గురువారం, మార్చి 07, 2013

బలరామ్మూర్తి అంకుల్


కొన్ని అనుబంధాలు ఎలా ఎందుకు ఏర్పడతాయో అస్సలు చెప్పలేం ఏ జన్మలోని ఋణానుబంధమో ఏ బంధుత్వం లేకపోయినా ఈ జన్మలో కూడా స్నేహం రూపంలో కొనసాగుతూ ఉంటాయి అనిపిస్తుంటుంది. అలాంటి అనుబంధమే మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు బలరామ్మూర్తి అంకుల్ ది మాదీనూ. మా ఈ అనుబంధం వయసు దదాపు పాతికేళ్ళు. మొదట్లో అమ్మవాళ్ళ ఆఫీస్ కొలీగ్ గా పరిచయమై మెల్లగా మా ఇంట్లో చిన్నా పెద్దా అందరికీ కూడా ఆత్మీయ మిత్రులై ఒక పెద్దదిక్కుగా క్రమం తప్పకుండా మా అందరి మంచి చెడ్డలు వాకబు చేస్తూ  నా స్కూల్ డేస్ నుండి కూడా నేను సాధించిన ప్రతి చిన్న విజయానికి అభినందిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మా అందరి జీవితాల్లో తనో ముఖ్యపాత్ర పోషించి స్నేహానికి నిర్వచనంలా మెలగిన మనిషి.

అమ్మ చనిపోయాక మూడేళ్ళ క్రితం నాన్నగారి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నప్పటినుండి ఐతే “మీ నాన్నగారికి దగ్గరే ఉండి కాసిని కబుర్లు చెప్తూ ఉంటే హాపీగా ఉండి తొందరగా కోలుకుంటారు వేణూ.. ఆయనకి అలా ఇష్టం” అని అంటూ క్రమం తప్పకుండా ప్రతి వారం ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళేవారు. నాన్నగారు త్వరగా కోలుకోవడంలో ఆయన పాత్రకూడా చాలా ఉంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకసారి కనిపించి క్షేమ సమాచారాలు కనుక్కునే పలకరింపుకు ఇంత శక్తి ఉంటుందా అని ఆశ్చర్యపోయేవాడ్ని. ఇంట్లో విషయాలు ఎక్స్చేంజ్ చేస్కుంటూ.. రాజకీయాలు, ఆఫీస్ కబుర్లు పంచుకుంటూ ఉండే వాళ్ళ కబుర్లు వింటూ ఉండడం నాకు భలే ఇష్టం దదాపు గత ఏడాదిగా నేనూ ఇక్కడే ఉండడంతో మరింత దగ్గరగా చూస్తూ గమనించే అవకాశం కలగడమే కాక నాకు కూడా బాగా అలవాటయ్యారు.

మా అంకుల్ ఆహార్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఎప్పుడూ ఇస్త్రీ మడత నలగని లైట్ కలర్ డ్రస్సులు అపుడపుడు డార్క్ కలర్ పాంట్ వేస్కుంటారు కానీ షర్ట్ మాత్రం ఎపుడూ వైట్ / క్రీం, జోబులో ఒక పెన్ను ఖచ్చితంగా ఉండేది, గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాలు, చక్కగా దువ్విన క్రాఫ్ తో చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు, ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా మాసిన గడ్డంతో చూడలేదు ఆయనను. గేర్ బళ్ళు నడపడం నావల్ల కాదయ్యా అంటూ ఒకప్పుడు లూనా మీదా, తర్వాత స్కూటీ మీద తిరిగేవారు. ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటారో మాట్లాడితే అంత పసిపిల్లాడిలా సరదాగా మనతో కలిసిపోతారు జోకులేస్తూ నవ్విస్తూ తను చెప్పే కబుర్లు వింటూంటే ఎన్ని గంటలైనా తెలిసేది కాదు. ఎప్పుడైనా రాజకీయ నాయకుల మీద కావాలని తెచ్చిపెట్టుకున్న కోపం తప్ప తను పరుషంగా మాట్లాడగా కూడా నేను ఇప్పటివరకూ చూడలేదు.

ఆయనతోనే కాదు మా రెండు కుటుంబాల మధ్య కూడా చక్కని స్నేహం అమరింది. ఏ అకేషనూ లేకుండానే మీరోరోజు భోజనానికి రావాలని పట్టుపట్టి ఆయనకి బాగా ఇష్టమైన రెండు మూడు నాన్వెజ్ వెరైటీలతో భోజనం పెట్టేవారు. మా అంకుల్ కి నాన్వెజ్ వంటలు అంటే చాలా ఇష్టం, అసలు నాన్వెజ్ ఎలా తినాలో ఆయన్ని చూసే నేర్చుకోవాలి. “ఏం తిండయ్యా అది ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటారు” అంటూ కొసరి కొసరి వడ్డించేవారు. పాపం మా ఆంటీ కూడా శ్రమ అనుకోకుండా మాకోసం చక్కగా వండి పెట్టేవారు. మేము అందరమూ ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసిపోడానికి ఆయన స్నేహశీలతే కారణం. నేను వైజాగ్ లో ఇంజనీరింగ్ జాయినైనపుడు అక్కడే పెయింట్స్ బిజెనెస్ లో ఉన్న వారి రెండో అబ్బాయి నన్ను తరచుగా కలుస్తూ ధైర్యం చెప్పి ఉండకపోతే కనుక రాగింగ్ తట్టుకోలేక వదిలేసి వచ్చి ఉండేవాడ్ని.


మానుండి ఏమీ ఆశించకుండా ఇంతటి ప్రేమాప్యాయతలను పంచి ఇచ్చిన మా బలరామ్మూర్తి అంకుల్ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి వృద్దాప్యం వలన వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తిరుగుతూ తిరుగుతూనే తన డెబ్బై నాలుగవ ఏట మొన్న భీష్మ ఏకాదశి (ఫిబ్రవరి 21) రోజున హఠాత్తుగా స్వర్గస్తులయ్యారు. ముగ్గురు రత్నాల్లాంటి అబ్బాయిలని చక్కగా సెటిల్ చేసి పెద్దమనవరాలికి నాలుగు నెలల క్రితమే తన చేతులమీదుగా పెళ్ళి చేసి ఎవరితోనూ చేయించుకోకుండా దివ్యమైన రోజున అనాయాస మరణాన్ని పొందడం ఆయన చేసుకున్న పుణ్యఫలమే అని ప్రస్తుతానికి సర్ది చెప్పుకుని తృప్తి పడుతున్నాము. కానీ మనిషి ఆశాజీవి కదా... ఆయన ఆరోగ్యంగానే ఉన్నారుగా మరో రెండు మూడేళ్ళు ఉండుంటే మునిమనవడ్ని కూడా ఎత్తుకునేవారు కదా అనీ అనిపించక మానట్లేదు.

కొన్నాళ్ళ క్రితం ఒక రెండు రోజులు బెంగళూరులో తనకాతిధ్యం ఇచ్చే భాగ్యం దక్కింది కానీ ఆయన అనుకున్నట్లుగా నా ఇంట్లో ఒక వారం రోజులు ఆతిధ్యమిచ్చి మైసూరు పుట్టపర్తితో సహా బెంగళూరు పరిసరాలన్నీ చూపించాలనే కోరిక మాత్రం తీర్చుకోలేక పోయాను.  నా వరకూ అయితే నాకు ఆసరా ఇచ్చే మరో పెద్దదిక్కుని కోల్పోయానని దిగులుగా ఉంది. ఇంకా అపుడపుడు గుమ్మం బయట నుండి వేణూ అని పిలుస్తూ లోపలకి వస్తున్నట్లే అనిపిస్తుంది, మా నాన్నగారి పక్కన కూర్చుని ఆయన చెప్పే కబుర్లు వింటున్నట్లే అనిపిస్తుంది కానీ ఆ స్వరం వినపడదు వారానికి ఒకసారైనా నవ్వుమొహంతో ఆత్మీయంగా పలకరించే ఆయనా కనపడరు నేను మాత్రం మరో దీర్ఘమైన నిట్టూర్పు విడిచి జీవితం కొనసాగిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా మా బలరామ్మూర్తి అంకుల్ ఆత్మ శాంతించాలనీ... ఆయన మంచితనం ఆయన కుటుంబానికి అండగా ఉండి వారంతా ఎపుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన ఆత్మ శాంతికై మీరూ ప్రార్ధించండి.

5 వ్యాఖ్యలు:

 1. కొన్ని బంధాలూ బంధుత్వాలూ ఎందుకు ఎలా మొదలవుతాయో ఎలా ఆగిపోతాయో చెప్పలేం.ఏది ఏమయినా సునాయాస మరణం అన్నది చాలా అదృష్టమయిన విషయమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బలరామ్మూర్తి గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నానండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆప్తులు దూరమైన బాధ వర్ణించలేనిది...
  బలరామ్మూర్తిగారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.