శనివారం, అక్టోబర్ 25, 2014

కార్తికేయ

జవాబులేని ప్రశ్నలు అంటూ ఉంటే అది ప్రయత్నలోపమే తప్ప తగినవిధంగా ప్రయత్నిస్తే సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదని నమ్మే క్యూరియస్ అండ్ డేరింగ్ మెడికో కార్తీక్. తను మెడికల్ కాంప్ లో భాగంగా సుబ్రహ్మణ్యపురం అనే చిన్న ఊరికి వెళ్తాడు. అక్కడ ఎంతో పురాతనమైన ఒక సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంటుంది కానీ ఇటీవల మూసి వేయబడిన ఆ గుడి తలుపులు తెరవడానికి ఎవరు ప్రయత్నించినా అసలు ఆ గుడి గురించి మాట్లాడినా కూడా చనిపోతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన కార్తీక్ తన సహజమైన క్యూరియాసిటీ తో ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడనేదే "కార్తికేయ" సినిమా.

నిఖిల్ తన ట్రెండ్ మార్చి చేసిన గత చిత్రం స్వామిరారా తరహాలోనే హైపర్ యాక్షన్ ని పక్కన పెట్టేసి పాత్రకు తగినట్లు హుందాగా నటించాడు. స్వాతి కూడా అవసరానికి మించి బబ్లీనెస్ ప్రదర్శించకుండా చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఒకటి రెండు సార్లు మేకప్ విషయంలో మరికాస్త శ్రద్ద తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ప్రవీణ్, సత్య హాస్యం బాగుంది అలాగే జోగి బ్రదర్స్ లో ఒకరైన జోగినాయుడికి మంచి పాత్ర దక్కింది. మిగిలిన సీనియర్ నటులు తనికెళ్ళ భరణి గారు, రావురమేష్, తులసి, కిషోర్, రాజా రవీందర్ అంతా వారి వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. 

నూతన దర్శకుడు చందు మొండేటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళకుండా పూర్తిగా కథా కథనాలను నమ్ముకుని తెరకెక్కించారీ చిత్రాన్ని. సస్పెన్స్ ను చివరివరకూ మెయిన్ టెయిన్ చేస్తూ తను రాసుకున్న కథనం ఆకట్టుకుంది. అయితే సినిమా అంతా బిల్డప్ మరీ ఎక్కువవడంతో చివరికి సస్పెన్స్ రివీల్ అయినప్పుడు ఇంతేనా అని కాస్త డిజప్పాయింట్ మెంట్ కి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే భక్తిని సైన్స్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సినిమాని కంక్లూడ్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది.

ఈ సినిమాకి శేఖర్ చంద్ర నేపద్య సంగీతం మంచి ఎసెట్ అయింది చాలా సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి తోడ్పడింది. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా మరో పెద్ద ఎసెట్. పాటలలో ఒకటి రెండు మెలోడీలు ఆకట్టుకుంటాయి కానీ ద్రిల్లర్ కావడంతో పాటలు నెరేషన్ కి అడ్డుపడిన ఫీలింగ్ కలిగింది. "ఇంతలా" అనే పాట కాన్సెప్ట్ అండ్ చిత్రీకరణ మాత్రం బాగుంది. రొటీన్ ఫార్ములా చిత్రాలకు భిన్నంగా థ్రిల్లర్ సబ్జెక్ట్ తో కథే హీరోగా తీసిన చిత్రం కార్తికేయ. వైవిధ్యమైన సినిమాలను థ్రిల్లర్ సినిమాలనూ ఇష్టపడే ప్రేక్షకులు తప్పక ఒకసారి చూసి తీరవలసిన చిత్రమిది, డోంట్ మిస్ ఇట్. 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.