మంగళవారం, జనవరి 22, 2013

అమ్మ.


“ఎనకటికో పేదరాసి పెద్దమ్మ “నా కోడి కూశాక నేలేచి నా కుంపటిలో నిప్పురాజేశాకే రేతిరి కరిగిపోయి సూరీడొచ్చి ఊరు ఊరంతటికి తెల్లారుతుంది కదా... నాకోడీ, నా కుంపటీ లేకపోతే ఎట్టా? ఈ ఊరికి తెల్లారదు గదా?” అని అనుకునిందంట అట్టాగుందయ్యా నీ యవ్వారం. అరె ఎంతకాలమని ఇట్టా కూకుంటా... ఎవురున్నా ల్యాపోయినా మన బండి నడవక తప్పదు గందా.. ప్రపంచం నడవకా ఆగదు. పొద్దునె లేస్తే ఆకలేస్తది కడుపుకింత పడేయాల ఇయన్నీ తప్పవు, సావు పుటకలనేవి మన సేతిలో ఉన్నాయా.. ఏదేమైనా ఆ పైనోడి పిలుపొచ్చేదాంక పెపంచికంతో పాటూ మనమూ పరిగెడతానే ఉండాల.”


ఒకప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చిన ఓ పెద్దమనిషి సముదాయింపు ఇది. ఏదో చెప్పాలని చెప్పారు కానీ ఆయనకి మాత్రం తెలియదా ఆ కోడీ కుంపటీ లేకపోతే ఊరంతటికీ ఏమో కానీ ఆ పెద్దమ్మకి మాత్రం తెల్లారదనీ. ఐనవాళ్ళని, కుటుంబంలో కీలకమైన వ్యక్తిని కోల్పోయిన వారి పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది అని నాలుగేళ్ళగా దదాపు స్తంభించిపోయిన మా జీవితాలని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. అమ్మ కురుక్షేత్రంలో శ్రీకృష్ణులవారు చెప్పినట్లు “ఆయుధమున్ ధరింప అని ఖగ్గముగా ఒకపట్ల  ఊరకే సాయము చేయువాడ” అని చెప్పేసి తాను హాల్లో నుండి అంగుళం కూడా కదలకుండా ఫోన్ల మీదే పనులు జరిపించేసి, మా అందరికి ఎవరి ఎఫిషియన్సీకి తగ్గట్లు వాళ్లకి పనులు పురమాయించేసి, ఇంటికి ఆఫీస్ కి తప్ప ఎక్కడికీ వెళ్ళకపోయినా అన్ని విషయాలు తెలుసుకుని మాకు తగిన సూచనలు సలహాలు ఇచ్చేసి అందరిని తానే ముందుండి నడిపించేది.
 
తానేపనీ చేసినట్లు కనపడేది కాదు కానీ అన్నిపనుల్లోనూ తానే ఉండేది. మాకే కాదు మా పిన్నులకి మావయ్యలకీ అందరికీ కూడా వాళ్ళ పెద్దక్క అంటే పెద్ద దిక్సూచీ, తాను సలహా ఇచ్చిందంటే ఎలాంటి సమస్య అయినా పలాయనం చిత్తగించవలసిందే తాను ప్లాన్ చేసి గైడ్ చేసిందంటే ఆదారిలో నడక నల్లేరుమీద బండినడకే. అలాంటిది అమ్మ ఉందనే ధైర్యంతో తననికూడా లెక్కచేయట్లేదని ఆ దేవుడు మామీద కినుక వహించాడో లేక మేమందరం హాయిగా తన ఆలోచనల మీద ఆధారపడి మా మెదడుకి పని చెప్పడం లేదని కోప్పడ్డాడో కానీ అర్ధాంతరంగా అమ్మని తీస్కెళ్ళిపోయాడు. అలా తీస్కెళ్ళి ఈరోజుకి నాలుగేళ్ళవుతున్నా మా ప్రయాణం ఇంకా నడిసముద్రంలో దిక్సూచీ లేని నావలాగే ఉంది. కాలం పరిగెడుతుంది రోజులు గడుస్తున్నాయి కానీ స్తంభించిన జీవితం మాత్రం ముందుకు కదలనంటుంది. కానీ ఏం చేస్తాం మరో మార్గం లేదు కదా ఆ పెద్దాయన చెప్పినట్లు కాలంతో పాటు కదులుతూనే ఉండాలి.

నేనిలా చెప్తున్నందుకు నన్ను తప్పుగా అనుకోవద్దు, నెగటివ్ ఎనర్జీని నింపుతున్నానని ఫీల్ అవద్దు, ప్రాక్టికల్ గా ఆలోచించి చూడండి. ఈ పోస్ట్ చదివే మీలో ఎవరైనాకానీ లేదా మీ ఇంటిలో ఎవరైనాకానీ ఇలా ఒంటి చేత్తో ఇంటి మొత్తాన్ని నడిపిస్తుంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఆ ఒక్కరు లేకపోతే కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచించి చూడండి. ఆర్ధికంగానే కాదు ఆలోచనల పరంగా కూడా కుటుంబం అంతటికి ఒక్కరిపైనే ఆధారపడే తత్వాన్ని అలవాటు చేయకండి. “నీ కెందుకు కన్నా నేను చూసుకుంటాను కదా” అనే మీ మాటల వెనుక కొండంత ప్రేమ ఉండచ్చు కానీ ఆప్రేమవల్ల వాళ్ళకి రేపంతా అగమ్యగోచరమవచ్చు అందుకే ఆ చూస్కునేది ఎందుకు ఎలా చూస్కుంటున్నారో, మీ ప్రయారిటీస్ ఏంటో, వారు మీస్థానంలో ఉంటే ఎలా చేయాలో, మీ కుటుంబంతో కూలంకషంగా చర్చించి వారిలోని ఆలోచనలను కూడా పెంపొందించండి, కుటుంబం అంతటిని ఇన్వాల్వ్ చేయండి. దానివల్ల కుటుంబంలో బంధాలు మరింత బలపడతాయి మీమీద గౌరవం కూడా మరింత పెరుగుతుంది. వాళ్ళకి నడక నేర్పించడమే కాదు వాళ్ళు నేర్చుకున్నాక ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం పక్కఫోటోలో చూపించినట్లు మీకు దారి చూపమని అడగండి. పిల్లలూ ఇతర కుటుంబ సభ్యులు మీరు కూడా వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఆకళింపు చేస్కోడానికి ప్రయత్నించండి.
   
ఇందాక పరామర్శ అంటే ఒక విషయం గుర్తొచ్చింది మీకు ఖచ్చితంగా చెప్పాలండోయ్, నా మిత్రులు కొందరు ఉన్నట్లుండి అమ్మ గురించో ఇంకేదో మాట్లాడేసి “హే సారీ అమ్మని గుర్తుచేసి బాధపెట్టాను కదా” అని అంటూంటారు, అలాంటపుడు నాకు భలే నవ్వొస్తుంటుంది. అందులో రెండు తప్పులున్నాయ్ అని చెప్పాలనిపిస్తుంటుంది. మొదటిది మనం మర్చిపోయిన వ్యక్తిని మాత్రమే గుర్తుచేయగలం అసలు అమ్మని మర్చిపోం కనుక గుర్తు చేయడమనే మాటే ఉండదు. ఇక రెండోది అమ్మ జ్ఞాపకాలు స్ఫూర్తినీ ఆనందాన్నీ ఉత్సాహాన్నీ నింపుతాయే కానీ బాధపెట్టవు. నిజానికి వాళ్ళు అమ్మగురించి చెప్పినప్పటికన్నా అలా సారీ చెప్పినపుడు అమ్మలేదనే విషయాన్ని గుర్తు చేసి ఎక్కువ బాధపెడుతుంటారు :-) పాపం ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదనుకోండి.

అన్నట్లు ఆ మధ్య ఎక్కడో చదివానండీ అమ్మ ప్రేమ కన్నా గొప్ప మెడిసిన్ లేదని అందరమూ అనుకుంటుంటాం కదా అది ఒక స్టడీ చేసి మరీ ప్రూవ్ చేశారట తెలుసా. చిన్న వయసులో పుష్కలంగా అమ్మ ప్రేమని పొందిన వారు నడివయసులో కూడా శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారుట. నాకైతే నిజమే అనిపిస్తుంది చిన్నపుడు పెద్ద పెద్ద డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇవ్వలేని రిలీఫ్ అమ్మ ఇచ్చే ఒక్క ముద్దు ఇచ్చేసేది. ఎపుడైనా స్కూల్ నుండి వస్తూ కింద పడిపోయినా ఇంట్లో పరిగెడుతూ కాలు బెణికినా ఏదైనా చూసి భయపడినా అయ్యయ్యో ఏమైంది కన్నా అని దగ్గరకి తీస్కుని ప్రేమగా సున్నితంగా వీపు నిమిరి దెబ్బ తగిలిన చోట మృదువుగా రుద్ది అమ్మ మెత్తగా ఒక్క ముద్దు పెట్టిందంటే చాలు ఎక్కడి నొప్పులు అక్కడే అన్నీ హుష్ కాకి అన్నట్లు ఎగిరిపోయి మాయమవేవి కదా. మీక్కూడా అనుభవమేకదా ఇలాంటి అమ్మ ప్రేమ. నాకైతే ఇపుడు కూడా అపుడపుడు ఏదైనా సమస్యవచ్చి అలా ఆలోచిస్తూ పడుకుండి పోతే నిద్రలో అమ్మ మెత్తని చేతి స్పర్శ అలా వీపు మీద నిమిరినట్లు సమసి పోతుందిలేరా కన్నా అని చెప్పినట్లు అనిపిస్తుంటుంది ఇక అంతే ఆ తెల్లారి లేవగానే ఎంతటి ధైర్యం వచ్చేస్తుందో :-)

27 వ్యాఖ్యలు:

 1. >> ఆర్ధికంగానే కాదు ఆలోచనల పరంగా కూడా కుటుంబం అంతటికి ఒక్కరిపైనే ఆధారపడే తత్వాన్ని అలవాటు చేయకండి.>>
  నిక్కచ్చిగా చెప్పారు వేణు. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినది.
  మనసు ద్రవించింది.....మీ మాట నచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కళ్ళు చెమర్చాయి వేణు గారు.చాలా మంచి పోస్టు రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హ్మ్మ్....ఓ వారం రోజుల తరువాత ఇవ్వాళే కిచన్ లోకి వెళ్ళాను. మా పెద్దమ్మాయి నిన్న సాయంత్రం కాలేజి నుంచి వస్తూనే నా వైపు తిరిగి ఎలా ఉంది అమ్మా అంటూ పలకరించి, థాంక్ గాడ్, అమ్మా! నీ విలువ నాకు బాగా తెలిసింది. పొద్దున్నే అన్నీ నువ్వు చేసిపెడితే రెడీ ఐ వెళ్ళడానికి ఏదో ఒకటి మేము ప్రిపేరు చేసుకోవడానికి తేడా. నువ్వు ఎలా అమర్చిపెడతావో కదా ?అని చెప్పింది! కేవలం యాధ్రుచ్చికంగానే సుమా! నువ్వు చెప్పిన విషయం అర్ధం ఐందని షేరు చేసుకోవడం మాత్రమే....
  కానీ ఒక్కటి మాత్రం నిజం కాలం గడిచిపోతూనే ఉంటుంది...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాల మంచి విషయం ప్రస్తావించారు వేణు. ఆడైనా మగైనా కుటుంబ పెద్దగా మొత్తం అన్నిటికీ తమవాళ్ళు తమ మీద ఆధారపడకుండా ఉండేలా చెయ్యడం అన్నది ఎంతో ముఖ్యం. నేనెప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించలేదు. మంచి విషయం చెప్పారు. ఇప్పటినుండీ నా బుర్రలో ఈ ఆలోచన కూడా ఉంటుంది. thank you.

  అమ్మగారికి మీరోపాటు నేను కూడా..స్మృత్యంజలి ఘటిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాల మంచి టపా రాసారు. మనకు అన్నీ నేర్పేది అమ్మే కదా!. కుటుంబాన్ని ఒంటి చేత్తో నడిపించే మనిషిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే జీవితం ఒక దిక్సూచి లాంటి నావ లా మారిపోవడం నిజమే. కాని అమ్మ బ్రతికుండగానే అదే ఆత్మస్థైర్యాన్ని బిడ్డలలో నింపి వారు ముందు ముందు జీవితం లో తాను లేక పోయినా ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటుంది. అదే కదా అమ్మ ప్రేమ అంటే ! మంచి టపా రాసి అందరిని ఆలోచింప జేశారు. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఏం చెప్పాలో తెలియడం లేదు వేణూ గారూ.. మీరు నెగెటివ్ గా ఏం చెప్పలేదండీ. ప్రాక్టికల్ గా ఎలా ఉండాలో చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చాలా చక్క గా రాసారు వేణు గారు ! మీ జ్ఞాపకాలు అమ్మ ఎప్పుడూ మీతోనే ఉన్నారు అన్న ధైర్యాన్ని ఇవ్వాలి అని ఆశిస్తున్నా !

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చాలా మంచి విషయం చెప్పారు వేణు గారు ..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. చాలా ప్రాక్టికల్ విషయం వేణూ! ఇంట్లో అన్నీ తానై చూసుకోవడం అమ్మలు ఇంట్లో వాళ్లందరికీ అలవాటు చేసేస్తారు. మనకీ సుఖంగానే ఉంటుంది కాబట్టి హాయిగా ఎంజాయ్ చేసేస్తాం! కానీ ఒక్క సారి మనిషంటూ లేక పోయాక గానీ ఆ లోటు, మన అసహాయత తెలిసి రావు.

  ఇక్కడ అందరికంటే ఎక్కువ దెబ్బ తినేది భ్ర్త! అంటే నాన్న!

  అమ్మ పోయాక రెక్కలు తెగిన పక్షిలా వరండాలో నిశ్శబ్దంగా కూచునే మా నాన్నగారిని చూస్తుంటే దిగులేస్తుంది. తన బట్టలు ఎక్కడుంటాయో తెలీదు, కప్పు కాఫీ ఎలా కలుపుకోవాలో తెలీదు(కోడలు ఉంది కాబట్టి ఆ అవసరం లేదనుకోండి ఈ వయసులో! అసలు వయసులో అయినా ఆయనకు అలాగే నడిచింది),కిరాణా సామాను కి ఎంత అవుతుందో తెలీదు.

  పూర్తిగా భార్య మీద ఆధార పడటం పాత తరం మగవాళ్లకు అలవాటు. ఇప్పుడు భార్యా భర్తలిద్దరూ బాధ్యతలు , అందునా ఇంటి బాధ్యతలు కూడా పంచుకుంటున్నారనుకోండి. అయినా చాలా చోట్ల ఇంట్లో బాధ్యత అంతా అమ్మే తీసుకోవడం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం!!

  నెగటివ్ ఎనర్జీ కాదు మీరు నింపింది..ఇదొక పాజిటివ్ ఆలోచన.

  కళ్ళు చెమర్చడం కాదు కానీ ఆలోచనలో మాత్రం పడేసే పోస్టు.

  ఇది చదువుతుంటే నాకు పాత తెలుగు సీరియల్ ఒకటి గుర్తొచ్చింది."భార్యా మణి ఉద్యోగం" అని! గుర్తుందా మీకు?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మంచి విషయం వేణు . అలా వుండటాని కి ప్రయత్నిస్తాను .
  మీ అమ్మగారు ఎందుకో నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూవుంటారు . బహుషా నా బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా అదే కావటం మూలంగానేమో .

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చాలా బాగా రాసారు వేణు గారు, మంచి విషయాలు ప్రస్తావించారు.

  ప్రత్యుత్తరంతొలగించు

 12. "..కానీ ఆప్రేమవల్ల వాళ్ళకి రేపంతా అగమ్యగోచరమవచ్చు అందుకే ఆ చూస్కునేది ఎందుకు ఎలా చూస్కుంటున్నారో, మీ ప్రయారిటీస్ ఏంటో, వారు మీస్థానంలో ఉంటే ఎలా చేయాలో, మీ కుటుంబంతో కూలంకషంగా చర్చించి వారిలోని ఆలోచనలను కూడా పెంపొందించండి, కుటుంబం అంతటిని ఇన్వాల్వ్ చేయండి...."

  థాంక్యూ వేణూ, అమ్మ ప్రేమని ఇలా స్పూర్తివంతంగా మలచి చూపించినందుకు! సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ తన జ్ఞాపకాలను నువ్వు మలచుకుంటున్న విధానం చూసి నాకు సంతోషంగా ఉంది!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. జ్యోతిర్మయి గారు, నాగిని గారు, గురూజీ, సునీత గారు, సౌమ్య, రాజ్, నవజీవన్ గారు, శిశిర గారు, శ్రావ్య, కళ్యాణ్ గారు, సుజాత గారు, మాల గారు, ఫోటాన్, నిషీ వ్యాఖ్యానించినందుకు అందరికి ధన్యవాదాలు. నెగెటివ్ సెన్స్ లో కాకుండా ప్రాక్టికల్ థింకింగ్ అని పాజిటివ్ సెన్స్ లో స్వీకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

  సునీత గారు నిజమేనండీ కాలం గడిచిపోతూనే ఉంటుంది. అమ్మరాజీనామా అని ఒక సినిమా ఉంటుంది మీరు చూశారా... మీ కామెంట్ చూసినపుడు నాకు ఆ సినిమానే గుర్తొచ్చిందండీ. అమ్మలు ఎంతలా అలవాటు చేసేస్తారంటే అదో నాచురల్ ప్రాసెస్ అన్న ఫీలింగ్ వచ్చేసి ఒకోసారి అన్నీ సమయానికి అమరడం వెనకున్న శ్రమని కూడా గుర్తించలేం.

  అవును సౌమ్యా ఈ విషయాన్ని గుర్తెరిగి నడుచుకుంటే బాధ్యతలను అభిప్రాయాలను అందరితో కలిసి పంచుకుంటున్నందుకు కుటుంబ బంధాలు కూడా మరింత బలపడతాయి అనిపించింది.

  నవజీవన్ గారూ నా కోరిక కూడా అదేనండీ... ఆత్మ స్థైర్యాన్ని ఆలోచనను కూడా నింపాలి అని, ఇది అమ్మ బాధ్యత మాత్రమేకాదు మొత్తం కుటుంబం అమ్మా నాన్న పిల్లలు అందరి సమిష్టి బాధ్యత కుటుంబ సభ్యులమధ్య కమ్యునికేషన్ పెరగాలి అని కోరుకుంటున్నాను.

  సుజాత గారు ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండీ... మీరన్నట్లు మనముందు తరంలో ఇలాంటిది ఎక్కువ చూస్తాం నాన్న పూర్తిగా తన అవసరాలకోసం వందశాతం అమ్మపై ఆధారపడటం. ఈ మధ్య కాలంలో కొంచెం మెరుగవుతుంది అనే అనుకుంటున్నాను.

  ఇలాంటి నాన్నల విషయంలో మరింత దిగులు పడాల్సిన అంశం ఏంటంటే కొత్తగా నేర్చుకోవాలనే ఆసక్తిని కోల్పోయే వయసులో ఇలా నేర్చుకోవాల్సిన, అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం రావడం. తనకు తానుగా కొత్తగా అలవాటు చేస్కోలేక పిల్లలపై పూర్తిగా ఆధారపడలేక నరకయాతన భరించాల్సి వస్తుంటుంది.

  ఒకోసారి అమ్మ ఇంట్లో మిగిలిన వాళ్ళకు నేర్పించాలని ప్రయత్నించినా కూడా మనమే నువ్వు చేసేస్తున్నావ్ కదా అని అలక్ష్యం చేసేస్తాం కూడా అండీ. మా అమ్మగారైతే తిట్టే వారు చేయమంటున్నాను అంటే ఎందుకు చేయమంటున్నానో అడిగే పనిలేదా తెలుసుకోవా అని. నువ్వు చెప్పావంటే అది మంచిదే అయి ఉంటుందిలే అమ్మా అని ఐస్ పెట్టేసి పరిగెట్టే వాణ్ణి.
  హ్మ్... భార్యామణి ఉద్యోగం.. సీరియల్ ఏమీ గుర్తులేదండీ...

  మాల గారు నాపేరులాగే అమ్మ పేరు కూడా యునీక్ తనకిమాత్రమే ఉంటుంది అని అనుకునేవాణ్ణండీ ఇన్ని రోజులు. మీ ఫ్రెండ్ గారికి కూడా ఉందని తెలియడం సంతోషం.

  థాంక్స్ నిషీ, భవిష్యత్తులోకూడా ఇలాగే ముందుకు వెళ్ళగలిగే ధైర్యాన్నివ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మీ ప్రతి మాటా మనసుని తాకింది, వేణూ గారు. ఇంతకు మించి మరేమీ మాట్లాడలేకపోతున్నానండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. హాయ్ వేణూ...ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీతో ఇంటరాక్ట్ అయ్యి....నాకు అర్ధమైనంతలో మనం(నాన్న కూడా) అమ్మ మీద పూర్తిగా ఎందుకు ఆధారపడిపోవడానికి సిద్దపడిపోతామంటే అమ్మ ఎప్పుడూ మనల్ని ఎలాంటి సంధర్భంలో నైనా అండగా ఉంటుంది, వదిలిపెట్టదనే ఒక పూర్తి భరోసా వలన...అలా ప్రేమించేవాళ్ళు ఏదో ఒక టైంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అనే ఆలోచనే మనకు అస్సలు నచ్చదు...భాదలో కూడా మీరు ఇంత పాజిటివ్‌గా ఆలోచించటం బాగుంది వేణూ....Take Care...

  ప్రత్యుత్తరంతొలగించు
 16. సిve ణూశ్రీకాంత్ గారూ!మీ పొస్ట్ చదువుతుంటే నా ప్రమేయం లేకుండానే కళ్లనుంచి కన్నీరు ఆగకుండా వచేస్తుంది.దేవుడు మంచి వాళ్లను తన దగ్గరకు త్వరగా తీసుకెళ్లిపోతాడని చెప్పుకొని మనల్ని మనం ఓదార్చుకొవాలి. ఎందుకంటే అమ్మ విషయంలో మాకు కూడా ఇలానే జరిగింది. మేము నలుగురం అక్కచెల్లెళ్లం .మా అమ్మ కూడా ఎలాంటి సమస్య ఐనా చిటికలో పరిష్కరించేసాది.అలా అమ్మని చూసి ం ంఏము కూదా ఏదైనా సమస్య వస్తే చాల వరకు సాల్వ్ చేసుకునేవాళ్లం.అలాంటి కొండలాంటి అమ్మను సంవత్సరం క్రితం దేవుడు తన దగ్గరకు తీసుకెళ్లిపోయి ఆ కొండ నీడ మాకు లేకుండా చేసేసాడు. అమ్మ జ్ఞాపకాలతో అమ్మ ఇచ్హిన స్పూర్తితో కాలం గడుపుతూ ఇప్పుడు ఏదైనా సమస్య వచ్హినా లేదా ఏ పని ఐనా చెయ్యల్సివచ్హినా అమ్మ ఐతే ఇలాచేసేది అని మేం నలుగురం అనుకొని నాన్నగారితో చెప్పి చేసుకుంటున్నాము.అమ్మలోటు తీర్చలెనిదే ఐనా కాలం తో పాటుగా ముందుకి సాగాలి కదా!అలా అమ్మను అనుసరించడం వల్లే ఇప్పుడు మా పనులు వ్యవహారాలు మేం చెసుకోగలుగుతున్నాం అని అస్తమానూ అనుకుంటాము.అమ్మ ఎప్పటికీ అమ్మే.ఆ స్థానం ఎప్పుడూ ఖాళేయే. దేవుడు మాత్రమే ఆ ఖాళిలో వుంటాడు అనుకుంటున్నాను ...

  ప్రత్యుత్తరంతొలగించు
 17. థాంక్స్ ప్రియ గారు.

  థాంక్స్ శేఖర్, నిజమే మనం మాట్లాడుకుని చాలా రోజులు అవుతుంది కదా. మీరన్నట్లు ఆ నమ్మకమే మనలని అలా ఆధారపడేలా చేస్తుంది కానీ ఇలా మనమూ భాగం పంచుకోవడం మొదట్లో తనను ఇబ్బందిపెట్టినా మెల్లగా తనకి కూడా నచ్చుతుంది.

  పద్మలత గారు, ఏం చెప్పాలో అర్ధంకావట్లేదండీ.. మీరూ సరిగ్గా నేనున్న పరిస్థితుల్లోనుండే రావడంవలన అంత కరెక్ట్ గా కనెక్ట్ అవగలిగారనుకుంటాను. మీరన్నట్లు నిబ్బరంగా ఉండటమే మనమెవరమైనా చేయగలిగింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఏమైనా పాటలు విందామని మీ బ్లాగులోకి వచ్చాను ,అమ్మ కనిపించింది. అమ్మ గురించి రాసే జ్ఞాపకాలు నాకు చాల ఇష్టం. అనుభవం తో మీరు ఇచ్చిన సందేశం కుటుంబం లో ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం .

  ప్రత్యుత్తరంతొలగించు
 19. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ చిన్ని గారు. పాటలు చాలారోజులుగా అసలు ఎక్కువ వినడంలేదండీ.. ఈ మధ్యే కొంచెం మొదలుపెట్టాను మళ్ళీ.. పాటల బ్లాగు దుమ్ము దులపాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. "మమ్మీస్ పెట్" అనిపించుకునేప్పుడు ఉడుకున్నా, నాకు కూడా అమ్మ లేనిదే ఏ పనీ జరగదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. హహహ మురళీ కదా :-) నేనైతే పైకి ఉడుకున్నా అలాపిలిపించుకున్నందుకు లోపల్లోపల గర్వంగా ఫీలయ్యేవాడ్ని :-))
  థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. మొదటిది మనం మర్చిపోయిన వ్యక్తిని మాత్రమే గుర్తుచేయగలం అసలు అమ్మని మర్చిపోం కనుక గుర్తు చేయడమనే మాటే ఉండదు. ఇక రెండోది అమ్మ జ్ఞాపకాలు స్ఫూర్తినీ ఆనందాన్నీ ఉత్సాహాన్నీ నింపుతాయే కానీ బాధపెట్టవు.

  చాలా బాగా చెప్పేరు.మీరు రాసింది చదువుతుంటే మా అమ్మేగుర్తొచ్చింది. అక్క చెప్పిన అక్కాచెళ్ళిళ్ళలో నెనొక చెల్లిని మా అమ్మ గుర్తొచ్చినప్పుడు మీరు చెప్పే అమ్మ కబుర్లు చదువుతా మా అమ్మని గుర్తుచేసుకుంటూ

  ప్రత్యుత్తరంతొలగించు
 23. చాల బాగుంది వేణు గారు. మా అమ్మ అప్పుడప్పుడు కొపం గా అంటూ వుంటుంది నే పొయాక తెలుస్తుంది అని. మేము నాన్న ఎక్కడికి పోతావు అని అంటె కాశి అంటు వుంటుంది కాని అమ్మ లేక పోతె ఎమీ తోచదు. మా అమ్మ వాళ్ళ నాన్న పోయాక అమ్మ ఏడవడం చూస్తే చాలా ఏడుపు వచ్చింది అండి. ఆ రోజు మా అమ్మ తో చెప్పా నేనే నీకు నాన్న ని అని. ఇప్పుడు ఇది చదివాక భయం వేస్తొంది. నేను ఇంకెప్పుడు మా అమ్మ ని ఎమీ అనను నిజం గా ఎమీ అనను. :( :(

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. థాంక్స్ శ్రీగారు.. మీ కామెంట్ ఇలా చక్కని తెలుగులో చదువుతుంటే చాలా హాయిగా ఉందండీ.. :-)
   ఊహూ అమ్మని ఏవీ అనకపోతే మనకేవీ తోచదుకదండీ.. అమ్మతో దెబ్బలాడాలీ మళ్ళీ వెళ్ళి అమ్మఒళ్ళోనే పడుకుని సేదతీరాలి అలాగే అమ్మ చెప్పినట్లు వింటూ మనసుని కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలి. ఆ అవకాశం అంత ప్రేమ ఇవ్వగలిగింది అమ్మ ఒక్కరే కనుక మీరు అలా ఫీల్ అవ్వద్దు.

   తొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.