ఇది చాలా రోజుల క్రితం కథ, అప్పటికింకా వోల్వోబస్సులు మన ఆర్టీసీకి రాని రోజుల్లో.. బస్సుల్లో కూడా హైటెక్ హవా నడుస్తున్నరోజుల్లో ఓ శుభముహుర్తాన బెంగళూరు నుండి ఓ ప్రైవేట్ హైటెక్ బస్సు లో గుంటూరు బయల్దేరాను. రాత్రి పదకొండుగంటల ప్రాంతంలో భోజనమయ్యాక వాక్మన్ లో పాటలు వింటూ నిద్రకుపక్రమిస్తుండగా "థడ్‍డ్..డాం.." మంటూ పెద్ద శబ్దం అంతకన్నా పెద్ద కుదుపుతో బస్ ఆగిపోయింది. దదాపు కూర్చున్న ప్రతిఒక్కరికి మొహమో కాళ్ళకో ముందు సీట్ కి తగిలి చిన్న దెబ్బలు తగిలాయి. బస్ ముందు అద్దం పగిలింది కదిలే స్థితిలో ఉందో లేదో తెలీదు. భోజనాల దగ్గర మందుకొట్టి ఎక్కిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ కూడా ప్రయాణీకులతో పాటు నిద్రకుపక్రమిస్తూ యాక్సిడెంట్ చేయడం కాకుండా వెంటనే బస్ ని, ప్రయాణీకులని గాలికి ఒదిలేసి పరారయ్యారు. వీడు ఎదురుగా గుద్దినది ఒక అర్టీసీ బస్ ని ఆ బస్ స్టాఫ్ మా రూట్ లో వెళ్ళే ఇతర ఆర్టీసీ బస్సులను ఆపి మమ్మల్ని ఎక్కించి పంపించారు. నాదగ్గర ఉన్న అన్ని డబ్బులు ప్రైవేట్ బస్ వాడి టికెట్ కి పెట్టేయడం తో ఈ కొత్త బస్ లో టికెట్ కి పదిరూపాయలు తగ్గితే ఓ అపరిచితుడ్ని అడిగి టికెట్ తీసుకున్నాను అతను మా కొలీగ్ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడనుకోండి. ఈ సంఘటన నాకు రెండు పాఠాలు నేర్పింది. ఒకటి కేవలం గవర్నమెంట్ బస్సులు మాత్రమే ఎక్కడం. ఇంకోటి ప్రయాణం లో ఎప్పుడూ టికెట్ డబ్బుకి రెట్టింపు డబ్బు దగ్గర ఉంచుకోడం.
అలా బస్ ఆగిపోయి రెండునిముషాలు కూడా అవ్వలేదు అతి దగ్గరలో వెనక నుండి పెద్దగా రైలు కూత !! వెనక్కి తిరిగి చూస్తే.. నాకైతే ఒక్క క్షణం వెన్నుజలదరించింది, ఆ రైలు నా గుండెల్లోనే పరిగెట్టినట్లు అనిపించింది. రైల్వే ట్రాక్ కు మా బస్ కూమధ్య రెండు బస్సులు పట్టే అంత దూరం అంతే.. గేటు దాటిన వెంటనే మా బస్ ఆగిపోయింది కాబట్టి సరిపోయింది అదే ట్రాక్ మీద ఆగితే మా పరిస్థితి ఏంటి. బస్ లో పసిపిల్లలు, మహిళలు, వృద్దులు అన్ని రకాల వాళ్ళు మంచి నిద్ర లో ఉన్నారు అందర్ని లేపి సమయానికి బస్ నుండి దింపడం సాధ్యమయ్యే పనేనా.. బస్ ను ట్రాక్ పైనుండి నెట్టి ఇవతలికి తీసుకురావాలన్నా అంత తక్కువ వ్యవధిలో అయ్యేనా... అసలు ఇలాటి ఎమర్జన్సీ సమయం లో గేట్ పడకపోతే అతి తక్కువ సమయంలో రైలు ను ఆపటానికి సరైన ఎక్విప్ మెంట్ మరియూ భద్రతా వ్యవస్థ ఆగేట్ దగ్గర ఉందా ఇలాటి ప్రశ్నలు చుట్టుముట్టాయి. నాకు తెలిసి ఇది వరకు 5 నిముషాలకు ముందే గేట్ వేసేవాడు ఇపుడు బెటర్ ఎక్విప్మెంట్ ఉండటం వల్ల ఆ వ్యవధి తగ్గించాడా లేక కేవలం ట్రాఫిక్ ఒత్తిడి వలనా అనేది తెలియదు.
సరే బస్ ఆగింది సెల్ఫ్ స్టార్ట్ అవడం లేదు ఇక మార్గాంతరం బస్ తోయడమే అయి ఉంటుంది అనుకుంటూ బస్ దిగి ఏమైందా అని నిలబడి చూస్తున్నాను. అప్పటికే నాలాటి ఎంతూసియాస్ట్స్ కొందరు దిగి ఇంజన్ చుట్టు పక్కల మూగి మాట్లాడుకుంటున్నారు. ఇదే సందు అని సిగరెట్ వెలిగించి హడావిడిగా దమ్ము లాగేస్తున్నారెవరో..
"ఇందాక వాళ్ళ బస్ ఫెయిల్ అయిందని ఎవర్నో చాలామందిని ఎక్కించారు వాళ్ళని దించేయండోయ్ ఎవరో స్ట్రాంగ్ లెగ్ గాడున్నట్లున్నాడు " ఒకాయన జోక్.
"ఛ ఏపీయస్ ఆర్టీసీ వాళ్ళు ఇంత చెత్త బస్సులు నడుపుతున్నారా.. ఇంకోసారి వీళ్ళ బస్ అసలు ఎక్క కూడదు.." ఓ యూత్ అప్పటికప్పుడు తీసేసుకున్న రిజల్యూషన్.
"కుదుపులకి బ్యాటరీ వైర్లేవో లూజ్ అయి ఉంటాయి చూడండి మాష్టారు.." గుండు సూది నుండి అణుబాంబు వరకూ తనకు తెలియని విషయం లేదని ఫీల్ అయ్యే ఓ పెద్దాయన ఉచిత సలహా...
"అబ్బా బంగారం లాంటి నిద్ర పాడు చేశారు.. బయల్దేరిన దగ్గరనుండి డొక్కు సినిమా ’బిల్లా’ పెట్టి. ఇప్పుడేమో ఇలా హు.. అవును మాష్టారూ ఇంతకీ ఇది ఏ ఊరంటారు ??" ఇంకొకాయన భోగట్టా..
"......." చిరునవ్వుతో మౌనంగా వీళ్ళమాటలు వింటూ, మనసులో "ఇవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని బ్లాగ్ లో రాసేయాలి.." అనుకుంటూ నేనూ, ఇదీ అక్కడి సన్నివేశం.

వోల్వో వెబ్ సైట్ ని బట్టి చూస్తే వాళ్ళ బస్సులు అన్ని Euro 2/Euro 3 ఎమిషన్ క్లాసుకు చెందినవే అయి ఉంటాయి, వాటికి ఇంత ఘోరమైన నల్లని పొగ రాకూడదు. మరి మన వాళ్ళు కిరోసిన్ కల్తీ అయిన డీజిల్ తోనడుపుతున్నారో లేక బస్ కొనడమే కానీ బొత్తిగా మెయింటెనెన్స్ విషయం పట్టించుకోవడం లేదో అర్ధం కాలేదు. నాకైతే మెయింటెనెన్స్ లోపమే అనిపించింది, అలా అనుకోవడానికి బస్ వాలకం కూడా ఒక కారణం. కనీసం సరిగా బస్ కడిగే విషయం కూడా పట్టించుకోని వాళ్ళు క్రమం తప్పకుండా సర్వీస్ చేయించే అవకాశం నాకైతే కనిపించలేదు. అలా చేయిస్తే ఇలాటి సంధర్భం ఎదురు పడదు అని నా నమ్మకం. దాదాపు యాభై నుండి అరవై లక్షల వరకూ పోసి కొనే బస్సులు ఇలా గాలికి వదిలేస్తే వాటి లైఫ్ స్పాన్ తగ్గిపోవడం ఒక నష్టం. అదేకాక ఇందాక చెప్పినట్లు ఏ రైల్వే ట్రాక్ మధ్య లోనో ఆగిపోయి ఫాటల్ యాక్సిడెంట్ కి కారణం అయితే ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు మూల్యం చెల్లించినట్లు ? వీళ్ళు మారేదెన్నడు ??