శనివారం, ఏప్రిల్ 03, 2010

హాస్టల్ - 4 (పరోఠాల బిజినెస్)

మా కాలేజ్ విజయవాడ కు దగ్గరలో బందరు వెళ్తుంటే ఈడ్పుగల్లు అనే గ్రామానికి ఒక కిలోమీటర్ ఇవతల ఉంటుంది. అంటే మేమున్న ఏరియాని కూడా ఈడ్పుగల్లు అనే అనేవారు. మాకు ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం లో బందర్ రోడ్డు లోనే విజయవాడ వైపు గంగూరు అనే ఊరుండేది. అక్కడ మా కాలేజ్ కన్నా కాస్త మంచి పేరున్న నలంద రెసిడెన్షియల్ కాలేజ్ ఉండేది. దానికన్నా ముఖ్యంగా గంగూరు బస్టాప్ దగ్గర ఒక ధాభా ఉండేది, దాని పేరేంటో గుర్తు లేదు కానీ మేమంతా దాన్ని గంగూరు ధాభా అనే పిలిచేవాళ్ళం. అక్కడ పరోఠాలు చాలా బాగుండేవి.పరాఠాలు అంటే నార్త్ ఇండియన్ ఆలూ పరాఠా, మేతీ పరాఠా, గోభీపరాఠా లాంటి సాథారణమైన పరాఠాలు కాదు. అసలు సిసలు కేరళ పరోఠాలు, పొరలు పొరలుగా ఉండి షేరువా తో కలిస్తే అత్యద్భుతమైన రుచిని తమ సొంతం చేసుకున్న పరోఠాలు అనమాట.

మా కాలేజ్ లో ప్రతి ఆదివారం ఉదయం పరీక్ష పెట్టేసి, అదయ్యాక పన్నెండు గంటలకి లంచ్ చేసాక బయటకి వదిలేవారు. వెళ్ళేప్పుడు గేట్ దగ్గర రిజిస్టర్ లో సంతకం చెసి అదేరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా తిరిగి వచ్చేయాలి. దగ్గర లో ఊర్లున్న వారు అంటే మా నరసరావుపేట గంటన్నరే కాబట్టి నాలాంటి వాళ్ళు ఊరు వెళ్ళి తిరిగి సోమవారం ఉదయం క్లాసు ల టైం కి వచ్చేసే వాళ్ళం. కాస్త దూరంగా ఉండే వాళ్ళు అలానే ఇంటి మీద ఆట్టే బెంగ లేని జనాలు బేవార్సు గా విజయవాడ సిటీ లోనో కంకిపాడు విలేజ్ లోనో తిరిగేసి ఒకటీ అరా సినిమాలు చూసేసి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. అలా ఔటింగ్ ఇచ్చిన సంధర్భంలో నలందా లో చదువుతున్న ఫ్రెండ్స్ ద్వారా అనుకుంటాను మా కాలేజ్ వాడెవడో ఆ ధాబా లోని పరోఠాల రుచి పట్టుకున్నాడు. అంతే అది మా కాలేజ్ లో కాస్త ఏక్టివ్ గా ఉండే ఒకరిద్దరికి అంటించాడు. అసలే హాస్టల్ తిండి మరి రుచికరమైన పరోఠాలు దొరుకుతుంటే ఎవరు వదిలేస్తారు చెప్పండి.

నాకు పరోఠాలు పార్సిల్ తెచ్చుకుని తినడం కన్నా హోటల్లో తినడమే బోలెడంత ఇష్టం. అసలు కేరళ పరోఠాలు తినడం ఓ ఆర్టు, అక్కడక్కడా కర కర లాడుతూ గట్టిగా, అక్కడక్కడా మెత్తగా పొరలు పొరలు గా పొగలు గక్కే పరోఠాను అరిటాకు వేసిన ప్లేట్ లో అరిటాకు పై పెట్టి పక్కన ఒక గిన్నెలో షారువా, గుండ్రని చక్రాల్లా కోసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న నిమ్మచెక్క ఇవన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టగానే జీహ్వ జివ్వున లాగేస్తుంది. నిమ్మ చెక్క ని పరోఠాపై పిండి ఆ వేడికి కమ్మటివాసనలు వెదజల్లుతుంటే వాటిని ఆస్వాదించేసి. ఆపై కాస్త మెత్తని పరోఠా ముక్కని తుంచి షారువాలో ముంచి తీసి నముల్తూ ఓ చిన్న ఉల్లిపాయ ముక్కని కసుక్కుని కొరికి దాన్తో పాటు నమిలేస్తే సూపరు. ఆపై కాస్త గట్టి పడిన పరోఠాముక్కలని షారువా కప్ లో వేసి నానేసి ఆపై తింటే ఆహా ఆ మజానే వేరు :-) నేను ఇలా ఆస్వాదించడానికే ధాబాలో తిండానికి ఇష్టపడేవాడ్ని.

ఇక్కడ నాకు నచ్చిన ఇంకో ఐటం బోన్లెస్ చికెన్ పలావ్, మాములు మన హైదరబాద్ పారడైజ్ బిర్యానీ లా ఘాటైన మసాలాలు దట్టించకుండా అతి తక్కువ మసాలాతో కమ్మని పలావ్ రైస్ సగం ప్లేట్ నిండుగా పెట్టి దాని పైన కమ్మగా వండిన బొన్లెస్ చికెన్ కర్రీ పరిచేవాడు. మసాలా నిండిన చికెన్ తప్ప మరో కూర ముక్క కానీ ఉల్లిపాయ ముక్క కానీ తగలదనమాట బహు కమ్మగా ఉండేది లెండి దాని రుచి. ఈ రెండిటి కోసం నేను ధాబాకు వెళ్ళి తినే వాడిని ఔటింగ్ కు వెళ్ళినపుడు అపుడపుడు. సహజంగా నేను ఆదివారం ఔటింగ్ సమయంలో నరసరావుపేట్ వెళ్ళిపోయే వాడ్ని కనుక మధ్యలో నే పుచ్చుకునే ఔటింగ్ లను ఇలాంటి పనులకు ఉపయోగించుకునే వాడ్ని.
 
ఇక ఆ ధాబాలో ఒక పేద్ద సైజు పరోఠా, చిక్కని కమ్మటి షారువా, చిన్న నిమ్మచెక్క, నాలుగు ఉల్లిపాయలు మొత్తం కలిపి నాలుగు రూపాయలకు ఇచ్చేవాడు. మా వాళ్ళు నైట్ స్టడీ అవర్ అయ్యాక పదిగంటల టైం లో కాలేజ్ వెనక ప్రహరీ గోడ మీద నుండి చెఱుకు తోటలోకి దూకి దాని నుండి మెయిన్ రోడ్ మీదకు వచ్చి, లారీ ఏదైనా పట్టుకుని గంగూరు వెళ్ళి పార్సిళ్ళు పట్టుకు వచ్చేవారు. ఈ ప్రయత్నాల్లో ఒకోసారి భారీ దెబ్బలే తగిలించుకునే వారు, మరి అంత రిస్క్ తీసుకుంటున్నారు కదా అందుకని వాళ్ళు ఒకో పరాఠా అయిదు రూపాయలకు అమ్మే వాళ్ళు. అదేకాక వీళ్ళు ఒకో సారి ముఫ్ఫై కి తగ్గకుండా ఒకోసారి నలభై యాభై పరోఠాలకౌ ఆర్డర్ లు కూడా తీసుకు వెళ్ళడంతో ఆ ధాబా వాడు వీళ్ళకి ఫ్రీగా పరోఠాలు పెట్టడమే కాకుండా టోకున కాస్త డిస్కౌంట్ కూడా ఇచ్చేవాడు. అవన్నీ మా వాళ్ళకు లాభాలనమాట.

అలా మెల్లగా చెఱుకు తోటని వదిలేసి పరోఠాల పై పడ్డారనమాట మా కుర్రాళ్ళు, అయితే చెఱుకు తోట విషయం లో లాగా ఇందులో దెబ్బలు తినాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే వార్డెన్లు కూడా తెప్పించుకునే వాళ్ళు, అదీకాక అందరికీ లాభాలే కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అనుకుంటా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దిన దిన ప్రవర్థమానమై మేమున్నన్నాళ్ళు పరోఠాల బిజినెస్ వర్ధిల్లింది.

29 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. మేం ఇంటర్ లో ఉన్నపుడు వీధి చివరే కోకిలా రెస్టారెంట్ ఉండేది అందులో పరోట సూపరు, అమ్మని కేరేజీ పెట్టొద్దని చెప్పి మరీ తెప్పించుకొనేవాళ్ళం. వడిచ్చిన చిన్ని నిమ్మ ముక్క సరిపోదని, ఇంటినుంచే నిమ్మ చెక్క కూడా తెచ్చుకునేవళ్లం. పదింటికి break లో చెప్తే ఆయమ్మ lunch కి తెచ్చేసేది, మరి మేమెవ్వరూ గేటు దాటకూడదు కదా...వేడి వేడి కూర వాసన ముందు ఆశ్వాదించేసేవాళ్ళం, ఆ తర్వాత, కాస్త కరకరలాడే ముక్కలు తుంచి ముందు పక్కన పెట్టేసి చివార్న, వాడు కనీకనిపించకుండా వేసిన బంగాళ దుంప ముక్కలని ఏరి, దాచుకుని ఉల్లిపాయ్ ముక్కలో మధ్యన కరకరల్లడేది పెట్టి, కాస్త గ్రేవీ అంటించి అలా స్వర్గలోకపు అంచులదాకా వెళ్లేవాళ్లం.. :)

    చికెన్ నే తినలా కాని, హవేలీలో బోన్లెస్స్ బటర్ చికెన్ బాఉంటుందనేవారు

    రిప్లయితొలగించండి
  3. basu thanks basu
    e post rasinanaduku
    nenu nalanda lo intermediate chadivanu ..
    akkada roju tinevallam ..
    a non veg taste friends varninchatam chusi veg nunchi non-veg ki jump ayya .. believe me

    asalu a taste e taste basu ...
    inchu minchi bawarchi range lo vuntundi
    mottaniki pata rojulu gurtu ku techhinanduku thanks basu ..

    రిప్లయితొలగించండి
  4. baagunnaayamdi paratha kaburlu...naaku koodaa aa porala porala paraathaalu ishtam. first time chinnappudu Delhi lo tinnaanu avi nenu...with good quality..

    sorry for not being able to write in telugu.

    రిప్లయితొలగించండి
  5. ధాభా కాదు సోడరా *ధాబా*.
    వార్నాయనో ఇల నోరూరిస్తే ఎలా?
    సరేగానీ, పిడ్రాళ్ళలో, పోలీస్ స్టేషన్ కి ఇటుపక్క, కార్నర్లో ఓ కేరళా వోటలు, ఆడికాడ తిన్నావా హెప్డన్నా పరాఠా?
    కానీ, పరాఠా మంచిది కాదు ఆరోగ్యానికి, కారణం పరాఠాలు మైదాతో చేస్తారు. మైదాలో కార్బ్స్ తప్ప ఇంకేమీ లేవు.
    మంచి జ్ఞాపకాలు అబ్బాయీ!!
    మీ వారాంతం ఆనందమౌగాక.

    రిప్లయితొలగించండి
  6. ఇదన్యాయం!కాదు అన్యాయమంటేనే ఇది...పరోఠాల గురించి ఇలా రాయటం యెంత అన్యాయం,యెంత అదీ?యెంత ఇదీ అసలు?అయినా మీరు యెంతగా ఊరించినా గుంటూరు మాయాబజారు దగ్గర ఉన్న కింగ్స్ హోటల్ వాడు చేసే పరోఠాలముందు ఇవి యెంతమాత్రమూ చాలవూ ఆగవూ అని నా నిశ్చితాభిప్రాయం.అక్కడికి ఎప్పుడన్నా రాత్రుళ్ళు పదకొండూ పన్నెండూ దాటాక వెళ్ళి వాడిచ్చేపాయాతో ప్రయత్నించి చూడండి.
    ఇంతవయసొచ్చాక,ఇన్నివందల(వేలుకాకపొయినా)పరోఠాలు తిన్నాక మొన్నీ మధ్యే తెలిసింది...సదరు నిమ్మకాయను ఆ పరోఠామీద పిండకూడదనీ,మీదేసి రుద్దాలనీ :)

    రిప్లయితొలగించండి
  7. నేను గారు నెనర్లు :-) హ హ వివరంగా మీ అనుభూతులు పంచుకున్నందుకు నెనర్లు. భలే చెప్పారు మొత్తానికి మీ పరోఠాలతో మీ ఎక్స్పీరియన్స్ :-)

    అఙ్ఞాత బాసు నెనర్లు బాసు :-)

    తృష్ణ గారు నెనర్లు :-)

    భాస్కర్ గారు నెనర్లు :-) నాకు ఒత్తు దేనికి ఇవ్వాలో కాసింత అనుమానం వచ్చింది సోదరా అందుకే రెండిటీకీ ఇచ్చేశాను :-) దాభా అని కూడా చాల మంది అనడం విన్నాను :-)

    రాజేంద్ర గారు నెనర్లు :-) ఈ సెంటర్ గురించి ఎపుడూ వినలేదండీ అలాగే ఈ సారి అక్కడి పరోఠా ప్రయత్నిస్తాను :-)

    రిప్లయితొలగించండి
  8. మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత మీ హాస్టల్ కబుర్లు చెప్పారు. ధాబాల్లో తినటమే ఒక గొప్ప అనుభవాలు. మీ పరాఠాలు సుపర్బ్. దెబ్బలు తప్పినందుకు కంగ్రాట్స్:)

    రిప్లయితొలగించండి
  9. నాకు సింగ పూర్ వచ్చాకే పరోటాలనే పదార్దం తెలిసింది..ఇక్కడ వాటిని తినని వాళ్ళు అంటూ ఉండరేమో మలయ్లు, చైనీయులతో సహా ..

    రిప్లయితొలగించండి
  10. జయ గారు నెనర్లు :-) మధ్యలో కాస్త బిజీ అవడం వలన కాస్త ఆలస్యమైందండీ.

    నేస్తం గారు నెనర్లు :-) నిజమే అమెరికాలో కూడా మలేసియన్ పరోఠాస్ అని దొరికేవండీ అవి ఇలానే పొరలు పొరలుగా చాలా బాగుంటాయి.

    రిప్లయితొలగించండి
  11. మీరు అదృష్టవంతులేనండీ...ఇంటర్మీడియట్ లోనే కాసింతైనా అల్లరి చేసే చాన్స్ వచ్చింది...నేను ఇంటి నుండే కాలేజీకు వెళ్ళటం వల్ల ఇంటర్లో చాలా సరదాలు మిస్సయ్యాను...పరోట అంటే ఎందుకో నాకంత నచ్చవండి..కొంచెం సాగుతుంటాయి కదా..

    రిప్లయితొలగించండి
  12. శేఖర్ గారు నెనర్లు :-) నిజమేనండీ హాస్టల్ లో చేసే అల్లరీ చూసే జీవితం చాలా వేరుగా ఉంటుంది. పరాఠాలు సరిగా చేస్తే అంతగా సాగవండీ పొరలు పొరలు గా బాగుంటాయ్.

    రిప్లయితొలగించండి
  13. వేడి వేడి పరోటకబుర్లు బాగున్నాయి :)

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. నిజమే. మలయాళీ పరాటాల ముందు పంజాబీ పరాటాల రుచి దిగదుడుపే. (బే ఏరియా వాస్తవ్యులారా: స్పైస్ హట్‌లో దొరికే మలబార్ పరాటాలు బ్రహ్మాండంగా ఉంటాయి. లాగించి చూడండి)

    రిప్లయితొలగించండి
  16. ఇప్పుడు నాకు లంచ్ బ్రేక్ పరోఠా తిని వస్తాను. బాగుంది మీ పరోఠా పురాణం. నోరూరించింది.

    శ్రీవాసుకి

    రిప్లయితొలగించండి
  17. అబ్రకదబ్ర గారు నెనర్లు, నిజమే కానీ మరీ దిగదుడుపు కాదులేండి. వాళ్ళ స్టఫ్డ్ పరాఠాలు కూడా నాకు ఇష్టమే. ఆహా బేఏరియా వాస్తవ్యులకు మంచి వివరాన్నందించారుగా :-) ధన్యవాదాలు.

    శ్రీవాసుకి గారు నెనర్లు, హ హ మరి పరోఠా తిని వచ్చారా :-)

    రిప్లయితొలగించండి
  18. మళ్లీ పాత రోజులు గుర్తు చేసారు ...నేనూ గంగూరు పరోటాలు ఎక్కువగా తిన్న వాడినే ..మీరు చెప్పిన గంగూరు నలంద లోనే నేను ఇంటర్ చదివాను ...

    రిప్లయితొలగించండి
  19. విష్వక్సేనుడు గారు నెనర్లు :-) నేనీ టపా రాసేప్పుడు అనుకున్నానండీ నలంద విధ్యార్ధులెవరైనా చూస్తారో చూడరో అని మీరు నలంద అని తెలుసుకోవడం ఆనందం గా ఉంది. ఎంతైనా అవి గోల్డెన్ డేస్ కదండీ :-)

    రిప్లయితొలగించండి
  20. అబ్బ భలే ఊరించారు కదా పారాటల గురించి రాసి. నాకు కూడా ఆ కేరళా పరాఠాలంటే చాల ఇష్టం. చెన్నై లో ఆ మాటకొస్తే మొత్తం తమిళనాడులో ఈ పరఠాలతో పాటు సాల్నా అని ఒక కూరకి పులుసు కి మధ్యలో ఉండే ఒక పదార్థం ఇస్తాడు. దానితో ఈ కేరళా పరాఠలు తింటే అబ్బబ్బబబ్బా అసలు ఏమి రుచి అనుకున్నారూ...చెప్పతరం కాదు.

    హైదరాబాదులో మా యూనివర్సిటీ పక్కన కైరళి అనే ఒక కేరళా ధాబాలాంటి హోటలుందేది. రెండు రోజులకోకసరైనా అక్కడకి వెళ్ళి ఆప్పం, ఈ పరాఠాలు వేడి వేడిగా చికెన్ కర్రీతోనో, లేదా శెనగల కూరతోనో తింటూ ఉంటే భలేగా ఉండేది. నాకు మా యునివర్సిటీ రోజులు గుర్తు చేసి ఏడిపించేస్తున్నారు మీరు :(

    రిప్లయితొలగించండి
  21. మీరు చెప్పిన ఢాబానో మరోటో నాకు తెలియదు కాని ఇరవయ్యేళ్ళ క్రితం నేను సిధ్ధార్థ ఇంజనీరింగు కాలేజిలో చదువుకున్నప్పుడు కూడా గంగూరులో ఒక ఫేమస్ ఢాబా ఉండేది.
    హాస్టల్లో నాన్ వెజ్ ఎక్కువ పెట్టరు కాబట్టి స్టూడెంట్లందరూ వీలైనప్పుడల్లా అక్కడ చేరేవారు.
    చిన్న చిన్న పార్టీలన్నీ అక్కడే జరిగేవి.
    బోన్ లెస్ చికెన్ అక్కడ చాలా ఫేమస్.

    రిప్లయితొలగించండి
  22. సౌమ్య గారు నెనర్లు :-) కేరళ ఫుడ్ లో నాకు నచ్చే మరో ఐటమ్ ఆప్పం కూడానండీ... బాగా గుర్తు చేశారు. హ హ ఙ్ఞాపకాలు ఎప్పుడూ మధురమేనండీ :-) అవి నవ్వించాలి కానీ ఏడిపించకూడదు.

    బోనగిరి గారు నెనర్లు :-) నేను చెప్పేది కూడా అదే ధాబా గురించండీ.. అప్పట్లో సిద్ధార్థ స్టూడెంట్స్ కూడా వచ్చేవారు వాళ్ళ హడావిడి చూసి మేము మనం కూడా ఇలా మెయింటెయిన్ చేయాల్రా అనుకునే వాళ్ళం :-)

    రిప్లయితొలగించండి
  23. నమస్తే వేణు గారూ,

    మీ బ్లాగ్ ని చూడ్డం ఇదే మొదటిసారి.ఒక్కో బ్లాగ్ని చూస్తూ చూస్తూ మీ బ్లాగ్లోకి తేలాను.మీరు రాసిన మర్యాద రామన్న రివ్యూ చదువుతూ ఇలా మీ పాత టపాలన్ని చూస్తూ ఏ టపాకి వ్యాఖ్య పంపాలో తెలియక ఫైనల్ గా ఇంత నోరూరుంచినందుకు మీ పరఠా టపాలోకి నా వ్యాఖ్యని పోస్ట్ చేస్తున్నాను.

    అసలే లంచ్ టైం ,మీరు ఇలా నోరూరించడం ఏం బాగాలేదండీ(ఎందుకంటే నాకవి మా ఆఫీస్ కాంటీన్లో దొరకవు కాబట్టి) :(

    అయినా పర్లేదు ఈ వారాంతం instant Paratas తెప్పించుకుని రుచి చూసేస్తాను.

    మిగతా టపాలు కూడా చాలా బాగున్నాయి.
    అబినందనలు :)

    రిప్లయితొలగించండి
  24. ధన్యవాదాలు స్నిగ్ధ గారు,
    ఓపికగా పాత టపాలు అన్నీ చదివి మీ అభిప్రాయం చెప్పడం చూసి చాలా ఆనందించాను. టపాలు నచ్చినందుకు సంతోషం. తప్పకుండా... కుదిరితే కేరళ పరాఠాలు కానీ మలేషియన్ పరాఠాలు కానీ తెప్పించుకుని ఎంజాయ్ చేసేయండి మరి :-)

    రిప్లయితొలగించండి
  25. వేణు గారు, మీ పరాఠోపాఖ్యానం బావుంది కాని, పరోఠాలోకెల్లా మళయాళ పర్రోఠ మిన్న అనడాన్ని నేను ఒప్పుకోను. పోయిన నవంబరులో మేము మనాలి వెళ్ళటం జరిగింది, సాగర్ హోటల్ లో 3రోజులున్నాము. ఆ చల్లని వాతావరణంలో, మంచుకొండల కెదురుగా కూచుని,వేడి వేడీ, అలూ, గోబీ, పరోఠాను, నార్తిండియన్ పికెలులో మామిడి ముక్కలను ఆస్వాదిస్తూ తింటుంటే .. అహో అప్పుడు గుర్తొచ్చిందండీ ఓ పాట - ' సొగసు చూడ తరమా .. నీ సొగసు చూడ తరమా ..' అదో అనుభూతిని మిగిల్చింది లెండి. దేశంలో మనాలి, కులూ, మణికర్ణి చూడదగిన ప్రదేశాలు, అక్కడే వుండిపోవాలని పించింది. సింలా అంత బాగుండదని నా ఫ్రెండొకడు చెప్పాడు. ప్రవాసులు ప్రశాంతగా కొన్నిరోజులు గడపదగ్గ ప్రదేశం మనాలి, ఆ పరిసరాలు.

    రిప్లయితొలగించండి
  26. ధన్యవాదాలు snkr గారు,
    ఓ ఐతే నేను సరైన ప్లేస్ లో సరిగా వండిన ఆలూ పరాఠా తినలేదనమాట. నేనూ కులు మనాలి వెళ్ళాలి అని చాలా రోజులు నుండి అనుకుంటున్నానండీ కుదిరితే వేళ్ళి అక్కడ ప్రయత్నిస్తాను. నిజమే నాకుకూడా సిమ్లా అంత గొప్పగా ఏం నచ్చలేదు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.