అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

సోమవారం, అక్టోబర్ 01, 2018

నవాబ్...

ఎక్కడనుండో వలస వచ్చిన ఒక అనామకుడిగా మొదలుపెట్టి చిన్న సైజు సామ్రాజ్యాన్ని స్థాపించుకుని రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) కి ముగ్గురు పిల్లలు. పెద్దకొడుకు వరద(అరవింద్ స్వామి) తండ్రి దగ్గరే ఉంటూ ఆయనకి దళపతిలా పనిచేస్తుంటాడు. రెండవ వాడు త్యాగు (అరుణ్ విజయ్) దుబాయ్ లో తన దందాని నిర్వహిస్తుంటాడు. మూడవ వాడు రుద్ర(శింబు) సెర్బియా లో అక్రమ ఆయుధ రవాణా చేస్తుంటాడు.

ఒక బాంబు దాడిలో దెబ్బతిన్న తండ్రిని చూడడానికి వచ్చిన ముగ్గురు కొడుకుల మధ్య తండ్రి తర్వాత వారసత్వం ఎవరిది అనే చర్చ మొదలవుతుంది. ఆ చర్చ దేనికి దారితీసింది, భూపతి సంపదకి పవర్ కి వారసత్వం కోసం జరిగిన పోరులో ఎవరు గెలిచారు, ఈ మొత్తంలో వరద బెస్ట్ ఫ్రెండ్ అయిన ఓ కరప్ట్ పోలీసాఫీసర్ రసూల్(విజయ్ సేతుపతి) పాత్ర ఏంటి అనేది తెలుసుకోవాలంటే "నవాబ్" చిత్రం చూడాలి.

మణిరత్నం ఒకప్పటి క్లాసిక్స్ సరసన నిలవకపోవచ్చేమో కానీ ఆయన ఈ మధ్య తీసిన చాలా సినిమాలకన్నా చాలా బావుందీసినిమా. కథనుండి ఎక్కడా డీవియేట్ కాకపోవడంతో ఎంటర్టైన్మెంట్, పేస్ కాస్త అటూ ఇటూ అయినట్లు అనిపించవచ్చు కానీ సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, ఏ.ఆర్. రహ్మాన్ నేపధ్య సంగీతం, మణిరత్నం టేకింగ్ మనల్ని కట్టి పడేస్తాయి.

ఒక సీరియస్ కథ చెప్పాలనుకున్నపుడు ఇలా చెప్పడమే సరైన పద్దతని నాకనిపించింది అలాగే క్లైమాక్స్ కొందరికి థ్రిల్లింగ్ గా అనిపిస్తే కొందరికి చీట్ చేసిన ఫీలింగ్ రప్పించవచ్చు. క్రైమ్ బిజెనెస్ లో ఉన్న కుటుంబాలలోని వ్యక్తులు ఎంత మెటీరియలిస్టిక్ గా మారిపోవచ్చో వారి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు, స్వార్ధం ఎలా ఉండచ్చూ అనేది చూపించిన విధానానికి హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. 
 
ప్రకాష్ రాజ్, జయసుధ, విజయ్ సేతుపతి, అరవింద్, జ్యోతిక, శింబు అందరూ పాత్రలలో ఒదిగిపోయారు చాలాకాలం గుర్తుండి పోతారు. అరవింద్ స్వామి, జ్యోతిక, అదితిరావ్ హైదరీ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటా ఒకప్పటి విలన్ త్యాగరాజన్ ను భూపతికి రైవల్ చిన్నప్పగౌడ్ గా చూడడం బావుంది. ఉన్న కొద్ది పాటలు ప్రత్యేకంగా కాక కథనంలో కలిసిపోయాయి.

సినిమా కథ తెలుసుకోవడం కోసం కన్నా నటీనటుల నటన అండ్ టెక్నికాలిటీస్ కోసం చూడాల్సిన సినిమా నవాబ్. మణిరత్నం అభిమానులు, గ్యాంగ్ స్టర్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు మిస్సవకుండా చూడవలసిన చిత్రం "నవాబ్". ఈ సినిమా ట్రైలర్స్ ఇక్కడ మరియూ ఇక్కడ చూడవచ్చు. 

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.