మంగళవారం, జనవరి 19, 2021

కంబాలపల్లి కథలు - మెయిల్

ఈ పోస్ట్ ని నా స్వరంలో ఈ యూట్యూబ్ వీడియోగా ఇక్కడ వినవచ్చు. For those of you who can't read Telugu but can understand. You can listen to this post in my voice on YouTube at this link

ఆహా లో స్ట్రీమ్ అవుతున్న కంబాలపల్లి కథలు వెబ్ సీరీస్ లోని మొదటి అంకం 1:56 నిముషాల నిడివి గల "మెయిల్" బావుంది. అక్కడక్కడా కథా సౌలభ్యం కోసం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ సాధ్యమైనంత సహజమైన వాతావరణంలో సహజ సంభాషణలతో దర్శకుడు ఉదయ్ గుర్రాల చక్కగా తీశాడీ సినిమాని. 

ఒకప్పుడు గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలంటే ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే ఉండేవి. అభిరుచి ఉన్న ఏ కొద్దిమందో మాత్రమే ఆదరించినా స్లో నెరేషన్ కీ, అవసరంలేని డీటేయిలింగ్ కీ పెట్టింది పేరైన ఇవి కమర్షియల్ సినిమాల్లో జోకులు వేస్కోడానికి మాత్రమే ఎక్కువ ఉపయోగపడేవి. ఐతే ఇప్పుడు న్యూ ఏజ్ ఆర్ట్ ఫిల్మ్స్ పంథా కాస్త మారింది. గ్రామీణ నేపథ్యంతో కూడా చక్కని ఆకట్టుకునే కథా కథనాలు రాసుకుని కమర్షియల్ సినిమాలకు ధీటుగా తెరకెక్కిస్తున్నారు ప్రేక్షకులు కూడా అలానే ఆదరిస్తున్నారు. అలా ఒకప్పటి మాల్గుడిడేస్ ను గుర్తు చేసేవే ఈ కంబాలపల్లి కథలు. 

2005 లో అప్పుడప్పుడే గ్రామాలకు సైతం కంప్యూటర్స్ విస్తరిస్తున్న సమయంలో జరిగిన కథ ఇది. తన ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ చూసుకోడానికి ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళిన రవి(హర్షిత్) మొదటి సారి కంప్యూటర్ ని చూసి ప్రేమలో పడిపోతాడు. డిగ్రీ కంప్యూటర్స్ లో చేయాలని సొంతంగా ఓ కంప్యూటర్ కొనుక్కోవాలని అనుకున్నా తన ఆర్ధిక పరిస్థితి సహకరించక బి.కామ్. లో చేరతాడు. అక్కడ తన క్లాస్మేట్ రోజా(గౌరీప్రియ) తో ప్రేమలో పడతాడు. 

అలాంటి సమయంలో ఆ ఊర్లో ఫోటో స్టూడియో నడుపుకుంటున్న హైబత్(ప్రియదర్శి) ఆ రంగంలో తనకి పోటీ ఎక్కువైందని. స్టూడియో స్థానంలో ఓ చిన్న కంప్యూటర్ తీస్కొచ్చి గేమింగ్ సెంటర్ విత్ ఇంటర్నెట్ అండ్ ప్రింటౌట్ ఫేసిలిటీ ఏర్పాటు చేస్తాడు. ఇది చూసిన రవి అప్పటివరకు తను వెంటబడుతున్న రోజాని కూడా పట్టించుకోకుండా వదిలేసి కంప్యూటర్ నేర్చుకుంటానంటూ హైబత్ వెంటబడడం మొదలు పెడతాడు. 

తనకు కాంపిటీషన్ గా ఊర్లో మరో నెట్ సెంటర్ మొదలు పెట్టనంటేనే నేర్పుతా అంటూ మరికొన్ని షరతులతో హైబత్ రవికి నేర్పడానికి ఒప్పుకుంటాడు. ఫస్ట్ స్టెప్ గా ఒక ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసిస్తాడు రవికి. ఇక దానికి ఎప్పుడు మెయిల్ వస్తుందా అని రోజు చెక్ చేసుకుంటూ ఉంటాడు రవి. ఓ రోజు ఆ ఈమెయిల్ ఐడికి లాటరిలో రెండు కోట్లు గెలిచినట్లుగా మెయిల్ వస్తుంది. ఆ ఈ-మెయిల్ రవి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అనేదే మిగిలిన కథ.

ఈ సినిమా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింభించింది. అందమైన ప్రకృతి అమాయకత్వం స్వచ్చత నిండిన మనుషులు అడుగడుగున కనిపిస్తు సహజమైన సంభాషణలు పలుకుతూ ఆకట్టుకుంటారు. అచ్చంగా ఊరిలో తిరుగుతూ ఒకడి కథ మనం చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అన్ని సంధర్బాల్లో మనకి తోడుండే ఓ స్నేహితుడిని ఎలా చూపించారో అలాగే గర్ల్ బెస్టీ తో ఉండే అందమైన స్నేహాన్ని కూడా అంతే చక్కగా చూపించారు.  

ఇందులోని హాస్యం అంతా కూడా సునిశితమైన హాస్యం సటిల్ హ్యూమర్ అంటారు చూడండి అలాంటిది. అంతా పాత్రల అమాయకత్వం తెలివి తక్కువ తనంలోనుంచే పుడుతుంది. ఏ పాత్రా కావాలని ప్రయత్నించి నవ్వించడం కానీ గట్టిగా నవ్వడమో విరగబడడమో హాస్యం కోసం తిట్టడమో కొట్టడమో లాంటివి ఏవీ కనిపించవు. నటులంతా సహజంగా ప్రవర్తిస్తూనే కావలసినంత నవ్వు పుట్టించారు. ఇక కంప్యూటర్ రూం లోకి చెప్పులు విప్పి వెళ్ళడం లాంటి సన్నివేశాలు చూసినపుడు ప్రతి ఒక్కరికీ సిటీస్ లో సైతం ఈ పద్దతి పాటించడం గుర్తు రాక మానదు. కంప్యూటర్ చుట్టుపక్కల రాసుకున్న సన్నివేశాలన్నీ నాస్టాల్జిక్ అనిపిస్తాయి. 

ప్రియదర్శి ఆల్రెడీ ప్రూవెన్ నటుడు తనకి ఇలాంటి పాత్రలు కేక్ వాక్ లాంటివి. హీరోగా హర్షిత్ చాలా చక్కగా సరిపోయాడు తన పాత్రకి. అలాగే అందం అమాయకత్వం ముగ్ధత్వం కాస్త గడుసుదనం నిండిన హీరోయిన్ పాత్రలో గౌరీ ప్రియ కూడా మెప్పించేసింది. స్నేహితుడు సుబ్బుగా చేసిన మణి, శివన్న గా చేసిన రవీందర్ బొమ్మకంటి ఆఖరికి కంప్యూటర్ కి వైరస్ వస్తే రిపేర్ చేయడానికి వచ్చిన మెకానిక్(ఒకే సీన్) కూడా గుర్తుండి పోతాడు. 

స్వప్నా మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకోవాల్సిన పనేలేదు చక్కగా ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, నేపధ్య సంగీతం కూడా సినిమా మూడ్ కి తగినట్లుగా సరిపోయాయి. ఇక దర్శకుడు రాసుకున్న కథనం కాస్త నిడివి ఎక్కువ ఐనట్లు అనిపించింది, ఒక పదిహేను నిముషాలు తగ్గించి ఉంటే బావుండేది. ఐతే మొదట్లో కాస్త నిదానంగా అనిపించినా రవి సమస్యకి మనని కూడా కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు. అది జరిగాక లెంత్ విషయం మర్చిపోతాం ఇక ఊహించని ఆసక్తికరమైన క్లైమాక్స్ తో హాయిగా నవ్వుకుంటూ మంచి సినిమాని చూశాం అనుకునేలా చేశాడు.      

కాస్త నిడివి ఎక్కువయినట్లు అనిపించినా కానీ వైవిధ్యమైన గ్రామీణ నేపథ్యంతో ఉన్న కథలను ఇష్టపడే వారు మిస్సవకుండా చూడవలసిన సినిమా ’మెయిల్’. ఈ సినిమా టీజర్ ఇక్కడ, ట్రైలర్ ఇక్కడ, చెప్పులేసుకుని లోపలకి రావడం వల్ల కంప్యూటర్ కి వైరస్ వచ్చిందంటూ హడావిడి చేసే ఓ సరదా సన్నివేశం ఇక్కడ చూడవచ్చు. ఆసక్తిగా అనిపిస్తే కనుక ఆహా లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని మిస్ అవకండి. 

2 కామెంట్‌లు:

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.