బుధవారం, జనవరి 13, 2010

నేనూ - నా ఇయర్ ఫోన్స్ - ఓ భొగి

పది సంవత్సరాలు ఒక వస్తువు మనతో ఉందంటే దానితో తెలియని అనుభందం ఏదో ఏర్పడి పోతుంది. హఠాత్తుగా ఓ  ఉదయం అది పని చేయడం మానేసిందంటేనో ఇక ఉపయోగించలేక పడేయాల్సి వస్తుందంటేనో మనసు ఒక్క క్షణమైనా విలవిలలాడక ఉండదేమో. అలాటిది మన నిర్లక్ష్యమే దానికి కారణం అయినపుడు ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. ఆ వస్తువు ఏదైనా విలువ ఎంతైనా ఈ అనుభూతిలో మాత్రం పెద్దగా మార్పుండదు. "ఈ ప్రపంచంలోని ప్రతి దానిలోనూ జీవం ఉంటుంది ఏ మనిషైనా, వస్తువైనా మనకు ఎపుడు పరిచయమవ్వాలో మనతో ఎంత కాలం కలిసి ఉండాలో అంతా ముందే నిర్ణయింప బడి ఉంటుంది.." అని ఈ మధ్యే చదివిన ’ఆల్కెమిస్ట్’ లో చెప్పినా కూడా ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే కాలికింద నలిగి మూడు ముక్కలైన నా సోనీ ఇయర్ ఫోన్స్ ని చూసి "హ్మ్ ఋణం తీరిపోయింది" అని అనుకుని సరిపెట్టుకోలేక పోయాను, కళ్లలో తడి చేరకుండా ఆపలేకపోయాను.

ఇంచుమించు పదేళ్ళ క్రితం నా క్యాసెట్ వాక్మన్ తో వచ్చిన హెడ్ సెట్ అసౌకర్యంగా ఉంది ప్లస్ క్వాలిటీ బాగోలేదు అని ఓ వెయ్యి లోపే దొరికిన ఈ ఇయర్ ఫోన్స్ కొన్నాను. నాకు చిన్నప్పటినుండి సోనీ అంటే అదో విథమైన ఫాసినేషన్ వల్లనో ఏమో తెలియదు కానీ అంతవరకూ వాడి పడేసిన చాలా హెడ్ సెట్స్ కన్నా దీని క్వాలిటీ చాలా బాగుంది అనిపించింది. ఇక అప్పటి నుండి ఇది నా శరీరం లో ఓభాగమై పోయింది. ఆఫీసు లో డెస్క్ టాప్ ఆ తర్వాత ల్యాప్ టాప్ కి కూడా ఇవే వాడేవాడ్ని. కొన్నాళ్ళకి క్యాసెట్ వాక్మెన్ పోయి సిడి ప్లేయర్ తర్వాత యంపీత్రీ సీడీ ప్లేయర్, తర్వాత ఫస్ట్ జెన్ ఐపాడ్, క్రియేటివ్ జెన్, కొత్త ఐపాడ్ ఇలా ఎన్ని ప్లేయర్స్ మారినా ఇయర్ ఫోన్స్ మాత్రం ప్లేయర్ తో వచ్చిన వాటిని పక్కన పడేసి ఇదే వాడేవాడ్ని. అదేంటో తెలియదు ప్లేయర్స్ తో వచ్చిన వాటి కన్నా నాకు ఇందులోనే బాగా వినిపిస్తున్నాయ్ అనిపించేది. నేను ఏ ఊరికి వెళ్తే ఇది కూడా నా వెంట ఆఊరికి ఆ దేశానికి వచ్చేసేది. నా చెవులు కూడా దీనికి బాగా అలవాటయ్యాయి. ఫోన్ తాలూకూ హెడ్ సెట్ కి పావుగంటలో విసుగొచ్చేది కానీ ఇవి పెట్టుకుంటే మాత్రం గంటలు గంటలు పాటలు వింటూ ఆనందంగా గడిపేసే వాడ్ని.

అలాంటి దీన్ని రాత్రి ల్యాప్ టాప్ తో పాటు ఉపయోగించి నిర్లక్ష్యంగా మంచం మీద వదిలేసాననుకుంటా, ఉదయం మంచం దిగేసరికి సరిగా నా కాలికింద పడి బాగుచేయడానికి కూడా వీలులేనంతగా రైట్ ఇయర్ బడ్ మూడు ముక్కలు అయింది. ఎలాగో కష్టపడి అతికించా కానీ పనిచేయడం లేదు ఎడమ బడ్ బాగానే అదే క్లారిటీతో వినిపిస్తుంది కానీ ఇకపై ఉపయోగించడం కష్టమే. నా గోడు విన్న ఓ నేస్తం "దానికో చిన్న శవపేటిక తయారు చేయించి ఓ శాటిన్ రిబ్బను కట్టి దాచిపెట్టుకోరా" అని సలహా ఇచ్చినా, అల్కెమిస్ట్ ఫిలాసఫీలో ఆలోచిస్తే దీనికీ ఓ ఆత్మ ఉంది అది ఇన్ని రోజులు నన్ను అనుసరించి ఉండి, "ఇక వీడు ఎంతకాలమైనా నన్ను ఇలానే సతాయిస్తుంటాడు రెస్ట్ ఇవ్వకుండా" అని అనుకుని, పనికి రాని పాత వస్తువుల్ని భోగి మంటల్లో పడవేసే ఈ భోగి రోజు తనంతట తానే ఇలా పాడైపోయి ముక్తిపొందాలని నిర్ణయించుకుంది అని అనిపిస్తుంది. అంతలోనే ఇన్నాళ్ళు నాతో ఉన్న ఈ హెడ్ ఫోన్ ఇలా పాడై పోవడం వెనుక ఏదైనా bad omen ఉందా అని కూడా అనిపిస్తుంది :-) మీరింకా ’అల్కెమిస్ట్’ చదవకపోతే ఈ విషయాలు వదిలేయండి. 

 హ హ :-) నాకు బొత్తిగా పనిలేదన్న విషయం ఈపాటికే మీరు గ్రహించేసుంటారు. ఏదేమైనా భోగి అనగానే నాకు  గుర్తొచ్చే ఓ చిన్న మ్యూజిక్ బిట్ గురించి చెప్పి ముగిస్తాను. ఇళయరాజా గారు స్వర పరిచిన దళపతి సినిమాలోనిది ఈ బిట్. సినిమాలో  అప్పుడప్పుడు నేపథ్య సంగీతం గా వినిపిస్తుంది క్యాసెట్ లో కూడా వచ్చిందనుకుంటా. లిరిక్ కి పెద్ద ప్రాముఖ్యం లేదు కానీ రాజా బీట్ వినడానికి భలే ఉంటుంది. నేను అప్పుడప్పుడు రివైవ్ అవడానికి ఈ బిట్ వింటుంటాను, లిరిక్ వదిలేసి తాననన తాననన తానానా హొయ్ అని పాడుకుంటూ కూడా ఉంటాను. మీరు ఇక్కడ విని ఆనందించండి. :-) మీకూ మీ కుటుంబానికీ భోగి మరియూ సంక్రాంతి శుభాకాంక్షలు :-)

24 కామెంట్‌లు:

  1. ఒకటి ఉందని సంతోషించచ్చు కదండి,
    మీకు కూడా భోగి మరియూ సంక్రాంతి శుభాకాంక్షలు :)
    in b/w ఇలాంటివి భోగి మంటలు లో వేస్తే చాలా toxic fumes release అవుతాయి..

    రిప్లయితొలగించండి
  2. ఇందాక చెప్పడం మర్చిపోయాను "MAKTUB"

    రిప్లయితొలగించండి
  3. అయ్యయ్యో.. ఎంత పని జరిగిందీ :(
    మీకో ఐడియా చెప్పనా... మళ్లీ మీరొక కొత్త సోనీ ఇయర్ ఫోన్స్ కొనండి. రెండూ సోనీ సోనీ..కాబట్టి.. మన తాతలు తండ్రులు మళ్ళీ పిల్లలుగా పుట్టినట్టు.. మీ పాత ఇయర్ ఫోన్స్ ఆత్మ కొత్తదాంట్లోకి వచ్చి చేరుతుంది. అప్పుడు మీరు హ్యాపీ, ఇయర్ ఫోన్స్ కూడా హ్యాపీ ;-) ;-)
    బాగా చెప్పానా :p
    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు యువర్ యియర్ ఫోన్స్...జోక్ కాదండీ నిజమే...చాలా కాలం మనతో ఉన్న వస్తువులకేమన్నా అయితే ఎలాఉంటుండో తెలుసండీ...!! ఇంతకీ పండుగ భోజనం సరిగ్గా చేసారా లేక చింతిస్తూ...సరిగ్గా తినలేకపోయారా...??

    దళపతిలో నాకూ ఆ బిట్ నచ్చుతుందండీ...కానీ మీరన్నట్టు లిరిక్ వినకూడదు...:)

    రిప్లయితొలగించండి
  5. ప్చ్...ప్చ్...అయ్యో పాపం ఇయర్ ఫోన్స్.
    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. నాకు వస్తువుల మీద పెద్దగా మమకారం, మమస్వీటూ లేదు వేణూ..

    నిజానికి నాకు ఇలా జరిగితే.. ఆ ఇంకెంతకాలం వాడతాం, ఎంచక్కా ఇప్పుడు కొత్తది కొనుక్కోవచ్చు అని సంబరపడతా !

    మీరు కూడా లేటెస్ట్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోండి హాయిగా !

    :)

    రిప్లయితొలగించండి
  7. అయ్యయ్యో...:)
    సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. oops..

    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు :)

    రిప్లయితొలగించండి
  9. ఐపాడ్ రాక మునుపు, సోనీ ఏ కదా రారాజు మ్యూజిక్ ప్లే యర్స్ లో. కొంత మంది స్టేటస్ సింబల్ గా కూడా ఫీల్ అయ్యేవారు.

    ఆల్కెమిస్ట్ ఒకటి చదవాల్సిన వాటిలో ఉంది. చదివాక చెప్తా మీ సంగతి :)

    (పాడయి)పోయిన వన్నీ మంచివి. ఉన్నవి పోయినవాటి తీపి గుర్తులనుకోండి మరి.

    రిప్లయితొలగించండి
  10. అనుబంధాలు పెంచటం, త్రుంచటం మన చేతిలోదాండి? నా వస్తువులు పోయినా నాకలాగే బాధ. ఈ పాట మీరు పాడుకున్నట్లే నేనూ పాడతాను.

    రిప్లయితొలగించండి
  11. మనం ప్రాణపదంగా చూసుకున్న ఒస్తువులు పోయినా, పాడైపోయినా ఎంత బాధో, అది ఎంత కాలం అనుభవిస్తామో, నాకు బాగా తెలుసు. కనీసం, ఇప్పుడైనా...కొంచెం తొందరగా పెళ్ళి చేసేసుకుంటే మంచిది. మీ ప్రియసఖి, మీ ప్రాణపద వొస్తుల్ని జాగ్రత్తగా కాపాడుతుంది కదా...My deep condolence & all the best for bright future. ఇవాళ హ్యాపీ గా పతంగులు ఎగిరేసుకోండి. ఓకే!

    రిప్లయితొలగించండి
  12. నేను గారు నెనర్లు. హ హ మరే MAKTUB గురించి మర్చిపోయాను. టాక్సిక్ ఫ్యూమ్స్ నిజమే సుమండీ అయినా ఏదో మాట వరసకన్నా కానీ నిజంగా వేసేస్తామా ఏమన్నానా. మీరు ఎన్విరాన్మెంటలిస్టా :-)

    రాణి గారు మీ కామెంట్ అర్ధం కాలేదు కాని నెనర్లు :-)

    మధురవాణి గారు మీ సలహా కేకండి :-) వ్యాఖ్యకు నెనర్లు, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    తృష్ణ గారు నెనర్లు. అబ్బే అలాంటిదేమీ లేదండి దేని దారి దానిదే సమయానికి కడుపులో ఇంత ముద్ద పడకపోతే బాధ పడడానికి ఓపిక ఉండద్దూ :-)

    సృజన గారు నెనర్లు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    వేణు గారు నెనర్లు. నేను అలా అనుకున్న సంధర్భాలు లేకపోలేదండీ కానీ కొన్ని వస్తువులతో అలా అనుభందం ఏర్పడిపోతుంది అంతే, మమకారం స్వ్రీటు ప్రయోగం బాగుంది.

    ప్రేరణ గారు నెనర్లు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    నెలబాలుడు గారు నెనర్లు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    కొత్తపాళీ గారు నెనర్లు.

    వాసు గారు నెనర్లు. నిజమేనండీ ఐపాడ్ కు ముందు సోనీదే రాజ్యం. హ హ మీ ఫిలాసఫీ బాగుంది.

    ఉషగారు నెనర్లు. నిజమేనండీ ఏదీ మనచేతిలో లేదు.

    సిరిసిరిమువ్వ గారు నెనర్లు.

    జయ గారు నెనర్లు. అంటే ఏంటండి అబ్బాయిలేమో వస్తువులు పాడు చేసే వాళ్ళు, అమ్మాయిలేమో జాగ్రత్తగా కాపాడేవాళ్ళనా మీ ఉద్దేశ్యం హన్నా :-)
    నేను పదేళ్ళగా కాపాడుకుంటూ వస్తున్నానండీ. ఏదో నిన్న కాస్త నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించా అంతే. ఏదేమైనా మీ విషెస్ కి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. మధుర వాణి గారి సలహా ఫాలో ఐపోన్డి శ్రీకాంత్.. బాగుంది. మీకు నా హృదయ పూర్వక సంతాపాన్ని తెలియ చేస్తున్నా (అవును ఇలాంటి తెలుగు మాట వాడోచ్చా సంతాపం తెలియ చేయటానికి లేక పోతే ఒక వీర తాడు వేసుకుందాము లే)

    రిప్లయితొలగించండి
  14. అల్కెమిస్ట్ చదివాను - కాబట్టి వదిలేయకుండా వ్యాఖ్యానిస్తున్నాను.

    మరీ అంతగా ఇయర్ ఫోన్స్ వాడటం చెవులకి మంచిది కాదేమో. అసౌకర్యంగా ఉన్నా, చెవుల్ని పూర్తిగా కవర్ చేసే హెడ్ సెట్లే మంచివి. ఉచిత సలహా :-)

    మీరిచ్చిన దళపతి లింకు నొక్కలేదు కానీ, ఆ మ్యూజిక్ 'టండండట్ట టండండట్ట' కదా. నాకూ నచ్చుతుంది. స్లోమోలో లుంగీలెగ్గట్టుకుంటూ వాళ్లేసే డాన్సులూ అప్పుడు నచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం నవ్వొస్తాయి.

    రిప్లయితొలగించండి
  15. నేను ఇలా ఒకసారి బాధపడుతుంటే మా తమ్ముడి వరసయ్యే కజినొకడు ఒక సలహా చెప్పాడు. వాడు పాటించిందే! ఇయర్ ఫోన్స్ లాంటి వాటి మీద మమకారం పెంచుకోకూడదుట..సరే!

    వాడు కింగ్ ఫిషర్, జెట్ వంటి ఫ్లైట్లు ఎక్కినపుడల్లా ఫ్లైట్లో వాళ్ళిచ్చే ఇయర్ ఫోన్స్ క్రమం తప్పక జేబులో పెట్టుకుని తెచ్చేస్తాట్ట. వాడి దగ్గర ఇప్పటికే పది పన్నెండు సెట్లు ఉన్నాయి. అదేంట్రా కొనుక్కోవచ్చుగా అంటే "కొనడం సమస్య కాదు, ఫ్లైట్లోంచి లేపేస్తే అదొక మజా,."అన్నాడు. ఆ తర్వాత వాడు మా ఇంటికి వచ్చిపుడల్లా ఇలాంటి చిన్న చిన్న ఎలెక్ట్రానిక్ వస్తువులు, ఐపాడ్లూ కనపడకుండా ఉంచడం మొదలెట్టాను.

    అన్నట్టు కొత్తవి కొన్నారా లేదా ఇంతకీ?

    రిప్లయితొలగించండి
  16. 'సోనీ' 'ఆల్కెమిస్ట్' ..నేనూ మీతోనే..
    కాకపొతే నేను వస్తువులతో మరీ అంత మమకారం పెంచుకోలేనండీ.. మనుషులతో మమకారాలే పూటకో మలుపు తిరుగుతున్న రోజులు కదా..
    ఎనీ హౌ, మధురవాణి గారు చెప్పినట్టు కొత్త ఇయర్ ఫోన్స్ లో పాత వాటిని చూసుకోండి మరి..

    రిప్లయితొలగించండి
  17. భావన గారు నెనర్లు. ఇప్పుడు రావడం లేదనుకుంటానండీ ఈ సెట్ ఏదైనా ప్రయత్నించి చూస్తాను. అంతే అంతే వీరతాడు వేసేస్కోవడమే :-)

    అబ్రకదబ్ర గారు నెనర్లు. మీ సలహాబానే ఉంది కానీ తలపైనుండి వచ్చే హెడ్ ఫోన్స్ లో బయటి నాయిస్ ఎక్కువ వినిపిస్తుందండీ. ఇన్ ఇయర్ మోడల్ తో సంగీతంలో మరింత లీనమవచ్చు అని నేను వీటినే ఇష్టపడతాను. హ హ :-) స్లోమో లుంగీ డాన్సులు :-) బాగున్నాయ్ నాకు అప్పట్లోనే కాస్తంత కామెడీగా అనిపించేవి, కాకపోతే వీడియో చూడాల్సిన అవసరం లేదు కదా, నేను వినడానికే ఎక్కువ ప్రాథాన్యతను ఇస్తాను.

    సుజాత గారు నెనర్లు. హ హ మీ కజిన్ పద్దతి బాగుందండీ. మిగతా ఎయిర్ లైన్స్ సంగతి తెలీదు కానీ కింగ్ ఫిషర్ వాడు తీసుకెళ్ళడానికే పెడతాడు దాచుకుని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాని వాటిలో పాటలు వింటే ఆ క్వాలిటీకి మనకి సంగీతం మీదే విరక్తి వస్తుంది. నాకు అర్జంట్ గా కొత్తవి కొనాల్సిన అవసరం లేదండీ నా దగ్గర ఇంకో ఐదారు వేరే మోడల్ సెట్స్ ఉన్నాయ్. ప్రస్తుతానికి ఐపాడ్ ఫోన్స్ తో మేనేజ్ చేస్తున్నా. ఇదే మోడల్ దొరికితే మాత్రం కొనేస్తాను. యథేచ్చగా రోజువారీ వాడకానికి ఈ ఫోన్స్ బాగా పనికొచ్చాయ్.

    మురళి గారు నెనర్లు. మరే మాబాగా చెప్పారు కాని అలా ఆలోచిస్తే వస్తువులతో రిస్క్ ఫ్రీ అండీ, మమకారాల మెయింటెనెన్స్ లో సగం భారం తగ్గుతుంది. మనుషులతో అంటే ఇద్దరి మనసులుకు తగ్గట్టుగా మెయింటెయిన్ చేయాలి కదా మరి. అలాగే ఇదే మోడల్ కోసం చూస్తున్నానండీ దొరుకుతుందేమో చూస్తాను.

    రిప్లయితొలగించండి
  18. అయ్యో..అలా జరిగిందా!! త్వరలోనే మీరు వాడిన మోడల్ ఇయర్ ఫోన్స్ దొరకాలని ఆశిస్తున్నాను...నేను కూడా వస్తువులతో సెంటీ అయిపోయే బాపతేనండి.

    @సుజాత గారు, మీ కజిన్ ఇయర్ ఫోన్స్ లేపేయటం..మీరు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు అతని కంట్లో పడకుండా దాచటం.... :-) :-)

    రిప్లయితొలగించండి
  19. శేఖర్ గారు నెనర్లు. ఓ మీరు కూడా నా బాపతే అనమాట. ఏమోనండీ ఇలాటి టైంలో ఒకోసారి మారాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంటుంది.

    రిప్లయితొలగించండి
  20. హతోస్మి హెడ్ ఫోన్స్ కి కూడా కదలల్లుతారని ఇప్పుడే చూస్తున్న ఆ పాట వింటుంటే మా చిన్నది వెనకాల ( అక్షరాల పద్దెనిమిది నెల్లు) చిందులు వేస్తోంది గాలిబ్ గీతాలులో స్వర్గం ఉందొ లేదో నాకు తెలియదు కానీ నా బాల్యాన్ని నాకు తిరిగి ఇచేయ్యి అంటాడు అలా మరో సోనీ హెడ్ ఫోన్స్ ఉన్నాయో లేదో నావి నాకు ఇవ్వు అని
    దేవుడినే అడగాలి మరి ......

    రిప్లయితొలగించండి
  21. శిరీష గారు నెనర్లు. ఇళయరాజా గారి సంగీతం మహత్యం అదండీ మరి. హ హ అలానే అడగాలి :-)
    రెండ్రోజుల్లోనే చాలా బాగా రాస్తున్నారు తెలుగులో మొన్నటి వ్యాఖ్యకు నేటి వ్యాఖ్యకు చాలా ఇంప్రూవ్ అయింది :-) ఆలస్యం చేయకుండా మీరు త్వరగా బ్లాగు మొదలెట్టేయాలి ఇక.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.