అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.
అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.
ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.
ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.
సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
శుక్రవారం, జనవరి 22, 2021
అమ్మా అమ్మమ్మగారిల్లు...
బుధవారం, జులై 02, 2008
మరికొన్ని కాలనీ కబుర్లు
మరీ చిన్నప్పుడు కాదు కాని కొంచెం పెద్దయిన తర్వాత సాయంత్రం అలా ఆరుబయట నులక మంచం మీద వెల్లకిలా పడుకుని గుండెల మీద బేటరీ రేడియో పెట్టుకుని వినడం కూడా చాలా ఇష్టం. ఇలాంటి నా అందమైన సాయంత్రాలలో ఒక అపశ్రుతి మా పక్కింటి అంకుల్, ఆయన అందరితో నవ్వుతూ గౌరవం గా మాట్లేడే వారు ఎప్పుడైనా ఎదురు పడితే "ఏం బాబు బావున్నావా" అంటూ ఆప్యాయం గా పలకరిస్తారు, చాలా మర్యాదస్తుడు కాకపోతే సాయంత్రం ఆరింటి వరకే. అది దాటిందంటే "ఏం బాబు" కాస్తా "ఏరా కుర్ర నాకొడకా" లోకి మారిపోతుంది. ప్రతి రోజు ఫుల్ల్ గా మందు కొట్టేసి నానా యాగీ చేస్తుండే వారు, నేను కొంచెం పెద్దయిన తర్వాత నవ్వుకునే వాడ్ని కాని చిన్నపుడు ఆయన అరుపులు అవీ విని చాలా భయం వేసేది. మేం వెళ్ళినప్పుడు కూడా ఒకో సారి తాత గారు నాతో ఆడకుండా వాళ్ళ గొడవలు తీర్చాల్సి వచ్చేది.
కారంపుడి గురించి చెప్తూ కోడి పందాల గురించి చెప్పుకోక పోతే అసంపూర్తి గానే ఉండి పోతుందేమో. సాధారణం గా సంక్రాంతి, దసరా లాంటి పండగలకి మేము తాతగారి ఊరు వెళ్ళేవాళ్ళం మరీ బాలకృష్ణ సినిమాలో చూపించినట్లు కాదు కాని కోళ్ళ పందాలు జరిగేవి, నాకు ఒక సారి చూసినట్లు గుర్తు. మరి నేను చిన్న పిల్లాడ్ని కదా అటు వెళ్ళనివ్వరు అనమాట. అప్పట్లో మా ఇంట్లో కూడా ఒక కోడి ని పెంచే వాళ్ళు, కువ కువ లాడుతూ దాని వెనకాలే తిరిగే బుజ్జి బుజ్జి పిల్లల్ని చూడటం అంటే నాకు ఎంత సరదానో. అప్పుడప్పుడు అపురూపం గా ఆ చిన్న చిన్న కోడి పిల్లల్ని పట్టుకుని తెగ మురిసి పోయే వాడ్ని వెచ్చగా ఉండే వాటి స్పర్శ ఇంకా నాకు అలానే గుర్తుండి పోయింది.
సంక్రాంతి టైం లో అనుకుంటా మా ఊర్లో బండ లాగుడు పోటీ లు జరిగేవి. ఒక పెద్ద పొడవాటి బండకి అటు ఇటు జోడెడ్లని కట్టి ఆ బండ మీద నుంచుని ఎడ్లని అదుపు చేస్తూ లాగించాలి. ఆ పోటీలు చూడటనికి జనం బాగా వచ్చే వాళ్ళు. అసలు సంక్రాంతి అంటే 3 రోజులకూ మూడు ప్రత్యేకతలతో పండుగ బ్రహ్మాండం గా జరిగేది. ఇంటి ముందు ముగ్గులు, హరిదాసు లు, గంగిరెద్దులు, ఇంకా భోగి మంటలు ఇవేవీ మర్చిపోలేను. కాలేజి కి వచ్చాకా చాలా తక్కువ సంక్రాంతి పండగలకి ఇంట్లో ఉన్నాను ఒక వేళ వున్నా అప్పటి సందడి ఇప్పుడు ఎక్కడ లెండి ఏదో అతిధి ఫుడ్స్ నుండి పిండి వంటలు, పులిహార తో సహా కొనుక్కుని వచ్చి పండగ అయింది అనిపించే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. నేనూ అంతే వాళ్ళలో ఒకడ్ని, అసలు ఇక్కడ అమెరికా లో ఉంటే అందరికీ ఫోన్ చేసి విష్ చేయడమే పండగ అనే స్తితి కి వచ్చేసా అనుకోండి అది వేరే విషయం.
అన్నట్లు కారంపుడి అంటే ఇంకో చిన్న విషయం చెప్పాలి, ఇప్పటికీ ఇంకా వేస్తున్నారో లేదో తెలీదు కాని అప్పట్లో అంత్రం వేసే వాళ్ళు అని వుండేవారు, కారంపుడి లో కూడా ఒకతను ఉండే వాడు. నాకు చిన్నప్పుడు ఎపుడో ఒంట్లో బాగా లేకపోతే అతని దగ్గరకి తీసుకు వెళ్ళి అది కట్టించారు. అంత్రం/తాయత్తు అంటే చిన్న రాగి సిలిండర్ లాగా ఉంటుంది medical capsule కన్నా కొంచెం పెద్ద సైజు లో రెండు పక్కలా చదును గా మూతల లాగా వుండి మధ్య లో తాడు కట్టడానికి చిన్న రింగులు వుండేవి. మనకి మొదటి సారి అది కట్టించినప్పుడు అసలే మనకి curiosity ఎక్కువ రిపేర్లు అంటే సరదా కదా సో దానిలో ఏముంటుందా అని నానా కష్టాలు పడి విరగొట్టి తీసి చూసేసాను లోపల ఏమీ లేదు. ఒక పలచని రాగి రేకుని అలా ఆ షేప్ లో చుట్టి ఇచ్చాడు అంతే...
సో అలా దాన్లో ఏదో ఉంటుంది అని మనం చేసిన ఎక్స్పరిమెంట్ తుస్సనడమే కాకుండా దాని వల్ల అమ్మ చేతిలో గాఠ్టిగా ప్రైవేటు చెప్పించుకోవాల్సొచ్చింది. అవునూ! అసలు మీకు ప్రైవేటు చెప్పించు కోడం అంటే తెలుసా... లేదంటే లాభం లేదు బుడుగు చేత మీకు ప్రైవేటు చెప్పించేయాల్సిందే...
సరేనండీ కారంపుడి గురించి దాదాపు నాకు గుర్తున్నంత వరకూ వ్రాసేసాను ఇంకా ఏమన్నా గుర్తొస్తే మధ్య మధ్య లో వ్రాస్తుంటాను. రేపు మరో విషయం మీద మాట్లాడుకుందాం అంత వరకూ శలవా మరి.
--మీ వేణు.
మంగళవారం, జులై 01, 2008
N.S.P. / PWD కాలనీ..
మా తాత గారి ఇంటి బయట నుంచుంటే ఇలా U Turns కోసం వచ్చిన బస్ కనిపించేది అప్పట్లో మనకదొక వింత :-) అంతే కాకుండా ఎవరైనా ఊరికి బయల్దేరే సమయం లో పిల్లల్లో ఒకళ్ళని ఇంటి బయట కాపలా పెట్టి బస్ రాగానే చెప్పమనే వాళ్ళు. అంటే అలా U turn తీసుకుని వెళ్ళీ కాఫీ టిఫిన్ కోసం ఆపే వాళ్ళనమాట, దాంతో మేము తీరికగా వెళ్ళడానికి కొంచెం టైముండేది. అంతా బాగానే ఉంటుంది కానీ హాస్పిటల్ ముందునుండి వెళ్ళాలంటే మనకి కొంచెం భయం. అయినా తప్పదు కదా వెళ్ళే దారిలోనాయె, సరే ఏం చేస్తాం అని కొంచెం దూరం గా మధ్య మధ్య లో ఇండీషన్ (Injection ని మనం ఇలానే పిలిచే వాళ్ళం) ఇచ్చే కంపౌండరు ఏమన్నా వస్తున్నాడా అని చూసుకుంటూ వెళ్ళేవాడ్ని.
ఒకో రోజు ఆఫీసరు గారింట్లో పాలు పోసి రావడానికి నేను కూడా వెళ్ళే వాడ్ని. ఇంకా పూర్తి గా నిద్ర లేవని వీధులలో చుట్టూ పచ్చని చెట్ల మధ్య మా పిన్ని చేయి పట్టుకుని, మా స్కూల్ కబుర్లు చెప్తూ నడుస్తూ ఉంటే మాకు నేపధ్యం లో పక్షుల కువ కువ లు, గుడిలో నుండి బాలు గారి గొంతుతో వినిపించే శివస్తుతి వింటుంటే అలసట తెలిసేదే కాదు. ఎంత మధురం గా ఉండేవో ఆ రోజులు. ఉదయం అంటే అలా ఉండాలి అనిపించేలా ఉండేవి. బాలు గారు ఆలపించిన శివస్తుతి మీరు విని ఉండక పోతే వెంటనే వినండి చాలా బావుంటుంది, మరి నాకు మా ఊరిలో వినడం వల్ల అలా అలవాటు అయిందేమో తెలిదు కానీ ఎప్పుడు విన్నా నాకు ఉషోదయమే. ఇంకా ఆఫిసర్ గారి బంగళాలో నెమలి ఉండేది దానికోసమే అంత ఇష్టం గా వెళ్ళే వాడ్ని. నేను నెమలి పురి విప్పడం చూడలేదు కానీ పింఛం తో అలా వయ్యారం గా నడుస్తూ తిరగడం చూసే వాడ్ని. ఎప్పుడైనా వర్షం పడే ముందు బాగా తూనీగలు ఎగురుతుంటే అప్పుడు అనుకునే వాళ్ళం నెమలి ఇప్పుడు పురి విప్పి ఆడుతుంటుందేమో అని.
కాలనీ ఇళ్ళన్నీ దాటి అలా కొంచెం దూరం వెళ్తే కాలవ వచ్చేది అక్కడ పిల్లల ఈతలు అల్లర్లూ చూసి ఆనందించడమే కానీ నాకు ఈత కొట్టేంత ఫ్రీడం ఉండేది కాదు, ఎప్పుడూ ఎవరో ఒకరు పెద్ద వాళ్ళు తోడు రాకుండా అటు వెళ్ళనిచ్చే వారు కాదు నన్ను. అదీ కాక నేను చాలా చిన్న తనం నుండీ కళ్ళద్దాలు వాడాల్సి వచ్చింది. మూడవ తరగతి లోనో 4 లోనో మొదలు పెట్టాను అప్పుడే -6 పవరు వున్న అద్దాలు వాడే వాడ్ని. కాసు ప్రసాద రెడ్డి గారి పుణ్యమా అని ఇప్పుడు లేవనుకోండి. నాకైతే కాలవ ఒడ్డున నిలబడి చేప పిల్లలు ఎక్కడ కనిపిస్తాయా అని చూడటమే గొప్ప సరదాగా ఉండేది. నా సరదా చూసి మా వాళ్ళు బొరుగులు తీసుకుని వచ్చే వాళ్ళు అవి వేస్తే చేప పిల్లలు పైకి వస్తాయి చూడచ్చు అని.
కాలవ దాటి ఒక పక్కగా వెళ్తే చేలుండేవి అక్కడ మట్టి గట్టు మీద జాగ్రత్త గా నడవాలి. చేలో వేరు శనగ మొక్కల్ని పీకి మట్టి తగలకుండా జాగ్రత్త గా ఒలుచుకు తినేవాళ్ళం చాలా రుచి గా ఉండేవి. ఇంకా ఒకో సారి తిరిగి వచ్చేప్పుడు రేగు పళ్ళు, సీమ చింతకాయలు డైరెక్ట్ గా చెట్ల నుండి కోసుకుని తినడం లో ఉండే ఆనందం సూపర్ బజారు లో కొనుక్కుని తెచ్చుకోడం లో ఎక్కడ ఉంటుంది చెప్పండి. అసలు మీరు లేత తాటి కాయ నుండి డైరెక్ట్ గా తాటి ముంజలు ఎప్పుడైనా తిన్నారా... కాయ లో ముంజ కి ఒక పక్కగా బొటన వేలు పెట్టి తిప్పి నోటితో ఒడుపుగా ముంజని మొత్తం లాగేసి తింటుంటే... అసలు ఆ మజా ఎన్ని వందల పిజ్జాలు బర్గర్ లూ తిన్నా దొరకదు. హ హ.. వీడెవడ్రా బాబు పెద్ద తిండి పోతులా ఉన్నాడు అనుకుంటున్నారా... మనం కొంచెం భోజన ప్రియులమే లెండి.
ఇంక ఆటల విషయానికి వస్తే మా మామయ్యలు బిజీ గా కాలేజిలో ఉండే వాళ్ళు దాంతో నేను ఎక్కువ గా మా పిన్ని వాళ్ళతో పులీమేక, పరమపదసోపాన పఠం, గవ్వలు, అచ్చంగిల్లాలు (ఇవి నాకు అస్సలు వచ్చేవి కాదు ఒక రెండు సార్లు ప్రయత్నించి వదిలేసే వాడ్ని), రైటా రాంగా, ఇసుకలో పుల్లని దాచి పెట్టే ఆట ఇలాంటి హాని లేని ఆటలు ఆడేవాడ్ని అనమాట మరి మనకి కళ్ళద్దాలున్నాయ్ కదా సో వీటికే పరిమితం, అసలా అద్దాల మూలం గా నాకు సైకిలు నేర్చుకోడానికి కూడా కుదిరేది కాదు. అమ్మ భయపడి నేర్చుకోనివ్వలేదు మనకీ పెద్ద ఇష్టం లేదనుకోండి అది వేరే విషయం. ఇంకా ఆకాశం లో కొంగలు ఎగురుతుంటే గోళ్ళు ఇలా గట్టి గా పట్టుకుని ...కొక్కిరాయి... అని ఏదో చెప్పే వాళ్ళం అలా చేస్తే కొంగలు వాటి తెల్ల రంగుని మన గోళ్ళకి ఇచ్చి వెళ్తాయంట. నిజం గానే కొంగలు వెళ్ళాక చూస్తే గోరు మొదట్లో తెల్ల గా మచ్చ కనిపించేది తెగ మురిసి పోయే వాళ్ళం :-) నొప్పి పుట్టేలా గోటిని నొక్కి పట్టుకుంటే తెల్ల మచ్చ పడక చస్తుందా...
అవనమాట కొన్ని నా చిన్ననాటి కబుర్లు.
మళ్ళీ మరో టపా లో మరిన్ని కబుర్లతో కలుద్దాం అంత వరకూ శలవా మరి....
--మీ వేణు.
శుక్రవారం, జూన్ 27, 2008
గుల్మొహర్
సరే ఇక నా టపా విషయానికి వస్తే, ఇదిగో పైన కనిపిస్తున్న గుల్మొహర్ చెట్టు గురించి, దాని పువ్వుల అందం గురించి వాటి మొగ్గలతో మేము ఆడుకునే కోడి పందెం ఆట గురించీ నా కారంపుడి టపా లో చదివి ఈ చెట్టుపై నాకున్న ఇష్టాన్ని అర్ధం చేసుకుని, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ ఊరిలో ఉన్న ఈ చెట్టూ, పువ్వులూ ఫోటో లు తీసి నాకు పంపించిన నా నేస్తం "బుడిగి" కి బోలెడు నెనర్లూ థాంక్స్ లూ (పేపర్‌కాయితం లా) చెప్పుకుంటూ ఆ ఫోటో లు నా బ్లాగు లో భద్రపరచుకొని అప్పుడప్పుడూ చూసుకోవచ్చు కదా అని ఈ రోజు టపా లో అవి పోస్ట్ చేస్తున్నా.
అశోకుడు రోడ్లకి ఇరువైపులా నాటించింది ఈ చెట్లో అశోక చెట్లో నాకు తెలీదు కానీ మా కాలనీ రోడ్ లో ఇవి మాత్రం గొడుగులా పెద్దగా పెరిగి మంచి నీడనిచ్చేవి. కొన్ని చెట్లకి కింద చెట్టు చుట్టూ అరుగులు కట్టి ఉండేవి పిల్లలం వాటి మీద కూర్చుని మరీ ఆడుకునే వాళ్ళం. మా ఇంట్లో మాత్రం అది Main Road కావడం తో బాబోయ్ బస్సులు వస్తాయ్ అని ఒక్కడ్నే వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు ఎవరో ఒకరు ఎస్కార్ట్ ఉండాల్సిందే లేదంటే ఒకో రోజు వాళ్ళే వెళ్ళి కాసిన్ని మొగ్గలు తెచ్చి ఇచ్చి ఇంట్లోనే ఆడుకొమ్మనే వాళ్ళు. 
నాకు పేరు గుర్తు రాక కోడిపుంజు చెట్టు అని పరిచయం చేసిన ఈ చెట్టుకు అసలు "గుల్మొహర్, అగ్నిపూలచెట్టు, పొగడపూలచెట్టు, Flame of the forest (Botanical : delonix regia)" అని బోలెడు పేర్లు ఉన్నాయిట వీటిలో ఏవైనా కరెక్ట్ కాదనిపించినా... ఇంకేదైనా కొత్త పేరు మీకు తెలిసినా వ్యాఖ్య ద్వారా తెలియ చేయండేం. ఎందుకంటే నా ఙ్నాపక శక్తి మీద నాకు పెద్ద గా నమ్మకం లేదు కాని గుల్మొహర్ పేరు మాత్రం గుర్తొచ్చింది తర్వాత ఓ నేస్తం గుర్తు చేస్తే.
ఈ రోజుకి ఇక శలవా మరి.
--మీ వేణు.
బుధవారం, జూన్ 04, 2008
కారంపుడి a.k.a కారెంపుడి
అమ్మా నాన్న ల వృత్తి రీత్యా మేము ఉండేది నరసరావుపేట్ కావడం తో మేము అక్కడ నుండి నకిరికల్లు మీదుగా వెళ్ళేవాల్లం. ఊరు ప్రయాణం అంటే అందరు చిన్న పిల్లల్లానే నేను చాలా సరదా పడేవాడ్ని. అప్పట్లో ఎర్రబస్సు ఎయిర్‌బస్సు కన్నా అపురూపం గా కనిపించేది. బస్సు బయలుదేరేది నరసరావుపేట్ నుండే కావడం తో సాధారణం గా సీట్ కోసం ఇబ్బంది ఉండేది కాదు ఇక కిటికీ పక్కన సీట్ దొరికితే ఆ సంతోషం చెప్పనే అక్కర్లేదు. నేను బాగా చిన్నపుడు ఇలానే కిటికీ పక్క సీట్ లో కూర్చుంటే గురజాల లోనో లేక గుత్తికొండ లోనో బస్సు ఆగినప్పుడు అక్కడ షోడా సీసాలతో కొట్టుకుంటుంటే ఆ సీసాల గాజు పెంకు ఒకటి వచ్చి నా మెడకు గుచ్చుకుంది ఆ మచ్చ అలానే ఇప్పటికీ కనిపిస్తుంది అని అమ్మ చెప్తుంటుంది. అంటే ఈ మధ్య చూసుకో లేదు లెండి ఒక పది సంవత్సారాల క్రితం చెప్పింది అమ్మ ఈ విషయం.
సరె ఇక ఊరు కి వెళుతుంటే మొదట తగిలేది టూరింగ్ టాకీసు. పేరు సరిగా గుర్తు లేదు జయలక్ష్మి అనో ఇంకోటో ఉండేది. ఎప్పుడైనా మొదటి ఆట సినిమాకి వెళ్ళినపుడో లేదా ఆ టైముకి అటుగా బస్సు లో వెళ్ళినప్పుడో ఘంటసాల గారి "నమో వెంకటేశా" "ఏడుకొండలవాడా" పాటలు వినడం తప్పని సరి. మేము సినిమాకి వెళ్ళేప్పుడు ఈ పాట వినబడుతుంటే కొంచెం నడక వేగం పెంచే వాళ్ళం అమ్మో తెర లేస్తుంది సినిమా మొదలవుతుంది అని. సినిమా అంటే గుర్తొచ్చింది మీలో ఎంత మందికి గుర్తుందో కాని అప్పట్లో స్క్రీన్ కి ముందు ఎర్రని తెరలు వుండేవి ఈ మధ్య కాలం లో నేను ఎక్కడా చూడలేదు కాని అప్పట్లో తెర కి చివరన ఇంక మధ్య మధ్య లో అక్కడక్కడా లైట్లతో ఎర్రని రంగు లో కుచ్చుల కుచ్చుల తో అందం గా వయ్యరం గా మెల్ల గా అలా అలా తెర పైకి లేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలేవి కాదు. ఒక పక్క సినిమా మొదలు పెట్టేస్తున్నారు అన్న ఆనందం కూడా తోడవగా చాలా బాగా ఎంజయ్ చేసేవాడ్ని.
సరే ఈ టూరింగ్ టాకీసు దాటిన వెంటనే నాగులేరు ఉండేది ఒకోసారి వర్షా కాలం లో బాగా పొంగు వచ్చి రాక పోకలకి అంతరాయం ఏర్పడినా మాములు సమయం లో నింపాదిగా ప్రవహిస్తూ కింద అంతా రక రకాల సైజులలో ఉన్న నాపరాళ్ళు కనిపిస్తూ చాలా అందం గా ఉండేది. మా ఊరు రోడ్డు అలా వేసారో లేకా ఊరే అలా అభివృద్ది చెందిందో కానీ రోడ్డు మీద నుండి చూస్తుంటే ఏటవాలు (diagonal) గా ప్రవహిస్తూ చూడటానికి చాలా బావుండేది. నాగులేరు ని ఆనుకుని కొంచెం దూరం లో బస్టాండ్ ఉండేది అక్కడ దొరికే తినుబండారాలంటే నాకు చాలా ఇష్టం వాటిలో బెండ్లు, పంచదార చిలకలు, బెల్లం పూసమిఠాయి ఐతే మరీ ఇష్టం.
మా తాత గారు ఉండేది NSP ఇరిగేషన్ కాలనీ లో అది ఊరికి కొంచెం దూరం లో చివరగా కాలవకి కొంచెం దగ్గర గా ఉండేది. ఐతే మేము ఎక్కిన బస్సు లు కొన్ని ప్రత్యేకం గా కాలనీ వరకు వెళ్ళేవి, కొన్ని మాత్రం బస్టాండ్ లోనే ఆపేసే వారు. కాలనీకి వెళ్ళే బస్సు లో ప్రయాణం ప్రత్యేకించి చెప్పుకోవాలి. బస్టాండ్ నుండి బయల్దేరాక ఊరిలో కొంచెం దూరం ఇరుకు సందులలోనుండి అంత పెద్ద బస్సు ని చాలా చాకచక్యం గా తీసుకు వెళ్ళేవాళ్ళు డ్రైవరు. వాళ్ళ గురించి ఇప్పుడు తలుచుకుంటే పద్మవ్యూహం లో అభిమన్యుడు గుర్తొస్తుంటాడు ఖచ్చితం గా వీళ్ళంతా అభిమన్యుడి వారసులే అయి వుండి వుంటారు :-) అలా నానా కష్టాలు పడి ఒక ఐదు నిముషాలలో ఊరు దాటిన మరుక్షణం రోడ్డుకి రెండు వైపులా పచ్చని చెట్లతో నల్లని తారు రోడ్డు ఆహ్వానం పలుకుతుంది.
నాకు ఆ రోడ్డు చాలా ఇష్టం కనుచూపు మేరా నల్లని పొడవైన రోడ్డు దానికి రెందు వైపులా అన్ని కాలాలలో పచ్చదనం నిండి ఉండే చెట్లు కొన్ని సార్లు పువ్వులు బాగా పూచె కాలం లో ఐతే చెట్టునుండి రాలి కింద పడిన పువ్వులతో నల్లని రోడ్డు కి రెండు వైపులా ఎర్రని తివాచీ పరిచినట్లు చాలా అందం గా ఉండేది. ఆ చెట్ల పేరు ఎంటో గుర్తు లేదు కానీ వాటి పువ్వులతో మేము పిల్లలం అందరం కలిసి కోడి పందాలు ఆడేవాళ్ళం. ఆ పువ్వులు విచ్చుకోడానికి సిద్దంగా ఉండే సమయం లోనే గాలికి రాలి కింద పడేవి అలా పడిన మొగ్గలని ఏరుకుని ఓపెన్ చేస్తే లోపల పొడవాటి కాండం దాని కొసన సన్నని బంధం తో బియ్యపుగింజ ఆకారం లో ఉండేది. వాటిని ఒకదానికి ఒకటి లంకె వేసి లాగితే ఎవరి పువ్వు విరిగి పోతే వాడు ఓడిపోయినట్లు. నిజం గా కోడి పందాలు గెలిచినంత గా ఫీల్ అయ్యేవాళ్ళం అందులో గెలిచి :-)
నాకు ఆ రోడ్ అంటే ఎంత ఇష్టం అంటే అప్పట్లోనే నేను ఎప్పుడైన ఇదే రోడ్ లో నా సొంత కారు లో నా అంతట నేనే చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ ఈ రోడ్ ఉన్నంత దూరం అలానే వెళ్ళాలి అని అనుకునే వాడ్ని. కాని ఆ తర్వాత తాత గారు అక్కడ నుండి నరసరావు పేట్ వచ్చేయడం తో మళ్ళీ ఆ ఊరు వెళ్ళడమే కుదరలేదు ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడైనా కుదురుతుందేమో చూడాలి.
సరే లెండి ఈ రోజుకి బాగానే బుర్ర తిన్నట్లున్నాను కాదా.. కారెంపుడి లో మా యన్‌యస్పీ కాలనీ కబుర్లతో మళ్ళీ త్వరలో కలుద్దాం.
అంతవరకూ శలవా మరి...
--వేణు.
శనివారం, మే 24, 2008
మా ఊరు
అసలు నాన్న గారి సొంత ఊరు మాచెర్ల దగ్గర లో ఉన్న పాలవాయి. పక్కా పలనాటి ఊరు ఎక్కడ చూసిన నాపరాళ్ళతోఎండిన చేలతో ఉండేది. ఆ ఊరితో పెద్దగా నాకు పరిచయం లేదు, నాన్న ఒక్కడే సంతానం అవడం తో ఎక్కువబంధువులు లేక కొన్ని సార్లు మాత్రమే ఆ ఊరికి వెళ్ళాను. ఊరి మొదట్లో వుండే పిల్ల కాలువ, ఇంటి పక్కన వున్న చిన్నరామాలయము, ఇళ్ళ మధ్య నుండి వెళ్ళే బండలు పరిచిన రోడ్డు, టవలు కట్టుకుని ఆరుబయట బావి దగ్గర స్నానంఅన్నింటిని మించి వెళ్ళిన ప్రతి సారి ఉన్న కొద్ది మంది బందువుల ఆత్మీయమైన పలకరింపు ఇవి తప్పించి పెద్దగా ఏమిగుర్తు లేవు.
ఇక పోతే నేను చిన్నపుడు మా అమ్మమ్మ వాళ్ళు కారంపుడి లో ఉండే వాళ్ళు నా ప్రతి సెలవల్లొ ఊరు వెళ్ళాలి అంటేఅక్కడికే వెళ్ళే వాళ్ళము. అల్లర్లతో బాగా పేరు పొందిన కారంచేడు మా ఊరు వేరు వేరు. నేను ఈ ఊరు పేరుచెప్పినప్పుడల్లా ఇలా కలిపేసి అడుగుతూ ఉంటారు లెండి అందుకే ప్రత్యేకం గా చెప్తున్నా. కారంపుడి కారంచేడు వేరు వేరు అని. సరే ఇక కారంపుడి తో నా బాల్య స్మృతులు చాలా పెనవేసుకుని ఉన్నాయి. అవన్ని ఒకటొకటి గా వివరిస్తాను.
బాల్యం అంతా నరసరావుపేట, కారంపుడి మధ్యలో 7 & 8 తరగతులు మాత్రం పిడుగురాళ్ళ లో గడిపాను. స్కూల్ చదువు అయ్యాక ఇంటర్ చదువు కోసం విజయవాడ వెళ్ళాను అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. మొదటి సారి ఒక పెద్ద ఊరితో పరిచయం అదీ కాక కాలేజీ చదువు కదా హీరో లా ఫీల్ అయ్యే వాడ్ని. ఆ ఊరు అక్కడి కాలేజీ అనుభవాలు కూడా చాలా ఉన్నాయి తలచుకుంటే రోజుల తరబడి అలా ఆలోచనల్లో గడిపేస్తానేమో. ఆ తరువాత ఇంజనీరింగ్ కోసం విశాఖ ప్రయాణం మొదటి సారి సముద్ర తీరాన్ని చూసినప్పుడు ఆ ఆశ్చర్యం ఆనందం మాటలలో చెప్పలేను. ఆ కడలితీరాలలో చల్లని గాలులతో సేద దీరుతూ 4 సంవత్సరాలని 4 క్షణాల్లా గడిపేసాము. ఇక్కడే నాకు జీవిత కాలం నాతోనిలిచే నేస్తాలు పరిచయమయ్యారు. కాలేజీ వదిలి 12 సంవత్సరాలైనా ఇంకా మేము కొంత మందిమి దాదాపు రోజుమాట్లాడుకుంటాము అంటే మీలో చాలా మంది నమ్మలేరేమో కాని ఇది నిజం.
చదువు అయ్యాక హైదరాబాదు అమీరుపేట లో ట్రైనింగు, మినిస్టర్స్ రోడ్ లో జీవితం టిఫిన్ బండి లో ఉప్మా దోశ, ఇంట్లోక్రికెట్, ఎలుకల బాధ, నీటి కరువు, రెండో ఆట సినిమాలు, మా ఇంటి యజమాని గురించి చెప్పకుండా ఉండగలనా... ఆతరువాత మకాం మదరాసు ఇక్కడి ఉద్యోగ ప్రయత్నాలు mansion జీవితాలు గురించి చెప్పుకోకపోతే చాలా మిస్అయినట్లే... అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్న తరువాత బెంగళూరు... ఆ పై అమెరికా లో అట్లాంటా ఆ తరువాతవాషింగ్టన్ ఆ తరువాత మళ్ళీ కొన్ని రోజులు బెంగళూరు చివరగా ప్రస్తుతం చికాగో ఇదీ నా ప్రస్థానం.
ఏవిటో నా ఊరు అని మొదలు పెట్టి నేను ఉన్న ఊళ్ళ గురించి అన్నీ రాసేసాను కదా. సరే లెండి నా బాల్యం లో నేనుఎక్కువ గడిపిన కారంపుడి కబుర్లతో మళ్ళీ కలుద్దాం.
అంత వరకూ శలవా మరి,
--వేణు.
నేను ???
- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.



