అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

బుధవారం, జనవరి 21, 2009

దారిన పోయే దానయ్య లు !!

ప్రయాణం లో చికాకులు ఎన్ని ఉన్నా చివరికి విమానం శంషాబాద్ విమానాశ్రయం లో ల్యాండ్ అయింది, లగేజి పికప్ కోసం మెల్లగా Baggage Carousel (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) దగ్గరకు చేరుకున్నాను. నేపద్యం లో విమానాశ్రయం సిబ్బంది రక రకాల ప్రకటనలు చేస్తున్నారు వాటిలో ఒకటి, "విమానాశ్రయము నందు మీకు పెయిడ్ పోర్టర్ సౌకర్యము కలదు..మీ సామాను మోయుటకు పోర్టర్ సిబ్బంది సేవలను ఉపయోగించు 'కొన' వచ్చును.." అని అంటూ చెప్తుంది. ఇది చాలా శ్రద్దగా విన్నాడేమో నా పక్కన ఉన్న ఒకాయన పాపం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తరపున సాయం చెయ్యడానికి వచ్చిన వాళ్ళ మీద గయ్ గయ్ మంటూ విరుచుకు పడి పోయాడు. మాములు గా అయితే పాపం మర్యాద గా చెప్పి ఉండే వాడేమో కానీ "మరి ఎవరు ఎయిర్ లైన్స్ వాళ్ళో ఎవరు పోర్టర్ సిబ్బందో ఎలా తెలుస్తుంది ఎందుకు వచ్చిన గోలా, నా సామాను నేనే మోసుకుంటే పోలా !!" అని అనుకున్నాడేమో, దాంతో వాళ్ళు బలి. నాకు ఆ కింగ్ ఫిషర్ జనాలని చూస్తే బోల్డు కొంచెం జాలేసింది :-) విజయ్ మాల్యా నేమో అతి మర్యాదలూ.. అతిథి మర్యాదలూ అని "Hospitality is more important" అని సిబ్బంది కి తర్ఫీదు ఇచ్చి పంపుతుంటే, అంత మర్యాద కి అంత గా అలవాటు పడని మనవాళ్ళు ఆ సర్వీసుని సరిగా అర్ధం చేసుకో లేక సిబ్బంది ని కసురుకుంటుంటే,, ఏం చేయాలో పాలు పోక పాపం సతమతమౌతున్నారు ఈ కింగ్ ఫిషర్ సిబ్బంది. సరే కింగ్ ఫిషర్ గురించి మరో రోజు రాస్తాను, మన టపా విషయానికి వస్తే...

నా ట్రిప్ లో నేను ఎక్కువ భాగం రోడ్ మీదే గడపాల్సి వచ్చింది. సో అవసరమైనప్పుడల్లా ఓ రెంటల్ కార్ తీసుకుని ఊళ్ళు తిరగడం జరిగింది నేను ఇండియా లో ఉన్నప్పుడు అంటే 2006 డిశంబర్ వరకూ కూడా చెవీ వ్యాన్ లు అంతగా పేరు తెచ్చుకోలేదు. కానీ మొన్న ఎక్కడ చూసినా ఛెవీ టవేరా (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) chevrolet Tavera నే కనిపించింది. ఏ ట్రావెల్స్ వాడ్ని ఆడిగినా ముందు ఇదే బండి ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పట్లో సుమో, తర్వాత క్వాలిస్ ఆ తర్వాత స్కార్పియో కొన్ని రోజులు తిరిగింది కానీ దాన్ని త్వరలోనే ఈ బండి రిప్లేస్ చేసింది సార్ అని కథలు కథలు గా చెప్పారు ట్రావెల్స్ జనాలు. అమెరికా లోనే అంతంత మాత్రం గా ఉపయోగించే ఈ అమెరికన్ వ్యాన్ ఇంతగా ఆంద్రా లో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనేది నేను ఊహించలేదు. సరే అలాంటి ఓ పన్నెండు గంటల ట్రిప్ లో ఓ రోజు కంభం అనే ఊరిలో బోజనం చేయాల్సి వచ్చింది.

ఊరు చూస్తే చాలా చిన్న ఊరు లా ఉంది, అప్పటికే టైమ్ తొమ్మిదిన్నర అయిందీ, ఈ ఊరు దాటితే మరో ఊరు రావడానికి ఎంత లేదన్నా అరగంట టైం పడుతుంది సో ఇక్కడే ఏదో తినేద్దాం అని ఏదో చిన్న సెంటర్‌లా కనిపించిన చోట ఆపి, మా డ్రైవర్ దిగి వెళ్ళి కనుక్కుని వచ్చి "పైన సెంటర్ లో ఉన్నాయంటండీ.." అని అంటే మళ్ళీ బయల్దేరాం కొంచెం దూరం వెళ్ళాం కానీ ఎక్కడా ఏమీ కనిపించ లేదు ఇంతలో ఆ దారిన పోయే ఒకతను కనిపింఛాడు. అతనిదగ్గర లో బండి ఆపి "బాబూ ఇక్కడ మంచి హోటల్స్ ఏమున్నాయ్.." అని అడిగాం అతను మేం అడగడం ఆలశ్యం ఓ క్షణం ఆలో చించి మీకు ఎలాంటి బోజనం కావాలి అని అడిగి ఇదిగో ఫలానా సెంటర్ కి వెళ్తే ఫలానా హోటల్ ఉంటుంది అక్కడకి వెళ్ళండి అని వివరం గా స్పీడ్ బ్రేకర్ లు సిగ్నల్ లైట్స్ తో సహా దారి చెప్పడమే కాకుండా అక్కడ ఏమేం దొరుకుతాయో ఏవి బాగుంటాయో చాలా వివరంగా ఓపిక గా ఏమాత్రం విసుగు లేకుండా చెప్పాడు. ఆ హోటల్ మీదేనేమిటోయ్ కొంపదీసి అంటే "లేదండీ మా ఊర్లో రుచికరమైన బోజనం అక్కడే దొరుకుద్దండీ.." అని చెప్పాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి శలవు పుచ్చుకున్నాక మేమంతా ఒకరి మొహాలు ఒకరం చూసుకుంటూ మొత్తానికి భలే వాడిని అడిగాం అనుకున్నాం.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా చిన్న హోటల్ శుబ్రత గురించి కొంచెం అనుమానం వచ్చింది. ఒక పది నిముషాలు కాస్త రేట్ ఎక్కువ వసూల్ చేసే పెద్ద హోటల్ దొరుకుతుందేమో అని వెతికి.. ఏమీ దొరక్క సరె మా దానయ్య మీద భరోసా ఉంచి అక్కడే తిందాం అని కూర్చున్నాం. వడ్డించే ముందు అతను ముందుగా వాష్ బేసిన్ లో చేయి కడుక్కుని మొదలు పెట్టటం చూసాక పర్లేదు ధైర్యం గానే తినచ్చు అనుకున్నాం. మా దానయ్య చెప్పినట్లే భోజనం వేడిగా, చాలా రుచి గా ఉంది. హోటల్ చూసి పదార్దాల రుచిని అంచనా వేయ కూడదు అని మరో సారి నిర్ధారించుకున్నాను. మొత్తం మీద ఆ దారిన పోయే దానయ్య పుణ్యమా అని అంత రాత్రి వేళ ఆ కంభం లొ కమ్మని భోజనం చేసాం. ఇటువంటి సౌలభ్యం ఈ అమెరికా లో బాగా మిస్ అవుతాను నేను. ఇక్కడ అలా దారే పోయే వాడిని ఆపితే వాడేం చేస్తాడో అని భయం, అదే కాక ఏదో డౌన్ టౌన్ లో తప్ప అసలు ఇక్కడ రోడ్ మీద జనం కనపడటమే గగనమాయె, సో చచ్చినట్లు దారి లో కనిపించిన ఏ చెత్త రెస్టారెంట్ లోనో దొరికిన గడ్డి తిని తృప్తి పడాల్సిందే...

ఇదే ట్రిప్ లో ఒక సారి ఆళ్ళగడ్డ సమీపిస్తుండగా చాంతాడు లాంటి ట్రాఫిక్ జామ్ ఎదురైంది మా బండి చివరి లో ఉంది ముందంతా కనుచూపు మేరా బస్ లు లారీ లు ఆగి ఉన్నాయి. మేము ట్రాఫిక్ జామ్ ని సమీపిస్తూ దేవుడా దీన్లో నుండి ఎప్పటికి రా బాబు బయట పడేది అని అనుకుంటూ, ఏమైంది అని వాకబు చేస్తే. మరో దానయ్య స్వచ్చందం గా ముందుకు వచ్చి "సెంటర్ లో ఎరువులు అందలేదని రైతులు ధర్నా చేస్తున్నారండీ ఇప్పట్లో తేలే లా లేదు చాలా సెపటి నుండీ బళ్ళు ఆగున్నాయ్.. మీరేడికెళ్ళాళా? " అని అడిగాడు. ఊరు దాటి వెళ్ళాళి బాబు అని చెప్తే "అయితే మీరు కాస్త ఎనక్కి వెళ్ళి ఆ కనబడే మట్టి రోడ్డంబడి వెళ్తే ఊళ్ళో సందులగుండా సెంటర్ లో ధర్నా ని తప్పించుకుని ఎళ్ళచ్చు.." అని దారి చెప్పాడు. అతను చెప్పిన రూట్ లో వెళ్ళి ఒక ఇరవై నిముషాల్లో మళ్ళీ హైవే ఎక్కాం మనసులోనే అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇలా సాయం తీసుకోడం లో కూడా రిస్క్ ఉందండోయ్.. ప్రత్యేకంగా రాత్రి పూట మీరు ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు ఎప్పుడూ కూడా ఇలా మధ్య లో అడిగిన వాళ్ళ కి మీ చివరి గమ్యం చెప్పకండి. వాళ్ళెవరో తెలియదు కనుక దొంగలు అయ్యే అవకాశం కూడా ఉంది కనుక వీలైనంత దగ్గర ఊరి పేరు మాత్రం చెప్పండి చాలు. అందరూ మంచి వాళ్ళే దొరకరు కదా మన జాగ్రత్త లో మనం ఉండాలి మరి.

ఆదివారం, జనవరి 11, 2009

ముత్యాల పల్లకి (1976)

నా చిన్నతనం లో నేను చాలా సార్లు విన్న పాటలు ఇవి రెండూ.. అప్పట్లో పెళ్ళికి వెళ్తే "సన్నా జాజి కి..." పాట తప్పని సరిగా వినిపించే వారు. కొన్ని రోజులు గా ఎందుకో ఈ పాటలు గుర్తొస్తున్నాయి. మీరూ ఓ సారి విని గుర్తు చేసుకుని ఆనందించండి. మల్లెమాల గారు రాసిన సాహిత్యం సరళంగా అందం గా ఉంటుంది. తెల్లవారక ముందే పాట, రెండవ చఱణం లో పల్లెల గురించి ఎంత బాగా చెప్పారు అనిపించక మానదు. ఈ సంక్రాంతి సమయం లో పల్లెలు మరింత గుర్తొచ్చి మనసు భారమౌతుంది కదా !!


తెల్ల వారక ముందే.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి.

చిత్రం: ముత్యాల పల్లకి
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల

తెల్లా వారక ముందే పల్లే లేచిందీ..
తన వారినందరినీ తట్టి లేపిందీ..
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి..
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది..

||తెల్లా వారక ముందే||

వెలుగు దుస్తులేసుకునీ సూరీడూ..
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో..
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి..
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..

||తెల్లా వారక ముందే||

పాలావెల్లి లాంటి మనుషులు...
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ..
పల్లె సీమలో కోకొల్లలూ..
అనురాగం.. అభిమానం...
అనురాగం అభిమానం కవల పిల్లలూ..
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ..

||తెల్లా వారక ముందే||


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*


సన్న జాజికి గున్న మావికి.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి.

చిత్రం: ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు, సుశీల

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ.. ||సన్నజాజికి||
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. ||గున్నా మావికి||
హాహహా ఆ ఆ...ఓహో.హోహ్హో...

పూచే వసంతాలు మా కళ్ళ లో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో..
పూచే వసంతాలు మా కళ్ళ లో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో..
విరికొమ్మా.. చిరు రెమ్మా..
విరికొమ్మ చిరు రెమ్మ
పేరంటానికి రారమ్మా

||సన్నాజాజికి||

కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
శ్రీరస్తూ...శుభమస్తూ..
శ్రీరస్తు శుభమస్తు
అని మీరూ మీరు దీవించాలి

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాధవీ లత నాట్యమాడిందీ...
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..

గురువారం, జనవరి 08, 2009

నేటి ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో నా బ్లాగు !!

నా బ్లాగు లో నే రాసుకున్న "నాన్న తో షికార్లు !!" టపాను ఉదహరిస్తూ, ఆంధ్ర జ్యోతి పేపరు వారు నేటి (8th Jan-2009) నవ్య అనుబంధం లో నా బ్లాగు గురించి పరిచయం చేసారు. ఈ సంధర్బంగా ఆంధ్రజ్యోతి వారికీ, నవ్య నిర్వాహకులకు ధన్యవాదములు.

నా బ్లాగును కనుగొని, ఓపికగా రెండు టపాల నుండి ఎంపిక చేసిన పేరాలు కూర్చి, స్వల్ప మార్పులతో నా బ్లాగు పరిచయం గా ప్రచురించిన వారికి (ఆ వ్యక్తి ఎవరో తెలియదు) ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

అలానే పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో నా టపాకు స్థానం కల్పించిన చదువరి గారికీ, పొద్దు సంపాదకీయానికి నెనర్లు. బహుశా ఆంధ్ర జ్యోతి వారు అక్కడి నుండే నా బ్లాగు చూడటం తటస్థించి ఉండచ్చు.

బొమ్మ లో ఉన్నది చదవాలంటే, బొమ్మ పై క్లిక్కండి, పెద్ద గా కనిపిస్తుంది.



నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.