అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శనివారం, ఆగస్టు 14, 2010

మర్యాద రామన్న..

ఈ సినిమా పై ఇప్పటికే చాలా రివ్యూలు చదివి ఉంటారు కనుక నేను కథా పరిచయం చేయబోవడం లేదు, మరికొన్ని వివరాలకు ఇదే సినిమా పై బ్లాగ్ మితృలు మురళి గారు రాసిన టపా ఇక్కడ చదవవచ్చు. 

"A picture is worth a thousand words", ఏదైనా ఒక విషయాన్ని వేయి మాటల్లో కన్నా ఒక్క చిత్రంతో హృదయానికి హత్తుకునేలా చెప్పవచ్చు అన్నది జగమెరిగిన సామెత. అలాంటి చిత్రాల(scenes) సమాహారమైన చలనచిత్రానికి కొన్ని శక్తివంతమైన మాటలతో కూడిన నేపథ్యసంగీతం తోడైతే చెప్పవలసిన విషయం మరింత సూటిగా ప్రేక్షకునికి చేరుతుంది కదా, అదే మర్యాద రామన్న సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ప్రతి ఫ్రేమ్ లోనూ రాజమౌళీ అతని టెక్నికల్ టీం, వాళ్లలో కూడా ముఖ్యంగా కీరవాణి కనిపించారు. అలా అని సునీల్ యాక్షన్ ని తీసివేయడం నా ఉద్దేశ్యం కాదు, అతని సాధారణమైన మ్యానరిజమ్స్ నుండి బయటికి వచ్చి వైవిధ్యమైన నటన కనబరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు తను నేర్చుకున్న నటన మర్చిపోయి ఫ్రెష్ గా రాజమౌళి స్కూల్ లో మళ్ళీ నేర్చుకున్నాడా అని అనిపించింది.
అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..
ప్రాణాలిచ్చే మమతల్లో.. ప్రాణం తీసే పంతాల్లో.. 
నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు...
అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..
అనే పాటను టైటిల్స్ కు నేపథ్య సంగీతంగా వాడి మొదటినుండే సినిమా కథేమిటో టూకీగా చెప్తూ ప్రారంభించిన కీరవాణి, సినిమా అంతా సన్నివేశానికి తగిన మూడ్ ని ఎలివేట్ చేసే సంగీతంతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా అనే కాదు రాజమౌళి సినిమాలన్నిటికీ కీరవాణి ప్రత్యేకమైన నేపధ్య సంగీతాన్ని అందిస్తారు, రాజమౌళి ఇచ్చే ఫ్రీడం వలనో ఆయన మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానమో లేదంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించడం వలనో, కారణం వాళ్ళిద్దరికే తెలియాలి. సాథారణంగా కీరవాణి నేపధ్య సంగీతానికి వాయిద్యాలకన్నా గళానికి(వాయిస్/కోరస్ కి) ఎక్కువ ప్రాథాన్యతని ఇస్తారు కానీ మిగిలిన సినిమాలకన్నా ఈ సినిమాకు బిట్ సాంగ్స్ మరియూ స్వరాలను(వాయిస్/కోరస్) నేపధ్యసంగీతంగా చాలా అద్భుతంగా మరింత ఎఫెక్టివ్ గా ఉపయోగించుకున్నారు. అసలు సినిమాకు అంత ఫీల్ రావడానికి బాగా దోహదపడింది కీరవాణి నేపధ్య సంగీతమే.

ఈ సినిమా పాటలు విన్నపుడు రెండు పాటలు తప్ప అంత పెద్దగా ఆకట్టుకోకున్నా సినిమా చూసినపుడు సంధర్బోచితంగా ఉన్న ప్లేస్మెంట్ మరియూ రాజమౌళి చిత్రీకరణ తోడై దదాపు అన్ని పాటలు బాగున్నాయ్ అనిపించాయ్. "అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది", "తెలుగమ్మాయి" మంచి మెలోడీని అందిస్తే "రాయె రాయె" మాస్ ఫీల్ ను, "ఉద్యోగం ఊడిపోయింది" సరదాగానూ "పరుగులు తీయ్" స్ఫూర్తిదాయకంగాను ఉన్నాయి. ఈ పరుగులు తీయ్ పాటలోనూ చేజ్ లో నేపధ్యానికి వాడిని "హరోం హర హర హర హర" కూడా చాలా మంచి ఫీల్ ఇచ్చింది. ఇక సినిమా అంతా అక్కడక్కడ నేపధ్యానికి వాడిన చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాట సినిమా ఫీల్ ను ఎలివేట్ చేయడానికి ఎంతగా ఉపయోగపడిందో ఈ చిన్న క్లిప్ లో మీరే చూడండి.


ఎన్నేండ్లకు పెదపండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ...
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ...
ఆఆఆఆ ఆ ఆ ఆఅ...

కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే
పోలమ్మకు పొట్టేలును ఏస్తే హోయ...

అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత
ఎలుగుందా రేతిరి గడిసాక హోయ...

చుట్టూతా కసి కత్తుల కోటా ఏదారి కనిపించని చోటా
కునుకుండదు కంటికి ఏపూటా హోయ...

ఇంకా ఇదే కాక "చెట్టులెక్క గలవా" పాటకు పేరడీగా మధ్యలొ వచ్చే ఈ చిన్న బిట్ సాంగ్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఈ సినిమా విజయంలో సింహ బాగం కీరవాణికే సొంతం అనడం లో ఏమాత్రం సందేహం అక్కర్లేదు అనిపిస్తుంది.
లెక్క జెప్పగలవా నీ ఆయువు లెక్కజెప్పగలవా
బిక్కు బిక్కు మని తెల్లవారి పని చక్కబెట్టగలవా.. అందాకా ఉగ్గబట్టగలవా..
లెక్కబెట్టగలవా ఆ చుక్కలు లెక్కబెట్టగలవా..
చావుదప్పి నువు బతికి బైటపడి బట్టగట్ట గలవా.. అందాకా ఉగ్గబట్టగలవా..

ఇక ఈ సినిమా లో హాస్యం విషయానికి వస్తే సైకిలు కి మాటలు నేర్పిన రవితేజ తన వంతు వినోదాన్ని అందించారు. ఎక్కడా వెకిలి హాస్యం, చొక్కాలు చింపు కోవడం, అల్లరి చేయడం లాంటివి లేకుండా కేవలం హీరో భయం లోనుండి అమాయకత్వం నుండి చక్కని హాస్యాన్ని సృష్టించారు. సినిమా ట్రైలర్స్ లోనే రాజమౌళి ఇతర సినిమాల హీరోలను చూపించి చివరిలో సునిల్ వచ్చి "నేను అలాంటోడిని కాదండి" అని అంటూ ప్రేక్షకుల అంచనాలను సరిగా సెట్ చేశారు. అలానే హీరో ఇంట్రడక్షన్ సీన్ ఇంచుమించు పోకిరిని తలిపించినా సునీల్ మొహంలో హీరోయిజం కన్నా భయవిహ్వలుడైనట్లు ముఖకవళికలు చూపించి ఒక కంటిన్యుటీ మెయింటెయిన్ చేశారు. కథా రచయిత కాంచి ఓ చిన్న పాత్రలో నవ్వులను పంచారు. రావు రమేష్ ఒక్క సీన్ కే పరిమితమైనా సినిమాకు చాలా ముఖ్యమైన సీన్ లో చాలా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ పాత్ర కూడా బాగుంది. అవసరానికి మించకుండా సినిమా నిడివి రెండుగంటలు మాత్రమే ఉంచడం కూడా చెప్పుకోవలసిన విషయం, సినిమా ఎక్కడా బోరు కొట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మొత్తం మీద మీరు ఇంకా ఈ సినిమా చూడనట్లైతే వీలైనంత త్వరగా కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 
 

గురువారం, ఆగస్టు 12, 2010

లీడర్ మాటీవి లో (ఈ ఆదివారం ఆగస్ట్ 15)

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ’లీడర్’ సినిమా ఈ ఆగస్ట్ పదిహేనో తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ’మా టీవి’ లో ప్రదర్శిస్తున్నారుట, సరైన సమయం ఇంకా తెలియదు బహుశా మద్యాహ్నం ప్రదర్శిస్తుండవచ్చు. సమయం తెలిసాక ఈ పోస్ట్ మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈ సినిమా మీరు ఇంకా చూడనట్లైతే ఈ అవకాశాన్ని మిస్ కాకుండా తప్పని సరిగా చూడండి.

ప్రదర్శన సమయం : మధ్యాహ్నం ఒంటిగంట (1:00 PM on 15th Aug)

ఈ సినిమా పై ఇదివరకు నేను రాసిన పోస్ట్ ఇక్కడ చదవవచ్చు.



నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.