అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శనివారం, ఫిబ్రవరి 20, 2010

ఈ నాడు ’ఈనాడు’ లో నేను.

 


మనసులోమాట బ్లాగర్ సుజాత గారికి కృతజ్ఞతలతో..

మంగళవారం, ఫిబ్రవరి 16, 2010

హాస్టల్ - 2

ఇలా బోలెడు ప్రశ్నలతో నాన్న వెనక నడుస్తూ ఆ చిన్న గేట్ ద్వారా లోపలికి అడుగుపెట్టాం. రిజిస్టర్ లో నాన్న ఏవో వివరాలు నింపిన తర్వాత ఆఫీస్ రూమ్ కి ఎలా వెళ్ళాలో దారి చూపించారు. మెల్లగా ముందుకు నడవడం ప్రారంభించాం. గేటు ఆనుకుని పక్కనే ఒక చిన్న బిల్డింగ్ దానిలో క్యాంటిన్ లాగా ఉంది అక్కడ కాఫీ,టీ,కూల్ డ్రింక్స్, కేకులు, బిస్కట్లు, సబ్బులు, పేస్ట్ లు, షాంపూలు ఇలాంటి నిత్యావసర వస్తువులన్నీ దొరుకుతాయిట. కేకులు బిస్కట్లు కూల్ డ్రింక్ లు చూసాక ఓకే ఇది కొంత వరకూ పర్లేదు, హమ్మయ్య కనీసం ఒక సమస్య తీరింది అనుకున్నాను. అవునూ బయట స్కూల్ బోర్డ్ ఉంది కానీ కాలేజ్ పేరు లేదేంటి అని అడిగితే "ఇదే క్యాంపస్ లో ఒక బిల్డింగ్ స్కూల్ ది ఇంకో బిల్డింగ్ కాలేజ్ ది, కాలేజ్ బోర్డ్ ఇంకా రాయించలేదు త్వరలో పెడతారు" అని చెప్పారు. (తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అసలక్కడ స్కూల్ కు మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే మా వాళ్ళు కాలేజ్ కూడా నడిపేస్తున్నారట, రికార్డ్స్ ప్రకారం మాకాలేజ్ ఈడ్పుగల్లు దగ్గర్లో ఉన్న గోశాల అనే ఊర్లో ఉండాలి)

అలా మరో రెండు అడుగులు ముందుకు వేశామో లేదో "డుగ్ డుగ్ డుగ్ డుగ్.." అని లీలగ మొదలై మాకు మెల్లగా చేరువవుతున్న శబ్దం వినబడింది. మనకి బాగా ఇష్టమైనా నచ్చిన వాటిని చూసినా విన్నా తిన్నా ఏదో తెలియని మధురమైన అనుభూతికి లోనవుతాము, కళ్ళలో మెరుపు మొహం లో వెలుగు ఇత్యాది మార్పులు మనకి తెలియకుండానే జరిగిపోతుంటాయ్. అదిగో నాలో ఆలాంటి మార్పులకు కారణమయ్యే వాటిలో ఒకటి బుల్లెట్ మోటార్ సైకిల్. అసలు ఠీవీగా నిలబడే దాని రూపం చూస్తేనే ముచ్చటేస్తుంది. ఇక అది చేసే శబ్దం వింటే గుండెల్లో మృదంగం మోగిన అనుభూతి నాకారోజుల్లో.

ఆహా ఎక్కడా అని ఆసక్తిగా చూస్తే ఎదురుగా బుల్లెట్ బండి మీద ఒక భారీ ఆకారం వస్తూ కనిపించింది. ఆయన టీవీ భీముడు అంత ఉన్నారు, వయసు యాభై దగ్గరలో ఉండచ్చు, ఇంచు మించు ఏడు అడుగులు ఎత్తు ఉంటారేమో. ఎత్తుకు తగ్గ లావు, కాస్త ఎక్కువే లావు అనచ్చేమో. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన బుల్లెట్ బండి వేసుకు వస్తుంటే ఆయన భారీ ఆకారం కింద అది ఏదో లూనా లా కనిపించింది. గుండెల్లో మృదంగం ఆగిపోయి చెవుల్లో "మహాభారత్.." అని టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ మోగుతుండగా, ఆయన బండి మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయింది. నాకు ముచ్చెమట్లు పోశాయి, వామ్మో హాస్టల్ లో ఈయనేంటండీ బాబు ఒక్క చిటికెన వేలితో ఎత్తి అవతల పడేస్తారేమో సరిగా చదవక పోతే అనుకున్నాను. (తను మాకు కెమిస్ట్రీ చెప్పేవారు మనిషి ఎంత భారీనో మనసు అంత మెతక మమ్మల్ని ఎప్పుడైనా కాస్త గదమడమే కానీ ఎప్పుడూ చెయి చేసుకోలేదు:-)

నాకు అప్పటికే ఉన్న దిగులుకు భయం కూడా తోడవగా మెల్లగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి వెళ్ళాం. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని AO(Administration Officer) గారిని కలవాలి ఆ బెంచ్ మీద కూచుని కాసేపు ఎదురు చూడండి అని చెప్పారు. AO గారి పేరు ప్రభాకర్ మా హాస్టల్ లో తనంటే టెర్రర్. చూడటానికి కాస్త పొట్ట ఎక్కువ పెంచిన మమ్ముట్టీ లా ఉంటారు. మొహానికి కళ్ళద్దాలు మరింత హుందాతనాన్ని తెచ్చిపెట్టి మాకు భయాన్ని గౌరవాన్ని మరింత పెంచేవి. హాస్టల్ కు సంభందించిన అన్ని విషయాలు తనే చూసుకునే వారు. ఆయన్ని కలిసాక  నాన్న "మా వాడు మాకు దూరంగా ఉండటం ఇదే మొదటి సారి కాస్త జాగ్రత్తగా చూడండి" ఇత్యాది జాగ్రత్తలు అన్నీ ఆయనకు చెప్పేసి నాకు కొనాల్సిన సామాన్ల లిస్ట్ ఇస్తే అది పట్టుకుని ఆఫీస్ నుండి బయట పడ్డాం.  

వెంట తెచ్చుకున్న పెట్టె రూం లో పెట్టేసి వెళ్దాం ఒక సారి రూం చూసినట్లు కూడా ఉంటుంది అని బిల్డింగ్ లోపలికి నడిచాం.  పొడవాటి కారిడార్ కు అటు ఇటు రూంస్ ఉన్నాయ్ మొదట ఉన్న కొన్ని రూములు చిన్నవిగా ఉన్నాయ్ ఒకో దానిలో 6-7 మంచాల వరకూ వేసి ఉన్నాయ్. ఒకవైపు రూములన్నీ N1, N2 ఇలా నంబర్లు వేసి ఉంటే వాటి ఎదురుగా  మరో వైపు ఉన్న రూములకు S1, S2 ఇలా నంబర్లు వేసి ఉన్నాయి. నాకు అలాట్ చేసిన రూమ్ చాలా పెద్దది ఒక రూంలో 15-20 వరకూ మంచాలు ఉన్నాయి. అంతమందితో కలిసి ఒకే రూంలో ఉండాలా ఎవరెవరు ఎలాంటి వారో ఎలా ఉండబోతుందో ఇక్కడ అని ఆలోచిస్తూ ఒక బెడ్ ఆక్రమించుకుని నా సామాన్లు పెట్టేసి, ఊరి మీద పడ్డాం. నా దిగులు పోగొట్టడానికి అని నాన్న రాఘవయ్య పార్క్, బీసెంట్ రోడ్ అన్ని ఏరియాలు తిప్పి చూపించారు. ఒక మంచి హోటల్లో భోజనం చేసి కొత్తగా కొన్న సామాన్లతో చీకటి పడ్డాక మళ్ళీ హాస్టల్ చేరుకున్నాం.

సామాన్లు రూం లో ఉంచాక నాన్నకు మా బిల్డింగ్ గుమ్మం దగ్గరే వీడ్కోలు ఇచ్చి తిరిగి రూం లోకి వచ్చాను. ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. అప్పటివరకూ ఉన్న దిగులు రెట్టింపు అయింది, దానికి బెరుకు కూడా తోడయ్యింది. అదేమిటో అంతమంది మధ్యన ఉన్నా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. ఒకరిద్దరు నన్ను చూసి పలకరింపుగా నవ్వారే కానీ అంతకు మించి ఎవరూ మాట్లాడలేదు. (పాపం వాళ్ళకూ కొత్త అన్న విషయం నాకు అప్పట్లో స్పురించలేదు). అప్పటికే పరిచయం అయిన వాళ్ళనుకుంటా కొంతమంది ఒక గ్రూప్ గా రూమ్ కు ఆ చివర  కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఒక సారి నా సామాన్లు చూసుకున్నాను నా సొంతంగా ఒక పరుపు, దిండు, దుప్పట్లు, బక్కెట్, మగ్, ప్లేట్, గ్లాస్, ఒక ట్రంక్ పెట్టె. బట్టలకు విలువైన వస్తువులు డబ్బులు పెట్టుకోవడానికి ఒక విఐపి సూట్ కేస్. ట్రంక్ పెట్టె తీసి చూస్తే నా కోసం ప్రత్యేకంగా సర్ధిన కొన్ని నిత్యావసరాలు పేస్ట్, సబ్బులు లాంటివి చూసుకుని బోలెడు దిగులు పడిపోయాను. మొన్నటి వరకూ ఇంట్లో సరుకులు తెచ్చినపుడు తప్ప వీటిగురించి అసలు పట్టించుకునే వాడ్ని కాదు ఇప్పుడు నాకోసం అన్నీ ప్రత్యేకంగా నేనే మెంయింటెయిన్ చేసుకోవాల్సినవి. బట్టలు కూడా నేనే ఉతుక్కోవాల్సి వస్తుందేమో అని చెప్పారు. ఏమిటో ఈ కష్టాలు అసలు ఇలా ఇంటినుండి ప్రత్యేకంగా వచ్చి నా సామాన్లతో నేను బతకడం ఏమిటో అని ఏడుపు వచ్చేసింది. కాసేపు ఎవరికీ కనపడకుండా ఏడ్చేసి మెల్లగా అలానే నిద్ర లోకి జారుకున్నాను.

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

హాస్టల్ లో నా మొదటి రోజు అలా గడిచిందండీ . నిన్న టపాలో చెప్పినట్లు ఇక పై ఒక సీక్వెన్స్ లో కాకపోయినా నాకు గుర్తున్న కొన్ని సంఘటనలను అపుడపుడూ మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సోమవారం, ఫిబ్రవరి 15, 2010

హాస్టల్ - 1

నల్లగా నిగనిగలాడుతూ, మెలికలు తిరుగుతూ పరుచుకుని ఉన్న తారు రోడ్ పై బస్సు శర వేగంతో ముందుకు వెళ్తుంది. నరసరావుపేట పొలిమేరలు దాటి ఐదునిముషాలవుతుందేమో. కిటికీ పక్కనే కూర్చున్న నా దృష్టి రోడ్ పైనే ఉన్నా ఆలోచనలు మాత్రం బస్సుకన్నా వేగంగా, దారితప్పిన బాటసారిలా ముందుకు వెనక్కు ప్రయాణిస్తూ ఉన్నాయ్. "విజయవాడ ఎంత సేపట్లో వస్తుంది నాన్నా?" ప్రశ్న అడుగుతూ పక్కకి తిరిగిన నాకు, కొద్దిగా తెరిచిన నోటినుండి సన్నగా వస్తున్న గురకే సమాధానమైంది. పాపం నాన్న, ఉదయాన్నే లేచి ఆఫీసుకు వెళ్ళి మధ్యాహ్నం వరకూ పని చేసి వచ్చి హడావిడిగా అన్నంతినేసి నన్ను హాస్టల్ లో దిగబెట్టడం కోసం, మధ్యాహ్నం నిద్ర కూడా మానుకుని బయల్దేరారు. పడుకోనిద్దాంలే ఇపుడు నేను తెలుసుకుని మాత్రం చేసేదేముంది.

దృష్టి మళ్ళీ రోడ్ పై నిలిపాను, ఎండ తీక్షణంగా ఉంది, దూరంగా రోడ్ పై నీటి చెలమలు ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. బస్ ముందుకు వెళ్ళే కొద్దీ అవి మాయమవడమో మరింత దూరం జరగడమో జరుగుతుంది. ఎండమావులు(Mirage) అంటారు ఇవేనేమో!!, కానీ స్కూల్లో టీచర్ చెప్పిన ప్రకారం అవి ఎడారుల్లో కదా కనిపించాలి, ఊర్లో ఇలా రోడ్ మీద ఎందుకు కనిపిస్తున్నాయబ్బా ఏమోలే.. ఎండమావులు పదం ఈ మధ్యే ఎక్కడో విన్నాను కదా ఎక్కడా ?

"అసలు ఈ రెసిడెన్షియల్ కాలేజిలు ఎండమావులు లాంటివమ్మాయ్ దూరంగా ఉన్నంత సేపు మురిపిస్తాయ్ అంతే.. అక్కడికెళ్తే అసలు బండారం బయట పడుతుంది. అయినా మన బంగారం మంచిదవ్వాలి కానీ అంత డబ్బులు పోసి అక్కడ చదివించినా ఉపయోగం ఏం ఉంటుంది చెప్పు డబ్బు దండగ తప్పించి.." నే వినట్లేదనుకున్నారో లేదా విన్నా పర్లేదనుకున్నారో మొత్తానికి స్పష్టంగా నా చెవిన పడ్డ ఒకాయన అమ్మకిస్తున్న ఉచిత సలహా గుర్తొచ్చింది.

"వాడి కంటి చూపు అంతంత మాత్రమే అంత లావు కళ్ళద్దాలు వేసి అంత దూరాల్లో ఒక్కడ్నే ఉంచి చదివించాల్సిన అవసరం ఉందా.. ఇప్పుడు వాడు చదివి ఎవర్ని ఉద్దరించాలిట. ఏం వాళ్ళ నాన్న బిఎ చదివి మాంచి ఉద్యోగం చేయడం లేదా వాడ్ని కూడా ఏ ఆర్ట్స్ గ్రూపులోనో చేర్చి ఇంటిదగ్గరే ఉంచి చదివించచ్చు కదా.." బంధువుల సలహాలు విని చిద్విలాసంగా నవ్వడమే కానీ పన్నెత్తు మాట మాట్లాడని అమ్మానాన్నలు గుర్తొచ్చారు.అసలు బుద్దిగా చదువుకుంటే ఈ బాధలు ఉండక పోవు కదా అత్తెసరు మార్కులు తెచ్చుకోవడం వల్లనే కదా ఈ కష్టాలన్నీ. "ఎవరు చేసిన ఖర్మ వారనుభవించకా.." మనసులోనే పాడేసుకుంటూ మళ్ళీ రోడ్ పై దృష్టి నిలిపాను.

హాయ్!! దూరంగా అదేమిటి ఎడ్లబండా? ఆ, దగ్గరకు వస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది. ఎడ్లు ఏంత ఠీవీగా నడుస్తున్నాయో... ఆస్వాదించేలోపే రయ్ య్ య్... మంటూ మా బస్ దాన్ని ఒక్క క్షణం లో దాటేసింది భలే! హఠాత్తుగా స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ వాళ్ళ ఎడ్లబండిని దాటుకుంటూ వెళ్ళే మోటారు వాహనాలు గుర్తొచ్చాయ్ "నిధిచాల సుఖమా.." కీర్తన గుర్తొచ్చింది. ఎలాగైనా విశ్వనాథ్ గారు సినిమాలు బాగా తీస్తారు కదా. విశ్వనాథ్ బాగాతీస్తారు కానీ ఆయన సినిమాల్లో కొన్ని సరిగా అర్ధం కావు. అదే మాబాసు చిరంజీవైతే కామెడీ చేసినా ఫైట్లు చేసినా డ్యాన్సాడినా ఇరగదీస్తాడు కదా. చిరుని తలుచుకోగానే బోల్డంత ఉత్సాహం అంతలోనే నీరసం తన్నుకొచ్చేశాయి.

రేపటి నుండి జైలు జీవితమేనటగా ఇకపై నరసరావుపేటలో ఫ్రెండ్స్ ని తరచుగా కలవడానికే కుదరదు, ఇక సినిమాల సంగతి సరే సరి. ఫ్రెండ్స్ అంటే సర్లే ఇక్కడ కూడా కొత్త ఫ్రెండ్స్ తయారవుతారు కానీ సినిమాలు ఒకసారి రిలీజై ఎత్తేస్తే మళ్ళీ ఎలా చూడటం. మహర్షి సినిమా అలాకాదు చూడలేకపోయింది. పరీక్షలకు నెల ముందు రిలీజైనా పబ్లిక్ పరీక్షలు అని చెప్పి ఎంత బతిమిలాడినా చూడనివ్వలేదు. పరీక్షలవేసరికి సినిమా ఎత్తేశారు. చాలామంది బాగాలేదన్నారు కాని నామినేని గాడు "చాలా బాగుంది, నీకు కూడా నచ్చుతుంది" అన్నాడు, కానీ నాకు కుదరలేదు. నేను హాస్టల్ లో ఉన్నపుడు రిలీజైన సినిమాలు ఎలా చూడాలో ఏమిటో :-(

అరె!! ఆలోచనల్లోనే విజయవాడ వచ్చేసిందా! వావ్ ప్రకాశం బ్యారేజ్ ఎంత అందంగా ఉందో కదా. బాబోయ్ నది ఒడ్డునే ఎంత ఇరుకుగా ఇళ్ళుకట్టుకున్నారో, ఎంతైనా పెద్ద ఊర్లంటే అలాగే ఉంటాయ్ ఏమోలే అందరూ ఇక్కడికే వస్తుంటారు కదా. అవునూ విజయవాడ అంటే మంచి రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్ లూ ఊహించుకుంటే ఇదేమిటీ ఇలా ఉంది?. ఇలా నాలో నేను చూసిన ప్రతి దాన్నీ ప్రశ్నించుకుంటూ ముందుకు సాగుతూనే నాన్న వెంట కాలేజి గేట్ ముందు బస్ దిగాను. ఎదురుగా పెద్ద గేట్ దానికి  రెండు పెద్ద పెద్ద నల్లని తలుపులు, ఈ చివర నుంచి ఆ చివరికి నిలువు చువ్వలు,వాటి వెనకగా మందపాటి పెద్ద రేకు ప్రతి చువ్వపైన మొనదేలిన కొసలతో త్రిభుజాకారపు ఆక్రుతులు, బహుశా పిల్లలెవరైన గేటు దూకే ప్రయత్నం చేస్తే అవి గుచ్చుకుని ఆగిపోడానికేమో.

గేటుకి ఒక మూల ఒక మనిషి మాత్రమే పట్టే మరో చిన్న తలుపు. "ఇదేదో అచ్చంగా సినిమాల్లో చూపించే జైలు గేటు లా ఉందే. నిజంగా హాస్టల్ కే వచ్చామా లేక బస్ వాడు పొరబాటున ఏదైనా జైలు ముందు దించేశాడా ?" ఒక వేళ నేను ఇంట్లో ఆబద్దాలు చెప్పి అప్పుడప్పుడూ కొట్టేసిన ఐదు పది రూపాయలకు నాకు జైలు శిక్షవేస్తే నాకు చెప్పకుండా నాన్న ఇక్కడకు తీసుకువచ్చారా ? హబ్బే ఆబద్దాలకి, అదీ ఇంత పెద్ద జైల్లో శిక్ష వేయరేమో లే. అవునూ ఆమూల  చిన్న బోర్డేదో కనపడుతుంది కదా చూద్దాం. ఓ సారి కళ్ళద్దాలు సవరించుకుని చదివాను "సిద్దార్థ రెసిడెన్షియల్ స్కూల్, ఈడ్పుగల్లు" హమ్మయ్యా ఇది జైలు కాదు. కానీ నేను కాలేజి లో జాయిన్ అవడానికి కదా వచ్చింది ఇదేంటి నన్ను స్కూల్ కి తీసుకు వచ్చారు ? ("ఈ పక్కన ఫోటోలో చూపింది మా కాలేజ్ గేట్ కాదు లెండి ఇంచు మించు ఇదే స్టైల్ లో ఇంకా ఎత్తుగా ఉండేది మా గేట్")


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
నేను విజయవాడ సిద్దార్ధ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివాను. ఆ ఙ్ఞాపకాలు ఈ టపాల సిరీస్ ద్వారా పంచుకుందామని నా ఈ చిన్న ప్రయత్నం. ఇది సీరియల్ అని చెప్పను కాని అక్కడక్కడా టపా నిడివి దృష్టిలో పెట్టుకుని రెండు మూడు టపాలకు పొడిగించే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్ టపాలలో ఒకదానితో ఒకటి కాస్త రిలేషన్ కూడా ఉండచ్చు ఎందుకంటే మా కాలేజ్, క్లాస్ మేట్స్, లెక్చరర్స్, విజయవాడ ఇవి అన్నీ ఏమీ మారవు కదా. సరేనండి త్వరలో మరో టపాలో కలుద్దాం.

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2010

నేనూ .. బ్రిటానియా ..

అసలు చిరుతిళ్ళనూ, చాక్లెట్లు బిస్కెట్లు లాటి తినుబండారాలనూ ఇష్టపడని పిల్లలు చాలా అరుదుగా ఉంటారేమో. అందుకే 1892 లో 295 రూపాయల పెట్టుబడితో కలకత్తాలో ఒక మూల ప్రారంభమైన ఒక చిన్న బిస్కట్ కంపెనీ నేడు వందకోట్ల టర్నోవర్ దాటడమే కాక ప్రపంచంలోని మొదటి రెండువందల చిన్న కంపెనీలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఇండియాలో నమ్మదగిన బ్రాండ్ల లో రెండవ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. అయితే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా క్వాలిటీ తగ్గకుండా చూసుకోవడం ఒకటే కాక. ఎప్పటికప్పుడు వినూత్నమైన మార్కెటింగ్ పద్దతులతో మారుతున్న ప్రజల అభిరుచులకు తగిన విధంగా మార్పులు చేర్పులతో ముందుకు  వెళ్ళడం కూడా ఈ కంపెనీ ఇంకా హాట్ ఫేవరిట్ గా నిలబడడానికి ఒక ముఖ్య కారణం. "Eat healthy, think better" లాంటి క్యాప్షన్స్ తెలియకుండా సృష్టించే ప్రభావం అంతా ఇంతా కాదు.

నా దృష్టిలో బిస్కట్ అంటే బ్రిటానియానే.. పార్లేకు కూడా చాలా మంది  అభిమానులు ఉన్నా (ఈ మధ్యే గమనించిన విషయం ఏమిటంటే సౌత్ ఇండియాలో బ్రిటానియా నార్త్ లో పార్లేకి ఎక్కువ మార్కెట్ ఉందట, లెక్కల్తో నిరూపించలేను కానీ నాకు తెలిసిన నార్త్ ఇండియా ఫ్రెండ్స్ ని గమనిస్తే అర్ధమైన విషయం ఇది.) న్యూట్రిన్, హార్లిక్స్, సన్ ఫీస్ట్ లాటి ఉత్పత్తులు ఎన్ని ఉన్నా నాకు ఎందుకో బ్రిటానియా బిస్కట్లకు ఉన్న రుచి మరి వేటికీ రాదు అనిపిస్తుంది. నా మొదటి పరిచయం మిల్క్ బికీస్ తోనే ఇప్పుడు దాని కవర్ పై అన్నిరంగులు నింపేసి డిజైన్ చేసినా అప్పట్లో కేవలం కుంకుమ మరియూ తెలుపు రంగులతో వెడల్పాటి భాగం అంతా పెద్ద అక్షరాలతో బ్రిటానియా అనే పేరు ప్రింట్ చేసి మిగిలిన వివరాలను నల్లని అక్షరాలతో సన్నని పక్క భాగాలలో ప్రింట్ చేసి వచ్చే బిస్కట్ ప్యాకెట్ చూడగానే నోరూరేది.

ఇక ఈ పక్క ఫోటోలో చూపించినట్లు బిస్కట్ అంచు వెంబడి పూలూ మధ్యలో ఎలివేటెడ్ ఫాంట్ లో బ్రిటానియా అనే ఆంగ్ల అక్షరాలు మహా అద్భుతంగా అనిపించేది. నిజం చెప్పద్దూ ఈ బిస్కట్ తినడం ఒక కళ :-) హడావిడిగా మొత్తం బిస్కట్ అలా నోట్లో కొరికేసి నమిలేస్తే మజా ఉండదు. ఇప్పుడంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళతో ప్రతి బైట్ నీ ఎంజాయ్ చేస్తూ తినండి అని చెప్పించుకోవాల్సి వస్తుంది కానీ చిన్నతనంలో ఏ కోర్సులు లేకుండానే అలా తినే వాడ్ని. ముందుగా నాలుగు వైపులా అంచు వెంబడి ఉన్న పూలను కొంచెం కొంచెం కొరికి చప్పరిస్తూ తినేసే వాడ్ని, ఆపై చదును గా ఉన్న బిస్కట్ పై దాడి చేసి చాలా శ్రద్దగా అక్షరాలు ఏమాత్రం డ్యామేజ్ అవకుండా భద్రంగా మిగతా బిస్కట్ అంతా తినేసిన తర్వాత చివరగా ఒక్కో అక్షరం అలా మెల్లగా కొరికి చప్పరిస్తుంటే ఆహా ఆ మజానే వేరు.  ఇప్పుడు ఎన్ని కేకులూ బిస్కట్లు తిన్నా అంత ఆనందం రాదు. ఇప్పుడు అసలు ఆ రూపమే మార్చేశాడు. కవర్ పై రంగులు ఒంపేశాడు బిస్కట్ పై అక్షరాలను తీసేసి గళ్ళను పెట్టాడు, ఇప్పుడే బాగుందోయ్ టీ లో ముంచుకున్నపుడు విరగ కుండా ఉంటుంది ఈ కొత్త డిజైన్ వల్ల అని ఎవరో అంటే విన్నాను మరి నాలాగా అస్వాదిస్తూ తినేవాళ్ళ పరిస్థితి ఏమిటో ఎవరూ ఆలోచించలేదల్లే ఉంది. అన్నట్లు ఇంకో విషయం అండోయ్ డిజైన్ లో ఎన్ని మారినా బిస్కట్ అడుగున డిజైన్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ అన్ని రకాల బిస్కట్స్ అడుగునా ఒకే రకమైన డిజైన్ ఉంటుంది, మరి దాని వెనక కథ ఏమిటో !

మిల్క్ బికీస్ తర్వాత నాకు బాగా ఇష్టమైనవి చిన్న బిస్కట్లు. పావలా సైజులో మిల్క్ బికీస్ మందంలో B అనే అక్షరం తో ఉండే చిన్న చిన్న బిస్కట్లు పెద్ద పెద్ద అల్యూమినియం డబ్బాల్లో వచ్చేవి అవి కేజీల్లెక్కలో సరుకులతో పాటు కొని తెచ్చుకుని ఇంట్లో సీసాల్లో నింపుకుని అప్పుడు కొన్ని అప్పుడుకొన్ని అలా తింటుండడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు ఇవి అస్సలు రావడం లేదనుకుంటాను. వాటి తర్వాత నాకు బాగా ఇష్టమైన బిస్కట్స్ bourban. నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంతగా నచ్చదు కాని ఈ బిస్కట్ విషయం లో మాత్రం ప్రత్యేకం. బిస్కట్ అంతా చాక్లెట్ ప్లేవర్ మధ్యలో జ్యూసీ క్రీమ్, ఇక బిస్కట్ పైన నక్షత్రాల్లా మెరిసే పంచదార పలుకులు. ఆహా తలచుకుంటేనే నోరూరుతుందంటే నమ్మండి. క్రీమ్ బిస్కట్స్ కూడా ప్రత్యేకంగా తినాలి :-) కొన్ని బిస్కట్స్ ఏమో రెండూ కలిపి కొంచెం కొంచెం కొరికి తిన్నా. కనీసం సగం ప్యాకెట్ అయినా రెండు బిస్కట్స్ ని వేరు చేసి ముందు క్రీమ్ అంతా నాలుక పై కరిగించేసి ఆ రుచి ఆస్వాదిస్తూ ఆపై ఒట్టి బిస్కట్ తినేయాలనమాట :-)

వీటి తర్వాత నచ్చేవి లిటిల్ హార్ట్స్, "ప్రేమించుకుందాం రా" సినిమా దర్శకుడి పుణ్యమా అని వీటి గిరాకీ మరింత పెరిగింది అనుకుంటాను ఇవి కూడా మంచి హార్ట్ షేప్ లో ఫ్లఫ్ఫీగా ఉండి రుచిగా ఉంటాయి. వీటి తర్వాత 50-50 రుచి కూడా అమోఘం. వాటిలో మసాలా ప్లేవర్స్ అంతగా నాకు నచ్చలేదు కానీ మొదట వచ్చిన ప్లెయిన్ నాకు ఇప్పటికీ ఇష్టమే.. వీటి తర్వాత మ్యారీ నాకు అంతగా నచ్చదు కేవలం విటా మ్యారీ మాత్రమే కాస్త కర కర లాడుతూ బాగుంటుంది మిగతావి అంత బాగోవు. ఆ తర్వాత వచ్చిన వాటిలో "గుడ్ డే" ప్రస్తుతం నేను కొనాల్సి వస్తే మొదట వెతికే బిస్కట్స్ ఇవే... క్యాషూ ఫ్లేవర్ మాత్రమే అని వచ్చే బిస్కట్స్ మధ్య ప్రతి బిస్కట్ లోనూ జీడి పప్పుకనిపించేలా జాగ్రత్త తీసుకుని అదే కమర్షియల్స్ కు వాడుకుని మాంచి పేరు సంపాదించాడు ఈ బ్రాండ్ తో. ఇక వీళ్ళ బార్బన్ తప్ప మిగతా క్రీం బిస్కట్స్ (ట్రీట్ సిరీస్) నేను అంతగా తినలేదు పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇంకా వీరి ఫ్రూట్ కేక్స్ కూడా నాకు అంతగా నచ్చవు, కానీ ప్రయాణాలలో భోజనానికి సమయం లేనపుడు రక్షిస్తుంటాయి. ఇంకా ప్రస్తుతం వస్తున్న మల్టీ గ్రెయిన్ న్యూట్రీ ఛాయిస్ బిస్కట్స్ కూడా బాగానే ఉంటున్నాయి ఊరికే విరిగిపోవడం కాస్త ఇబ్బందైనా ఆరోగ్యం రుచి దృష్ట్యా అది పెద్ద అవరోధం అనిపించలేదు. వందేళ్ళకు మించిన చరిత్ర ఉన్న వీరి ప్రోడక్ట్స్ లో నేను స్పృశించిన వెరైటీలు కొన్నే అయి ఉండవచ్చు, కానీ ఇవి నాకు తెలిసినా నచ్చినా వెరైటీలు.

నా బ్రిటానియా అభిమానానికి మచ్చుతునకలు కొన్ని ఏమిటంటే.. బ్రిటానియా యాడ్స్ లో చివర్న వచ్చే "టింగ్‍టింగ్‍టిటింగ్" అనే టోన్ ప్రస్తుతం నా మెసేజ్ రింగ్ టోన్ :-) అది మీకు కావాలంటే ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు బెంగళూరు లో ఉద్యోగం వచ్చిన కొత్తలో పాత ఎఇర్ పోర్ట్ రోడ్ లోని గోల్డెన్ టవర్స్ లో ఉండేది మా ఆఫీస్. మొదటి రోజు ఆఫీస్ దగ్గరపడే కొద్దీ ఆటోలో ఉన్న నా దృష్టిని మా ఆఫీస్ బోర్డ్ కన్నా ఆ పక్కనే ఉన్న బ్రిటానియా బోర్డ్ అత్యంత ఆకర్షించింది. తెల్లని బోర్డ్ పై మెరూన్ అక్షరాలతో బ్రిటానియా అనే పేరు మా ఆఫీస్ పక్కనే చూసి మనసు పులకించి పొయింది. ఓ క్షణం "ఆహా మధ్యాహ్నాలు రోజూ అన్నం మానేసి వీళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి వేడి వేడి బిస్కట్లు ఓవెన్ లోనుండి డైరెక్ట్ గా తీసుకుని తినచ్చేమో" అని సినిమాస్కోప్ లో కలలు కన్నాను కానీ ఒకసారి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి భంగపడి ఆ ఆలోచనను విరమించుకున్నాను :-) ఈ మధ్యనే మళ్ళీ వాళ్ళ వెబ్ సైట్ ద్వారా "మీ ఫ్యాక్టరీ లో వేల కొలదీ బిస్కట్లు ఎలా తయారు చేస్తారో చూడాలని ఉంది ఎలా చూడాలీ" అని అడుగుతూ మెయిల్ రాశాను, "త్వరలో మీకు జవాబిస్తాం" అని వెంటనే రిప్లై ఇచ్చారు కాని ఆ తర్వాత మళ్ళీ సౌండ్ లేదు. ఒకవేళ వెళ్ళడం కుదిరితే ఫోటోలకు అనుమతిస్తే ఆ విశేషాలను మరో టపాలో రాస్తాను. అంతవరకూ మాంచి కరకరలాడే గుడ్ డే బిస్కట్స్ తో "హవ్ ఎ గుడ్ డే" :-)

శుక్రవారం, ఫిబ్రవరి 05, 2010

Happy to Help - ఛా! నిజమా!!

ఈ వీడియో చూశారా అందులో మొదటి ప్రకటన చూసి "how cute!!" అని అనుకోని వారు ఉండరేమో కదా. చక్కని క్రియేటివిటీతో ఎంతో శ్రద్దగా తయారు చేసిన ప్రకటన. నాకు నచ్చిన వాణిజ్య ప్రకటనల్లో ఇది ఒకటి. హచ్ కుక్క పిల్ల ’పగ్’ సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు కదా... దానినే ఉపయోగించి వోడాఫోన్ కు ఈ ప్రకటన రూపొందించిన వారెవరో కానీ వారిని మెచ్చుకోకుండా ఉండలేను. దీని తర్వాత ఇప్పుడు తనకు తానుగా ఏ ఫేమస్ హీరోకూ తీసిపోనంత పేరు సంపాదించుకున్న zozo పాత్రలతో రూపొందించిన వోడాఫోన్ ప్రతి ప్రకటనా ఆ యాడ్ మేకర్  క్రియేటివిటీ కి అద్దం పడుతుంది. నేను గత మేలో ఇండియా వచ్చినపుడు ఏ ఫోన్ నంబర్ తీసుకోవాలా అని ఆలోచించి ఈ ప్రకటనలు గుర్తొచ్చి "ప్రకటనల మీదే అంత శ్రద్ద పెట్టిన వారు సర్వీస్ మీద కనీసం యాభై శాతమన్నా శ్రద్ద పెట్టి ఉండరా" అని అనుకుని వొడాఫోన్ తీసుకున్నాను. నాకు అనుకూలంగా ఉన్న STD, SMS తారీఫ్ ప్లాన్ లు కూడా ఒక కారణం అనుకోండి. ఆ క్షణం లో ఓ పక్కనుండి zozo బొమ్మ "వెర్రి వెధవ మమ్మల్ని చూసి బుట్టలో పడ్డాడు ఇక వీడి పనైపోయిందే" అనుకుంటూ చేసిన వికటాట్టహాసం నా చెవుల బడకుండా ఏ శక్తి అడ్డుకుందో ఏమో కానీ వేడి వేడి ముద్దపప్పులో కాలేశాను అన్న విషయం తర్వాత తెలిసింది.


అదేమిటో పొలిమేరల్లోనూ, ఊరి బయట హైవేస్ మీదా ఉన్నంత సిగ్నల్ స్ట్రెంత్ సిటీల్లోనూ ఇంట్లోనూ ఆఫీసుల్లోనూ ఉండి చావదు. సరే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలిగా మరి చీప్ గా ఇస్తున్నపుడు ఇలాటివి భరించాలి లే అని వదిలేశాను. సిగ్నల్ సంగతి పక్కన పెడితే నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ఏ కాల్ చేసినా కూడా 30 నిముషాలు దాటనివ్వడు. సరిగ్గా ఇరవైతొమ్మిది నిముషాల యాభైఏడు సెకన్లకు కట్ చేసి పడేస్తాడు. మంచి ఫ్లోలో సాగుతున్న సంభాషణ మధ్య ఈ అంతరాయం చాలా చిరాకు కలిగిస్తుంది, ఈ సరికే దీనికి కూడా అలవాటు పడిపోయాను అనుకోండి. ఒకోసారి లైన్ కలవదు నంబరు బిజీ అనో నాట్ ఇన్ కవరేజ్ ఏరియా అనో వస్తుంది అవతల వ్యక్తి ఫోన్ పట్టుకుని మనకోసమే ఎదురుచూస్తున్నారు అని మనకి తెలుసు అయినా వీడి నాటకాలు ఇవి. ఒకోసారి ఉన్నట్లుండి 4-5 నిముషాలు కూడా గడవక ముందే చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వచ్చి కాల్ కట్ అయిపోతుంది. నాకైతే ఆ సమయంలో zozo బొమ్మ ఒక ఎర్రడబ్బా పై కూచుని నా వైపే చూస్తూ "అచ్చికిచ్చి.. అచ్చికిచ్చి.. అయ్యిందా అబ్బాయిగారి పని యిహ్హిహిహిహి..." అని గేలిచేస్తూ నవ్వుతున్నట్లు కనిపిస్తుంది (అచ్చంగా ఈ కింది వీడియోలో చూపించినట్లు). ఇంక కాల్స్ రద్దీ ఎక్కువ ఉండే సమయంలో మాట్లాడాలంటే గగనమే, లైన్స్ దొరకక పోవడం ఒక ఎత్తైతే కలిసినా చిత్రమైన శబ్దాలు కొండకచో అవతలి మనిషి గొంతు రోబోట్ గొంతులా వినపడటం జరుగుతుంటుంది.

సరే ఇన్ని జరిగుతున్నా మనకి కాస్త సహనం పాళ్ళు ఎక్కువే కనుక భరిస్తూ వచ్చాను. ఓ వారం క్రితం ఉన్నట్లుండి నో యాక్సెస్ అని ఫోన్ లో నెట్వర్క్ రిజిస్టర్ అవడం మానేసింది. ఫోన్ లో ఏ విధమైన సమస్య లేదని నిర్ధారించుకుని కాసేపు మాన్యువల్ ఆటోమాటిక్ మధ్య మారుస్తూ ఎలాగో మళ్ళీ సాధించాను. ఒక రెండ్రోజుల క్రితం మళ్ళీ పోయింది ఈ సారి ఎంత ప్రయత్నించినా రాలేదు. సరే ఒక సారి ప్రకటన గుర్తుతెచ్చుకుని హ్యాపీ అట కదా చూద్దాం అని కాల్ చేస్తే  సంతోషం సంగతి దేవుడెరుగు కనీసం తీరిగ్గా సమస్య ఏంటో విని సలహా ఇద్దాం అనే ఆసక్తి ఏమాత్రం కనిపించలేదు. ఎప్పుడు ఫోన్ పెట్టేద్దామా అని ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. సరే ఆవిడ సలహాలు నోట్ చేసుకుని అవన్నీ పాటించి అయినా ఉపయోగం లేదని ఇంకోసారి కాల్ చేస్తే ఈవిడ ఒక పదినిముషాలు సతాయించి "ఈ జిడ్డుగాడు వదిలే లా లేడు" అనుకుని కంప్లైంట్ రిజస్టర్ చేసి కంప్లైంట్ నంబర్ SMS వస్తుంది అని చెప్పింది. నాకు తిక్క నషాలానికంటింది, "నెట్వర్క్ లేదు మొర్రో అంటే sms" ఎలా వస్తుంది అని అడిగా.. "నెట్వర్క్ వచ్చిన తర్వాత వస్తుంది" అంది, నేను "నెట్వర్క్ వచ్చిన తర్వాత కంప్లైంట్ నంబర్ నాకెందుకు నాలుక గీసుకోడానికి కూడా పనికి రాదు" అంటే సరే మీకు ఇప్పుడే ఇస్తాను ఉండండి అని కాసేపు హోల్డ్ లో పెట్టి ఫైనల్ గా ఇచ్చింది. ఆ తర్వాత ఆ నంబర్ పట్టుకుని మళ్ళీ కాల్ చేసి ఎస్కలేట్ చేయిస్తే ఒక గంటకు నెట్వర్క్ వచ్చింది, వీళ్ళు సాయం చేసే విథానం ఇది.


అక్కడితో కథ సుఖాంతమైతే ఈ టపా ఉండేది కాదు. నిన్నటి నుండి నేను ఏ నంబర్ కు కాల్ చేసినా చేసిన ప్రతిసారి "మీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అప్లికేషన్ ఏదైనా వొడాఫోన్ స్టోర్ లో ఇవ్వడానికి ఆఖరి రోజు" అంటూ మెసేజ్ వస్తుంది, నిన్న ఇదే విషయమై ఒక sms కూడా వచ్చింది. సరే సంగంతేంటి గురూ అని రాత్రి మళ్ళీ కాల్ చేశాను, ఇతను మరో ఖంగారు కనకయ్య బట్టీ పట్టిన నాలుగుముక్కలు  లొడ లొడ మంటూ కక్కేయడమే కానీ అసలు నే చెప్పేది వినే తీరికే లేదు. పోని ఆ దిక్కుమాలిన స్టోర్ ఎక్కడ ఉందో చెప్పరా బాబు అని అడిగితే, నేను కమ్మన హళ్ళి లో ఉందేమో చూడరా నాయనా అంటే తను ఒన్లీ ఇన్ సిటీస్ సార్ హళ్ళి పల్లి ల్లో ఉండదు సారు బీటీయమ్ కోరమంగళ అంటూ నాకు పాతిక కి.మి. దూరంలో ఉన్న ప్రదేశాలు చెప్పాడు. సరే ఎలాగైతేనేం రాత్రి వాళ్ళ వెబ్సైట్ స్టోర్ లొకేటర్ లో ఓ స్టోర్ అడ్రస్ పట్టుకుని నా అలవాటుకు విరుద్దంగా కాస్త ఉదయాన్నే నిద్ర లేచి పదిగంటలకు స్టోర్ కి వెళితే అది మూసేసి ఉంది. పదకొండు గంటలకు తెరుస్తారుట పోనీ డాక్యుమెంట్స్ ఏ కదా ఎక్కడైనా డ్రాప్ చేయచ్చా అంటే ఆ వీలు లేదు. కనీసం స్టోర్ ఫోన్ నంబరు వెబ్సైట్ లో లేదు అక్కడ టైమింగ్స్ కూడా లిస్ట్ చేసి చావలేదు. మళ్ళీ ఈసురోమంటూ కాళ్ళీడ్చుకుంటూ సాయంత్రం వెళ్ళాలి. ఈ సారి ఏ టీబ్రేకో అని మళ్ళీ మూసేస్తారేమో అలా చేస్తే తలుపులు పగలగొట్టి లోపలేసి వచ్చేస్తా అంత చిరాకు గా ఉంది వీళ్ల సర్వీసు మీద.

అవండీ నా సినిమా కష్టాలు ప్రీపెయిడ్ ఫోన్ గత జూన్ లో నేను తీసుకునేప్పుడే అన్ని ప్రూఫ్ లు ఇచ్చి కొన్న కొట్లో "అన్నీ జాగ్రత్త గా పంపించరా" అని పది సార్లు చెప్పినా ఉపయోగం లేక అవన్నీ పోగొట్టుకుని ఇలా మళ్ళీ కస్టమర్స్ ని టార్చర్ చేస్తున్న వీళ్ళనేం అనాలి. కాకపోతే ఆన్లైన్ రిచార్జ్ ఫెసిలిటీ, చవకగా దొరికే std & sms ప్లాన్లకు తోడు మళ్ళీ ఇపుడు అందరికీ కొత్త నంబరు ఎక్కడ చెప్తాం అనే బండెడు బద్దకం పుణ్యమా అని ఈ టార్చర్ అంతా అవలీలగా భరించేస్తున్నాను.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.