అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

బుధవారం, మార్చి 27, 2013

స్వామిరారా

సూర్య(నిఖిల్) తన మిత్రులతో(పూజ,కమెడియన్ సత్య) కలిసి ప్రొఫెషనల్ గా ప్లాన్ చేసి జేబులు కొట్టేయడం ఇంకా  చిన్న చిన్న దొంగతనాలూ చేస్తుంటాడు. చూడ్డానికి చాలా డీసెంట్ గా కనపడే ఈ బ్యాచ్ చేసే దొంగతనాలను గుర్తించడం ఎవరితరమూ కాదు. స్వాతి(స్వాతి) జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా స్వాతిని కలిసిన సూర్య ఆమెతో ప్రేమలో పడి తనో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నని ఆమెకి అబద్దాలు చెప్తూ దగ్గరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా ఉండగా ఎన్నో ఏళ్ళ తర్వాత బయటపడ్డ అనంతపద్మనాభస్వామి సంపదని లెక్కించే సమయంలో ఒక చిన్న వినాయకుడి విగ్రహం దొంగిలించబడుతుంది. ఒక మంత్రిగారు ఆ విగ్రహం తనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్మి అది సంపాదించే పనిని దుర్గ(రవిబాబు) అనే లోకల్ గ్యాంగ్ స్టర్ కి అప్పచెప్తాడు. ఆ విగ్రహం తెచ్చిపెడ్తే తనపైనున్న కేసులన్నీ కొట్టేయించి రాజకీయలలో చేర్చుకుంటాననడంతో దుర్గ ఎలాగైనా ఆ విగ్రహం సంపాదించాలని ప్రయత్నిస్తుంటాడు.

ఎక్కడో కేరళలోని తిరువనంతపురంలో చోరీకాబడిన ఆ విగ్రహం హైదరాబాద్ ఎలా చేరుకుంది సూర్య, స్వాతి, దుర్గల జీవితాలలో ఎలా కల్లోలాన్ని రేపింది చివరికి ఏమైంది తెలుసుకోవాలంటే “స్వామిరారా” సినిమా చూడాలి.


“నాకు నచ్చిన ప్రతి సినిమా నుండీ నేను కాపీ కొడతాను” అని నిర్భయంగా టైటిల్స్ కి ముందే చెప్పిన దర్శకుడు సుధీర్ వర్మ సినిమా అంతా అదే మాట మీద నిలబడ్డాడు. అలాగని ఇదంతా ఎప్పుడో చూసిన సినిమానే కదా అనే ఫీల్ రాకుండా ఒక ఫ్రెష్ లుక్ తో ట్రీట్మెంట్ తో ప్రేక్షకులని కట్టిపడేయడంలో సఫలీకృతుడయ్యాడు.


కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా పాత్రలు సంఘటనలు కూడా క్షణక్షణం, అనగనగా ఒకరోజు, ఇంకా ఇదే జెనర్ లో వచ్చిన కొన్ని ఆంగ్ల చిత్రాలనుండీ సంగ్రహించినా కూడా తనకున్న ఎఫిషియెంట్ టెక్నికల్ టీం సపోర్ట్ తో ఆ మొత్తాన్ని చక్కని కథనంతో పంచ్ ల కోసం ప్రయాస పడకుండా అక్కడక్కడ ఛమక్కుమనిపించే సంభాషణలతో, కథాకథనాలలో కలిసిపోయే సునిశితమైన హాస్యంతో కలిపి ఆద్యంతమూ ప్రేక్షకుడు సినిమాలో లీనమయి చూసేలా చేశాడు.


హ్యాపీడేస్ తర్వాత నిఖిల్ నాకు ఏ సినిమాలోనూ అంతగా నచ్చలేదు. రవితేజ డేట్స్ దొరకని చిన్న నిర్మాతలంతా అతనితో సినిమాలు తీస్తే అతనుకూడా వాళ్ళకు కావలసినట్లు రవితేజని ఇమిటేట్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తూ గడిపేశాడు. మధ్యలో అతను చేసిన “యువత” అండ్ “ఆలశ్యం అమృతం విషం” సినిమాలు కొంచెం పర్లేదనిపిస్తాయి. అయితే ఈ సినిమాలో సుధీర్ తనని పూర్తిగా మార్చేశాడు. సూర్య అన్న దొంగోడి పాత్ర తప్ప నిఖిల్ హైపర్ యాక్షన్ ఏమాత్రం కనిపించదు ఇందులో.

అలాగే స్వాతి కూడా చాలా సటిల్ గా చేసింది, నిజానికి అక్కర్లేకపోయినా బోలెడంత హైపర్ ఎనర్జీతో నటించే హీరో హీరోయిన్లు ఇద్దరినీ కంట్రోల్ చేసిన క్రెడిట్ సుధీర్ కే దక్కాలేమో వీరిద్దరి నటన ఇందులో పాత్రోచితంగా మెచ్చుకోదగినట్లుగా ఉంది. సూర్య ఫ్రెండ్ గా చేసిన పూజ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్ స్వాతి కన్నా ఈ అమ్మాయికే ఎక్కువ ఫూటేజ్ ఉందనిపిస్తుంది.

అలాగే కమెడియన్ సత్యకూడా ఆకట్టుకుంటాడు. సునీల్ హీరోగా స్థిరపడడంతో ఇలాంటి ప్రతిభ ఉన్న మంచినటులంతా వెలుగులోకొస్తున్నారు. ఇక రవిబాబు, అతని బండ అసిస్టెంట్, జీవా, జోగిబ్రదర్స్, సూర్య బాచ్ ని అపుడపుడు కలిసే హోటల్లో పనిచేసే చిన్న కుర్రోడు అంతా పాత్రోచితంగా చేశారు.
 
సన్నీ మ్యూజిక్ లో వెస్ట్రన్ టచ్ ఎక్కువున్నా పాటలు బాగున్నాయి, పాటలన్నీ కూడా సంధర్బానుసారం నేపధ్యంతో  కలిసిపోయి వస్తుంటాయి తప్పించి హీరోహీరోయిన్లు లొకేషన్స్ కి వెళ్ళో భారీ సెట్టింగులేస్కునో పాడుకునే పాటలేం లేవు. సన్నీ సినిమా మూడ్ కి తగినట్లు చేసిన స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ వర్క్ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్రేమింగ్ అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ తో సినిమాకి స్టైలిష్ లుక్ తీసుకొస్తూ చాలా బాగుంది. స్లోమోషన్ లో చిత్రీకరించిన కొన్ని షాట్స్ ఆకట్టుకుంటాయి.

ఈ తరహా చిత్రాలకు థ్రిల్స్ చాలా ముఖ్యం, ఉండీ ఉండీ ప్రేక్షకుల చేత వహ్వా అనిపించి చప్పట్లు కొట్టించగల సీన్లు ఈలలు వేయించగల సీన్లు ఉండడం చాలా అవసరం రెండుగంటల నిడివి ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకులనుండి అలాంటి స్పందనను చాలాసార్లే గమనించాను.


సినిమా చూసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు ఈ క్రింది స్పాయిలర్ బటన్ పై క్లిక్ చేయకండి. దానిలోని కంటెంట్ చదివితే మీకు థ్రిల్ మిస్సవ్వచ్చు. ఫర్వాలేదనుకున్నవాళ్ళు సినిమా చూసే అవకాశం లేనివాళ్ళు క్లిక్ చేసి చదవండి. 


సహజంగా ఇలాంటి సినిమాలకి చేసినట్లు దొంగతనం సీన్ తో సినిమా ఓపెన్ చేయకుండా జోగీబ్రదర్స్ సీన్ తో చేసి ఆ సీన్ ని ప్రేక్షకులు మర్చిపోయే దశలో ఇంటర్వెల్ తర్వాత ఎక్కడో స్క్రీన్ ప్లేలో కలపడం బాగుంది. ఆంగ్ల చిత్రాలతో పరిచయమున్నవారికి ఇది Quentin Tarantino స్టైల్ అని తెలిసే ఉంటుంది.

అలాగే విగ్రహం విలువ గుర్తించే కొద్దీ దాని ధర సున్నానుండి మెల్లమెల్లగా ఎలా పెరుగుతుంది అనేది స్క్రీన్ పై లొకేషన్ ప్లస్ ధర డిస్ప్లేతో చూపించిన విధానం బాగుంది. విగ్రహం కొనేవారు ఆషామాషీగా నోటిమాటమీద నమ్మకం ఉంచినట్లుకాక ఖచ్చితంగా పరీక్ష చేసుకుని కొనడం లాంటి సన్నివేశాలను చూపించడం బాగుంది. రాహుకాలం వర్జ్యం లాంటి నమ్మకాలవలన నష్టంకూడా జరగచ్చంటూ కమెడియన్ సత్యద్వారా అండర్ కరెంట్ గా వేసిన సెటైర్ కూడా బాగుంది.

రొటీన్ లవ్ స్టోరీలు, పాటలు, ఫైట్లతో కలిపి కర్చీఫులు పిండేసే ఎమోషనల్ సీన్స్ లేని సినిమా సినిమానే కాదనుకునే ప్రేక్షక వర్గంలో మీరుంటే మీరీ సినిమా చూడడం వేస్ట్. అలాకాకుండా పెద్దగా కథ ఏమీ లేకపోయినా ఇన్వాల్వ్ చేయగల కథనంతో సునిశితమైన హాస్యంతో ఆకట్టుకునే వైవిధ్యమైన సినిమాలు చూసే అభిరుచి మీదైతే ముఖ్యంగా ఇలా దొంగతానాలు దోపిడీలు అంటూ క్రైం థ్రిల్లర్ కామెడీ సినిమాలు నచ్చే వారైతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకుండా చూడవలసిన సినిమా “స్వామిరారా”


ఆదివారం, మార్చి 24, 2013

గుండెల్లో గోదారి


శ్రీ బాపూ రమణ గార్లు ఆప్యాయంగా సీతారాముడు అని పిలుచుకునే బి.వి.ఎస్.రామారావు గారు దదాపు పుష్కరకాలం గోదారొడ్డున వివిధ ప్రాంతాలలో ఇంజనీరుగా వివిధ హోదాలలో పనిచేశారు. అలా తాను అతి దగ్గరగా గమనించిన జీవన విధానం నుండి విన్నవి కన్నవి ఊహించినవి కొన్ని సంఘటనలను కథలను అన్నిటినీ కలగలిపి ఈ గోదారి కథలు రాశానని చెప్తారు. తను పుష్కరాల రేవులో పుల్లట్లు కథ చెప్పబోతూ ఓ మాటంటారు... “ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగిపోతుంటాయి. తరంగానికి దిగువ మనకి కనపడని మరొక తరంగం ఉంటుంది, ఆ తరంగ శక్తే మనం చూస్తున్న తరంగాన్ని నడిపిస్తుంది. అలాగే మనమెరిగిన వ్యక్తుల జీవితాల వెనుక మనమెరుగని ఎన్నో బాధలూ కథలూ దాగి ఉంటాయి. ఆ సాగే కథలకు పారే గోదారే సాక్షి” అని. ఆ బాధలకు రామారావ్ గారు అక్షర రూపమివ్వడం మనం చాలా కథల్లో గమనించవచ్చు. అసలు వ్యధలేనిదే కథేలేదని ఎవరో పెద్దాయన అన్నట్లుగా ఇందులోని కొన్ని కథలలో కష్టాలు కన్నీళ్ళూ ఎక్కువగా కనిపిస్తాయి, తరచి చూస్తే అవి మనకెదురుపడే కొన్ని జీవితాలలోని కఠిన వాస్తవాలేనని గమనించవచ్చు.

అలాంటి యధార్ధజీవిత చిత్రణ చేసిన కథలలోనుండి రెండు కథలను తీస్కుని కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసిన సినిమానే “గుండెల్లో గోదారి”. ఈ సినిమా చూడాలంటే చాలా ధైర్యం కావాలి నొప్పిని భరించగలిగే శక్తి కావాలి (అది సినిమా చూడడం వలన కలిగే నొప్పా సినిమాలో ఉన్న నొప్పా అని చిలిపి ప్రశ్నలేయడాలు ఇక్కడ లేవు :-)). సినిమా అంటే కేవలం వినోదసాధనం మాత్రమే నిజజీవితంలో ఉన్న కష్టాలు చాలుకదా ఇక్కడ కూడా ఎందుకు అనుకుంటే ఈ సినిమాకి దూరంగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా ఇది స్ట్రిక్ట్ గా పెద్దల సినిమా (A Certificate). రెండు పాటలలో తప్ప మరీ శ్రుతిమించిన సన్నివేశాలు లేకపోయినా మెయిన్ థీం వివాహేతర సంబంధాల గురించి కనుక ఇలాంటి సినిమాకి పద్దెనిమిదేళ్ళలోపు పిల్లలని తీసుకువెళ్ళవద్దని నా సలహా.

ఇక కథ విషయానికి వస్తే గోదారి కథలలోని “గుండెల్లో గోదారి” కథనే మెయిన్ థీంగా ఎన్నుకున్నారు, దానిలోని వాడి(రచయిత ఈకథలో వీరికి పేర్లు పెట్టలేదు అదీ వాడు అనే అంటారు) ఫ్లాష్ బాక్ ని కొంచెం సినిమాటిక్ గా మార్చుకున్నారు. దాని ఫ్లాష్బాక్ గా “పుష్కరాల రేవులో పుల్లట్లు” కథలోని పుల్లమ్మ ఫ్లాష్బాక్ ని కాస్త మార్చి వాడుకున్నారు. పుస్తకం చదవని వారికోసం కథా వివరాలు..


1986 లో ఎగువ గోదారి ప్రాంతాలలో విస్తారంగా కురిసిన వర్షాల వలన గోదారికి అధికమొత్తంలో వరదనీరు వస్తుంటుంది, సరిగ్గా ఇదే సమయానికి ఈ విషయం తెలియని బంగారప్పేట లో మల్లి(ఆది) చిత్ర(మంచు లక్ష్మి)ల పెళ్ళి జరుగుతుంటుంది. ఆ పెళ్ళిలో తాళికట్టే సమయానికి నావలు అద్దెకిచ్చే సాంబశివయ్య గారి కూతురు సరళ(తాప్సి) వచ్చి పెళ్ళికొడుక్కి బంగారపు ఉంగరం చదివిస్తుంది. “అబ్బో అంతదూరం నుంచొచ్చి ఇంత ఖరీదైన బహుమతి చదివిచ్చిందంటే యవ్వారం ఎంత దూరం వెళ్ళుంటదో..” అని ఊళ్ళో వాళ్ళ గుసగుసలు విన్న చిత్ర మనసులో అనుమానం నాటుకుంటుంది. అంతలో రాజమండ్రిలో చిత్ర పని చేసే కంపెనీ యజమాని దొరబాబు(రవిబాబు) వచ్చి చిత్రకి బంగారు గొలుసు చదివిస్తాడు. అది చూసి దొందూ దొందే అని చులకనగా మాట్లాడుకుంటున్న ఊరివాళ్ల మాటలు విని మల్లి మనసులో కూడా అనుమానం మొదలవుతుంది. అలా సందేహాలతోనే పెళ్ళి జరుగుతుంది.

అదే సమయానికి పోలీసులు కోడెం తూము దగ్గర గోదారికి గండి పడిందని ఏ క్షణమైనా బంగారప్పేట మునిగిపోవచ్చని చెప్పి అందరినీ గట్టు మీదకి ఎక్కేయమంటారు. ఊరంతా వెంటనే గట్టువేపు పరిగెట్టినా మల్లి, చిత్ర మాత్రం జనం మాట్లాడుకున్న మాటల గురించి తమ పెళ్ళి ఇలా రసాభసా అవడం గురించి ఎవరి ఆలోచనల్లో వాళ్లుంటారు, మంటపం చుట్టూ చేరిన వరదనీరు చింది మొహం మీదపడ్డంతో తేరుకున్న ఇద్దరూ కష్టపడి ఒక గడ్డిమేటు మీదకి చేరతారు, అది చుక్కాని లేని నావలా గోదారి వరద నీటిలో పడి కొట్టుకుపోతుంటుంది. ఎలాగూ చావబోతున్నాము కదా అని కట్టుకున్నవాళ్ళకి నిజం చెప్పి చావాలని నిశ్చయించుకుని ఒకరికొకరు తమ గతం గురించి చెప్పుకుంటారు, ఆ గతం ఏమిటి దొరబాబు, సరళ వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చారు, ఆ గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చారు, అసలు వాళ్లని వరద గోదారి తనలో కలిపేసుకుందా లేకా ఒడ్డుకు చేర్చిందా లాంటి వివరాలు తెలుసు కోవాలంటే గుండెల్లో గోదారి సినిమా చూడాలి.

సినిమాకి ఒక బలం కాస్టింగ్, పాత్రలే తప్ప నటీనటులు ఎక్కడా కనిపించరు. మల్లి పాత్రలో ’ఆది పినిశెట్టి’ ఒదిగిపోయాడు తన తీరైన ఫిజిక్ తో, మంచితనం మూర్తీభవించిన అమాయకపు జాలరి యువకుడిగా చక్కని పల్లె యాసతో అలరిస్తాడు. సూరి పాత్రలో సందీప్ ని చూస్తే రొటీన్ లవ్ స్టోరీ లో చేసిన హీరో ఇతనేనా అనిపిస్తుంది కోడిపందాలపై అమితమైన ప్రేమను పెంచుకున్న పల్లెటూరి యువకుడు మాత్రమే కనిపించాడు, ఇతని డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. లంగా ఓణీలు, రంగు రంగుల బొట్టు బిళ్ళలు, కళ్ళకు కాటుక, ఓ సారి ఇంత పెద్ద ముద్దబంతిపువ్వు ఇంకోసారి అంత గుప్పెడు కనకాంబరాలు జడలో తురిమి కాస్త పెద్దింటి పల్లెపడుచులా తాప్సీ చక్కగా ఆకట్టుకుంటుంది, తను ఈ సినిమాలో వేసిన పాత్ర మరెవరూ చేయలేరేమో అనిపించేట్లు చేసింది.


మంచు లక్ష్మి కాస్త మిస్ ఫిట్ ఈ సినిమాకి. అప్పటికీ నటన విషయంలో డైలాగ్ డెలివరీ విషయంలో చాలా కష్టపడింది కానీ ఆకష్టం తెరమీద కనిపిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతుంది. కొన్ని సీన్స్ లో బాగానే అనిపించినా కొన్ని షాట్స్ లో మాత్రం హీరోలిద్దరిపక్కనా చాలా పెద్దదానిలా కనిపించింది అయితే దర్శకుడు కుమార్ చిన్నప్పటి మంచులక్ష్మి, సూరి పాత్రలు ఎన్నుకోవడంలో కూడా అమ్మాయిని అబ్బాయికన్నా కొంచెం వయసులో పెద్దగా ఉండేట్లు ఎన్నుకోవడం ద్వారా కంటిన్యుటీ దెబ్బతినకుండా చూస్కోడం నాకు నచ్చింది. తాప్సీ పాత్రనుద్దేశించి రివ్యూవర్స్ అందరూ ఎనభైలలో అమ్మాయిలందరూ ఇంత ఫాస్టా అని అన్నారు.. అయి ఉండకపోవచ్చు ఏ కోటికొక్క అమ్మాయో అలా ఉండి ఉండచ్చు అలాంటి సరళ కథే ఈ సినిమాలో చూపించారు అని సర్దుకుపోవాలి. ఆమాటకొస్తే తనకి పూర్తి వ్యతిరేకంగా మరో హీరోయిన్ చిత్ర పాత్ర ఉంటుంది కనుక అప్పట్లో అమ్మాయిలందరూ చిత్రలాగే ఉండి ఉంటారని కూడా అనుకోవచ్చు కదా కానీ “విమర్శకుల” కంటికి చిత్ర కనిపించదు. మల్లి కుటుంబానికి దూరపు బంధువుగా చిత్ర పక్కింటిలో ఉండే మనిషిగా పెద్ది పాత్రలో అన్నపూర్ణమ్మ గారు నటించారు తన పాత్ర బాగుంది కూతురు కాపురం గురించి చెప్పిన డైలాగులు బాగున్నాయ్. జీవా, రవిబాబు, తర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పట్టాభి కూడా చక్కగా నటించారు.

సినిమాకి పని చేసిన టెక్నికల్ టీం అంతా మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ఎనభైలలో వాతావరణాన్ని కాస్ట్యూంస్ తో సహా చాలా జాగ్రత్తగా చిత్రీకరించడంలో ఆర్ట్ ఽ కాస్ట్యూంస్ ఇద్దరిని మెచ్చుకోవాలి వారినుండి అలాంటి ఔట్ పుట్ రాబట్టిన దర్శకుని ప్రతిభని కూడా మెచ్చుకోవాలి. సినిమాలకు సాధారణంగా వాడే ప్లాస్టరాఫ్ పారిస్ కాకుండా పల్లె సెట్ అంతా సహజంగా ప్రకృతిలో కలిసిపోయే మెటీరియల్ తో ఎకో ఫ్రెండ్లీగా నిర్మించడం నాకు బాగా నచ్చింది. అంత వరద బీభత్సంలోనూ హాస్య చతురతని వీడకుండా జోకులేస్కోడం పశువులని కూడా ప్రేమతో కాపాడే ప్రయత్నం చేయడం లాంటి పల్లెప్రజల స్వచ్చతని కాప్చర్ చేసే సన్నివేశాలతో దర్శకుడు స్క్రిప్ట్ చక్కగా రాసుకున్నారు. ఫళని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది వరద భీభత్సాన్ని నైట్ ఎఫెక్ట్ లో బాగా కాప్చర్ చేశారు, స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయ్. కానీ సినిమా నేపధ్యం వలననేమో పచ్చదనంతో నిండిన గోదారి జిల్లాల అందాలు కాస్త తక్కువే కనిపించాయి అనిపించింది.
 
సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఇళయరాజా గారి సంగీతం. సంధర్భానుసారంగా చేసిన పాటలు ఎనభైలలో వచ్చిన సంగీతాన్ని గుర్తు చేస్తూ సినిమా నేపధ్యానికి తగినట్లుగా చక్కగా అమిరాయి. “గుండెల్లోగోదారీ పొంగి పొరలుతోందీ” పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా జాలర్ల గురించిన నేపధ్యంతో హాయిగా సాగుతుంది. “నను నీతో నిను నాతో” పాట మంచి మెలొడీ చిత్రీకరణ కూడా బాగుంది. “ఎక్కడుంది ఎక్కడుంది నాకోడి” కోడి పందాల గురించి వాటిని చంటిపిల్లల్లా ఎలా సాకుతారో చెప్తూ సరదాగా సాగిపోయింది. “జిల్లుమంది జిల్లుమంది వయసు” ఎనభైలలో వచ్చిన కొన్ని పాటలను గుర్తు చేస్తాయి సరళ కారెక్టరైజేషన్ ని పట్టి చూపించేట్లు అనంత శ్రీరాం బాగా రాశారీ పాట. ఐటం సాంగ్స్ లో “వెచ్చాని వయసుందిరా” పాత ట్యూనే కనుక మాంచి బీట్ తో ఆకట్టుకుంటుంది. ఇక నేపధ్య సంగీతంలో “బంతీ చామంతీ”, “ఏలేలమ్మా ఏలేలమ్మ హోయ్.. అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చేనూ”, “ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మో” లాంటి పాటలని ఇళయరాజా చక్కగా ఉపయోగించారు. లేట్ ఎయిటీస్ లో టీనేజ్ చూసిన వాళ్ళకి ఈ సినిమా ఒక మాంచి నాస్టాల్జిక్ ఫీల్ ఇస్తుందనడంలో ఏ సందేహం అక్కర్లేదు.

ద్వితీయార్ధంలో వచ్చే చిత్ర ఫ్లాష్బాక్ ఎనభైలలో ముత్యాల సుబ్బయ్య, క్రాంతికుమార్ సినిమాలలో మహిళలు అనుభవించే సినిమా కష్టాలను మనముందుంచి కొంచెం ఇబ్బందిపెట్టచ్చు కానీ కథ అదే కనుక యాక్సెప్ట్ చేసేయచ్చు. సినిమా నిడివి రెండుగంటలు మాత్రమే కనుక ఈ సన్నివేశాలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు. సాధారణంగా చెప్పాలనుకున్న కథనుండి డీవియేట్ అవకుండా ఒక కన్విక్షన్ తో తెరకెక్కించిన చిత్రాలు తెలుగులో రావడం చాలా అరుదు ఆ విషయంలో దర్శకుడు కుమార్ నాగేంద్రన్ ని నిర్మాత మంచు లక్ష్మినీ తప్పక అభినందించి తీరాల్సిందే. నిర్మాణంలో ఎన్ని కష్టాలెదురైనా తననుకున్నట్లు నిర్మించడంలో మంచు లక్ష్మి విజయవంతమయ్యారు. మీరు వైవిధ్యమైన తెలుగు సినిమాలను కోరుకుంటూ సహజత్వాన్నీ, టఫ్ అండ్ పెయిన్ ఫుల్ స్టోరీస్ నీ భరించగలిగే శక్తి ఉంటే కనుక ఒక్కసారైనా చూడాల్సిన సినిమా గుండెల్లో గోదారి.

బుధవారం, మార్చి 13, 2013

భయం !!

చేస్తున్న పని ఆపి వేళ్ళు విరుచుకుంటూ సిస్టం ట్రే లో టైం చూశాను 1.36 AM.

దదాపు గంటనుండి నిరంతరాయంగా మోగుతున్న ఇళయరాజా ప్లేలిస్ట్ ని పాజ్ చేసి రెండు చెవుల్లోనుండి ఇయర్ ఫోన్స్ తీసి తలతిప్పి గదిలో నాలుగు పక్కలకి చూశాను.. లోయస్ట్ బ్రైట్ నెస్ సెట్టింగ్ లో లాప్ టాప్ స్క్రీన్ నుండి వస్తున్న వెలుగు ఒక ప్రొజెక్టర్ లైట్ లా నా వెనక తెల్లని గోడ మీద నలుచదరంగా పలచగా పరచుకుంది..

స్క్రీన్ కి ఎదురుగా కూర్చున్న నానీడ గోడపై ఆ వెలుగులో అస్పష్టంగా తెలుస్తుంది. నేను తల తిప్పి తన వైపు చూడడంతో నానీడ కూడా తలతిప్పి నన్ను పరికించి చూస్తున్నట్లు అనిపించింది.

ఇంకానయం గదిలో ఎవరూ లేరు ఎవరైనా ఈపాటికే పడుకుని ఉంటే నిద్రలో సడెన్ గా కళ్ళు తెరచి నానీడని చూస్తే దెయ్యమని భయపడే వారేమో అనిపించింది.

ఇంత చీకటిలో లాపీతో పని చేయకూడదు అంటారు కదా అనుకుంటూ తిరిగి లాప్టాప్ వైపు చూశాను స్క్రీన్ వెనక టేబుల్ పై మిణుకు మిణుకుమంటున్న నైట్ లాంప్ తన అస్థిత్వాన్ని తెలియజేయడానికి అష్టకష్టాలు పడుతుంది.

“ఈ ట్యూబ్ లైట్ రిపేర్ అయ్యేవరకూ ఒక చిన్న CFL బల్బ్ అన్నా పెట్టుకోవాలి రేపటినుండి” అనుకున్నాను.

తలతిప్పి కిటికీలోనుండి బయటకి దృష్టి సారించాను, అమావాస్యేమో చిక్కని చీకటి, బిగించిన తలుపుల అద్దాల బయట కాస్తంత వెలుతురు కూడా కనపడలేదు. స్క్రీన్ వెలుతురు చూడడానికి అలవాటు పడిన కళ్ళు చీకటికి అలవాటు పడడానికి టైం తీస్కుంటున్నట్లున్నాయ్. ఒక సారి కళ్ళు మూసి తెరిచాను. గదిలోపల బయట కూడా చీకటి... నేను నా గదిలో కాక అనంతమైన శూన్యంలో కూర్చున్నానా అనిపించేట్లు చుట్టూ నల్లటి చీకటి తప్ప ఇంక వేరే ఏమీ కనపడడం లేదు. 

“అవునూ అదేంటి బయట వీధి దీపాల వెలుగు కొంచమైనా కనిపించాలే బొత్తిగా ఏం లేదేంటి?”

“ఏదైనా ప్రాబ్లం వలన వెలగట్లేదా లేక ఏ దొంగోడో వీధి దీపాలు పగల గొట్టాడా ??”

“ఈ ఏరియాలో దొంగతనాలు అంతగా జరగవులే.. అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం ఎందుకైనా మంచిది.”

“ఏంటో ప్రశ్నా జవాబూ రెండూ నావేనా ? ఇవే బయటికి వినిపించేట్లు పెద్దగా మాట్లాడితే నన్ను పిచ్చోడనుకుంటారేమో.. అదీ ఈ టైంలో నాలోనేను మాట్లాడుకోడం చూస్తే ఏ దెయ్యమో పూనిందనుకుంటారేమో !!”

“అబ్బా ఏంటో ఎంత కాదనుకున్నా ఈ దెయ్యాల ఆలోచనలు మాత్రం రాకుండా ఉండవు కదా.. ఇంత రాత్రిపూట వాటి గురించి ఎందుకులే కానీ దొంగల గురించి ఆలోచిస్తే బెటరేమో..” 

“ఆగాగు... ఆ శబ్దం ఏంటి??” మరో సారి జాగ్రత్తగా చెవులు రిక్కించి విన్నాను. ఎక్కడినుండో లీలగా సన్నగా మ్మ్..మ్మ్...మ్....మ్.మ్.మ్.మ్.... అని వినిపిస్తుంది. 

“ఎవరిదో మనిషి మూలుగులాగా ఉంది కదా..”

“కానీ అంత చిన్నగా వినిపిస్తుందంటే... మనిషి కాదేమో మరైతే ఏంటి ?? దెయ్యమా !!

“ఛఛ అయి ఉండదు అదైతే ఇలా ఎందుకు భయపెడుతుంది.. డైరెక్ట్ గా అరిచి గీపెట్టి భయపెట్టచ్చు కదా.”

“మురళి చెప్పిన దెయ్యమేదో ఉంది ఏంటది మిమిక్రి దెయ్యం.. హా.. జాకర్ దెయ్యం కదా అది ఇలాగే చిన్న పిల్లలని జంతువులని అనుకరించి అరుస్తుందని అన్నారు కదా.”

“ఇపుడొచ్చింది అదేనేమో.. బయట నుండి అరుస్తుందేమో నేను భయపడి దాన్ని చూశాక నన్ను పట్టేసుకుంటుందేమో !! ఇపుడెలా..”

“ఆ మనవన్నీ అనవసర భయాలు దెయ్యాలు లేవ్ భూతాల్ లేవ్.”

“ఒకవేళ ఇంట్లోనే ఎవరైనా..!!” సందేహం వచ్చినదే తడవు భయాలనన్నిటినీ పక్కకి తోసేసి ఒక్కుదుటున లేచెళ్ళి ఇంట్లో నిద్ర పోతున్న మిగతా కుటుంబ సభ్యులనందరిని చెక్ చేశాను. అందరూ ప్రశాంతంగా పడుకుని ఉన్నారు ఏ డిస్ట్రబెన్సూ లేకుండా. కుదుటపడిన హృదయంతో హాల్  లోకొచ్చి చుట్టూ చూశాను. కాషాయ వర్ణంలో బెడ్ లైట్ కాంతి హాలంతా పరుచుకుని ఉంది.

డైనింగ్ ఏరియాకి ఒక మూల గోడకి దగ్గరగా నాలుగడుగుల ఎత్తున్న సన్నని వెలుగు రేఖ అర ఇంచి వెడల్పు ఉంటుందేమో ఉన్నచోట ఉన్నట్లే అలలు అలలు గా కదులుతూ కనిపించింది. దాని చుట్టూ ఒక అరడుగు మేర ఒక అరా లాగా క్లౌడ్ లా పలచని వెలుతురు పరుచుకుని ఉంది. అందులో కూడా ఏవో అస్పష్టంగా కదులుతున్నట్లు అనిపించింది.

ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది... వెన్ను లోపల సరసర ఏదో పాకినట్లనిపించింది... పొద్దున్న చంపిన కాళ్ళ జెర్రి గుర్తొచ్చింది, రోజు మస్కిటో బాట్ తో పదుల సంఖ్యలో చంపే దోమలు గుర్తొచ్చాయ్. వాటికి కూడా ఆత్మలు ఉంటాయా వాటిల్లో ఒకటేనా ఇపుడు నా మీద పగ దీర్చుకోడానికి వచ్చింది. నాకాళ్ళు బలహీనమవడం తెలుస్తుంది పడిపోతానేమో అనిపించింది ఓ క్షణం. 

“అవునూ మల్లాది తన పుస్తకంలో ఆత్మల సూక్ష్మ శరీరం రెండంగుళాలు ఉండచ్చని రాశాడు కదా మరి ఇదేంటి ఇంచుమించు నాలుగడుగుల ఎత్తు ఉందీ”... 

“అంటే కొంపదీసి ఆత్మల కాలనీనా ? అందుకే అలా ఉన్నచోటే నిట్ట నిలువుగా అలలా కదులుతున్నాయా ఆత్మలన్నీ కలిసి ఒకదానితో ఒకటి కొట్టుకుని తిరుగుతూ అల్లరి చేస్తూ... నా భయాన్ని చూసి నవ్వుకుంటూ గెంతులేస్తూ ఉన్నాయా ??  అందుకేనా ఆ కదలికలు.. ” 

“అయ్యో రామా!! ఇపుడేం చేయాలి ?? హా.. రాముడు.. ఆంజనేయ దండకం చదివితే బెటరేమో కానీ రాదే.. పోనీ వచ్చిన హనుమాన్ చాలీసా చదువుదాం..”

“ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం..
లోకాభిరామం శ్రీరామమ్ భూయో భూయో నమామ్యహం.....”

ఓ కన్ను ఓరకంట తెరచి చూసి “హ్మ్ వాటి పొజిషన్ లో ఏమార్పూ వచ్చినట్లు లేదే... పోనీ లైటేసి చూద్దామా.. కానీ స్విచ్ బోర్డ్ అక్కడెక్కడో ఉంది కదా.. అక్కడికి వెళ్ళే లోపు దాడి చేస్తే...”

“హా ఐడియా.. దగ్గరలో ఫ్రిజ్ డోర్ ఉంది కదా ఒక్క అంగలో అందేస్తుంది దాన్ని తెరిస్తే లైటొస్తుంది.. అపుడేమవుతుందో చూద్దాం..”

చూపు ఆ వెలుగు రేఖమీదే ఉంచి రెప్పవేయకుండా అటే చూస్తూ ఫ్రిజ్ వేపు ఒకడుగు వేసి డోర్ పట్టుకుని చప్పుడు కాకుండా మెల్లగా లాగాను... డోర్ తెరుచుకునే కొద్దీ ఆ వెలుగు రేఖ పెద్దదవడం మొదలెట్టింది. నాకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్ధంకాలేదు. భయమేసి తలుపు మూసేశాను అలికిడికి అనుకుంటాను ఆత్మల కాలనీ మాయమైంది బెడ్ లైట్ వలన పరుచుకున్న పలచని కాంతి తప్ప అక్కడ ఏం లేదు.

“అవునూ ఫ్రిజ్ డోర్ ఇంత సులువుగా ఓపెన్ ఐపోయిందేంటి కాస్త బలం ఉపయోగించి లాగాల్సి వస్తుంది కదా” అని ఆలోచిస్తూ మళ్ళీ తలుపు కొంచెం తీశాను వెంటనే ఆత్మల కాలనీ మళ్ళీ ప్రత్యక్షమైంది.

అప్పటికి అర్ధమైంది అప్పటి వరకూ నన్ను భయపెట్టిన ఆత్మల కాలనీ మరేదోకాదు సరిగా మూస్కోని ఫ్రిజ్ తలుపు సందులోనుండి గోడమీద పడుతున్న ఫ్రిజ్ లైట్ మాత్రమే అని.

హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకుని “ఎంత భయపెట్టింది రా” అనుకుంటూ కాసిని మంచినీళ్ళు తాగి తిరిగి బెడ్ రూంలోకి వచ్చాను. లాపీ స్లీప్ మోడ్ లోకి వెళ్ళడంతో చీకటి మరింత చిక్కబడింది. అప్పటి వరకూ మర్చిపోయిన మూలుగు మళ్ళీ వినిపించడం మొదలైంది.
ధైర్యాన్ని మింగేస్తూ భయమ్ బయట పడడం మొదలైంది.. పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.

వేగంగా ఆలోచించడం మొదలెట్టాను..

“దెయ్యాలు అన్నీ ట్రాష్.. ఇప్పుడే హాల్లో చూశాను కదా ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది..”

“అమాయకుడా అదే నిజమైతే ఈపాటికే విషయం అర్ధమై ఉండేది కదా.. ఇది ఖచ్చితంగా ఏదో అదృశ్య శక్తి పనే..”

“అదృశ్య శక్తీ లేదు ఆవకాయ బద్దాలేదు లెట్ మీ ఫైండౌట్..”

నా ఫోకస్ అంతా దానిమీదే ఉండడం వలననేమో సీలింగ్ కి తిరుగుతున్న ఫాన్ చేసే బర బర గర గర చప్పుళ్ళని సైతం అధిగమిస్తూ స్పష్టంగా వినిపిస్తుంది.. కానీ అదేమిటో అర్ధం కావట్లేదు.. ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ లో వినిపిస్తుందంటే ఏమై ఉంటుందో “పోనీ కిటికీ తెరచి సౌండ్ పెద్దదవుతుందేమో చూద్దామా అసలు లొకేషన్ ఐడెంటిఫై చేయచ్చు” అనిపించింది.

“కానీ ఒక వేళ అది కిటికీ బయట దాడి చేయడానికి సిద్దంగా ఉండి ఉంటే ??”

“ఊచలు అడ్డంగా ఉన్నాయ్ గా ఏమీ కాదులే తీసి చూడు” భయపడుతూనే చేత్తో మెల్లగా కిటికీ తలుపుని నెట్టాను.
కర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్... మని చప్పుడు చేస్తూ కిటికీ కొద్దిగా తెరుచుకుంది చల్లని గాలి ఒక అలలా మొహానికి కొట్టింది.

“అయిపోయింది ఆ వచ్చింది దెయ్యమే అయి ఉంటుంది అందుకే అంత చల్లగా తగిలింది.. ఇక రేపట్నుండి నీ పిచ్చి చేష్టలు బిగిన్.. న్యూస్ లో కూడా వచ్చేస్తావేమో..”

“నీ మొహం మండా.. బయట వాతావరణం చల్లగా ఉందిరా కావాలంటే చూడు ఇంకా చల్లగాలి వస్తూనే ఉంది. ముందు సౌండ్ ఏమైనా మారిందేమో గమనించు...”

“ఏం మారలేదు.. అంటే సమస్య ఎక్కడో ఇంట్లోనే అనమాట.. కిటికీ వేసేసి ఒక సారి ఫాన్ ఆపి చూద్దాం ఒక వేళ ఫాన్ నుండి వస్తుందేమో ఆ సౌండ్..”

ఫాన్ ఆపేశాక మరింత స్పష్టంగా.. పిక్స్డ్ ఇంటర్వెల్స్ లో పదే పదే మళ్ళీ వినిపిస్తుంది. ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్లున్న సౌండ్.. రూం అంతా ప్రతిద్వనిస్తుంది కానీ ఎక్కడ మొదలవుతుందో అర్ధంకావడంలేదు.. 

ఏం చేయాలో అర్ధంకాక చుట్టూ చూస్తున్నాను.. డెకొరేటివ్ కాక్టస్ నైట్ లాంప్ లోనుండి బ్లూ, ఎల్లో, ఆరెంజ్ రంగుల్లో పలచని వెలుతురు రూంలోని గోడలపై ఒకదాని తర్వాత ఒకటిగా పరుచుకుంటూ వింత పాటర్న్స్ సృష్టిస్తున్నాయి.

ఏదో అర్ధమయినట్లు అనిపించింది. నైట్ లాంప్ హౌసింగ్ అంతా పకడ్బందీగా ఏమీ మూవింగ్ పార్ట్స్ లేకుండా ఉంది.. కాని.. దానిని పరీక్షగా చూస్తే లోపల ఒక చిన్న కలర్ డిస్క్ తిరుగుతూ కనిపించింది... ఈ వచ్చే సౌండ్ ఆ డిస్క్ దేనికో తగులుతుంటే రాపిడి వల్ల వస్తున్న సౌండా అని అనుమానం వచ్చింది. వెంటనే లాంప్ ఆపేసి చూశాను. సౌండ్ ఆగిపోయింది. ఒక నిముషం ఆగి లాంప్ మళ్ళీ వేశాను.. కొన్ని సెకన్ల తర్వాత అదే పాటర్న్ తో మళ్ళీ రిపీటెడ్ గా మ్.మ్.మ్మ్మ్మ్..మ్.మ్.మ్.మ్ అని సౌండ్ రావడం మొదలెట్టింది.

డెకొరేటివ్ పీస్ బాగుందని చాలారోజుల తర్వాత నిన్ననే ఆ లాంప్ ని అల్మారాలోనుండి తీసి ఉపయోగిస్తున్నాను అన్న విషయం గుర్తొచ్చింది. భయం మంచులా కరిగిపోయింది. పెదాలపై చిరునవ్వు మొలిచింది.

హోరి దీంతస్సదియ్యా భలే భయపెట్టాయి రెండూ అనుకుంటూ పడుకుని ఎందుకో కిటికీ బయటకి చూశాను. చీకటికి బాగా అలవాటు పడ్డ కళ్ళకి కిటికీ అవతల వీధిలైట్ల వెలుతురు పలచగా కనిపించింది...
చిరునవ్వు నవ్వుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయాను. 

~*~*~*~
  
నోట్ :: మొన్న అమావాస్య రోజు పదినిముషాల వ్యవధిలో జరిగిన రెండు చిన్న సంఘటనలని ఆధారంగా చేస్కుని సరదాగా మిమ్మల్ని భయపెట్టాలని చేసిన నా మొదటి ప్రయత్నమిది. :-) 

ఈ సబ్జెక్ట్ పై అమితమైన ఆసక్తి ఉన్న ఒక ప్రియమిత్రునికి నివాళి ఈ టపా.

గురువారం, మార్చి 07, 2013

బలరామ్మూర్తి అంకుల్


కొన్ని అనుబంధాలు ఎలా ఎందుకు ఏర్పడతాయో అస్సలు చెప్పలేం ఏ జన్మలోని ఋణానుబంధమో ఏ బంధుత్వం లేకపోయినా ఈ జన్మలో కూడా స్నేహం రూపంలో కొనసాగుతూ ఉంటాయి అనిపిస్తుంటుంది. అలాంటి అనుబంధమే మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు బలరామ్మూర్తి అంకుల్ ది మాదీనూ. మా ఈ అనుబంధం వయసు దదాపు పాతికేళ్ళు. మొదట్లో అమ్మవాళ్ళ ఆఫీస్ కొలీగ్ గా పరిచయమై మెల్లగా మా ఇంట్లో చిన్నా పెద్దా అందరికీ కూడా ఆత్మీయ మిత్రులై ఒక పెద్దదిక్కుగా క్రమం తప్పకుండా మా అందరి మంచి చెడ్డలు వాకబు చేస్తూ  నా స్కూల్ డేస్ నుండి కూడా నేను సాధించిన ప్రతి చిన్న విజయానికి అభినందిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మా అందరి జీవితాల్లో తనో ముఖ్యపాత్ర పోషించి స్నేహానికి నిర్వచనంలా మెలగిన మనిషి.

అమ్మ చనిపోయాక మూడేళ్ళ క్రితం నాన్నగారి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నప్పటినుండి ఐతే “మీ నాన్నగారికి దగ్గరే ఉండి కాసిని కబుర్లు చెప్తూ ఉంటే హాపీగా ఉండి తొందరగా కోలుకుంటారు వేణూ.. ఆయనకి అలా ఇష్టం” అని అంటూ క్రమం తప్పకుండా ప్రతి వారం ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళేవారు. నాన్నగారు త్వరగా కోలుకోవడంలో ఆయన పాత్రకూడా చాలా ఉంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకసారి కనిపించి క్షేమ సమాచారాలు కనుక్కునే పలకరింపుకు ఇంత శక్తి ఉంటుందా అని ఆశ్చర్యపోయేవాడ్ని. ఇంట్లో విషయాలు ఎక్స్చేంజ్ చేస్కుంటూ.. రాజకీయాలు, ఆఫీస్ కబుర్లు పంచుకుంటూ ఉండే వాళ్ళ కబుర్లు వింటూ ఉండడం నాకు భలే ఇష్టం దదాపు గత ఏడాదిగా నేనూ ఇక్కడే ఉండడంతో మరింత దగ్గరగా చూస్తూ గమనించే అవకాశం కలగడమే కాక నాకు కూడా బాగా అలవాటయ్యారు.

మా అంకుల్ ఆహార్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఎప్పుడూ ఇస్త్రీ మడత నలగని లైట్ కలర్ డ్రస్సులు అపుడపుడు డార్క్ కలర్ పాంట్ వేస్కుంటారు కానీ షర్ట్ మాత్రం ఎపుడూ వైట్ / క్రీం, జోబులో ఒక పెన్ను ఖచ్చితంగా ఉండేది, గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాలు, చక్కగా దువ్విన క్రాఫ్ తో చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు, ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా మాసిన గడ్డంతో చూడలేదు ఆయనను. గేర్ బళ్ళు నడపడం నావల్ల కాదయ్యా అంటూ ఒకప్పుడు లూనా మీదా, తర్వాత స్కూటీ మీద తిరిగేవారు. ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటారో మాట్లాడితే అంత పసిపిల్లాడిలా సరదాగా మనతో కలిసిపోతారు జోకులేస్తూ నవ్విస్తూ తను చెప్పే కబుర్లు వింటూంటే ఎన్ని గంటలైనా తెలిసేది కాదు. ఎప్పుడైనా రాజకీయ నాయకుల మీద కావాలని తెచ్చిపెట్టుకున్న కోపం తప్ప తను పరుషంగా మాట్లాడగా కూడా నేను ఇప్పటివరకూ చూడలేదు.

ఆయనతోనే కాదు మా రెండు కుటుంబాల మధ్య కూడా చక్కని స్నేహం అమరింది. ఏ అకేషనూ లేకుండానే మీరోరోజు భోజనానికి రావాలని పట్టుపట్టి ఆయనకి బాగా ఇష్టమైన రెండు మూడు నాన్వెజ్ వెరైటీలతో భోజనం పెట్టేవారు. మా అంకుల్ కి నాన్వెజ్ వంటలు అంటే చాలా ఇష్టం, అసలు నాన్వెజ్ ఎలా తినాలో ఆయన్ని చూసే నేర్చుకోవాలి. “ఏం తిండయ్యా అది ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటారు” అంటూ కొసరి కొసరి వడ్డించేవారు. పాపం మా ఆంటీ కూడా శ్రమ అనుకోకుండా మాకోసం చక్కగా వండి పెట్టేవారు. మేము అందరమూ ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసిపోడానికి ఆయన స్నేహశీలతే కారణం. నేను వైజాగ్ లో ఇంజనీరింగ్ జాయినైనపుడు అక్కడే పెయింట్స్ బిజెనెస్ లో ఉన్న వారి రెండో అబ్బాయి నన్ను తరచుగా కలుస్తూ ధైర్యం చెప్పి ఉండకపోతే కనుక రాగింగ్ తట్టుకోలేక వదిలేసి వచ్చి ఉండేవాడ్ని.


మానుండి ఏమీ ఆశించకుండా ఇంతటి ప్రేమాప్యాయతలను పంచి ఇచ్చిన మా బలరామ్మూర్తి అంకుల్ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి వృద్దాప్యం వలన వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తిరుగుతూ తిరుగుతూనే తన డెబ్బై నాలుగవ ఏట మొన్న భీష్మ ఏకాదశి (ఫిబ్రవరి 21) రోజున హఠాత్తుగా స్వర్గస్తులయ్యారు. ముగ్గురు రత్నాల్లాంటి అబ్బాయిలని చక్కగా సెటిల్ చేసి పెద్దమనవరాలికి నాలుగు నెలల క్రితమే తన చేతులమీదుగా పెళ్ళి చేసి ఎవరితోనూ చేయించుకోకుండా దివ్యమైన రోజున అనాయాస మరణాన్ని పొందడం ఆయన చేసుకున్న పుణ్యఫలమే అని ప్రస్తుతానికి సర్ది చెప్పుకుని తృప్తి పడుతున్నాము. కానీ మనిషి ఆశాజీవి కదా... ఆయన ఆరోగ్యంగానే ఉన్నారుగా మరో రెండు మూడేళ్ళు ఉండుంటే మునిమనవడ్ని కూడా ఎత్తుకునేవారు కదా అనీ అనిపించక మానట్లేదు.

కొన్నాళ్ళ క్రితం ఒక రెండు రోజులు బెంగళూరులో తనకాతిధ్యం ఇచ్చే భాగ్యం దక్కింది కానీ ఆయన అనుకున్నట్లుగా నా ఇంట్లో ఒక వారం రోజులు ఆతిధ్యమిచ్చి మైసూరు పుట్టపర్తితో సహా బెంగళూరు పరిసరాలన్నీ చూపించాలనే కోరిక మాత్రం తీర్చుకోలేక పోయాను.  నా వరకూ అయితే నాకు ఆసరా ఇచ్చే మరో పెద్దదిక్కుని కోల్పోయానని దిగులుగా ఉంది. ఇంకా అపుడపుడు గుమ్మం బయట నుండి వేణూ అని పిలుస్తూ లోపలకి వస్తున్నట్లే అనిపిస్తుంది, మా నాన్నగారి పక్కన కూర్చుని ఆయన చెప్పే కబుర్లు వింటున్నట్లే అనిపిస్తుంది కానీ ఆ స్వరం వినపడదు వారానికి ఒకసారైనా నవ్వుమొహంతో ఆత్మీయంగా పలకరించే ఆయనా కనపడరు నేను మాత్రం మరో దీర్ఘమైన నిట్టూర్పు విడిచి జీవితం కొనసాగిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా మా బలరామ్మూర్తి అంకుల్ ఆత్మ శాంతించాలనీ... ఆయన మంచితనం ఆయన కుటుంబానికి అండగా ఉండి వారంతా ఎపుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన ఆత్మ శాంతికై మీరూ ప్రార్ధించండి.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.