హైదరాబాద్ నగరంలోని అత్యంత ధనవంతులలో ఒకరు జగన్నాథ్(సుమన్). అతని కొడుకు మంచి మనసున్న కృష్ణ(సుధీర్ బాబు) తన పుట్టినరోజు పార్టీలో మిత్రులకి పరిచయం చేయడానికి తన తండ్రికి ఇష్టమైన రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ "శమంతకమణి" ని అతనికి తెలియకుండా తీస్కెళతాడు. పార్టీ ముగిసే సరికి ఆ కార్ దొంగతనానికి గురవుతుంది. చిన్నపుడు తన తల్లి కొనిస్తానని మాటిచ్చిన ఆ కార్ ఇంటికి వచ్చిన దగ్గర నుండీ తనకి దూరమైన తల్లే తిరిగి వచ్చిందన్నంతగా సంబర పడుతున్న కృష్ణ ఆ కార్ ని వెతికి పట్టుకోవాలని పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ సహాయం కోరతాడు.
రంజిత్ కుమార్ (నారా రోహిత్) ఒక కరప్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తన లైఫ్ సెటిలైపోయేలాంటి ఏదైనా ఒక స్కామ్ / సెటిల్మెంట్ చేసి డబ్బు సంపాదించాలన్నది అతని జీవితాశయం. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ చిన్న చిన్న చిల్లర వసూళ్ళతో జీవితం నెట్టుకొస్తుంటాడు. ఈ కారు పట్టుకుంటే వచ్చే డబ్బుతో తన లైఫ్ సెటిల్ ఐపోతుందని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు.
శివ(సందీప్ కిషన్) ఒక అమాయకమైన పల్లెటూరు యువకుడు, ఊరిలో తను ప్రేమించిన అమ్మాయి తనని ప్రేమించి కూడా తన దగ్గర డబ్బులేని కారణంగా తనకు దూరమైందన్న కోపంతో ఎలాగైనా డబ్బు సంపాదించి చూపించాలని ఎదురు చూస్తుంటాడు.
కార్తీక్(ఆది సాయికుమార్) ఒక మధ్యతరగతి కుర్రవాడు తన చిన్ననాటి స్నేహితురాలైన ఓ డబ్బున్నమ్మాయిని ప్రేమిస్తాడు. తనకీ తన ప్రేయసికి ఉన్న ఆర్ధిక అంతరాల వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచేసుకున్న కార్తీక్ తమ మధ్య జరిగే ప్రతి సంఘటనలోనూ తన వద్ద డబ్బులేని కారణంగా ప్రేయసి తనని చులకన చేస్తుందని ఫీలవుతూ ఎలాగైనా డబ్బుసంపాదించాలని ఎదురు చూస్తుంటాడు.
ఉమా మహేశ్వరరావ్(రాజేంద్ర ప్రసాద్) ఒక సాధారణ కార్ మెకానిక్, తన ఎదురింట్లో ఉండే ఇంద్రజని ప్రేమించి ఆమెతో లైఫ్ లో సెటిల్ అవాలని ఎదురు చూస్తుంటాడు అయితే అందుకోసం ఆమె చుట్టూ ఉన్న సమస్యలను తీర్చడానికి కొంత డబ్బు అవసరం ఉంటుంది. ఎలాగైనా సంపాదించాలని మార్గాలు వెతుకుతుంటాడు.

"మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిలవల్లే ప్రాబ్లమ్స్ బ్రో.." అంటూ బాధ పడి పోయే ముదురు బాచిలర్ పాత్రలో రాజేంద్రప్రసాద్ ఆకట్టుకుంటాడు అతని ప్రియురాలిగా ఇంద్రజ అందంగా కనిపించింది. వీరిద్దరినీ జంటగా తెరమీద చూడ్డం బావుంది. కరప్ట్ పోలీసాఫీసర్ గా నారా రోహిత్ చాలా సహజంగా నటించేశాడు అతని సైడ్ కిక్ గా కానిస్టేబుల్ పాత్రలో రఘు కారుమంచి నవ్వించాడు. సందీప్, సుధీర్, ఆది సాయికుమార్ కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ గా మణిశర్మ నేపథ్యసంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పుడి ఎడిటింగ్, శ్రీరామ్ ఆదిత్య సంభాషణలు బావున్నాయ్.. ముడులు వేసుకుంటూ వచ్చే మొదటి సగం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా చిత్రం సెకండాఫ్ నుండీ ఆసక్తికరంగా కూర్చో బెడుతుంది ఊహించని క్లైమాక్స్ ఆశ్చర్యపరుస్తుంది.
పాటలు ఫైట్లు కామెడీ ట్రాక్ లు అంటూ ఫార్మాట్ ఫిల్మ్స్ కాకుండా వైవిధ్యమైన సినిమాలను, క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వాళ్ళు మిస్సవకుండా చూడవలసిన ఈ చిత్రం రేపు శనివారం అంటే 11 నవంబర్ 2017 న సాయంత్రం 6:30 గంటలకు జెమినీ టీవీలో ప్రసారమవబోతుంది, మిస్సవకండి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.