అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శుక్రవారం, డిసెంబర్ 31, 2010

హాస్టల్ - 7 (న్యూ ఇయర్)

ఈ టపానూ ఇంకా కొత్త సంవత్సరం పై బ్లాగరులు రాసిన మరికొన్ని చక్కని టపాలను సుజన మధుర గారి e-బుక్ లో ఇక్కడ చదవండి. సర్వర్ లో డౌన్లోడ్ అవకపోతే గూగుల్ డాక్స్ లో ఇక్కడ నుండి దింపుకోండి.

మిగతా పండగలు చేసినా చేయకపోయినా ఆగస్ట్ 15 కాక మా కాలేజ్ లో ముఖ్యంగా చేసేవి మూడు పండగలు. ఒకటి దీపావళి -  పెద్ద సంఖ్యలో బాణాసంచా తెప్పించి ఇళ్ళకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయిన పిల్లలతో కాల్పించేవారు. రెండోది కాలేజ్ యానివర్సరీ - ఒక చీఫ్ గెస్ట్ ను పిలిపించి పెద్ద సభ జరిపి, సాంస్కృతిక కార్యక్రమాలు, రెండువారాలుగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతిప్రదానం, మెస్ లో ఫీస్ట్ ఏర్పాటులతో ఘనంగా జరిగేది. ఇక మూడోది న్యూయియర్ - డిశంబర్ 31 న మధ్యాహ్నం నుండి కాలేజ్ లో మా తరగతి గదులను బెలూన్లు, రంగుకాగితాలు, తగరపు కాగితాలు, మెలికల కాగితాలతో శక్తిమేరకు ముస్తాబు చేసే వాళ్లం. ఆరోజు సాయంత్రం ఫీస్ట్ ఇక రాత్రి డాబా పైన క్లాస్ రూంస్ ముందున్న ఖాళీ స్థలంలో అందరినీ సమావేశపరచి మా డైరెక్టర్ కేక్ కట్ చేసేవారు. రోజూ ఒకటే దినచర్యతో చప్పగా గడిచే హాస్టల్ జివితంలో ఈ ప్రత్యేకమైన రోజులు తెచ్చే సందడి అంతా ఇంతా కాదు. ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నా పుస్తకాలు ముట్టుకునే పనిలేదన్న సంతోషం ఎంత అరిచి అల్లరి చేసినా ఎవరూ ఏమీ అనరు అనే ధైర్యంతో నిజంగా పండగ వాతావరణం ప్రతి విద్యార్ది మొహంలో ఆనందంగా ప్రతిఫలించేది.

కాలేజ్ డెకరేషన్ ప్లాన్స్ ఒక వారం ముందునుండే ప్రారంభమౌతాయి కావాల్సిన సామాగ్రికోసం స్పెషల్ ఔటింగ్ పర్మిషన్ తెచ్చుకోవడం ఎలా చెయ్యాలో అందరం కూర్చుని చర్చించుకోవడం మంచి సరదాగా ఉండేది. మాలో కొందరం ఈ ప్లానింగ్ లో ఉంటే కాస్త రౌడీ బ్యాచ్ సమావేశమై మరో ప్లానింగ్ లో ఉండేది. ఏమిటయ్యా అది అంటే కొంతమంది వార్డెన్స్ స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉండేవారు కానీ ఒకళ్ళిద్దరు మాత్రం వాళ్ళు పైనుండి దిగివచ్చిన దేవుళ్ళలా మేమంతా వాళ్ళని పీడించుకు తినడానికి పుట్టిన రాక్షసుల్లా బిల్డప్ ఇచ్చేవాళ్ళు. అలాంటివాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళలో ఎక్కువ తప్పులు చేసిన ఒకవార్డెన్ ని ఎన్నుకునేవాళ్ళు (ఠాగూర్ సినిమా లోని ACF రేంజ్ అనమాట). ఇక 31 రాత్రి డిన్నర్ అయ్యి A.O గారు ఇంటికి వెళ్ళాక కారిడార్ లోనో(పైన ఫోటోలో చూపించినట్లే ఉండేది మా కారిడార్ అటు ఇటు రూంస్ తో) లేదంటే బాత్రూంస్ దగ్గరో ఆ వార్డెన్ ని పట్టుకుని లైట్లు ఆపేసి దుప్పటి ముసుగేసి కసితీరా కొట్టే వాళ్ళు. సో వార్డెన్ ని బయటకి ఎవరు తీసుకు రావాలి, లైట్స్ దగ్గర కంట్రోల్ ఎవరిది, దుప్పటి ఎవరెవరు పట్టుకోవాలి, ఎవరెవరు కొట్టాలి ఇత్యాదులన్నీ ప్లానింగ్ లో భాగమనమాట.

ఇక శ్రీనివాసరావుగారని డైనింగ్ హాల్ సూపర్ వైజర్ ఒకాయన ఉండేవారు తను ఫుడ్ విషయంలో క్వాలిటీ సంగతి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెరుగు కప్పుల దగ్గర మాత్రం నిక్కచ్చిగా ఉండేవారు. చిన్న చిన్న కప్పుల్లో డైరెక్ట్ గా తోడుపెట్టేవారు పెరుగు, అది ఎవరికీ సరిపోయేది కాదు కనుక ఏమాత్రం అవకాశమున్నా మేం ఏదో ఒక మాయ చేసి అదనంగా సంపాదించడానికి ప్రయత్నించేవాళ్ళం ఒకవేళ జ్వరం లాటివి వస్తే మాత్రం మిగతా కూరలు తినం కాబట్టి అదనంగా శాంక్షన్ చేసేవారు. ఆయన ఫీస్ట్ రోజు ఐస్క్రీం కప్పుల మీద ఆ నిఘా ఏర్పాటు చేసేవారు. చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులలో చెక్క స్పూన్స్ తొ సహా వచ్చే ’క్వాలిటీ’ వెనిలా ఐస్క్రీం రుచి భలే ఉండేది. ఒక కప్పు సరిపోక  మేమంతా కలిసి “I scream.. You scream.. We scream.. For Ice cream..” అని గోల గోల చేసేవాళ్ళం. ఓ సారి అలాఅరుస్తుంటే ఓ చిరంజీవి దురభిమాని “ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగా స్టార్” అని అరిచాడు. ఏంట్రా నీ గోల అంటే మొన్న చిరంజీవి సినిమాకిఇలానె అరిచాంరా మీరు స్లోగన్స్ ఇస్తున్నారు కదా అని నే కూడా ఇచ్చాను అన్నాడు. “ఆహా అలాగా ఒరే వీడి కప్పుకూడా లాక్కోండ్రా చిరంజీవి వచ్చి వీడికి ఐస్క్రీం తినిపిస్తాడు” అని వాడి మీద పడ్డాం :-)

ఇక రాత్రి కేక్ కటింగ్ దగ్గర కేక్ తోపాటు కూల్ డ్రింక్ లూ, సమోసాలో లేదా వెజ్ పఫ్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఓ సారి కేక్ కటింగ్ ఆ తర్వాత చిన్న చిన్న స్పీచ్ లూ అయ్యాక కేక్ అందరికీ సర్వ్ చేసేసి ఆపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏమీ ప్లాన్ చేయకపోవడంతో ఎవరైనా పాటలు కానీ డాన్స్ లు కాని చేసే వాళ్లుంటే రండిరా అని ఆహ్వానం పలికారు. ఒకడి ఏకపాత్రాభినయం మరొకడి పాట అయ్యాక ఎవరో “సార్ వేణుగాడు కూడా పాటలు బాగా పాడతాడు సార్” అంటూ నన్ను ముందుకు తోశారు. ఎదురుగా డైరెక్టర్, A.O. ఇంకా మిగిలిన స్టాఫ్ అంతా ఉండటంతో కాస్త మొహమాట పడినా కాదనలేక నేను సిరివెన్నెల నుండి “ఈ గాలీ.. ఈ నేల..” పాట మొదలెట్టాను. మొదటి చరణం చివరికి వచ్చేసరికి నా ముందున్న వాళ్ళంతా పాపం శ్రద్దగానే వింటున్నారు కానీ మా డైరెక్టర్, స్టాఫ్ నాపాట పట్టించుకోకుండా ఏవో కబుర్లు మొదలుపెట్టటంతో గోల మొదలైంది. అంతే మనకి వెంటనే శంకరాభరణం శంకరశాస్త్రిగారు గుర్తొచ్చారు... “ఠాట్ నేను పాడుతుంటే వినకుండా గోలచేస్తారా !! వీళ్ళకు నా పాట వినే అర్హతలేదు ఫో !!” అనుకుని పాట ఆపేసి కూర్చుండిపోయాను. మా సార్ ఒకరు “ఏంట్రా ఆపేశావ్?” అని అడిగితే “నాకు అంతవరకే వచ్చండి..” అని చెప్పేసరికి పాపం చేసేది లేక చప్పట్లు కొట్టేశారు.


విజయవాడలోనిది ఒకే బిల్డింగ్ లో గడిపిన ఖైదీ జివితమైతే ఇంజనీరింగ్ కి వచ్చాక ఆంధ్రా యూనివర్సిటీ వైజాగ్ లో అపరిమితమైన స్వేచ్చ... అక్కడ నాకు బాగా గుర్తున్నవాటిలో ఓ ఏడాది 31 రాత్రి సెకండ్ షోకి దదాపు ఒక 15 మందిమి క్లాస్మేట్స్ అంతా కలిసి ’అనగనగా ఒక రోజు’ సినిమాకి వెళ్ళాము. నాకు ఇప్పటికీ గుర్తు చిత్రాలయలో చూశాము ఆ సినిమా మా వాళ్ళు కొందరు ముందువెళ్ళారు మేం ఓ నలుగురం 5 నిముషాలు లేట్ గా వెళ్ళాం మేం థియేటర్ లోకి ఎంటర్ అయ్యే సరికి ఊర్మిళ ఇంట్రడక్షన్ సీన్ వస్తుంది తను చక్రి కోసం వెయిటింగ్ పెద్ద స్క్రీన్ పై తనని చూడటానికి రెండుకళ్ళు చాలడం లేదు. మా వాళ్ళు సీట్లలోంచి “ఒరేయ్ మేం ఇక్కడ ఉన్నాం..” అని అరుస్తున్నా పట్టించుకోకుండా అలానే వాక్వే లో నిలబడి ఆ సీన్ చూశాక వెళ్లి సీట్లలో సర్దుకున్నాం :-) ఆసక్తి ఉన్నవాళ్ళు పై వీడియోలో 6 నిముషాల దగ్గర చూడండి.

ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళడంతో సినిమాలోని కామెడీ చాలాబాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయ్యాక క్లాస్మేట్స్ లో అమ్మాయిలను మహరాణిపేట హాస్టల్స్ లో దింపేసి ఆ డౌన్ లో దిగి బీచ్ కు వెళ్ళి బీచ్ రోడ్ వెంబడి నడుచుకుంటూ మా హాస్టల్స్ కు చేరుకోవడం మరిచిపోలేని అనుభూతి దారిలో పెద్ద పెద్దగా అరుస్తూ ఆటోవాలాలకు, బైకుల్లోనూ, కారుల్లోనూ ఎదురైన ప్రతి ఒక్కరికీ గ్రీటింగ్స్ చెబుతూ, కబుర్లు చెప్పుకుంటూ, సినిమాలోని బ్రహ్మానందం ’జాక్సన్ మైఖేల్ జాక్సన్’ కామెడీ సీన్స్ కొన్ని యాక్ట్ చేస్తూ నవ్వుకుంటూ గోల గోలగా గడిపాము. హాస్టల్ దగ్గర టెలిఫోన్ బూత్ నుండి రాత్రి 12:30 కి ఒక ర్యాండమ్ నంబర్ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన ఆంటీ మొదట కాస్త టెన్షన్ పడినా.. ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంత మందిమి సరదాగా ఒక నంబర్ ట్రై చేశాము అని వివరంగా చెప్తే తర్వాత వాళ్ళ ఇంటిల్లిపాదితో మాట్లాడించడం.. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం బాగా ఎంజాయ్ చెయ్యండి అని చెప్పడం కూడా మరిచిపోలేను. ఆ నంబర్ గుర్తులేదు కానీ వాళ్ళ ఇల్లు MVP కాలనీలో ఉంది అని మాత్రం చెప్పారు అపుడు.

"ఆనాటి ఆ స్నేహమానందగీతం ఆ ఙ్ఞాపకాలన్ని మధురాతి మధురం" అని పాడుకోవడమే ఇపుడు మిగిలింది... ఒకవేళ అందరం కలిసినా కార్లు, గ్యాడ్జెట్లు, భయాలు, బాధ్యతలు ఇప్పటి కథేవేరు... ఆరోజుల్లోలా నిర్లక్ష్యంగా ఎంత రాత్రైనా బిందాస్ గా రోడ్లమీద తిరగగలమా... ఏమో!! నాకైతే నమ్మకం లేదు...

బ్లాగ్ మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఆదివారం, డిసెంబర్ 26, 2010

హాస్టల్ - 6 (వేణు The దేవదాస్ !!)

~*~*~ ఇది సీరియల్ కాదు ఏ టపాకు ఆ టపానే విడిగా కూడా చదువుకోవచ్చు.. నేను విజయవాడ సిద్దార్థ రెసిడెన్షియల్ లో ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో జరిగిన ఈ హాస్టల్ కబుర్ల గురించి పరిచయం లేని వారు విజయవాడ హాస్టల్లో అన్న లేబుల్ పై క్లిక్ చేస్తే ముందు 5 టపాలు చదవవచ్చు.~*~*~

ఖర్మరా బాబు ఇపుడు వీడి ప్రేమకథ వినిపిస్తాడా అని కంగారు పడకండి, ఓ ప్రేమికుడుగా దేవదాస్ ఎంత ఫేమస్సో ఓ తాగుబోతుగా కూడా అంతే ఫేమస్ మరి, ఇపుడు నే చెప్పబోయేది ఆ రెండో (అవ)లక్షణం గురించే. నేను విజయవాడలో ఇంటర్ చదివేరోజుల్లో మాకు ప్రతి ఆదివారం ఔటింగ్ ఇచ్చేవారు అంటే మధ్యహ్నం భోజనాలు అవ్వగానే బయటకి వెళ్ళి రాత్రి పదిగంటలలోపు హాస్టల్ కు వచ్చేయాలి. మొదట్లో హోం సిక్ వలన ఆ కొద్ది టైంలోనే రెండుగంటలపైగా ప్రయాణం చేసి నరసరావుపేటలో ఇంటికి వెళ్ళేవాడిని. కానీ ప్రతీసారి సోమవారం పొద్దున్న తిరిగి రావడం, ఉదయం స్టడీ అవర్ గైర్హాజరీ తో మా A.O. గారు ప్రతీవారం వెళ్ళద్దంటూ వార్నింగ్ ఇచ్చేవారు. ఆయనకి భయపడి ప్లస్ హాస్టల్ జీవితానికి కూడా అలవాటుపడటంతో కొన్ని నెలల తర్వాత ప్రతివారం ఇంటికి వెళ్ళడం మానేసి  కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి విజయవాడ సిటీ చుట్టి రావడానికి వెళ్ళే వాణ్ణి.

ఇలాంటి ఒక ఆదివారం నా నేస్తాలంతా వేరే వేరే పనుల మీద తలోదిక్కు వెళ్ళడంతో నేను ఒంటరి వాడినైపోయాను. క్రితంవారమే ఇంటికి కూడా వెళ్ళివచ్చాను కనుక ఒంటరిగా తిరిగేసొద్దాం అని ఈడుపుగల్లు నుండి విజయవాడ RTC బస్టాండ్ కు వెళ్ళే సిటీబస్ ఎక్కి రాఘవయ్యపార్క్ దగ్గర దిగాను. మేం సాధారణంగా ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ సర్వేచేసేవాళ్లం బీసెంట్ రోడ్, స్వర్ణాపేలస్, ఆ దగ్గరలోని పాతపుస్తకాల షాపులు, రాజ్ యువరాజ్ థియేటర్ సెంటర్ ఇంకా వాటి దగ్గర రీడింగ్ రూములూ అన్నీ నడిచి తిరిగేవాళ్ళం. నేను కూడా అలాగే తిరుగుతూ కొన్ని పాత పుస్తకాలు కొనుక్కుని చీకటి పడ్డాక డిన్నర్ గురించి ఏంచేద్దామా అని ఆలోచిస్తున్నంతలో ఒక బార్ & రెస్టారెంట్ కనిపించింది. మా కారంపూడిలో పక్కింటి సత్యం వల్లనైతేనేమి ఇంకొన్ని దుస్సంఘటనలవల్ల అయితేనేమి నాకు చిన్నప్పటినుండి కూడా తాగినవాళ్ళను చూస్తే భయం.
గమనిక : సర్వకాల సర్వావస్థలయందునూ ఏవిధమైన ఆల్కహాల్ పానీయమైననూ సేవించుట ఆరోగ్యానికి హానికరమని పిల్లలు పెద్దలు అందరూ గుర్తించ ప్రార్ధన.
కానీ ఆ క్షణం ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది దానికి తోడు లోపలనుండి పలావు ఘుమ ఘుమలు రారమ్మంటూ పట్టిలాగుతున్నాయి, గమనించి చూస్తే అప్పటికింకా ఏడుగంటలే అవడం మూలాన్నేమో పెద్దగా రష్ కూడా లేదు. సరే అని “సాహసం సేయరా ఢింభకా” అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని లోపలికి అడుగుపెట్టాను. ఒక ప్లేట్ పలావు ఒక థమ్సప్ ఆర్డర్ చేసి కూర్చున్నాను. బయటికి పలావు వాసన మాత్రమే వచ్చింది కానీ లోపల సిగరెట్లు మందు నీచు కలిసిన ఘోరమైన వెగటు వాసనతో కడుపులో తిప్పడం మొదలైంది.

“వెయిటర్ ని చూస్తే కాస్త మంచోడు లాగానే కనిపిస్తున్నాడు మనకి కోపరేట్ చేస్తాడంటావా లేక అడగ్గానే పుసుక్కున నవ్వేసి ఆటపట్టిస్తాడా...” అని ఆలోచనలు ఒక వైపు.

“ఎవడికి తిక్కరేగి సినిమాలో చూపించినట్లు బాటిల్ పగలకొట్టి మన మీదకి ఫైటింగ్ కొస్తాడో ఒక వేళ అలా వస్తే వాడ్ని ఎలా ఎదుర్కోవాలి? చేతికి అందుబాటులో ఎమేం వస్తువులు ఉన్నాయ్? మనం బెండ్ అవడానికి ఎటువైపు సామాన్లు లేకుండా ఖాళీ ఉంది? పంచ్ ఎలా ఇవ్వాలి?” అని శివ రేంజ్ లో ఫైట్ ప్లానుల ఆలోచనలు మరొక వైపు..

“ఇక్కడ నన్ను ఎవరైనా చూసి అమ్మకి చెప్తే నా పరిస్థితి ఏంటి? మూడో తరగతి నుండి ఇంతవరకూ తన్నులు తినలేదన్న రికార్డ్ బ్రేక్ అవుతుందా? చదువు మానిపిస్తారా?..” అన్న ఆలోచనలు మరో వైపు ఇలా నానావిధాలుగా టెన్షన్ పడుతుండగా వెయిటర్ ఫుడ్ తెచ్చాడు.

అతన్ని “ఒక్క క్షణం బాస్” అని ఆపి “ఒక క్వార్టర్ విస్కీ బాటిల్ తెస్తావా ఖాళీది” అని అడిగాను. అతనొకసారి వార్నీ ఈడిక్కూడా మందుగావాల్సొచ్చిందా అన్నట్లు పైనుండి కిందకి చూసి చిరాగ్గా “ఏం బ్రాండ్?” అని అడిగాడు. దానికి నేను “ఆహ ఏ బ్రాండ్ ఐనా పర్లేదు ఖాళీబాటిల్ కావాలి దాన్లో ఈ థమ్సప్ పోసి ఇవ్వు” అని అడిగాను. విషయం అర్ధం కాగానే అతని మొహంలో చిరాకు స్థానే ఆసక్తి ప్లస్ అల్లరి కనిపించాయ్.. నవ్వుతూ “ఏం బాస్ లవ్వర్ కి టోకరా ఇవ్వడానికా?” అని అడిగాడు. “ఎందుకోకందుకు నువ్వు ఇవ్వరా బాబు” అంటే “కుదరదు బాస్ మాశేఠ్ చూస్తే బిల్ ఏస్తాడు” అన్నాడు. నాకు ఎలాగైనా ఆ క్వార్టర్ బాటిల్ లో కూల్ డ్రింక్ పోసుకుని వెళ్ళి మావాళ్ళ ముందు దేవదాస్ రేంజ్ లో కలర్ ఇవ్వాలన్న కోరిక పెరిగిపోతుంది. సరదా గురించి చూస్తున్నానే కానీ ఆ సీసా నేను క్యాంపస్ లోకి తీసుకువెళ్తే ఒకవేళ అదిబయటపడితే వచ్చే అనర్థాలగురించి ఆ క్షణం ఆలోచించలేదు.
మెటల్ ఆల్కహాల్ ఫ్లాస్క్
అతనికి ఒక 10 రూపాయలు టిప్ ఇచ్చి “వెళ్ళి మీ శేఠ్ కి ముందే విషయం చెప్పి తీసుకురా” అన్నాను. మొత్తానికి విజయవంతంగా థమ్సప్ నింపిన క్వార్టర్ బాటిల్ సంపాదించి దాన్ని పుస్తకాలతో పాటు ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ లో పడేసి దర్జాగా ఊపుకుంటూ నడవడం మొదలుపెట్టాను. కౌబోయ్ సినిమాల్లో హీరోలు స్టీల్ ఆల్కహాల్ ఫ్లాస్కుల్లోంచి తాగుతున్నట్లు నేను ఈ క్వార్టర్ బాటిల్ ఎత్తి తాగుతుంటే చుట్టూ నా ఫ్రెండ్సంతా హీరోవర్షిప్ తో నా వైపు ఆరాధనాపూర్వకంగా చూస్తూ “అబ్బ వీడెంత గ్రేట్ రా, వీడికెంత ధైర్యంరా, హాస్టల్ కి మందు తెచ్చుకొని తాగుతున్నాడు..” అని వాళ్ళళ్ళో వాళ్ళు చెవులు కొరుక్కుంటూ గుసగుసలాడుకుంటున్నట్లుగా కలల్లో తేలిపోతూ ఒక ఐదు నిముషాలు నడిచానో లేదో ఉన్నట్లుండి ఎక్కడినుంచో సీసా భళ్ళుమని బద్దలైన పెద్ద శబ్దం !!!

సీసాతో పాటు నా కలలు కూడా బద్దలై వాస్తవంలోకి వచ్చి ఎక్కడా అని తలదించి చూస్తే.. కవర్లో సీసా ముక్కలు ముక్కలై... థమ్సప్ నేను కొన్న పుస్తకాలని పూర్తిగా తడిపేసి గాజుపెంకులు ప్లాస్టిక్ సంచికి చేసిన కన్నంలోంచి కిందకి కారుతూ నా ప్యాంట్ పైకి కూడా చింది అంతా బంక బంకగా ఖంగాళీ సీన్. అనుమానం వచ్చి తల ఎత్తి పక్కలకి చూస్తే ఒకరిద్దరు అనుమానంగా నా వైపే చూస్తూ కనిపించారు. హిహిహి అని ఒక వెర్రినవ్వు నవ్వి హమ్మయ్య పర్లేదు ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు లేదులే అని తల మరోపక్కకి తిప్పగానే పక్కనే కిళ్ళీ బంకు దగ్గరనుండి నిర్లక్ష్యంగా సిగరెట్ కాలుస్తూ “ఏంట్రా అది?” అని అడుగుతూ ఒక కానిస్టేబుల్ నా వైపు నడవడం మొదలెట్టాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయ్ “ఒరేయ్ వేణుగా ఐపోయిందిరా.. నీ జీవితం మఠాష్.. జాగ్రత్తగా డీల్ చేయకపోయావో నీశేషజీవితమంతా జైల్లోగడపాల్సిందే.. నీ ఎంకమ్మా.. నువ్వూ నీ దిక్కుమాలిన ఐడియాలు..” అని నన్ను నేనే మనసులో బండ బూతులు తిట్టుకుంటూ సాధ్యమైనంత నవ్వుముఖంతో మాక్సిమమ్ మర్యాదతో ఇది సార్ జరిగింది కావాలంటే ఆ బార్ లో వెయిటర్ సాక్ష్యం సార్ అని మొత్తం స్టోరీ వినిపించాను.
మరి నా ఫేస్ లో అమాయకత్వం కనిపించిందో, నా భయం చూసి జాలేసిందో, నా మాటతీరు నచ్చిందో, తను వయసులో ఉన్నపుడు చేసిన అల్లరి గుర్తొచ్చిందో గాని అతనుకూడా టోన్ మార్చేసి నవ్వుతూ “అల్లరి చేయాలనుకుంటే చాలదోయ్ తగిన తెలివితేటలు కూడా ఉండాలి... డ్రింక్ లో గ్యాస్ ఉంటుంది కదా నువ్వు సంచి ఊపడంవల్ల లోపల ప్రెజర్ ఎక్కువై సీసా పగిలి ఉంటుందిలే కంగారు పడకు..” అని సర్దిచెప్పి బంకులో ఇంకో క్యారీబ్యాగ్ ఇప్పించి “పుస్తకాలు అందులో పెట్టుకుని బుద్దిగా హాస్టల్ కి వెళ్ళు..” అని పంపించాడు. నేను తిరిగి చూడకుండా అదిరే గుండెని అరచేత పట్టుకుని ఎలాగో హాస్టల్ లో పడ్డాను. అలా హీరోనవుదామనుకున్న నా కల నెరవేరక జీరోగా మిగిలిపోవడమే కాక ఎంత ఆరబెట్టినా ఆ పుస్తకాలకు ఉన్న బంక వదలక చాన్నాళ్ళపాటు వాటిని ముట్టుకున్నపుడల్లా ఆ పోలీస్ మొహమే గుర్తొచ్చి వణుకొచ్చేది.

ఇప్పుడు ఎప్పుడైనా ఈ సంఘటన గుర్తొస్తే ఇలా అనిపిస్తుంటుంది.. అప్పట్లో ఇంత టెర్రరిజం లేకపోబట్టి గానీ అదే ఇప్పటి రోజుల్లో ఐతే ముందు నన్ను షూట్ చేసేసి తర్వాత ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఉండేవాడేమో.
గమనిక : ఆల్కహాల్ సేవించుట ఆరోగ్యానికి హానికరమని పిల్లలు పెద్దలు అందరూ గుర్తించ ప్రార్ధన. అది శరీరంపై కలుగజేయు దుష్ఫలితాల గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది చిత్రం చూడండి.

గురువారం, డిసెంబర్ 23, 2010

చిన్ననాటి పాటలు

మధ్య ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళినపుడు, వాళ్ళ పాప ఆటల మధ్యలో తన 'చిన్నారుల తెలుగు పాటల పుస్తకం' తెచ్చి నాకు చూపించింది. దాన్లో కొన్ని పాటలు చూసిన మరుక్షణం మనసు అలా బాల్యంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రానని మొరాయిస్తుంటే బలవంతంగా లాక్కొచ్చి ఇహంలో పడేసాను. వెంటనే ఆ మధురానుభూతిని అనుకున్న తక్షణం పొందడానికి వీలుగా ఆ పాటలను ఎక్కడైన పదిల పరచుకోవాలని ఎక్కడో ఎందుకు బ్లాగ్ ఉందికదా అనుకుని అన్ని ఇక్కడ రాసుకుంటున్నాను. అచ్చుతప్పులకు తోడు ఙ్ఞాపకశక్తియొక్క లోపాల వలన కొన్ని పాటలలో తప్పులు ఉండవచ్చు, కొన్ని అసంపూర్తిగా ఉండవచ్చు. నేను మిస్ అయినవి మీకు తెలిసిన మరికొన్ని మంచి పాటలు వ్యాఖ్యల ద్వారా కలపండి.

కొన్ని పాటలు అక్కడక్కడా వెతికి సేకరించాను కానీ అన్నీ దొరకక పూర్తి వివరాలు సేకరించలేకపోయాను కనుక మీరు గమనించిన సవరణలు తెలియచేస్తే టపాలో సరిచేస్తాను. నా చిన్నప్పటి నేస్తాలలో ఒకరిద్దరు అమ్మాయిలు కూడా ఉండటంతో "చెమ్మ చెక్క..", "ఒప్పులకుప్ప", "చిట్టిచిట్టి మిరియాలు", "కాళ్ళాగజ్జ", "తొక్కుడు బిళ్ళ", లాంటి పాటలు ఆటలు కూడా అందరం కలిసి పాడుకుని ఆడుకునే వాళ్ళం అందుకే అన్నీ ఇక్కడ పొందు పరుస్తున్నాను. సరే మరి బడి గుడి ఒకటేనంటూ గురువును దైవంతో సమానంగా పూజించమంటూ చెప్పే ఈ పాటతో బాల్యంలోకి మన ప్రయాణం మొదలెడదామా.
1
బడిలో గంట గుడిలో గంట
రెండూ ఒకటేనంటా..
గుడిలో దేవుడు బడిలో గురువు
ఇద్దరు ఒకటేనంటా..
చదువుల తల్లి ఒడిలో మనమూ
చక్కగ చదువుకుందామూ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
2
చిట్టి చిలకమ్మా
అమ్మకొట్టిందా
తోట కెళ్ళావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కున మింగావా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
3
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్తతెచ్చిన కొత్త కోక కట్టనన్నది
మామతెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మగనిచేత మొట్టికాయలు తింటానన్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

4
చందమామ రావె జాబిల్లి రావె
కొండెక్కి రావె కోటిపూలు తేవె
బండెక్కి రావె బంతిపూలు తేవె
తేరుమీద రావె తేనెపట్టు తేవె
పల్లకీలో రావె పాలు పెరుగు తేవె
పరుగెత్తి రావె పనసపండు తేవె
అలయకుండ రావె అఱటిపండు తేవె
అన్నిటిని తెచ్చి మా అబ్బాయికివ్వవె

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
5
బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెళ్తివి
రాజుగారి దొడ్డిలోన మేతకెళ్తిని
రాజుగారి దొడ్డిలోన ఏమి చూస్తివి
రాణిగారి పూలమొక్కల సొగసు చూస్తిని
పూలమొక్కల సొగసు చూసి ఊరకొంటివా
పూలమొక్కల సొగసు చూసి మేసివేస్తిని
రాజుగారి భటులు వచ్చి ఏమి చేస్తిరి
రాజుగారి భటులు వచ్చి తన్ని పంపిరి.

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 6
ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం
సవారిచేస్తే చక్కని గుర్రం
సాములు చేస్తే సర్కస్ గుర్రం
పౌరుషముంటే పందెపు గుర్రం
ఆగకపోతే అరబ్బీ గుర్రం
చచ్చుది అయితే జట్కా గుర్రం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
7
వానా వాన వల్లప్ప
వాకిలి తిరుగు చెల్లప్ప
చేతులు చాపు చెల్లప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరుగాలేను నరసప్ప

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 8
చీమ ఎంత చిన్నది 
పనిలో ఎంత మిన్నది
ముందు చూపు ఉన్నది 
పొదుపులోన మిన్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
9
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ.. 
అట్లుపోయంగ ఆరగించంగా..
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా
రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లి చేయంగ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 10
చింత చెట్టుతొర్ర లోన చిలక ఉన్నది
తాత బోడిబుర్ర మీద పిలక ఉన్నది
చిలక ముక్కు తాత ముక్కు తీరునున్నది
చింత తొర్ర తాత బుర్ర తీరునున్నది
తాతకాళ్ళకున్న జోడు కిర్రుమన్నది
చింతచెట్టు తొర్రలోన చిలుక తుర్రుమన్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
11
కోతీబావకు పెళ్ళంటా 
కొండా కోనా విడిదంటా
కుక్కానక్కల విందంటా 
ఏనుగు వడ్డన చేయునట
ఎలుగు వింతను చూచునటా
కోడీ కోకిల కాకమ్మా 
కోతీ పెళ్ళికి పాటంటా
నెమళ్ళు నాట్యం చేయునటా
ఒంటెలు డోలు వేయునటా
ఊరంతా శుభలేఖలటా
వచ్చే వారికి విందులట
పెళ్ళిపీటలపై కోతీ బావ
పళ్ళికిలించునటా..
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
12
చుక్ చుకు రైలు వస్తుంది
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డూ మిఠాయి తినిపిస్తా
కమ్మని పాలు తాగిస్తా
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
13
 బావా బావా పన్నీరు.. 
బావని పట్టుకు తన్నేరు..
వీదీ వీదీ తిప్పేరూ.. 
వీశెడు గంధం పూసేరు..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
14
తారంగం తారంగం 
తాండవ కృష్ణా తారంగం
వేణూ నాథా తారంగం 
వెన్న ముద్దల తారంగం
ఆలా బాలా తారంగం.. 
ఆడుకొ పాపా తారంగం..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
15
ఉడుతా ఉడుతా హూచ్
ఎక్కడికెళ్తావ్ హూచ్
కొమ్మ మీదీ జాంపండు
కోసుకొస్తావా మా బేబీ కిస్తావా..
చేతిలో ఉన్న పల్లీని ఒక చిన్న ముక్క కొరికి ముందు పళ్ళతో చిత్రంగా ఆత్రంగా నములుతూ హైరానా పడిపోతూ హడావిడిగా అన్ని వైపుల తలతిప్పేస్తూ ఓసారి పరికించి మళ్ళీ కాస్త కొరికి హైరానా పడిపోయే ఈ బుజ్జి బుజ్జి ఉడుతలు నాకుచాలా ఇష్టమైన నేస్తాలు :-) చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలియక ముందే ఓ ఏడాది వయసప్పుడు అనమాట నన్నెత్తుకుని అమ్మ ఈ పాట ఎక్కువగా పాడేసిందేమో మరి. నన్ను మా ఇంటి ముందున్న జామ చెట్టు కింద పడుకోపెడితే ఉడుతలు, రామ చిలుకలు దోర మగ్గిన జామపండ్లని రుచి చూసి మరీ నాకోసం నా మంచం మీదికి విసిరి నాతో అప్పటి నుండే దోస్తీ కట్టేసేవట. అవి అంత ప్రేమగా విసురుతుంటే పాపం వెర్రి అమ్మేమో వీటి ప్రేమ పాడుగాను అబ్బాయికి ఎక్కడ దెబ్బతగులుతుందో ఆ పళ్ళు తగిలి అని గాబరా పడేదట.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
16
ఒప్పుల కుప్ప వయ్యారి భామ
సన్న బ్వియ్యం ఛాయపప్పు
చిన్న మువ్వ సన్న జాజి
కొబ్బరి కోరు బెల్లం ముక్క
గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
17
గుడు గుడు గుంచెం గుండే రాగం
పాముల పట్నం పడగే రాగం
అత్తారింటికి దారేది దారేది దారేది..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
18
ఏనుగమ్మా ఏనుగు..
మా ఊరొచ్చిందేనుగూ..
ఏనుగు మీదా రాముడు..
ఎంతో చక్కని దేముడూ..
ఏనుగు ఏనుగు నల్లనా..
ఏనుగు కొమ్ములు తెల్లనా..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
19
చిట్టిచిట్టి మిరియాలూ.. చెట్టు కింద పోసి..
పుట్ట మన్ను దెచ్చి.. బొమ్మరిల్లు గట్టి..
బొమ్మరింట్లో పిల్ల పుడితే..
బొమ్మ తలకూ నూనె లేదు..
బొమ్మ బిడ్డకీ నెయ్యి లేదు..
అల్ల వారింటికీ చల్లకు వెళితే..
అల్ల వారి కుక్క భౌ భౌ మన్నది
నా కాళ్ళ గజ్జెలు ఘల్ ఘల్ మన్నవి
చంకలోని పిల్ల క్యార్ క్యార్ మన్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 20
కాళ్ళా గజ్జ కంకాళమ్మా
వేగు చుక్క వెలగ మొగ్గ
మొగ్గ కాదు మోటానీరు
నీరు గాదు నిమ్మల బావి
బావి కాదు బచ్చలి కూర
కూరా కాదు గుమ్మడి పండు
పండు కాదు పాప కాలు
కాలు తీసి కడగా పెట్టు. 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

కాళ్ళాగజ్జ కంకాళమ్మ అంటే గుర్తొచ్చింది, దాగుడు మూతలు ఆడేముందు దొంగని డిసైడ్ చేయడానికి చేతి పంటలు వేసుకునే బదులు, అందరం కింద రౌండుగా కాళ్ళు చాపుకుని కూర్చుని ఇదే పాటని బాగా కుదించి
కాళ్ళా గజ్జ కంకాళమ్మా
వేగు చుక్క వెలగ పండు
కాలు తీసి కడగా పెట్టు.
అని అంటూ చేత్తో కాళ్ళు చూపుతు "కడగాపెట్టు" అన్న పదం ఎవరి కాలి మీదకి వస్తే వాళ్ళు పంటైనట్లు చివరిగా మిగిలిపోయిన వాళ్ళని దొంగగా నిర్ణయించేసే వాళ్ళం. ఈ దాగుడు మూతలు ఆటకి ఉపయోగించే మాటలు కూడా పాటలాగానే ఉంటాయ్ కదా.. కాకపోతే మన అమ్మో లేదా మన టీంలో పెద్దవాళ్ళో పాడేస్తారు :)
వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమీ
xyz, ఆ xyz వెళ్ళి దాక్కో

దాగుడు మూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలుక చోర్
ఎక్కడి దొంగలక్కడే..
గప్ చుప్.. సాంబార్ బుడ్డీ
 ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇంకా చేతవెన్నముద్ద, ఆదివారంనాడు అఱటి, కాకీ..కాకీ పాటలకోసం అనుగారి ఊహలు ఊసులు బ్లాగ్ ఇక్కడ చూడండి.

బుధవారం, డిసెంబర్ 15, 2010

చిత్రమాలిక లో నేను..

పదేళ్ళ క్రితం నేను అమెరికాలో మొదటిసారి కాలుపెట్టినపుడు ఎదుర్కొన్న ప్రధమ సమస్య భాష. భాష అనేకన్నా యాస అనడం సబబేమో. పదోతరగతి వరకు తెలుగుమీడియంలో చదువుకున్న నాకు నాఇంగ్లీష్ నాలెడ్జే అంతంత మాత్రం, ఇక అమెరికన్ యాక్సెంట్ అర్ధం చేసుకోడానికి నానా కష్టాలు పడి ఒళ్ళు చెవులు సర్వం  రిక్కించి విని ఆ మాటలు మనసులో ప్రాసెస్ చేసుకుని అర్ధంచేసుకోవాల్సి వచ్చేది. ఇక అమెరికన్ల సంగతికొస్తే నేను మాట్లాడటం దేవుడెరుగు కనీసం తలాడించినా అర్ధమయ్యేది కాదు “అవుననా కాదనా దాని అర్ధమేమిటి” అని మళ్ళీ మళ్ళీ అడిగేవాళ్ళు. వీటన్నిటినీ అధిగమించడానికి నేను ఎన్నుకున్న మార్గం టివిలొ వచ్చే అమెరికన్ సినిమాలు.

అక్కడ టివీలో క్లోస్డ్ క్యాప్షన్స్ (సబ్ టైటిల్స్) పెట్టుకుని వచ్చే ప్రతి అడ్డమైన సినిమాలు చూసేవాడిని. మనకి భాష + మ్యానరిజమ్స్ తెలియాలి కనుక సంభాషణలున్న సినిమాలు చూస్తుంటే "ఊరక మాట్లాడుకుంటుంటే ఏం చూస్తావ్ ఒక్క యాక్షన్ సీన్ లేకుండా" అంటూ మా రూంమేట్స్ అసహనానికి గురయ్యేవారు. వాళ్ళగోల భరించలేక రాత్రిళ్ళు జాగారం చేసిన రోజులు ఎన్నో. అలాంటి రోజుల్లో చూసిన సినిమానే 12 Angry Men అసలే థ్రిల్లర్స్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్ననాకు ఈ సినిమా చాలా చాలా నచ్చేసింది. ఎంతగా అంటే తర్వాత రోజుల్లో దదాపు రెండునెలలకోసారి చూసేటంత. ఈ సినిమా పై నేను రాసిన పరిచయ వ్యాసం చిత్రమాలిక లో చదవండి...

ఆదివారం, డిసెంబర్ 12, 2010

నిజం చెప్పి ప్రేమించమనే ఆరెంజ్.

నేనూ మార్గదర్శిలో చేరాను ఆరెంజ్ సినిమా చూశాను :-) ఈ సినిమాగురించి మాటమాట్లాడితే బడ్జెట్ అంటున్నారు అదీకాక ఇంత ఆలశ్యంగా చూశాను కదా అని ఈ కామెడీ డైలాగ్ కొట్టా కానీ ఇలా చిట్టీలు కట్టుకుని పొదుపుచేసి సినిమాకి వెళ్ళవలసివచ్చే రోజులు ఎంతో దూరంలేవు. దిక్కుమాలిన మల్టిప్లెక్స్ పుణ్యమా అని ఇక్కడ టిక్కెట్లకు ఒక స్థిరమైన ధర ఉండదు కన్నడ సినిమాలు కాస్త తక్కువేకానీ పరభాషాచిత్రాలు మరీ ఎక్కువ అవి మొదటివారమైతే 350 తరవాత నుండి వారంమధ్యలో ఐతే పగలు 160, సాయంత్రాలు 180, వారాంతం(శుక్ర,శని,ఆది) వచ్చిందంటే అవే రేట్లు వరుసగా 200, 240 ఐపోతాయి. వీటికితోడు మంచినీళ్ళ సీసా కావాలన్నా యాభైరూపాయిలు అదికూడా బయట నుండి తీసుకు వెళ్ళడానికి వీలు లేదు. పోనీలే నిర్మాతలు బాగుపడతారుకదా అనుకుందామంటే టిక్కెట్ డబ్బులో డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్ళేది తక్కువా థియేటర్ యాజమాన్యానికి వెళ్ళేది ఎక్కువా అంట. నాలాంటి సింగిల్ టికెట్ గాడికే ఈ డబ్బులతో ఒక అరడజను డివిడి లు వాటిలో ఇరవైకి తక్కువగాకుండా సినిమాలు వచ్చేవి అనిపిస్తే ఇక కుటుంబాల పరిస్థితి ఏమిటి ? పైరసీని అరికట్టండి అంటే ఎవరైనా ఎందుకు అరికడతారు ? సరే ఈవాదన ఎంతకీ తెగదు కనుక అదివదిలేసి సినిమా విషయానికి వస్తే... సినిమా నాకు చాలా నచ్చేసింది అలా అని నెగటివ్ పాయింట్స్ లేవని కాదు కానీ ఆలోచింపచేసే సినిమా...

“సముద్రమంత ప్రేమని పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం అంకితం” 

సినిమాప్రారంభానికి ముందు ఈ లైన్ చూసి ఒకింత ఆశ్చర్యపోయాను ఎంటీ ఈ సినిమా హీరో ఏదో కొంతకాలమే ప్రేమిస్తాను అని అంటాడు అన్నారు ఇక్కడచూస్తే సముద్రం అంత ప్రేమ అంటున్నాడు కొంతకాలంలో అదెలా సాధ్యం అని. సినిమా పూర్తయ్యాక భాస్కర్ చెప్పింది అదే అనిపించింది కొంతకాలం ప్రేమిస్తే సముద్రమంత ప్రేమ చూడలేవు కనుక ప్రేమ తగ్గడమోలేదా పాతబడడమో జరిగినపుడు విడిపోవడానికి కారణాలు కాకుండా ఆప్రేమను పెంచుకోవడానికి ఇంకొంచెం ప్రేమించడానికి కారణాలు అణ్వేషించు అలా జీవితకాలం ప్రేమించి చరమాంకంలో సముద్రమంత ప్రేమని ఆస్వాదించు అని. ప్రేయసిని సంతోషపెట్టడానికి ఆబద్దాలాడటం ఏమాత్రం ఇష్టంలేని నిజాయితీగల ఓ కుర్రాడు అలా అబద్ధాలు ఆడేబదులు ప్రేయసికోసం తనని తాను మెల్లగా మార్చుకోవడం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే “Don’t sacrifice anything for anybody” అనే అభిప్రాయం నుండి “Sacrifice anything for your Love” అనుకునే వరకూ చేసిన ప్రయాణమే ఈ ఆరెంజ్. 

ఒప్పుకోవడానికి కష్టమనిపించినా తెలిసో తెలియకో మనలో నూటికి తొంభై మందిమి మన జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తుంటాం, అది నిర్లక్ష్యం కూడా కాదు we just take them for granted. ప్రేమించడం మొదలైన కొత్తలోనో పెళ్ళైన కొత్తలోనో ప్రయత్నించినంతగా మన ప్రేమని ప్రదర్శించాలని, ఎదుటి మనిషిని సంతోషపెట్టాలని ఆరాటపడటం రాను రాను తగ్గిపోతుంది. అంతమాత్రాన ప్రేమతగ్గిపోయినట్లు అర్ధంకాదు దైనందిన జీవితాల్లో పడి ఇతరత్రా బాధ్యతలవల్ల కొంత ఇవన్నీ కుదరకపోవచ్చు. మరీ కుర్రపిల్లల్లా ఆ చేష్టలేమిటీ అని ఎవరన్నా ఏమైనా అంటారేమో అన్న బిడియం కూడా కారణం కావచ్చు. ఈ సినిమాలో పెళ్ళిరోజు గ్రాండ్ గా జరుపుకుంటూ వాళ్ళ అందమైన మొదటి పరిచయాన్ని నెమరువేసుకుంటున్న హీరోయిన్ తండ్రిని హీరో ఒక ప్రశ్న వేస్తాడు “ఈ రోజు మీరు మీ ప్రేమని ఎలా express చేశారంకుల్” అని. దానికి అతనిదగ్గర సమాధానం ఉండదు, అతనిదగ్గరేకాదు మనలో చాలామంది దగ్గర ఆ సమాధానం ఉండదు. అలా సమాధానంలేకుండా ఉండకూడదు అనే ఆరెంజ్ చెప్తుంది.

నేను రామ్ చరణ్ ని చూడటానికి ఇంకా పూర్తిగా అలవాటుపడలేదు, చాలా చోట్ల ఫ్రెష్ లుక్ తో పెప్పీగా కనిపించినా అక్కడక్కడా ఘోరంగా కూడా కనిపించాడు. ఈ సినిమాలొ డాన్స్ నాకు బాగానచ్చింది, చరణ్ మాటల్లోనే చెప్పాలంటే “కరెంట్ షాక్ కొట్టి కిందపడి గిలగిల కొట్టుకుంటున్నట్లు, చీపురు లేకుండా నేల ఊడుస్తున్నట్లు ఉండే జిమ్నాస్టిక్ స్టెప్స్ ఒకటి కూడా లేవు” అన్నీ కూడా ఫ్రీఫ్లోయింగ్ మూమెంట్ తో ఏమాత్రం కష్టపడకుండా అలవోకగా వేసేలా పాటల మూడ్ కి తగినట్లుగా మంచి ఆహ్లాదకరమైన స్టెప్స్ కంపోజ్ చేశారు. నాగబాబువేసిన చిన్న పాత్ర సినిమాకి చాలా కీలకం సినిమా ఎసెన్స్ అంతా ఆ ఒక్క చిన్నపాత్రతో చక్కని సన్నివేశాలతో చెప్పేశాడు. కానీ ఇతని లెగ్ చిరంజీవికి ఏ సినిమాలో కూడా అచ్చిరాలేదు అదే చరణ్ కి కూడా కంటిన్యూ అవుతున్నట్లుంది, ఈ పాత్రకి ఏ జగపతి బాబు లాంటివారినో ఉపయోగించుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. హాస్యం అంతర్లీనంగా ఉంది పొట్టచెక్కలయ్యేల నవ్వించే సన్నివేశాలు కాదు ప్రత్యేకమైన ట్రాక్ లేదు కానీ చిరునవ్వులు పూయించే సున్నితమైన హాస్యం ఉంది. ఈ ప్రేమకథకు ప్రేక్షకుని పాత్రలో బ్రహ్మానందాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు కొన్ని చోట్ల ఇతని కామెంట్స్ మన అభిప్రాయాలతో సరిగ్గా సరిపోతాయి :-) ఇక పాటలగురించి చెప్పేదేముంది పదే పదే వినదగ్గ పాటలు కనీసం ఒక ఏడాది పాటు వినిపిస్తూనే ఉంటాయి.


సినిమా టైటిల్స్ చివర షాట్ లో స్క్రీన్ మొత్తం తెల్లని దుమ్ముతో నిండి ఉంటుంది అది మెల్లగా సద్దుమణిగి స్క్రీన్ మీద ఒక సగం అంతా జెనీలియా మొహం మిగతాసగంలో పైన ఒక మూల దర్శకత్వం భాస్కర్ అన్న పేరు కనపడతాయి. ఈ దర్శకుడి జెనీలియా పిచ్చి గురించి చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలి. సినిమాపై అన్ని కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత ఈవిడ దుస్తులపై ఇంకాస్త ఖర్చుపెట్టి ఇంకో నాలుగంగుళాలు పొడవు కుట్టిస్తే బాగుండేది. అయినా దుస్తులు పొడవు తగ్గే కొద్దీ రేటు పెరుగుతుందనుకుంటా కదా ఆ లెక్కన చూస్తే నిర్మాతకి కాస్త డబ్బులు మిగిలేవేమో. కానీ గుడ్డిలో మెల్ల ఏమిటంటే ఈవిడ ఇంట్లోఉన్నపుడైనా కాస్త నిండుగా ఒళ్ళు కప్పుకుని పరువు నిలబెట్టింది అంతవరకుసంతోషం. పొట్టిబట్టలు పిచ్చిజుట్టుతో యంగ్ గా కనిపించవచ్చు అని ఎవరుచెప్పారోకాని ముందువాళ్ళని తన్నాలి. ఇక తన ఇంట్రడక్షన్ ని చూసి సినిమా అంతా ఇంతేఉంటుందా ఇంటర్వెల్ లో బయటపడటం ఎలాగా అని ఆలోచిస్తున్నటైంలో ఆ సన్నివేశాల్లో తనని చూసి ప్రేమలో పడిన చరణ్ వాళ్ల అక్కతో “ఇవ్వాళ సిడ్నీలో ఓ తింగరిదాన్ని చూశాను” అని చెప్పడంతో పోనిలే దర్శకుడికి కనీసం ఆ క్లారిటీ ఉందికదా అని కుదుటపడ్డాను. అనుకున్నట్లుగానే మొదట్లో తను అలా ఎందుకు ఉంది రాను రాను ఎలా చేంజ్ అయింది అన్నది బాగానే చూపించాడు.

ఈ సినిమాలో కథ గురించి చెప్పుకోడానికి పెద్దగా ఏమీలేదు ఇప్పటికే చాలా రివ్యూలలో చెప్పేశారు కూడా కదా ఉన్న కాస్త కథ గురించీ అందుకే ఇక నేను ఆ పాయింట్ టచ్ చేయడంలేదు. గ్రాఫిటీ బాగుంది స్ప్రే క్యాన్ ఫైట్ ప్రత్యేకంగా ఉంది కానీ అంత గొప్పగా అనిపించలేదు. ఇక స్కైడైవింగ్ ఫైట్ తో మన చెవుల్లో ఏకంగా పూల మొక్కలే పెట్టేశాడు అనిపించింది ఏమాత్రం కన్విన్సింగ్ గా లేదు. అసలా ఫైట్ మొత్తం ఎత్తేస్తే ప్రభుపాత్ర మరికొంతబాగా ప్రజంట్ చేసినట్లు ఉండేది, నా అనుమానం అది భాస్కర్ స్క్రిప్ట్ లో ఉండిఉండదు ఫ్యాన్స్ కోసం వేసిన వేషాలయి ఉండచ్చు. ట్రూత్ / డేర్ గేం సన్నివేశం నాకు చాలా నచ్చింది. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి “ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నటించడం మహాపాపంరా” లాంటి డైలాగ్స్ మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. 


ఆరెంజ్ name is not about the fruit, it’s about the color, it’s about the freshness. సినిమాకి ఈ పేరుతోనే ఒక తాజాదనం తీసుకువచ్చాడు భాస్కర్. మొదటినుండి చివరివరకూ ఏదో కొన్నిచోట్లతప్ప ప్రతి ఫ్రేం లోనూ ఆ తాజాదనం ప్రతిఫలించింది. ఈ సినిమాని హైదరాబాద్ నేపధ్యంలో తీసి ఆ తాజాదనం తీసుకురావాలంటే చాలా క్రియేటివిటీ కావాలి అదిలేకే సిడ్నీ నేపధ్యాన్ని గ్రాఫిటీని ఎన్నుకున్నాడు. సినిమాకి రిపీట్ ఆడియెన్స్ అయిన మాస్ కి ఈ సినిమాలోని గాఢత అర్ధంకాక, యువతకి ఈ సినిమాలోని నిజాయితీని ఎదుర్కొనే ధైర్యంలేక ఈసినిమాని  ఫ్లాప్ చేశారేమో అనిపించింది. ఈ సినిమా అయ్యాక వస్తుంటే నేనువిన్న కామెంట్ “మా ఫ్రెండ్ చెప్పింది నిజమే మామ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఈ సినిమాకి చచ్చినా రాకూడదు”.

నిజాయితీగా ప్రేమగురించి ఆలోచింపచేసే సినిమా ఆరెంజ్. నిజమైన ప్రేమకీ ప్రేమ అనే భ్రమకి తేడాతెలియని యువత మిస్ అవకుండా చూడవలసిన సినిమా ఆరెంజ్. మేం ప్రేమిస్తున్నాం ప్రేమలోఉన్నాం అని అనుకునే వాళ్ళని పక్కన పెడితే మీరు మీ ప్రేయసినో జీవితభాగస్వామినో నిజంగా ప్రేమిస్తున్నట్లైతే ఈ సినిమా చూశాక తనదగ్గర మీ ప్రేమని మరోసారి వ్యక్తీకరించాలనీ తననుండి తొలినాటి అదే ప్రేమని మళ్ళీ మళ్ళీ పొందాలనీ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక వైవిధ్యమైన స్క్రిప్ట్ తో ముందుకు వచ్చిన భాస్కర్‍నీ, ప్రయోగమనో మూడోసినిమానేకదా అనో భయపడకుండా ధైర్యంగా సినిమా చేయడానికి అంగీకరించిన రామ్ చరణ్‍నీ అభినందించి తీరాలి.

సోమవారం, డిసెంబర్ 06, 2010

నెనర్లు.. ధన్యవాదాలు.. త్యాంకులు..

ఈరోజు (డిశంబర్ ఆరు) నా పుట్టిన రోజు సంధర్బంగా బ్లాగులలో టపాల ద్వారా, కామెంట్ల ద్వారా, బజ్ లోనూ, లేఖలలోనూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంధర్బంగా గతంలో గుర్తుచేసుకున్న నా పుట్టినరోజు ఙ్ఞాపకాలు ఇక్కడ చూడవచ్చు.

 
నాకు ఇష్టమైన "పుదీనా జంతికలు" చేసిపెట్టిన సృజనగారికి, తనెవరో నేను పేరుచెప్పను మీరే కనిపెట్టండి అంటూ నాకు అభావకుడు అని పేరు తగిలించి దేశమంతా బ్లాక్ డే జరుపుకునే ఈరోజున మా నరసరావుపేట రాష్ట్రానికి మాత్రం శ్వేతదినంగా ప్రకటించి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పిన "గీతాచార్యగారికి", తన బ్లాగ్ లో నాకు ఇష్టమైన కృష్ణుని బొమ్మతోపాటు చక్కని మెసేజ్ మరియూ బజ్ లో ఓ అల్లరి మల్లిక్ కార్టూన్ తో మరిచిపోలేని విషెస్ అందించిన "మంచుగారికీ", వైవిధ్యమైన తనశైలిలో ఇంటిల్లిపాదితో కలిసి  శుభాకాంక్షలు చెబుతూనే పెద్దన్నయ్యలా నాకు కర్తవ్యబోధ చేసిన "భాస్కర రామరాజు గారికి" ప్రత్యేకమైన ధన్యవాదాలు. You all made my day and Thanks a lot for making me feel so special on this day.


ఇంత మంచి కుటుంబాన్నీ, స్నేహితులను నాకు ఇచ్చినందుకు, ఇంతటి ప్రేమాభిమానాలు నా సొంతం చేసినందుకు ఆ దేవుడికి, ఈబ్లాగులోకానికీ, మీ అందరి మంచి మనసులకు మరోసారి ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. 

ఈ సంధర్బంగా సంకలినులలో టపాలు లేదా కామెంట్స్ వలన ఎవరికైనా అసౌకర్యం కలిగిఉంటే మన్నించగలరు. 

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.