బుధవారం, అక్టోబర్ 27, 2010

సుత్తి ఎవరి సొత్తు?

నిన్న రౌడి గారి బ్లాగ్ లో శంకరయ్య గారు సుత్తి ఎవరి సొత్తు? విశ్లేషణ ఇవ్వగలరా అని అడిగిన ప్రశ్న చూసి వెంటనే నేనెరిగిన నాలుగు ముక్కలు చెప్దామని వారి ప్రశ్ననే శీర్షిక గా చేసుకుని సుత్తి గురించి కాసేపు సుత్తి కొడదామని ఈ టపా మొదలెట్టాను. వారేదో ఆంగ్ల నవలలో "You had been hammering Mr. Lanslott for the money since longtime" అన్న వాక్యం చదివి ఈ పదం ఆంగ్ల రచయితలు ఇదివరకే వాడినట్లున్నారు మన జంధ్యాల గారి ఐడియా కాదేమో అనిపించింది అన్నారు. ఆంగ్లంలో hammering అన్న ఉపయోగం గురించి వెతికితే ఈ కింది జవాబిచ్చింది. ఆ వివరాలు ఈలింక్ లో చూడవచ్చు. >>"to interrogate someone; to ask questions endlessly of someone. The cops kept hammering away at the suspect until he told them everything they wanted to know. They hammered at him for hours."<< వారు ఉదహరించిన వాక్యం కూడా ఈ అర్ధానికి సరిపోయినట్లు అనిపిస్తుంది.

ఇక మన జంధ్యాల గారు తెలుగు ప్రజలకు పరిచయం చేసిన సుత్తి గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. వారి మాటలలోనే సుత్తివేలు గారి నోటివెంట సుత్తి గురించిన వ్యాఖ్యానం ఈ క్రింది వీడియో లో చూడండి. బహుశా జంధ్యాల గారు ఆంగ్లంలో ఉపయోగించిన పద్దతి నుండి inspire అయి ఉండచ్చు కానీ వారు తెలుగు వారికి పరిచయం చేసిన ఈ సుత్తికొట్టడం అనేమాటకు సర్వ పేటెంట్ హక్కులు జంధ్యాల గారివే అని నా అభిప్రాయం :-)


ఆ వాక్ప్రవాహానికి శోషొచ్చి పడిపొయిన భరతుడు కాస్సేపటికి తేరుకుని "అన్నయ్యా నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా ఇంత సుత్తెందుకూ" అన్నాడట. అలా భరతుడి నోట్లోనుంచి రాలిన  ఆ సుత్తి భారత దేశం లో వాడుకలోకొచ్చిందనమాట. ఈ సుత్తుల్లో చాలా రకాలున్నాయ్...

ఒక్కోడూ ఠంగు ఠంగు మని గడియారం గంటగొట్టినట్లు సుత్తేస్తాడు దాన్ని ఇనప సుత్తి అంటారు అంటే iron hammering అనమాట.
ఇంకోడూ సుత్తేస్తున్నట్లు తెలీకుండా మెత్తగా సుత్తేస్తాడు రబ్బర్ సుత్తి అంటే rubber hammering అనమాట.
ఇంకోడూ ప్రజలందరికీ కలిపి సుత్తేస్తాడు సామూహిక సుత్తి దీన్నే mass hammering అంటారనమాట అంటే రాజకీయ నాయకుల మీటింగులు ఉపన్యాసాలు ఈ టైపు.
పోతే ఇంకోటైపుంది మీనాన్న గారు నాకు సుత్తేదామని వచ్చారనుకో నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాననుకో దాన్ని ఎదురు సుత్తి అంటారు అంటే reverse hammering అనమాట...
ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుధీర్ఘ సుత్తవుతుందనమాట అంటే prolonged hammering అనమాట.

మహానుభావుడు జంధ్యాల గారు ఇప్పుడు లేరు కాని ఉండుంటే " ఇంకోడూ చదివేవాడి ఖర్మ అన్నట్లు పేజీలకు పేజీలు వాళ్ళ బ్లాగుల్లో రాసేస్తుంటారు దాన్ని బ్లాగ్‌సుత్తి అంటారనమాట" అని కూడా ఒక రకం కలిపేసి ఉండేవారు :-) అదండీ సుత్తి వెనక ఉన్న కథాకమామిషు. మనలో మన మాట మీలో బిజెపి వాళ్ళెవరైనా ఉంటే మారాములోరిని సుత్తేసాడంటావా అని నాపై దాడి చేయకండి బాబులు ఏమైనా ఉంటే జంధ్యాల గారితో తేల్చుకోండి ప్లీజ్...

22 కామెంట్‌లు:

  1. ఆంగ్ల పుస్తకంలో ఎక్కడో ఒక్క మాట "హామ్మరింగ్" చూసేసి మన జంధ్యాల గారు కాపీ కొట్టారు అనుకోవటం శుధ్ధ పొరబాటు. మీరు ఇచ్చిన వివరణ బాగున్నది. ఆంగ్లలో వాడిన పధ్ధతిలో హాస్యం ఎక్కడ ఉన్నది?

    జంధ్యాల గారు సుత్తి కొట్టటం అన్న మాటను తెలుగు వారికి అందించారన్న మాట నిరూపించాల్సిన పనీలేదు అదెక్కడినుంచో "కొట్టుకొచ్చారు" అని అనుకోవాల్సిన పనీలేదు.

    రిప్లయితొలగించండి
  2. వేణు శ్రీకాంత్ గారు: మీరు సుత్తి గురించి చెప్పిన సుత్తి (vEnu sri kanth hammering..... Dont feel sir...just koke ) సూపరో సూపరు ..very very funny


    >>>> చదివేవాడి ఖర్మ అన్నట్లు పేజీలకు పేజీలు వాళ్ళ బ్లాగుల్లో రాసేస్తుంటారు దాన్ని బ్లాగ్‌సుత్తి అంటారనమాట" <<<<

    ఈ మాటేదో నా గురించి కాదు కదా

    రిప్లయితొలగించండి
  3. ఇంకో సుత్తి ఉందండి. నిశ్శబ్ద సుత్తి. టి.వీ., వాళ్ళు సినిమా వాళ్ళు ఎక్కువగా వేస్తారు.హీరో తండ్రిని చూస్తాడు వారు తల్లిని చూస్తారు వారు హీరోయిన్ని చూస్తారు. అందరూ కలసి దేవుడి ఫోటో కేసి చూస్తారు. మొత్తం అంతా కలిపి ఓ పావు ఘంట చూసేసు కుంటారు. మధ్యలో మనం బలయిపోతాం నిశ్శబ్దంగా.

    థాంక్యూ మాకు సుత్తేసి హాయిగా నవ్వించి నందుకు.

    రిప్లయితొలగించండి
  4. హహ్హహ్హహ్హా.. భలే భలే సుత్తి కబుర్లు వేణు గారు..:) చాలా బాగుంది మీ "సుత్తి" టపా..;)
    సుబ్రహ్మణ్యం గారి నిశ్శబ్ద సుత్తి కూడా బహు బాగు..:)

    రంజనీ
    >>ఈ మాటేదో నా గురించి కాదు కదా
    మరద్దే.. గుమ్మడికాయల దొంగ అంటే..***** :)))
    మనం బంగారాలం.. బాగా రాస్తాం..:) ఎవ్వరూ అనకపోయినా మనమే అనేసుకోవాలి..;)

    రిప్లయితొలగించండి
  5. అయితే ఇది రబ్బరు సుత్తి అన్నమాట.


    hi hi hi just kidding, good one!

    రిప్లయితొలగించండి
  6. ఏంటి వేణూ గారూ,
    రాత్రి నేను వేసిన సుత్తికి తట్టుకోలేక పొద్దున్నే టపా పెట్టేసినట్టున్నారు....ః)))...

    ఇంతకీ నాది ఏ టైపు సుత్తి...iron or rubber....:))...

    సూపర్ పోస్ట్...సుబ్రమణ్యం గారి నిశ్శబ్ద సుత్తి సూపరోసూపరు....

    రిప్లయితొలగించండి
  7. ఈ 'సుత్తి' టపా (అనగా సుత్తి గురించి టపా) ద్వారా రెండు కొత్త సుత్తిల గురించి తెలిసింది...బ్లాగ్‌సుత్తి, నిశబ్ద సుత్తి..... వాహ్...

    వేణూగారు, జంధ్యాలగారు గనక ఉండుంటే 'బ్లాగ్‌సుత్తి'తో పాటు 'కామెంట్ సుత్తి' గురించికూడా చెప్పుండేవారేమో!!

    రిప్లయితొలగించండి
  8. శివ గారు నెనర్లు, మీరు చెప్పినది నూటికి నూరుపాళ్లు నిజం.

    కృష్ణప్రియ గారు నెనర్లు,

    శివరంజని గారు నెనర్లు,
    హహ అపర్ణ గారు చెప్పినట్లు గా అలా భుజాలు తడుముకోకూడదండి :) నిజానికి అది నన్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న లైను. మీరేమో నాకోసం శ్రీకాంత్ సుత్తి అని ఒక కొత్త రకాన్ని సృష్టిస్తాను అంటున్నారు కదా సంతోషం అంతకు మించిన గౌరవమేముంటుంది :) (ఏం ఫీల్ అవలేదు లెండి నే కూడా సరదాకే)

    సుబ్రహ్మణ్యం గారు నెనర్లు, హహ నిశ్శబ్ద సుత్తి అదిరిపోయింది సారు :) అన్నిటికన్నా మేటి ఇది కాకపోతే జంధ్యాల గారి టైంలో ఈ సీరియళ్ళు అంతగా బాధించట్లేదనుకుంటా అందుకే వారు వదిలేశారు.

    అపర్ణ నెనర్లు,

    ఆ.సౌమ్య గారు నెనర్లు, హర్రెర్రె మీరు అసాధ్యులు సుమా సుతిమెత్తని నా రబ్బర్ హ్యమరింగ్ ఎవరూ కనిపెట్టలేరులే అనుకున్నా.

    కౌటిల్య గారు నెనర్లు, హహ అలాంటిదేం లేదండీ.. అలా బుజాలు తడుముకుంటే ఎలా :-)

    నాగార్జున నెనర్లు, హ హ కామెంట్ల సుత్తి కూడా బాగుందండోయ్ నేను మరిచిపోయాను. నిజమే దాన్ని కూడా కలపాలి.

    రిప్లయితొలగించండి
  9. హ్హహ్హహ్హా! బాగుంది మీ 'సుత్తి ' టపా... బులుసు సుబ్రహ్మన్యం గారి కొత్త సుత్తి కూడా బాగుందండోయ్......

    రిప్లయితొలగించండి
  10. మీనుండి తరచుగా టపాలు రావడం సంతోష దాయకం

    >>ఇంకోడూ చదివేవాడి ఖర్మ అన్నట్లు పేజీలకు పేజీలు వాళ్ళ బ్లాగుల్లో రాసేస్తుంటారు దాన్ని బ్లాగ్‌సుత్తి అంటారనమాట


    ఇది నేలకోక్కసారి రెండు సార్లు టపాలు వేసే వాళ్లకి వర్తించకూడదని కోరుకుంటూ
    హారం లో చూడండి ఒకే రోజు పదికి పైగా టపాలు వేసే మహానుభావులు ముగ్గురు నలుగురు తగులుతారు :)
    డైలీ సుత్తి,వీక్లీ సుత్తి,మంత్లీ సుత్తి కేటగరీ లు కూడా create చెయ్యాలని ఈ సందర్భం గా సంకలని నిర్వాహకులను అభ్యర్దిస్తూ
    ఈ కామెంట్ సుత్తి ని ఆపేస్తున్నా

    రిప్లయితొలగించండి
  11. -- హా హా.. గుడ్ పోస్ట్ వేణు గారు.. మీ విరామం పోస్ట్ తర్వాత.. మీ బ్లాగ్ వైపే రాలేదు...:(మళ్లీ ఈరోజే చూడటం.. కవర్ చెయ్యాల్సినవి చాలా ఉన్నట్టున్నై.. :)

    రిప్లయితొలగించండి
  12. సుత్తి గురించి సుతిమెత్తంగా చెప్పారు జంధ్యాలగారు, మీరు మాకు మళ్ళీ అందించారు. బాగుంది :-)

    రిప్లయితొలగించండి
  13. >>> >>ఇంకోడూ చదివేవాడి ఖర్మ అన్నట్లు పేజీలకు పేజీలు వాళ్ళ బ్లాగుల్లో రాసేస్తుంటారు దాన్ని బ్లాగ్‌సుత్తి అంటారనమాట
    నాకు తెలుసు నాకు తెలుసు నన్నే కదా అన్నారు.. నేను అలిగాను :(

    రిప్లయితొలగించండి
  14. నేస్తం,

    మిమ్మల్ని కాదు.నన్నే అన్నట్లున్నారు. నాది సీరియల్ సుత్తి అని...నేను కూడా అలిగాను:-))

    రిప్లయితొలగించండి
  15. సుత్తి ఎవరి సొత్తు ?
    సుత్తి నా సొత్తు బ్లాగర్ పరుచూరి వంశీ కృష్ణ సొత్తు కదా
    అతను మీ మీద,ఈ పోస్ట్ లో కామెంట్ రాసే వాళ్ళు అందరి మీద చర్యలు తీసుకొనే ముందే రిప్లై ఇవ్వగలరు :)

    రిప్లయితొలగించండి
  16. హ హ హ..
    ""దాన్ని బ్లాగ్‌సుత్తి అంటారనమాట""
    అవును .. ఇది ఆడ కేడీ బ్లాగర్లకందరికీ వర్తిస్తుంది :-)) LOLLLLLL

    రిప్లయితొలగించండి
  17. ఏటండి మంచుగోరు....ఆడ మహిళా స్త్రీ లేడిస్‌ పై యుద్దం ప్రకటించేట్లున్నారు....ఆ కేడి లేడిస్ ఎవరో సెప్పాలేదు.... ;)

    రిప్లయితొలగించండి
  18. ఇందు గారు నెనర్లు, మరే బులుసు గారు కామెంట్లతో కూడా నవ్వించేస్తున్నారు.

    హరేకృష్ణ గారు నెనర్లు, హ హ మరే మరే అలా అరుదుగా రాసేవాళ్ళకి వర్తించకూడదు :-) మీరు చెప్పినట్లు ఒకే రోజు బోలెడు టపాలేసేవారికి సుదీర్ఘ సుత్తిలోకి వేసుకోవచ్చండి లేదంటే నిరవధిక సుత్తి లేదా నిరంతర సుత్తి అని కూడా పిలుచుకోవచ్చు :-)

    కొత్తపాళీ గారు నెనర్లు.

    వేణూరాం గారు నెనర్లు, అంత ముఖ్యమైనవి ఏమీ లేవండీ తీరిగ్గా మీకు సమయమున్నపుడు చదువుకోండి.

    జేబి గారు నెనర్లు.

    నేస్తం గారు నెనర్లు, హన్నన్నా మిమ్మల్ని అనగలనా, అన్నా మీ అభిమాన సంఘం ఊరుకుంటుందా అసలు ఆ సంఘంలో నేనూ ఒకడ్నే కదా నేనెలా అనగలను చెప్పండి, కనుక వెంటనే అలకపానుపు దిగేయండి లేదంటే తార్రోడ్డుమీద రేకు డబ్బాతో గీకుతున్నట్లుండే నా కంఠస్వరంతో "అలకపానుపు ఎక్కనేల..." అని పాటందుకోవలసి ఉంటుంది ఆ :-)

    కల్పన గారు నెనర్లు, మీకు కూడా నేస్తం గారికి చెప్పిన జవాబే :-) మొత్తానికి నా సుత్తిటపా కాదు కానీ చాలామంది భుజాలు తడుముకున్నట్లున్నారు :-D

    హరేకృష్ణ గారు మరే నిజమేనండోయ్, నేను మర్చే పోయాను. ఐనా ఆయన గురించి ఆయన చెప్పుకున్న మాటలు చదివారా "మంచి వాడిని మనసున్న వాడిని మంచి మనసున్న వాడిని" అన్నారు కనుక అంతమంచి వారు మనపై చర్యలు తీసుకుంటారని గాబరా పడాల్సిన పనిలేదు.

    మంచు గారు నెనర్లు, హహ ఏంటండి ఈ మధ్య మీరు ఆడవాళ్ళ పేరు చెప్తే చాలు మరీ అగ్గిరాముడైపోతున్నారు, ఎక్కడైనా ఘాట్టి ఎదురు దెబ్బ తగిలిందా ఏంటి :-D

    నాగార్జున గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.