మత్తు వదలరా
నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే
గమ్మత్తుగా చిత్తవుదువురా...
మత్తు వదలరా
నిద్దుర మత్తు వదలరా
హ్మ్.. ఏంటో ఘంటసాల గారి కమ్మటి గొంతులో ఈ పాటింటుంటే జోలపాడుతున్నట్లుండి నాకే నిద్రొస్తుంది ఇంక నిద్రపోయే పాండా గాడేం లేస్తాడు... ఇది కాదు కానీ ఇంకోపాటతో ట్రైచేద్దారి...
తెల్లారేదాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదూ..
గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..
ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?
బద్దకమే ఈ జన్మకు వదిలి పోదా..?
గురకలలో నీ పరువే చెడును కద...
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా?
వీడేంటీ నిద్రలేవమంటే చిత్రమైన ఆసనాలేస్తున్నాడు
లేవర..లేవరా..
“అబ్బా పోరా..”
సుందర.. సుందరా..
“తంతానొరేయ్..”
చాలు రా నిద్దరా..
“థూ..ఈ సారినిద్దర్లేపావంటే సంపేత్తానొరేయ్”
వార్నీ.. నేన్రా ఈ బ్లాగువాడ్ని..
అడ్డగాడిదలా.. ఓహ్ నువ్ పాండావి కదూ.. అడ్డపాండాలా పడుకున్నది కాక నిన్ను
అమ్మాబాబు అంటూ మర్యాదగా నిద్రలేపుతుంటే నన్నే తిడతావా?? హన్నా... లే
ముందు..
“హబ్బా బ్లాగోడివి ఐతే ఏంటి గురూ.. మాంచి నిద్ర చెడగొట్టావ్.. ఇంకొన్నాళ్ళు పడుకోనివ్వు.. చాలా బద్దకంగా ఉంది.. ఐనా ఇపుడు నువ్వింత అర్జంట్ గా నన్ను నిద్రలేపి ఏం వెలగపెట్టాలంటా ?"
"ఏమంటే ఏం చెప్తాం మాకు మాకు బోల్డు కబుర్లు ఉంటాయోయ్ ఐనా నా బ్లాగుకు అతిధిగా వచ్చి సెటిల్ అయిందేకాక లేవమంటే నీ గోలేంటీ... ఇప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ నిన్నూ నన్ను కలిపి తిట్టుకుంటున్నారు తెలుసా?"
"ఏంటీ
తిడుతున్నారా ?? ఎవరు.. ఎవరు మనల్ని తిడుతుంది.. కమాన్ చెప్పు.. రెండు
కుంగ్ ఫూ కిక్కులిచ్చానంటే కిక్కురుమనకుండా పడుకుంటారు..."
"అదుగో ఇందుకే నిన్ను ఆ కుంగ్ ఫూ సినిమాలు ఎక్కువ చూడద్దనేది ఇదివరకూ ఎంత స్వీట్ గా క్యూట్ గా ఉండేవాడివి ఇపుడేమో ఇలా రౌడీలా తయారయ్యావ్..."
"హిహి తిడుతున్నారనే సరికి ఏదో కొద్దిగా ఆవేశం వచ్చిందిలే బాసు... అదీకాక కాస్త బద్దకం కూడా వదిలిచ్చుకోడానికి పనికి వస్తుంది కదాని రెండు మూవ్ లు ప్రాక్టీస్ చేశా.."
"సరే సరే లే ఇక సాగింది చాలు గానీ ఇంద ఈ కేక్ తినేసి మన ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసి బయల్దేరితే నేను నా పని చూసుకుంటా.."
"ఏంటో బాసు బొత్తిగా అలవాటై పోయింది నీ బ్లాగ్ వదిలి వెళ్ళాలనిపించడంలేదు పోనీ నీకు అడ్డం రాకుండా అప్పుడప్పుడూ అవసరమైతే సాయం చేస్తూ ఇక్కడే ఓపక్కన తిరుగుతూ ఉండనా.. ఎంతైనా మనం మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నీ బ్లాగ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను కూడా పరిచయం చేయ్..."
"హ్మ్ సరే రోజూ వచ్చి నిన్ను చూస్కోడం నాకు కూడా అలవాటైపోయింది నువ్ లేకపోతే వెలితిగానే ఉంటుందేమో. సో అలా సైడ్ బార్ లో ఓ పక్కన తిష్టవేసేయ్ కానీ మళ్ళీ బద్దకమంటూ నిద్రొస్తుందంటూ నాకు అడ్డం రాకూడదు సరేనా.."
"అలాగే గురూ నేను అస్సలు అడ్డంరాను నువ్వు హాయిగా
కబుర్లు చెప్పుకో" (మనసులో:హు! వీడి బద్దకానికి నిద్రకీ నన్ను బాధ్యుడిని
చేస్తున్నాడు.. దొంగమొహం..)
"నేస్తాలూ కొంచెం దగ్గిరగా రండి మా బాసు వినకుండా మీకో విషయం చెప్పాలి.. ఈ రోజు నుండీ ఈ బ్లాగ్ వాడు మళ్ళీ మీకు సుత్తేయడం మొదలు పెడతాడుట, మా గురువుగారు శ్రీశ్రీ బుడుగు గారు ఆర్డర్ వేస్తే సర్లేకదా అని పాపం ఇన్ని రోజులూ ఏదో ఒకలా మిమ్మల్ని నేను రష్చించేశాను ఇకపై మీకు భరించక తప్పదు... నేను కూడా ఆ పక్కనే ఉండి మనవాడ్ని కాస్త అదుపులో పెడతాలెండి."
"మరి కొత్త సంవత్సరం కదా మీకోసం నా అంత పేఏఏ..ద్ద... కేక్ ఇంకా ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ తీసుకు వచ్చాను మరి అవి అందుకుని నాతో కూడా దోస్తీ కట్టేసి ఈ బ్లాగ్ కి వచ్చినపుడు నన్ను కూడా పలకరిస్తుండండేం.."
"హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్."
"ఆ విషెస్ చెప్పేశాను బాసు.. ఇక వస్తా.."
"ఆ ఆ సరే టాటా.."
నేస్తాలూ అదనమాట విషయం..
అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ప్రతిరోజూ ప్రతిక్షణం అవధులులేని ఆనందం మీ సొంతమవాలని కోరుకుంటున్నాను...