శుక్రవారం, ఆగస్టు 22, 2014

ఊహలు గుసగుసలాడే...

ప్రేమ !... రెండక్షరాల పదం... ఒక చిన్న ఫీలింగ్ / ఎమోషన్... సినిమాలు మొదలయినప్పటినుండీ... ఆమాటకొస్తే కథలు చెప్పడం మొదలైన దగ్గర నుండి కూడా ఇప్పటికి కొన్ని వేల సార్లు కథా వస్తువుగా ఉపయోగపడింది ఈ ప్రేమ, ఇక ముందు కూడా ఉపయోగపడుతుంది.

ప్రేమ కథలు ఎన్ని సార్లు విన్నా చూసినా బోర్ కొట్టవని కొత్తగానే ఉంటాయని పదే పదే హిట్ అయ్యే ఎన్నో ప్రేమకథలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. అలాంటి ఒక ప్రేమకథకి ఆకట్టుకునే కథనం, చక్కని సంభాషణలు, సున్నితమైన హాస్యం కూడా తోడైతే... ఆ సినిమా చూడడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

అలాంటి ఓ మంచి సినిమానే "ఊహలు గుసగుసలాడే" సినిమా... ఈ సినిమా ఈ ఆదివారం (24 ఆగస్ట్ 2014) సాయంత్రం 6 గంటలకు మాటీవీ లో టెలికాస్ట్ అవుతుంది. అవకాశమున్న ప్రతిఒక్కరూ తప్పక చూడండి... డోంట్ మిస్ ఇట్... ఒక వేళ మిస్ అయినా 25 ఆగస్ట్ 2014 నుండి డివిడి లభ్యమవనుంది సొంతం చేస్కోండి.

 

చెడిపోవడానికి అన్ని అవకాశాలున్నా కూడా బుద్దిమంతుడిగా మిగిలిపోయిన ఒక రిచ్ మంచబ్బాయి ఆనంద్ గా "అష్టాచెమ్మా" సినిమాతో పరిచయమైన "శ్రీనివాస్ అవసరాల" దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. నటుడిగా ఆ సినిమాతో ఎంత ఆకట్టుకున్నాడో దర్శకుడిగా, రచయితగా అడుగడుగునా తన మార్క్ చూపిస్తూ ఈ సినిమాతో కూడా అంతే ఆకట్టుకున్నాడు. ఎక్కడా వెకిలి హాస్యానికి చోటివ్వకుండా క్లీన్ కామెడీతో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మన సొంతం చేశాడు. 

ఈ సినిమాకి కళ్యాణ్ కోడూరి సంగీతం కూడా ఒక పెద్ద ఎసెట్ అయింది. సంగీతం అంటే వాయిద్యాల హోరుగా సాహిత్యాన్ని మింగేసేదిగా నిర్వచనాన్ని మార్చేస్తున్న ఈరోజుల్లో... సిరివెన్నెల, అనంత శ్రీరాం రాసిన పాటల్లోని అందమైన సాహిత్యాన్ని చక్కగా కాంప్లిమెంట్ చేస్తూ ప్రతి పదమూ స్పష్టంగా వినిపించేలా దానికి సపోర్టింగ్ గా నేపధ్యంలో పరిమితమైన వాయిద్యాలతో చాలా హాయైన అనుభూతిని ఇచ్చింది. కావాలంటే ఒకసారి ఈ క్రింది పాట విని చూడండి మీరే ఒప్పుకుంటారు. అలాగే నేపధ్య సంగీతం సైతం ప్రతి సీన్ లోనూ సంభాషణలను మింగేయకుండా సన్నివేశాలను ఎలివేట్ చేస్తుంది. సినిమాకు మరో ఎసెట్ వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ... వైజాగ్ బీచ్ అయినా, టీవీ స్టూడియో అయినా, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయినా, సినిమా థియేటర్ అయినా, ఏదైనా కూడా చూడచక్కని ఫ్రేమ్స్ లో కళ్ళకి ఏమాత్రం శ్రమనివ్వని కలర్ కాంబినేషన్స్ లో సన్నివేశానికి తగిన మూడ్ కియేట్ చేస్తూ హాయిగా అనిపిస్తుంది. సినిమాలోని ముఖ్యమైన మూడు పాత్రల్లోనూ నాగశౌర్య, రాశిఖన్నా, శ్రీని అవసరాల ఒదిగిపోయారు. సపోర్టింగ్ రోల్స్ చేసిన ఇతర నటీనటులంతా కూడా ఆకట్టుకున్నారు. 

కథ కన్నా కథనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చిన ఈ సినిమా ఒక మహోన్నతమైన తెలుగుసినిమా అని చెప్పను కానీ ఆకట్టుకునే కథనంతో చక్కని పాటలతో సున్నితమైన హాస్యంతో ఒక మంచి సినిమాని చూసిన అనుభూతిని అందిస్తుంది. కామెడీ అంటే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఎదుటి వ్యక్తిని బకరాని చేయడం లేదా తన్నడం మాత్రమే అనుకోకుండా సన్నివేశాలనుండి సంభాషణలనుండి కూడా హాస్యాన్ని సృష్టించవచ్చని ప్రూవ్ చేసిన ఒకప్పటి జంధ్యాల సినిమాలను గుర్తు చేసే సినిమా ఈ "ఊహలు గుసగుసలాడే". ఈ పోస్ట్ లో ఎంబెడ్ చేసిన ట్రైలర్స్ చూడండి నచ్చితే ఈ సినిమా మిస్ అవకండి. 


2 వ్యాఖ్యలు:

  1. నేనూ ఆన్‌లైన్లో మొన్నే చూసాను.బావుంది సినిమా..simple comedy. మొదటిసారి హీరోయిన్, అవసరాల శ్రీనివాస్ పెళ్ళిచూపులకి కలుసుకున్నప్పుడు మోనాలిసా గురించి కవిత చెప్తాడు కదా.. టూమచ్ అది :)

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. థాంక్స్ అనామిక గారు.. నాన్నైతే అవసరాల,హీరోయిన్ ల కాంబినేషన్ సీన్స్ అన్నీ భలే నవ్వించాయ్ అండీ :)

      తొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.