే చాలా పలచగా వంగపండు రంగు లో ఉంటాయి అవి మీరన్నట్లు గుబురుగా ఇంకా సన్నజాజి పందిరి లాగా పెరుగుతాయి. కానీ గుల్మొహర్ అని మాత్రం పైన బొమ్మలో ఉండే చెట్లనే అంటారు.

    భావకుడన్ గారు నెనర్లు. హ హ మీ గుల్మొహర్ ఆట అంటారు మొత్తానికి :) మరో సారి అందమైన బాల్యం గుర్తు తెచ్చుకోడానికి నా టపా సహకరించినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  18. హమ్మయ్య! మీ టపాలన్నీ అయిపోయాయి...ఈ కోడిపుంజులాట మేమూ తెగ ఆడేవాళ్ళం...మా స్కూల్లో బోల్డన్ని చెట్లుండేవి...మర్చిపోయాని వీటిని తురాయి చెట్లంటారు..గుల్మొహర్ అంటే పూలు ఇలానే ఉన్నా చిన్నగా ఉంటాయి..ఆ కోడిపుంజులు ఉండవు పూలకి..చెట్టుకూడా చిన్న గుట్టలా పెరుగుతుంది,కాని తుఱాయి చాలా పెద్దగా అవుతుంది...

    హ్మ్..చూస్తుంటే, ప్రతి తెలుగువాడి బాల్యం ఇంచుమించుగా ఒకరకంగానే ఉంటుందేమో!
    నాకు ఇన్ని మధురానుభూతుల్ని గుర్తు చేసినందుకు మంగిడీలు.....

    రిప్లయితొలగించండి
  19. కౌటిల్య గారు నెనర్లు,
    ఓపికగా పాత టపాలన్నీ చదివి కామెంట్ రాస్తున్నందుకు ధన్యవాదాలండీ..

    ఓ ఈ చెట్టుకు మరో కొత్త పేరు చెప్పారు. నేను ఇదే గుల్మొహర్ అనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  20. venu gaaru,
    eppudo mee gurinchi eenadu paper lo chadivaanu appatinundi blogs lo mee posts kosam chustunnanu. ane blog title marchipoyanulendi. anni posts lo mee comments unnayi kaani mee posts kanapadaledu.ivala dorikinaayi. mottam chadivestunnanu.ivaala maa intlo vanta kooda cheyyanu.pillalni maa vaarini bayataku velli tinamani cheppanu. anta baagunnayi mee postlu.
    naa chinnatanam antaa kalla munduki techaru.thank u very much.

    రిప్లయితొలగించండి
  21. అఙ్ఞాత గారు, థ్యాంక్సండి. హ హ మీరు మరీ చెప్తారు, అసలే పండగ టైం వంటమానేస్తే కష్టం కదండీ మరి, లేదంటే మీ వారి చేతికి గరిటిచ్చేసి పండగ స్పెషల్ అని చెప్పేయండి. ఐనా నా టపాలు ఎక్కడికెళ్తాయండి. మీ అభిమానానానికి థ్యాంక్స్. టపాలు మిమ్మల్ని బాల్యంలోకి తీసుకువెళ్ళి ఆనందపెట్టినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.