అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

మంగళవారం, మార్చి 30, 2010

లీడర్ & ఏ మాయ చేసావె

ఈ రెండు సినిమాల గురించే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య కాలం లో నేను చూసినది ఈ రెండు సినిమాలనే.. ఇంకా రెండు సినిమాల్లోనూ ఏదో చెప్పాలి అని మంచి ప్లాట్ తో సినిమా మొదలు పెట్టి ఏం చెప్పాలో అర్ధం కాక మాములు గా వదిలేసినట్లు అనిపించింది. రెండూ కూడా గొప్ప సినిమాలు కాకపోయినా ప్రోత్సహించదగిన మంచి ప్రయత్నాలు. రెండు సినిమాల దర్శకుల పై నాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించి ఈ రెండు సినిమాలు డైలాగ్ బేస్డ్ సినిమాలు, ఈ సినిమాలను వినాలి, మనసుపెట్టి చూడాలి, పాత్రల స్వభావాలను కాస్తయినా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి అపుడే సినిమాను మరింత ఆస్వాదించగలం. తెలుగులో ఈ అవసరాన్ని కల్పించే సినిమాలు వేళ్ళపై లెక్క పెట్టచ్చేమో. డ్యుయట్ లు, ఫైట్లు, వీరోచితమైన డైలాగులు, రక్తాలు, చంపుకోవడం, వెకిలి హాస్యం, ఓవర్ యాక్షన్ ల జోలికి పోకుండా చేసిన వైవిధ్యమైన ప్రయత్నం. మరో మెచ్చుకోతగిన అంశం మాంచి సినీ నేపధ్యం గల ఇద్దరు హీరోలలో ఒక హీరోకి మొదటి సినిమా అయితే మరో హీరోకి రెండో సినిమా. సొంత తెలివి తేటలో ఎవరి ప్రోత్సాహమో తెలియదు కాని ఇటువంటి సినిమాలు ఎంచుకోవడం మంచి పరిణామం.


లీడర్ సినిమా చివరలో అమ్మ పాత్ర తన కొడుకు తో ఇలా అంటుంది "నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కానీ పొలిటీషియన్ కాదు రా" అని. శేఖర్ ఈ డైలాగ్ తో తనకి క్లారిటీ ఉంది అని నిరూపిస్తాడు కానీ సినిమా అంతా పొలిటీషియన్ అవడం ఎలాగో చూపిస్తాడు చివరి పది నిముషాలు మాత్రమే హీరో లీడర్ అవడానికి చేసిన ప్రయత్నాలను అది కూడా మాంటేజ్ షాట్ లో చూపిస్తాడు. అటుదిటు ఇటుదటు చేసి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేదేమో, కనీసం క్రిటిక్స్ మూవీ గా అన్నా నిలిచేదేమో అనిపించింది నాకు. బహుశా ఏది చేయద్దు అనేది చూపిస్తే ఏది చేయాలి అన్నది అసలైన నాయకులే నిర్ణయించుకుంటారు లే అని వదిలేశాడేమో. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పవర్ ఫుల్ షాట్స్ తో హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం లో సఫలమయ్యాడనే చెప్పచ్చు. రామానాయుడు గారిలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాణా ఇటువంటి కధను ఎన్నుకోవడం కూడా అభినందనీయం. ఇతను ఈ సినిమాకో పెద్ద ప్లస్ కొత్త నటుడు అన్నట్లు కనిపించలేదు. హైట్ తో పెర్ఫార్మెన్స్ తో అందరి మతులు పోగొట్టేశాడు, అలా చేసేలా చేశాడేమో శేఖర్. అలానే ఇతని కంఠస్వరం, తెలుగు ఉఛ్చారణ కూడా ఆ పవర్ తీసుకు రావడానికి దోహదం చేశాయి. ముఖ్య విలన్ ధనుంజయ్ గా చేసిన సుబ్బరాజు కూడా మంచి ఎంపిక ఇతనికి హర్షవర్ధన్ కూ కూడా మంచి పాత్రలు దొరికాయి. మొత్తం మీద ఆకట్టుకున్న సినిమా.


లీడర్ కు హీరో ప్లస్ అయితే ఏ మాయ చేసావె కు హీరో పెద్ద మైనస్ :-) అభిమానులు నన్ను తప్పు పట్టవద్దు. పాత్ర పరం గా మరో నటుడిని ఎన్నుకుని ఉంటే మరింత బాగా వచ్చేదేమో సినిమా అనిపించింది. ఇక హీరోయిన్ జెస్సీ రాక్స్, ఈ అమ్మాయి చాలా బాగుంది. తనలో ఏం లేదమ్మా మాములు అమ్మాయే కాకపోతే ఈ సినిమాలో బాగా చూపించారు అన్నారెవరో.. మేబీ.. అది నిజమే అయి ఉండచ్చు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు నాకు నచ్చింది ఏం మాయచేసావే లో జెస్సీ అంతే. తన వాయిస్ కూడా తన కన్ఫ్యూజ్డ్ స్వభావానికి తగ్గట్లుగా సరిపోయింది అనిపించింది. సినిమాలో చెప్పినట్లు అమ్మాయిలందరిదీ కాంప్లెక్స్ మెంటాలిటీ అబ్బాయిలందరిదీ సింపుల్ మెంటాలిటీ అని నేను చెప్పడం లేదు, నిజ జీవితం లో అమ్మాయిల్లో క్లారిటీ ఉండి సింపుల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళుండచ్చు అలానే అబ్బాయిలు విపరీతమైన ఆలోచనలతో కాంప్లికేట్ చేసుకునే వాళ్ళు ఉండచ్చు, కానీ ఇటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ తో సినిమా చేయాలనే ఐడియా నాకు బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ రి విజువల్స్ కూడా సినిమాను ఎంజాయ్ చేయడం లో తోడ్పడతాయి.

రెండు సినిమాల్లోనూ హాస్య నటుల పై ఆధారపడకుండా ముఖ్య పాత్రలతోనే కాస్త హాస్యాన్ని పండించడం నచ్చింది :-) ఏ మాయ చేసావే లో హీరో సీరియస్ గా చేసే నటన మరియూ మూవ్ మెంట్స్ తో మనం బోల్డు నవ్వుకోవచ్చులెండి అది వేరే విషయం. కానీ మొదటి సినిమా జోష్ తో పోలిస్తే ఈ సినిమాలో ఇతను చాలా బెటర్. కొన్ని సీన్స్ కోసం సినిమాలో ఫీల్ కోసం ఖచ్చితంగా ఈ రెండు సినిమాల డివిడి లు నా లైబ్రరీలో చోటు సుస్థిరం చేసుకున్నాయి. అందుకే ఈ పరిచయం.

సోమవారం, మార్చి 29, 2010

పది పైసలు

మరుగున పడిపోకుండా పదిల పరచుకోవలసిన వాటిలో మధురమైన ఙ్ఞాపకాల తర్వాత మొదటి స్థానం కరెన్సీదేనేమో. చిన్నప్పటి నుండి నాకు ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయం ఒకటుండేది. ఎక్కువ విలువ ఉన్న డబ్బులు నీళ్ళలో వేస్తే నానిపోయే కాగితంతో చేస్తారు కానీ తక్కువ విలువ ఉండే చిల్లరను కలకాలం నిలవుండే మెటల్ తో తయారు చేస్తారు ఎందుకో ఎంత ఆలోచించినా నా బుర్రకి ఇప్పటికీ అర్ధంకాని ప్రశ్నే. కాస్త పెద్దయిన తర్వాత బహుశా విలువ తక్కువ ఉండే చిల్లరకు వాడుక ఎక్కువ కనుక కాగితాలు త్వరగా పాడవుతాయ్ అని నాణేలు ఉపయోగించారేమో లే అని నాకు నేను సర్ధి చెప్పుకున్నాను, మరి ఇది కాక వేరే కారణమేదైనా ఉంటే మీరే చెప్పాలి. నా చిన్న తనంలో నేను తరచుగా ఉపయోగించినది పది పైసలు :-) ఇప్పటి పిల్లలకి పాకెట్ మోయలేనంత పాకెట్ మనీలు కానీ అప్పట్లో మనం ఇంట్లో ఒక రూపాయి సంపాదించడమంటేనే గగనం. కాని మా ఇంట్లో నాకు కాస్త గారాబం ఎక్కువ కనుక స్కూల్  ఇంటర్వెల్ లో కొనుక్కోడానికి తప్పకుండా చిల్లర ఇచ్చేది అమ్మ. పదిపైసలకి రెండు వచ్చే కొబ్బరి బిళ్ళలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా న్యూట్రిన్ లో పది పైసల సైజ్/షేప్ లోనే వచ్చే ఒక కొబ్బరి చాక్లెట్ ఒకటి ఉండేది అది కూడా చాలా ఇష్టం. పొదుపు చేసుకుని ఒకే సారి ఖర్చు పెట్టుకోవడం కన్నా ఎప్పటికప్పుడు దొరికే ఆనందమే మిన్న అని నమ్మే నేను నా చిల్లర అంతా ఆ చిరుతిళ్ళ కొట్టువాడికే ధారా దత్తం చేసేస్తున్నాను అని అంటుండేది అమ్మ.
 
ఈ పదిపైసలు చూసి చాలా ఏళ్ళయింది అసలు సత్తు కాయిన్స్ అన్నీ మానేశారు అనుకుంటా కదా. అసలు నేను పావలా చూసే చాన్నాళ్ళైంది లేండి ఇక పదిపైసల గురించి ఎందుకు అడుగుతారు. పదిపైసలు అనగానే నాకు ముందు గుర్తొచ్చేది రైలుబండి. అదేంటి అంటారా :-) మా ఇల్లు నరసరావుపేట లో స్టేషన్ కు చాలా దగ్గరలోనే ఉండేది. అక్కడ పిల్లలు కొందరు ఈ పది పైసలను రైలు పట్టాల మీద పెట్టి, దాని మీదనుండి రైలు వెళ్ళాక పలచని రేకు లా మారిన వాటిని కలెక్ట్ చేసుకుని, వాటి మధ్యలో రెండు రంధ్రాలు పెట్టి దారం కట్టి రెండు చేతుల వేళ్ళ మధ్య పెట్టి ఆడుకునే వాళ్ళు. నా క్లాస్మేట్స్ కూడా అపుడపుడు చేసే వాళ్ళు కానీ రైలు దగ్గరకి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తే వీపు చీరేస్తారనే భయం ఉండేది కనుక నేను కేవలం ఫైనాన్సియర్ పాత్రకి పరిమితమయ్యే వాడ్ని. అంటే పావలా ఇస్తే ఒక పదిపైసలు దీనికి దాచుకుని ఆ పిల్లలకో మా ఫ్రెండ్స్ కో ఇచ్చి చక్కని రేకు సంపాదించేవాడ్ననమాట. ఈ ప్రాసెస్ లో కొన్ని డబ్బులు వేస్ట్ అయ్యేవి అంటే సగం మాత్రమే నలిగి, ఒకోసారి మధ్యకు విరిగి ఇలా పనికొచ్చేవి కావు అనమాట. మా వాళ్ళొకోసారి ఇలా అయినవి నావే అని చెప్పి ఇచ్చేవారు. మనం వెళ్ళలేం కనుక వాళ్ళేం చెప్తే అదే కదా మరి.

కొన్నాళ్ళకి డబ్బులు ఎందుకురా వేస్ట్ చేయడం అని గోల్డ్ స్పాట్, లిమ్కా లాంటి కూల్ డ్రింక్ సీసా మూతలను ఓపికగా గుండ్రాయ్ తో చదును చేసి రేకులా తయారు చేసి దానిని ఉపయోగించే వాళ్ళం ఆటవస్తువులు గా. కానీ దీనికి బోలెడంత ఓపిక కావాలి నిదానంగా జాగ్రత్తగా వేలు నలక్కొట్టుకోకుండా మూత పాడవకుండా ముందు అంచుల పై కొట్టి మెల్లగా వంచాలి అన్ని కాస్త వెడల్పుగా అయ్యాక అపుడు మూత మొత్తాన్ని ఎడా పెడా కొట్టేసి రేకులా చదునుగా చేయచ్చు. అసలు ఈ రేకు తయారయినా కూడా పాడవకుండా వీటికి కన్నం పెట్టడం ఒక ఆర్టు. దబ్బనమో లేదా పుస్తకాలు కుట్టడానికి ఉపయోగించే పెద్ద సూదో ఉపయోగించి పెట్టాలి. ఒకోసారి దబ్బనం మొన సరిగా లేకపోతే రేకు వంగిపోవడమో పాడయి పనికి రాకపోడమో జరిగే అవకాసం ఉంది. ఒక సారి సమయానికి ఇవేమీ దొరకక కుట్టు మిషన్ లో ఎంబ్రాయిడరీ చేసే సూది కాస్త పెద్దగానే ఉంది కదా అని దానితో ప్రయత్నింఛా కానీ అది రెండు ముక్కలయ్యే సరికి బుద్దిగా ఎక్కడిదక్కడ పెట్టేసి దెబ్బలు తప్పించుకున్నా అనుకోండి. దీనికి దారం కూడా మాములు బట్టలు కుట్టే దారమైతే మూడు నాలుగు వరుసలు కలిపి పేనాలి కానీ అంత కష్టపడినా ఒకోసారి సరిగా రావు. అందుకే ఇంట్లో సరుకులు తెచ్చినపుడు వచ్చే పొట్లాలు కట్టే దారం బోల్డంత ఎప్పటికప్పుడు దాచేసుకుని అప్పుడప్పుడు ఇలాంటి వాటికి ఉపయోగించాలనమాట.

పదిపైసలు కాదు కానీ సత్తు చిల్లర తలచుకుంటే మెదిలే ఙ్ఞాపకం ఇంకోటి ఉందండోయ్ :-) ఓ పది పన్నేండేళ్ళ క్రితం  అనుకుంటాను అప్పట్లో ఈ చిల్లర ఇంకా చలామణి అవుతూనే ఉంది కానీ అప్పుడే కనుమరుగు చేద్దామని ఆలోచిస్తున్నారు అనుకుంటా.  ఒక సారి ఢిల్లీ వెళ్ళి వస్తూ రైలు లో అడుక్కునే వాడికి పోకిరి సినిమాలో బ్రహ్మి లా ఒక ఇరవై పైసల బిళ్ళ ని దానమిచ్చి ఫో పండగ చేస్కో పో అన్న లెవల్ లో స్టైల్ గా చూశా. అప్పట్లో మన రేంజి కి అది చాలా ఎక్కువ మరి :-) కానీ వాడు వెంటనే దాన్ని నా చేతిలో పెట్టేసి "ఏ క్యాహై.. అభి ఏ నయి చల్తా.." అనేసి ఆ పండగేదో నువ్వే చేసుకో పోరా అన్నట్లు చూసి "కహాసే ఆతే ఏ మదరాసి లోగ్.." అనుకుంటూ పోయాడు. ఔరా ఎంతటి అవమానమూ అని ఫీల్ అయిపోతుంటే అప్పటి వరకు పక్కన కూర్చొని బాతాఖానీ వేసిన తెలుగాయన ఇవి ఇక్కడ చెల్లవు సార్ మన ఆంధ్రాలో ఇంకా వాడుతున్నారనుకుంటా అని ఙ్ఞానోదయం చేశారు. అపుడే మొదట తెలిసింది ఈ చిల్లర త్వరలో కనుమరుగవబోతోందనమాట అని. పదిపైసల కబుర్లు అవి మళ్ళీ ఏమైనా గుర్తొస్తే మరోసారి ఆ కబుర్లతో కలుద్దాం, అంతవరకూ శలవ్. 

శుక్రవారం, మార్చి 26, 2010

ఆనందం.. అంతలోనే అంతర్ముఖం !

I have a dream.. ఇది సరైన ప్రయోగమేనా.. MLK గారి స్పీచ్ గుర్తొచ్చి ఆవేశంగా మొదలెట్టాను కానీ సరైన ప్రయోగం కాదేమో, ఎందుకంటే ఈ కల ఇప్పుడు రావడం లేదు, అదీకాక తీరిన ఈ కల గురించే ఈ టపా కనుక ఈ ప్రయోగం సరికాదనే అనుకుంటున్నా. ఏమో లెండి ఇంగ్లీష్ గ్రామర్లో ఈ టెన్స్ లు ఎప్పుడూ నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాయ్. ఏదేమైనా గ్రామర్ సంగతి ఇంగ్లీష్ టీచరమ్మలకి వదిలేసి అసలు విషయానికి వస్తే, ఈ బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో నేనో కలగనే వాడ్ని. నేనేదో బిజినెస్ లంచ్ కో, లేదూ డిన్నర్ పార్టీ కో, పెళ్ళికో, పుట్టినరోజు వేడుకకో వెళ్ళి పదిమందితో కలిసి మాట్లాడుతున్నపుడు హఠాత్తుగా ఒక పరిచయం లేని వ్యక్తి వచ్చి "మీరు ఫలానా కదా ఫలానా బ్లాగ్ రాస్తారు కదా నేను తరచుగా చదువుతుంటాను, బాగా రాస్తారు..బ్లా.. బ్లా.." అని నన్ను పరిచయం చేసుకుని మాట్లాడేస్తున్నట్లూ... నేనేమో అందరి మధ్యలో మొహమాట పడిపోతూ, ఒక పక్క కాస్త గర్వ పడుతూ చిరునవ్వులు చిందిస్తూ అతనితో మాట్లాడుతున్నట్లు.. ఇలా సాగిపోతుంది ఆ కల :-)

మొన్న ఓ రోజు మధ్యాహ్నం ఇంచుమించు ఇలాంటి సంఘటనే జరిగింది. నేను మా ఆఫీస్ కేఫెటీరియాలో టీ తాగుతుండగా ఒకరు వచ్చి మీరు వేణూశ్రీకాంత్ కదా? నాతోనేను నాగురించి బ్లాగ్ రాస్తారు కదా? నేను క్రమం తప్పక చదువుతానండీ మీరు చాలా బాగా రాస్తారు అంటూ పలకరించి మాట్లాడారు. అంతే ఒక్కసారిగా నా మనసులో "కల నిజమాయెగా..", "గాల్లో తేలినట్లుందే" ఇత్యాది పాటలు నేపధ్యంలో మోగుతుండగా అతి కష్టం మీద మొహంలో ఆ భావాలను కనపడనివ్వకుండా కాసేపు మాట్లాడి వచ్చేశాను. అతను నా బ్లాగ్ చూసి నే ఐబియం లో పని చేస్తున్న విషయం తెలుసుకుని మా ఆఫీస్ లోకల్ చాట్ రూం లో నా ఫోటో చూసి నన్ను గుర్తు పట్టాడుట. ఇంట్రెస్టింగ్ అనుకుంటూ అక్కడ నుండి డెస్క్ దగ్గరకు వస్తుంటే దారిలో మరో అపరిచితుడు తన కంప్యూటర్ లో నా బ్లాగ్ ఓపెన్ చేసి చదువుతూ కనిపించాడు. నే వెళ్ళేప్పుడు సాక్షిపేపర్ చదువుతున్న అతన్ని చూసి నవ్వుకున్నాను ఆహా !! ఆఫీస్ టైం మాబాగా ఉపయోగిస్తున్నాడు అని. వచ్చేప్పుడు నా బ్లాగ్ చదువుతున్న అతని గురించి ఏమనుకున్నానో మరి ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు కదా :-) కాకపోతే తనని కదిలించడమెందుకు లే అని నేనేం అడగలేదు. మొత్తం మీద ఒకే రోజు ఆఫీస్ లో ఇలా డబుల్ ధమాకా నా సొంతమైందనమాట.

ఈ సంధర్భంగా మీకో విషయం చెప్పాలి. నిజంగా మీ ఙ్ఞాపకాలను పదిల పరచుకోవాలంటే డైరీ చాలు కదా బ్లాగెందుకు అని ఈ మధ్యే అడిగిన ఓ నేస్తానికి నాకు సంతృప్తి కలిగే జవాబు చెప్పలేకపోయాను. నిజమే కదా అనిపించింది. కానీ నా బ్లాగ్ మొదలెట్టినపుడు నాకు పరిచయమున్న పదుగురిలో ఓ నాలుగురైదుగురు కంప్యూటర్ ఇంటర్నెట్ తో పరిచయమున్న వారు మాత్రమే చూస్తారు లే అని మొదలెట్టాను. కేవలం నాకు బాగా పరిచయమైన ఆత్మీయమైన ఒకరిద్దరు విజిటర్స్ తో ఇంచుమించు నాడైరీ లా సాగుతున్న నా బ్లాగ్ ను ఎలా పట్టుకున్నారో కానీ చావాకిరణ్ గారు మొదటి కామెంట్ రాసి తన ప్రొఫైల్ కి, బ్లాగ్ కి రప్పించుకుని అక్కడ నుండి నన్ను జల్లెడ కీ కూడలికి పరిచయం చేశారు. ఇక అక్కడ నుండి నాకు హిట్ కౌంటర్లు కామెంట్లు ఇత్యాదులు అలవాటైయ్యాయి.

నాతో కాస్త పరిచయమున్న వారెవరైనా నాకు కాస్త కీ.క. అదేనండీ కీర్తి కండూతి ఎక్కువే అని ఒప్పుకుంటారు. అంటే పైకి కాస్త మాడెస్టీ ప్రదర్శించినా పొగడ్తలకి పడిపోని మనిషెవరుంటారు చెప్పండి :-) ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు మీడియాలో మన పేరు చూసుకోవడం అనుకోని ధ్రిల్ ను మనసొంతం చేస్తాయి. బహుశా అవే నన్ను బ్లాగ్ కు అడిక్ట్ చేసేసి నన్ను అడ్రినలిన్ జంకీ ని చేశాయేమో అనిపించింది. చాలా మంది ఫేమస్ బ్లాగర్స్ తో పోలిస్తే నా రాతలు  చాలా సబ్ స్టాండర్డ్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అలానే నా టపాల సంఖ్య కానీ కామెంట్ల సంఖ్యకానీ విజిటర్స్ సంఖ్యకానీ చాలా ఇతర బ్లాగులతో పోలిస్తే అతి తక్కువ కనుక నేను బ్లాగ్ కు ఎడిక్ట్ అయ్యాను అన్నమాట నిజం కాదేమో అనికూడా అనిపిస్తుంది.

కానీ బ్లాగ్ నాకు తెలియకుండానే నా జీవితం లో ఒక సింహ భాగం అయిపోయింది. ఫ్యామిలీ ని, ఆత్మీయ నేస్తాలనీ మించి కేవలం నాకుమాత్రమే స్థానం కలిగిన నాకంటూ ఒక ప్రపంచం సృష్టించుకుని దానిలో సోలోగా బతికేస్తున్నాను అనిపిస్తుంది. బ్లాగ్ ద్వారా పరిచయమైన మితృలు బాహ్య ప్రపంచంలో పరిచయం కాకపోవడం బాహ్యప్రపంచంలోని మితృలు సన్నిహితుల దగ్గర బ్లాగ్ గురించి అతి తక్కువ మాట్లాడటం వారికి నా బ్లాగ్ లో వ్యక్తపరిచే అభిప్రాయాలలో చోటులేకపోవడం ఒక కారణం కావచ్చు. బ్లాగ్ పూర్తిగా వ్యక్తిగతమైన అభిప్రాయాల వేదిక అని అందులో ఇతరులకు చోటు లేదనీ ఒక అభిప్రాయంలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఆ  ఇతరులు ఎవరు అనేది నిర్ణయించుకోవడం లో కూడా ఒక చిన్న పొరపాటు చేసి ఆత్మీయులను నొప్పించాను ఆ విషయం అర్ధమయ్యాక  చాలా బాధ పడ్డాను. 

ఇదిగో ఈ పైన రాసినటువంటి అంతర్మధనం జరిగినపుడు ఎపుడైనా బ్లాగ్ మూసేయాలి అనిపిస్తే ఆఆలోచన కు స్వస్తి చెప్పేలా చేసేది బ్లాగ్ మితృల ప్రోత్సాహమే. ఈ బ్లాగ్, చదివిన వారిని కాసేపు వారి కష్టాలను మరిచి ఙ్ఞాపకాలలోకి వెళ్ళి ఓ చిన్న చిరునవ్వును వారి మొహంపై పూయించ గలిగితే ఈ బ్లాగ్ ఓపెన్ గా అందరూ చదివేలా ఉంచడం వెనుక ధ్యేయం నెరవేరినట్లే. ఏదేమైనా నేను రాసినది ఓపికగా చదివి కామెంట్లు రాస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మితృలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. కామెంట్ రాయకపోయినా క్రమం తప్పక చదివే పాఠకులకు కూడా పేరు పేరునా ధన్యవాదాలు. అలానే మొదటి కామెంట్ రాసిన చావా కిరణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.

అసలు నేను రాసినది మరొకరు చదవగలరు, చదివి ఆస్వాదించగలరు అనే నమ్మకాన్ని నాలో కలిగించి ఈ బ్లాగ్ ప్రారంభించడానికి ముఖ్య  కారణమై నా వేలు పట్టుకుని నా బ్లాగు రూపు రేఖలను దిద్దించి. తను మాత్రం, తను మాటలు నేర్పిన కొడుకు పెద్ద పెద్ద డిబేట్లు గెలుస్తుంటే దూరం నుండి మురిపెంగా చూసుకుని ఆనందించే అమ్మలా. తన వేలు పట్టుకుని నడక నేర్చుకున్న కొడుకు ఆ వేలు విడిపించుకుని తోటి పిల్లలతో ఆటలాడు కోవడానికి పరిగెడితే ఆ ఆటలలో తనకే భాగస్వామ్యం లేకపోయినా దూరం నుండి ముచ్చటగా చూస్తూ మురిసిపోయే నాన్నలా. దూరం నుండి చూస్తూ నిరంతరం ప్రోత్సహిస్తున్న నా ఆత్మీయ నేస్తానికి ఈ సంధర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. బ్లాగ్ ప్రపంచంలో మునిగిపోయి నాకే తెలియకుండా నే చేసిన పొరపాట్లను తను మనస్ఫూర్తిగా మన్నిస్తారని తలుస్తూ...

ఈ టపాను తనకి అంకితమిస్తూ...
ప్రస్తుతానికి శలవు...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.