అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

బుధవారం, నవంబర్ 26, 2014

రౌడీఫెలో...

నారా రోహిత్ నాకు నచ్చే నటులలో ఒకరు. తెలుగులో ఇతర కమర్షియల్ హీరోలకి భిన్నంగా తనకంటూ ఒక పంథా సృష్టించుకోవాలని తపనపడే ఇతని స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. మొదటి చిత్రం 'బాణం' లోనే తన ప్లస్ పాయింట్స్ ని సరిగా క్యాచ్ చేసి వాటిని హైలైట్ చేసే కథతో వచ్చి మంచి మార్కులేయించుకున్నాడు. తరువాత ఒక లవ్ స్టోరీ (సోలో), ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామా(ఒక్కడినే), ఒక సోషల్ మెసేజ్ ఫిల్మ్ (ప్రతినిధి) ఇలా ఏం చేసినా మినిమమ్ గ్యారెంటీ ఔట్ పుట్ ఇచ్చే ప్రామిసింగ్ హీరో అనిపిస్తాడు నాకు. కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా కానీ ఇతని సినిమాలు ఖచ్చితంగా వైవిధ్యంగా తప్పక ఒకసారైనా చూడాలనిపించేలా ఉంటాయి.

పాటల రచయిత 'కృష్ణ చైతన్య' దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన కొత్త చిత్రం ఈ 'రౌడీఫెలో'. దర్శకులుగా మారే రచయితల సినిమాలు అంతత్వరగా డిజప్పాయింట్ చేయవనే నమ్మకాన్ని మరోసారి నిలబెట్టింది ఈ చిత్రం. నెరేషన్ విషయంలో కాస్త నెమ్మదిగా ఉన్నట్లనిపించినా అది కూడా సినిమాకి ఒక స్టైల్ ని యాడ్ చేసింది ఇక డైలాగ్స్ విషయంలో అయితే చాలా చక్కగా రాసుకున్నాడు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు తను తీసిన విధానం వాటి ఫ్రేమింగ్ ప్రేక్షకులతో "ఆహా ఏం తీశాడ్రా" అని అనిపిస్తాయి. అఫ్ కోర్స్ వాటికి ’సన్నీ’ ఇచ్చిన నేపధ్య సంగీతం, ఓం సినిమాటోగ్రఫీ, నటీనటుల చక్కని పెర్ఫార్మెన్స్ కూడా తోడయ్యాయనుకోండి.

కథ విషయానికి వస్తే లెక్కలేనంత ఆస్థి, మంచి మనసు ఉన్నా నిలువెల్లా ఇగో తో నిండిపోయిన ఒక అహంకారి రాణా ప్రతాప్ జయదేవ్( నారా రోహిత్). తన కాలర్ పట్టుకున్నందుకు మూడేళ్ళ తర్వాత కూడా మర్చిపోకుండా అమెరికా నుండి వచ్చి వాడ్ని కొట్టి తన అహాన్ని తృప్తిపరచుకునే రకం. ఒక ఎస్పీతో(ఆహుతి ప్రసాద్) అయిన గొడవలో అహం దెబ్బ తిన్న రాణా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే చేరి ఆ ఎస్పీకి పక్కలో బల్లెంలా తయారవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొల్లేరు ఎస్సై గా ఛార్జ్ తీసుకున్నాక ఓ కేస్ ఇన్వెస్టిగేషన్ లో అక్కడి బీదల బ్రతుకులతో చెలగాటమాడుతూ వారినుండి మనిషిగా జీవించే హక్కును సైతం లాగేసుకుంటున్న లోకల్ ఎంపీ అసురగణ దుర్గా ప్రసాద్ (రావు రమేష్) గురించి తెలుసుకుంటాడు. రాణా కేస్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఆ ఎంపీకి ఎలా బుద్దిచెప్పాడు అనేది మిగిలిన కథ.

నారా రోహిత్ స్ట్రెంత్స్ లో మొదట నిలిచేది తన డైలాగ్ డెలివరీ.. ఈ సినిమాలో దర్శకుడు దాన్ని పీక్స్ లో ఉపయోగించుకున్నాడు. యారొగెంట్ పోలీసాఫిసర్ గా ఈ పాత్రలో కరెక్ట్ గా సరిపోయాడు. అయితే ఫిట్ నెస్ విషయంలో తన గత చిత్రం ప్రతినిధి కన్నా నయమే అనిపించినా మరింత శ్రద్ద తీస్కోకపోతే ముందుముందు ఇతనిని భరించడం కష్టమయే ప్రమాదం ఉంది. తర్వాత చెప్పుకోవలసింది రావురమేష్ నటన ఇతనికి సరైన పాత్రలు దొరికితే ఎప్పుడూ చెలరేగిపోతాడు. ఇందులో కూడా అలాగే తనకి వచ్చిన అవకాశాన్ని చక్కగ సద్వినియోగ పరచుకున్నాడు. తన సటిల్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ చూస్తే ముందు ముందు మరింత మంచి పేరు తెచ్చుకుంటాడు తన తండ్రి పేరు నిలబెడతాడు అని అనిపించింది.

గొల్లపూడి గారు, తాళ్ళూరి రామేశ్వరి గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, జోగి బ్రదర్స్, అజయ్ అందరూ తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ప్రవీణ్ కి మంచి పాత్ర లభించింది. థియేటర్ ఓనర్ ’సిల్క్’ గా పోసాని కృష్ణ మురళి కామెడీ బాగానే పండించాడు. కమెడియన్ సత్య(స్వామిరారా ఫేం) సునీల్ ని అనుకరించడానికి వృథా ప్రయత్నం చేశాడు, తన ఒరిజినల్ స్టైల్లో చేస్తేనే ఎక్కువ ఆకట్టుకునేవాడేమో అనిపించింది. హీరోయిన్ విశాఖ సింగ్ ఫర్వాలేదు సినిమాలో నెగటివ్ పాయింట్ ఏమైనా ఉందంటే అది హీరోగారి లవ్ ట్రాకే అసలే నెమ్మదిగా నడిచే స్క్రీన్ ప్లేకి ఇది మరికాస్త బ్రేక్ వేసినట్లుగా అయింది. అయితే పాటలు ఒక్క చరణమే చిత్రీకరించడం ఒక ప్లస్ పాయింట్.

కొల్లేరు నేపధ్యంగా అల్లుకున్న ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి తక్కువ ప్రాధాన్యతనిచ్చి స్లో నెరేషన్ అయినా తను చెప్పాలనుకున్న పాయింట్ పై మాత్రమే దృష్టినిలిపి నడిపించారు దర్శకుడు. తెలుగులో వచ్చే రొటీన్ లవ్ స్టోరీలూ, బకరా కమెడియన్ కామెడీలూ, నవ్వొచ్చే ఫైటింగ్ యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టి కొత్తదనం కోరుకుంటున్న వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

అయితే కమర్షియల్ ఎలిమెంట్స్, లౌడ్ కామెడీ, లవ్ ట్రాక్ లాంటివి సరిగా లేకపోవడం, స్లో నెరేషన్ లోటుగా భావిస్తే మీరు ఈ సినిమాకి దూరంగా ఉండడం మంచిది. సినిమాని ఆస్వాదించడానికి అవి అడ్డంకి కాదని మీరు భావిస్తే వైవిధ్యమైన కథతో, ఆలోచింపచేసే సంభాషణలతో, బిలీవిబుల్ ఫైట్స్, సటిల్ కామెడీ కి తోడు చక్కని సినిమాటోగ్రఫీ, సరైన నేపధ్య సంగీతం, నటీనటుల బెస్ట్ కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ తో కూడిన ఒక మంచి తెలుగు సినిమా చూసిన అనుభూతి కోసం ’రౌడీ ఫెలో’ చూడండి. సినిమాలో నాకు నచ్చిన కొన్ని డైలాగ్స్ ఇక్కడ ఇస్తున్నాను. 

“అరవై సెకన్లలో డెబ్బైరెండు సార్లు కొట్టుకునే గుండెకే లాజిక్ లేదు ఇక నేను చేసిన పనుల గురించి అడిగితే ఏం చెప్తారా.”

“జంతువులకి చెప్పాలి, మనిషిని అడగాలి, నాలాంటోడ్ని బతిమాలాలి.”

“మూగవాడిది ఒక విధమైన మౌనమైతే పేదవాడిది మరొక విధమైన మౌనం. మూగవాడు మాటల్రాక మాట్టాడ్డు, పేదవాడికి అన్నీ తెలిసినా మట్లాడలేడు.”

“ద్రౌపది నవ్వినపుడు దుర్యోదనుడు లైట్ తీస్కుని ఉంటే మహాభారతం ఉండేదా? సీత నవ్వుని రావణాసురుడు పట్టించుకోకపోతే రామాయణం ఉండేదా? పురాణాలన్నీ ఇగో ప్రాబ్లమ్సేననమాట.”

“కోపం బాగా కాస్ట్లీ అనమాట మాటి మాటికీ వాడకూడదు.”

“నేను సాయం చేయను న్యాయం చేస్తాను.”

“చరిత్ర ఎక్కువగా చెడ్డవాళ్ళనే గుర్తుంచుకుంటుంది.”

హీరో : “నాకు పెద్దగా ఆశలూ లేవు ఆకలంటే తెలీదు...”
ఒక పెద్దాయన : “ఆశకీ ఆకలికి మధ్య అవసరం ఉంటుంది అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు.”

“మనిషిని చూసి మనిషి ఎందుకు భయపడాలి ?”

“మంచి విషయాలు గొప్పోళ్ళు చెప్పారంటే విలువిస్తారు కానీ నువ్వు నేనూ చెప్పామంటే ఎవరూ పట్టించుకోరు.”

“ప్రెపంచకంలో మనిషి గురించి ఆలోచించే ప్రతివాడూ పిచ్చోడే కదా.”

“మీకంటే బెంజ్ ఉంది కాబట్టి ఇన్నోవా వద్దన్నారు అదే పాత స్కూటర్ మీద తిరిగేవాడైతే కావాలనుకుంటాడు.”

“చేపలుపట్టే వలలో తిమింగలాలు పడవు.”

“నువు మనుషులను భయపెట్టగలవేమో అక్షరాలను కాదు.”

“ఆకలితో ఉన్న జంతువు కన్నా ఆశతో ఉన్న మనిషే ప్రమాదకరం.”

“ఇండియాలో గాంధీ గారి మాట కన్నా నోటుకే విలువెక్కువ.”

శనివారం, అక్టోబర్ 25, 2014

కార్తికేయ

జవాబులేని ప్రశ్నలు అంటూ ఉంటే అది ప్రయత్నలోపమే తప్ప తగినవిధంగా ప్రయత్నిస్తే సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదని నమ్మే క్యూరియస్ అండ్ డేరింగ్ మెడికో కార్తీక్. తను మెడికల్ కాంప్ లో భాగంగా సుబ్రహ్మణ్యపురం అనే చిన్న ఊరికి వెళ్తాడు. అక్కడ ఎంతో పురాతనమైన ఒక సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంటుంది కానీ ఇటీవల మూసి వేయబడిన ఆ గుడి తలుపులు తెరవడానికి ఎవరు ప్రయత్నించినా అసలు ఆ గుడి గురించి మాట్లాడినా కూడా చనిపోతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన కార్తీక్ తన సహజమైన క్యూరియాసిటీ తో ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడనేదే "కార్తికేయ" సినిమా.

నిఖిల్ తన ట్రెండ్ మార్చి చేసిన గత చిత్రం స్వామిరారా తరహాలోనే హైపర్ యాక్షన్ ని పక్కన పెట్టేసి పాత్రకు తగినట్లు హుందాగా నటించాడు. స్వాతి కూడా అవసరానికి మించి బబ్లీనెస్ ప్రదర్శించకుండా చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఒకటి రెండు సార్లు మేకప్ విషయంలో మరికాస్త శ్రద్ద తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ప్రవీణ్, సత్య హాస్యం బాగుంది అలాగే జోగి బ్రదర్స్ లో ఒకరైన జోగినాయుడికి మంచి పాత్ర దక్కింది. మిగిలిన సీనియర్ నటులు తనికెళ్ళ భరణి గారు, రావురమేష్, తులసి, కిషోర్, రాజా రవీందర్ అంతా వారి వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. 

నూతన దర్శకుడు చందు మొండేటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళకుండా పూర్తిగా కథా కథనాలను నమ్ముకుని తెరకెక్కించారీ చిత్రాన్ని. సస్పెన్స్ ను చివరివరకూ మెయిన్ టెయిన్ చేస్తూ తను రాసుకున్న కథనం ఆకట్టుకుంది. అయితే సినిమా అంతా బిల్డప్ మరీ ఎక్కువవడంతో చివరికి సస్పెన్స్ రివీల్ అయినప్పుడు ఇంతేనా అని కాస్త డిజప్పాయింట్ మెంట్ కి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే భక్తిని సైన్స్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సినిమాని కంక్లూడ్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది.

ఈ సినిమాకి శేఖర్ చంద్ర నేపద్య సంగీతం మంచి ఎసెట్ అయింది చాలా సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి తోడ్పడింది. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా మరో పెద్ద ఎసెట్. పాటలలో ఒకటి రెండు మెలోడీలు ఆకట్టుకుంటాయి కానీ ద్రిల్లర్ కావడంతో పాటలు నెరేషన్ కి అడ్డుపడిన ఫీలింగ్ కలిగింది. "ఇంతలా" అనే పాట కాన్సెప్ట్ అండ్ చిత్రీకరణ మాత్రం బాగుంది. రొటీన్ ఫార్ములా చిత్రాలకు భిన్నంగా థ్రిల్లర్ సబ్జెక్ట్ తో కథే హీరోగా తీసిన చిత్రం కార్తికేయ. వైవిధ్యమైన సినిమాలను థ్రిల్లర్ సినిమాలనూ ఇష్టపడే ప్రేక్షకులు తప్పక ఒకసారి చూసి తీరవలసిన చిత్రమిది, డోంట్ మిస్ ఇట్. 

శుక్రవారం, ఆగస్టు 22, 2014

ఊహలు గుసగుసలాడే...

ప్రేమ !... రెండక్షరాల పదం... ఒక చిన్న ఫీలింగ్ / ఎమోషన్... సినిమాలు మొదలయినప్పటినుండీ... ఆమాటకొస్తే కథలు చెప్పడం మొదలైన దగ్గర నుండి కూడా ఇప్పటికి కొన్ని వేల సార్లు కథా వస్తువుగా ఉపయోగపడింది ఈ ప్రేమ, ఇక ముందు కూడా ఉపయోగపడుతుంది.

ప్రేమ కథలు ఎన్ని సార్లు విన్నా చూసినా బోర్ కొట్టవని కొత్తగానే ఉంటాయని పదే పదే హిట్ అయ్యే ఎన్నో ప్రేమకథలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. అలాంటి ఒక ప్రేమకథకి ఆకట్టుకునే కథనం, చక్కని సంభాషణలు, సున్నితమైన హాస్యం కూడా తోడైతే... ఆ సినిమా చూడడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

అలాంటి ఓ మంచి సినిమానే "ఊహలు గుసగుసలాడే" సినిమా... ఈ సినిమా ఈ ఆదివారం (24 ఆగస్ట్ 2014) సాయంత్రం 6 గంటలకు మాటీవీ లో టెలికాస్ట్ అవుతుంది. అవకాశమున్న ప్రతిఒక్కరూ తప్పక చూడండి... డోంట్ మిస్ ఇట్... ఒక వేళ మిస్ అయినా 25 ఆగస్ట్ 2014 నుండి డివిడి లభ్యమవనుంది సొంతం చేస్కోండి.

 

చెడిపోవడానికి అన్ని అవకాశాలున్నా కూడా బుద్దిమంతుడిగా మిగిలిపోయిన ఒక రిచ్ మంచబ్బాయి ఆనంద్ గా "అష్టాచెమ్మా" సినిమాతో పరిచయమైన "శ్రీనివాస్ అవసరాల" దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. నటుడిగా ఆ సినిమాతో ఎంత ఆకట్టుకున్నాడో దర్శకుడిగా, రచయితగా అడుగడుగునా తన మార్క్ చూపిస్తూ ఈ సినిమాతో కూడా అంతే ఆకట్టుకున్నాడు. ఎక్కడా వెకిలి హాస్యానికి చోటివ్వకుండా క్లీన్ కామెడీతో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మన సొంతం చేశాడు. 

ఈ సినిమాకి కళ్యాణ్ కోడూరి సంగీతం కూడా ఒక పెద్ద ఎసెట్ అయింది. సంగీతం అంటే వాయిద్యాల హోరుగా సాహిత్యాన్ని మింగేసేదిగా నిర్వచనాన్ని మార్చేస్తున్న ఈరోజుల్లో... సిరివెన్నెల, అనంత శ్రీరాం రాసిన పాటల్లోని అందమైన సాహిత్యాన్ని చక్కగా కాంప్లిమెంట్ చేస్తూ ప్రతి పదమూ స్పష్టంగా వినిపించేలా దానికి సపోర్టింగ్ గా నేపధ్యంలో పరిమితమైన వాయిద్యాలతో చాలా హాయైన అనుభూతిని ఇచ్చింది. కావాలంటే ఒకసారి ఈ క్రింది పాట విని చూడండి మీరే ఒప్పుకుంటారు. అలాగే నేపధ్య సంగీతం సైతం ప్రతి సీన్ లోనూ సంభాషణలను మింగేయకుండా సన్నివేశాలను ఎలివేట్ చేస్తుంది. 



సినిమాకు మరో ఎసెట్ వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ... వైజాగ్ బీచ్ అయినా, టీవీ స్టూడియో అయినా, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయినా, సినిమా థియేటర్ అయినా, ఏదైనా కూడా చూడచక్కని ఫ్రేమ్స్ లో కళ్ళకి ఏమాత్రం శ్రమనివ్వని కలర్ కాంబినేషన్స్ లో సన్నివేశానికి తగిన మూడ్ కియేట్ చేస్తూ హాయిగా అనిపిస్తుంది. సినిమాలోని ముఖ్యమైన మూడు పాత్రల్లోనూ నాగశౌర్య, రాశిఖన్నా, శ్రీని అవసరాల ఒదిగిపోయారు. సపోర్టింగ్ రోల్స్ చేసిన ఇతర నటీనటులంతా కూడా ఆకట్టుకున్నారు. 

కథ కన్నా కథనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చిన ఈ సినిమా ఒక మహోన్నతమైన తెలుగుసినిమా అని చెప్పను కానీ ఆకట్టుకునే కథనంతో చక్కని పాటలతో సున్నితమైన హాస్యంతో ఒక మంచి సినిమాని చూసిన అనుభూతిని అందిస్తుంది. కామెడీ అంటే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఎదుటి వ్యక్తిని బకరాని చేయడం లేదా తన్నడం మాత్రమే అనుకోకుండా సన్నివేశాలనుండి సంభాషణలనుండి కూడా హాస్యాన్ని సృష్టించవచ్చని ప్రూవ్ చేసిన ఒకప్పటి జంధ్యాల సినిమాలను గుర్తు చేసే సినిమా ఈ "ఊహలు గుసగుసలాడే". ఈ పోస్ట్ లో ఎంబెడ్ చేసిన ట్రైలర్స్ చూడండి నచ్చితే ఈ సినిమా మిస్ అవకండి. 


శుక్రవారం, ఆగస్టు 15, 2014

మార్పు మనతోనే మొదలవ్వాలి...

 
"మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం కూడా దేశభక్తే... మార్పు మనతోనే మొదలవ్వాలి.." అని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక చక్కని లఘు చిత్రాన్ని కానుకగా అందించారు హీరో అల్లూ అర్జున్. ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ నీ, అల్లూ అర్జున్ నీ మరియూ ఈ చిత్రానికి పని చేసిన టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి సందేశాత్మకమైన లఘుచిత్రాన్ని నిర్మించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ ఇక్కడ చూడవచ్చు. ఈ లఘు చిత్రాన్ని క్రింది ఎంబెడ్ వీడియోలో లేదా ఇక్కడ చూడవచ్చు.

మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.  

బుధవారం, మే 07, 2014

ఎన్నికల కబుర్లు..

ఆదివారం కాకపోయినా ఆ రోజు అందరికీ సెలవు ఉండేది... సెలవు అయినాకానీ నాన్న మాత్రం ఇంట్లో ఉండేవారు కాదు.. ఒకరోజు ముందుగానే ప్రయాణమయి ఎక్కడో దూరంగా ఉండే ఊరికి స్పెషల్ డ్యూటీ మీద వెళ్ళేవారు... నాన్న వెళ్ళిన దగ్గర నుండీ అమ్మ రేడియో, టీవీ అన్నీ ఎదురుగా పెట్టుకుని వింటూ చూస్తూ నాన్న డ్యూటీకి వెళ్ళిన ఊరిలో ఏ గొడవలూ రాకూడదని అందరు దేవుళ్ళకీ మొక్కులు మొక్కుకుంటూ గడిపేది...

తెల్లారి ఎన్నికల రోజు పది పదకొండు గంటల సమయంలో వంట పనులన్నీ అయ్యాక పార్టీ కార్యకర్తలు అరేంజ్ చేసిన వాహనాల్లో అమ్మ ఇంకా పక్కింటి ఆంటీలందరూ వెళ్ళి ఓటు వేసి వచ్చేవాళ్ళు. ఇంట్లో ఓటుహక్కులేని పిల్లలమంతా ఆటల్లో మునిగి తేలుతూ అమ్మతో ఏమేమి స్పెషల్స్ వండించుకోవాలో ప్లాన్లు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓటుహక్కు గురించి బొత్తిగా అవగాహనలేని స్కూల్ రోజుల్లో ఓట్లంటే రాజకీయనాయకులకు లబ్ది చేకూర్చేవి మాత్రమే అనీ అందుకే వాళ్ళు అలా కారుల్లో తీస్కెళ్ళి ఓట్లేయిస్తారనీ అనుకునేవాడ్ని.

కంప్యూటర్లు లేని ఆ రోజుల్లో ఓటరు జాబితాలతో అన్నీ ఇన్నీ పాట్లు కావు ఫోటోలు ఉండేవి కావు, పేర్లు సరిపోయేవి కాదు స్లిప్పులపై పేర్లలో తేడాలు ఉంటే ఓటేయనిచ్చేవారు కాదు అయినా దొంగ ఓట్లు చాలా పడేవి. కొన్నిసార్లు ఓటు వేయడానికి వెళ్ళే సరికే అక్కడ వీళ్ళ వోట్లు ఎవరో వేసేసేవారు. హోటల్ దగ్గరో రోడ్ మీద ఎదురైతేనో కొంతమంది “ఒరేయ్ ఈ వేలుమీద ఉన్న గుర్తు ఎలా చెరిపేయాలో చెప్పరా చదూకున్నావ్ గా ఆ మాత్రం తెలియదా” అని అడిగేవారు ఆ గుర్తు చెరపడానికి నానారకాల విన్యాసాలు చేసేవారు.  

సెల్ఫోన్ల ఊసే లేక లాండ్ లైన్ ఫోన్లు, టీవీలు కూడా పరిమితంగా ఉండే ఆ రోజుల్లో రేడియోలో వార్తలు, వార్తా పత్రికలు సాయంత్రం ప్రచురించే స్పెషల్ ఎడిషన్ పేపర్లు, ఇంకా ఆనోటా ఈనోటా తెలిసే గాలివార్తలే ప్రముఖమయేవి. చాలా సార్లు ఉదయం ప్రశాంతంగా జరిగే ఎన్నికలు మధ్యాహ్నానికి రకరకాల వార్తలతో గందరగోళమయేవి.

పేపర్ బాలెట్ ఉపయోగించే ఆ రోజుల్లో బాలెట్ బాక్సుల్లో నీళ్ళు, ఇంకూ పోసేవాళ్ళు, పోలింగ్ బూత్ లో చొరబడి వాటిని ఎత్తుకెళ్ళే వాళ్లు, ఓటర్ జాబితాలను చించేసేవాళ్ళూ, రిగ్గింగ్ చేసే వాళ్ళూ, ఎన్నికల ఆఫీసర్స్ ని కిడ్నాప్ చేసే వాళ్ళు, బాంబు దాడులు కత్తిపోట్లు రాళ్ళ దాడులు గొడవలు కొన్ని సార్లు రణరంగాన్ని తలపించేవి.
 
డ్యూటీకి వెళ్ళి వచ్చిన నాన్న కథలు కథలుగా ఆ సంఘటనలు దదాపు వారం రోజులు చెప్పేవారు. చండశేషనుడు గా పేరొందిన టి.ఎన్.శేషన్ ఎన్నికల నిర్వహణాధికారిగా వచ్చేవరకూ ఇలాంటి పరిస్థితులే కొనసాగాయి. ఆ తర్వాత నుండి మెల్లగా పరిస్థితులు మెరుగవడం మొదలైంది.

ఇపుడంతా ఎలక్ట్రానిక్ యుగం, పేపర్ బాలెట్స్ స్థానంలో ఎలెక్ట్రానికి ఓటింగ్ మెషీన్స్ వచ్చాయి. హింస రక్తపాతం చాలావరకూ తగ్గింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడూ చెదురు ముదురు సంఘటనలు జరుగుతున్నా కూడా రెలెటివ్ గా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయనే చెప్పచ్చేమో....

ఇంతకీ ఇపుడిదంతా ఎందుకు గుర్తు చేసుకున్నానంటే ఈరోజు ఎన్నికలు జరిగాయి కాబట్టి నేనూ ఓటేశాను కాబట్టి. ఉదయాన్నే ఏడున్నరకల్లా పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి దదాపు గంటన్నర సమయం వెచ్చించి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను.

పొద్దున్న చల్లగా ఉంటుంది క్యూలో ఎదురు చూడడం కూడా సులువు అనుకుని వెళ్తే దదాపు మా వార్డ్ లో అందరూ అదే అనుకున్నట్లున్నారు నేను వెళ్ళే సరికే దదాపు అరవై మందికి పైగా క్యూ ఉంది సరే కదా అని ఎదురు చూడ్డం మొదలెడితే ఎనిమిదయ్యే సరికి మిట్టమధ్యాహ్నంలా సూర్యుడు ప్రతాపం చూపడం మొదలెట్టాడు.

గుంటూర్లో అసలే చెమటలెక్కువేమో ఒక పక్కన గాలి వీస్తూన్నా కూడా ఏమాత్రం ఆరకుండా చెమటలు పడుతూనే ఉన్నాయి. లైఫ్ ఈజ్ జిందగీ రూల్ ప్రకారం మనం నుంచున్న క్యూలోనే జనం ఎక్కువ ఉంటారు అదే మెల్లగా కదులుతూ ఉంటుంది ఎప్పుడూ, ఈ వేళ కూడా అంతే మెల్లగా నడుస్తుంది.

మా వార్డ్ జనాభాకే చైతన్యం ఎక్కువై ఇంత పొద్దున్నే వచ్చేశారు మా పక్క బూత్ మరోటి కూడా రష్ గానే ఉంది వాళ్ల క్యూ కాస్త చెట్ల నీడలో సాగింది. ఇక మా రెండూ తప్ప మిగిలిన బూత్స్ లో ఎక్కడా పది పదిహేనుమందికి మించలేదు. వీటన్నిటికి తోడు క్యూ జంప్ చేద్దామని ప్రయత్నించేవాళ్ళకీ తక్కువ లేదు.

సరే ఎలాగైతేనేం ఓటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకుని పనులు చూసుకుని సీనియర్ సిటిజన్ కనుక క్యూలో ఎదురు చూడాల్సిన పని ఉండదులే అని పన్నెండు ప్రాంతంలో కాస్త వాతావరణం కూడా చల్లబడిందిలే అని నాన్నగారిని ఓటు వేయించడానికి తీస్కెళితే మా బూత్ లో స్టాఫ్ అందరూ ఖాళీగా ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు.

ఏ సిటిజన్ అయినా డైరెక్ట్ గా వెళ్ళి ఓటేసి వచ్చేయడమే అనమాట. హారినీ నేనూ తమ్ముడూ ఆవేశంగా పొద్దున్న వచ్చామనమాట మేం కూడా ఇప్పుడే వస్తే పోయేది అనుకున్నాను. కనుక మిత్రులారా ఉదయాన్నే వెళ్ళడం కన్నా అవకాశముంటే ఇలా ఏ లంచ్ టైమ్ లోనో వెళ్తే సులువుగా క్యూలు లేకుండా ఓట్ వేసి వచ్చేయచ్చనమాట గుర్తుంచుకోండి.

ఏదైతేనేం ఎపుడూ నేనో చెల్లాయో ఊరిలో ఉండకపోవడమో, నాన్న ఎలెక్షన్ డ్యూటీలకి వెళ్ళడమో జరిగేది కనుక మా ఇంట్లో అందరమూ ఓట్లు వేసే అవకాశం ఉండేది కాదు. నేను పుట్టి బుద్ది ఎరిగాక ఈరోజు మొదటిసారి మా ఇంట్లో అందరమూ ఓటేసి మా తరఫున వందశాతం పోలింగ్ నమోదు చేయగలిగామనమాట.

ఇన్నీ చెప్పి మరి ఓటేశానని చెప్పే ప్రూఫ్ చూపించకపోతే ఎలా... అసలే ఈ కాలంలో ఈ వేలుచూపించడమో స్టైల్ కదా.. ఇదనమాట విషయం.

శనివారం, ఫిబ్రవరి 01, 2014

కౌముది లో నేను...

కౌముది సాహితీ మాసపత్రికలో పాఠకులు పాల్గొనే శీర్షికలో ఈ ఏడాది థీం "టెంత్ క్లాస్ జ్ఞాపకాలు" అని మీరు చూసే ఉంటారు. ఈ నెల(ఫిబ్రవరి 2014) కౌముదిలో ఈ శీర్షికన నేను రాసిన వ్యాసం ప్రచురితమైంది. నా వ్యాసం ప్రచురణకి స్వీకరించిన కిరణ్ ప్రభ గారికీ, కాంతి గారికీ ధన్యవాదాలు. 

వ్యాసం చూడాలంటే ఇక్కడ పత్రిక లింక్ పై క్లిక్ చేసి ఇండెక్స్ కిందకి స్క్రోల్ చేస్తే పాఠకులు పాల్గొనే శీర్షిక అన్న దానిమీద క్లిక్ చేస్తే నా వ్యాసం చూడవచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేస్తే నా వ్యాసం డాక్యుమెంట్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. మీ స్పందన కౌముదిలో కామెంట్స్ రూపంలో ఇక్కడ తెలియచేయవచ్చు.

ఈ శీర్షికకు మీరూ వ్యాసాలు పంపించవచ్చు మీ టెంత్ క్లాస్ అనుభవాలను గూర్చి 3-4 పేజీలలో వచ్చేట్లుగా యూనికోడ్ లో టైప్ చేసి editor@koumudi.net కు పంపించండి. మరిన్ని వివరాలకు వ్యాసంలోని మొదటిపేజ్ లో గల ప్రకటన చూడండి. 

బుధవారం, జనవరి 22, 2014

అమ్మ పెంపకం...

నాకున్న సినిమా పిచ్చి వారసత్వంగా వచ్చినదే... నా చిన్నతనంలో అమ్మా నాన్న ఇద్దరూ కూడా విపరీతంగా సినిమాలు చూసేవారట. నేను చిన్నపిల్లవాడ్ని కదా సో ఒకోరోజు తొందరగా నిద్రపోయినా కూడా అలాగే నన్ను రిక్షాలో వేసుకుని సినిమాకి తీస్కెళ్ళే వాళ్ళట. అప్పట్లో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అవి ట్రాన్సిస్టర్లు లైసెన్సులు రద్దయ్యి మాములుగా ఛలామణి అవుతున్న రోజులు కనుక రేడియో వినడం ఒక హాబీ అంతే తప్ప క్రేజ్ ఉండేది కాదు టీవీలు ఎవరో కోటీశ్వరుల ఇంట్లో వీసీఆర్ తో చూడ్డానికి మాత్రమే ఉండేవి.

నాటకాలు ఇంకా నడుస్తూనే ఉండేవి కానీ సినిమాలంత విరివిగా లభ్యత ఉండేది కాదు సో ఇక సాయంత్రం ముఖ్యమైన ఆటవిడుపు అంటే సినిమాలే అనమాట. నాకు పాటలు వినడం సినిమాలు చూడ్డం అడగకుండానే తీరే కోరికలు కనుక వాటిపై ఇష్టం ఆటోమాటిక్ గా పెరిగిపోయింది అయితే నేను కాస్త హైస్కూల్ కి వచ్చేసరికి అమ్మానాన్నలకి ఆసక్తి తగ్గడంతో సినిమాలకి వెళ్ళడం తగ్గించేశాం. అక్కడే మొదలైంది నా సమస్య. 

అపుడు నా క్లాస్మేట్స్ అందరితో డిస్కస్ చేయడానికో లేకా ఏ చిరంజీవి సినిమానో సూపర్ గా ఉందని విని ఇంట్లో పోరి పోరి పర్మిషన్ తెచ్చుకుని ఎపుడైనా సినిమాకి వెళ్దామనుకుని ప్లాన్ చేసుకున్నపుడు ఒకోరోజు అమ్మ ఆఫీస్ నుండి ఆలశ్యంగా వచ్చేది. అప్పట్లో ఇంత విరివిగా ఫోన్లు కూడా ఉండేవి కాదు కనుక ఎదురు చూడ్డం తప్ప ఏం చేయలేకపోయేవాణ్ణి సో సినిమా టైం దాటిపోయేవరకూ వస్తుందేమో ఇపుడు వెళ్తామేమో అని ఎదురు చూసి ఆ తర్వాత ఉక్రోషాన్ని ప్రదర్శించడానికి అమ్మ వచ్చేవరకూ కోపంతో ఎదురు చూసేవాడ్ని. వచ్చాక ఏడ్చి అరిచి గోల గోల చేసేవాడ్ని.

ఒకోసారి అమ్మ సమయానికి వచ్చేది కానీ "ఈ రోజు సినిమాకి వెళ్ళట్లేదు రేపు వెళ్తున్నాం" అని చెప్పేది ఎందుకంటే "అదంతే నేను మనసు మార్చుకున్నాను ఈరోజు నాకు చూడాలని లేదు" అనేది లేదంటే నాన్నకి ఏదో ఒక పని చెప్పి బయటకి పంపి ఇక ఈరోజుకి కుదరదనేది. ఇంకొంచెం పెద్దయ్యాక నన్ను ఒక్కడ్నే సినిమాకి పంపిస్తానని చెప్పి తర్వాత నాన్నని కూడా తోడు తీస్కెళ్ళమనేది లేదంటే పంపిస్తానన్న రోజు కాక మరుసటి రోజో కొన్నాళ్ళు ఆగో వెళ్ళమనేది. ముఖ్యంగా హైస్కూల్ కి వచ్చాక ఇలా జరుగుతుండేది.

నాకు అస్సలు అర్ధమయ్యేది కాదు "ఎందుకు ఇలా చేస్తుంది అమ్మకి నేనంటే ఇష్టంలేదా నామీద కోపమా.. సినిమాకే కదా వెళ్తానంటున్నాను నా క్లాస్మెట్స్ లాగా టూర్స్ కి పిక్నిక్ కి స్లీపోవర్స్ కి వెళ్తాననట్లేదు కదా ఇంత చిన్న కోరిక తీర్చడానికి కూడా ఏవిటి ప్రాబ్లం" అని తెగ ఆలోచించేవాడ్ని ఒకోసారి గయ్యాళి రాకాసి అని తిట్టుకునేవాడ్ని. అలా ఒకసారి తొమ్మిదో తరగతిలోనో పదిలోనో ఇలాంటి విషయం మీదే బాగా గొడవయ్యి "అసలు ఎందుకు ఇంతలా కక్షగట్టినట్లు సాధిస్తున్నావ్ అమ్మా.. నేనంటే నీకు ఎందుకింత కోపం" అని అడిగేశా. 

అపుడు అమ్మ చెప్పింది “రేపు జీవితంలో నువ్ పెద్దయ్యాక అన్ని పరిస్థితులు నీ కంట్రోల్ లో ఉండవు అపుడపుడు నువ్వు అనుకున్నది చేయలేకపోవడమో కావలనుకున్నది దక్కకపోవడమో జరగచ్చు అలా కాకుండా చేయగల పరిస్థితులు నీ అదుపులో ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితులని నువ్ ఎదుర్కోవాలంటే ఇప్పటినుండే ఇలాంటి చిన్న చిన్న వాటిలో డిజప్పాయింట్మెంట్ నీకు అలవాటవ్వాలి. సినిమా అనేది ఎంత చిన్న విషయం ఈరోజు కాకపోతే రేపు చూస్తావ్ దానివల్ల జరిగే పెద్ద నష్టం ఏముంది ? దానికే నువ్వింత తల్లకిందులై బాధపడాల్సిన అవసరం ఉందా ? ఆలోచించి చూడు” అని.

అమ్మ మాటలు విన్నాక స్థిమితంగా కూర్చుని ఆలోచించి చూస్తే నిజమే కదా అనిపించింది ఆ తర్వాత ఎలాంటి నిరాశనైనా సమర్దంగా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం అలవర్చుకున్నాను పెద్ద పెద్ద డిజప్పాయింట్మెంట్స్ కి కూడా అంత తీవ్రంగా బాధపడలేదు ఇక చిన్న చిన్న వాటినైతే పట్టించుకోవడం కూడా మానేశాను. అంతేకాక సరదాగా అప్పుడప్పుడు నన్ను నేను టెస్ట్ చేస్కోడానికి ఒకోసారి లాస్ట్ మినిట్ లో నేనే పోస్ట్ పోన్ చేసేసేవాడ్ని.

అమ్మ చేసిన మరో అలవాటు పుస్తకాలు, నా చిన్నపుడు నాకు చదవడం అలవాటవాలని చందమామ, బాలమిత్ర, బుజ్జాయి లాంటివి కనీసం నాలుగైదు పిల్లల పుస్తకాలు ప్రతినెలా తెప్పించి పెట్టేది. ఎలిమెంటరీ స్కూల్లో అంటే ఆరోతరగతిలోపు ఆపుస్తకాలు ఎంత సేపు చదివినా ఊరుకునేది కానీ హైస్కూల్ కి వచ్చాక అవే పట్టుకుని కూర్చుంటానంటే కుదరదని వాటికి కూడా టైమ్ టేబుల్ వేసేది. 

ఇక నన్ను క్లాస్ బుక్స్ చదివించడానికి తనుకూడా నాతోపాటు ఏవో ఒక వీక్లీనో నవలో పట్టుకుని కూర్చునేది. కానీ అవి చదవడానికి నాకు అనుమతి ఉండేది కాదు. అలాంటి సమయంలో మల్లాదిగారు రాసిన "నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త" నవల చదివిన అమ్మ ఆ కాన్సెప్ట్ గురించి నాకు చెప్పింది. నాకు చాలా ఆసక్తిగా అనిపించింది కానీ చదవడానికి దదాపు ఆరునెలలు వెయిట్ చేశాక సమ్మర్ హాలిడేస్ లో చదవనిచ్చింది అప్పటి వరకూ ఆ పుస్తకాన్ని దాచి ఉంచింది. అదే నా మొదటి నవల అదో అపురూపమైన అనుభూతి. ఇంటర్మీడియెట్ అయ్యేవరకూ కూడా ఇలా తను చదివి సెలెక్ట్ చేసిన కొన్ని నవలలు మాత్రమే చదవడానికి అనుమతి ఉండేది నాకు. 

ఇలా చాలా విషయాలలో మమ్మల్ని అమ్మ గారం చేస్తూనే కొన్ని విషయాలలో అంతే స్ట్రిక్ట్ గా కట్టడి చేస్తూ జాగ్రత్తగా పెంచిందనిపిస్తుంటుంది. కానీ అప్పుడంత కఠినంగా ఉన్నా అమ్మమీద ఎంత కోపమొచ్చినా అలకొచ్చినా కొంచెం సేపటిలోనే మొత్తం కరిగిపోయేది... ఎలా తెప్పించేదో అలాగే ఏదో ఒక మాయ చేసేసి ఆ కోపాన్ని అలకని కూడా తగ్గించేసేది. కానీ ఐదేళ్ళక్రితం సరిగ్గా ఇదే రోజు జనవరి 22 న మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయి తెప్పించిన దిగులుని మాత్రం ఎంతగా అలిగినా ఇంతవరకూ తగ్గించలేకపోయింది. ఐదేళ్ళైనా అపుడపుడు తలచుకున్నపుడు ఇంత పెద్దవాడ్నికూడా ఈ సినిమాలో ఈషాన్ అంత అయిపోయి "भीड़ में, यूँ ना छोड़ो मुझे... क्या इतना बुरा हूँ मैं माँ... क्या इतना बुरा मेरी माँ" అని అడగాలనిపిస్తుంటుంది.


मैं कभी बतलाता नहीं
पर अंधेरे से डरता हूँ मैं माँ

यूँ तो मैं, दिखलाता नहीं
तेरी परवाह करता हूँ मैं माँ
तुझे सब है पता, है ना माँ
तुझे सब है पता, मेरी माँ

भीड़ में, यूँ ना छोड़ो मुझे
घर लौट के भी आ ना पाऊँ माँ  
भेज ना इतना दूर मुझको तू
याद भी तुझको आ ना पाऊँ माँ
क्या इतना बुरा हूँ मैं माँ
क्या इतना बुरा मेरी माँ

जब भी कभी पापा मुझे
जो ज़ोर से झूला झुलाते हैं माँ
मेरी नज़र ढूँढे तुझे
सोचूं यही तू आ के थामेगी माँ

उनसे मैं ये कहता नहीं
पर मैं सहम जाता हूँ माँ
चेहरे पे आने देता नहीं
दिल ही दिल में घबराता हूँ माँ
तुझे सब है पता है ना माँ
तुझे सब है पता मेरी माँ
मैं कभी बतलता नहीं...

Movie/Album: तारे ज़मीन पर (2007)
Music By: शंकर एहसान लॉय
Lyrics By: प्रसून जोशी
Performed By: शंकर महादेवन

లిరిక్స్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ లోనూ అనువాదాన్ని పై వీడియోలో సబ్ టైటిలో లేదా ఈ లింక్ పై నొక్కి చూడవచ్చు.

బుధవారం, జనవరి 01, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారూ... న్యూ ఇయర్ ఈవ్ అని నిన్న ఉదయం నుండి మొదలుపెట్టి ఈ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా పార్టీలలో, గెట్ టుగెదర్ లలో, ఈమెయిల్స్, ట్వీట్స్, ప్లస్ పోస్ట్స్, ఫేస్బుక్ వాల్ పోస్ట్స్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ లాంటి మెసెంజెర్స్, ఫోన్ కాల్స్, ఛాట్స్, ఇతరత్రా అందుబాటులో ఉన్న ప్రతిమాధ్యమం ద్వారానూ మీ మిత్రులకి, ఆత్మీయులకి, పరిచయస్తులకి అందరికి శుభాకాంక్షలందించేసి అందుకుని ఉంటారు కదా. ఇక ఈ వేళ్టికి చాలని పడుకునేముందు ఈ బ్లాగ్ ద్వారా కూడా మరొక్కమారు విషెస్ అందుకోండి.

మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మనమంతా నూతనోత్సాహంతో మొదలెట్టి ఏడాదంతా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను.

 

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.