ఆదివారం 22 నవంబర్ 2009

బండీ రా.. పొగబండీ రా..

శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే రైలుబండి అని కూడా తెలియని వీడికి ఒక బ్లాగు.. దానిలో పోస్ట్ లు.. వాటిని మనం చదవడం..హుః" అని మోహన్ బాబు స్టైల్ ల్లో తిట్టేసుకోకండి మరి, చివరి ఫోటో చూస్తే అసలు ఈ టపా ఎందుకు మొదలెట్టానో మీకీపాటికి అర్ధమైపోయుంటుంది. అసలు టపా లోనికి వెళ్ళేముందు ఓ చిన్ని పిట్టకథ చెప్పాలి.

ఇది చాలా రోజుల క్రితం కథ, అప్పటికింకా వోల్వోబస్సులు మన ఆర్టీసీకి రాని రోజుల్లో.. బస్సుల్లో కూడా హైటెక్ హవా నడుస్తున్నరోజుల్లో ఓ శుభముహుర్తాన బెంగళూరు నుండి ఓ ప్రైవేట్ హైటెక్ బస్సు లో గుంటూరు బయల్దేరాను. రాత్రి పదకొండుగంటల ప్రాంతంలో భోజనమయ్యాక వాక్మన్ లో పాటలు వింటూ నిద్రకుపక్రమిస్తుండగా "థడ్‍డ్..డాం.." మంటూ పెద్ద శబ్దం అంతకన్నా పెద్ద కుదుపుతో బస్ ఆగిపోయింది. దదాపు కూర్చున్న ప్రతిఒక్కరికి మొహమో కాళ్ళకో ముందు సీట్ కి తగిలి చిన్న దెబ్బలు తగిలాయి. బస్ ముందు అద్దం పగిలింది కదిలే స్థితిలో ఉందో లేదో తెలీదు. భోజనాల దగ్గర మందుకొట్టి ఎక్కిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ కూడా ప్రయాణీకులతో పాటు నిద్రకుపక్రమిస్తూ యాక్సిడెంట్ చేయడం కాకుండా వెంటనే బస్ ని, ప్రయాణీకులని గాలికి ఒదిలేసి పరారయ్యారు. వీడు ఎదురుగా గుద్దినది ఒక అర్టీసీ బస్ ని ఆ బస్ స్టాఫ్ మా రూట్ లో వెళ్ళే ఇతర ఆర్టీసీ బస్సులను ఆపి మమ్మల్ని ఎక్కించి పంపించారు. నాదగ్గర ఉన్న అన్ని డబ్బులు ప్రైవేట్ బస్ వాడి టికెట్ కి పెట్టేయడం తో ఈ కొత్త బస్ లో టికెట్ కి పదిరూపాయలు తగ్గితే ఓ అపరిచితుడ్ని అడిగి టికెట్ తీసుకున్నాను అతను మా కొలీగ్ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడనుకోండి. ఈ సంఘటన నాకు రెండు పాఠాలు నేర్పింది. ఒకటి కేవలం గవర్నమెంట్ బస్సులు మాత్రమే ఎక్కడం. ఇంకోటి ప్రయాణం లో ఎప్పుడూ టికెట్ డబ్బుకి రెట్టింపు డబ్బు దగ్గర ఉంచుకోడం.

సరే ఇక విషయంలోనికి వస్తే ప్రస్తుతం ఓల్వో బస్సులు వచ్చి బస్ ప్రయాణాన్ని కాస్త సులభ తరం చేశాయనే చెప్పచ్చు. మొన్నా మధ్య బెంగళూరు నుండి హైదరాబాద్ కు వోల్వోలో ప్రయాణించాను, అది ఎపియస్ అర్టీసీ వారి బండి. దాని వాలకం చూడగానే కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. సాధారణంగా మిగిలిన బస్ ల మెయింటెనెన్స్ విషయం లో కాస్త అలక్ష్యం చూపించినా ఓ ఆర్నెల్లక్రితంవరకు వోల్వోలు బాగానే మెయింటెయిన్ చేసేవారు ఈ బస్ వాలకమే డబ్బా వాలకంగా కనిపించింది. సరే టిక్కెట్టుకొన్నాక తప్పదు కదా అనుకుని ఎక్కి కూర్చున్నాను మొదటి అసౌకర్యం సీట్ల మధ్య ఎడమ విషయంలో, మరీ సీట్ లు దగ్గర దగ్గరగా అరేంజ్ చేశాడు ఎంతగా అంటే ముందు వాడు ఫుల్ గా రిక్లైన్ అయితే వెనక సీట్లో ఎవరూ కూర్చోలేనంత. బెంగళూరు - గుంటూరు రూట్లో నాకు ఈ అసౌకర్యం ఎపుడూ కలగలేదు. సరే అని కూర్చుంటే రాత్రి రెండు గంటల సమయం లో పెద్ద కుదుపుతో బస్ ఆగిపోయింది. సెల్ఫ్ స్టార్టర్ పని చేయడం లేదు కాసేపు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ సెల్ఫ్ అందుకోవడం లేదు.

అలా బస్ ఆగిపోయి రెండునిముషాలు కూడా అవ్వలేదు అతి దగ్గరలో వెనక నుండి పెద్దగా రైలు కూత !! వెనక్కి తిరిగి చూస్తే.. నాకైతే ఒక్క క్షణం వెన్నుజలదరించింది, ఆ రైలు నా గుండెల్లోనే పరిగెట్టినట్లు అనిపించింది. రైల్వే ట్రాక్ కు మా బస్ కూమధ్య రెండు బస్సులు పట్టే అంత దూరం అంతే.. గేటు దాటిన వెంటనే మా బస్ ఆగిపోయింది కాబట్టి సరిపోయింది అదే ట్రాక్ మీద ఆగితే మా పరిస్థితి ఏంటి. బస్ లో పసిపిల్లలు, మహిళలు, వృద్దులు అన్ని రకాల వాళ్ళు మంచి నిద్ర లో ఉన్నారు అందర్ని లేపి సమయానికి బస్ నుండి దింపడం సాధ్యమయ్యే పనేనా.. బస్ ను ట్రాక్ పైనుండి నెట్టి ఇవతలికి తీసుకురావాలన్నా అంత తక్కువ వ్యవధిలో అయ్యేనా... అసలు ఇలాటి ఎమర్జన్సీ సమయం లో గేట్ పడకపోతే అతి తక్కువ సమయంలో రైలు ను ఆపటానికి సరైన ఎక్విప్ మెంట్ మరియూ భద్రతా వ్యవస్థ ఆగేట్ దగ్గర ఉందా ఇలాటి ప్రశ్నలు చుట్టుముట్టాయి. నాకు తెలిసి ఇది వరకు 5 నిముషాలకు ముందే గేట్ వేసేవాడు ఇపుడు బెటర్ ఎక్విప్మెంట్ ఉండటం వల్ల ఆ వ్యవధి తగ్గించాడా లేక కేవలం ట్రాఫిక్ ఒత్తిడి వలనా అనేది తెలియదు.

సరే బస్ ఆగింది సెల్ఫ్ స్టార్ట్ అవడం లేదు ఇక మార్గాంతరం బస్ తోయడమే అయి ఉంటుంది అనుకుంటూ బస్ దిగి ఏమైందా అని నిలబడి చూస్తున్నాను. అప్పటికే నాలాటి ఎంతూసియాస్ట్స్ కొందరు దిగి ఇంజన్ చుట్టు పక్కల మూగి మాట్లాడుకుంటున్నారు. ఇదే సందు అని సిగరెట్ వెలిగించి హడావిడిగా దమ్ము లాగేస్తున్నారెవరో..

"ఇందాక వాళ్ళ బస్ ఫెయిల్ అయిందని ఎవర్నో చాలామందిని ఎక్కించారు వాళ్ళని దించేయండోయ్ ఎవరో స్ట్రాంగ్ లెగ్ గాడున్నట్లున్నాడు " ఒకాయన జోక్.

"ఛ ఏపీయస్ ఆర్టీసీ వాళ్ళు ఇంత చెత్త బస్సులు నడుపుతున్నారా.. ఇంకోసారి వీళ్ళ బస్ అసలు ఎక్క కూడదు.." ఓ యూత్ అప్పటికప్పుడు తీసేసుకున్న రిజల్యూషన్.

"కుదుపులకి బ్యాటరీ వైర్లేవో లూజ్ అయి ఉంటాయి చూడండి మాష్టారు.." గుండు సూది నుండి అణుబాంబు వరకూ తనకు తెలియని విషయం లేదని ఫీల్ అయ్యే ఓ పెద్దాయన ఉచిత సలహా...

"అబ్బా బంగారం లాంటి నిద్ర పాడు చేశారు.. బయల్దేరిన దగ్గరనుండి డొక్కు సినిమా ’బిల్లా’ పెట్టి. ఇప్పుడేమో ఇలా హు.. అవును మాష్టారూ ఇంతకీ ఇది ఏ ఊరంటారు ??" ఇంకొకాయన భోగట్టా..

"......." చిరునవ్వుతో మౌనంగా వీళ్ళమాటలు వింటూ, మనసులో "ఇవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని బ్లాగ్ లో రాసేయాలి.." అనుకుంటూ నేనూ, ఇదీ అక్కడి సన్నివేశం.

సరే చివరికి ఇక వేరే దారి లేదు అని నిర్ణయించుకుని "రండి బాబు బస్ నెట్టండి.. అలా స్టార్ట్ చేయాల్సిందే.. లేకుంటే కదలదు.." అన్న డ్రైవర్ పిలుపందుకుని బస్ వెనక్కి చేరాం. అక్కడ అంతా దుమ్ము డీజిల్ ఎక్సాస్ట్ వలన పట్టిన చమురుమురికి చూడటానికే అసహ్యం గా ఉంది, కానీ మరి తప్పదు కదా అలానే దాని మీద చేతులు వేసి బస్ నెట్టడం మొదలు పెట్టాం. ఓ పది పదిహేనడుగులు నెట్టిన తర్వాత ఒక్కసారిగా ఇంజన్ స్టార్ట్ అయింది.. మరుక్షణం దట్టంగా నల్లని పొగ మేఘం మా అందరిని చుట్టుముట్టింది.. మేమంతా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల్లా.. నల్లగా తయారయ్యాం.. అవకాశం దొరికిన వెంటనే తప్పించుకున్నం కాని ఆ లోపే ఇదీ మా పరిస్థితి. ఆ తర్వాత కూడా బస్ ఇంజన్ రైజ్ చేసేకొద్దీ దాదాపు ఒక అయిదు నిముషాలపాటు అలా నల్లని పొగ వదులుతూనే ఉంది. (ఈ పక్కన ఫోటో గూగులమ్మ ఇచ్చింది, నేనెక్కిన బస్ ఇంతకు పది రెట్లు ఘోరంగా ఉంది)

వోల్వో వెబ్ సైట్ ని బట్టి చూస్తే వాళ్ళ బస్సులు అన్ని Euro 2/Euro 3 ఎమిషన్ క్లాసుకు చెందినవే అయి ఉంటాయి, వాటికి ఇంత ఘోరమైన నల్లని పొగ రాకూడదు. మరి మన వాళ్ళు కిరోసిన్ కల్తీ అయిన డీజిల్ తోనడుపుతున్నారో లేక బస్ కొనడమే కానీ బొత్తిగా మెయింటెనెన్స్ విషయం పట్టించుకోవడం లేదో అర్ధం కాలేదు. నాకైతే మెయింటెనెన్స్ లోపమే అనిపించింది, అలా అనుకోవడానికి బస్ వాలకం కూడా ఒక కారణం. కనీసం సరిగా బస్ కడిగే విషయం కూడా పట్టించుకోని వాళ్ళు క్రమం తప్పకుండా సర్వీస్ చేయించే అవకాశం నాకైతే కనిపించలేదు. అలా చేయిస్తే ఇలాటి సంధర్భం ఎదురు పడదు అని నా నమ్మకం. దాదాపు యాభై నుండి అరవై లక్షల వరకూ పోసి కొనే బస్సులు ఇలా గాలికి వదిలేస్తే వాటి లైఫ్ స్పాన్ తగ్గిపోవడం ఒక నష్టం. అదేకాక ఇందాక చెప్పినట్లు ఏ రైల్వే ట్రాక్ మధ్య లోనో ఆగిపోయి ఫాటల్ యాక్సిడెంట్ కి కారణం అయితే ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు మూల్యం చెల్లించినట్లు ? వీళ్ళు మారేదెన్నడు ??

సోమవారం 16 నవంబర్ 2009

టీవీ ఛానళ్ళూ - సృజనాత్మక తలలు !

ఏమిటీ చిత్రమైన శిర్షిక అని హాశ్చర్యపడిపోతున్నారా? ఏంలేదండీ creative heads ని ఆంధ్రీకరించాను అంతే. గత ఏడాది బ్లాగులు, వార్తలు, టీవీ కార్యక్రమాలని ఫాలో అయిన వారెవరికీ ’ఈటీవి’ కి పట్టిన చీడ సుమన్ మరియూ క్రియేటివ్‍హెడ్ ప్రభాకర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను (మీ మనోభావాలు ఏమాత్రం దెబ్బతిన్నా ఈ టపా చదవడం ఇంతటితో ఆపేయమని నా సలహా!! ఇహ ముందుకు చదవడం అనవసరం అని నా ఉద్దేశ్యం, ఆపై మీ ఇష్టం). ఆ చానల్ ను ఇంచుమించు నాశనం చేసేయబోయిన ఈ చీడ భారినుండి రామోజీ గారు ఆలశ్యంగానైనా మేలుకుని, కొడుకు అని కూడా చూడకుండా వీళ్ళ ఇద్దరి భారి నుండి జనాన్ని, ఈటీవీ ని ఏకకాలం లో రక్షించేశారు. ఇప్పుడు మాటీవి నీ అదే దారిలో నడిపించనున్నాడా అని అనిపిస్తున్న మరో క్రియేటివ్ హెడ్ ’ఓంకార్’ అని పిలవబడే ఓ వికార్ గురించే ఈ టపా.

"అసలెవరీ ఓంకార్ ఒకప్పుడు 90 లలో టివీ సీరియల్స్ లోనూ కొన్ని సినిమాలలోనూ తన వైవిధ్యమైన గొంతుతో వెటకారపు సంభాషణలతో కనిపించేవాడు అతనేనా?" అని అడుగుతున్నారా.. కానే కాదు. ఇతను మొదట జీతెలుగు చానల్ లో డ్యాన్స్ కాంపిటీషన్ ద్వారా కెరీర్ మొదలు పెట్టాడనుకుంటా ప్రస్తుతం మాటీవీ జీ రెండిటిలోనూ కొన్ని ప్రోగ్రాంస్ చేస్తున్నాడు. ఈ టీవీ అంతరంగాలకు సుమన్ కధ, మాటలు, పాటలు దర్శకత్వం అని పేరేసుకోడంతో మొదలుపెట్టినట్లు ప్రస్తుతం ఇతను కూడా కాన్సెప్ట్, రచన, నిర్మాత, దర్శకత్వం ఇలా నాలుగైదు విభాగాలకు పేరు వేసుకోవడం మొదలు పెట్టాడు. కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఇతనివి సీరియల్స్ కాదు కేవలం టాలెంట్ షోస్ కే పరిమితమైనట్లున్నాడు ప్రస్తుతం. ఇతని ఓవర్ యాక్షన్ చూడాలంటే ప్రఖ్యాత మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి గారు ఇతన్ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఈ కింది వీడియో చూడండి. ఇందులో బ్లాక్ డ్రస్ లో ఏంకరింగ్ చేస్తూ కనిపించే వ్యక్తే ఓంకార్.



ఇతను మొదట్లో జీటీవీ లో ఆట పేరుతో ఒక డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలు పెట్టారు, పిల్లలతో సైతం చిత్రవేషధారణ కుప్పిగంతులు వేయించేవాడు. తర్వాత ఇంకేదో చిత్రమైన పిల్లల ప్రోగ్రాం ఒకటి చేశాడు అందులో కూడా ఎలిమినేషన్ పేరుతో పిల్లల్ని ఏడిపించి నానా యాగీ చేసేవాడు. ఇక ప్రస్తుతం మాటీవీ లో ఛాలెంజ్ పేరుతో ఓ డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తున్నాడు, ఇంత కాలం ఇలాటి ప్రోగ్రాంలో వీళ్ళ వింత వేషధారణ, డ్యాన్స్ పేరుతో చేసే వికృత చేష్టలు, న్యాయనిర్ణేతల ఓవర్ యాక్షన్ మాత్రమే భరించాల్సి వచ్చేది, ఇపుడు ఛాలెంజ్ పేరుతో డ్యాన్సర్లు వాళ్లల్లో వాళ్ళే మరీ చెత్తకుండీల దగ్గర కుక్కల కన్నా ఘోరంగా కొట్టుకుంటున్నారు. పోలిక కాస్త ఘాటుగా ఉన్నా ఒకటి రెండు ఎపిసోడ్స్ చూసిన నాకు అలానే అనిపించింది. అది చాలదన్నట్లు ఈ కొట్లాటనే ప్రోమోస్ గా చూపిస్తుంటే ఏం చేస్తాం.

ఇతని మరో ప్రోగ్రాం మాటివి లో అదృష్టం, అమెరికా లోని డీల్ నో డీల్ ప్రోగ్రాం కి కాసిని మార్పులు చేసి ప్రసారం చేసే ఈ ప్రోగ్రాం లో ఇతని ఓవర్ యాక్షన్ చూసి తీరాల్సిందే.. మొదట్లో కాస్త సెలబ్రిటీస్ ని పిలిస్తే వాళ్ళు ఇతన్ని ఆడుకుని మొత్తం ప్రోగ్రాం ని హాస్యభరితం చేసారు, దానితో ఇలా లాభం లేదు అని పిల్లలను అతని మిగిలిన ప్రోగ్రాంస్ లో పార్టిసిపెంట్స్ ని పిలిచి వాళ్ళతో ఆడుకోడం మొదలు పెట్టాడు. అలా అని ఇతనిమీద అన్నీ కంప్లైంట్స్ లేవు నాకు, ఉదాహరణకి ఛాలెంజ్ పేరుతో వస్తున్న ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ అప్పొనెంట్ కోసం పాట సెలెక్ట్ చేసి ఇవ్వడం. ఇద్దరిమధ్య ఒకే పాటకి పోటీ పెట్టడం లాంటి మంచి ఐడియాలు కూడ ఉన్నాయి. చేతిలో అవకాశం విద్య రెండూ ఉన్నపుడు కాస్త తెలివిగా వ్యవహరించి సక్రమంగా ఉపయోగిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం.

టీవీ అంటే గుర్తొచ్చింది. జూడాలు గురించి విన్నారా... వినే ఉంటారు లెండి ’జూనియర్‍డాక్టర్’ అన్న పదానికి వచ్చిన తిప్పలు ఇవి. నిన్న వార్తలు చూస్తుంటే లైన్ కి మూడు నాలుగు సార్లు జూడాలు అని చదువుతుంటే వినడానికి చాలా అసహనంగా అనిపించింది. కంపోజర్ కన్వీనియన్స్ కోసం అలా జూ.డా లు అని రాసిస్తే దాన్ని యధాతధంగా చదివేస్తున్నాడా లేక టీవీ వాళ్ళు కొత్త పదాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే విషయం అర్ధంకావడం లేదు. వార్తల్లో ఈమధ్య గమనించిన మరో అంశం వార్తలు వేగంగా చదవడం. ప్రయత్న పూర్వకంగా అలా హడావిడిగా చదివేయడం ప్రత్యక్షంగా తెలుస్తూంటే విసుగొస్తుంది. క్వాలిటీ కన్నా క్వాంటిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వచ్చిన తిప్పలు కావచ్చేమో.

మంగళవారం 13 అక్టోబర్ 2009

Wake Up SID !!

నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్ అని తెలిస్తే కానీ చూడను. అలాంటిది కాస్త మంచి టాక్ వచ్చిందని తెలిసి ఈ వారాంతం wake up sid చూడటం తటస్థించింది. నేను చాలా సాధారణ ప్రేక్షకుడిని, సినిమా టెక్నికాలిటీస్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. సినిమా అంటే బోలెడంత ఇష్టం మాత్రం నా సొంతం. స్క్రిప్ట్ తో కట్టి పడేసే సినిమాలు, థియేటర్ బయటకు వచ్చాక కూడా సినిమా గురించి ఆలోచించేలా చేసే థ్రిల్లర్స్ అంటే కూడా ప్రత్యేకమైన ఇష్టం ఉంది. సినిమా లో ఇంటర్వెల్ కార్డ్ పడగానే "హమ్మయ్య ఇంటర్వెల్ వచ్చింది రా బాబు.." అని కాకుండా "అరె అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా..." అనీ, శుభం కార్డ్ పడగానే "అపుడే అయిపోయిందా.." అనీ అనిపిస్తే నా దృష్టి లో ఆ దర్శకుడు విజయం సాధించినట్లే...



ఈ విషయం లో wake up Sid దర్శకుడు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా నిస్సందేహంగా ఓ క్లీన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం ప్రొమో లో చెప్పినట్లు గా it is story about a boy who refused to grow up. ప్రతి ఒక్కరి జీవితం లో ఈ సిద్ ఉంటాడు.. లేదంటే కనీసం మీరు దగ్గరగా చూసి ఉంటారు, ఇతను చేసే చేష్టలన్నీ ఎపుడో మనం చేసినట్లు గా అనిపించక మానవు. ఇక సినిమా లో మిగతా పాత్రలన్నీ మెలో డ్రామా జోలికి పోకుండా చాలా సహజంగా ప్రవర్తించాయి. సోదాహరణం గా వివరించాలని ఉంది కానీ చూసినపుడు ఆ ఫీల్ మిస్ అవుతారు అని నేనా పనికి పూనుకోవడం లేదు. సినిమా కాస్త పాత బడ్డాక మళ్ళీ రాయడానికి ప్రయత్నిస్తాను.

ఈ సినిమా లో తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం ఉంది అలాగని అనవసర సెంటిమెంట్ సీన్స్ కానీ భారీ డైలాగులు కానీ లేవు. ఈ సినిమాలో కాలేజీ, స్నేహితులూ ఉన్నారు కానీ హాస్యం పేరు తో ఉపాధ్యాయులను అగౌరవ పరిచే సన్నివేశాలు లేవు. సినిమాలో అంతర్లీనంగా సునిశితమైన హాస్యం ఉంది కానీ హాస్యానికే ప్రత్యేకించి వేరే ట్రాక్ లేదు. ఇది సిద్ ప్రేమ కథ కూడా కానీ ప్రేక్షకుడి బలహీనతలు, ఉద్రేకాలతో ఆడుకునే సన్నివేశాలు లేవు. ఈ సినిమా జీవితానికి ఓ లక్ష్యం ఉండాలి అని చెప్తుంది అలా అని ఇందులో సినిమా కష్టాలు, భారీ సందేశాలు లేవు. సినిమా అంతా చాలా సహజంగా స్మూత్ గా సాగిపోతుంది.

సిద్ గా రణ్బీర్ చక్కగా సరిపోయాడు చైల్డిష్ లుక్ తో అలరించాడు. హీరోయిన్ కొంకణ ని మొదట చూసి ఇంతకంటే గ్లామరస్ మొహాలు కనిపించలేదా ఈ దర్శకుడికి అనిపించింది కానీ కాసేపటికి తనలో ఏదో అట్రాక్షన్ ఉంది అనిపించింది, సినిమా ముందుకు నడిచి తను కేవలం గ్లామర్ కు పరిమితమైన పాత్ర కాదని తెలిసే కొద్దీ తను మనల్ని మరింత ఆకట్టుకుంటుంది (మొహానికి అలవాటు పడటం కూడా ఒక కారణమేమో:-). సిద్ స్నేహితురాలు లక్ష్మి గా చేసిన అమ్మాయి కూడా బాగుంది. సంగీతం విషయానికి వస్తే విన్నపుడు పాటలలో నాకు ’ఇక్‍తార..’ అన్న పాట తప్ప పెద్దగా నచ్చ లేదు ’లైఫ్ ఈజ్ క్రేజీ..’, టైటిల్ సాంగ్ కూడా పర్లేదు కానీ పాటలు అన్నీ శంకర్ ఎహ్‍సాన్ లాయ్ ల శైలి లోనే ఉంటూ వాళ్ళ ఇతర సినిమా పాటల్ని గుర్తు చేస్తాయి, సినిమా మూడ్ కి మాత్రం సంగీతం సరిపోయింది అనిపించింది.

సినిమా అంటే భారీ తారాగణం, గ్రాఫిక్ వర్క్, టెక్నికల్ బ్రిలియన్స్, మంచి సందేశం, ఊహించని మలుపులు, థ్రిల్స్ ఇలా ఏదో పెద్ద ప్రత్యేకత ఉండాలి అని కాక, సినిమా అంటే రెండున్నర గంటలు కదలకుండా కూర్చోపెట్టి ఆకట్టుకునే విధంగా ఆహ్లాదభరితమైన కథ చెప్పడం అని మీరు నమ్మే వారైతే ధైర్యం గా ఈ సినిమా చూడవచ్చు. ఒకటి రెండు చోట్ల వచ్చే కొన్ని అభ్యంతరకరమైన సంభాషణల వలన ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ఇచ్చి ఉండచ్చు. కానీ సినిమా మంచి ఎంటర్టైనర్, సిద్ అందరికీ నచ్చేస్తాడు. అబ్బాయిలూ మనలో మన మాట, ఈ సినిమా చూశాక మీ ఇష్ట సఖి మీతో సిద్/రణ్‍బీర్ ని "హీ ఈస్ సో క్యూట్... " అంటూ తెగ పొగిడేస్తుంటే కుళ్ళుకోకుండా నిమ్మళంగా ఉండటానికి ఇప్పటి నుండీ సిద్దంగా ఉండండేం:-) పో పోవోయ్ మేం బాపూ గారి పెళ్ళిపుస్తకం చూశాం కుళ్ళుకున్నా కూడా "అసూయ ఘాటైన ప్రేమకి థర్మామీటర్...." అని కవర్ చేయగలం అంటారా సరే మీ ఇష్టం.

శుక్రవారం 9 అక్టోబర్ 2009

ఐస్..పుల్లైస్..పాలైస్..

వేసవి శలవల్లో మండే ఎండలలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం లోనో లేదా మూడు గంటల సమయం లోనో చల్లని ఈ పుల్ల ఐస్ చప్పరిస్తుంటే ఆ ఆనందం మాటలలో చెప్పతరమా చెప్పండి. అసలు ఈ రుచి ఎరుగని జన్మ ఒక జన్మేనా అనిపిస్తుంది నిజంగా. తర్వాత తర్వాత ఐస్క్రీములు వచ్చి వీటి అమ్మకానికి గండి కొట్టాయ్ కానీ నా చిన్నతనం లో ఇవే రారాజులు. వీధిలో కేక వినబడగానే ఏ పని చేస్తున్నా వెంటనే అలర్ట్ అయిపోయే వాడిని. ఒకో రోజు కాస్త పెద్ద వాళ్ళు మాత్రమే తీసుకు రాగలిగే రెండు చక్రాల చిన్న తోపుడు బండి లో తెచ్చేవాడు. ఆ బండి భలే ఉండేది చెక్కతో చేసిన పెద్ద పెట్టె, దాని లోపల థర్మోకోల్ అట్టలూ, పింక్ లేదా ఎర్రని ప్లాస్టిక్ బబుల్ రాప్‍తో బాగా ఇన్సులేట్ చేసి వాటి సాయం తోనే పెట్టెని అరలు గా విభజించి ఆ అరల్లో రక రకాల ఐస్ఫ్రూట్ లు నింపి తెచ్చే వాడు. అంత పెద్ద పెట్టెకూ పైన ఒక వృత్తాకారపు చిన్న మూత మాత్రమే ఉండేది. ఆ మూత తీసి ప్లాస్టిక్ కాగితాలు అలా పక్కకి జరిపి కేవలం రెండు మూడు చేతులు మాత్రమే పట్టే ఖాళీ లో చేయిపెట్టి, వాడు డబ్బా లోకి చూడకుండ్ blindfold ఆడుతూ, మనం అడిగిన రకాన్నిబట్టి చేతిని ఒకో వైపు తిప్పి మనకి కావాల్సిన ఐస్ఫ్రూట్ బయటకి తీసి పట్టుకోగానే ఇక మన ఆనందానికి అవధులు ఉండవు. ఇదంతా ఒక ఎత్తైతే డబ్బా పై రంగు రంగుల ఆకర్షణీయమైన బొమ్మలూ కొన్ని బండ్లకు ఉండే చిన్న సైజ్ గంట ఒకటీ మరో ప్రత్యేకమైన ఆకర్షణ.

ఈ బండి దగ్గర కొనాలంటే మనం రోడ్డు మీదకి వెళ్ళాలి కదా అలా కాకుండా దాదాపు మన అంత వయసే ఉన్న ఓ చిన్న కుర్రాడు లోపల అంతా థర్మాకోల్ అట్టలతో ప్లాస్టిక్ కవర్ తో ఇన్సులేట్ చేసిన బ్రిటానియా బిస్కట్ డబ్బా లో పెట్టి దానికి ఒక తాడు కట్టుకుని భుజాన మోసుకుంటూ అమ్మటానికి తెచ్చే వాడు. వాడైతే చక్కగా మన గుమ్మం ముందుకే వచ్చిఇస్తాడు. ఎఱ్ఱ ఐస్, తెల్లని పాలైస్, ద్రాక్షా ఐస్, కొబ్బరి ఐస్, సేమ్యా ఐస్, ఇలాచీ ఐస్, మ్యాంగో ఐస్ ఇలా ఒకో సమ్మర్ కి ఒకో కొత్త రకం తెచ్చేవాడు. ఎన్ని రకాలు ఉన్నా గోల్డ్ స్పాట్(ఇది అప్పట్లో దొరికే కోలా, ఈ రుచి ఇప్పుడు దొరికే వాటిలో ఎక్కడా నాకు తగల్లేదు, కాస్త ఆరెంజ్ రుచి అనుకోవచ్చు, ఇప్పటి పిల్లలికి తెలియాలి అంటే మిరిండా రుచి అని చెప్పచ్చేమో!) లాంటి రుచితో వచ్చే ఎఱ్ఱ ఐస్ మాత్రం నా ఫేవరెట్, దాని తర్వాత ఇష్టమైనది పాలైస్, ఎప్పుడైనా వేరే ఫ్లేవర్ ప్రయత్నించాలి అంటే గోల్డ్ స్పాట్ ఐస్ మిస్ అవుతానే అని తెగ ఫీల్ అయ్యే వాడ్ని నా బాధ చూడ లేక అమ్మ "సరే రెండూ కొనుక్కో రా.." అని పర్మిషన్ ఇచ్చేది ఒకో సారి :-)

ఎఱ్ఱని గోల్డ్ స్పాట్ ఐస్ సాదా గా ఉండేది, ఇలాటి సాదా ఐస్ ల లోనే తర్వాత తర్వాత ద్రాక్ష, ఆరెంజ్, మామిడి, యాలుకలు ఇలాటి రుచులు తెచ్చేవాడు ఇవన్ని రుచి వేరైనా ఆకారం ఒకే రకంగా దీర్ఘ చతురస్రాకారపు క్యూబ్ ల్లా ఉండేవి పైన బొమ్మ లో చూపినట్లు. వీటికి భిన్నంగా సన్నగా, షడ్బుజాకారం లో సిలిండర్ లా ఉండి తెల్లగా మెరిసి పోయే పాలైస్ రుచి మాత్రం అద్భుతం గా ఉండేది. అప్పట్లో ఇది ఖరీదు ఎక్కువ కూడా, మాములు ఐస్ అర్ధరూపాయి ఉంటే ఇది రూపాయి ఉండేది. కాని రుచి మాత్రం యమా ఉండేది లెండి ఆ ఆకారం కూడా ఇంక మళ్ళీ దేనికి ఉపయోగించలేదు. కొన్నాళ్ళ తర్వాత మాములు బార్ షేప్ లో కూడా పాలైస్ తెచ్చే వాడు. దీనికే ఒక చివర కొబ్బరి కోరు అద్దితే కొబ్బరి ఐస్, సేమ్యాలు అద్దితే సేమ్యా ఐస్, యాలుకల పొడి అద్దితే ఇలాచి ఐస్. ఇలా అద్దడం కాకుండా ఒకోసారి పొడవుగా కోసిన కొబ్బరి ముక్కలు రెండు పెట్టి కూడా చేసే వాడు కొబ్బరి ఐస్, అలాగే ద్రాక్ష రుచి ఉన్న ఐస్ లో చివర రెండు ద్రాక్షాలు వచ్చేలా చేసే వాడు. సేమ్యా ఐస్ లో కూడా చివర అద్దడం కాకుండా ఐస్ అంతా నిండుగా సేమ్యాలు నింపి చేసే వాడు.

నాకు ఈ సేమ్యా ఐస్ ఎలా చేస్తారో ఎప్పటికీ అర్ధమయ్యేది కాదు. నీళ్ళలో సేమ్యా వేయగానే నీళ్ళు ఐస్ లా గడ్డ కట్టే లోపే సేమ్యా అడుగుకి వెళ్ళి పోతుంది కదా ఐస్ అంతా పరుచుకుని ఉండేలా సేమ్యాలతో ఎలా తయారు చేస్తాడా అని తెగ ఆలోచించే వాడ్ని, బహుశా కాస్త గడ్డ కట్టడం మొదలయ్యాక కలుపుతాడేమో లే అని సరిపెట్టేసుకున్నా... తర్వాత కొన్ని రోజులకి ప్యాకెట్ ఐస్ బాగా ఫేమస్ అయింది. ఈ పక్కన చూపించినట్లు పొడవాటి సన్నని ప్లాస్టిక్ ప్యాకెట్ లో రక రకాల రుచులు గల నీరు నింపి ఫ్రీజ్ చేసి తెచ్చే వాడు మనకి ఇచ్చేటప్పుడు దానికి ఒక మూల బ్లేడ్ తో కోసి అందించే వాడు ఎందుకనో మా ఇంట్లో ఈ ఐస్ కొనుక్కోడానికి ఒప్పుకునే వారు కాదు. సో ఇది మనం డబ్బులు దాచుకుని సీక్రెట్ గా బడిదగ్గర ఇంటర్బెల్ లో మత్రమే కొనుక్కోవాలనమాట. కాని ఆ అవకాశం మనకొచ్చింది బహుస్వల్పం మొత్తం మీద దీని రుచి పెద్దగా చూడకుండానే నేను స్కూల్ దాటేశాను. ఆ తర్వాత ఇవన్నీ మోటైపోయి చిన్న చిన్న పేపర్ కప్పుల్లో నాజూకుగా చెక్క స్పూన్ లతో తినే ఐస్క్రీములు ఫేమస్ అయిపోయాయి. క్వాలిటీ ఈ ఐస్క్రీమ్ మార్కెట్టును దీర్ఘకాలం ఏలింది అనుకుంటా ఆ తర్వాత అరుణ్ వచ్చేది. అప్పట్లో వీటిని మార్కెట్ చేయడానికి మాములు కప్ లు కాకుండా వాలీ బాల్ ఆకారం లో చేసిన కప్ లు కూడా వచ్చేవి క్వాలిటీ వాడివి, కానీ ఎందుకో నాకు ఐస్ నచ్చినంతగా ఐస్క్రీమ్ లు నచ్చక పెద్దగా ఫాలో అవలేదు... ఏదేమైనా పుల్లైస్ కి ఉండే రుచి ఈ ఐస్క్రీములకి ఎక్కడిది చెప్పండి.

ఇలా నేను కమ్మటి ఊహలలో ఉండగా హఠాత్తుగా వాస్తవం కరిచింది... ఈ ఐస్క్రీముల పుణ్యమో ఏమో కానీ అలాంటి ఐస్ అమ్మే చిన్న పిల్లలు తర్వాత కాలం లో ఎప్పుడూ కనిపించ లేదు, బహుశా ఇప్పుడు అసలు రావట్లేదేమో మరి. వాడు తెచ్చే ఐస్ రుచి గా ఉన్నా, వాడ్ని చూస్తే జాలేసేది. ఇప్పుడు తలచుకుంటే మరీ పాపం అనిపిస్తుంది. వాడిది మనలాగే వేసవి శలవలను ఆనందంగా ఆడుకుంటూ గడప వలసిన బాల్యం అన్న స్పృహ నాకు అప్పట్లో తక్కువే ఉండేది కానీ. ఐస్ లు నింపిన బరువైన బ్రిటానియా డబ్బాని భుజాన మోస్తూ, నిండు వేసవి మండుటెండ లో దదాపు కరిగిపోయిన తారు రోడ్, అరిగిపోయి చిల్లులు పడ్డ స్లిప్పర్స్ లో నుండి వాడి లేత అరికాళ్ళపై తన ప్రతాపాన్ని చూపిస్తుంటే, పరుగో నడకో అర్దం కాని నడక తో వాడు ఇంటింటికీ తిరిగే వాడు. పాపం భుజాన అన్ని ఐస్ఫ్రూట్ లు ఉన్నా దాహం తీర్చుకోవాలంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఇచ్చే గుక్కెడు మంచినీళ్ళే గతయ్యేవి. ఒకోసారి నాతో పాటు మా వీధిబడి లో చదివే పిల్లలు కూడా ఇలా అమ్మడానికి వచ్చేవారు. వాళ్ళ అవస్థలు తలచుకుంటే ఈ పుల్లైస్ లు ఇపుడు తక్కువగా దొరకడమే మంచిదైందేమో అనిపిస్తుంటుంది.

నేనెవరంటే !!!...

నా ఫోటో
వేణూ శ్రీకాంత్
బెంగళూరు, కర్ణాటక, India
ఆశావాదం, కాస్త భావుకత ?(ఈ మధ్య కొన్ని తెలుగు బ్లాగులు చదివాక నా భావుకత నాకే ప్రశ్నార్ధకం గా కనిపిస్తుంది), కాసిన్ని పగటికలలు, దేవుడి పై నమ్మకం, తెలుగు పై అపారమైన మక్కువ కలగలిసిన ఒక సగటు మనిషిని.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి