బుధవారం, జూన్ 25, 2008

వంట-తంటా (కామన్‌సెన్స్ కరువైన ఓ వంట కధ)

ఆ మధ్య కొన్ని బ్లాగులలో మగ వాళ్ళే వంటింటికి అసలు సిసలు హక్కు దారులు అని అనడం చూసి నా అనుభవాన్ని తెలియచేయాలి అని ఈ టపా మొదలు పెట్టాను....ఇక చదవండి.

ఈ మధ్యే నా పాత తెలుగు రూమ్మేట్ వేరే ఊరికి మారిపోడం తో సులేఖా, ఏక్‌నజర్ లాటి వెబ్‌సైట్ల లో ప్రకటనలు ఇచ్చి మళయాళీ యువతరానికి ప్రతినిధి అయిన ఒక అతనికి నా అపార్ట్మెంట్ లో ఓ గది అద్దెకిచ్చాను. పేరు బాబి :-) అలా నవ్వకండి అతని పేరు కృష్ణ సినిమాలో బ్రహ్మానందానికి పెట్టి కామెడీ చేస్తే అతనేం చేస్తాడు చెప్పండి. నాకూ మొదట్లో పిలిచినప్పుడల్లా నవ్వు ఆపుకోడం కొంచెం కష్టమైందనుకోండీ.

సరే ఇక సోది ఆపి విషయం లోకొస్తే ఇతను మొన్న ఒక రోజు సాయంత్రం కాలీఫ్లవర్ కూర చేస్తాను అని మొదలు పెట్టాడు. ఆహా !! బావుంది సరే నువ్వు చేసి పెట్టు బాబు మేము తిని పెడతాం, అని నా ఫ్రెండూ నేను కొంచెం షాపింగ్ ఉంటే వెళ్ళి ఆ పని చూసుకుని ఒక అరగంటలో వచ్చాం. మేం వచ్చే సరికి ఘుమఘుమలు పార్కింగ్ లాట్ వరకూ కొడుతున్నాయి. మన వాడు పథ్యం కూర వండినా గరమ్మసాలా కొబ్బరి లాంటివి వేసి సువాసనలు మాత్రం తెప్పించేస్తాడు లెండి. మేమిద్దరం ఆకలితో నక నక లాడుతూ ఆహా ఏమి మన భాగ్యము అని పాడుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాం.

మేం అడుగు పెట్టే సరికి అతను కిచెన్ లో, war room లో critical decision తీసుకోబోయే ఆర్మీ మేజర్ లా తుపాకి బదులు ఒక చిన్న గరిటె పట్టుకుని హడావిడి గా అటూ ఇటూ తిరగుతున్నాడు. మాకు చూడగానే దాల్ మె కుచ్ కాలా హై అనిపించింది. సరే ఇంతకీ సంగతేంటి గురూ అని ఇద్దరం ఒకేసారి అడిగేసాం. sorry Man it's a disaster అన్నాడు. అది సరే నాయనా ఇంత మంచి ఘుమఘుమలు కొడుతుంటే అలా ఎలా ఒప్పుకుంటాం అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగాం. దానికి మన వాడు ఇలా చెప్పుకొచ్చాడు.

మసాలాలు గట్రా అన్నీ వేసి కాలీఫ్లవర్ కొంచెం ఉడికాక మరీ కొద్దిగే ఉంది ముగ్గురుకి సరిపోదేమో అనిపించిందట, దాంతో ఫ్రిజ్ లో ఉన్న ఫ్రోజెన్ కాకరకాయ ముక్కలని యధా తధం గా కూర లో పడేసాడుట. తర్వాత మరి మన వాడికి రుచి చూడాలి అని ఎందుకనిపించిందో, చూస్తే కూరంతా చేదు విషం పోనీ అక్కడితో ఆపేశాడా అంటే లేదు. కొంచెం తెలివి తేటలు ఉపయోగించి బోలెడు ఉప్పు పోసేసాడు "ఉప్పు చేదుని విరక్కొడుతుంది" అని ఎవరో చెప్పినట్లున్నారు, సరే ఇంత చేసినా చేదు పోలేదు గదా అని పంచదార కూడా కలిపాడుట. వింటున్న మా మొహాలలో తెలుగు సినిమాలలో కామెడీ నటులు అందరూ పూనారా అన్నట్లు చిత్ర విచిత్రమైన expressions అన్నీ పలికాయంటే నమ్మండి.

అసలు కాలీఫ్లవర్ కాకరకాయ రెండూ కలిపి వండాలి అన్న ఆలోచనే అమోఘం, బహుశా రెండూ "క" తోనే మొదలయ్యాయి కదా అని కలిపేద్దాం అనుకున్నాడేమో. దానికి తోడు మళ్ళీ ఫిక్షింగ్ ట్రీట్మెంట్ ఒకటి. అయినా ఒక సారి ప్రయత్నించి చూద్దాం అని ఒక ముక్క నోట్లో వేసుకుని చూద్దును గదా, చంటబ్బాయి సినిమా లో శ్రీలక్ష్మి వండిన "అఱటి పండు లంబా లంబా" తిన్న ఎడిటర్ కి మల్లే చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీ పాఠాలు అన్నీ గుర్తొచ్చేసాయి. సరే అన్నం ఎందుకు లే వేస్ట్ చేయడం అని ప్రియా పచ్చళ్ళు, దిక్కుమాలిన యోగర్ట్ లతో భొంచేస్తుంటే అంతకు ముందు రోజే చదివిన మగవాళ్ళ వంట టపాలు గుర్తొచ్చి ఈ ప్రహసనాన్ని తప్పక బ్లాగాలి అని అనుకున్నాను.

అద్భుతం గా వండి వార్చే మగవాళ్ళంతా నా మీద దండయాత్రకి సిద్దం కాకండేం. నా ఉద్దేశ్యం మగ వాళ్ళకి వంట రాదు అని చెప్పడం కాదు. నారీమణులంతా నిజం గా వంట గది అప్పగించే ఆలోచనలో ఉంటే, ఓ పాలి ఆలోసించి ఆ పని చేయండి, కీడెంచి మేలెంచమన్నారు కదా పెద్దలు :-)

18 వ్యాఖ్యలు:

 1. అమ్మయిలకి మాత్రం పుట్టుకతోనే వంట చేయడం రాదు కదా!!! వాళ్ళు పెళ్ళి ఐన తరువాతే నేర్చుకుంటారు.. ఇంకా మీకే నయం కదా.. చక్కగా ఇప్పుడే నేర్చుకుని పెళ్ళి అయ్యేసరికి expert అవ్వచ్చు.. అప్పుడు వంట సామ్రాజ్యానికి మీరే మహారాజు అవ్వచ్చు!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నిజమే మేధ గారు ఎవరికీ పుట్టుకతో వంట రాదు. కాని నేను గమనించినంత వరకు, అమ్మాయిల్లో వంటకి సంబందించిన Talent ఎక్కువ వుంటుంది అనిపిస్తుంది. అంటే అదే skill గా డెవలప్ చేసుకున్న వంట వాళ్ళని వదిలి పెడితే ఆ Ease నేను మగ వాళ్ళలో చూసింది చాలా తక్కువ. మరి అది మన పెద్ద వాళ్ళు అమ్మాయి అంటే వంట తెలియాలి అని పెంచడం వల్ల ఆడపిల్లలు అలా నేర్చేసుకుంటారేమో తెలీదు కాని నా చిన్ని ప్రపంచం లో నాకు పరిచయమైన వాళ్ళ దగ్గర నేను గమనించినది అది.
  నేను వంట కి వ్యతిరేకిని కాను, తింటానికి లేని బాధ వండటానికి ఎందుకు అని ఆలోచించే వాడ్నే కాని అమ్మాయిలు వంట చేసినంత సులువు గా అబ్బాయిలు చేయలేరు అని నా అభిప్రాయం (Of course Excluding chefs).

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వెరీ గుడ్ వేణుగారు,,

  జీవిత సత్యాన్ని చాలా చాలా తొందరగా నేర్చుకున్నారు. ఐనా వంట అంటే బ్రహ్మ విద్య ఏమీకాదు. ఆడాళ్ళు ఇంట్లో మాత్రమే వంట చేస్తారు.అన్ని స్టార్ల హోటళ్ళలో చేసేది మగవాళ్ళే కదా. నేర్చేసుకోండి. మహారాజులేం ఖర్మ.. చక్రవర్తులే ఐపోవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పడ్ద వాడెప్పుడూ చెడ్డవాడు కాదన్నట్టు, మీ మిత్రుణ్ణి క్షమించేయండి పాపం. వంట కు లింగ భేదాలు లేవని నా ఉద్దేశ్యం..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మొదటి ప్రయత్నంలో ఆడాళ్ళ వంటైనా మగాళ్ళ వంటైనా ఇలాగే తగలెడతాయి...అభ్యాసము కూసు విద్యని ..practice makes man and woman perfect అన్నది ఈ వంటలో మాత్రం ‘ఉడికించిన’ నిజం.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మేథ, కరెక్టుగా చెప్పారు! ఆడైనా, మగైనా నేర్చుకుంటేనేగా వస్తుంది?
  వేణూ,

  మీరూ అదే మాటా? అమ్మాయిల్లో వంట టాలెంట్ ఉంటుంది,skill, ease అనీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. :))

  మీ మళయాళీ బాబీ వంట ప్రయోగం బాగుంది.

  లింగ భేదం లో కాదు బాబూ..గరిటె తిప్పే చేతిలో ఉంటుంది విషయం.

  నా అనుభవం లో అయితే ఇప్పటికీ ఘోరం గా వంట చేసే అమ్మాయిలను చూసాను. అలాగే అప్పుడప్పుడు చేసినా అధ్బుతం గా చేసే అబ్బాయిలనీ చూసాను.

  ఏ పని చేసేటప్పుడైనా కాస్త మనసు పెట్టి చేస్తే బాగా వస్తుందని నా అభిప్రాయం !

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @జ్యోతి గారు
  మీ వ్యాఖ్యకు థాంక్స్.

  @రవి గారు
  క్షమించడం అంత పెద్ద పదాలు ఎందుకు లెండి, మా వాడు నాకు రాదు అని కూర్చోకుండా ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నందుకు మెచ్చుకుంటూనే వుంటాను.

  @మహేష్ గారు
  మీ ఉడికించిన నిజం బావుందండీ.

  @సుజాత గారు
  నా social network చాల చిన్నదండీ అందులో నేను గమనించినది ఇదీ. అంతెందుకు మా చెల్లాయి కన్నా నేను చాలా ముందు నుండీ వంట చేస్తున్నాను కాని తను నా కంటే చాలా బాగా చేస్తుంది :-) వేణు గారన్నట్లు మరి నేను మనసు పెట్టి చేయడం లేదేమో.

  @వేణు A గారు
  "ఏ పని చేసేటప్పుడైనా కాస్త మనసు పెట్టి చేస్తే బాగా వస్తుందని నా అభిప్రాయం !"
  చాలా బాగ చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నిజానికి ఈ కాలంలో చదువుకుంటున్న,ఉద్యోగాలు చేస్తున్న చాలామంది ఆడవాళ్ళెవరూ వంటలు చేసుకోవడం లేదు.బయట తినడమో,పేయింగ్ గెస్ట్ గా వుండడమో,హాస్టలో వుండడమో...ఇలా వాళ్ళు చాలాపనులని దూరం చేసుకుంటున్నారు. కానీ కుర్రాళ్ళు మాత్రం వాళ్ళే స్వయం పాకాలు చేస్తుంటారు.పెళ్ళయ్యాకా మాత్రమే ఆడపిల్లలు గరిటపట్టుకుంటున్నారు.
  ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి.గత 4,5 ఏళ్ళుగా నేను గమనించింది ఏమిటంటే ఇంటికి దూరం గా వున్న ఆడపిల్లలని,మగపిల్లలని గమనిస్తే మగవాళ్ళే ఎక్కువ బాధ్యతగా వుంటున్నారు.ఇంటిపని,వంటపని అన్నీ మగపిల్లలు స్వయం గా చేసుకుంటుంటే,ఆడపిల్లలు మాత్రం ఇంటిపనికి,బట్టలుతకడానికి పనిమనిషిని పెట్టుకుంటున్నారు.చాలా మార్పు వచ్చింది కదా సమాజంలో:)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. వేణూ..
  విధాత తలపున పోస్టింగ్ వరకు వాడిన ఫాంట్ సైజ్ బాగుంది. చదవటానికి ఈజీ గా ఉంది. అదే వాడటానికి ట్రై చెయ్యండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. srikanth ji......kya baat hai....kya tapa hai...aap to bohat bade chupe rustam nikle.
  nijanga chaaaaaaaaala baundi mee tapa.
  untanu.....meenakshi..
  ..........................
  aratikaya lamba lamba ..meeda prayogam cheyadaniki veltunna..
  bye.............
  meeku chaalaaaaaaa thankssssssssss.
  RUTURAAGAALU....song kosam chala mandi vedukutunnaru.andulo nenu unnanu.mottaniki mee daya valla a song dorikindi.......nijanga aa pata chaala bauntudi......naaku chaala istam kooda.thanksssssssss ..alot

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @రాధిక గారు
  వ్యాఖ్యకు నెనర్లు, ఆ తేడా అబ్బాయి అమ్మాయిలలో వచ్చింది కాదేమోనండీ. నేను గమనించినంత వరకూ అది ఇండియా లో ఉన్న వాళ్ళకి అమెరికా లాంటి విదేశాల లో ఉన్న వాళ్ళకి మధ్య వచ్చిన తేడా. ఇక్కడ ఇండియా లో లా పనిమనుషులు దొరకరు కదా ఒక వేళ పెట్టుకోవాలి అంటే మన జీతం లో సగం సమర్పించుకోవాలి కద. అందుకే ఇక్కడ ఆడైనా మగ అయినా మన పనులు మనం చేసుకోడానికి అలవాటు పడతాం. ఇండియా రాగానే వెసులుబాటు ఉండటం తో మన బద్దకం మనని మళ్ళీ వచ్చి చేరుతుంది :-) నేను ఇండియాలో ఉన్నపుడు ఊర్లో అమ్మ కి సాయం చేయడం తప్ప బెంగళూర్ లో పనిమనిషి మీదే ఆధార పడేవాడ్ని.

  @వేణు
  ఆ ఫాంట్ సైజు మరీ పెద్దదైపోయిందండీ కొంచెం మధ్యస్తం గా ఉన్నది లేదు అందుకే ఇదే వాడుతున్నాను. నాకూ ఒకో సారి చిరాకు వచ్చి browser font size పెంచి చదువుతాను. కానీ monitor లో low resolution(I use that in my home computer) వాడే వారికి ఆ ఫాంట్ తాటికాయంత అక్షరాలలో కనిపిస్తుంది.

  @మీనాక్షి గారు
  మీ టపాలలో హాస్యం ముందు నావి హనుమంతుడి ముందు కుప్పి గంతులు మాత్రమేనండి. అలాగే ప్రయోగం చేసి పాపం మీ "అఱటిపండు లంబా లంబా" కి బలయిన వ్యక్తి గురించి వ్రాయండి. "వాసంత సమీరం లా" కి ఇంత డిమాండ్ ఉందని నాకు తెలియదు. mp3 ఫైల్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మీ మళయాళీ స్నేహితుడి తెలివే తెలివి... :)

  సన్నివేశం అచ్చంగా తీసుకెళ్ళి సినిమాలో పెట్టుకోవచ్చు. అప్పుడే నాకు ఆ కూర తిని మొహం అదోలా పెట్టిన బ్రహ్మానందం కనిపిస్తున్నాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. hi venu ji.....
  meeku oka chinna manavi.
  nannu meenu ani piliste chaalu.ee ANDI,MEERU,GINDI...lanTi baruvyna padaalu moyalekunnanu....
  u just cal me meenu...nuvvu..ekavachana prayogam cheyumu..venumaadhavaa....(garu)...
  annattu manchi salaha icharu....mee valle ARATIPANDU LAMBA LAMBA ,parichayam
  ayindi..kabatti mee address iste meeke pampista...gurudevaa..lamba..lamba,GARU.meeku chaala anTe...oka 10,000 thanks pampistunna.plz vaddanoddu.BANK lo dachukondi.oka vela nenu eppudaina marichipoyi meeku thanks cheppakapote andulo nundi teesukondi........
  LAMBA LAMBA gurchi tappakunda tapa rayadaniki prayatnista.....
  ......................
  annttu meeru modaTi saariga na blog lo aDugu pettaru...aa santhosham lo adagadame marichanu........
  .......
  intaki meeru em teesukunTaaru TEA..aa???..Ledaa..COFFEE..aa??...
  lamba ..lamba GURUDEVA..JI.
  .....................
  jobhi ho aap jaise dost baDe kismat se milte hain.....aap aaye hame achaa laga...aate rahiye ga janaab....aap ki dost...meenakshi

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఇండియా లో వుండగా 'ఛీ ఇంత బ్రతుకు బ్రతికి వంట చేయడం ఏంటి?' అని hotel లో తినేవాడిని :). కానీ అమెరికా వచ్చిన తరువాత 'ఎవరి వంట వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు.' అంటూ చచ్చినట్టు వండుకొని తింటున్నా :(.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @ప్రవీణ్ గారు
  థాంక్స్ అండీ, శీను వైట్ల గారికో కాపీ పంపుదాం లెండి.

  @ప్రసాద్
  మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  @మీనూ
  థాంక్స్, అలానే కాని నన్ను మాధవుడ్ని చేయకు అసలే నా పేరంటే నాకు బోలెడు ఇష్టం. నాకెందుకమ్మా అంత అదృష్టం!!! అదేదో నువ్వే తినేసి ఎలా ఉందో నాకు చెప్పు చాలు. ఇదే మొదటి సారి కాదు మీనూ ఇంతకు ముందు టపాలు కొన్ని చదివాను కాని కామెంట్ రాయలేదు అంతే. అయినా నా Kauphy కబుర్లు టపా చదువు నాకు ఏది ఇష్టమో నీకే తెలుస్తుంది. Aap jaisi అని అలా అప్పుడే ఫిక్స్ అయిపోకు, నేనస్సలు మంచోడ్ని కాను చాలా ఖతర్నాక్. మా ఊర్లో నా గురించి తెలిసిన వాళ్ళందరూ చారల బనీను, గళ్ళ లుంగీ ఒకటే తక్కువ వీడికి అనుకుంటుంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. మీ బాబీ గారి వంట బాగుందండి...
  ఇప్పుడు నల భీములే కనక వుండి వుంటే వారి వారసులను చూసి ఏమి అనుకునేవారో మరి.........
  భీముడు ఐతే "అన్నా ధర్మరాజా మనము తెలియక కురుక్షేత్ర పోరు తలపెట్టినాము ...ఈ వంటకంబు రుచి చూసిన యెడల కౌరవసేన అంతా వెంటనే పలాయనము చిత్తగించెదరు కదా" అనెడి వాడేమో

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.