అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

సోమవారం, సెప్టెంబర్ 29, 2008

ఫిల్టర్ కాఫీ / కాఫీ ఫిల్టర్

శీర్షిక చూసి ఇదేదో మంచి కాఫీ లాంటి టపా చదువుదాం అని వస్తే, మీరు తప్పులో కాలేసినట్లే ముందే హెచ్చరిస్తున్నా కాబట్టి చదివి మీరు తెచ్చుకునే తలనొప్పులకు ఇక నా పూచీ ఏం లేదు (నా లాంటి కాఫీ ప్రియులకి తలనొప్పి కూడా ఒకందుకు మంచిదే!! మరి ఎంచక్కా ఆ వంకతో ఇంకో కప్పు కాఫీ ఎక్కువ తాగేయచ్చు కదా:-). సరే ఏదో ఊసు పోక ఈ రోజు ఉదయం నే చేసిన సాహసం గురించి సరదాగా వ్రాద్దాం అని కూర్చున్నా సో తీరిక ఉంటే చదవండి.

నేను ఇండియా వెళ్ళినప్పుడు చెన్నై అయితే వెళ్ళాను కానీ చాలా బిజీ స్కెడ్యూల్ అవడం వల్ల శరవణ భవన్ లో ఫిల్టర్ కాఫీ తాగే అవకాశం దొరక లేదు. కానీ అక్కడ ఉన్నంత సేపూ తలచుకుంటూనే ఉన్నా. అక్కడ నుండి గుంటూర్ వచ్చాక ఈ సారి తీసుకు వెళ్ళాల్సిన వాటిలో కాఫీ ఫిల్టర్ మర్చిపోకుండా చేర్చమ్మా అని చెప్పా. దాందేముంది రా మన ఇంట్లో ఉన్నది ఎలాగు వాడటం లేదు అది ఇప్పుడే సూట్కేస్ లో పెట్టేసుకో అని అమ్మ ఇచ్చేసింది. మా ఇంట్లో అందరూ టీ ప్రియులు లెండి నేను ఒక్కడ్నే కాఫీ కి అంకితమయ్యా... మొత్తం మీద అలా మర్చిపోకుండా తీసుకు వచ్చిన ఫిల్టర్ ని వాడటానికి ఈ రోజే తీరిక దొరికింది.

ఎలా వాడాలి అనే బేసిక్ ట్రైనింగ్ టెలిపోన్ లో అల్రెడీ ఓ నేస్తం దగ్గర తీసుకుని ఉండటం తో "జయమ్ము నిశ్చయమ్ము రా భయమ్ము లేదు రా... " అనుకుంటూ మొదలు పెట్టాను. ముందు నీళ్ళు మైక్రోవేవ్ లో వేడి చేయాలి దానికోసం ఒక ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్ళు పోసి ఓ ప్లాస్టిక్ స్పూన్ వేసి ఓవెన్ లో పెట్టా (మైక్రో వేవ్ ఓవెన్ లో నీళ్ళు యధాతధం గా వేడి చేయకూడదు ఓ స్పూనో స్టిర్రరో వేసి చేయాలి అని వీడియోలతో మరీ చెప్పారు కదా అది వంట పట్టించుకున్నా లెండి అందుకే ముందు జాగ్రత్త) కానీ ఓ 3 నిముషాలు ఆగి చూస్తే ఆ స్పూన్ కాస్తా వంగి పోయి ఉంది.

హతవిధీ ఆదిలోనే హంసపాదా అనుకుని సరే ఆ వంగిన ప్లాస్టిక్ స్పూన్ కరిగి పోయి ఏ కెమికల్స్ నీళ్ళలో కలిసి ఉంటాయో అని అనుమానం వచ్చి అవన్ని పడేసి ఈ సారి పింగాణీ కప్ దాన్లోకి ఒక స్ట్రాంగ్ స్పూన్ పడేసి కాసింత తక్కువ టైం వేడి చేసా. నీళ్ళు వేడయ్యే సరికి ఫిల్టర్ లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి దాని పైన రెండో
ఫిల్టర్ పెట్టి రెడీ చేసి, ఆ వేడి నీళ్ళు ఫిల్టర్ లో పోసి మూత పెట్టేసా. ఇక అక్కడ నుండి మొదలు నా కష్టాలు.

ఫిల్టర్ అంతా స్టీల్ అదీ కాక Airtight ఎక్కడ ముట్టుకున్నా కాలి పోతుంది కనీసం ఒక పక్కకి జరపడానికి కూడా లేదు. పొనీ హేండిల్ ఏమన్నా ఇచ్చాడా అంటే అదీ లేదు ముందు ఇది ఇలా డిజైన్ చేసిన వాడ్ని తన్నాలి అనుకున్నా పోని చల్ల బడే వరకు ఆగుదాం అంటే మనకి ఆత్రం ఆగి చావదు. ఏదైనా గుడ్డ తోనో లేదా పేపర్ టవల్ తోనో ట్రై చేద్దాం అంటే ముందు గ్రిప్ దొరకడం లేదు దానికి తోడు మొత్తం Airtight అవడం వల్లనేమో రెండు కంపార్ట్మెంట్ లు పైన మూత అన్నీ బిగుసుకు పోయి కదిలి చావడం లేదు, లోపలేం జరుగుతుందో తెలీడం లేదు.

ఓ రెండు నిముషాల పాటు "బావగారు బాగున్నారా" సినిమాలో శ్రీహరి సీసా మూత తీయడానికి చేసే ప్రయత్నం గుర్తు చేసుకోండి ఇంచు మించు అదే రేంజ్ లో తిప్పలు పడ్డా... మరో రెండు నిముషాలు "తమ్ముడు" సినిమాలో అవధాన్లు మాష్టారి దుష్యంతుడు పాఠం గుర్తొచ్చింది. బాణం గాట్టిగా లాగాడు... రాలా !!... మళ్ళీ లాగాడు...బాణం లో నుంచి చెయ్యొచ్చింది కాని బాణం రాలా!!.. అదే టైప్ లో గాట్టిగా లాగాను కానీ చేయి జారిపోయింది కానీ మూత రాలేదు కింద కంపార్ట్మెంటూ రాలేదు !! అలా ఓ అయిదు నిముషాలు కుస్తీ పట్టాక వేసుకున్న
టీషర్ట్ ని కాఫీ షర్ట్ చేస్తూ హఠాత్తు గా ఊడి వచ్చేసింది.

అయ్యో రామా మొత్తం అంతా ఒలికి పోయిందా మళ్ళీ పెట్టాలా అనుకుని చూస్తే ఏదో కాస్త షర్ట్ మీదా నేల మీద కిచెన్ టాప్ మీదా చిందిందనే కానీ మళ్ళీ చేయాల్సిన అవసరం రాలేదు, బ్రతుకు జేవుడా అనుకుంటూ
అవన్ని క్లీన్ చేసి, 3 వంతులు పాలు ఓ వంతు డికాక్షను కలిపి కాసింత చక్కెర వేసి మళ్ళీ కాసేపు వేడి చేసి. చివరగా కాఫీని మంచి నురగ వచ్చేలా స్టీల్ గ్లాస్ లోకి ఇంకో కప్ తోటి తిరగ కొట్టి వేడి వేడి ఫిల్టర్ కాఫీ ని ఆస్వాదించేసా. ఈ చివర తిరగకొట్టడం అనబడు ఘట్టం అతిముఖ్యం స్పూన్ తో తిప్పినా Ikea లో దొరికే Milk frother లాంటి టూల్స్ వాడినా ఇలా ఒక కప్ నుండి ఇంకో కప్ లోకి తిరగ కొడితే వచ్చే టేస్ట్ కానీ అలాంటి నురగ కానీ రాదు.

నే తెచ్చిన కాఫీ ఫిల్టర్ & నే చేసిన ఫిల్టర్ కాఫీ

ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఎంత కష్ట పడైనా ఫిల్టర్ కాఫీ నే మళ్ళీ
తాగాలనిపిస్తుంది కాని ఇంచు మించు సరి సాటి అని చెప్పుకునే ఇన్స్టంట్ జోలికి ఇక వెళ్ళ బుద్ది కావడం లేదంటే నమ్మండీ. ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ స్టీల్ కి కాఫీ కి ఏదో కనెక్షన్ ఉండీ ఉంటుంది. అరిటాకులో వేసి ఇచ్చిన వేడి వేడి పెసరట్టు అరిటాకు రసం పీల్చి మరింత రుచి గా తయారయినట్లు స్టిల్ ఫిల్టర్ లో, స్టీల్ గ్లాస్ ల్లో ఏదో ప్రత్యేకమైన రుచి ని సంతరించుకుంటుంది మన కాఫీ. ఇది వరకు ఇక్కడి electric coffee maker లో చేసిన ఫిల్టర్ కాఫీ ఇంత రుచి గా లేకపోడమే అందుకు నిదర్శనం.

సో అదనమాట నా ఫిల్టర్ కాఫీ కధ, ఇంకెందుకాలశ్యం వెళ్ళి ఓ మంచి ఫిల్టర్ కాఫీ తాగేయండి.

మళ్ళీ మరో టపా లో కలుద్దాం శలవ్.

సోమవారం, సెప్టెంబర్ 15, 2008

బ్లాగ్లోకానికి, బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి...

బ్లాగ్లోకానికి బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి... గత నెల రోజులు గా నా నుండి కొత్త టపా లేక పోయినా అపుడపుడు ఇటు విచ్చేసి వ్యాఖ్య లతో పలకరించి ప్రోత్సహంచిన మిత్రులందరికీ శతకోటి నమస్సులు. నేను మధ్యలో ఒకటీ అరా టపా లు అతికష్టం మీద చదివినా వ్యాఖ్య వ్రాసే సమయం లేకపోయింది. కంప్యూటరు తో గడప గలిగిన కాస్త సమయం లో ఏదో ఒక ఆఫీసు పని ఉండటం తో పాటు Internent Speed సరిగా లేక పోడం తో ఎక్కువ సమయం వెచ్చించ లేకపోయాను.

ఏదేమైనా నెల రోజుల శలవులు ముగించుకుని ఈ రోజే తిరిగి చికాగో చేరుకున్నాను. నేను డిల్లీ నుండి బయలుదేరే రోజే అక్కడ పేలుళ్ళు జరగడం బాధాకరం, Aug 11th ఉదయం అభినవ్ బింద్రా బంగారు పతకం గెలుచుకున్నాడన్న వార్త తో భారత మీడియా నాకు స్వాగతం పలికిందని సంతోషించే లోపే Sept 13th డిల్లీ పేలుళ్ళ వార్త తో వీడ్కోలు పలకడం బాధాకరమైన విషయం.

మొత్తం మీద నా ట్రిప్ అద్యంతమూ దేవుడి పాలనలో వరుణదేవుడు కురిపించిన ఎడతెరిపి లేని వర్షాలలోను, మా బంధువులు ఆత్మీయులు కురిపించిన అత్మీయ, అనురాగ వర్షపు జల్లులలోనూ, ఇంకా అకాల వర్షాల వల్ల పంట చెడిపోయిందనో సకాలం లో ఎరువులు అందలేదనో రైతన్నల ఆగ్రహ జల్లులలోనూ తడిసి ముద్దయి పోయా... ఇక నా అభిమాన హీరో "ప్రజారాజ్యం" ఆవిష్కరణని అందరితో కూర్చుని ప్రత్యక్ష ప్రసారం చూడటం కూడా ఓ మరువలేని అనుభూతి. ఈ నెల రోజులలోనూ మోయలేనన్ని బోలెడు అనుభూతులు, జ్ఞాపకాల వల్లనో :-) లేకా అనునిత్యం తిన్న విందు భోజనాల వల్లనో (ఇదే అసలు కారణం లెండీ) కానీ ఓ 3 కిలోల బరువు కూడా పెరిగాను.

రానున్న పది రోజులలోనూ మెల్లగా ఆఫీసు లోనూ, బ్లాగ్లోకం లోనూ ఉన్న back log లను కవర్ చేసి తిరిగి టపాయించడం మొదలు పెడతాను అంతవరకూ నిన్న ప్రయాణమయ్యేప్పుడు నా మదిలో మెదిలిన ఈ పాట మీకోసం.



చిత్రం : సిరివెన్నెల
గానం : యస్ పి బి, పి సుశీల
సంగీతం : కె వి మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఆ... ఆ...
పొలిమేర దాటిపోతున్నా, ఓ గువ్వలచెన్నా!
పొరుగూరికి చేరిపోతున్నా, ఓ గువ్వలచెన్నా!
కధ మారే రోజులు మారేనూ, ఓ గువ్వలచెన్నా!
కల తీరే దారులు వెతికేనూ, ఓ గువ్వలచెన్నా!

ఆ... ఆ...
ఆ... ఆ...

గుళ్ళో నిను చూడలేకున్నా, ఓ గువ్వలచెన్నా!
గుండెల్లో దాచుకున్నాలే, ఓ గువ్వలచెన్నా!
ఏ సీమలొ తిరుగాడినా, ఓ గువ్వలచెన్నా!
నీ దీవెనలందించాలన్నా, ఓ గువ్వలచెన్నా!
ఓ..ఓ..ఓ...ఒ.ఒ.ఒ.ఓ..
ఆ..ఆ..ఆ..అ.అ.అ.ఆ..

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.