బుధవారం, జనవరి 06, 2010

క్షుర ’ఖ’ర్మ

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షవరం. చిన్నప్పటి నుండీ మంగలి చేతిలో హింస భరించ లేక, అలా అని జుట్టుని అలా వదిలేయలేక పడ్డ కష్టాలు నాకూ ఆ దేవుడికే తెలుసు. అసలు మనిషి అనాటమీ గురించి ఎపుడైనా ఆలోచిస్తే ఆహా  దేవుడు ఎంత అద్భుతమైన అర్కిటెక్ట్ అని అనిపిస్తుంటుంది. కానీ అంత గొప్ప ఆర్కిటెక్ట్ కూడా అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ జుట్టు. తలలో ఉన్న మెదడు కు దెబ్బ తగలకుండా రక్షణ కోసాం జుట్టును అమర్చాడనుకుందాం సరే బాగుంది. కానీ అది కుషన్ లా కాస్త పెరిగి, ఓ స్టైల్ లో అలా ఉండిపోయేలా ఉంటే ఎంత బాగుండేది. అలాకాకుండా అది జీవితాంతం అలా పెరుగుతూనే ఉండే ఏర్పాటు చేశాడు చూశారా అక్కడే మరి నాకు మండుద్ది. పోని కత్తిరించకుండా వదిలేద్దామా అంటే అడ్డ దిడ్డంగా ఎగిరి మొహం మీద పడటం, చెవుల పైనంతా పెరిగి చిరాకు తెప్పించటం ఇత్యాదిగా దాని నిర్వాకాలు మాటల్లో చెప్పనలవి కాదు. ఇంతేనా అసలు దాని నిర్వహణ కోసం రోజూ కొబ్బరి నూనె సీసానో, శలవురోజుల్లో అయితే ఆముదం సీసానో చేత పట్టుకుని వెంటపడే అమ్మనుండి తప్పించుకోడానికి ఎంత చాక చక్యం కావాలి. పోనీ గుండు గీయించేద్దాం అంటే, అబ్బే అదస్సలు బాగోదు. హు మగవాడిగా పుట్టినందుకు ఈ కష్టాలు భరించక తప్పదు కదా. 

నా చిరాకుకు ఒక మినహాయింపు వాలుజడ, అంటే మరి దాన్ని భరించాల్సింది మనం కాదు కదా :-) అది కూడా ఓ కారణం మినహాయించడానికి. కానీ గుప్పెడు మల్లెలు తురిమిన వాలు జడ నాగుపాములా అలా వయ్యారంగా కదులుతూ ఉంటే ఆ అందం చూడటానికి రెండు కళ్ళూ సరిపోతాయిటండీ... అసలు ఒకప్పటి అమ్మాయిలను చూసి కుళ్ళుకునే వాడ్ని ఎంచక్కా అందమైన వాలు జడ వీళ్ళసొంతం, అదీకాక నెలకోసారి మంగలిచేతికి తలప్పగించి వాడు దానిపై తబలా వాయిస్తూ వాలీబాల్ ఆడుకుంటుంటే భరించాల్సిన అవసరం లేదుకదా అని. ఒకప్పటి అని ఎందుకన్నానంటే పాపం ఇప్పుడు వాళ్ళుకూడా క్రాఫింగ్ చేయించేస్తున్నారు కదా అందుకని. కానీ తర్వాత్తర్వాత చెల్లాయిని చూస్తే అర్ధమైన విషయం ఏమిటయ్యా అంటే వాలుజడ నిర్వహణ కోసం అమ్మాయిలంతా మంగలోడి కన్నా నిరంకుశులు అయిన అమ్మల చేతికి ప్రతిరోజు బుర్ర అప్పగించి నానా హింస భరిస్తారు పాపం :-( అని. వారి సహనానికో వందనం ఇదుగో :-)

అమెరికాలో ఈ బాధ మరింత ఘోరంగా ఉండేది. అక్కడ ఎక్కువగా మెక్సికన్స్ మరియూ చైనీస్ ఈ పని చేసే వారు. వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పినా సరిగా అర్ధం అయ్యేది కాదు పోని అర్ధం కాలేదు అని మరో సారి అడిగి మనకి ఎలా కావాలో తెలుసుకుంటారా అంటే ఊహూ అదీలేదు. మనం చెప్పిన దానికంతా తలాడించేసి  వాడికి నచ్చిన స్టైల్లో చేసి పంపించేస్తాడు. ఒకసారి ఇలానే నేను ఐదు నిముషాలు జుట్టుపట్టుకుని మరీ చూపించి వివరించాను వాడు బుద్దిగా విని నేఆపగానే ఒక మెషీన్ తీసుకుని వరికోతలు కోసినట్లు జుయ్.య్.య్.మని తలంతా రెండు రౌండ్ లు వేసి రెండే నిముషాల్లో అయిపోయింది ఫో!! అన్నాడు, నాకేం చేయాలో అర్ధంకాక డబ్బులు ఇచ్చి బయటపడ్డాను. ఇక్కడి రేట్లు కూడా మరీ దారుణం రెండు నిముషాలు మిషన్తో చేసే పనికి 13 డాలర్ల ఫీజు పైన రెండు డాలర్ల టిప్పూ వెరసి 15 డాలర్లు ముక్కుపిండి వసూలు చేసేవాడు (ఈసారెళ్తే వాల్ మార్ట్ లో ఓ మూల క్షౌరశాల కూడా పెట్టమని సలహా ఇవ్వాలి). సరే ఇంటికొచ్చి చూస్కుందును కదా తలంతా సగం చీకేసిన తాటి టెంక లా ఒకసగం అంతా క్రాఫ్ చేయని పొడవు జుట్టు రేగిపోయి, మరోసగం క్రాఫింగ్ చేసిన జుట్టు కుదురుగా నున్నగా అణిగిపోయి దర్శనమిచ్చింది. ఆ వికృతరూపాన్ని చూసి ఝడుసుకుని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేక వేరే చోటకి వెళ్ళి సరిచేయించుకుని వచ్చాను.

సరే ఇక బెంగుళూరు వచ్చిన మొదట్లో అప్పటికే చాన్నాళ్లవుతుంది, చిరాకుగా ఉంది  అని తప్పనిసరై సెలూన్ వేట మొదలెట్టాను, ఎవర్నడిగినా ఇక్కడే ఇక్కడే అని చెప్తుంటే కాబోలు అనుకుని అలా కాళ్ళరిగేలా ఓ కిలోమీటరు పైనే నడిచి ఏదో ఒక మెన్స్ పార్లర్ అని కనిపిస్తే దాన్లోకి అడుగు పెట్టాను. తలుపు తీసి లోపలికి అడుగు పెట్టానో లేదో చల్లని ఎయిర్ కండిషన్ గాలి, సుమధురమైన రూమ్ ఫ్రెషనర్ ఘుమ ఘుమలు మైమరపించాయి. ఓ క్షణం పరికించి చూస్తే మాంచి టివీ ప్లస్ మ్యూజిక్ సిస్టం, ఒక పక్కగా అక్వేరియం, ఖరీదైన (ఫోటోల్లో చూపించినలాంటి) కుర్చీలు, ఓ మూలగా వాషింగ్ మెషీన్, ప్రతి కుర్చీకీ పక్కన వాళ్ళు కనపడకుండా ఇండివిడ్యువల్ కంపార్ట్ మెంట్స్(కార్పొరేట్ అఫీసుల్లో కూడా ఉండవేమో). కళ్ళు మిరుమిట్లు గొలిపే లైట్లు, గ్రానైట్ ఫినిషింగ్ తో వాష్ బేసిన్ ప్లాట్‍ఫాం. మొత్తం పోష్ సెటప్ చూస్తే వీర లెవల్ లో వసూల్ చేస్తాడు అనిపించింది ఓ క్షణం వెనక్కితిరిగి చూడకుండా పారిపోదామా అనికూడా అనిపించింది. కానీ అప్పటికే అలసి పోయి ఉండటంతో ఏదోఒకటి లే ఇక ఓపికలేదు అనుకున్నాను.

అంతలో ఓ పక్కనుండి యాప్రాన్ కట్టుకుని చేతిలో ఓ కత్తెర పట్టుకుని మాంచి ఇంగ్లీష్ లో ఒకతను పలకరించాడు. అతన్ని చూసిన వెంటనే ఫక్కుమని నవ్వొచ్చేసింది. కింద ఫోటోలో చూపించినట్లుగా, అంత కాకపోయినా ఇంచుమించు అంత గడ్డం, చెవులవరకూ అంటే సగం పైగా బట్టతల. అతన్ని ఇలాటి మెన్స్ బ్యూటీ పార్లర్ లో పెట్టడం చూసి నవ్వాగలేదు. "నువ్వు అర్జెంట్ గా ఓ విగ్గు కొనుక్కో.. లేదంటే ఈ పనైనా మానేయవోయ్.." అని సలహా ఇద్దాం అనుకున్నాను. చూస్తే తెలుగువాడిలా కనిపించాడు "ఏం పేరోయ్.." అని అడిగా/ దివాకర్ అన్నాడు నాకు ఎందుకో తోటరాముడు గారి దినకర్ ప్లస్ ఏప్రిల్ ఒకటి విడుదల లోని దివాకరం ఇద్దరూ కలిసి గుర్తిచ్చారు. సరే తెలుగు అని తెలిసాక మాట్లాడటం మొదలెట్టాడు.

"అసలు మీకు మీ జుట్టు మీద కానీ మీమీద కానీ శ్రద్ద లేదు సార్... ఇవ్వాళ రేపు జనం ఎలా ఉంటున్నారు ? జిమ్ లని బ్యూటీ పార్లర్ లని ఎంత శ్రద్దగా మెయింటెయిన్ చేస్తున్నారో తెలుసా?. మీరిలా మీగురించే పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్?" అన్నాడు. అహా అలాగా "అది సరే ఇంతకీ పట్టించుకోవడం అంటే ఏంటి సార్?" అని అడిగాను. "ఫేషియల్ చేద్దాం సార్, బ్లీచ్ చేద్దాం సార్" అని వాడి దగ్గర ఉన్న సర్వీసులన్నీ మార్కెటింగ్ చేయడం మొదలెట్టాడు. "అలాక్కాదు కానీ ముందు క్రాఫ్ చేసి తగులడు రా బాబు.." అని చెప్తే మొదలెట్టి క్రాఫ్ చేస్తున్నంత సేపు వాగుతూనే ఉన్నాడు. ధ్యాసంతా మిగిలిన సర్వీసులపై ఉంటే ఇక క్షవరం ఎలా చేసుంటాడో మీకు వేరే చెప్పాలా.. అసలే పలచని సిల్కీ హెయిర్ ఆపై వాడు అడ్డదిడ్డంగా కత్తెరతో స్వైర విహారం చేస్తుంటే జుట్టు కుదుళ్ళతో సహా పెరకబడటం తెలుస్తుంది. "ఒరే..ఒరే.. నేను క్షవరం చేయమన్నాను రా జుట్టుపీకమనలేదు.." అని తిట్టేశాను కాస్తేలే సార్ అని కవర్ చేశాడు. ఇక గెడ్డం గీసేప్పుడైతే  సుత్తివీరభద్రరావు గారి తిట్లు గుర్తొచ్చాయ్ "ఇంకోసారి చేయి వణికిందంటే నీ నవరంధ్రాలలోను మైనం కూరతాను కుంకా... గడ్డం చేస్తే సుతారంగా నెమలీక తో నివిరినట్లుండాల్రా దోగుడుపార తో దోకినట్లు కాదు". అని తిట్టేద్దాం అనిపించింది. మొత్తం మీద అన్నీ ముగించి చివరికి 370 బిల్లేశాడు. క్షవరం నా తలకా, నా జేబుకా రా నాయనా అని తిట్టుకుంటూ బిల్లు కట్టి బయటపడ్డాను, అదీ జరిగింది.

24 వ్యాఖ్యలు:

 1. ఓస్! 370 కే ఇంత బాధపడితే ఎలాగ సార్! ఒకసారి నేను(మా ఇంటిదగ్గరి బ్యూటీ పార్లర్ మూసేసి ఉండటంతో) సరదాగా చూద్దామని లక్మే వాళ్ళ బ్యూటీ సెలూన్ కెళ్ళి జస్ట్ ......ట్రిమ్మింగ్ కి ఏడొందలు ఇచ్చాను! (అలాంటి చోట్లకెళ్ళినపుడు "ఎంత" అని అడగటం నామోషీ కదా! అందుకని వెయ్యి రూపాయల నోటిస్తే మూడొందలు తిరిగి చేతిలో పెట్టి ఎయిరిండియా మహరాజా టైపులో వంగి "థాంక్యూ"అని చెప్పాడు కౌంటర్లో అబ్బాయి. పైగా వాళ్ళ లోషన్లూ, షాంపూలు,కండిషనర్లూ కొనమని వెంటపడ్డారు.

  మొత్తానికి, భలే ఉందండీ మీ క్షుర ఖర్మ! చైనీస్ పిల్ల చేతికి జుట్టు అప్పగించి కూచున్న వంగూరు చిట్టెన్ రాజు గారి అమెరికామెడీ కథ చదవాల్సిందే మీరు!

  వాలుజడకు మీరిచ్చిన మినహాయింపు బ్యూటిఫుల్ గా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగున్నాయి మీ క్షురకర్మ బాధలు. నేను అమెరికా వచ్చిన మొదట్లో ఇలాంటి అనుభవమే అయింది.

  సలూన్ వాణ్ణి 2 ఇంచులు తగ్గించరా అంటే వాడు 2" కిప్పర్ సైజ్ పెట్టి నున్నగా గొరిగేసాడు. దాన్నీ బట్టి అర్ధం అయిందేంటంటే ఎలా కావాలి అని వాడు అడగ్గానే క్లిప్పర్ సైజ్ చెప్తే సరిపోతుంది అని. క్లిప్పర్ సైజ్ 5 రీజనబుల్ గా ఉంటుంది. తల చూట్టూతా క్లిప్పర్ తో చేయించి, తల పైన మాత్రం సిజర్స్ యూజ్ చేయిస్తే యే ప్రాబ్లెం ఉండదు.

  మీరు వాలుజెడ అనగానే నాకు బాపు గారి రాధా గోపాళం లో జడ పాట గుర్తొచ్చింది.
  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బిల్లు సంసార పక్షంగానే ఉందండీ.. అన్నట్టు నేనూ క్షురకర్మ బాధితుడినే.. కాకపొతే చిన్నప్పుడు.. ఇప్పుడు కూడా మరి కొన్నాళ్ళ పాటు సెలూన్ కి వెళ్ళాలి లెండి :):)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. 370 కే అలా అంటే ఎలా సోదరా! నా స్నేహితుడు అమెరికా నుండి వైజాగ్ వెళ్ళి అక్షరాలా 2,500 క్షవరం చేయించుకు వచ్చాడు ( నమ్మటం లేదా.....నేను కూడా నమ్మలేక పోయా..:)
  అమెరికాలో మీరు చెప్పిన అనుభవాలన్నీ అయ్యాక, ఇంక బాధపడటం మానేసి వెళ్ళినప్పుడల్లా 2" కట్టింగ్ మొదలుపెట్టాను :)

  -నేను సైతం

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అందుకే అమెరికా లొ నార్త్ ఈస్ట్ బెస్టు.. సెలూన్లొ అందరూ అమ్మాయిలే వుంటారు.. వాళ్ళేలా చేసిన పర్లే :-))

  బెంగుళూరులొ Le Meridien హొటల్ సెలూన్ లొ రాజ్ అని ఒకడుంటాడు (ఇప్పుడు వున్నాడొ లెడో తెలీదు) .. ఒకప్పుడు రజినీకాంత్ కి హయిర్ డ్రెస్సర్ .. ఒకసారి ట్రై చెయ్యండి.. అప్పుడు ప్రపంచంలొ మిగతా క్షురకులు అందరూ చాలా టేలెంటెడ్ గా కనిపిస్తారు..:-)

  ఒక్కసారి వాడిబారిన పడ్డా.. అదీ గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి ముందు.. మంచి టిప్ టాప్ గా తయారూవుదామని .. వాడిచ్చిన షాక్ జీవితం లొ మర్చిపొలేను..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అమెరికా కటింగ్ గురించి చాల క్లియర్ గ చెప్పారు ......నేను వెళ్ళిన ప్రతిసారి ఒక కోత్హ హెయిర్ స్టైల్ తో బయటకి వస్తాను........

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇన్ని భాదలెందుకు మీరు కూడా జాకీ చాన్ సినెమాలో ఫైటర్స్ లాగ వాలుజడ పెంచేస్కోండి ;-p

  ప్రత్యుత్తరంతొలగించు
 8. హా..హాహ్హ్..
  వేణుగారూ మా ఊళ్ళో ఇప్పటికీ ఇంటింటికీ తిరిగి గుమ్మాల దగ్గరే కటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. వాడి దగ్గర జస్ట్ పది రూపాయలే...చక్కగా మెట్ల మీద కూర్చొబెట్టుకుని హాయిగా గాలి తగులు తుంటే, సన్నని ఎండ మొహాన తగిలీ తగలనట్టు ఉంటూ కట్ చేయించుకుంటే భలే ఉంటుంది ఆ అనుభవం.
  ఎక్కడికో పోయి ఓ అయిదొందలు పోగొట్టుకుని చెత్తగా కటింగ్ చేయించుకునే బదులు వాడిలాంటివాళ్ళ దగ్గరే నాకు బెటర్ అనిపిస్తుంటుంది. ఎలా చేస్తాడు అని మాత్రం అడక్కండేం..:-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హ హ బాగుంది :)
  అన్నట్టు శేఖర్ గారు చెప్పింది చూడండి బాగున్నట్టుంది;)
  మా ఉళ్ళో కుడా అలా పది కే చేసేవారు ... ఇప్పుడు కాదు లెండి ఒకప్పుడు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఈ క్షౌర ఖర్మ బాధ నాకు ఎక్కువగా కలుగలేదే... ఇక్కడందరూ ఇలా మొత్తుకుంటున్నారు. కాకపోతే ఒకసారి మాత్రం డప్పుచికం అయింది.

  కొన్నామధ్య కాస్త ప్రగ్గానే గుండు మొదలెట్టా. అప్పుడున్న సుఖం మళ్ళా ఎప్పుడూ చూళ్ళే. (రొనాల్డో మాయ ;-))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఆహ అతనికంటె ఘనుడు అని సామెత చెప్పినట్లు మా బార్బరుడిని మించి వీర వసూళ్ళు చేసే వాళ్ళు బోలెడంతమంది ఉన్నారనమాట. నేనింకా కేవలం స్టార్ హోటళ్ళకు, స్టార్ బ్యూటీపార్లర్ లకు మాత్రమే పరిమితం ఈ వసూళ్ళు, మిగిలిన అందరూ యాభైలలోపే వసూల్ చేస్తారనే అఙ్ఞానం లో ఉన్నాను.

  సుజాత గారు నెనర్లు. వంగూరి చిట్టెన్ రాజు గారి కథలు కొన్ని చదివానండీ మీరు చెప్పినది కూడా చదవాలి. లాక్మె ఎక్కువని ఊహించా కానీ ట్రిమ్మింగ్ కి అంతంటే ఏం చెప్పగలం రూపాయి విలువ బొత్తిగా పడిపోయిందండీ అని అనుకోవడం తప్పించి.

  వేణు గారు నెనర్లు. బహుకాల దర్శనం బాగా బిజీ అయినట్లున్నారు. నాకు ఎందుకో ఆ క్లిప్పర్ ను చూస్తేనే అలర్జీ అండీ. ఆ నంబర్లు సరిగా తెలియవు ఈ సారి అవసరమైతే మీరు చెప్పిన పద్దతి పాటిస్తాను. హ హ నేను రాధాగోపాలం నుండే బాపు బొమ్మలదగ్గరికి వెళ్ళాను.

  మురళి గారు నెనర్లు. హ హ అదేంటి సారు మొరికొన్నాళ్ళేం ఖర్మ ఉన్నన్నాళ్ళు ఈ బాధ తప్పదు కదా..

  నేను సైతం గారు నెనర్లు. మీ ఫ్రెండ్ ఏ స్టార్ హోటల్లోనో చేయించి ఉంటారండీ ఎక్కడైనా క్షవరానికి అంత ఇచ్చుకోవాలంటే కష్టమనిపిస్తుంది. పోనీ వీళ్లేదో గొప్పగా చేస్తారా అంటే ఏమీ ఉండదు.

  మంచుపల్లకీ గారు నెనర్లు. మరే మరే బాగా చెప్పారు వాళ్ళెలా చేసినా పర్లే :-) హ హ మీ లీ మెరిడియన్ ప్రహసనాన్ని చదివిన వెంటనే నా మనసులోమాట "I know exactly what you are talking brother". ఎందుకంటే నే పైన చెప్పిన అమెరికా ప్రహసనం కూడా సరిగ్గా ఇలా నేను గార్ల్ ఫ్రెండ్ ని కలిసే ముందురోజే జరిగింది. ఆరోజు నే నేర్చుకున్న పాఠం "కాస్త జుట్టు పెరిగినా పర్లేదు కానీ గర్ల్ ఫ్రెండ్స్ ని కలిసే ముందో, పెళ్ళి చూపులకు ముందో ఇలాటి పనులు చేయకూడదు" అని. కానీ మనకి అందం మీద కాస్త మక్కువ కలిగేది అలాటి టైంలోనే కదా ఏంచేస్తాం.

  నిజం గారు నెనర్లు. హ హ మరే వాళ్ళని మెచ్చుకుని తీరాలండీ మొనాటనస్ గా కాకుండా వైవిధ్యత కనపరుస్తున్నందుకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నేను గారు నెనర్లు. హ హ సలహా బానే ఉంది కానీ నా వాలు జడ అందం చూసి "మగ బొమ్మాలీ.." అనెవరైనా వెంటపడితే కష్టం కదండీ మరి :-p అయినా వాలు జడ నిర్వహణకు బోలెడంత సహనం అవసరం అని ముందే చెప్పా కదా, మనకంత దృశ్యములేదు :-)

  శేఖర్ గారు నెనర్లు. ఆహా భలే వర్ణించారండీ నిజమే ఆ మజాయే వేరు. నేను మావాడికి బిల్ కడుతూ ఊర్లో ఆ పదిరూపాయల క్షవరాన్నే గుర్తు చేసుకున్నానండీ అందుకే అంతలా ఫీలై ఈ టపా రాశాను. కాస్త నిర్లక్ష్యంగా తలని అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటారు అనే కాని వీళ్ళ ఫైనల్ ఔట్‍పుట్ బాగానే ఉంటుంది.

  చైతన్య గారు నెనర్లు. ఇకపై అదే ఫాలో అవుదాం అనుకుంటున్నానండీ.

  గీతాచార్య గారు నెనర్లు. ఆహా గుండు లో ఉన్న సుఖం ఇంకెందులోను లేదు అది మాత్రం సత్యం. అన్నట్లు మీ వ్యాఖ్య చూసి ఓ చిన్న ధర్మ సందేహం. క్షురకర్మ తప్పంటారా క్షౌరకర్మ అనాలంటారా.. రెండూ కరెష్టే అంటారా..

  వీరుభొట్ల గారు నెనర్లు. ఆయ్ గుండు సుఖమే కానీ మరి అలవాటైన ప్రాణం కదండీ గుండేసుకు తిరిగటం కాసింత కష్టమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. వేణుగారూ..పాపం చాలానే కష్టపడ్డారండీ..
  మీకు నా ప్రగాఢ సానుభూతి.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. స్వాతి గారు నెనర్లు. మరే అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. వేణు చాలా బాగుంది మీ క్షుర ఖర్మ. మా అబ్బాయి కూడా ఇలానే కంప్లైంట్ చేస్తాడూ స్పేనిష్ చైనీస్ గురించి. గీతాచర్య చెప్పినట్లు బోడి గుండంత భాగ్యం లేదు చుట్ట గుడిసె అంత సుఖం లేదు అని సామెత చెప్పుకోవటం బెటర్ ఏమో.. ;-) లేట్ గా నూతన సవత్సర శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. పాపం, ఏవిటో మీ మొగవాళ్ళ బాధలు తలచుకుంటే జాలేస్తుంది. గడ్డం లాగే, క్షవరం కూడా సొంతంగా చేసుకోవచ్చేమో చూడండి.:) jk

  ప్రత్యుత్తరంతొలగించు
 17. భావన గారు నెనర్లు. ఆ సామెత చెప్పుకోడానికి చాలా బాగుంటుంది కానీ పాటించడానికి బోల్డంత ధైర్యం కావాలండీ నాకంత సీన్ లేదు.

  జయ గారు నెనర్లు. సొంతంగా కష్టమండీ :-) కానీ ఈ సారి అమెరికా జంటగా వెళ్తే తనకి నేర్పించేస్తాను. అక్కడ మంచి ఎక్విప్మెంట్ సరసమైన ధరకే దొరుకుతుంది చక్కగా ఇష్టమైన రీతిలో కానిచ్చేయచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. హహహ మీ క్షురకర్మ బాధలు విని భలే నవ్వుకున్నాను. నేను కూడా అమెరికా వచ్చిన కొత్తలో అయిదు నిమిషాల కటింగ్కి పదిహేను - ఇరవై డాలర్లు ఇవ్వడానికి తెగ బాధ పడిపోయేవాడిని. కాని తప్పదు కాబట్టి ఏదో సర్దుకున్నాను. కాని ఇప్పుడు మేము ఉండే NJ లో మన దేశి అమ్మాయిలు చేస్తారు పైగా పది డాలర్లల్లో పని అయిపోతుంది సో అందుకే ఈ మధ్య పెద్దగా బాధ వేయడంలేదు బిల్ కట్టడానికి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 19. శ్రీనివాస్ చింతకింది గారు నెనర్లు. హ హ NJ లో దేశీ అమ్మాయిలు చేస్తారా హ హ అయితే ఎంతడిగినా ఇచ్చేయచ్చును అంటారనమాట :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 20. వాలుజడ నా మినహాయింపుల్లోనూ ఉంది..
  కాకపోతే.. పాలేవో .. నీళ్లేవో -- నీలాలేవో - సవరాలేవో తెలీయని ... అమాయకుడిని అవటం వల్ల....

  అది సరే .. ఈ సారి అమెరికా జంటగే వెల్తే అంటున్నారు .. మాకు చెప్పకుండానే ఏడడుగులు నడిచినట్టున్నారు.... పోనీ ఆ కోటయ్యకన్నా చెప్పారా

  ప్రత్యుత్తరంతొలగించు
 21. ఊకదంపుడు గారు నెనర్లు, "నీలాలేవో - సవరాలేవో తెలీయని ... అమాయకుడిని అవటం వల్ల.." హ హ మరే మరే మహ బాగా చెప్పారు :-)

  అబ్బే అదేమీ లేదండీ, ఎంతమాట అన్నారు.. తప్పకుండా మీ అందరికీ చెప్పే నడుస్తాను :-) జంటగా వెళ్తే అన్నది మీరు జంట దొరికాక అని చదువుకోవాలి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 22. కానీ ఈ సారి అమెరికా జంటగా వెళ్తే తనకి నేర్పించేస్తాను. అక్కడ మంచి ఎక్విప్మెంట్ సరసమైన ధరకే దొరుకుతుంది చక్కగా ఇష్టమైన రీతిలో కానిచ్చేయచ్చు.
  ---
  నేను కూడా ఎలాగే అనుకునేవాణ్ణి. కానీ తనవైపు నుంచి అస్సలు కోపరేషన్ లేదు - ఉండదు. నాకేం ఖర్మ - నాకలాంటివేం రావు. నేను చెయ్య(లే)ను. లాంటి అరుపులు వినిపిస్తాయి. నేను భార్యా బాదితుణ్ణి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హహహ అజ్ఞాత గారు :-) ఎప్పటిదో పోస్ట్ వెలికి తీసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలండీ.

   తొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.