శనివారం, జూన్ 28, 2008

అనగనగా ఓ హిచ్...

ఆయ్!! మీరు సరిగానే చదివారండి అప్పుతచ్చులేం లేవు...లేదూ నేనింకేదో చెప్పబోయి తుమ్మనూ లేదు... అది హచ్(తుమ్ము) కాదు హిచ్చే... అనుమానమేం లేదు వీడికి పిచ్చే... అని మీరు నిర్ధారించే లోపు టాపిక్ లోకి వచ్చేస్తాను. మొన్నీ మధ్యన నా ఫ్రెండ్ మా ఊరి నుండి వేరే ఊరికి మూవ్ అయ్యాడు అని చెప్పాను కదా... తనకి ఒక చిన్ని కారు తో పాటు బోలెడంత సామాను ఉంది. సామాను అంటే ఇక్కడ అమ్మేసి వెళ్ళి అక్కడ కొనుక్కునే టైపు సామాను కాదండోయ్... బట్టలు, పుస్తకాలు ఇతరత్రా చిన్ని చిన్ని ఎలెక్ట్రానిక్ సామన్లు ఇంకా మోజు పడి కొనుక్కున్న జిం సామాగ్రి గట్రా అనమాట. సొ అవన్నీ కారు తో సహా తను వెళ్ళే ఊరికి తీసుకు వెళ్ళాలి. మూవ్ అవడానికి ఒక నెల ముందు నుండే ఆలోచించీ... చించీ... చించి మిగతా ఉపాయాలేమి పని చేయడం లేదు అని ఎంత దూరమైనా సరే నే డ్రైవ్ చేసుకెళతా అని ఓ నిర్ణయానికి వచ్చేసాడు.

సరే సామాను చూస్తే బోలెడు ఉంది కార్ చూస్తే చిన్నది ఏం చేయాలా అని ఆలోచించి కార్ కి ఒక Uhaul Trailer తగిలిద్దాం అని డిసైడ్ అయ్యాడు. ఇక్కడే మన హీరో(హిచ్) ఎంటర్ అయ్యేది...సాధారణం గా Sports utility vehicles లేదా పికప్‌ట్రక్కులకీ వుండే ఈ హిచ్ ని మన వాడి బుజ్జి Toyota Celica కార్ కి తగిలించాలి. మామూలు గా ఏ Uhaul ఆఫిసుకో లేదా మెకానిక్ షెడ్ కో తీసుకు వెళ్తే ఓ నాలుగైదువందల డాలర్లు తీసుకుని బిగించి ఇచ్చే వాడు. కానీ మా వాడికి కార్ మెకానిజం అంటే బోలెడంత ఇష్టం, తను మెకానికల్ ఇంజినీరు లెండి. ఈ కార్ ని అమ్మేయకుండా ఇంకా వాడుతున్నదే దాని మీద ప్రయోగాలు చేయడానికి.

మనమేమన్నా తక్కువ తిన్నామా Instrumentation Engineering పట్టా పుచ్చుకున్నాం కదా, అదీ కాక నాకు చిన్నప్పటి నుండీ ఇలాంటి పనులు అంటే మహా సరదా... కావాలంటే మా ఇంట్లో పాత గడియారాలని రేడియో లని అడగండి వాటి ధీన గాధలు వినిపించటానికి సొంతం గా ఓ బ్లాగ్ ఓపెన్ చెస్తాయి.... అంటే హైస్కూల్ కి వచ్చాక తిరిగి బిగించడం కూడా వచ్చిందనుకోండీ అంతకు ముందు విషయాలు మీరు నన్ను అడక్కూడదు. అప్పట్లోనే మన ఈ కళని చూసి మా నాన్న గారు సతీ లీలావతి సినిమా లో కమల హాసన్ లా "మనోడి రిపేరింగుని జూసావా పెద్ద ఇంజినీరైపోతాడీడు" అని అనుకునే వారంట.

సరే సరే వర్తమానం లోకి వస్తే...ఠాట్ ఇంట్లో ఇద్దరు ఇంజనీర్లం ఉండి ఎవడికో అప్పగించడమేంటి... అదీ గాక గాంధీ గారు ఏమని చెప్పారు మన పని మనమే చేసుకోవాలి అని చెప్పారు (అంటే అదే కారణం కాదు లెండీ ఆ వంక తో మా సరదా కూడా తీరుతుంది ఇంకా కాసిన్ని డబ్బులూ మిగుల్తాయ్ కదా అవి ఎంచక్కా షేర్స్ లో పెట్టుకోవచ్చు అని) సో ఇత్యాది కారణాల వల్ల మేమే బిగించాలి అని డిసైడ్ అయ్యాం అంతర్జాలం లో వెతికి కావాల్సిన సరంజామా ఆర్డర్ చేసాడు మా వాడు. అది రావడానికి ఒక రెండు వారాలు పైనే పట్టింది.

అంతా వచ్చేసాక ఇక చూస్కోండి మా వీరంగం అంతా ఇంతా కాదు ఓ రెండు వారాల పాటు మా అపార్ట్‌మెంట్ జనాలకి ఏమీ అర్ధం అయ్యేది కాదు. గరాజ్ లో చేస్తే ఒక అందం కానీ మేం ఏ మాత్రం సిగ్గు పడకుండా అపార్ట్‌మెంట్ ఓపెన్ పార్కింగ్ లాట్ లో వీకెండ్, వీక్‌డే అని తేడా లేకుండా ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సాయంత్రాలు ఒక అరగంటా, గంటా టైం దానికి కేటాయించే వాళ్ళం.
ఇదే మేం బిగించిన హిచ్.. స్టీల్ లా మెరిసిపోయేది బాల్‌మౌంట్, రంగు రంగుల వైర్ లు కార్ లోపల్నుండి వచ్చాయి కదా ఆ వేలాడే కనెక్టర్ ని Trailer కి కలిపితే అప్పుడు కార్ తో పాటు Trailer కి కూడా సిగ్నల్ & బ్రేక్ లైట్లు వెలుగుతాయనమాట
అదేంటో మాకు ఏ పనీ మొదటి సారి విజయవంతం అయ్యేది కాదు మొదట Trailer లైట్లకి వైరింగ్ చేయాలి. అది కొంచెం తడబడినా విజయవంతం గా పూర్తి చేసాం. తర్వాత ఒక రోజు ఒక అరగంట నానా తంటాలు పడి బంపర్ పీక లేక వదిలేసాం. మరుసటి రోజు అరనిముషం లో అదీ పీకేసాం. తర్వాత బిగిద్దాం అంటే alignment కుదర్లేదు దాంతో మా వాడి మెకానికల్ బుర్ర ఉపయోగించి Filing చేసాడు అలా Failure is stepping stone of success అని ప్రత్యక్షం గా అనుభవించాం అనమాట.
Uhaul వాడు ఇలా హుక్ చేస్తాడు
మొత్తం మీద అంతా అయిపోయాక మా అనందం మాత్రం వర్ణనాతీతం. ఆదా చేసిన డబ్బులు కాదు కానీ మా పని మేం చేసుకోడం తో వచ్చిన ఆనందం అనమాట. అంతా అయిపోయి చివరగా Uhaul వాడి దగ్గరకి వెళ్తే వాడు అరనిముషం లో మేం బిగించిన హిచ్ కి Trailer హుక్ చేసి ఇచ్చేసరికి మా అనందం అంతా ఇంత కాదు మా అంతట మేమే సొంతంగా కార్ డిజైన్ చేసి డెవలప్ చేసినంత ఫీల్ అయిపోయాం. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా అంత ఆనందించి ఉండరు. Toyota Celica హిచ్ మరియూ యూహాల్ ట్రైలర్ తో

సో అదనమాట మా హిచ్ కధా కమామిషు... ఇంకెందుకాలస్యం సాధనమున పనులు సమకూరు ధరలోన... అనుకుంటూ మీరూ ఇలాటిదే ఏదో కార్యక్రమం మొదలు పెట్టండి మరి...

మళ్ళీ మరో టపాలో కలుసుకుందాం...

అంతవరకూ శలవా మరి....

--మీ వేణు.

14 కామెంట్‌లు:

  1. గ్రేట్! నిజ్జంగా పనిచేసిందా?

    రిప్లయితొలగించండి
  2. హ హ భలే ప్రశ్న వేసారు కిరణ్... అది చెప్పడం మర్చి పోయాను. ముందు అంతా బాగా పని చేసింది లగేజ్ లోడ్ చేసాక left signal పని చేయలేదు, ఏదో లూజ్ కనెక్షన్, సో అది సరిచేసాక ఏ ఇబ్బందీ లేకుండా పని చేసింది. మా వాడు క్షేమంగా చేరాడు.

    రిప్లయితొలగించండి
  3. మొదటి గా మీది నరసరావు పేట అని తెలుసుకోని చాలా సంతోషించడమైనది.. మాది నరసరావు పేట నే.. అన్నారం అనే వూరు, రొంపిచెర్ల మండలము.. పేట లో , నవోదయనగర్ లో వుండేవాళ్ళము.. ఆదిత్య కాలేజి లో ఇంటర్ చదివాను లే.. మీ టపా లు బాగున్నాయి.. కోదిపుంజు పందేల పూల చెట్టు కి ఇంతా విషయము వుందా అని తెలుసుకోగలిగాను..హ్హహ్హహ్హ.. సుజాత గారు ఏదో పల్నాటి ఉద్యమము అంటున్నారు? నాటు బాంబులు ఎప్పుడైనా చూశారేమొ అడిగి, వాటి మీద కూడా ఒక టపా రాసేయ్యండి.. హ్హహ్హహ్హ.. సరదా కి అంటున్నా లే..

    రిప్లయితొలగించండి
  4. hi venu jii......
    gaallo teli potu baagane raastunnaru TApaalu....nenu kudda appudappudu ilanti prayogaalu chestunTanu..kaani..anni tussu....gaDiyaaralu ippaDam telusu..kani malli peTTadam raadu....
    nenu chinnappudu anTe 7 th class lo ekanga helicopter taayaaru chesa..telusa??..daani gurchi oka Tapa raastanu lenDi...
    maastaaru..intaki..meeru chesina prayogam safalama....??madhyalo edyna prob..raledu kada..?
    baundi......meenu...

    రిప్లయితొలగించండి
  5. డాక్టరు గారు, మరియు శ్రీకాంత్.
    నరసరావు పేట బ్లాగర్ల మీటింగ్ ఎప్పుడు పెడదాం? గుంటూరు వాళ్ళెవరైనా ఉంటే కూడా చేర్చుకుందామా? నాటు బాంబులు చూడ్డం కాదు, తెలీక పట్టుకున్నానొక సారి! దాని గురించి నేనే రాస్తా ఒక టపా!

    రిప్లయితొలగించండి
  6. వేణు గారు,చాలా బాగుంది.ఇదేమొదటిసారి మీబ్లాగు చూదటం.అయినా మాకు ఇలాంటివాటికి మినిట్రాన్స్ పోర్ట్.తదితరాలున్నాయి లేండి.మీకమెరికాలో ఇలాంటివి దొరకవు.నరసరావుపేట బ్లాగరులు అని కాదు గానీ పల్నాటిబ్లాగవతంలా ఒక పల్నాటి బ్లాగుసంఘం పెట్టుకోండి.నాకూ పల్నాదంటే చాలా ఫాసినేషన్ ఉంది కానీ మొన్న కోడేలశివప్రసాద్ ధర్నా చూసాక కాస్త ఇంకింది.మాది పొన్నూరు అనే ఊరులెండి.

    రిప్లయితొలగించండి
  7. మీరిలా అన్నింటికీ సులభమైన సౌలభ్యాలు చూపిస్తే.. నాకు కష్టం కాదూ?? నా పుస్తకాలను, నన్నూ ఎలా బయటపడేయాలా అని ఆలోచించే మా అమ్మకు సాయం చేసిన వారవ్వరూ?? ఎంత రోజుకో టపా రాసి మిమల్ని విసిగిస్తేమాత్రం నా మీద ఇంత కుట్రా....?? ;-)

    On a serious note, బుర్ర ఒకటి ఏడ్చింది కాబట్టి దాన్ని వాడుకోండి అని మీ మెసేజ్ బాగా రీచ్ అయ్యింది.

    రిప్లయితొలగించండి
  8. భలే...
    మంచి "గీకు" లన్నమాట మీరు, మీ స్నేహితుడూ.

    రిప్లయితొలగించండి
  9. @డాక్టర్ రామ్ గారూ
    మేం ప్రకాష్ నగర్ లో ఉండే వాళ్ళం. నా టపాలు నచ్చిన విషయం తెలియచేసినందుకు ధన్య వాదాలు. నాటు బాంబుల గురించి టపా రాసే అవకాశం సుజాత గారికి ఇచ్చేద్దాం లెండి, తను చాలా బాగా రాస్తారు. నా స్కూల్ డేస్ లో కోట బజార్ వైపు వెళ్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఉండే వాడ్ని ఏ వైపు నుండి ఏ బాంబు పడుతుందో అని.

    @మీనూ
    Don't worry, you will get it eventually ఓ రెండు గడియారాలు చెడ గొట్టేసాక అమ్మో, నాన్నారో చింత బరికె పుచ్చుకు వెంట పడతారు అప్పుడు ఆటోమేటిక్ గా బిగించడం కూడా వచ్చేస్తుంది (అనుభవం తో చెప్తున్నాను విను). ఓ మా ప్రయోగం సఫలమే మా వాడు క్షేమంగా చేరాడు.

    @బాబా గారు
    చాలా థాంక్సండీ...

    @సుజాత గారు
    థాంక్స్ అండీ...కానీ అదేంటండీ, మీరు ప్రత్యేక పల్నాడు ఉద్యమం అన్నారు కదా అని నేనూ ఓ పార్టీ పెడదాం అని ఆలోచిస్తుంటే బ్లాగర్ల మీట్ తో సరిపెట్టేస్తారా..హయ్యో !!

    @రాజేంద్ర గారు
    బ్లాగు మీకు నచ్చింది అని తెలియచేసినందుకు చాలా థాంక్స్ అండీ. ఓ మీది పొన్నూరా నేను చిన్నపుడు ఒకటి రెండు సార్లు వెళ్ళాను. అది అసలు సిసలు రాజకీయం అండీ, అయినా అలా కొందరు చేసిన దానికి పలనాడు మొత్తం భాద్యులు కారేమో !!

    @మహేష్ గారు
    చాలా థాంక్స్.

    @పూర్ణిమా గారు
    థాంక్స్ అండీ, మెసేజ్ లు ఇచ్చేంత పరిఙ్నానం నాకు లేదు. ఏదో మేం సరదా పడి పొందిన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనే చిన్ని ప్రయత్నం అంతే... మరి ఈ టపా మీ అమ్మగారి కంట పడకుండా జగ్రత్త పడండి :-)

    @ప్రవీణ్ గారు
    చాలా థాంక్స్ అండీ, నిజం గానే బాగా గీకి(filing చేసి) గీకు లయ్యాం.

    @శ్రీవిద్య గారు
    థాంక్స్ అండీ.

    రిప్లయితొలగించండి
  10. bagundi venu,

    chakkaga raasaru..abbo..meeku chala kalalu vunnaye?? mee blog loo boledundi chadava daaniki, time vunnapuudu chaduvuthoo vunta.

    bad entante, nenu adige daka, meeru natho share cheyyala ee istory ni..:-(

    cool..elagayithe nem, runing commentry vinnam..malla ippudu highlights choosam...good

    njoy!!

    -Geetha

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.