అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

ఆదివారం, అక్టోబర్ 31, 2010

హెచ్చవేత - చైనీయుల పద్దతి(ట)

ఇప్పటికే ఈ వీడియో మీలో చాలా మంది చూసి ఉండచ్చు, కానీ నేను నిన్నే చూశాను and felt amazing. నా స్కూల్ డేస్ లో నాకు ఈ ట్రిక్ తెలిసుంటే ఎంత బాగుండేది, ఎన్ని కష్టాలు తప్పేవి అని చాలా అనిపించింది :-)

Show this to your kids at your own risk :-D


బుధవారం, అక్టోబర్ 27, 2010

సుత్తి ఎవరి సొత్తు?

నిన్న రౌడి గారి బ్లాగ్ లో శంకరయ్య గారు సుత్తి ఎవరి సొత్తు? విశ్లేషణ ఇవ్వగలరా అని అడిగిన ప్రశ్న చూసి వెంటనే నేనెరిగిన నాలుగు ముక్కలు చెప్దామని వారి ప్రశ్ననే శీర్షిక గా చేసుకుని సుత్తి గురించి కాసేపు సుత్తి కొడదామని ఈ టపా మొదలెట్టాను. వారేదో ఆంగ్ల నవలలో "You had been hammering Mr. Lanslott for the money since longtime" అన్న వాక్యం చదివి ఈ పదం ఆంగ్ల రచయితలు ఇదివరకే వాడినట్లున్నారు మన జంధ్యాల గారి ఐడియా కాదేమో అనిపించింది అన్నారు. ఆంగ్లంలో hammering అన్న ఉపయోగం గురించి వెతికితే ఈ కింది జవాబిచ్చింది. ఆ వివరాలు ఈలింక్ లో చూడవచ్చు. >>"to interrogate someone; to ask questions endlessly of someone. The cops kept hammering away at the suspect until he told them everything they wanted to know. They hammered at him for hours."<< వారు ఉదహరించిన వాక్యం కూడా ఈ అర్ధానికి సరిపోయినట్లు అనిపిస్తుంది.

ఇక మన జంధ్యాల గారు తెలుగు ప్రజలకు పరిచయం చేసిన సుత్తి గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. వారి మాటలలోనే సుత్తివేలు గారి నోటివెంట సుత్తి గురించిన వ్యాఖ్యానం ఈ క్రింది వీడియో లో చూడండి. బహుశా జంధ్యాల గారు ఆంగ్లంలో ఉపయోగించిన పద్దతి నుండి inspire అయి ఉండచ్చు కానీ వారు తెలుగు వారికి పరిచయం చేసిన ఈ సుత్తికొట్టడం అనేమాటకు సర్వ పేటెంట్ హక్కులు జంధ్యాల గారివే అని నా అభిప్రాయం :-)


ఆ వాక్ప్రవాహానికి శోషొచ్చి పడిపొయిన భరతుడు కాస్సేపటికి తేరుకుని "అన్నయ్యా నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా ఇంత సుత్తెందుకూ" అన్నాడట. అలా భరతుడి నోట్లోనుంచి రాలిన  ఆ సుత్తి భారత దేశం లో వాడుకలోకొచ్చిందనమాట. ఈ సుత్తుల్లో చాలా రకాలున్నాయ్...

ఒక్కోడూ ఠంగు ఠంగు మని గడియారం గంటగొట్టినట్లు సుత్తేస్తాడు దాన్ని ఇనప సుత్తి అంటారు అంటే iron hammering అనమాట.
ఇంకోడూ సుత్తేస్తున్నట్లు తెలీకుండా మెత్తగా సుత్తేస్తాడు రబ్బర్ సుత్తి అంటే rubber hammering అనమాట.
ఇంకోడూ ప్రజలందరికీ కలిపి సుత్తేస్తాడు సామూహిక సుత్తి దీన్నే mass hammering అంటారనమాట అంటే రాజకీయ నాయకుల మీటింగులు ఉపన్యాసాలు ఈ టైపు.
పోతే ఇంకోటైపుంది మీనాన్న గారు నాకు సుత్తేదామని వచ్చారనుకో నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాననుకో దాన్ని ఎదురు సుత్తి అంటారు అంటే reverse hammering అనమాట...
ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుధీర్ఘ సుత్తవుతుందనమాట అంటే prolonged hammering అనమాట.

మహానుభావుడు జంధ్యాల గారు ఇప్పుడు లేరు కాని ఉండుంటే " ఇంకోడూ చదివేవాడి ఖర్మ అన్నట్లు పేజీలకు పేజీలు వాళ్ళ బ్లాగుల్లో రాసేస్తుంటారు దాన్ని బ్లాగ్‌సుత్తి అంటారనమాట" అని కూడా ఒక రకం కలిపేసి ఉండేవారు :-) అదండీ సుత్తి వెనక ఉన్న కథాకమామిషు. మనలో మన మాట మీలో బిజెపి వాళ్ళెవరైనా ఉంటే మారాములోరిని సుత్తేసాడంటావా అని నాపై దాడి చేయకండి బాబులు ఏమైనా ఉంటే జంధ్యాల గారితో తేల్చుకోండి ప్లీజ్...

గురువారం, అక్టోబర్ 21, 2010

మహేష్ ఖలేజా


పై సీన్ చూశారు కదా? అందులో "మరీ ఇంత over expectation తట్టుకోలేకపోతున్నాను భయ్యా" అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఈ సినిమా ఏవరేజ్ టాక్ దగ్గర సెటిల్ అవడానికి కారణం చెప్పకనే చెప్పినట్లయింది. మూడేళ్ళ సమయం, నలభై కోట్లు, భారీ తారాగణం, గంభీరమైన టైటిల్ సరిపోవన్నట్లు ఏకంగా క్లైమాక్స్ సీన్ తో కూడిన టీజర్, స్పష్టత కొరవడిన మహేష్ ట్వీట్లు వెరసి ఈ సినిమా అంచనాలను ఆకాశానికెత్తేసి బాగున్న సినిమాను కూడా ఏవరేజ్ దగ్గర సెటిల్ అయ్యేలా చేసింది. హీరో, దర్శకుడు, నిర్మాత ముగ్గురూ కూడా సినిమా పై సరైన అంచనాలను ప్రేక్షకులకు చేరవేయడంలో విఫలమయ్యారు. వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ కాకుండా ఇక్కడ ఇచ్చిన రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసుంటే మహేష్ చేసే కామెడీకి సిద్దపడి జనం సినిమాచూసేవారు. మరి వచ్చే ఓపెనింగ్ కలక్షన్స్ కూడా రావని భయపడ్డారో లేదా సర్‍ప్రైజ్ వర్క్ అవుతుందనుకున్నారో కానీ మొత్తానికి సినిమా చతికిల పడింది.


సరే ఇక విషయానికి వస్తే నాకు ఈ సినిమా నచ్చింది, పాటలను క్లైమాక్స్ ను ఫార్వార్డ్ చేస్తూ రెండో సారి చూడటానికి కూడా రెడీ. ఒక గొప్ప కళాఖండం కాకపోవచ్చు, రికార్డ్ బ్రేకర్ కాకపోవచ్చు కానీ ఒక పూర్తి ఎంటర్ టైనర్. మూస జోలికి వెళ్ళకుండా వైవిధ్యతతో చేసిన ఓ మంచి ప్రయత్నం. సునీల్ తో ఫస్ట్ సీన్ నుండి చివరి వరకూ మహేష్ క్యారెక్టరైజేషన్ ఎక్కడా తొణక్కుండా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. తీసిన ప్రతి సినిమా ఒక అతడు మరో పోకిరి కావాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఏ సినిమా ప్రత్యేకత దానిదే. నిజానికి త్రివిక్రమ్ అతడు అనౌన్స్ చేసినపుడే నేనిలాంటి డైలాగ్ బేస్డ్ లైటర్ వీన్ సినిమా కోసం ఎదురు చూశాను. నేను గమనించినంతవరకూ త్రివిక్రమ్ కథల్లో హీరో సామాన్యమైన మనిషిలా ఉంటాడు అందుకే ఆ కథలను బేస్ చేసుకుని తీసే సినిమాలు(విజయభాస్కర్ సిన్మాలు కూడా కలిపి ఆలోచించండి) ఒక మంచి కథ చెప్తుంటే వింటున్నట్లు అనిపిస్తాయి. అలానే ఖలేజాలోకూడా మహేష్ కనిపించడు, ఒక సాథారణమైన ట్యాక్సీ డ్రైవర్ మాత్రమే కనిపిస్తాడు. అతనెంత సహజంగా ఉంటాడంటే ఊరంతా గొప్పగా చూసే రావురమేష్ ని సైతం ’వాడు/ఒరే’ అనడానికి ఏమాత్రం సంకోచించడు.

కథలోని మూలాంశం దైవం మానుషరూపేణా పూర్తి కొత్తది కాకపోయినా (కథ వినగానే నాకు ఒకప్పటి దేవానంద్ హిట్ సినిమా గైడ్ గుర్తొచ్చింది) కథనం కొత్తగా ప్రయత్నించాడు, థియేటర్ లో కూర్చుని సిన్సియర్ గా ఫాలో అయ్యేవారికి కథనం కూడా ఏమంత నిరుత్సాహ పరచదు. మొదట్లో కొన్ని సీన్లను చివర్లో వివరించి కథకు కనెక్ట్ చేసిన తీరు బాగుంది కానీ రివ్యూలలో సగటు ప్రేక్షకులు చివరి అరగంట వరకూ కథ అర్దం కాక కన్ఫ్యూజన్ ని కలగచేసిందన్నారు మరి నాకలా అన్పించలేదు. ఈ చిత్రాన్ని మొదటి సారి చూసేప్పుడు సగం అర్ధమయ్యీ కాని డైలాగులతో యధేచ్చగా చేసిన కట్స్ తో నిండి ఉన్న పైరసీ ప్రింట్లు చూడకండి. కుదిరితే థియేటర్ లో చూడండి లేదంటే డివిడి వచ్చే వరకూ ఆగండి. ఇక రివ్యూలలో నేను చూసిన మరో నెగటివ్ పాయింట్ విలన్ తో కేవలం క్లైమాక్స్ లో మాత్రమే ఎదురు పడటం. పరిశీలిస్తే త్రివిక్రమ్ సినిమాలన్నిటిలోనూ ఇదే ట్రెండ్ మీరు గమనించవచ్చు అతడు, జల్సా లలో సైతం సినిమా అంతా హీరో విలన్ లమధ్య పరోక్ష యుద్దమే కానీ ప్రత్యక్ష యుద్దం ఉండదు. పదినిముషాలకోసారి ఎదురు పడి ప్యాంటులు చిరిగేలా తొడలు చరుచుకుని పేజీలకు పేజీలు డైలాగులు చెప్పడం త్రివిక్రం హీరోలు చేయతగిన పని కాదు. ఆ మూస కొట్టుడు సినిమాలు తీసే వాళ్ళు వేరే చాలామందున్నారు.


ఇక ఈ సినిమాలో బూతులుగా చెప్పబడే పదాలు ఏమిటో పై ట్రైలర్ లో వినవచ్చు. మీరు మరీ ఎలీట్ క్రౌడ్ లో తిరుగుతుంటేనో లేదా ఏకాంతంగా గడుపుతుంటేనో తప్ప సామాన్యులు తిరిగే రోడ్దుమీదకో మార్కెట్టుకో వెళ్తే ఒక అరగంటలో ఈ మూడు పదాలు వినకుండా తిరిగి ఇంటికి రావడం అసాధ్యం. ఇక ఒక సారి కాలేజ్ స్టూడెంట్స్ ని కదిపిచూడండి ఇవి బూతులేంటి బాబు అని అంటారు. చదువబ్బని ఒక సాథారణమైన ట్యాక్సీ డ్రైవర్ నిజానికి అంతకన్నా ఘోరంగా మాట్లాడతాడు అలాంటిది మహేష్ భాష అలా ఉండటం తప్పేమీ కాదని నాకనిపించింది. ఇంతకన్నా ఘోరమైన పదాలు ఇప్పటికే చాలా తెలుగు సినిమాలలో వచ్చాయి. అంతెందుకు ఇంత తరచుగా కాకపోయినా ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా చెప్పబడుతున్న బృందావనం లో సైతం ఈమాటలు ఉన్నాయి.

సరే బయట ఎలాగూ తప్పడంలేదు ఈ తద్దినాన్ని సినిమాకి తీసుకు వెళ్ళిమరీ మా పిల్లలకి అలవాటు చేయడం ఎందుకు నాయనా అంటారా అది మీ ఇష్టం. కానీ ఓ వారాంతం తీరుబడిగా ఉన్నపుడు సరదాగా ఎంజాయ్ చేయదగినది ఈ ఖలేజా సిన్మా. సినిమా తీయడానికి పట్టిన సమయం, బడ్జెట్, స్టార్ కాస్ట్ ఇత్యాది విషయాలు పక్కన పెట్టి త్రివిక్రమ్ చెప్పిన ఒకానొక కథ వినడానికి సిధ్దమై వెళ్ళండి. వైవిధ్యమైన డైలాగ్ డెలివరీ తో మహేష్ సైతం మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. కామెడీ కోసం, మహేష్ కోసం, విజువల్స్ కోసం ఒక్కసారైనా చూడదగిన సినిమా ఖలేజా.

ఈ సినిమా పై నిస్పాక్షికంగా రెంటాల జయదేవ గారు రాసిన సమీక్ష ఇక్కడ మొదటిభాగం మరియూ రెండవభాగం.

ఈ సినిమాలో మిమ్మల్ని అలరించే త్రివిక్రమ్ డైలాగులు ఇక్కడ నెలబాలుని బ్లాగ్ లో చూడచ్చు.

ఈ సినిమా గురించిన మరో రివ్యూ రేరాజ్ గారిది ఇప్పటివరకు చదవకపోతే ఇక్కడ చూడండి.

అలానే ఈ సినిమాలోని మరికొన్ని కామెడీ సన్నివేశాలను ఇక్కడ చూడవచ్చు.

మంగళవారం, అక్టోబర్ 19, 2010

ఓంకార్ పై ఓ సరదా వీడియో

నాకు శతృవులు చాలా తక్కువ, అసలు లేరనే చెప్పచ్చేమో.. ఇదివరకు ఆఫీస్ లో కొందరు తెలుగు తెలిసిన కొలీగ్స్ నన్ను అజాతశతృవు అని పిలిచే వాళ్ళు. అలా ఉండగలగటానికి ముఖ్య కారణం నా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం. ఒక రెండుమూడేళ్ళ క్రితంవరకూ చాలా కంట్రోల్డ్ గా ఉండగలిగే వాడిని ఈ మద్య ఆ నిగ్రహం కాస్త కొరవడిందనుకోండి. ఇలాంటి నాకు కూడా ఒకోసారి అకారణంగా ఎదుటి వాళ్ళేమీ చేయకుండానే కొందరు వ్యక్తులను చూస్తేనే ఒళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకుతున్నంత కంపరం పుట్టి చిరాకు వస్తుంది. బహుశా వారు గతంలో నన్ను పెట్టిన హింస అలా అకారణ ద్వేషానికి కారణం కావచ్చు. అలాంటి వారిలో ప్రత్యక్షంగా పరిచయం ఉన్నవారు ఎవరూ లేకపోయినా టీవీ యాంకర్ ’ఓంకార్’ ప్రముఖుడు.

ఇతనెవరు అంటే వివరించే ఓపిక నాకిప్పుడులేదు కానీ వీలైతే ఈ టపా చదవండి. ఇతను ఈ మధ్య జీనియస్ అని ఇతను తీసే సిన్మాలో సెలెక్షన్ కోసం ఒక కొత్త రియాలిటీ షో ఒకటి మొదలెట్టాడు. దానికి కొన్ని తెలుగు కామెడీ సీన్లు కలిపి ఇతని మీదఉన్న కసి అంతా తీరేలా బహు చక్కగా తయారు చేసిన ఈ కామెడీ వీడీయో చూసి హాయిగా నవ్వుకోండి. ఇతగాడికి ఇలాంటి ఎన్ని వీడియోలు తయారు చేసినా బుద్దిరాదు. కాస్త నిడివి ఎక్కువే కానీ ఏం భయపడకండి ఇతన్ని అంత సేపు భరించాల్సిన దౌర్భాగ్యాన్ని నాబ్లాగుద్వారా మీకు కలుగ నిస్తానా. అందులో అధికభాగం కామెడీ క్లిప్సే ఉన్నాయి అదీకాక ఈ వీడియో ఖచ్చితంగా మీకితని మీదున్న కసిని కొంతైనా తీరుస్తుందని నాదీ హామి.

ఈ వీడియో తయారు చేసిన అసలు జీనియస్ కు నా జోహార్లు. ఇందులో వాడిన మహెష్ ఖలేజ క్లిప్ అయితే అసలు ముందు సీన్లో ఓంకార్ వైపే చూస్తూ తిడుతున్నట్లనిపించింది. ఇక బ్రహ్మానందం మేడమీదనుండి పరిగెట్టుకు వస్తూ చెప్పే "దరిద్రనారాయణుని దిక్కుమాలిన అవతారం" ఆ మ్యూజిక్కూ ఎంత చక్కగా సరిపోయిందో మాటల్లో చెప్పలేను. ఇక ఆర్తి పెట్టిన చీవాట్లు, "తిక్క కుదిరింది తింగరి వెధవకి" లాంటి బ్రహ్మానందం తిట్టిన తిట్లు, వీరభద్రరావుగారు ఇతని వెర్రిపై చేసిన వ్యాఖ్యానం గురించి చెప్పనే అక్కర్లేదు కంక్లూజన్ కూడా కేక.  ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇతనెవరో కానీ ఓంకార్ బాదితుల సంఘం అద్యక్షుడిలా ఉన్నాడు అందరి మనోభావాలను ఇట్టే పట్టుకుని ఎంచక్కా ప్రజెంట్ చేసేశాడు. చూసి ఆనందించండి.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.