అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

మంగళవారం, నవంబర్ 28, 2017

మెంటల్ మదిలో...

సాధారణంగా ఒకటికన్నా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తే మనందరం ఏది ఎన్నుకోవాలా అని అంతో ఇంతో కన్ఫూజ్ అవడం సహజం, మన అభిరుచి, అనుభవం, అవసరం ఇత్యాదులని బేరీజు వేసుకుని ఆలోచించి సరైన ఆప్షన్ ఎన్నుకుని ముందుకు సాగుతాం. ఐతే ఈ కన్ఫూజన్ మితిమీరిన మోతాదులో ఉన్న వ్యక్తే అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు). చిన్నతనం నుండీ కూడా ఆ రోజు ఏ డ్రస్ వేస్కోవాలో తల్లి డిసైడ్ చేసి ఇస్తే తప్ప రోజు మొదలవని అరవింద్ స్కూల్లో పరీక్షల్లో కూడా ఎస్సేటైప్ ఆన్సర్స్ పేజీలకు పేజీలకు రాసేసి మల్టిపుల్ ఛాయిస్ కొశ్ఛన్స్ కి మాత్రం తెల్లకాగితం ఇచ్చి వచ్చే రకం. ఎంతపెద్దైనా ఈ కన్ఫూజన్ అలా కొనసాగుతూనే ఉంటుంది. 

ఉన్న ఈ లక్షణం చాలదన్నట్లు చిన్నప్పుడే జరిగిన ఓ సంఘటన వల్ల అమ్మాయిలతో మాట్లాడాలంటే కూడా చచ్చేంత భయం, పక్కింటి అమ్మాయైనా క్లాస్మేట్ అయినా కనిపిస్తే తప్పించుకు తిరగడమే తప్ప మాటకలిపే అలవాటుండదు. అలాంటి మన హీరోగారికి పెళ్ళీడు వచ్చింది, ఇంకేముంది తండ్రి (శివాజిరాజా) గారి గుండెల మీద కుంపటే అయ్యాడు, ఆయన రెండున్నరేళ్ళ పాటు చేసిన విఫలయత్నాలతో విసిగిపోయున్న తరుణంలో ఓ స్నేహితుడి ద్వారా తెలిసిన ఓ ఇంటికి పెళ్ళి చూపులకి తీస్కెళతాడు కొడుకుని. 

ఆ అమ్మాయే "నాకేం కావాలో నాకు తెలియదా" అంటూ తన జీవితం మీద మంచి క్లారిటీ ఉన్న స్వేచ్ఛ(నివేదా పేతురాజ్). అనూహ్యంగా తనకి అరవింద్ నచ్చడం ఇద్దరి స్నేహం ముందుకు వెళ్ళడంతో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతాయి.. అన్నీ బావున్నాయనుకునే తరుణంలో కొన్ని పరిస్థితుల వల్ల ఎంగేజ్మెంట్ వాయిదా వేస్కోవలసి వస్తుంది. ఈ గ్యాప్ లో స్వేచ్ఛకు దూరంగా వేరే ఊరు వెళ్ళిన అరవింద్ కు రేణు (అమృత) పరిచయం అవుతుంది. స్వేచ్ఛ పరిచయం అవక ముందు తనకెలాంటి అమ్మాయి కావాలని తను కోరుకున్నాడో అలాంటి అమ్మాయి రేణు.

అసలే కన్ఫూజన్ మాస్టర్ అయిన మన హీరో గారికి ఇపుడు ఎవరితో జీవితాన్ని పంచుకోవాలనె కన్ఫూజన్ మొదలైపోతుంది. దానిని ఎలా అధిగమించి జీవితాన్ని సుఖాంతం చేసుకున్నాడో తెలియాలంటే "మెంటల్ మదిలో" సినిమా చూడాలి. పెళ్ళిచూపులు చిత్రాన్ని నిర్మించిన అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి తన రెండో చిత్రంలోనూ తన అభిరుచిని నిరూపించుకున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సెకండాఫ్ లో బోంబే ఎపిసోడ్ దగ్గర కాస్త తడబడినా కానీ మంచి క్లైమాక్స్ తో చక్కని కథనాన్ని వ్రాసుకున్నారు. సినిమా పూర్తయేసరికి ఒక హాయైన సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది. పాటలు, నేపధ్యసంగీతం కూడా సినిమా మూడ్ కి తగినట్లుగా ఆహ్లాదకరంగా ఉన్నాయ్. 

శ్రీవిష్ణు, నివేధా చాలా సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. హీరో తండ్రి పాత్రలో శివాజీరాజా అండ్ హీరోయిన్ తల్లి పాత్రలో అనితా చౌదరి పాత్రలు గుర్తుండిపోతాయ్. ఇద్దరి క్యారెక్టరైజేషన్ చాలా సహజంగా ఉంది. వీళ్ళ పాత్రలకూ సినిమాలో చూపించిన సింపుల్ పెళ్ళి చూపులు సీన్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు.  కొన్ని సింబాలిక్ షాట్స్, ప్రిక్లైమాక్స్ లో తండ్రి హీరోకి ఇచ్చే సలహా అలాగే హీరోయిన్ కి తన తల్లి "మాకు నువ్వు ముఖ్యం పరువు, బంధువులు అన్నీ అందరూ నీ తర్వాతే" అని చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి. వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరు మిస్ అవకుండా చూడవలసిన సినిమా "మెంటల్ మదిలో". ఇలాంటి మంచి సినిమాలని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.  

శుక్రవారం, నవంబర్ 10, 2017

శమంతకమణి...

హైదరాబాద్ నగరంలోని అత్యంత ధనవంతులలో ఒకరు జగన్నాథ్(సుమన్). అతని కొడుకు మంచి మనసున్న కృష్ణ(సుధీర్ బాబు) తన పుట్టినరోజు పార్టీలో మిత్రులకి పరిచయం చేయడానికి తన తండ్రికి ఇష్టమైన రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ "శమంతకమణి" ని అతనికి తెలియకుండా తీస్కెళతాడు. పార్టీ ముగిసే సరికి ఆ కార్ దొంగతనానికి గురవుతుంది. చిన్నపుడు తన తల్లి కొనిస్తానని మాటిచ్చిన ఆ కార్ ఇంటికి వచ్చిన దగ్గర నుండీ తనకి దూరమైన తల్లే తిరిగి వచ్చిందన్నంతగా సంబర పడుతున్న కృష్ణ ఆ కార్ ని వెతికి పట్టుకోవాలని పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ సహాయం కోరతాడు. 

రంజిత్ కుమార్ (నారా రోహిత్) ఒక కరప్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తన లైఫ్ సెటిలైపోయేలాంటి ఏదైనా ఒక స్కామ్ / సెటిల్మెంట్ చేసి డబ్బు సంపాదించాలన్నది అతని జీవితాశయం. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ చిన్న చిన్న చిల్లర వసూళ్ళతో జీవితం నెట్టుకొస్తుంటాడు. ఈ కారు పట్టుకుంటే వచ్చే డబ్బుతో తన లైఫ్ సెటిల్ ఐపోతుందని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు.      

శివ(సందీప్ కిషన్) ఒక అమాయకమైన పల్లెటూరు యువకుడు, ఊరిలో తను ప్రేమించిన అమ్మాయి తనని ప్రేమించి కూడా తన దగ్గర డబ్బులేని కారణంగా తనకు దూరమైందన్న కోపంతో ఎలాగైనా డబ్బు సంపాదించి చూపించాలని ఎదురు చూస్తుంటాడు. 

కార్తీక్(ఆది సాయికుమార్) ఒక మధ్యతరగతి కుర్రవాడు తన చిన్ననాటి స్నేహితురాలైన ఓ డబ్బున్నమ్మాయిని ప్రేమిస్తాడు. తనకీ తన ప్రేయసికి ఉన్న ఆర్ధిక అంతరాల వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచేసుకున్న కార్తీక్ తమ మధ్య జరిగే ప్రతి సంఘటనలోనూ తన వద్ద డబ్బులేని కారణంగా ప్రేయసి తనని చులకన చేస్తుందని ఫీలవుతూ ఎలాగైనా డబ్బుసంపాదించాలని ఎదురు చూస్తుంటాడు.  
 
ఉమా మహేశ్వరరావ్(రాజేంద్ర ప్రసాద్) ఒక సాధారణ కార్ మెకానిక్, తన ఎదురింట్లో ఉండే ఇంద్రజని ప్రేమించి ఆమెతో లైఫ్ లో సెటిల్ అవాలని ఎదురు చూస్తుంటాడు అయితే అందుకోసం ఆమె చుట్టూ ఉన్న సమస్యలను తీర్చడానికి కొంత డబ్బు అవసరం ఉంటుంది. ఎలాగైనా సంపాదించాలని మార్గాలు వెతుకుతుంటాడు. 

ఈ ముగ్గురికి ఆ కార్ కి సంబంధం ఏమిటి.. అసలా కార్ ఏమైంది.. ఇన్వెస్టిగేషన్ ఎలా నడిచింది.. చివరికి కార్ దొరికిందా లేదా ఇత్యాది వివరాలు తెలుసుకోవాలంటే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన "శమంతకమణి" చిత్రం చూడాల్సిందే. ఉండటానికి నలుగురు హీరోలున్నా ఈ సినిమాలో అసలు హీరో అంటూ ఎవరూ లేరు. ఎవరిదీ ప్రధాన పాత్ర కాకపోవడంతో డాన్సులు ఫైట్లు అని ఫోకస్ చేయాల్సిన అవసరం లేకుండా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగ తమకిచ్చిన పాత్రలో ఒదిగిపోయారు.  

"మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిలవల్లే ప్రాబ్లమ్స్ బ్రో.." అంటూ బాధ పడి పోయే ముదురు బాచిలర్ పాత్రలో రాజేంద్రప్రసాద్ ఆకట్టుకుంటాడు అతని ప్రియురాలిగా ఇంద్రజ అందంగా కనిపించింది. వీరిద్దరినీ జంటగా తెరమీద చూడ్డం బావుంది. కరప్ట్ పోలీసాఫీసర్ గా నారా రోహిత్ చాలా సహజంగా నటించేశాడు అతని సైడ్ కిక్ గా కానిస్టేబుల్ పాత్రలో రఘు కారుమంచి నవ్వించాడు. సందీప్, సుధీర్, ఆది సాయికుమార్ కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. 

టెక్నికల్ గా మణిశర్మ నేపథ్యసంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పుడి ఎడిటింగ్, శ్రీరామ్ ఆదిత్య సంభాషణలు బావున్నాయ్.. ముడులు వేసుకుంటూ వచ్చే మొదటి సగం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా చిత్రం సెకండాఫ్ నుండీ ఆసక్తికరంగా కూర్చో బెడుతుంది ఊహించని క్లైమాక్స్ ఆశ్చర్యపరుస్తుంది. 

పాటలు ఫైట్లు కామెడీ ట్రాక్ లు అంటూ ఫార్మాట్ ఫిల్మ్స్ కాకుండా వైవిధ్యమైన సినిమాలను, క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వాళ్ళు మిస్సవకుండా చూడవలసిన ఈ చిత్రం రేపు శనివారం అంటే 11 నవంబర్ 2017సాయంత్రం 6:30 గంటలకు జెమినీ టీవీలో ప్రసారమవబోతుంది, మిస్సవకండి. 

ఈ సినిమా టీజర్ ఇక్కడ మరియూ థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. జెమినీటీవీ ప్రోమో ఇక్కడ చూడవచ్చు. ఈ సినిమా గురించి మిత్రులు నెమలికన్ను మురళి గారి మాటల్లో ఇక్కడ చదవచ్చు.  

శనివారం, నవంబర్ 04, 2017

PSV గరుడవేగ 126.18M

డాక్టర్ రాజశేఖర్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎన్నాళ్ళవుతుందో అని లెక్కలేసుకుంటే అప్పుడెప్పుడో చూసిన అల్లరి ప్రియుడు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంక ఇంతవరకూ నేను థియేటర్లో చూసిన సినిమాలేవీ గుర్తు రావడమే లేదు. అలాంటిది ఇన్నాళ్ళకు ఒక పవర్ ఫుల్ ట్రయలర్ ప్లస్ ప్రవీణ్ సత్తార్ మీద ఉన్న నమ్మకం నన్ను థియేటర్ వైపు నడిపించింది. థియేటర్లో ఉన్న ఇతరులు కూడా "రాజశేఖర్ సినిమా మొదటి సారి థియేటర్లో చూస్తున్నా మామా" అని అనుకోవడం విని నవ్వుకున్నాను. 

సినిమా మొదటిసగం పూర్తయే సరికి వావ్! వావ్! వావ్! వావ్! వాటే మూవీ! అనుకుని ఆశ్చర్యపోవడం నా వంతైంది. రెండవ సగం పూర్తయేసరికి ఆ వావ్ లలో కొన్నివావ్ లు తగ్గిపోయినా కానీ ఓవరాల్ గా మంచి యాక్షన్ థ్రిల్లర్ చూసిన అనుభూతి కలిగించారు ప్రవీణ్ అండ్ టీమ్. కమర్షియాలిటీ కోసం హాస్యం కోసం అక్కడక్కడ అనవసరంగా చేసిన ప్రయత్నాల వల్ల ఇది కేవలం ఒక మంచి సినిమాగా మాత్రమే మిగిలిపోయింది కానీ అవి కూడా లేకుండా ఉండుంటే తెలుగు యాక్షన్ సినిమా ట్రెండ్ ని మార్చగలిగే సినిమా అయి ఉండేది. 

హాలీఉడ్ సినిమాలను అనుకరిస్తూ ఇటువంటి భారీ యాక్షన్ సన్నివేశాలు ఇదివరకు కూడా కొన్ని సినిమాలలో ప్రయత్నించినా కానీ ఈ సినిమాలో అ సన్నివేశాలు కావాలని తెచ్చిపెట్టినట్లుగా అతికించినట్లుగా కాక కథలో ఇమిడిపోయేలా వ్రాసిన ప్రవీణ్ రైటింగ్, దానికి చక్కగా అమరిన నేపధ్యసంగీతం, సినిమాటోగ్రఫీ కలిసి ఒక మంచి అనుభూతిని మన సొంతం చేస్తాయ్. సినిమా మొదటి సగం ఐతే హాస్య సన్నివేశాలని తప్పిస్తే చాలా చక్కని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపాడు సినిమాని.

ఎన్.ఐ.ఏ. కమిషనర్ చంద్రశేఖర్ గా రాజశేఖర్ ఎక్కడా ఓవరాక్షన్ చేయకుండా తన మేనరిజమ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి తూకమేసినట్లుగా చక్కని నటనని ప్రదర్శించారు. ముసలితనం ఛాయలు అక్కడక్కడా కనిపించినా కానీ కాస్టూమ్స్ తోనూ తన స్టైలింగ్ తోనూ హాలీఉడ్ సినిమాల్లో చూసే ఒక మిడిల్ ఏజ్డ్ ఏజెంట్ ఎలాగైతే ఉంటాడో అలాగే కనిపించి ఆకట్టుకున్నారు. తనకి డబ్బింగ్ చెప్పిన సాయికుమార్ వాయిస్ మరో పెద్ద ఎసెట్. పూజా కుమార్ పాత్ర విశ్వరూపంలో పాత్రకు ఎక్స్టెన్షన్ లా అనిపిస్తుంది. హ్యాకర్ గా చేసిన అదిత్ పాత్రకి తగినట్లు ఉన్నాడు, మెయిన్ విలన్ గా చేసిన కిషోర్ పాత్ర క్లైమాక్స్ లో తేలిపోయింది. ఉన్న కాసేపైనా బిగ్ బాస్ ఫేమ్ ఆదర్శ్ స్టైలిష్ ప్రజన్స్ తో గుర్తుండి పోతాడు. మిగిలిన నటీ నటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించినది టెక్నికల్ టీమ్, సినిమాటోగ్రఫీ అందించిన టీం అంజి, గికా చెలిడ్జే, బకుర్‌ చికోబవ, సురేష్‌, శ్యామ్‌ ఇంకా నేపధ్య సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల, ఎడిటింగ్ తో ఫస్ట్ హాఫ్ ని పరిగెట్టించిన ధర్మేంద్ర కాకరాల కృషిని అభినందించి తీరాలి. సినిమా కథ గురించి నేను ఏమీ చెప్పదలచుకోలేదు... సాథారణంగా స్పై థ్రిల్లర్స్ లో ఉండే కథే ఇది కూడా. అయితే ఆ కథను ఒక్కో ముడీ విప్పుకుంటూ చెప్పిన తీరు చాలా బాగుంది. అలాగే అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీస్కున్నా కానీ యాక్షన్ సన్నివేశాలతో సహా చాలా సన్నివేశాలలో లాజిక్ ను వదిలి పెట్టలేదు. సినిమాలో కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నా కూడా ఈ గ్రిప్పింగ్ నెరేషన్ వాటిని పట్టించుకోకుండా ఉండేలా చేస్తుంది. 

మొత్తం మీద ఒక్కొ సినిమాకి ఒక్కో జెనర్ ని ఎన్నుకుంటున్న ప్రవీణ్ సత్తారు ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తనదైన శైలిలో మనముందుకు తీస్కొచ్చారు. యాక్షన్ స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు తెలుగు తెరమీద వైవిధ్యమైన సినిమాలను చూడాలనుకునే వాళ్ళు, ఒకప్పటి (ఆహుతి, అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు) రాజశేఖర్ అభిమానులు మిస్సవకుండా చూడవలసిన సినిమా పి.ఎస్.వి. గరుడవేగ. వీలైతే కథ గురించి తెలుసుకోకుండా ట్రైలర్ ఇక్కడ చూసి సినిమాకి వెళ్ళండి ప్రవీణ్ అండ్ టీం మిమ్మల్ని నిరాశ పరచరు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.