అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

విజయవాడ హాస్టల్లో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విజయవాడ హాస్టల్లో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, జులై 26, 2013

హాస్టల్ – 11 (ఇంటిదొంగను ఈశ్వరుడైనా...)


ఇది నా హాస్టల్ కబుర్లు టపాల సిరీస్ కు కొనసాగింపు. ఆ సిరీస్ గురించి తెలియని వారు ఇక్కడ క్లిక్ చేసి ముందు పది టపాలు చదవచ్చు. 

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత మీరు వినే ఉంటారు కదా... ఆ ఈశ్వరుడు పట్టలేడేమోకానీ మా AO గారు తలుచుకుంటే మాత్రం పట్టేస్తారు. AO అంటే మా ఇంటర్మీడియెట్ కాలేజ్ Administrative Officer. నిజానికి ప్రిన్సిపల్ అనే పిలవాలి కాకపోతే ఆయనే మా కాలేజ్+రెసిడెన్షియల్ హాస్టల్+పక్కన ఉన్న చిన్న హైస్కూల్ అడ్మినిస్ట్రేషన్ పనులు అన్నీ కూడా చూసుకుంటుంటారు కనుక AO అని ఫిక్స్ చేశారు.

ఆయనపేరు ప్రభాకర్, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు, నిండైన రూపం, కళ్ళద్దాలుపెట్టుకుని, గుబురుమీసాలతో అప్పుడప్పుడు కొన్నిరోజులు నిండుగా గడ్డంపెంచి, ఎక్కువ రోజులు క్లీన్ షేవ్‌తో, ఎప్పుడూ మడతనలగని ఇస్త్రీబట్టలతో లైట్‌కలర్ షర్ట్‌ని డార్క్‌కలర్ ట్రౌజర్‌లోకి నీట్‌గా టక్‌ చేసి చూపులకి కొంచెం పొట్ట పెంచిన మళయాళ హీరో మమ్ముట్టీలా కనిపిస్తారు.

చూడటానికి హీరోలాగా కనిపిస్తారు కానీ మాపాలిట పెద్ద విలన్, ఛండశాసనుడు. అసలు నేను అక్కడ చదివిన రెండేళ్ళలో ఆయన నవ్వుతుండగా ఓ పదిసార్లకన్నా ఎక్కువ చూసి ఉండను. నేనేమిటీ ఎవ్వరూ చూసి ఉండరు ఇక ఆయన చేతిలో దెబ్బలు తినని స్టూడెంట్ అంటూ ఎవరూ ఉండేవారు కాదు, ఏదోరకంగా అందరమూ ఆయన కోపాన్ని చవిచూసినవాళ్ళమే. పైకి ఆయన్ని అందరమూ తిట్టుకున్నా చాలామందికి సీక్రెట్ గా ఆయనంటే ఒక హీరోవర్షిప్ ఉండేదని నా అనుమానం.

సరే ఇక మన కథానాయకుడు అదేనండీ మా తీఫ్ తిరుమలై దగ్గరకి వస్తే మావాడు ఓ మోస్తరు పొడవు, బక్కపలచని పర్సనాలిటీ, తెల్లటి తెలుపు చటుక్కున చూస్తే బాలీఉడ్ బడ్డింగ్ హీరోలా ఉంటాడు దానికి తోడు పరమ అమాయకమైన ఫేస్. కానీ మావాడు శివలో నాగార్జునలా ఒక గ్యాంగ్ ని వేస్కుని తిరుగుతుండేవాడు. ఆయన గ్యాంగ్ అన్నీ మంచి పనులు చేస్తే మా వాడి గ్యాంగ్ రాత్రుళ్ళు హాస్టల్ గోడదూకి వెళ్ళి పరోఠాలు, బిర్యానీ తెచ్చి అమ్మడం, మధ్యలో తగిలిన చెరుకు తోటలో చెరుకు గడలు కొట్టుకొచ్చి ఇవ్వడం, ఇంకా ఇలాంటి కృష్ణలీలలు కొన్ని చేసేవాడు.


మా క్యాంపస్ మొత్తానికి ఒక చిన్న క్యాంటీన్ కమ్ ప్రొవిజినల్ స్టోర్ ఒకటి ఉండేది పక్కన ఫోటోలో చూపించినంత పోష్ సెటప్ కాకపోయినా అప్పట్లో మా రేంజ్ కి అది పోష్ సెటప్ తోనే ఉండేది ఒక వైపు కౌంటర్ అందులోనే ఒక వైపు కుర్చీలు టేబుల్స్ వేసి ఉండేవి కౌంటర్ లో బేకరీ ఐటంస్ తో పాటు స్టూడెంట్స్ కి అవసరమయ్యే చిన్న చిన్న వస్తువులు సబ్బులు, షాంపూలూ, పేస్టులు, బ్రష్షులు, బుక్స్, పెన్సిల్స్ ఇతరత్రా అన్నీ స్టాక్ మెయింటెయిన్ చేసేవాళ్ళు. ఆ ఓనర్స్ రాత్రి ఎనిమిది గంటలకు క్యాంటీన్ మూసేసి పక్కన ఉండే పల్లెకి వెళ్ళిపోయేవాళ్ళు.

క్యాంటీన్ మెయిన్ గేట్ కి దగ్గరలో ఉండడంతో అక్కడి సెక్యూరిటీనే క్యాంటీన్ కు సైతం సెక్యూరిటీ అనమాట. ఐతే వాళ్ళు గేట్ దగ్గర కూర్చుంటారు కదా బయటనుండి వచ్చే వాళ్ళని ఆపగలరు కానీ క్యాంటీన్ వెనక వైపు హాస్టల్ నుండి ఈజీ యాక్సెసిబుల్ గా ఉండేది కనుక హాస్టల్ నుండి ఎవరైనా ఎంటర్ అయితే ఏం చేయలేరు. మా తీఫ్ తిరుమలై ఈ విషయం గమనించాడు ఆలశ్యం చేయకుండా ఒక రోజు ప్లాన్ గీసేశాడు. విజయవంతంగా అమలు పరిచాడు. ఎంత విజయవంతంగా అంటే చోరీ జరిగినట్లు వాళ్ళకే తెలియనంతగా మానేజ్ చేశారా గ్యాంగ్.


ఎలా ఎంటరయ్యే వాళ్ళో తెలీదు కానీ దొంగతనం జరిగిన ఆనవాలేవీ మిగిల్చే వారు కాదు, వెళ్ళినవాళ్ళు కూడా స్వల్పంగా తీస్కొచ్చేవాళ్ళట అంటే కేవలం ఒక వారం పదిరోజులకు సరిపడా స్టఫ్ మాత్రమే తెచ్చేవాళ్ళు. ఎంత జాగ్రత్తగా అంటే ఓనర్స్ సరుకులో తేడా వచ్చినా లెక్కల్లో ఏదో తేడా జరిగిందని అనుకునే వాళ్ళే కానీ దొంగతనం అనుకునే వాళ్ళుకాదు. అలా అవసరమైనపుడల్లా స్టోర్ రూంకి వెళ్ళి తెచ్చుకుంటున్నట్లు తెచ్చుకోవడం మొదలెట్టారు ఇలా కొన్ని రోజులు జరిగాక ఓసారి ఎక్కువ తేవడం జరిగిందో లేక రిపిటీషన్ వల్లనో ఓనర్ వాళ్ళకి అనుమానం వచ్చి మా A.O. గారికి కంప్లైంట్ చేశారు. 

మా చండశాసనుడు గారికి ఒక అలవాటుంది పిల్లలు అక్రమమైన పనులేమన్నా చేస్తున్నారేమో అని చెప్పకుండా  ఉన్నట్లుండి హాస్టల్ లో రూంస్ మొత్తం మెరుపు తనిఖీలు చేయిస్తుంటారు. వాటిల్లో మా వాళ్ళు తెచ్చే దొంగ సరుకు ఎపుడూ బయటపడేది కాదు. సరే తక్కువ తెస్తున్నారు కదా అందుకే దొరకట్లేదేమోలే అనుకునే వాళ్ళం మేము. ఆరోజు కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి రూముల్లో గోలగోలగా టైంపాస్ చేస్తున్నాం ఉన్నట్టుండి “రేయ్..” అంటూ సింహఘర్జన వినిపించింది. అరక్షణంలో అందరం కలుగులో నుండి బయటపడ్డ చిట్టెలుకల్లా రూముల్లోనుండి కారిడార్ లోకి వచ్చేశాం.

పొడవాటి కారిడార్ చివర నుంచుని ఉన్న మా ఛండశాసనుడు “అందరూ ఒక్క నిముషంలో మీ ట్రంకులు తాళాలు తీసి అక్కడే పెట్టి బయటకి వెళ్ళి నుంచోండి, ఒక్కొక్క రూం వాళ్ళని పిలుస్తాను” అని చెప్పారు. సాథారణంగా ఇలాంటి తనిఖీలు వార్డెన్స్ మీద, కొందరు ముఖ్యులైన స్టూడెంట్స్ మీదా వదిలేసి సూపర్వైజ్ చేసే ఆయన ఈ రోజు స్వయంగా రంగంలోకి దిగి ఒకో రూంలో తను కూడా నుంచుని అన్నీ తీయించి చూస్తున్నారు. మాకెవరికీ క్యాంటీన్ ఓనర్ కంప్లైంట్ చేసిన విషయం తెలీదు. నింపాదిగా నుంచుని వేడుక చూస్తున్నాము.


మా తీ.తి గాడి రూం తనిఖీ మొదలైంది, అప్పటికే ఆ రూం వాళ్ళమీద అనుమానముందేమో మరింత జాగ్రత్తగా ఎక్కువ సమయం తీస్కుని వెతికారు కానీ ఏవీ దొరకలేదు పక్కరూం అయిన మమ్మల్ని ఆల్రెడీ పిలవడంతో మేం వెళ్ళి రూం బయట నుంచుని ఎదురు చూస్తున్నాము. A.O. గారు బయటకు వస్తూ యథాలాపంగా తల ఎత్తి గుమ్మం పైకి చూసి ఒక్క నిముషం ఆగి వార్డెన్ గారిని పైన ఉన్న ఎలెక్ట్రిక్ స్విచ్ బోర్డ్ ఓపెన్ చేయమన్నారు.

ఇప్పుడంటే ఎలెక్ట్రిక్ వైరింగ్ అంతా కన్సీల్డ్ గా గోడల్లోంచే లాగేస్తున్నారు కానీ పాత బిల్డింగులకి బయటనుండే ఇచ్చే వారు ఆ వైర్లన్నీ ఒక స్విచ్ బోర్డ్ లోనికి వెళ్ళేవి అది ఒక పెద్ద సూట్ కేస్ తరహాలో తెరచి మూయగల గొళ్ళెం ఉన్న చెక్కబాక్స్ దాని పైన అన్ని రకాల స్విచ్ లు ప్లగ్ పాయింట్స్ బిగించి ఉండేవి. ఆ బోర్డ్ తెరిచినపుడు లోపల వైర్లు ఉన్నాకానీ బోలెడంత ఖాళీ కూడా ఉండేది పైనున్న బొమ్మలో చూపించినట్లు. సో వార్డెన్ మా తీ.తి గాడి రూంలోని ఆ స్విచ్ బోర్డ్ తెరవగానే పైనుండి చాక్లెట్లు, బిస్కట్లు, సబ్బులు, బ్రష్షులు, పేస్టులు వర్షంలా కురవడం మొదలైంది. సో ఇన్ని రోజులు ఆ బోర్డ్ లో దాచడం వల్ల ఎవరికీ దొరకలేదన్న విషయం ఛండశాసనుడితో పాటు మాక్కూడా అర్ధమైంది.

ఇక తనిఖీలు ఆపేసి ఆయన రెగ్యులర్ ఫార్ములా ఉపయోగించారు. “ఎవరు చేశారో చెప్తారా లేక రూంలో ఉన్న అరడజను మందికీ కోటింగ్ ఇచ్చి సస్పెండ్ చేయమంటారా” అని అడిగేసరికి దొంగల గ్యాంగ్ బయటపడింది. ఇక వాళ్ళని అక్కడికక్కడే ఉతికారు చూడండీ.. నా సామిరంగా.. ఒక్కొక్కళ్ళ ఒళ్ళు వాతలు తేలి రంగుమారిపోయింది ఆ తర్వాత పదిరోజులు సస్పెండ్ కూడా చేశారు. ఇంతా చేసి వాళ్ళంతా కూటికి లేక చేస్తున్నారా అంటే కాదు అందరూ లక్షాధికారుల పిల్లలే డబ్బుకు కొదవలేదు కేవలం థ్రిల్ అండ్ సరదా. ఇంకా చెప్పాలంటే క్లెప్టోమానియా ఏమో అని నాకు ఒక డౌట్. అదేంటో మీకు తెలియకపోతే వికీలో ఇక్కడ చూడండి.

ఈ గ్యాంగ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యానేమో తెలీదు కానీ ఈ క్లెప్టోమానియా పురుగు తర్వాత రోజుల్లో ఒకసమయంలో నన్నుకూడా కుట్టింది... సో నాలో ఉన్న ఆ తీఫ్ తిరుమలై గురించి త్వరలో...

శుక్రవారం, జనవరి 14, 2011

హాస్టల్ – 10 (జిల్ జిల్ జిలాని)

ప్రతి స్కూల్లోనూ ఆమాటకొస్తే ప్రతి క్లాస్ లోనూ సకలకళావల్లభుడు ఒకడుంటాడు.. వీడు మంచి హుషారైన వాడుంటాడు వాడులేకపోతే క్లాస్ లో సందడే ఉండదు, వాడికి లేని మంచి అలవాటంటూ ఉండదు :-P గోడలు దూకడం, అల్లరి చేయడం, జనాలని ఏడిపించడం, అపుడపుడు తమ తింగరి చేష్టలతో క్లాసు మొత్తాన్ని మూకుమ్మడిగా నవ్వించడం ఈ ఒక్క మహానుభావుడికి మాత్రమే చెల్లుతుంది అలాంటోడే మా జిలానీ. వాడేం చేసినా ఎంత బుద్దిగా ఒద్దికగా చేద్దామన్నా అది చిరిగి చేటంత అవుద్ది. అలాగని రాముడు మంచి బాలుడులా బుద్దిగా ఉండరా అని చెప్తే ఒక రోజు మహా అయితే రెండు రోజులు ఉంటాడు అంతే మళ్ళీ మాములే...

ఉదయం స్టడీ అవర్ కోసం నిద్ర లేపడానికి వచ్చే వార్డెన్ ని రోజుకోరకంగా మోసం చేసి అతనికి చిక్కకుండా ఒక రూం లోనుండి ఇంకో రూంలోకి అవసరమైతే మంచం కింద, ఒకోసారి బిల్డింగ్ చివర మెట్లమీద కూడా ముసుగుపెట్టి నిద్రపోవడంతో మావాడికి వాడి అల్లరికి రోజు మొదలౌతుంది. మా వార్డెన్ గారు కూడా మమ్మల్నందరినీ ఒకసారి లేపేసి ఇక వాడ్ని వేటాడ్డంలో బిజీ ఐపోయేవారు. వాళ్ళిద్దరు టాం & జెర్రీ ఆటాడుకుంటుంటే మాకు మంచి కాలక్షేపమై నవ్వులతో ఉదయపు నిద్రమత్తంతా వదిలి పోయేది. ఇక అక్కడి నుండీ బాత్రూం దగ్గర ప్లేస్ కోసం మిగిలిన వాళ్ళతో గొడవేసుకోవడం.. బ్రేక్ ఫాస్ట్ టైం లో మెస్ వార్డెన్ తో రెట్టింపు ఇడ్లీలకోసమో చపాతీలకోసమో ఇవేమీ కాదంటే నేనే ముందేసుకోవాలంటూ పక్కవాడితో సాంబార్ బక్కెట్ కోసమో గొడవేసుకునేవాడు అన్నీ సరదాకే లెండి. మాకు మాత్రం బ్రహ్మాండమైన కాలక్షేపం.

ఇక అదయ్యాక ఉదయం 9 గంటలకి ఒక గంటపాటు రోజుమార్చి రోజు ఏదో ఒక సబ్జెక్ట్ లో మాకు స్లిప్ టెస్ట్ లు పెట్టేవారు. వార్డెన్లే పేపర్ సెట్ చేసి గంటకి సరిపోయేలా నాలుగైదు ప్రశ్నలకన్నా ఎక్కువ లేకుండా పెట్టే చిన్న పరీక్ష కాబట్టి దాన్ని స్లిప్ టెస్ట్ అనేవారు. కానీ మా జిలానీ మాత్రం స్లిప్పులు పెట్టుకుని చూసి రాసేది కాబట్టి దాన్ని స్లిప్ టెస్ట్ అంటారు కాబోలునని వాడంతట వాడే సొంతంగా నిర్వచనం చెప్పేసుకున్నాడు. దాంతో ప్రతి టెస్ట్ కూ ఖచ్చితంగా స్లిప్పులు ప్రిపేర్ చేసుకుని తెచ్చుకునేవాడు. వాటిని వార్డెన్ కం ఇన్విజిలేటర్లకి కనపడకుండా రోజుకో కొత్త ప్రదేశంలో కొత్త రకంగా దాచిపెట్టి వార్డెన్ కి తెలీకుండా వాటిని చూసి రాయడానికి విశ్వప్రయత్నం చేసేవాడు. కానీ రోజూ వార్డెన్ కి దొరికి పోయేవాడు. ఒరే నీకు ప్రశ్నలు తెలియవు కదా అసలు ఏం స్లిప్పులు తెస్తావు రా అంటే ఫార్ములాలు అవీ రాసి తెచ్చుకుంటాను అని చెప్పేవాడు. కాకపోతే వార్డెన్ తన ఏకాగ్రతనంతా వాడిమీద చూపించి వాడిదగ్గర స్లిప్ లు వెదకడానికి వాడ్నిగమనించడానికే ప్రాముఖ్యతనిచ్చేప్పటికి సందట్లో సడేమియా అంటూ అవసరమయినపుడు మేం పక్కన ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేసుకుంటూ రాసుకునే వాళ్ళం :-) ఆవిధంగా మాఅందరికీ వాడు బోల్డంత ఎంటర్ టైన్మెంట్ ఇవ్వటంతో పాటు సాయం కూడా చేసేవాడనమాట.


ఇక క్లాస్ లు జరిగేటప్పుడు మా లెక్చరర్లందరికీ మావాడు శుద్దమొద్దని ప్రగాఢమైన విశ్వాసం కనుక వాడిమీద ప్రత్యేకమైన శ్రద్ద చూపించేవారు. బి.ఎన్.కె. గారనీ మాకు రేఖాగణితం చెప్పడానికి ఒక సార్ వచ్చేవారు ఆయనకి మా జిలానీ ప్రియశిష్యుడు. మా సార్ తరహానే ప్రత్యేకంగా ఉండేది, బ్లాక్ బోర్డ్ దగ్గరలో ఉన్నంత సేపు బాగానే కుదురుగా ఉండేవారు కానీ ఆ ఏరియా దాటి మా మధ్యలోకి వస్తే బాక్సింగ్ రింగ్ లో కదులుతున్న బాక్సర్ గుర్తొచ్చేవాడు. అచ్చం అలానే మునివేళ్ళ మీద అటు ఇటు వేగంగా కదులుతూ ఒక్కొక్కరినీ ప్రశ్నలడుగుతూ జవాబు చెప్పలేని వాళ్ళని వంగోబెట్టి వీపు మీద అరచేత్తో ఘాఠ్టిగా ఒక్క చరుపు చరిచేవాడు మాలో కొందరికైతే వాతలు తేలి సాయంత్రం వరకూ స్పష్టంగా అంతే ఉండేవి. అబ్బ ఆయన గురించి తలుచుకుంటుంటేనే వీపు మీద మంట పుట్టి వెన్నులోంచి వణుకు వస్తుంది :-(

ఆయన క్లాస్ లో మా జిలానీ హైడ్రామా నడిపేవాడు వాడ్ని ప్రశ్న అడగడంతోనే స్టార్ట్ వాడికెలాగూ రాదని తెలుసు పక్కన మేమెవరమన్నా అందిస్తే మా వీపులు సాఫ్ చేసేవారు మా బి.ఎన్.కె అందుకని మేం నోర్మూసుకుని కూర్చునే వాళ్ళం. మనకసలే హెల్పింగ్ నేచరెక్కువకదా మొదటిసారి అలా అందించబోయి ఆయన చేతిలో దెబ్బలు తిన్నది నేనే. ఇక మా సార్ దగ్గరికి రావడం తోనే మా వాడు పెద్దగా పొలికేకలు “సార్ సార్ వద్దుసార్.. కొట్టద్దు సార్.. వీపు మీద సెగ్గడ్డ లేచింది సార్.. కావాలంటే రేపు కొట్టండి సార్.. లేదంటే చేతిమీద కొట్టండి సార్.. రేపు చదువుకుని వస్తాను సార్..” ఇలా వాడికి తోచిన విధంగా డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించేవాడు, సార్ చెయ్యెత్తగానే “అయ్యో.. అమ్మో.. అబ్బో..” అని పెడబొబ్బలు పెట్టి గోల గోలగా క్లాస్ అంతా కల్లుతాగిన కోతిలా గంతులేసి పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడు. మా సార్ ఒకోసారి నేను ఇంకా కొట్టలేదురా సరే ఈ రోజు వదిలేస్తాలే అని వాడు కాస్త సైలెంట్ అవ్వగానే ఠపీమని పీకేవారు.
ఇలాంటి రోజుల్లో ఒక వింటర్ లో మా జిలాని గాడికి ఈ దెబ్బలు తప్పించుకోడానికి మహత్తరమైన ఐడియా వచ్చింది ఒక రోజు ఉదయాన్నే క్లాసులు మొదలయ్యే ముందరే మా అందరితో ఛాలెంజ్ చేశాడు “ఒరే చూడండ్రా ఈ రోజు బి.ఎన్.కె గారి నుండి ఎలా తప్పించుకుంటానో..” అని మేం అంతా రోజూకన్నా కాస్త బొద్దుగా కనిపిస్తున్న జిలానీ గాడ్ని చూస్తూ ఏం చేస్తాడబ్బా అని అనుకున్నాం. క్లాసు మొదలైంది మా సార్ యథావిధిగా మావాడ్ని ఏదో ప్రశ్న అడగటం వీడు చెప్పలేకపోవడం జరిగాయి ఎప్పట్లానే మావాడు డ్రామా స్టార్ట్ చేసినా కాస్తంత విజయంతోకూడిన  నవ్వు వాడిమొహంలో మాకు తెలుస్తుంది. మా సార్ వాడ్ని వంగోబెట్టి అరచేత్తో ఒక్కటిచ్చాడు ఎప్పుడూ వచ్చే టపామనే శబ్దం కాకుండా ఏదో పరుపు మీద కొట్టినట్లు చప్పుడైంది.

మా సార్ సామాన్యుడా వెంటనే విషయం గ్రహించేశారు ఒరే నువ్ అలాగే ఉండరా అని చొక్కా పైకెత్తారు.. లోపల ఇంకో చొక్కాకనిపించింది.. మా జిలాని గాడి ఫేస్ లో నవ్వు మాయమైంది :-) మా సార్ ఆ లోపలి చొక్కాని కూడా పైకెత్తారు దానిలోపల ఇంకోటి అలా మొత్తం నాలుగు చొక్కాలు లోపల ఒక పలచని స్వెటర్ వేసుకుని మాంచి కుషన్ లాగా తయారు చేసుకుని వచ్చాడు మా వాడు. మా సార్ ఆ స్వెటర్ కూడా పైకిలెపే సరికి ఇక మా వాడి విలయతాండవం మళ్ళీ మొదలైంది “సార్ సార్ తప్పైపోయింది సార్ ఒక చొక్కా అయినా ఉంచి కొట్టండి సార్..” అని ఒకటే గోల కానీ అలా చేస్తే మా సార్ బి.ఎన్.కె ఎందుకౌతారు మొత్తం తీసేసి ఒట్టి వీపు మీద చాచిపెట్టి ఒక్కటిస్తే ఆ వాతలు తెల్లారేవరకూ తగ్గలేదు పాపం. అంతే మావాడు మళ్ళీ ఆయన ముందు ఇంకెప్పుడూ అలాంటి ట్రిక్కులు ప్రయోగించే ధైర్యం చేయలేదు.

చెప్పడం మరిచాను ఆయన దెబ్బలు తప్పించుకోవడానికి నేను కూడా ఓ చిన్న ట్రిక్ ప్లే చేసేవాడ్ని :-) ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం గురించి ఏకొంచెం సంశయమున్నా కాస్త భయపడుతూ బిక్కు బిక్కు మంటూ బెదురు చూపులు చూసేవారి మీదే ఆయన దృష్టి ఎక్కువ ఉండేది, అలాంటివారిని ఎక్కువగా లేపి జవాబు చెప్పమనేవాడు. అందుకని ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలిసినా తెలియక పోయినా నాకు అన్నీ తెలిసినట్లు నన్ను అడగట్లేదేమిటి అన్నట్లుగా అత్యుత్సాహం ప్రదర్శించేవాడ్ని. ఆయన వీడికి జవాబు తెలుసులే అనుకుని నాలాంటివారిని అడిగేవాడు కాదు, నా ట్రిక్ చాలా కాలమే పని చేసి నన్ను దెబ్బలనుండి రష్చించేసింది.


ఈ పై యానిమేషన్ చూశారా. పూర్తిపాటకి ఇక్కడ చూడండి. చాలా పాత వీడియో నాలుగేళ్ళక్రితంది కానీ నాకు చాలా నచ్చిన వీడియో.. ఆ పాటే సింప్లీ సూపర్బ్ అనుకుంటే ఎవరు చేశారో కానీ యానిమేషన్ చాలా బాగా చేశారు. పాటపాడేటప్పుడు హిప్పో ముఖ కవళికలు, కుక్క డ్యాన్స్, దాని డ్యాన్స్ చూసి హిప్పో ఫేస్ లో ఏహే ఏంటీ అల్లరి అన్నట్లు చూసే చూపులు మొత్తం నాకు చాలా చాలా ఇష్టం.. ఎలాంటి మూడ్ లో ఉన్నపుడైనా నన్ను హాయిగా నవ్వించేస్తుంది ఈ వీడియో. డాన్స్ పేరుతో ఈ కుక్కచేసే అల్లరి చూస్తే అప్పుడప్పుడు మా జిలానీ గుర్తొస్తుంటాడు. ఇప్పుడెక్కడున్నాడో తెలీదు కానీ ఈ టపా చదివి మళ్ళీ కలిస్తే బాగుండు అనిపిస్తుంది. 

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
సర్వేజనా సుజనోభవంతు,
సర్వేసుజనా సుఖినోభవంతు.

గురువారం, జనవరి 13, 2011

హాస్టల్ - 9 (రాకుమారుని రాఖీ చెల్లి)

సహజ.. మూడక్షరాల ఆ పేరు తలచుకోగానే మదిలో వీణలు మోగినట్లుగా, దేవుడిగది తలుపులు తీస్తుంటే తలుపులకున్న చిరుగంటలు ఒక్కసారిగా ఘల్లుమన్నట్లుగా, సుతిమెత్తగా అడుగులచప్పుడు వినపడకుండా నడిచే ఇంతి కాలి మువ్వలు లయబద్దంగా చేసే సవ్వడి వింటున్నట్లుగా, మనసంతా ఓ తీయనైన అనుభూతితో నిండిపోతుంది. అందానికి మరో పేరు సహజ.. మూర్తీభవించిన సౌందర్యం సహజ.. పదహారణాల అచ్చతెలుగుదనానికి చక్కని రూపం వస్తే అది ’సహజ’. కుదురుగా పొడవుగా అల్లిన జడలో ఒదిగిన ఒత్తైన నల్లని కురులు, పొందికగా కట్టుకున్న లంగాఓణీ, సదా పెదవులపై ఉండీలేనట్టు తొణికిసలాడే సన్నని చిరునవ్వు. విఙ్ఞానం, అమాయకత్వం, అణుకువ కలిసి ద్విగుణీకృతమైన తేజస్సు ఏదో మోములొ మెరుస్తూండగా చదువుల తల్లిలా ఒద్దికగా మా క్యాంపస్ లో తిరిగే మా సహజను చూస్తే ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి అనిపించేది.

ఒద్దికగా చిరుసవ్వడితో పారే సెలయేరు ’సహజ’ ఐతే.. హోరుమని ఎగిరి దూకే జలపాతం ’శ్రుతి’. వీళ్ళిద్దరూ ఇంచుమించు 120 మంది అబ్బాయిలు నాలుగు సెక్షన్ లు ఉన్న మా ఇంటర్మీడియట్ కాలేజ్ లో మా సెక్షన్ లో మాతోపాటు చదువుకునే అమ్మాయిలు. ఒకే క్యాంపస్ లో ఉన్న స్కూల్ ని మినహాయిస్తే మా కాలేజ్ మొత్తానికి వీరిద్దరే అమ్మాయిలు. శ్రుతి అవసరాన్ని బట్టి అబ్బాయిలతో మాట్లాడుతూ కామెంట్లకు కౌంటర్లు వేస్తూ ఉండేది కానీ సహజ బొత్తిగా వంచిన తల ఎత్తకుండా తిరిగేది, ఎవరికైనా తను ఎదురు పడినా బుద్దిగా పక్కకు తప్పుకునేవాళ్ళే కానీ తనని కామెంట్ చేసేవాళ్ళెవరూ ఉండేవారు కాదు తనని తన వైఖరిని చూస్తే ఒక ఆరాధనా భావమే తప్పించి అల్లరి చేయాలని ఎవరికీ అనిపించదు.
***

మా రూం S8 లో ఉన్న ఏడుగురిలో నేను, భరత్, బాజీ ఒకటీంలా కలిసి తిరిగేవాళ్ళం మిగిలిన వాళ్ళలో రాకుమర్ ఒకడు. మేం హాస్టల్లో చేరిన కొత్తలో మాకు వీడో పెద్ద ఆశ్చర్యార్ధకం ఎందుకంటే మొదటి సారి హాస్టల్లో చేరిన మేమందరం ఇంటి మీద బోలెడంత బెంగపెట్టుకుని సొంతంగా మాపనులు మేం సరిగా చేసుకోలేక బిక్కు బిక్కుమంటూ భయం భయంగా తిరుగుతుంటే మా రాకుమార్ గాడు తన మూడో తరగతి నుండీ తల్లిదండ్రులకి దూరంగా హాస్టల్ లో ఉండటం వల్ల ఏ విధమైన బెంగ, దిగులు లేకుండా ఎవర్నీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరిగేవాడు. వీడు ఇలా ఎలా ఉండగలిగేవాడా అని అప్పట్లో అంతగా అవగాహనలేని మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. వాళ్ళ అమ్మానాన్న మాంచి సౌండ్ పార్టీ అవడంతో మాకు అపుడపుడు క్యాంటీన్ లో కేకులు కూల్డ్రింక్ లు స్పాన్సర్ చేసేవాడు. వాడి ధోరణి రూపం అన్నిటిని కలిపి వాడిని ఇదివరకు హాస్టల్ లో గాబ్రేల్ అని పిలిచేవారని తనే చెప్పుకున్నాడు మేంకూడా అదేపేరుతో పిలిచేవాళ్ళం.

సెకండ్ ఇయర్ మొదలయ్యాక కొన్నాళ్ళకి మా రాకుమార్ గాడు మా ’సహజ’ తో కాస్త చనువుగా మెలగడం మొదలెట్టాడు మెస్ లోనూ అప్పుడప్పుడూ క్లాస్ లోనూ శలవురోజుల్లో ఒకోసారి ఏంకాంతంగా వాళ్ళిద్దరూ  మాట్లాడుకుంటూ కనిపించడం మొదలెట్టారు. కాస్తో కూస్తో మంచిపేరున్న మా గ్యాంగ్ తో కానీ కాలేజిలో ఇంకెవ్వరితోకానీ మాట్లాడని సహజ వీడితో ఎందుకు మాట్లాడుతుందా అని కూపీలాగితే తెలిసిందేమిటయ్యా అంటే ఆ ఏడు రాఖీ పండగ రోజున మా రాకుమార్ గాడు ఒక రాఖీపట్టుకుని వెళ్ళి చెల్లెమ్మా అంటూ సహజ తో రాఖీ కట్టించుకున్నాడుట మేమందరం శలవుల్లో ఉండటం వలన ఈ విషయం మాకు తెలియలేదు. సరే బొత్తిగా ఏకాకి లా బతుకుతున్న సహజకు అన్నయ్య దొరికాడంటే సంతోషమే కదా అనుకుని మేమంతా మిన్నకుండిపోయాం. ఇలా కొన్ని రోజులు గడిచాక...     
***

ఒక రోజు సాయంత్రం నేను ఏదో కొనుక్కోవడానికి క్యాంటీన్ వైపు వెళ్ళాను అక్కడే ఉన్నా మా రాకుమార్ గాడు వేణూ ఈ రోజు నీకు పార్టీరా అంటూ తినలేను రా బాబు అంటున్నా వినకుండా నాకు సమోసా, కేక్, కూల్ డ్రింక్ ఇప్పించాడు. అక్కడ కూర్చున్నంతసేపు వాడి మాటతీరు కొంచెం తేడాగా అనిపించింది అప్పగింతలు చెప్తున్నట్లు.. మిమ్మల్ని ఎపుడైనా బాధ పెడ్తే క్షమించమని అడుగుతూ ఇలా ఏదేదో మాట్లాడాడు. అక్కడ నుండి రూంకి వచ్చేసిన తర్వాత ఎందుకో నాకు అనుమానం వచ్చి మా భరత్ గాడిదగ్గర ఈ విషయం కదిలించాను వాడికీ నాలాంటి అనుభవమే అయింది తనకి కూడా ఏదో అనుమానంగా ఉంది అదీకాక సహజ కూడా ఈ రోజు మెస్ లో ఎక్కడా కనపడలేదు ఏదో జరుగుతుందని చెప్పాడు. మేం వెంటనే శ్రుతిని సహజ గురించి కనుక్కోమని పురమాయించి మెల్లగా రాకుమార్ గాడ్ని గమనించడం మొదలుపెట్టాం.

డిన్నర్ అయ్యే సరికి శ్రుతిద్వారా మాకు తెలిసిన విషయమేమిటంటే మావాడు తనకి జీవితం మీద విరక్తి కలుగుతుందని తనంటే ఎవరికీ ఇష్టం లేదనీ తను ఎవ్వరికీ అఖ్ఖర్లేదనీ సహజ దగ్గర నానా రకాల వాగుడూ వాగి తానా రోజు రాత్రి ఆత్మహత్య చేసుకోబోతున్నానని చాలా సీరియస్ గా చెప్పాడుట. పాపం మా సహజ ఎవరైనా మా లెక్చరర్ గట్టిగా హోంవర్క్ చేశావా అని అడిగితేనే బొటా బొటా కన్నీళ్ళు కార్చేరకం ఇంక మావాడు వేసిన సినిమాకి పూర్తిగా డీలా పడిపోయి ఆ ముందురోజు తిండికూడా తినకుండా ఏడుస్తూ కూర్చుందట. మావాడికేం కాకుండా మేం చూసుకుంటాం అని అమ్మాయిలిద్దరికీ హామీ ఇచ్చి పంపేసి నేను భరత్ గాడు మావాడ్ని రక్షించే ప్రయత్నంలో పడ్డాం. జీవితం ఎంత విలువైనదో ఇండైరెక్ట్ గా వాడికి అర్ధమయ్యేలా మాట్లాడుకోవడం ఎదిగొచ్చిన పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో ఏవో వేరేసంఘటనలు ఉదహరిస్తూ మాట్లాడుకోవడం లాంటివి చేసి.

రూంలో ఉన్న కత్తి, కత్తెర, బ్లేడ్లు లాంటి పదునైన వస్తువులన్నీ టంగ్ క్లీనర్ తో సహా ఇంకా తాళ్ళు బ్యాట్లు లాంటివన్నీ పక్క ఫ్రెండ్స్ రూంలో దాచిపెట్టేసి, ఆ రాత్రి వాడు నిద్ర పోయాక ఇక బయటకి రాకుండా లోపల కొందరం ఉండి రూం బయట నుండి తాళం వేసి లోపల ఒకళ్ళం బయట ఒకళ్ళం నిద్ర మానుకుని కాపలా కాసాం. ఆ రాత్రి ఎలా గడిపామో తలచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత డ్రామా ఎందుకు వాడ్ని ఒక్కటి పీకి ప్రిన్సిపాల్ కి అప్పగిస్తే పోయేది కదా అంటారా.. మాకు స్పష్టంగా వాడి ఉద్దేశ్యం తెలిసే సరికి రాత్రి అయింది అదీకాక మాకు వాడి ప్లాన్ తెలిసిందని తెలిస్తే వాడు మాకు దూరంగా వెళ్ళి మరేదన్నా ప్రయత్నం చేయచ్చు అందుకని మేం ఏమీ తెలియనట్లే వాడ్ని కాపాడే ప్రయత్నం చేశామనమాట. ఎలా అయితేనేం ఆ రాత్రి గడిచింది తెల్లవారి స్టడీ అవర్ నడుస్తుండగా నేను మా భరత్ గాడు రాకుమార్ గాడ్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాం చివరలో ఎనిమిది గంటలు కావస్తుందనగా వాడు లేచి బయటకి వెళ్ళాడు వెంటనే మేం కూడా అనుసరించబోతుండగా ఎదురుగా ఛండశాసనుడిలా మా ఏ.ఓ గారు ఎదురయ్యారు ఆయన వెనుకే మా రాకుమార్ గాడు కూడా..

కిక్కురు మనకుండా మేం గిరుక్కున వెనక్కితిరిగి రూంలోకి వచ్చి కూర్చున్నాం ఏ.ఓ గారు లోపలికి వచ్చి అమ్మాయిలను S8 రూమ్మెట్సునూ రాకుమారుడితో సహా మా క్లాస్ లో ఉండమని మిగిలిన వాళ్ళందరినీ బయటకి వెళ్ళిపోమన్నారు. మాకు బెల్టు దెబ్బలు ఖాయమని తెలిసిపోతుంది 6th sense అప్పటికే హెచ్చరించటం మొదలెట్టింది ఏఏ దెబ్బలని ఎలా కాచుకోవాలా అని ప్లాన్లు గీయడం మొదలెట్టాను. ఆయన ఇంటరాగేషన్ మొదలైంది మనమసలే సత్యహరిశ్చంద్రుడికి వారసులం కదా ఉన్నదున్నట్లు అన్నీ నిజాలు చెప్పేశాను. మా ఏ.ఓ గారు వీరభద్రుని అవతారంఎత్తి తాటతీస్తానొక్కక్కడిదీ అని తిట్టి.. లెక్చరర్లు ఎవరైనా సహజని గట్టిగా ఏదైనా ప్రశ్న అడిగితే ఏడ్చేస్తుంది అలాంటి అమ్మాయిని అసలు ఇంత టార్చర్ పెట్టాలని ఎలా అనిపించింది రా అంటూ వెంటనే సమాచారమివ్వనందుకు మా అందర్నీ కూడా తిట్టేసి వార్నింగ్ ఇచ్చేసి రాకుమారుడ్ని అప్పటికప్పుడే సస్పెండ్ చేసేసి ఊళ్ళో ఉన్న వాళ్ళ బంధువులకు అప్పగించేశారు.

ఆ తర్వాత ఎపుడో పరీక్షలు రాయడానికి మా క్యాంపస్ కి వచ్చిన రాకుమారుడితో మాట్లాడాక తను కేవలం ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడని అందరితో అనిపించుకోవడానికి మా సహజతో పరిచయం పెంచుకోవడానికీ రాఖీని అడ్డంపెట్టుకున్నాడే కానీ నిజమైన అభిమానం కాదనీ... అలా కొంత కాలం మాట్లాడాకా బుద్దిమారి ఆత్మహత్య డ్రామాద్వారా సింపతీ సంపాదించి సహజకు దగ్గరవ్వాలని పన్నాగం పన్నాడనీ అర్ధం చేసుకుని నివ్వెరపోయాం. తీవ్రమైన మానసిక సమస్యలతో బాధ పడుతున్న వాడికి మా రూంమేట్స్ అంతా కూర్చుని కాస్త హితబోధ చేయడానికి ప్రయత్నించాం.

ఒక దుస్సంఘటన మన మనసుల్లో ముద్రించుకుపోయినంత ఘాడంగా మంచి సంఘటనలు గుర్తుండవు కదా, ఆ తర్వాత ఎన్నోసార్లు పరాయి స్త్రీలో తోబుట్టువును చూసే ఎందరో నిజాయితీపరులను నా కళ్ళారా చూసినప్పటికీ ఇప్పటికి కూడా పరిచయం పెంచుకోవడానికి చెల్లెమ్మా అంటూ దగ్గరయి అరవ సినిమా సిస్టర్ సెంటిమెంట్ సీన్లను కళ్ళముందు నిలబెట్టే అన్నలను చూస్తే అరక్షణం పాటైనా నా మనసు కీడు శంకిస్తూనే ఉంటుంది. ఆనాటి మా సహజ పడిన మెంటల్ టార్చర్ గుర్తొస్తూనే ఉంటుంది.

మంగళవారం, జనవరి 04, 2011

హాస్టల్ - 8 (అనగనగా ఓ రాత్రి!!)

“వేణుగా వర్మ సినిమారా.. చాలా బాగుందంటరా.. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కోసమైనా చూసితీరాలంటరా..” అంటూ ఉదయం క్లాసుల మధ్య ఇచ్చిన బ్రేక్ లో మా భరత్ గాడు మొదలెట్టాడు.
“అవునంటరా మొన్న క్యాంటీన్ లో పేపర్ లో చూశాను ఏదో కొత్త సౌండ్ సిస్టం అన్నారు అదేంట్రా..” అడిగాను నేను.
“6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ బే, అదికూడా తెలియదు సినిమా చూట్టానికి రెడీ ఐపోయాడు..” నవ్వుతూ అంటూ ఇంకో పక్కనుండి బాజీ గాడు ఓ టెంకిజెల్ల ఇచ్చాడు.
“తెలుసా సినిమాలో బస్సు కుడిపక్కనుండి ఎడంపక్కకు మన వెనకగా నిజంగా వెళ్తున్నట్లు అనిపిస్తుందంట.. ఇలాంటి ఎఫెక్ట్స్ ఇంకాబోలెడంట..” అంటూ భరత్ కంటిన్యూ చేశాడు.

ఆరోజే రిలీజ్ అయిన రామ్ గోపాల్ వర్మ “రాత్రి” సినిమా గురించి మా డిస్కషన్.. శివ, క్షణంక్షణం ప్రభావంతో వర్మ సినిమాలు అంటే మాస్టర్ పీస్ లు అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చేసిన నాకూ భరత్ గాడికీ ఎలాగైనా ఆ రోజే ఆ  సినిమా చూసేయాలని ఉంది. కానీ మా కాలేజ్ లో ఆదివారం తప్ప మధ్యలో ఔటింగ్ సంపాదించడమంటే చాలా కష్టమైన పని, అలాగని ఎవరూ వెళ్ళరు అని కాదు కానీ కాస్త బలమైన కారణం ఉండాలి.
“వార్డెన్ ని మ్యానేజ్ చేసి డిన్నర్ అయ్యాక గోడదూకి వెళ్దాంరా, మనకి దగ్గరలో అంటే కామయ్యతోపులో ఆడుతుంది.. సెకండ్ షోకి అందుకోవచ్చు” మా భరత్ గాడు తీర్మానించేశాడు. 

“ఒద్దురా అది చాలా రిస్క్ దొరికితే వీపంతా వాతలు తేల్తాయ్.. అదీకాక సౌండ్ కోసం చూడాలంటే రాజ్/యువరాజ్ లోనే చూడాలి, దగ్గరలోని లోకల్ హాళ్ళలో ఐతే అంత సీన్ ఉండదు చూట్టం వేస్ట్..” అంటూ నేను వాడి తీర్మానాన్ని వీటో చేసేశాను. దెబ్బలుతింటామన్న భయంకన్నా A.O. గారి దగ్గర ’రాముడు మంచి బాలుడు’ అని నాకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుద్దని నా బాధ. 

ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తూ మెల్లగా క్లాసులకి వెళ్ళిపోయాము, నేను క్లాస్ లో కూర్చున్నానన్నమాటే కానీ ఆలోచనలన్నీ వర్మ చుట్టూ రాజ్/యువరాజ్ లోఆడుతున్న రాత్రి సినిమా చుట్టూ తిరుగుతూ ఉన్నాయ్. మధ్య మధ్యలో శివలోంచీ క్షణంక్షణంలోంచీ కొన్ని సీన్స్ నామెదడులోంచి ఎదురుగా ఉన్న బ్లాక్ బోర్డ్ మీదకి ప్రొజెక్ట్ ఐ అక్కడ  రన్ అవుతున్నాయ్... ఇంతలో రెండుకళ్ళమధ్య ముక్కుదూలం మొదట్లో మంటగా అనిపించింది. “ఛస్ దీనెంకమ్మ కళ్ళజోడు దీనివల్ల ఉపయోగమేమో కానీ దీని బరువుకి వాచిపోతుంది” అని దాన్ని తిట్టుకుంటూ తీసి టేబుల్ మీద పెడుతూ యధాలాపంగా దానికేసి చూశాను... అంతే ఫ్లాష్ వెలిగింది.. దానితో పాటే నా మొహంలో కూడా వెయ్యిమతాబాల వెలుగునిండింది. హుర్రే !! అనుకుని ఆ ఐడియా మావాళ్లతో షేర్ చేస్కోడానికి ఎప్పుడెప్పుడు లంచ్ బ్రేక్ వస్తుందా అని ఎదురు చూడటం మొదలెట్టాను.
అప్పట్లో నాకు భయంకరమైన షార్ట్ సైట్ ఉండేది దాన్ని కాంపెన్సేట్ చేయడానికి -16D పవర్ ఉన్న కళ్ళద్దాలు వాడేవాడిని. ఒకో కంటిఅద్దం ఇంచుమించు ముప్పావు అంగుళం మందం ఉండేది. నాజూకుగా ఉండే మెటల్ ఫ్రేం వాటికి సరిపోదని బరువైన ఆ అద్దాలను ఆపలేదనీ చెప్పి పైన ఫొటోలో చూపించినలాంటి వెడల్పాటి షెల్ ఫ్రేం వేసేవాడు మా ఆప్టీషియన్. ఈ ఫ్రేం మధ్యలో ఒక గాడి ఉంటుంది అద్దం చుట్టూమధ్యలో కోసుగా చేసేవాడు దాన్ని తీసుకువెళ్ళి ఆ గాడిలో అమరేలా బిగిస్తే అద్దం కదలకుండా ఫ్రేంలోనే ఉంటుంది. ఆ రోజు నేను కళ్ళద్దాలు తీసి డస్క్ మీద పెడుతున్నపుడు ఒక మూలన అద్దం ఆఫ్రేంగాడిలోనుండి బయటకు వచ్చి కనిపించింది. చాలా పాతబడడం వల్ల ఫ్రెం లూజ్ అయ్యి ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది దాన్ని మళ్ళీ జాగ్రత్తగా లోపలికి నెట్టేసి వాడుకునే వాడ్ని. కానీ ఆ రోజు జాగ్రత్తగా కొంచెం ఫోర్స్ ఉపయోగించి అద్దానికీ ఫ్రేంకి డామేజ్ జరగకుండా అద్దాన్ని ఫ్రేం నుండి విడదీయగలిగాను. కొద్ది ప్రయత్నంతో దాన్ని తిరిగి యధా స్థానానికి చేర్చగలనని నిర్ధారించుకున్నాక మావాళ్లకి విషయం చేరవేశాను.

సరే ప్లాన్ వర్కవుట్ అవ్వాలంటే ముందుగా ఊడదీసిన అద్దాన్ని దాచిపెట్టాలి, నా ట్రంక్ లో దాస్తే పొరపాటున మా A.O. కి డౌట్ వచ్చి వెతికిస్తే దొరికిపోతాం కనుక మా రూముకు నాలుగు రూముల అవతల మాకంతగా పరిచయంలేని ఒకడ్ని పట్టుకుని వాడి ట్రంకు పెట్టెలో బట్టలమధ్య ఆ అద్దాన్ని బద్రంగా దాచిపెట్టాను. ఆపై సాయంత్రం 4గంటలకి క్లాసులు అవ్వగానే ఒకఅద్దంలేని ఆఫ్రేంతో మా A.O. గారి దగ్గరకు వెళ్ళి మెట్లుదిగుతుంటే కళ్ళద్దాలు జారిపడిపోయాయనీ ఒక అద్దం పగిలిపోయిందనీ.. అది లేకపోతే బొత్తిగా కనపడదు కనుక వెంటనే విజయవాడ వెళ్లి అద్దం వేయించుకుని వస్తాను అని చెప్పాను. మనకున్న మంచి ఇమేజ్ మూలంగా మా సార్ వెంటనే నమ్మేసి ఎక్కువ ప్రశ్నలు అడగకుండానే నాకూ ప్లస్ నాకుకనపడదు కనుక నాకుతోడుగా ఉండటానికి మా భరత్ గాడికీ పర్మిషన్ ఇచ్చేశారు. వెంటనే ఏమాత్రం ఆలశ్యం చేయకుండా దాచిపెట్టిన అద్దం తీసుకుని దాన్ని దాన్ని కొత్తగా కనిపించేలా శుబ్రంగా సబ్బునీళ్ళతో కడిగి అంచులవెంబడి మెరిసేలా పేపర్ తో పాలిష్ చేసి దాన్ని జోబులో వేసుకుని మళ్ళీ ఎవరి కంటపడకుండా వెనకదారిగుండా బయటపడి రోడ్డెక్కాము. థియేటర్ కి వెళ్ళేవరకూ మాతెలివితేటలకి మేమే నవ్వుకుంటూ జోకులేసుకుంటూగడిపాం..

తీరా రాజ్ యువరాజ్ కి వెళ్ళేసరికి మొదటిఆటకి టిక్కెట్లు అయిపోయాయన్నారు, కనీసం బ్లాక్ లో కూడా దొరకలేదు సరే ఇంత కష్టపడి వచ్చి చూడకుండా ఏం వెళతాం అని సెకండ్ షొకి వెళ్దాం అని నిర్ణయించుకుని డిన్నర్ చేసి గాలికి తిరిగి ఎలాగైతేనేం రెండోఆటకి టిక్కేట్లు సంపాదించాం. మేం కోరుకున్నట్లుగానే థియేటర్ మధ్యలో సీట్లు దొరికాయి.. సినిమా మొదలైంది స్క్రీన్ అంతా నల్లని నలుపు.. ఉన్నట్లుండి వెనకనుండి దయనీయంగా ఓ స్త్రీ ఏడుపు మొదలైంది ఓ క్షణం ఒళ్లుజలదరించింది... ఇంతలో తెరపై సన్నని వెలుగు.. అదేమైఉంటుందా అని ఆలోచిస్తూ టైటిల్స్ గమనిస్తుండగా నేపధ్యంలో సన్నగా ఆ స్త్రీ ఏడుపుకి తోడు భయం గొలిపే మిస్టరీ శబ్దాలు.. ఉన్నట్లుండి హఠాత్తుగా పెద్దశబ్దంతో తలుపులు తెరుచుకున్నాయి.. ఆశబ్దం ఎంత సహజంగా ఉందంటే అప్పటివరకూ తెరమీద చూస్తున్నది తలుపులను అని తెలియని నేను ఉలికిపడి అప్రయత్నంగా థియేటర్ తలుపులకేసి ఓ క్షణం చూశాను. అలా కెమేరా ముందుకు వెళ్తుంటే ఊరంతా ఖాళీ.. మొండిగోడలు ఇళ్ళు తప్ప మనుషులు ఎవ్వరూ ఉండరు.. ఇక అక్కడనుండి సౌండ్ & సినిమాటోగ్రఫీ మాయాజాలం మొదలైంది. 

అప్పటివరకూ సగటు సూపర్ హీరోల తెలుగు సినిమాలు తప్ప హిందీ సినిమాలతో కూడా అంతగా పరిచయంలేని నాకు హాలీఉడ్ హార్రర్ సినిమాల గురించి తెలిసే అవకాశం అస్సలు లేదు. దానివల్ల ఆ సినిమా చూస్తున్నంత సేపు పూర్తిగా వర్మ మాయలో పడిపోయాను. ఎక్కడా జుగుప్సకు తావివ్వకుండా సినిమా అంతా నటీనటుల ముఖ కవళికలు, సర్ ప్రైజ్, సౌండ్, కెమెరా యాంగిల్స్ పైనే ఆధారపడి ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చాడు. గడియారం టిక్ టిక్ సౌండ్, లారీ డోర్, సరిగా మూసుకోని బీరువా తలుపు, మామ్మగారి తెల్లజుట్టు తనుచేసే జపం, తుప్పుపట్టిన స్టోర్ రూం తలుపు చేసే కిర్రు శబ్దాలు, వంటింట్లో మిక్సీ, బాండీలో వేసే పోపూ ఇవీ ఇతను మనని భయపెట్టడానికి ఎంచుకున్న మార్గాలు. వాటినే హఠాత్తుగా వినిపించడం చూపించడం ద్వారా ఉలికిపడేట్లు చేస్తాడు. రేవతి కళ్ళగురించి చెప్పుకుని తీరాలి తను కంటిచూపు తోనే చంపేసింది ఆ సినిమాలో, తనతోపాటు చిన్నపిల్లాడి పెద్ద పెద్ద కళ్ళు కూడా భయపెడతాయ్. అలా మూడు ఆశ్చర్యాలు ఆరు భయాలతో సినిమా చూసి బయట పడ్డాం.


అర్ధరాత్రి పన్నెండుగంటలు మా మిషన్ - విజయవాడ సెంటర్ లోఉన్న రాజ్/యువరాజ్ నుండి బందరురోడ్లో ఊరిపొలిమేరలకు ఆవలనున్న ఈడ్పుగల్లులొని మా హాస్టల్ కు చేరుకోవడం. ఫిబ్రవరి నెల చలి ఇంకా తగ్గక పోవడంతో ఊరు త్వరగా సద్దుమణిగింది నిర్మానుష్యమైన వీధులు.. కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి.. నిశ్శబ్దంగానే ఉన్నట్లున్నా ఏవో చిత్ర విచిత్రమైన శబ్దాలు.. ఎలాగో కష్టపడి బెంజి సెంటర్ వరకూ చేరుకున్నాం అక్కడ చాలా సేపు ఎదురు చూశాక మా కాలేజ్ కి ఒక కిలోమీటర్ ఇవతల వరకూ వెళ్ళే ఒక వ్యాన్ దొరికింది వాడ్ని బతిమిలాడి ఎలాగో అక్కడివరకూ వెళ్ళాం. వాడుమమ్మల్ని మెయిన్ రోడ్ లో దింపేసి లోపలికి వెళ్ళిపోయాడు.

అక్కడ ఒకే ఒక చిన్న టీకొట్టు తప్ప ఇంకేమీ లేవు చుట్టూ పొలాలు చిమ్మ చీకటి.. కీచురాళ్ళ రొదలు.. అప్పటివరకూ సినిమాలో చూపించిన సన్నివేశాలన్నీ కళ్ళముందు కనిపించడం మొదలెట్టాయి పెద్ద చెట్టుని చూసినా భయమే.. కదిలే చిత్తుకాయితాన్ని చూసినా భయమే.. ఆ ప్రాంతంలో మేం ఇద్దరం తప్ప ఒక వాహనం కానీ మరో మనిషి కానీ ఎవరూ లేరు. కాసేపు ఎదురు చూశాక నడవాలి అని నిర్ణయించుకున్నాము. ఒకళ్ళ చేతులు ఒకళ్ళుపట్టుకుని వణుకుతూ భయం భయంగా చుట్టూ ఒకటికి పదిసార్లు చూసుకుంటూ ఎలా హాస్టల్ కి చేరుకున్నామో ఆ దేవుడికే ఎరుక. క్షేమంగా హాస్టల్ కు చేరాక ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ హార్రర్ సినిమాలకి సెకండ్ షోలకి వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకుని నిద్రోయాం :-) మొదలే భయస్తుడినైన నాకు తెల్లారేసరికి వచ్చిన జ్వరం తగ్గడానికి రెండ్రోజులు పట్టింది.

శుక్రవారం, డిసెంబర్ 31, 2010

హాస్టల్ - 7 (న్యూ ఇయర్)

ఈ టపానూ ఇంకా కొత్త సంవత్సరం పై బ్లాగరులు రాసిన మరికొన్ని చక్కని టపాలను సుజన మధుర గారి e-బుక్ లో ఇక్కడ చదవండి. సర్వర్ లో డౌన్లోడ్ అవకపోతే గూగుల్ డాక్స్ లో ఇక్కడ నుండి దింపుకోండి.

మిగతా పండగలు చేసినా చేయకపోయినా ఆగస్ట్ 15 కాక మా కాలేజ్ లో ముఖ్యంగా చేసేవి మూడు పండగలు. ఒకటి దీపావళి -  పెద్ద సంఖ్యలో బాణాసంచా తెప్పించి ఇళ్ళకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయిన పిల్లలతో కాల్పించేవారు. రెండోది కాలేజ్ యానివర్సరీ - ఒక చీఫ్ గెస్ట్ ను పిలిపించి పెద్ద సభ జరిపి, సాంస్కృతిక కార్యక్రమాలు, రెండువారాలుగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతిప్రదానం, మెస్ లో ఫీస్ట్ ఏర్పాటులతో ఘనంగా జరిగేది. ఇక మూడోది న్యూయియర్ - డిశంబర్ 31 న మధ్యాహ్నం నుండి కాలేజ్ లో మా తరగతి గదులను బెలూన్లు, రంగుకాగితాలు, తగరపు కాగితాలు, మెలికల కాగితాలతో శక్తిమేరకు ముస్తాబు చేసే వాళ్లం. ఆరోజు సాయంత్రం ఫీస్ట్ ఇక రాత్రి డాబా పైన క్లాస్ రూంస్ ముందున్న ఖాళీ స్థలంలో అందరినీ సమావేశపరచి మా డైరెక్టర్ కేక్ కట్ చేసేవారు. రోజూ ఒకటే దినచర్యతో చప్పగా గడిచే హాస్టల్ జివితంలో ఈ ప్రత్యేకమైన రోజులు తెచ్చే సందడి అంతా ఇంతా కాదు. ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నా పుస్తకాలు ముట్టుకునే పనిలేదన్న సంతోషం ఎంత అరిచి అల్లరి చేసినా ఎవరూ ఏమీ అనరు అనే ధైర్యంతో నిజంగా పండగ వాతావరణం ప్రతి విద్యార్ది మొహంలో ఆనందంగా ప్రతిఫలించేది.

కాలేజ్ డెకరేషన్ ప్లాన్స్ ఒక వారం ముందునుండే ప్రారంభమౌతాయి కావాల్సిన సామాగ్రికోసం స్పెషల్ ఔటింగ్ పర్మిషన్ తెచ్చుకోవడం ఎలా చెయ్యాలో అందరం కూర్చుని చర్చించుకోవడం మంచి సరదాగా ఉండేది. మాలో కొందరం ఈ ప్లానింగ్ లో ఉంటే కాస్త రౌడీ బ్యాచ్ సమావేశమై మరో ప్లానింగ్ లో ఉండేది. ఏమిటయ్యా అది అంటే కొంతమంది వార్డెన్స్ స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉండేవారు కానీ ఒకళ్ళిద్దరు మాత్రం వాళ్ళు పైనుండి దిగివచ్చిన దేవుళ్ళలా మేమంతా వాళ్ళని పీడించుకు తినడానికి పుట్టిన రాక్షసుల్లా బిల్డప్ ఇచ్చేవాళ్ళు. అలాంటివాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళలో ఎక్కువ తప్పులు చేసిన ఒకవార్డెన్ ని ఎన్నుకునేవాళ్ళు (ఠాగూర్ సినిమా లోని ACF రేంజ్ అనమాట). ఇక 31 రాత్రి డిన్నర్ అయ్యి A.O గారు ఇంటికి వెళ్ళాక కారిడార్ లోనో(పైన ఫోటోలో చూపించినట్లే ఉండేది మా కారిడార్ అటు ఇటు రూంస్ తో) లేదంటే బాత్రూంస్ దగ్గరో ఆ వార్డెన్ ని పట్టుకుని లైట్లు ఆపేసి దుప్పటి ముసుగేసి కసితీరా కొట్టే వాళ్ళు. సో వార్డెన్ ని బయటకి ఎవరు తీసుకు రావాలి, లైట్స్ దగ్గర కంట్రోల్ ఎవరిది, దుప్పటి ఎవరెవరు పట్టుకోవాలి, ఎవరెవరు కొట్టాలి ఇత్యాదులన్నీ ప్లానింగ్ లో భాగమనమాట.

ఇక శ్రీనివాసరావుగారని డైనింగ్ హాల్ సూపర్ వైజర్ ఒకాయన ఉండేవారు తను ఫుడ్ విషయంలో క్వాలిటీ సంగతి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెరుగు కప్పుల దగ్గర మాత్రం నిక్కచ్చిగా ఉండేవారు. చిన్న చిన్న కప్పుల్లో డైరెక్ట్ గా తోడుపెట్టేవారు పెరుగు, అది ఎవరికీ సరిపోయేది కాదు కనుక ఏమాత్రం అవకాశమున్నా మేం ఏదో ఒక మాయ చేసి అదనంగా సంపాదించడానికి ప్రయత్నించేవాళ్ళం ఒకవేళ జ్వరం లాటివి వస్తే మాత్రం మిగతా కూరలు తినం కాబట్టి అదనంగా శాంక్షన్ చేసేవారు. ఆయన ఫీస్ట్ రోజు ఐస్క్రీం కప్పుల మీద ఆ నిఘా ఏర్పాటు చేసేవారు. చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులలో చెక్క స్పూన్స్ తొ సహా వచ్చే ’క్వాలిటీ’ వెనిలా ఐస్క్రీం రుచి భలే ఉండేది. ఒక కప్పు సరిపోక  మేమంతా కలిసి “I scream.. You scream.. We scream.. For Ice cream..” అని గోల గోల చేసేవాళ్ళం. ఓ సారి అలాఅరుస్తుంటే ఓ చిరంజీవి దురభిమాని “ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగా స్టార్” అని అరిచాడు. ఏంట్రా నీ గోల అంటే మొన్న చిరంజీవి సినిమాకిఇలానె అరిచాంరా మీరు స్లోగన్స్ ఇస్తున్నారు కదా అని నే కూడా ఇచ్చాను అన్నాడు. “ఆహా అలాగా ఒరే వీడి కప్పుకూడా లాక్కోండ్రా చిరంజీవి వచ్చి వీడికి ఐస్క్రీం తినిపిస్తాడు” అని వాడి మీద పడ్డాం :-)

ఇక రాత్రి కేక్ కటింగ్ దగ్గర కేక్ తోపాటు కూల్ డ్రింక్ లూ, సమోసాలో లేదా వెజ్ పఫ్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఓ సారి కేక్ కటింగ్ ఆ తర్వాత చిన్న చిన్న స్పీచ్ లూ అయ్యాక కేక్ అందరికీ సర్వ్ చేసేసి ఆపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏమీ ప్లాన్ చేయకపోవడంతో ఎవరైనా పాటలు కానీ డాన్స్ లు కాని చేసే వాళ్లుంటే రండిరా అని ఆహ్వానం పలికారు. ఒకడి ఏకపాత్రాభినయం మరొకడి పాట అయ్యాక ఎవరో “సార్ వేణుగాడు కూడా పాటలు బాగా పాడతాడు సార్” అంటూ నన్ను ముందుకు తోశారు. ఎదురుగా డైరెక్టర్, A.O. ఇంకా మిగిలిన స్టాఫ్ అంతా ఉండటంతో కాస్త మొహమాట పడినా కాదనలేక నేను సిరివెన్నెల నుండి “ఈ గాలీ.. ఈ నేల..” పాట మొదలెట్టాను. మొదటి చరణం చివరికి వచ్చేసరికి నా ముందున్న వాళ్ళంతా పాపం శ్రద్దగానే వింటున్నారు కానీ మా డైరెక్టర్, స్టాఫ్ నాపాట పట్టించుకోకుండా ఏవో కబుర్లు మొదలుపెట్టటంతో గోల మొదలైంది. అంతే మనకి వెంటనే శంకరాభరణం శంకరశాస్త్రిగారు గుర్తొచ్చారు... “ఠాట్ నేను పాడుతుంటే వినకుండా గోలచేస్తారా !! వీళ్ళకు నా పాట వినే అర్హతలేదు ఫో !!” అనుకుని పాట ఆపేసి కూర్చుండిపోయాను. మా సార్ ఒకరు “ఏంట్రా ఆపేశావ్?” అని అడిగితే “నాకు అంతవరకే వచ్చండి..” అని చెప్పేసరికి పాపం చేసేది లేక చప్పట్లు కొట్టేశారు.


విజయవాడలోనిది ఒకే బిల్డింగ్ లో గడిపిన ఖైదీ జివితమైతే ఇంజనీరింగ్ కి వచ్చాక ఆంధ్రా యూనివర్సిటీ వైజాగ్ లో అపరిమితమైన స్వేచ్చ... అక్కడ నాకు బాగా గుర్తున్నవాటిలో ఓ ఏడాది 31 రాత్రి సెకండ్ షోకి దదాపు ఒక 15 మందిమి క్లాస్మేట్స్ అంతా కలిసి ’అనగనగా ఒక రోజు’ సినిమాకి వెళ్ళాము. నాకు ఇప్పటికీ గుర్తు చిత్రాలయలో చూశాము ఆ సినిమా మా వాళ్ళు కొందరు ముందువెళ్ళారు మేం ఓ నలుగురం 5 నిముషాలు లేట్ గా వెళ్ళాం మేం థియేటర్ లోకి ఎంటర్ అయ్యే సరికి ఊర్మిళ ఇంట్రడక్షన్ సీన్ వస్తుంది తను చక్రి కోసం వెయిటింగ్ పెద్ద స్క్రీన్ పై తనని చూడటానికి రెండుకళ్ళు చాలడం లేదు. మా వాళ్ళు సీట్లలోంచి “ఒరేయ్ మేం ఇక్కడ ఉన్నాం..” అని అరుస్తున్నా పట్టించుకోకుండా అలానే వాక్వే లో నిలబడి ఆ సీన్ చూశాక వెళ్లి సీట్లలో సర్దుకున్నాం :-) ఆసక్తి ఉన్నవాళ్ళు పై వీడియోలో 6 నిముషాల దగ్గర చూడండి.

ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళడంతో సినిమాలోని కామెడీ చాలాబాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయ్యాక క్లాస్మేట్స్ లో అమ్మాయిలను మహరాణిపేట హాస్టల్స్ లో దింపేసి ఆ డౌన్ లో దిగి బీచ్ కు వెళ్ళి బీచ్ రోడ్ వెంబడి నడుచుకుంటూ మా హాస్టల్స్ కు చేరుకోవడం మరిచిపోలేని అనుభూతి దారిలో పెద్ద పెద్దగా అరుస్తూ ఆటోవాలాలకు, బైకుల్లోనూ, కారుల్లోనూ ఎదురైన ప్రతి ఒక్కరికీ గ్రీటింగ్స్ చెబుతూ, కబుర్లు చెప్పుకుంటూ, సినిమాలోని బ్రహ్మానందం ’జాక్సన్ మైఖేల్ జాక్సన్’ కామెడీ సీన్స్ కొన్ని యాక్ట్ చేస్తూ నవ్వుకుంటూ గోల గోలగా గడిపాము. హాస్టల్ దగ్గర టెలిఫోన్ బూత్ నుండి రాత్రి 12:30 కి ఒక ర్యాండమ్ నంబర్ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన ఆంటీ మొదట కాస్త టెన్షన్ పడినా.. ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంత మందిమి సరదాగా ఒక నంబర్ ట్రై చేశాము అని వివరంగా చెప్తే తర్వాత వాళ్ళ ఇంటిల్లిపాదితో మాట్లాడించడం.. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం బాగా ఎంజాయ్ చెయ్యండి అని చెప్పడం కూడా మరిచిపోలేను. ఆ నంబర్ గుర్తులేదు కానీ వాళ్ళ ఇల్లు MVP కాలనీలో ఉంది అని మాత్రం చెప్పారు అపుడు.

"ఆనాటి ఆ స్నేహమానందగీతం ఆ ఙ్ఞాపకాలన్ని మధురాతి మధురం" అని పాడుకోవడమే ఇపుడు మిగిలింది... ఒకవేళ అందరం కలిసినా కార్లు, గ్యాడ్జెట్లు, భయాలు, బాధ్యతలు ఇప్పటి కథేవేరు... ఆరోజుల్లోలా నిర్లక్ష్యంగా ఎంత రాత్రైనా బిందాస్ గా రోడ్లమీద తిరగగలమా... ఏమో!! నాకైతే నమ్మకం లేదు...

బ్లాగ్ మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఆదివారం, డిసెంబర్ 26, 2010

హాస్టల్ - 6 (వేణు The దేవదాస్ !!)

~*~*~ ఇది సీరియల్ కాదు ఏ టపాకు ఆ టపానే విడిగా కూడా చదువుకోవచ్చు.. నేను విజయవాడ సిద్దార్థ రెసిడెన్షియల్ లో ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో జరిగిన ఈ హాస్టల్ కబుర్ల గురించి పరిచయం లేని వారు విజయవాడ హాస్టల్లో అన్న లేబుల్ పై క్లిక్ చేస్తే ముందు 5 టపాలు చదవవచ్చు.~*~*~

ఖర్మరా బాబు ఇపుడు వీడి ప్రేమకథ వినిపిస్తాడా అని కంగారు పడకండి, ఓ ప్రేమికుడుగా దేవదాస్ ఎంత ఫేమస్సో ఓ తాగుబోతుగా కూడా అంతే ఫేమస్ మరి, ఇపుడు నే చెప్పబోయేది ఆ రెండో (అవ)లక్షణం గురించే. నేను విజయవాడలో ఇంటర్ చదివేరోజుల్లో మాకు ప్రతి ఆదివారం ఔటింగ్ ఇచ్చేవారు అంటే మధ్యహ్నం భోజనాలు అవ్వగానే బయటకి వెళ్ళి రాత్రి పదిగంటలలోపు హాస్టల్ కు వచ్చేయాలి. మొదట్లో హోం సిక్ వలన ఆ కొద్ది టైంలోనే రెండుగంటలపైగా ప్రయాణం చేసి నరసరావుపేటలో ఇంటికి వెళ్ళేవాడిని. కానీ ప్రతీసారి సోమవారం పొద్దున్న తిరిగి రావడం, ఉదయం స్టడీ అవర్ గైర్హాజరీ తో మా A.O. గారు ప్రతీవారం వెళ్ళద్దంటూ వార్నింగ్ ఇచ్చేవారు. ఆయనకి భయపడి ప్లస్ హాస్టల్ జీవితానికి కూడా అలవాటుపడటంతో కొన్ని నెలల తర్వాత ప్రతివారం ఇంటికి వెళ్ళడం మానేసి  కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి విజయవాడ సిటీ చుట్టి రావడానికి వెళ్ళే వాణ్ణి.

ఇలాంటి ఒక ఆదివారం నా నేస్తాలంతా వేరే వేరే పనుల మీద తలోదిక్కు వెళ్ళడంతో నేను ఒంటరి వాడినైపోయాను. క్రితంవారమే ఇంటికి కూడా వెళ్ళివచ్చాను కనుక ఒంటరిగా తిరిగేసొద్దాం అని ఈడుపుగల్లు నుండి విజయవాడ RTC బస్టాండ్ కు వెళ్ళే సిటీబస్ ఎక్కి రాఘవయ్యపార్క్ దగ్గర దిగాను. మేం సాధారణంగా ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ సర్వేచేసేవాళ్లం బీసెంట్ రోడ్, స్వర్ణాపేలస్, ఆ దగ్గరలోని పాతపుస్తకాల షాపులు, రాజ్ యువరాజ్ థియేటర్ సెంటర్ ఇంకా వాటి దగ్గర రీడింగ్ రూములూ అన్నీ నడిచి తిరిగేవాళ్ళం. నేను కూడా అలాగే తిరుగుతూ కొన్ని పాత పుస్తకాలు కొనుక్కుని చీకటి పడ్డాక డిన్నర్ గురించి ఏంచేద్దామా అని ఆలోచిస్తున్నంతలో ఒక బార్ & రెస్టారెంట్ కనిపించింది. మా కారంపూడిలో పక్కింటి సత్యం వల్లనైతేనేమి ఇంకొన్ని దుస్సంఘటనలవల్ల అయితేనేమి నాకు చిన్నప్పటినుండి కూడా తాగినవాళ్ళను చూస్తే భయం.
గమనిక : సర్వకాల సర్వావస్థలయందునూ ఏవిధమైన ఆల్కహాల్ పానీయమైననూ సేవించుట ఆరోగ్యానికి హానికరమని పిల్లలు పెద్దలు అందరూ గుర్తించ ప్రార్ధన.
కానీ ఆ క్షణం ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది దానికి తోడు లోపలనుండి పలావు ఘుమ ఘుమలు రారమ్మంటూ పట్టిలాగుతున్నాయి, గమనించి చూస్తే అప్పటికింకా ఏడుగంటలే అవడం మూలాన్నేమో పెద్దగా రష్ కూడా లేదు. సరే అని “సాహసం సేయరా ఢింభకా” అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని లోపలికి అడుగుపెట్టాను. ఒక ప్లేట్ పలావు ఒక థమ్సప్ ఆర్డర్ చేసి కూర్చున్నాను. బయటికి పలావు వాసన మాత్రమే వచ్చింది కానీ లోపల సిగరెట్లు మందు నీచు కలిసిన ఘోరమైన వెగటు వాసనతో కడుపులో తిప్పడం మొదలైంది.

“వెయిటర్ ని చూస్తే కాస్త మంచోడు లాగానే కనిపిస్తున్నాడు మనకి కోపరేట్ చేస్తాడంటావా లేక అడగ్గానే పుసుక్కున నవ్వేసి ఆటపట్టిస్తాడా...” అని ఆలోచనలు ఒక వైపు.

“ఎవడికి తిక్కరేగి సినిమాలో చూపించినట్లు బాటిల్ పగలకొట్టి మన మీదకి ఫైటింగ్ కొస్తాడో ఒక వేళ అలా వస్తే వాడ్ని ఎలా ఎదుర్కోవాలి? చేతికి అందుబాటులో ఎమేం వస్తువులు ఉన్నాయ్? మనం బెండ్ అవడానికి ఎటువైపు సామాన్లు లేకుండా ఖాళీ ఉంది? పంచ్ ఎలా ఇవ్వాలి?” అని శివ రేంజ్ లో ఫైట్ ప్లానుల ఆలోచనలు మరొక వైపు..

“ఇక్కడ నన్ను ఎవరైనా చూసి అమ్మకి చెప్తే నా పరిస్థితి ఏంటి? మూడో తరగతి నుండి ఇంతవరకూ తన్నులు తినలేదన్న రికార్డ్ బ్రేక్ అవుతుందా? చదువు మానిపిస్తారా?..” అన్న ఆలోచనలు మరో వైపు ఇలా నానావిధాలుగా టెన్షన్ పడుతుండగా వెయిటర్ ఫుడ్ తెచ్చాడు.

అతన్ని “ఒక్క క్షణం బాస్” అని ఆపి “ఒక క్వార్టర్ విస్కీ బాటిల్ తెస్తావా ఖాళీది” అని అడిగాను. అతనొకసారి వార్నీ ఈడిక్కూడా మందుగావాల్సొచ్చిందా అన్నట్లు పైనుండి కిందకి చూసి చిరాగ్గా “ఏం బ్రాండ్?” అని అడిగాడు. దానికి నేను “ఆహ ఏ బ్రాండ్ ఐనా పర్లేదు ఖాళీబాటిల్ కావాలి దాన్లో ఈ థమ్సప్ పోసి ఇవ్వు” అని అడిగాను. విషయం అర్ధం కాగానే అతని మొహంలో చిరాకు స్థానే ఆసక్తి ప్లస్ అల్లరి కనిపించాయ్.. నవ్వుతూ “ఏం బాస్ లవ్వర్ కి టోకరా ఇవ్వడానికా?” అని అడిగాడు. “ఎందుకోకందుకు నువ్వు ఇవ్వరా బాబు” అంటే “కుదరదు బాస్ మాశేఠ్ చూస్తే బిల్ ఏస్తాడు” అన్నాడు. నాకు ఎలాగైనా ఆ క్వార్టర్ బాటిల్ లో కూల్ డ్రింక్ పోసుకుని వెళ్ళి మావాళ్ళ ముందు దేవదాస్ రేంజ్ లో కలర్ ఇవ్వాలన్న కోరిక పెరిగిపోతుంది. సరదా గురించి చూస్తున్నానే కానీ ఆ సీసా నేను క్యాంపస్ లోకి తీసుకువెళ్తే ఒకవేళ అదిబయటపడితే వచ్చే అనర్థాలగురించి ఆ క్షణం ఆలోచించలేదు.
మెటల్ ఆల్కహాల్ ఫ్లాస్క్
అతనికి ఒక 10 రూపాయలు టిప్ ఇచ్చి “వెళ్ళి మీ శేఠ్ కి ముందే విషయం చెప్పి తీసుకురా” అన్నాను. మొత్తానికి విజయవంతంగా థమ్సప్ నింపిన క్వార్టర్ బాటిల్ సంపాదించి దాన్ని పుస్తకాలతో పాటు ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ లో పడేసి దర్జాగా ఊపుకుంటూ నడవడం మొదలుపెట్టాను. కౌబోయ్ సినిమాల్లో హీరోలు స్టీల్ ఆల్కహాల్ ఫ్లాస్కుల్లోంచి తాగుతున్నట్లు నేను ఈ క్వార్టర్ బాటిల్ ఎత్తి తాగుతుంటే చుట్టూ నా ఫ్రెండ్సంతా హీరోవర్షిప్ తో నా వైపు ఆరాధనాపూర్వకంగా చూస్తూ “అబ్బ వీడెంత గ్రేట్ రా, వీడికెంత ధైర్యంరా, హాస్టల్ కి మందు తెచ్చుకొని తాగుతున్నాడు..” అని వాళ్ళళ్ళో వాళ్ళు చెవులు కొరుక్కుంటూ గుసగుసలాడుకుంటున్నట్లుగా కలల్లో తేలిపోతూ ఒక ఐదు నిముషాలు నడిచానో లేదో ఉన్నట్లుండి ఎక్కడినుంచో సీసా భళ్ళుమని బద్దలైన పెద్ద శబ్దం !!!

సీసాతో పాటు నా కలలు కూడా బద్దలై వాస్తవంలోకి వచ్చి ఎక్కడా అని తలదించి చూస్తే.. కవర్లో సీసా ముక్కలు ముక్కలై... థమ్సప్ నేను కొన్న పుస్తకాలని పూర్తిగా తడిపేసి గాజుపెంకులు ప్లాస్టిక్ సంచికి చేసిన కన్నంలోంచి కిందకి కారుతూ నా ప్యాంట్ పైకి కూడా చింది అంతా బంక బంకగా ఖంగాళీ సీన్. అనుమానం వచ్చి తల ఎత్తి పక్కలకి చూస్తే ఒకరిద్దరు అనుమానంగా నా వైపే చూస్తూ కనిపించారు. హిహిహి అని ఒక వెర్రినవ్వు నవ్వి హమ్మయ్య పర్లేదు ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు లేదులే అని తల మరోపక్కకి తిప్పగానే పక్కనే కిళ్ళీ బంకు దగ్గరనుండి నిర్లక్ష్యంగా సిగరెట్ కాలుస్తూ “ఏంట్రా అది?” అని అడుగుతూ ఒక కానిస్టేబుల్ నా వైపు నడవడం మొదలెట్టాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయ్ “ఒరేయ్ వేణుగా ఐపోయిందిరా.. నీ జీవితం మఠాష్.. జాగ్రత్తగా డీల్ చేయకపోయావో నీశేషజీవితమంతా జైల్లోగడపాల్సిందే.. నీ ఎంకమ్మా.. నువ్వూ నీ దిక్కుమాలిన ఐడియాలు..” అని నన్ను నేనే మనసులో బండ బూతులు తిట్టుకుంటూ సాధ్యమైనంత నవ్వుముఖంతో మాక్సిమమ్ మర్యాదతో ఇది సార్ జరిగింది కావాలంటే ఆ బార్ లో వెయిటర్ సాక్ష్యం సార్ అని మొత్తం స్టోరీ వినిపించాను.
మరి నా ఫేస్ లో అమాయకత్వం కనిపించిందో, నా భయం చూసి జాలేసిందో, నా మాటతీరు నచ్చిందో, తను వయసులో ఉన్నపుడు చేసిన అల్లరి గుర్తొచ్చిందో గాని అతనుకూడా టోన్ మార్చేసి నవ్వుతూ “అల్లరి చేయాలనుకుంటే చాలదోయ్ తగిన తెలివితేటలు కూడా ఉండాలి... డ్రింక్ లో గ్యాస్ ఉంటుంది కదా నువ్వు సంచి ఊపడంవల్ల లోపల ప్రెజర్ ఎక్కువై సీసా పగిలి ఉంటుందిలే కంగారు పడకు..” అని సర్దిచెప్పి బంకులో ఇంకో క్యారీబ్యాగ్ ఇప్పించి “పుస్తకాలు అందులో పెట్టుకుని బుద్దిగా హాస్టల్ కి వెళ్ళు..” అని పంపించాడు. నేను తిరిగి చూడకుండా అదిరే గుండెని అరచేత పట్టుకుని ఎలాగో హాస్టల్ లో పడ్డాను. అలా హీరోనవుదామనుకున్న నా కల నెరవేరక జీరోగా మిగిలిపోవడమే కాక ఎంత ఆరబెట్టినా ఆ పుస్తకాలకు ఉన్న బంక వదలక చాన్నాళ్ళపాటు వాటిని ముట్టుకున్నపుడల్లా ఆ పోలీస్ మొహమే గుర్తొచ్చి వణుకొచ్చేది.

ఇప్పుడు ఎప్పుడైనా ఈ సంఘటన గుర్తొస్తే ఇలా అనిపిస్తుంటుంది.. అప్పట్లో ఇంత టెర్రరిజం లేకపోబట్టి గానీ అదే ఇప్పటి రోజుల్లో ఐతే ముందు నన్ను షూట్ చేసేసి తర్వాత ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఉండేవాడేమో.
గమనిక : ఆల్కహాల్ సేవించుట ఆరోగ్యానికి హానికరమని పిల్లలు పెద్దలు అందరూ గుర్తించ ప్రార్ధన. అది శరీరంపై కలుగజేయు దుష్ఫలితాల గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది చిత్రం చూడండి.

శనివారం, ఏప్రిల్ 17, 2010

హాస్టల్ - 5 (శతృవు)

పిల్లల్ని కొట్టి శారీరకంగా హింసించే తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్ పాలిట, వారి వ్యక్తిత్వం పాలిట మొదటి శతృవులు అని నా ప్రఘాడ విశ్వాసం. అయితే ఇది నాలుగు గోడల మధ్య అయినపుడు కొంతలో కొంత పర్వాలేదేమో అనిపిస్తుంది, కానీ  పిల్లలకు కూడా ఆత్మ గౌరవమనేది ఒకటుంటుందనే విషయం మరిచి నలుగురు ముందు హేళన చేయడం, చేయి చేసుకోడం, అవమానించడం లాంటి పనులతో వారిని మానసికంగా గాయపరిచే తల్లిదండ్రులు భవిష్యత్ లో ఆ పిల్లలు సైకోలు గా తయారవడానికి స్వచ్చందంగా రహదారులు వేస్తున్నారు అని నా అభిప్రాయం. అయితే ఇది అన్ని సార్లు కరెక్ట్ కాదు అని నిరూపించిన వాడు మా రాజేష్ (పేరు మార్చడమైనది), వాడు ఇంటర్మీడియేట్ లో నా క్లాస్మేట్, నాతో కలిసి మా సిద్ధార్ధ లోనే చదువుకున్నాడు.

గత టపా లలో మా కాలేజ్ బిల్డింగ్ చూశారు కదా, బిల్డింగ్ ముందు బోలెడంత ఖాళీ స్థలం ఉండేది పక్కన పెద్ద పెద్ద చెట్లతో మాంచి ఆహ్లాదకరంగా ఉండేది. ఒకో రోజు ఉదయం పూట స్టడీ ఆవర్ ఆ ఆవరణలో పెట్టేవారు. ఓ రోజు అలానే పిల్లలందరం (అన్ని సెక్షన్స్ కలిపి ఒక వందమంది వరకూ ఉంటాం) కూర్చుని నిశ్శబ్దంగా చదువుకుంటున్నాం. అంతలో ఎవరో కోపం అసహనం కలిపి పెద్ద పెద్ద అడుగులు గట్టిగా వేసుకుంటూ రావడం వినిపించి ఒక్క సారిగా అందరి తలలు ఆ వైపు తిరిగాయి. "సార్ మా రాజేష్ ఎక్కడ సార్" అంటూ అడిగారు ఆ వచ్చినాయన, ఆసరికే విషయం తెలిసిన కొంతమంది పిల్లలు గుస గుసలాడుకోవడం మొదలెట్టారు ఇంకొందరు చిన్నగా నవ్వుకోవడం మొదలెట్టారు. కూర్చున్న పిల్లల్లో వెదికి చూస్తే రాజేష్ కనిపించ లేదు.

ఆ వచ్చినాయన కోపం నషాళానికంటడం మాకందరికీ తెలుస్తూనే ఉంది. ఇంతలో ఒక వార్డెన్ లేచి మీ అబ్బాయి ఈ రోజు కడుపు నొప్పిగా ఉందని స్టడీ అవర్ కి రాలేదండీ రూంలోనే ఉన్నాడు అని చెప్పారు. పాపం మా వార్డెన్ గారు వాడికి సాయం చేద్దామని చెప్పారో వాడి మీద కక్షకొద్దీ చెప్పారో కాని ఆయన దండకం మొదలెట్టారు ".... అన్నీ నాటకాలు సార్ ఏడీ.. ఎక్కడ వాడి రూం..." అని ఉరిమేంతలో విషయం కాస్త ఆలశ్యంగా తెలిసినట్లుంది మా వాడు మాంచి నిద్ర కళ్ళతో నిద్ర ఎక్కువై ఉబ్బిపోయిన మొహంతో ఓ పుస్తకం పుచ్చుకుని బయటకి వచ్చాడు. వాడ్ని ఆ అవతారం లో చూసిన ఆయన ఇక ఎక్కడ ఉన్నారూ ఏమిటీ అనే విషయం మరిచి పోయి శివతాండవం మొదలెట్టేశారు, బెల్ట్ తీసి అందరి ముందు మా వాడికి వీరలెవల్ లో చాకిరేవెట్టేశారు.

ఇటువంటి సంఘటనలు కోకొల్లలు, అలా అని మా వాడు సుద్ద మొద్దు అల్లరి తప్ప ఏమీ ఎరగని వాడు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే :-) వాడు మా క్లాస్ టాపర్స్ లో ఒకడు కానీ ఎంత ఇంటెలిజెంటో ఎంతబాగా చదివి మార్కులు తెచ్చుకునేవాడో అంతే అల్లరి కూడా చేసేవాడు. ఉదాహరణకి పరోఠాల బిజినెస్ బ్యాచ్ లో వీడూ ఓ మెంబర్. అలానే తక్కువసేపు చదివినా (కనీసం మాకందరికి అలా కనిపించినా) మార్కులు మాత్రం చాలా బాగా వచ్చేవి. అసలు వాడిది విజయవాడే అదీకాక వాడి తెలివికి వాడికి రెసిడెన్షియల్ కాలేజ్ అవసరం లేదు కానీ ఇంట్లో ఉంటే చదవడు అని వాళ్ళనాన్న ఇక్కడ చేర్చారు.

అసలు వాళ్ళ నాన్న గారి మితిమీరిన క్రమశిక్షణ వల్ల వీడు ఇలా బాగు పడ్డాడా లేక వీడు ముందునుండి ఇంటెలిజెంట్ అయినా కూడా అల్లరి ఉండటం వలన కేవలం అదుపులో పెట్టడానికి ఆయన ఇలా చేస్తున్నారా అన్నది నాకు ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్నే. ఆయన అన్ని కొట్టినా తిట్టినా మా వాడికి చీమ కుట్టినట్లు కూడా ఉండేది కాదు అస్సలు పట్టించుకోడు అదేమంటే "ఆయనంతే బాబాయ్ అయినదానికి కానిదానికి అలానే కొడుతుంటారు మనం లైట్" అని చాలా తేలికగ అనేసేవాడు. ఆయన ఫ్లోలో ఆయన వెళ్తుంటే మా వాడి ఫ్లోలో మా వాడు వెళ్తుంటాడు.

ఇలాంటి మా రాజేష్ ఓ ఆదివారం ఔటింగ్ కి ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు సాయంత్రం తీసుకుని వచ్చి కాలేజ్ లో దిగబెట్టారు. వీడ్ని ఇక్కడ దించేసి ఒక అరగంట గడిచిందేమో ఆయన తిరిగి మళ్ళీ కాలేజ్ కి వచ్చారు "ఏమైంది అంకుల్" అని అడిగితే "మీ ఫ్రెండ్ కి డబ్బులు ఇవ్వడం మర్చిపోయానమ్మా నా జేబులోనే ఉండిపోయాయ్ ఒక సారి పిలవండి" అని చాలా సౌమ్యంగా అడిగారు. ఆహా మా అంకుల్ ఇంత కూల్ గా కూడా ఉంటారా అనుకుంటూ మా వాడు ఎక్కడ ఉన్నాడా అని వెతకడం మొదలెట్టాం.

క్యాంపస్ అంతా గాలించినా మా వాడు ఎక్కడా కనిపించలేదు. ఆయన సహనం మెల్లగా నశించడం మొదలెట్టింది, "మాకివ్వండి అంకుల్ మేము ఇస్తాం" అని అడగడానికి మాకు మొహమాటం అడ్డం వస్తుంది. క్షణ క్షణానికి ఆయన మొహంలో ఫీలింగ్స్ మారిపోతున్నాయ్ "మీకు తెలిసే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడో చెప్పండమ్మా" అని అడుగుతున్నారు మేం "వీడికి మళ్ళీ మూడింది రా బాబు" అనుకుంటున్నాం. ఇంతలో మా వెనక నుంచున్న కుర్రాడొకడు సినిమాకి వెళ్ళాడనుకుంటా అంకుల్ అని ఉప్పందించాడు.

సాధారణంగా మేం కొత్త సినిమాలకి వెళ్ళాలంటే ఇటు కంకిపాడు కానీ లేదంటే అటు విజయవాడ కానీ వెళ్ళాలి. మా కాలెజ్ కి దగ్గరలో ఈడ్పుగల్లు ఊర్లోనో లేదంటే ఇంకొంచెం దూరంలోనో ఒక సినిమా హాల్ ఉండేది దాని పేరు సరిగా గుర్తులేదు. వాడు ఏవో పాత అరిగిపోయిన సినిమాలు తెచ్చి వేస్తుంటాడు. దాని టికెట్‍కౌంటర్ సినిమా నడుస్తున్నంత సేపు తెరిచే ఉంటుంది, మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి టిక్కెట్ కొనుక్కుని లోపల కూర్చోవచ్చనమాట. గాలిరావడం కోసమని సాయంత్రం ఫస్ట్ షో సెకండ్ షో జరిగేప్పుడు తలుపులు కూడా వేయరు, మాంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫీల్ వస్తూ చాలా బాగుంటుంది లెండి. ఆ రోజు ఆ థియేటర్ లో వెంకటేశ్ విజయశాంతి నటించిన శతృవు సినిమా నడుస్తుంది.

మా రాజేష్ గాడు వాళ్ళ నాన్న రిటర్న్ బస్  ఎక్కడం ఆలశ్యం ఇంకొంతమంది కోతి బ్యాచ్ ని వేసుకుని ఆ సినిమాకి చెక్కేసాడు. సినిమా మాంచి హుషారుగా నడుస్తుంది మావాడు జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమాలో వాలీబాల్ గ్రౌండ్ లో ఫైట్ సీన్ నడుస్తుంది. హీరో బాల్ పట్టుకుని దాని మీద కాలు పెట్టి ఇలా స్టైల్ గా నుంచున్నాడు "ఇక చూడ్రా విలన్ నాయాళ్ళకి ఇత్తడైపోతుంది.." అని కామెంట్ చేస్తూ మావాడు సడెన్ గా తెరకి ఎవరో అడ్డం వచ్చేసరికి "హెయ్ తప్పుకోవోయ్.." అంటూ తలపైకెత్తాడు. స్క్రీన్ మీద వెంకీ బాల్ మీద కాలేసి ఈ ఫోటోలో చూపించినట్లు నుంచునుంటే వీడి ఎదురుగా వీళ్ళనాన్న కుర్చీపై ఒక కాలుపెట్టి ఇలా నుంచుని సీరియస్ గా చూస్తున్నాడు. ఇక ఇత్తడి ఎవరికైందో ఇంత టపా చదివాక మీకు ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు కదా.. కాలర్ పుచ్చుకుని లేపి "ఎదవా కాలేజ్ లో దింపి అరగంట కూడా కావడం లేదు అప్పుడే సినిమానా....." అంటూ వీర ఉతుకుడు ఉతికేశారు ఆ హాల్లోనే...

శనివారం, ఏప్రిల్ 03, 2010

హాస్టల్ - 4 (పరోఠాల బిజినెస్)

మా కాలేజ్ విజయవాడ కు దగ్గరలో బందరు వెళ్తుంటే ఈడ్పుగల్లు అనే గ్రామానికి ఒక కిలోమీటర్ ఇవతల ఉంటుంది. అంటే మేమున్న ఏరియాని కూడా ఈడ్పుగల్లు అనే అనేవారు. మాకు ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం లో బందర్ రోడ్డు లోనే విజయవాడ వైపు గంగూరు అనే ఊరుండేది. అక్కడ మా కాలేజ్ కన్నా కాస్త మంచి పేరున్న నలంద రెసిడెన్షియల్ కాలేజ్ ఉండేది. దానికన్నా ముఖ్యంగా గంగూరు బస్టాప్ దగ్గర ఒక ధాభా ఉండేది, దాని పేరేంటో గుర్తు లేదు కానీ మేమంతా దాన్ని గంగూరు ధాభా అనే పిలిచేవాళ్ళం. అక్కడ పరోఠాలు చాలా బాగుండేవి.పరాఠాలు అంటే నార్త్ ఇండియన్ ఆలూ పరాఠా, మేతీ పరాఠా, గోభీపరాఠా లాంటి సాథారణమైన పరాఠాలు కాదు. అసలు సిసలు కేరళ పరోఠాలు, పొరలు పొరలుగా ఉండి షేరువా తో కలిస్తే అత్యద్భుతమైన రుచిని తమ సొంతం చేసుకున్న పరోఠాలు అనమాట.

మా కాలేజ్ లో ప్రతి ఆదివారం ఉదయం పరీక్ష పెట్టేసి, అదయ్యాక పన్నెండు గంటలకి లంచ్ చేసాక బయటకి వదిలేవారు. వెళ్ళేప్పుడు గేట్ దగ్గర రిజిస్టర్ లో సంతకం చెసి అదేరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా తిరిగి వచ్చేయాలి. దగ్గర లో ఊర్లున్న వారు అంటే మా నరసరావుపేట గంటన్నరే కాబట్టి నాలాంటి వాళ్ళు ఊరు వెళ్ళి తిరిగి సోమవారం ఉదయం క్లాసు ల టైం కి వచ్చేసే వాళ్ళం. కాస్త దూరంగా ఉండే వాళ్ళు అలానే ఇంటి మీద ఆట్టే బెంగ లేని జనాలు బేవార్సు గా విజయవాడ సిటీ లోనో కంకిపాడు విలేజ్ లోనో తిరిగేసి ఒకటీ అరా సినిమాలు చూసేసి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. అలా ఔటింగ్ ఇచ్చిన సంధర్భంలో నలందా లో చదువుతున్న ఫ్రెండ్స్ ద్వారా అనుకుంటాను మా కాలేజ్ వాడెవడో ఆ ధాబా లోని పరోఠాల రుచి పట్టుకున్నాడు. అంతే అది మా కాలేజ్ లో కాస్త ఏక్టివ్ గా ఉండే ఒకరిద్దరికి అంటించాడు. అసలే హాస్టల్ తిండి మరి రుచికరమైన పరోఠాలు దొరుకుతుంటే ఎవరు వదిలేస్తారు చెప్పండి.

నాకు పరోఠాలు పార్సిల్ తెచ్చుకుని తినడం కన్నా హోటల్లో తినడమే బోలెడంత ఇష్టం. అసలు కేరళ పరోఠాలు తినడం ఓ ఆర్టు, అక్కడక్కడా కర కర లాడుతూ గట్టిగా, అక్కడక్కడా మెత్తగా పొరలు పొరలు గా పొగలు గక్కే పరోఠాను అరిటాకు వేసిన ప్లేట్ లో అరిటాకు పై పెట్టి పక్కన ఒక గిన్నెలో షారువా, గుండ్రని చక్రాల్లా కోసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న నిమ్మచెక్క ఇవన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టగానే జీహ్వ జివ్వున లాగేస్తుంది. నిమ్మ చెక్క ని పరోఠాపై పిండి ఆ వేడికి కమ్మటివాసనలు వెదజల్లుతుంటే వాటిని ఆస్వాదించేసి. ఆపై కాస్త మెత్తని పరోఠా ముక్కని తుంచి షారువాలో ముంచి తీసి నముల్తూ ఓ చిన్న ఉల్లిపాయ ముక్కని కసుక్కుని కొరికి దాన్తో పాటు నమిలేస్తే సూపరు. ఆపై కాస్త గట్టి పడిన పరోఠాముక్కలని షారువా కప్ లో వేసి నానేసి ఆపై తింటే ఆహా ఆ మజానే వేరు :-) నేను ఇలా ఆస్వాదించడానికే ధాబాలో తిండానికి ఇష్టపడేవాడ్ని.

ఇక్కడ నాకు నచ్చిన ఇంకో ఐటం బోన్లెస్ చికెన్ పలావ్, మాములు మన హైదరబాద్ పారడైజ్ బిర్యానీ లా ఘాటైన మసాలాలు దట్టించకుండా అతి తక్కువ మసాలాతో కమ్మని పలావ్ రైస్ సగం ప్లేట్ నిండుగా పెట్టి దాని పైన కమ్మగా వండిన బొన్లెస్ చికెన్ కర్రీ పరిచేవాడు. మసాలా నిండిన చికెన్ తప్ప మరో కూర ముక్క కానీ ఉల్లిపాయ ముక్క కానీ తగలదనమాట బహు కమ్మగా ఉండేది లెండి దాని రుచి. ఈ రెండిటి కోసం నేను ధాబాకు వెళ్ళి తినే వాడిని ఔటింగ్ కు వెళ్ళినపుడు అపుడపుడు. సహజంగా నేను ఆదివారం ఔటింగ్ సమయంలో నరసరావుపేట్ వెళ్ళిపోయే వాడ్ని కనుక మధ్యలో నే పుచ్చుకునే ఔటింగ్ లను ఇలాంటి పనులకు ఉపయోగించుకునే వాడ్ని.
 
ఇక ఆ ధాబాలో ఒక పేద్ద సైజు పరోఠా, చిక్కని కమ్మటి షారువా, చిన్న నిమ్మచెక్క, నాలుగు ఉల్లిపాయలు మొత్తం కలిపి నాలుగు రూపాయలకు ఇచ్చేవాడు. మా వాళ్ళు నైట్ స్టడీ అవర్ అయ్యాక పదిగంటల టైం లో కాలేజ్ వెనక ప్రహరీ గోడ మీద నుండి చెఱుకు తోటలోకి దూకి దాని నుండి మెయిన్ రోడ్ మీదకు వచ్చి, లారీ ఏదైనా పట్టుకుని గంగూరు వెళ్ళి పార్సిళ్ళు పట్టుకు వచ్చేవారు. ఈ ప్రయత్నాల్లో ఒకోసారి భారీ దెబ్బలే తగిలించుకునే వారు, మరి అంత రిస్క్ తీసుకుంటున్నారు కదా అందుకని వాళ్ళు ఒకో పరాఠా అయిదు రూపాయలకు అమ్మే వాళ్ళు. అదేకాక వీళ్ళు ఒకో సారి ముఫ్ఫై కి తగ్గకుండా ఒకోసారి నలభై యాభై పరోఠాలకౌ ఆర్డర్ లు కూడా తీసుకు వెళ్ళడంతో ఆ ధాబా వాడు వీళ్ళకి ఫ్రీగా పరోఠాలు పెట్టడమే కాకుండా టోకున కాస్త డిస్కౌంట్ కూడా ఇచ్చేవాడు. అవన్నీ మా వాళ్ళకు లాభాలనమాట.

అలా మెల్లగా చెఱుకు తోటని వదిలేసి పరోఠాల పై పడ్డారనమాట మా కుర్రాళ్ళు, అయితే చెఱుకు తోట విషయం లో లాగా ఇందులో దెబ్బలు తినాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే వార్డెన్లు కూడా తెప్పించుకునే వాళ్ళు, అదీకాక అందరికీ లాభాలే కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అనుకుంటా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దిన దిన ప్రవర్థమానమై మేమున్నన్నాళ్ళు పరోఠాల బిజినెస్ వర్ధిల్లింది.

గురువారం, ఏప్రిల్ 01, 2010

హాస్టల్ - 3 ( చెఱకు తోట )

మా కాలేజ్ బిల్డింగ్ పొడవుగా ఉండేది మొత్తం నాలుగు అంతస్థులు. ఈ పక్కన ఫోటోలో ఉన్నది మాకాలేజే :-)  కింది ఫ్లోర్ లో హాస్టల్ రూంస్ పై ఫ్లోర్స్ లో కొన్ని క్లాస్ రూంస్ మరియూ హైస్కూలు క్లాసులు జరిగేవి వాటికి పైన డాబా మీద ఒకవైపు వరుసగా మా క్లాస్ రూములు వాటికి ముందు బోలెడంత ఖాళీ స్థలమూ ఉండేది. పగలు రూముల్లో క్లాసులు జరిగితే ఉదయం సాయంత్రం ఆ ఆరుబయట డాబా మీద స్టడీ అవర్ జరిగేది. మొదట్లో కిందే కూర్చునే వాళ్ళం డాబా చుట్టూ నాలుగడుగుల ఎత్తు పిట్ట గోడ ఉండేది. పైన ఆర్చిల్లా కనబడుతున్నాయ్ కదా అవి నా ఫస్టియర్ లాస్ట్ లో కట్టారు లేండి. ఒక రోజు రాత్రి స్టడీ అవర్ లో ఎనిమిది గంటల సమయంలో ఆ గోడ వెంబడి కూర్చొని చదువుకుంటూ మధ్యలో ఎందుకో తలఎత్తి అవతలకి పొలాల వైపు చూశాను. దూరంగా ఎకరాలకి ఎకరాలు తగలబడి పోతూ కనిపించాయి ఫారెస్ట్ ఫైర్ అంటారు అలా చేలల్లో కూడా ఏదో పేద్ద అగ్నిప్రమాదం ఏర్పడింది కాబోలు ఇపుడు అది అంతా పాకి చుట్టు పక్కల పొలాలు అన్నీ తగలబడి అలానే మా కాలేజ్ కూడా తగలబడి పోతుందేమో అని సందేహం వచ్చింది. ఎవర్నన్నా అడుగుదామంటే వార్డెన్ తో పాటు ఏఓ ప్రభాకర్ గారు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. ఇపుడు పక్క వాడితో మాట్లాడుతూ దొరికిపోతే మక్కెలిరగతంతారు. అయినా నించుని ఉన్నారు కదా వాళ్ళకు కూడా అవి కనపడుతుంటాయ్ కదా మరి ఎందుకని వాళ్ళేం మాట్లాడటం లేదు అని నాలో నేను అనుకుని ఆ మంటల వైపు ఒక కన్నేసి క్షణానికో మారు పక్కలకి పాకాయేమో గమనిస్తూ కాసేపు గడిపాను. కానీ అశ్చర్యంగా గిరి గీసినట్లు ఒకే చోట ఆగకుండా మండుతున్నాయ్ తప్ప ఎటూ కదలట్లేదు అనిపించింది. కాసేపటికి భయం స్థానాన్ని కుతూహలం ఆక్రమించింది.

ఆ తర్వాత ఎవర్ని దాని గురించి అడిగినా అదో పేద్ద కధ అని చెప్పేవారే కాని అసలు కథేంటో చెప్పేవారు కాదు. చివరికి నే తెలుసుకున్నది ఏమిటంటే... మా కాలేజ్ విజయవాడ దగ్గరలో ఉన్న ఈడ్పుగల్లు లో ఉందని ముందే చెప్పుకున్నాం కదా. అది కూడా ఊరు చివర్లో పొలాల మధ్య లో ఉండేది. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ పుణ్యమా అని మా చుట్టు పక్కల ఆ ఏరియాలో అంతా చెఱకు పంట ఎక్కువగా వేసే వారు.. చెఱకు కోసేసాక దాని చివర ఉండే ఆకులూ, చెత్తా, చెదారం అన్నీ చేనులోనే తగలపెట్టేస్తారుట అదంతా తర్వాత వేసే పంటకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుందట అందుకనే అవన్నీ కావాలని రగిలించిన మంటలు అని అటు ఇటు పాకకుండా తగు జాగ్రత్తలు తీసుకుని తగల బెడతారనీ మనకొచ్చిన ప్రమాదమేమీ లేదని తెలుసుకుని స్థిమిత పడ్డాను. మా కాలెజ్ వెనకాలే గోడకి ఆనుకుని ఒక ఎకరం చేను ఉండేది. సరిగా నేను చేరిన సంవత్సరమే మా కాలేజ్ పక్కన చేనులో చెఱకు పంట వేసుకున్నాడు ఆ రైతు. మా కాలేజ్ మొదలయ్యే సరికి పంట మంచి ఏపుగా ఎదిగి చక్కని చెఱుకులు నోరూరిస్తూ ఉండేవి. ఇక మా కోతి మూక భారిన పడకుండా వాటిని ఏడడుగుల ప్రహరీ గోడ ఏమాత్రం కాపాడ గలదు చెప్పండి. ఆ ప్రహరీకి పైన ఉన్న పదునైన గాజు పెంకులు సైతం ఏమాత్రం ఆపలేకపోయేవి.

అసలు చెఱకు తో నా ప్రణయం ఈనాటిది కాదు మొదటి సారి కోటప్ప కొండ తిరునాళ్ళలో మొదలైంది. ఆరోజు నుండీ ఈ రోజు వరకు ఆ ప్రేమ దిన దిన ప్రవర్ధమానమౌతున్నదే కానీ కొంచెం కూడా తగ్గలేదు. మా ఊరు తిరునాళ్ళకు అప్పట్లో ఎక్కడ నుండి తెప్పించే వారో కానీ చెఱకు గెడలు భలే ఉండేవి. నిలువెత్తు పెరిగి నిలువెల్లా నల్లగా నిగనిగలాడుతూ ఆభరణాల్లా కణుపుల దగ్గర మాత్రం తెల్లగా మెరిసిపోతూ చూడటానికే అధ్బుతంగా ఉండేవి. ఇక వాటిలో ఒక మాంచి గడలు ఒక రెండు మూడు నాన్న ఎన్నుకుని వాడికి చెప్పగానే వాడు పదునైన కొడవలితో వాటిని ముక్కలు కొడుతుంటే.. కొడవలి జారుతుందమ్మా అని నన్నో మూడు అడుగులు దూరంగా నించో బెట్టేవారా అయినా అంతదూరం రసం చిమ్మి ఎగిరి వచ్చి మీద పడేది దానికి తోడు కమ్మని వాసన కూడా చుట్టు ముట్టేది. ఇక ఆ ముక్కలని పొడవాటి ఆకుతో కట్టకట్టించుకుని ఎప్పుడెపుడు ఇంటికి చేరతామా అని ఎదురు చూసే వాడ్ని.

ఇక ఇంటికి వచ్చాక చెత్త వేయడానికి ఎదురుగా ఒక న్యూస్ పేపర్ పరచుకుని, మఠంవేసుకు కూర్చుని. చెఱకు ఒక చివర కచక్ మని కొరికి సర్ర్‍ర్‍ర్ర్ మంటూ చప్పుడొచ్చేలా ఒకేసారి 3-4 కణుపులు మీదుగా ఊడొచ్చేలా చెక్కును లాగేసి. ఆ క్రమంలో దానికి ఎక్కడైనా ఎక్కువ కండ పట్టిందేమో చూసుకుని ఒక వేళ పడితే దాన్ని కూడా నమిలేసి, రసం పీల్చేసి, అలా చెఱకు అంతా ఒలిచాక ఓ చివర ఒక లావుపాటి ముక్కను కొరికి దవడ పళ్ళ మధ్యలో పెట్టి గాట్టిగా ఒక సారి నొక్కగానే... నా సామిరంగా... పళ్లమధ్య నుండి చెఱకురసం దాని కమ్మదనం ఒక్కో చినుకులా రాలి, నదులుగా మారి, వరదలై పొంగి ప్రవాహమై నాలుకపై టేస్ట్ బడ్స్ ని నిలువెల్లా ముంచెత్తుతుంటే... ఆహా... ఆ ఆనందం అనుభవించాలే కానీ మాటలలో చెప్పతరమా...

మరి అలాంటి చెఱుకులు ఏపుగా పెరిగి తాజాగా ఉన్న తోటలో నుండి తెంపుకు వచ్చి తినడం అంటే ఏఓ లు వార్డేన్ల మీద ఉన్న భయం ఏమాత్రం ఆపగలదు చెప్పండి. మేము కాలేజి లో చేరిన నెల లోపే ఒక ఉదయం 8 గంటల ప్రాంతంలో బిల్డింగ్ బయట ముఖద్వారం దగ్గర మా ఏఓ ప్రభాకర్ గారు నిలబడి తన గంభీరమైన కంఠస్వరం తో "రేయ్.. అందరూ బయటకి రండ్రా.." అని ఒక్క అరుపు అరిచారు. అంతే దెబ్బకి మంట పెడితే కలుగుల్లోనుండి బయటపడ్డ ఎలుకల్లా భయం భయం గా బిల బిల మంటూ అందరం బయటకి అసెంబ్లీ ఏరియాకి వచ్చి నిలుచున్నాం. ప్రభాకర్ గారు స్టాఫ్ కొందరు వార్డెన్లూ మరి కొందరు కొత్త వ్యక్తులు లోపలకి మా రూముల వైపుకి వెళ్ళారు. అందరం ఏమై ఉంటుందా అని గుస గుసలాడుకోవడం మొదలెట్టాం.. ఇంతలో మా బిబిసి గాడు మోసుకొచ్చిన వార్త ఏంటంటే "పక్కన చెఱుకు తోట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాడుటరా మనవాళ్ళు రాత్రి గోడదూకి తోటలో నానా వీరంగం వేశారుట" అని.

కాసేపటికి లోపలికి వెళ్ళిన మా స్టాఫ్ కొన్ని బక్కెట్లు రూం బయట పెట్టారు ఆ రూముల వాళ్ళని లోపలిక్ పిలిచారు. ఏమిటా ఆ బక్కేట్ల ప్రత్యేకత అని చూస్తే రాత్రి గోడదూకి చెఱుకులు కోసుకొచ్చిన బ్యాచ్ చక్కగా తినేసి ఆ పిప్పి ఎక్కడ పడేయాలో అర్ధంకాకో బద్దకించో చక్కగా బక్కేట్ల నిండుగా నింపి ఎవడు చూడొచ్చారు లే అన్నట్లు వాళ్ళ  మంచాల కిందే దాచేశారు :-) అలా దొరికి పోయారనమాట. పాపం ఆ తోటతను సార్ వీళ్ళు తినేది రెండు పాడు చేసేది బోల్డు విత్తనం కోసం వేసిన పంటంతా తొక్కి ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు మాకు బోల్డు నష్టం వస్తుంది అని గోల. ప్రభాకర్ గారు ఏదో సర్ది చెప్పి పంపేశారు. ఇంకోసారి ఇలా చేస్తే తాటతీస్తాను అని చెప్పి మాకందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మా వాళ్ళంతా బుద్దిగా ఉన్నారు అని మీరు భ్రమ పడుతున్నారా :-) కాస్త బద్దకం మాత్రం వదిలించుకున్నారు. ఎలా అంటే శుబ్రంగా తినేసి మా బిల్డింగ్ కి కాస్త దూరంగా ఆ పిప్పి అంతా తిరిగి వాళ్ల తోటలోనే పారవేయడం మొదలెట్టారనమాట :-) పాపం ఆ రైతు ఒకటి రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చి విసుగొచ్చి ఇక మానుకున్నాడు.

మా వాళ్ళు కూడా మెల్లగా చెఱుకు తోట మీద దాడి తగ్గించారులెండి తర్వాత తర్వాత. ఎందుకనో అంటారా.. చిన్న పిల్లల్లా ఇంకా తీయని చెఱుకు లు ఏం తింటాం ప్రస్తుతం మనం కుర్రాళ్ళం కదా మాంచి కారం కారంగా ఏదైనా తినాలి అని పరోఠాల వెంట పడ్డారు లెండి అందుకు. ఆ పరోఠాల కథ కమామిషు ఏమిటో త్వరలో తరువాయి భాగంలో చెప్తాను, అంతవరకూ శలవ్ :-)

మంగళవారం, ఫిబ్రవరి 16, 2010

హాస్టల్ - 2

ఇలా బోలెడు ప్రశ్నలతో నాన్న వెనక నడుస్తూ ఆ చిన్న గేట్ ద్వారా లోపలికి అడుగుపెట్టాం. రిజిస్టర్ లో నాన్న ఏవో వివరాలు నింపిన తర్వాత ఆఫీస్ రూమ్ కి ఎలా వెళ్ళాలో దారి చూపించారు. మెల్లగా ముందుకు నడవడం ప్రారంభించాం. గేటు ఆనుకుని పక్కనే ఒక చిన్న బిల్డింగ్ దానిలో క్యాంటిన్ లాగా ఉంది అక్కడ కాఫీ,టీ,కూల్ డ్రింక్స్, కేకులు, బిస్కట్లు, సబ్బులు, పేస్ట్ లు, షాంపూలు ఇలాంటి నిత్యావసర వస్తువులన్నీ దొరుకుతాయిట. కేకులు బిస్కట్లు కూల్ డ్రింక్ లు చూసాక ఓకే ఇది కొంత వరకూ పర్లేదు, హమ్మయ్య కనీసం ఒక సమస్య తీరింది అనుకున్నాను. అవునూ బయట స్కూల్ బోర్డ్ ఉంది కానీ కాలేజ్ పేరు లేదేంటి అని అడిగితే "ఇదే క్యాంపస్ లో ఒక బిల్డింగ్ స్కూల్ ది ఇంకో బిల్డింగ్ కాలేజ్ ది, కాలేజ్ బోర్డ్ ఇంకా రాయించలేదు త్వరలో పెడతారు" అని చెప్పారు. (తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అసలక్కడ స్కూల్ కు మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే మా వాళ్ళు కాలేజ్ కూడా నడిపేస్తున్నారట, రికార్డ్స్ ప్రకారం మాకాలేజ్ ఈడ్పుగల్లు దగ్గర్లో ఉన్న గోశాల అనే ఊర్లో ఉండాలి)

అలా మరో రెండు అడుగులు ముందుకు వేశామో లేదో "డుగ్ డుగ్ డుగ్ డుగ్.." అని లీలగ మొదలై మాకు మెల్లగా చేరువవుతున్న శబ్దం వినబడింది. మనకి బాగా ఇష్టమైనా నచ్చిన వాటిని చూసినా విన్నా తిన్నా ఏదో తెలియని మధురమైన అనుభూతికి లోనవుతాము, కళ్ళలో మెరుపు మొహం లో వెలుగు ఇత్యాది మార్పులు మనకి తెలియకుండానే జరిగిపోతుంటాయ్. అదిగో నాలో ఆలాంటి మార్పులకు కారణమయ్యే వాటిలో ఒకటి బుల్లెట్ మోటార్ సైకిల్. అసలు ఠీవీగా నిలబడే దాని రూపం చూస్తేనే ముచ్చటేస్తుంది. ఇక అది చేసే శబ్దం వింటే గుండెల్లో మృదంగం మోగిన అనుభూతి నాకారోజుల్లో.

ఆహా ఎక్కడా అని ఆసక్తిగా చూస్తే ఎదురుగా బుల్లెట్ బండి మీద ఒక భారీ ఆకారం వస్తూ కనిపించింది. ఆయన టీవీ భీముడు అంత ఉన్నారు, వయసు యాభై దగ్గరలో ఉండచ్చు, ఇంచు మించు ఏడు అడుగులు ఎత్తు ఉంటారేమో. ఎత్తుకు తగ్గ లావు, కాస్త ఎక్కువే లావు అనచ్చేమో. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన బుల్లెట్ బండి వేసుకు వస్తుంటే ఆయన భారీ ఆకారం కింద అది ఏదో లూనా లా కనిపించింది. గుండెల్లో మృదంగం ఆగిపోయి చెవుల్లో "మహాభారత్.." అని టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ మోగుతుండగా, ఆయన బండి మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయింది. నాకు ముచ్చెమట్లు పోశాయి, వామ్మో హాస్టల్ లో ఈయనేంటండీ బాబు ఒక్క చిటికెన వేలితో ఎత్తి అవతల పడేస్తారేమో సరిగా చదవక పోతే అనుకున్నాను. (తను మాకు కెమిస్ట్రీ చెప్పేవారు మనిషి ఎంత భారీనో మనసు అంత మెతక మమ్మల్ని ఎప్పుడైనా కాస్త గదమడమే కానీ ఎప్పుడూ చెయి చేసుకోలేదు:-)

నాకు అప్పటికే ఉన్న దిగులుకు భయం కూడా తోడవగా మెల్లగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి వెళ్ళాం. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని AO(Administration Officer) గారిని కలవాలి ఆ బెంచ్ మీద కూచుని కాసేపు ఎదురు చూడండి అని చెప్పారు. AO గారి పేరు ప్రభాకర్ మా హాస్టల్ లో తనంటే టెర్రర్. చూడటానికి కాస్త పొట్ట ఎక్కువ పెంచిన మమ్ముట్టీ లా ఉంటారు. మొహానికి కళ్ళద్దాలు మరింత హుందాతనాన్ని తెచ్చిపెట్టి మాకు భయాన్ని గౌరవాన్ని మరింత పెంచేవి. హాస్టల్ కు సంభందించిన అన్ని విషయాలు తనే చూసుకునే వారు. ఆయన్ని కలిసాక  నాన్న "మా వాడు మాకు దూరంగా ఉండటం ఇదే మొదటి సారి కాస్త జాగ్రత్తగా చూడండి" ఇత్యాది జాగ్రత్తలు అన్నీ ఆయనకు చెప్పేసి నాకు కొనాల్సిన సామాన్ల లిస్ట్ ఇస్తే అది పట్టుకుని ఆఫీస్ నుండి బయట పడ్డాం.  

వెంట తెచ్చుకున్న పెట్టె రూం లో పెట్టేసి వెళ్దాం ఒక సారి రూం చూసినట్లు కూడా ఉంటుంది అని బిల్డింగ్ లోపలికి నడిచాం.  పొడవాటి కారిడార్ కు అటు ఇటు రూంస్ ఉన్నాయ్ మొదట ఉన్న కొన్ని రూములు చిన్నవిగా ఉన్నాయ్ ఒకో దానిలో 6-7 మంచాల వరకూ వేసి ఉన్నాయ్. ఒకవైపు రూములన్నీ N1, N2 ఇలా నంబర్లు వేసి ఉంటే వాటి ఎదురుగా  మరో వైపు ఉన్న రూములకు S1, S2 ఇలా నంబర్లు వేసి ఉన్నాయి. నాకు అలాట్ చేసిన రూమ్ చాలా పెద్దది ఒక రూంలో 15-20 వరకూ మంచాలు ఉన్నాయి. అంతమందితో కలిసి ఒకే రూంలో ఉండాలా ఎవరెవరు ఎలాంటి వారో ఎలా ఉండబోతుందో ఇక్కడ అని ఆలోచిస్తూ ఒక బెడ్ ఆక్రమించుకుని నా సామాన్లు పెట్టేసి, ఊరి మీద పడ్డాం. నా దిగులు పోగొట్టడానికి అని నాన్న రాఘవయ్య పార్క్, బీసెంట్ రోడ్ అన్ని ఏరియాలు తిప్పి చూపించారు. ఒక మంచి హోటల్లో భోజనం చేసి కొత్తగా కొన్న సామాన్లతో చీకటి పడ్డాక మళ్ళీ హాస్టల్ చేరుకున్నాం.

సామాన్లు రూం లో ఉంచాక నాన్నకు మా బిల్డింగ్ గుమ్మం దగ్గరే వీడ్కోలు ఇచ్చి తిరిగి రూం లోకి వచ్చాను. ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. అప్పటివరకూ ఉన్న దిగులు రెట్టింపు అయింది, దానికి బెరుకు కూడా తోడయ్యింది. అదేమిటో అంతమంది మధ్యన ఉన్నా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. ఒకరిద్దరు నన్ను చూసి పలకరింపుగా నవ్వారే కానీ అంతకు మించి ఎవరూ మాట్లాడలేదు. (పాపం వాళ్ళకూ కొత్త అన్న విషయం నాకు అప్పట్లో స్పురించలేదు). అప్పటికే పరిచయం అయిన వాళ్ళనుకుంటా కొంతమంది ఒక గ్రూప్ గా రూమ్ కు ఆ చివర  కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఒక సారి నా సామాన్లు చూసుకున్నాను నా సొంతంగా ఒక పరుపు, దిండు, దుప్పట్లు, బక్కెట్, మగ్, ప్లేట్, గ్లాస్, ఒక ట్రంక్ పెట్టె. బట్టలకు విలువైన వస్తువులు డబ్బులు పెట్టుకోవడానికి ఒక విఐపి సూట్ కేస్. ట్రంక్ పెట్టె తీసి చూస్తే నా కోసం ప్రత్యేకంగా సర్ధిన కొన్ని నిత్యావసరాలు పేస్ట్, సబ్బులు లాంటివి చూసుకుని బోలెడు దిగులు పడిపోయాను. మొన్నటి వరకూ ఇంట్లో సరుకులు తెచ్చినపుడు తప్ప వీటిగురించి అసలు పట్టించుకునే వాడ్ని కాదు ఇప్పుడు నాకోసం అన్నీ ప్రత్యేకంగా నేనే మెంయింటెయిన్ చేసుకోవాల్సినవి. బట్టలు కూడా నేనే ఉతుక్కోవాల్సి వస్తుందేమో అని చెప్పారు. ఏమిటో ఈ కష్టాలు అసలు ఇలా ఇంటినుండి ప్రత్యేకంగా వచ్చి నా సామాన్లతో నేను బతకడం ఏమిటో అని ఏడుపు వచ్చేసింది. కాసేపు ఎవరికీ కనపడకుండా ఏడ్చేసి మెల్లగా అలానే నిద్ర లోకి జారుకున్నాను.

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

హాస్టల్ లో నా మొదటి రోజు అలా గడిచిందండీ . నిన్న టపాలో చెప్పినట్లు ఇక పై ఒక సీక్వెన్స్ లో కాకపోయినా నాకు గుర్తున్న కొన్ని సంఘటనలను అపుడపుడూ మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సోమవారం, ఫిబ్రవరి 15, 2010

హాస్టల్ - 1

నల్లగా నిగనిగలాడుతూ, మెలికలు తిరుగుతూ పరుచుకుని ఉన్న తారు రోడ్ పై బస్సు శర వేగంతో ముందుకు వెళ్తుంది. నరసరావుపేట పొలిమేరలు దాటి ఐదునిముషాలవుతుందేమో. కిటికీ పక్కనే కూర్చున్న నా దృష్టి రోడ్ పైనే ఉన్నా ఆలోచనలు మాత్రం బస్సుకన్నా వేగంగా, దారితప్పిన బాటసారిలా ముందుకు వెనక్కు ప్రయాణిస్తూ ఉన్నాయ్. "విజయవాడ ఎంత సేపట్లో వస్తుంది నాన్నా?" ప్రశ్న అడుగుతూ పక్కకి తిరిగిన నాకు, కొద్దిగా తెరిచిన నోటినుండి సన్నగా వస్తున్న గురకే సమాధానమైంది. పాపం నాన్న, ఉదయాన్నే లేచి ఆఫీసుకు వెళ్ళి మధ్యాహ్నం వరకూ పని చేసి వచ్చి హడావిడిగా అన్నంతినేసి నన్ను హాస్టల్ లో దిగబెట్టడం కోసం, మధ్యాహ్నం నిద్ర కూడా మానుకుని బయల్దేరారు. పడుకోనిద్దాంలే ఇపుడు నేను తెలుసుకుని మాత్రం చేసేదేముంది.

దృష్టి మళ్ళీ రోడ్ పై నిలిపాను, ఎండ తీక్షణంగా ఉంది, దూరంగా రోడ్ పై నీటి చెలమలు ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. బస్ ముందుకు వెళ్ళే కొద్దీ అవి మాయమవడమో మరింత దూరం జరగడమో జరుగుతుంది. ఎండమావులు(Mirage) అంటారు ఇవేనేమో!!, కానీ స్కూల్లో టీచర్ చెప్పిన ప్రకారం అవి ఎడారుల్లో కదా కనిపించాలి, ఊర్లో ఇలా రోడ్ మీద ఎందుకు కనిపిస్తున్నాయబ్బా ఏమోలే.. ఎండమావులు పదం ఈ మధ్యే ఎక్కడో విన్నాను కదా ఎక్కడా ?

"అసలు ఈ రెసిడెన్షియల్ కాలేజిలు ఎండమావులు లాంటివమ్మాయ్ దూరంగా ఉన్నంత సేపు మురిపిస్తాయ్ అంతే.. అక్కడికెళ్తే అసలు బండారం బయట పడుతుంది. అయినా మన బంగారం మంచిదవ్వాలి కానీ అంత డబ్బులు పోసి అక్కడ చదివించినా ఉపయోగం ఏం ఉంటుంది చెప్పు డబ్బు దండగ తప్పించి.." నే వినట్లేదనుకున్నారో లేదా విన్నా పర్లేదనుకున్నారో మొత్తానికి స్పష్టంగా నా చెవిన పడ్డ ఒకాయన అమ్మకిస్తున్న ఉచిత సలహా గుర్తొచ్చింది.

"వాడి కంటి చూపు అంతంత మాత్రమే అంత లావు కళ్ళద్దాలు వేసి అంత దూరాల్లో ఒక్కడ్నే ఉంచి చదివించాల్సిన అవసరం ఉందా.. ఇప్పుడు వాడు చదివి ఎవర్ని ఉద్దరించాలిట. ఏం వాళ్ళ నాన్న బిఎ చదివి మాంచి ఉద్యోగం చేయడం లేదా వాడ్ని కూడా ఏ ఆర్ట్స్ గ్రూపులోనో చేర్చి ఇంటిదగ్గరే ఉంచి చదివించచ్చు కదా.." బంధువుల సలహాలు విని చిద్విలాసంగా నవ్వడమే కానీ పన్నెత్తు మాట మాట్లాడని అమ్మానాన్నలు గుర్తొచ్చారు.అసలు బుద్దిగా చదువుకుంటే ఈ బాధలు ఉండక పోవు కదా అత్తెసరు మార్కులు తెచ్చుకోవడం వల్లనే కదా ఈ కష్టాలన్నీ. "ఎవరు చేసిన ఖర్మ వారనుభవించకా.." మనసులోనే పాడేసుకుంటూ మళ్ళీ రోడ్ పై దృష్టి నిలిపాను.

హాయ్!! దూరంగా అదేమిటి ఎడ్లబండా? ఆ, దగ్గరకు వస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది. ఎడ్లు ఏంత ఠీవీగా నడుస్తున్నాయో... ఆస్వాదించేలోపే రయ్ య్ య్... మంటూ మా బస్ దాన్ని ఒక్క క్షణం లో దాటేసింది భలే! హఠాత్తుగా స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ వాళ్ళ ఎడ్లబండిని దాటుకుంటూ వెళ్ళే మోటారు వాహనాలు గుర్తొచ్చాయ్ "నిధిచాల సుఖమా.." కీర్తన గుర్తొచ్చింది. ఎలాగైనా విశ్వనాథ్ గారు సినిమాలు బాగా తీస్తారు కదా. విశ్వనాథ్ బాగాతీస్తారు కానీ ఆయన సినిమాల్లో కొన్ని సరిగా అర్ధం కావు. అదే మాబాసు చిరంజీవైతే కామెడీ చేసినా ఫైట్లు చేసినా డ్యాన్సాడినా ఇరగదీస్తాడు కదా. చిరుని తలుచుకోగానే బోల్డంత ఉత్సాహం అంతలోనే నీరసం తన్నుకొచ్చేశాయి.

రేపటి నుండి జైలు జీవితమేనటగా ఇకపై నరసరావుపేటలో ఫ్రెండ్స్ ని తరచుగా కలవడానికే కుదరదు, ఇక సినిమాల సంగతి సరే సరి. ఫ్రెండ్స్ అంటే సర్లే ఇక్కడ కూడా కొత్త ఫ్రెండ్స్ తయారవుతారు కానీ సినిమాలు ఒకసారి రిలీజై ఎత్తేస్తే మళ్ళీ ఎలా చూడటం. మహర్షి సినిమా అలాకాదు చూడలేకపోయింది. పరీక్షలకు నెల ముందు రిలీజైనా పబ్లిక్ పరీక్షలు అని చెప్పి ఎంత బతిమిలాడినా చూడనివ్వలేదు. పరీక్షలవేసరికి సినిమా ఎత్తేశారు. చాలామంది బాగాలేదన్నారు కాని నామినేని గాడు "చాలా బాగుంది, నీకు కూడా నచ్చుతుంది" అన్నాడు, కానీ నాకు కుదరలేదు. నేను హాస్టల్ లో ఉన్నపుడు రిలీజైన సినిమాలు ఎలా చూడాలో ఏమిటో :-(

అరె!! ఆలోచనల్లోనే విజయవాడ వచ్చేసిందా! వావ్ ప్రకాశం బ్యారేజ్ ఎంత అందంగా ఉందో కదా. బాబోయ్ నది ఒడ్డునే ఎంత ఇరుకుగా ఇళ్ళుకట్టుకున్నారో, ఎంతైనా పెద్ద ఊర్లంటే అలాగే ఉంటాయ్ ఏమోలే అందరూ ఇక్కడికే వస్తుంటారు కదా. అవునూ విజయవాడ అంటే మంచి రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్ లూ ఊహించుకుంటే ఇదేమిటీ ఇలా ఉంది?. ఇలా నాలో నేను చూసిన ప్రతి దాన్నీ ప్రశ్నించుకుంటూ ముందుకు సాగుతూనే నాన్న వెంట కాలేజి గేట్ ముందు బస్ దిగాను. ఎదురుగా పెద్ద గేట్ దానికి  రెండు పెద్ద పెద్ద నల్లని తలుపులు, ఈ చివర నుంచి ఆ చివరికి నిలువు చువ్వలు,వాటి వెనకగా మందపాటి పెద్ద రేకు ప్రతి చువ్వపైన మొనదేలిన కొసలతో త్రిభుజాకారపు ఆక్రుతులు, బహుశా పిల్లలెవరైన గేటు దూకే ప్రయత్నం చేస్తే అవి గుచ్చుకుని ఆగిపోడానికేమో.

గేటుకి ఒక మూల ఒక మనిషి మాత్రమే పట్టే మరో చిన్న తలుపు. "ఇదేదో అచ్చంగా సినిమాల్లో చూపించే జైలు గేటు లా ఉందే. నిజంగా హాస్టల్ కే వచ్చామా లేక బస్ వాడు పొరబాటున ఏదైనా జైలు ముందు దించేశాడా ?" ఒక వేళ నేను ఇంట్లో ఆబద్దాలు చెప్పి అప్పుడప్పుడూ కొట్టేసిన ఐదు పది రూపాయలకు నాకు జైలు శిక్షవేస్తే నాకు చెప్పకుండా నాన్న ఇక్కడకు తీసుకువచ్చారా ? హబ్బే ఆబద్దాలకి, అదీ ఇంత పెద్ద జైల్లో శిక్ష వేయరేమో లే. అవునూ ఆమూల  చిన్న బోర్డేదో కనపడుతుంది కదా చూద్దాం. ఓ సారి కళ్ళద్దాలు సవరించుకుని చదివాను "సిద్దార్థ రెసిడెన్షియల్ స్కూల్, ఈడ్పుగల్లు" హమ్మయ్యా ఇది జైలు కాదు. కానీ నేను కాలేజి లో జాయిన్ అవడానికి కదా వచ్చింది ఇదేంటి నన్ను స్కూల్ కి తీసుకు వచ్చారు ? ("ఈ పక్కన ఫోటోలో చూపింది మా కాలేజ్ గేట్ కాదు లెండి ఇంచు మించు ఇదే స్టైల్ లో ఇంకా ఎత్తుగా ఉండేది మా గేట్")


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
నేను విజయవాడ సిద్దార్ధ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివాను. ఆ ఙ్ఞాపకాలు ఈ టపాల సిరీస్ ద్వారా పంచుకుందామని నా ఈ చిన్న ప్రయత్నం. ఇది సీరియల్ అని చెప్పను కాని అక్కడక్కడా టపా నిడివి దృష్టిలో పెట్టుకుని రెండు మూడు టపాలకు పొడిగించే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్ టపాలలో ఒకదానితో ఒకటి కాస్త రిలేషన్ కూడా ఉండచ్చు ఎందుకంటే మా కాలేజ్, క్లాస్ మేట్స్, లెక్చరర్స్, విజయవాడ ఇవి అన్నీ ఏమీ మారవు కదా. సరేనండి త్వరలో మరో టపాలో కలుద్దాం.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.