సోమవారం, జూన్ 04, 2012

శ్రీశ్రీనివాసం శిరసా నమామి - 1

ఆ ఆపద మొక్కుల వాడిని తలచుకోగానే నాకు ముందు గుర్తొచ్చేది తిరుమలలోని రద్దీనే... నేను ఇలా భయపడతాను కనుకనే ఏమో నేను ఎపుడు దర్శనానికి వెళ్దామనుకున్నా విపరీతమైన రద్ది ఉంటుంది. వెళ్ళి వచ్చిన తెల్లారి పేపర్ చూస్తే “తిరుమలలో పెరిగిన రద్దీ” అంటూ వార్త వస్తుంటుంది. అప్పటికీ రెండు వారాలక్రితం నేను ఇలా వెళ్దామనుకున్నపుడు బ్లాగ్ మిత్రులు శంకర్ గారు “ఇప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుందండీ ఒక్క రెండువారాలు, స్కూల్స్ తీసేవరకూ ఆగడం మంచిది” అని సలహా ఇచ్చారు కానీ ఆస్వామి ఆజ్ఞ అయితే కాదని వాయిదా వేయడానికి మనమెవరం? అదీ కాక ఇంచుమించు పుష్కరకాలం తర్వాత వెళ్ళాలని బుద్దిపుట్టింది అనుకుని, శంకర్ గారి వద్ద కొన్ని సందేహాలు నివృత్తిచేసుకుని మరికొంత సమాచారం సేకరించి ఆమర్నాడే ఒంటరిగా తిరుమలకు బయలు దేరాను. నాకు మనసులో దర్శనానికి వెళ్ళాలని అనిపించినా ఆస్వామే శంకర్ గారి రూపంలో నాల్రోజులు ఆగి వెళ్లమని సలహా ఇచ్చారని నాకు ఆక్షణంలో తోచలేదు.

పుష్కరకాలం క్రితం నాలుగైదు సార్లు దర్శనానికి వెళ్ళినా కార్లు, పరివారం, రికమెండేషన్ లెటర్లు, ఇతరత్రా  హంగులతో వెళ్ళి వచ్చే వాడ్ని కనుక నాకు ఎపుడైనా క్యూకాంప్లెక్స్ లో వెయిటింగ్ తప్ప మరో నొప్పి తెలిసేది కాదు. ఈసారి మాత్రం ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సామాన్యుడిగా దర్శనానికి వెళ్ళాను. ఇలా ఏవిధమైన ఏర్పాట్లు లేకుండా వెళ్ళాలి అనుకున్నవాళ్ళకి ఉపయోగపడుతుందని అన్ని వివరాలతో టపా రాస్తున్నాను. ఇవన్నీ తెలిసిన వారిని ఈ టపా విసిగించవచ్చు గమనించగలరు.

ఆన్లైన్ రిజర్వేషన్ల పుణ్యమాని గుంటూరునుండి బయలుదేరే బస్సులో సీట్ దొరికింది, సాయంత్రం ఐదుగంటలకు వెచ్చని వడగాలులు మొహం మీద కొడుతూ మంటలు పుట్టిస్తుండగా పదినిముషాలకోసారి ఓ గుక్క మంచినీళ్లతో నాలుక తడుపుకుంటూ బస్సులో కూర్చున్నాను. రాత్రి పన్నెండు గంటలకు చేరుకోవాల్సిన బస్సు ఒకటిన్నరకి చేరుకుంది. బస్సుదిగి వాకబు చేస్తే కొండమీదకి బస్సులు నాలుగ్గంటలనుండి దొరుకుతాయని అన్నారు. ప్రైవేట్ వాహనాలపై సదభిప్రాయం లెని నేను ఆర్. టి. సి. బస్సుమాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. తిరుమల వెళ్ళే బస్టాండ్ కు చేరుకుని  కాలకృత్యాలు తీర్చుకునే సరికి రెండు గంటలనుండే కొండ మీదకి వెళ్ళే బస్సులకు టిక్కెట్లు ఇష్యూ చేయడం మొదలెట్టారు. ఒకవైపు ప్రయాణానికి 34రూ.లు వెళ్ళిరావడానికి 62రూ.లు టిక్కెట్. అదేరోజు తిరిగిరావాలనే రూల్ ఏమీలేదు. రిటర్న్ టిక్కెట్ కొని బస్సెక్కి కూర్చున్నాను. పదినిముషాల్లో బయల్దేరిన బస్సును మరో పదినిముషాల్లో అలిపిరి గేట్ వద్దకు తీసుకు వెళ్లి ఆపేశాడు.  

అక్కడ తెలిసిన విషయమేమిటయ్యా అంటే తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్ రాత్రి పన్నెండు గంటలనుండి మూడుగంటల వరకూ మూసి వేస్తారు. ఐతే కొంత టైం సేవ్ చేస్కోడానికి బస్సులు రెండింటి నుండి తిరుపతిలో బయల్దేరి గేట్ ముందు నిలుపుతారుట. తిరుపతి వచ్చేవరకూ కూడా వడగాడ్పులు అల్లాడించినా అలిపిరి దగ్గరకి వచ్చేసరికి చల్లని గాలి తగలడం మొదలైంది. ఆ చల్లగాలుల ద్వారా పచ్చని చెట్ల ఆవశ్యకతను ప్రకృతి మరోసారి స్పష్టంగా తెలియజేసినట్లు అనిపించింది. దదాపు అరగంట టైం ఉండటంతో బస్సుదిగి చుట్టుపక్కల కాస్త తిరిగి సైకిల్ పై పెట్టుకుని అమ్ముతున్న ఒక మాంచి మసాలా టీ తాగేసరికి గేట్ తీశారు. బస్సులోని ప్రతిఒక్కరు కూడా లగేజ్ తో దిగి సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాలి, బ్యాగ్ ను స్కానర్ పై ఉంచి మనం మెటల్ డిటెక్టర్ గుండా వెళ్ళాలి. బస్సుప్రయాణీకులను సైతం ఇలా చెక్ చేయడం బాగానే ఉంది కానీ కొందరు చేతి సంచులను సీట్ కింద వదిలేయడం గమనించాను బాధ్యతగా అన్నిటిని స్కాన్ చేయించేలా చూడాల్సిన డ్రైవర్ స్టీరింగ్ వీల్ వదిలి పక్కకి కూడా రాకపోవడం నాకు నచ్చలేదు, మొత్తంమీద అదో మొక్కుబడి వ్యవహారంగా మాత్రమే అనిపించింది. 

తిరుమలలో బస్సు దిగి నాలుగు అడుగులు వేయగానే రోడ్ మీదున్న ఒకరిద్దరు వ్యక్తులు ప్రయాణీకులకు సమాచారాన్ని ఇస్తుండడం గమనించాను ఓహో ఇంత తెల్లవారుఝామునే నిస్వార్ధంగా భక్తులకు సేవచేయడం ఎంత మంచి విషయం అని వాళ్ళదగ్గరకు వెళ్ళి కళ్యాణకట్ట (తలనీలాలు ఇచ్చే చోటు) కోసం ఏటువైపు వెళ్ళాలి ? రూంకావాలంటే ఎక్కడ తీస్కోవాలి ఇతరత్రా వివరాలు అడిగాను. వాళ్ళు సమాధానం దాటవేసి రండి నేను తీస్కెళ్తాను ముందు ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తే అక్కడ మీకో ఫోటో తీస్తారు అది తీస్కుని కళ్యాణకట్టకి వెళ్తే అక్కడ గుండు కొడ్తారు అని చెప్పడం మొదలెట్టారు. ఏం ఫోటో? ఎందుకు ? అని వివరాలు అడిగితే వాళ్ళు ఆకాంప్లెక్స్ లోని చిన్న చిన్న ఫోటో స్టూడియోల దళారులని బేరాలకోసం అక్కడ నిలబడి వచ్చిన యాత్రీకులకి కబుర్లు చెప్పి తీస్కెళుతున్నారని అర్ధమైంది. నాకేఫోటో అక్కర్లేదు నేనూ మార్గదర్శిలో చేరాను ఓ మైసూర్ కెమేరా కొనుక్కున్నాను అని చెప్పి పక్కనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ని వివరాలు కనుక్కుని రూంకోసం వెళ్ళాను.

ఆ రద్దీలో పేవ్మెంట్స్ మీద పడుకున్న జనాలని చూశాక రూం దొరుకుతుందన్న ఆశ అణుమాత్రమే ఉన్నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని బ్యాగ్ మోస్కుంటూ అడ్మిన్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళేసరికి ఒంటరి పక్షులకు రూములివ్వబడవు అని పెద్ద పెద్ద బోర్డులు వెక్కిరిస్తూ కనిపించాయ్. మేమంటే మీక్కూడా చులకనేనా స్వామీ ఏమిటీ అన్యాయం అని అనుకుని ఈసురోమంటూ కాళ్ళీడ్చుకుంటూ తిరిగి కళ్యాణకట్ట వద్దకు బయలు దేరాను. దారిలో నేను గమనించినదేమంటే తిరుమలలో తెల్లవారుఝాము మూడున్నరలాగానేలేదు దదాపు యాభై శాతం దుకాణాలు హోటల్స్ అన్నీ తెరిచే ఉన్నాయి, రోడ్డుపకన్న పడుకొనేవాళ్ళు, దుకాణాల్లో కొనేవాళ్ళు హోటల్స్ లో తినేవాళ్ళు ఎవరిదారి వారిదే అన్నట్లున్నారు. దారిపక్కన బొమ్మలు అమ్మే అతనితో మాటకలిపి ఏంటిబాబు ఇలా ఇరవైనాలుగ్గంటలూ ఇక్కడే ఉంటావా తిండీ నిద్ర పరిస్థితి ఏంటి అని అడిగాను. మరి పూటగడవాలంటే తప్పదుగదండి బేరాల టైంలో తెరవకపోతే ఎట్టా కుదురుద్ది. రాత్రి డూటీ నేను చేస్తాను ఈ టైంలో కూడా దరిదాపు పగలున్నంత బేరాలు ఉంటాయ్ తెల్లారినాక మాఅన్న వస్తాడు అని జవాబిచ్చాడు.

కళ్యాణకట్ట వద్ద అప్పటికే (ఉ.4:00 గం.లు) పేద్ద క్యూ ఉంది. మళ్ళీ ఒక అరకిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి క్యూలో జాయినయ్యాను. మాములుగా దర్శనం కోసం క్యూలోకి వెళ్ళే ముందే చెప్పులు బయట బద్రపరచాల్సి ఉంటుంది కానీ కళ్యాణకట్టకి వెళ్ళేప్పుడు మాత్రం క్యూ లోపలే సగం దూరం వెళ్ళాక ఉచితంగా చెప్పులు భద్రపరిచే కౌంటర్ వస్తుంది. అక్కడ ఇచ్చేసి టోకెన్ తీస్కుని పని అయ్యాక బయటకి వచ్చి కలెక్ట్ చేస్కోవచ్చు. తిరుమలలోని ఇలాంటి కౌంటర్స్ అన్నిటిలోనూ ఉచితంగా భద్రపరిచే అవకాశమున్నాకూడా ప్రతిఒక్కరు ఏదో మీకు తోచినంత ఇవ్వండి సార్ చాయ్ కాఫీకి అంటూ వసూలు చేస్తూనే ఉంటారు. ఒక్కటే గుడ్డిలో మెల్ల ఏంటంటే రుబాబు చేసి వసూలు చేసే పద్దతిలేదు. వాళ్ళు చూసే చూపులు తట్టుకోలేని వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు లేదంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు.  

తిరుమలలో నేను గమనించినది మరొకటి ఏమిటంటే క్యూలు విశాలమే కానీ మనుషుల మనసులే ఇరుకు.  క్యూలన్నీ కూడా చాలా విశాలంగా ఒకేసారి ముగ్గురు పక్కపక్కన నిలబడటానికి వీలుగా పెద్దగా ఉన్నాయ్ కానీ మనుషులు మాత్రం అందులో మూడులైన్లు ఫాం చేసేసి ఒకళ్ళమీద ఒకళ్ళుపడిపోయి తోసుకుని నానా ఖంగాళీ చేసేస్తున్నారు. ఎవరికి వారు ఎదురు చూపులవలన చిరాకులో ఉన్నారో తొందరలో ఉన్నారో కానీ ఊపిరాడనంత తొక్కిడి కొంచెం ఉక్కిరిబిక్కిరి చేసింది. కళ్యాణకట్ట క్యూలలో ఎక్కడో ఒక్కచోట మంచినీళ్ళ కుళాయి తప్ప ఫెసిలిటీస్ ఏమి లేవు మంచినీళ్ళ బాటిల్ వెంట తీసుకెళ్ళడం మంచిదైంది. క్యూలో రెండున్నరగంటలు పైగా నుంచుని ఎదురుచూశాక కంపార్ట్మెంట్స్ లోకి వదిలాడు. అక్కడి కబుర్లు ఇతర సౌకర్యాల గురించి దర్శనానికి సంబంధించిన కబుర్లు మరొక టపాలో చెప్పుకుందాం. అంతవరకూ నాతోపాటు మీరుకూడా గోవింద నామస్మరణ చేసుకోండి.

16 వ్యాఖ్యలు:

 1. అన్నయ్య నాకు తెలియని విషయాలు చాలా రాసావు .. నెక్స్ట్ పార్ట్ కోసం వెయింటింగ్ ... మేము కూడా తిరుపతి వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళడం వల్ల ఈ విషయాలు ఏమి తెలియవు ... పైగా దర్సనం కూడా చాలా ఈజీగా జరగడం వల్ల నొప్పి ఏమి తెలియలేదు .. కాని శ్రీనివాసుడి మీద విపరీతమైన భక్తీ పుట్టుకొచ్చే చాలా అద్భుతమైనా నమ్మశక్యం కాని సంఘటనలు జరిగాయి అవి ఎప్పడికి మర్చిపోలేను .. ఆ విషయాలు ఇంకొక కామెంట్ లోవివరిస్తా ... ఆ స్వామీ లీలలు చెప్పలేము ఎవ్వరం శ్రీ శీనివాసం శిరసా నమామి :))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగా వివరించారు వేణు గారు..!
  నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ వుంటాం..:)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీ అనుభవాలు చక్కగా వివరించారు వేణుగారూ..తరువాత టపా కోసం ఎండురుచూస్తూ ఉంటాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. గోవిందా గోవిందా! (మీరు గోవింద నామ స్మరణ చేయమనగానే వచ్చేసింది) బాగున్నాయి. కొండ నడిచి ఎక్కితే భలే ఉంటుంది. తరువాతి టపా కోసం చూస్తూ...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రెగ్యులర్ గా వెళుతూ ఉంటాను నేను. ఆ జర్నీ అన్నా బోర్ కొట్టిందేమో గానీ మీరన్నట్టూ ఇప్పుడు చదివేటప్పుడు మాత్రం బోర్ కొట్టలేదు... మీ పోస్టులు ఎంత శ్రద్దగా మనశ్శాంతిగా చదూతానో అలాగే చదివాను. యాత్రా విశేషాలు చదువుతున్నట్టు కాక, ఒక కధ చదువుతున్నట్టూ ఉందీ ;)

  మధ్యలో ఆ మైసూర్ కెమెరా ఏంటండీ?? ఆయ్?

  దైవ దర్శనం కలిగిన ఆ చివరాఖరి ఘట్టం కోసం ఎదురు చూస్తూ..

  ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోఓఓఓఓఓఓ.విందా...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మనుషుల మనసులు ఇరుకు సంగతేమో గానీ క్రమశిక్షణ, సహనం అనేది మచ్చుకైన కనిపించదు అక్కడ. ఎవరికి వారే తమ పని ఐపోవాలి అనే తొందరలో ఉంటారు. టిటిడి కొన్ని వసతులు, కొత్త ప్రణాలికలు అమల్లోకి పెట్టినా వాటిని సరిగ్గా ఉపయొగించుకోలేకపోవటం, రూల్స్ ను సక్రమంగా పాటించటం మనకు చేతకాకపోవటం దురదృష్టకరం.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అవును వేణు నాకు కూడా ఆ చెకింగ్ ఫార్మాలిటి గా అనిపించింది.ఈ పాటి దానికి చెయ్యక పొతే ఏమి అనిపించింది.మైసూర్ కెమెరా కేక...)) కాని రూం మాత్రం ఆన్లైన్ లో బుక్ చేసుకొని పొతే ఆ కాటేజ్ లకే కళ్యాణ కట్టలు ఉంటాయి.అక్కడ గుండు చేయించుకోవచ్చు.లేకుంటే నీ లాంటి కష్టాలే...బాగా వ్రాస్తున్నావు..ప్రోసీడ్ ...

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నేనూ క్రితం వారమే కొండకెళ్ళాను. శ్రీవారి మెట్టు అనే చోట నుండి నడక దారి ఒకటుంది. ఇది అలిపిరి నడకదారికన్నా దగ్గర. అక్కడ నుండి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అలా వెళితే వేళకు క్యూ కాంప్లెక్స్ లో భోజనాదులు (బిసిబేలా బాత్) టీటీడీ వారే సమకూరుస్తున్నారు.ఐదు గంటలు పట్టింది దర్శనం.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నాకేఫోటో అక్కర్లేదు నేనూ మార్గదర్శిలో చేరాను ఓ మైసూర్ కెమేరా కొనుక్కున్నాను :))))


  బాగా వివరించారు వేణు గారు,దర్శన విశేషాల కోసం ఎదురు చూస్తుంటాం

  ప్రత్యుత్తరంతొలగించు
 10. కొండ పైకి నడక చేస్తే, ఒక్కళ్ళకి కూడా లాకర్ ఇస్తారు.

  ఏడుకొండల వాడా, గోవిందా... గోవిందా...

  ప్రత్యుత్తరంతొలగించు
 11. గోవిందా.... గోఓఓఓఓఓ వింద.
  ఇందు కలదు అందులేదు అని సందేహము వలదు అన్నట్టు అంతటా అవినీతే కనిపిస్తుంది, దేవుడు అనిపించడు. దేవుడింకా ఆ పరిసరాల్లో ఇంకా వుంటాడా అనిపిస్తుంది.

  కడప టౌన్లో దేవునికడప అనే ప్రాంతంలో వెంకన్నదే ప్రాచీనమైన గుడి వుంది, బాగుంటుంది. విగ్రహం తిరుమల విగ్రహానికి నకలు అంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. చాలా వివరంగా చెప్తున్నారు, వేణూ.. ఈ రోజుల్లో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా ఆ శ్రీవారిని దర్శించుకోవడం అంటే కొంచెం సాహసోపేతమైన పనే అని చెప్పాలి..
  అదీ ఒంటరిగా కాబట్టి పర్వాలేదు.. కుటుంబంతో వెళ్తే!?!?
  కానీ ఎన్ని కష్టాలు పడ్డా ఒక్కసారి గుడిలోకి అడుగుపెట్టి గోవిందనామస్మరణ వినగానే ఆ అలసట/చికాకు అంతా మాయమైపోతుంది!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. శివరంజని, ఫోటాన్, జ్యోతీర్మయి గారు, రసజ్ఞ గారు, రాజ్, బులుసు గారు, తృష్ణ గారు, శశిగారు, రవిగారు, శ్రావ్య, హరే, పానీపూరి గారు, SNKR గారు, నిషి... వ్యాఖ్యానించిన మిత్రులందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు. ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు క్షంతవ్యుడను.

  ఆలశ్యమెందుకు చెల్లాయ్ నీకు కనిపించినలీలలను కూడా అక్షరబద్దంచేయి.
  రసజ్ఞ గారు అవునండీ నడిచి ఎక్కితే బాగుంటుందని నేనూ విన్నాను కానీ ఒంటరిగా రిస్క్ చేయలేక ఆగాను ఈసారెపుడైనా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాలి.
  తృష్ణ గారు భక్తులలో క్రమశిక్షణ లోపించడం కరెక్ట్ గా చెప్పారు.
  శశిగారు రూం దొరికితే బగానే ఉండేదండీ పరిస్థితి నిజమే కానీ కళ్యాణకట్టలో ఇవ్వడమూ కాటేజ్ లో ఇవ్వడమూ ఒకటికాదని ఒక పిచ్చి నమ్మకం అంతే :-)
  రవిగారు శ్రీవారిమెట్టు గురించి నేనూ విన్నానండీ, భోజన సదుపాయాలు అన్ని క్యూలలోనూ ఉన్నాయండీ అది మెచ్చుకోవలసిన విషయం.
  పానీపూరిగారు లాకర్ ఇస్తారు కానీ రూం ఇవ్వరండీ.
  SNKR గారు అక్కడ జరిగే అవినీతి గురించి వార్తల్లో చూడడమే కానీ పెద్దగా నాకూ తెలియదండి, బహుశా కర్మ సిద్దాంతాన్ని అనుసరించి దేవదేవుడు కూడా చూస్తూ మిన్నకుండిపోతాడేమో.
  >కానీ ఎన్ని కష్టాలు పడ్డా ఒక్కసారి గుడిలోకి అడుగుపెట్టి గోవిందనామస్మరణ వినగానే ఆ అలసట/చికాకు అంతా మాయమైపోతుంది!> కరెక్ట్ నిషీ.

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.