మంగళవారం, జులై 01, 2008

N.S.P. / PWD కాలనీ..

మొన్న, కారంపుడి టపా లో మా కాలనీ రోడ్డు గురించి చెప్పుకున్నాం కదా. అలా బస్ అంత అందమైన రోడ్ లో ఒక 10 నిముషాలు ప్రయాణించాక మా కాలనీ వస్తుంది. రోడ్ మీద ఒక పక్క చిన్న కాఫీ హోటలు దాని పక్కన ఒక కిళ్ళీ బంకు ఉంటే మరో పక్కన కాలనీ లోపలకి వెళ్ళే దారి ఉండేది. రోడ్ ని ఆనుకుని దారి మొదటిలో అటు ఇటు కూర్చోడానికి అరుగు లు లాగా కట్టి ఉండేవి. కారెంపుడి వరకే వచ్చే బస్సులు ఇక్కడ నుండి కాలనీ లోపలకి వెళ్ళే రోడ్ లొ అలా లోపలకి చివర దాకా వెళ్ళి కాలనీ హాస్పిటల్ దగ్గర ఒక round U Turn కొట్టి మళ్ళీ వెనక్కి ఊర్లోకి వెళ్ళేవి.

మా తాత గారి ఇంటి బయట నుంచుంటే ఇలా U Turns కోసం వచ్చిన బస్ కనిపించేది అప్పట్లో మనకదొక వింత :-) అంతే కాకుండా ఎవరైనా ఊరికి బయల్దేరే సమయం లో పిల్లల్లో ఒకళ్ళని ఇంటి బయట కాపలా పెట్టి బస్ రాగానే చెప్పమనే వాళ్ళు. అంటే అలా U turn తీసుకుని వెళ్ళీ కాఫీ టిఫిన్ కోసం ఆపే వాళ్ళనమాట, దాంతో మేము తీరికగా వెళ్ళడానికి కొంచెం టైముండేది. అంతా బాగానే ఉంటుంది కానీ హాస్పిటల్ ముందునుండి వెళ్ళాలంటే మనకి కొంచెం భయం. అయినా తప్పదు కదా వెళ్ళే దారిలోనాయె, సరే ఏం చేస్తాం అని కొంచెం దూరం గా మధ్య మధ్య లో ఇండీషన్ (Injection ని మనం ఇలానే పిలిచే వాళ్ళం) ఇచ్చే కంపౌండరు ఏమన్నా వస్తున్నాడా అని చూసుకుంటూ వెళ్ళేవాడ్ని.

నాకు మా కాలనీ అంటే చాలా ఇష్టం అన్ని ఇళ్ళు ఇంచుమించు ఒకేలా ఉండేవి, ఒకటే ప్లాన్, ప్రతీ ఇంటి ముందూ బోలెడు ఖాళీ స్థలం దాని తర్వాత చిన్న రోడ్ అది దాట గానే గడ్డి వాము దడి. దాదాపు ప్రతి ఇంట్లో పాడి పశువులు ఉండేవి. ఉదయాన్నే తెల తెల వారుతుండగా లేచి, నిలబెట్టిన మంచం పట్టె మీద తల ఆన్చి నించుని, నిద్ర కళ్ళతో, మత్తుగా అలా ఉండి, లయబద్దం గా వినపడుతున్న పాలు పితికే శబ్దాన్ని, పచ్చి పాల మీద నుండి వచ్చే ఒక రకమైన కమ్మటి వాసనని ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బావుండేదో... వర్ణించడానికి మాటలు రావడం లేదు.

ఒకో రోజు ఆఫీసరు గారింట్లో పాలు పోసి రావడానికి నేను కూడా వెళ్ళే వాడ్ని. ఇంకా పూర్తి గా నిద్ర లేవని వీధులలో చుట్టూ పచ్చని చెట్ల మధ్య మా పిన్ని చేయి పట్టుకుని, మా స్కూల్ కబుర్లు చెప్తూ నడుస్తూ ఉంటే మాకు నేపధ్యం లో పక్షుల కువ కువ లు, గుడిలో నుండి బాలు గారి గొంతుతో వినిపించే శివస్తుతి వింటుంటే అలసట తెలిసేదే కాదు. ఎంత మధురం గా ఉండేవో ఆ రోజులు. ఉదయం అంటే అలా ఉండాలి అనిపించేలా ఉండేవి. బాలు గారు ఆలపించిన శివస్తుతి మీరు విని ఉండక పోతే వెంటనే వినండి చాలా బావుంటుంది, మరి నాకు మా ఊరిలో వినడం వల్ల అలా అలవాటు అయిందేమో తెలిదు కానీ ఎప్పుడు విన్నా నాకు ఉషోదయమే. ఇంకా ఆఫిసర్ గారి బంగళాలో నెమలి ఉండేది దానికోసమే అంత ఇష్టం గా వెళ్ళే వాడ్ని. నేను నెమలి పురి విప్పడం చూడలేదు కానీ పింఛం తో అలా వయ్యారం గా నడుస్తూ తిరగడం చూసే వాడ్ని. ఎప్పుడైనా వర్షం పడే ముందు బాగా తూనీగలు ఎగురుతుంటే అప్పుడు అనుకునే వాళ్ళం నెమలి ఇప్పుడు పురి విప్పి ఆడుతుంటుందేమో అని.

కాలనీ ఇళ్ళన్నీ దాటి అలా కొంచెం దూరం వెళ్తే కాలవ వచ్చేది అక్కడ పిల్లల ఈతలు అల్లర్లూ చూసి ఆనందించడమే కానీ నాకు ఈత కొట్టేంత ఫ్రీడం ఉండేది కాదు, ఎప్పుడూ ఎవరో ఒకరు పెద్ద వాళ్ళు తోడు రాకుండా అటు వెళ్ళనిచ్చే వారు కాదు నన్ను. అదీ కాక నేను చాలా చిన్న తనం నుండీ కళ్ళద్దాలు వాడాల్సి వచ్చింది. మూడవ తరగతి లోనో 4 లోనో మొదలు పెట్టాను అప్పుడే -6 పవరు వున్న అద్దాలు వాడే వాడ్ని. కాసు ప్రసాద రెడ్డి గారి పుణ్యమా అని ఇప్పుడు లేవనుకోండి. నాకైతే కాలవ ఒడ్డున నిలబడి చేప పిల్లలు ఎక్కడ కనిపిస్తాయా అని చూడటమే గొప్ప సరదాగా ఉండేది. నా సరదా చూసి మా వాళ్ళు బొరుగులు తీసుకుని వచ్చే వాళ్ళు అవి వేస్తే చేప పిల్లలు పైకి వస్తాయి చూడచ్చు అని.

కాలవ దాటి ఒక పక్కగా వెళ్తే చేలుండేవి అక్కడ మట్టి గట్టు మీద జాగ్రత్త గా నడవాలి. చేలో వేరు శనగ మొక్కల్ని పీకి మట్టి తగలకుండా జాగ్రత్త గా ఒలుచుకు తినేవాళ్ళం చాలా రుచి గా ఉండేవి. ఇంకా ఒకో సారి తిరిగి వచ్చేప్పుడు రేగు పళ్ళు, సీమ చింతకాయలు డైరెక్ట్ గా చెట్ల నుండి కోసుకుని తినడం లో ఉండే ఆనందం సూపర్ బజారు లో కొనుక్కుని తెచ్చుకోడం లో ఎక్కడ ఉంటుంది చెప్పండి. అసలు మీరు లేత తాటి కాయ నుండి డైరెక్ట్ గా తాటి ముంజలు ఎప్పుడైనా తిన్నారా... కాయ లో ముంజ కి ఒక పక్కగా బొటన వేలు పెట్టి తిప్పి నోటితో ఒడుపుగా ముంజని మొత్తం లాగేసి తింటుంటే... అసలు ఆ మజా ఎన్ని వందల పిజ్జాలు బర్గర్ లూ తిన్నా దొరకదు. హ హ.. వీడెవడ్రా బాబు పెద్ద తిండి పోతులా ఉన్నాడు అనుకుంటున్నారా... మనం కొంచెం భోజన ప్రియులమే లెండి.

ఇంక ఆటల విషయానికి వస్తే మా మామయ్యలు బిజీ గా కాలేజిలో ఉండే వాళ్ళు దాంతో నేను ఎక్కువ గా మా పిన్ని వాళ్ళతో పులీమేక, పరమపదసోపాన పఠం, గవ్వలు, అచ్చంగిల్లాలు (ఇవి నాకు అస్సలు వచ్చేవి కాదు ఒక రెండు సార్లు ప్రయత్నించి వదిలేసే వాడ్ని), రైటా రాంగా, ఇసుకలో పుల్లని దాచి పెట్టే ఆట ఇలాంటి హాని లేని ఆటలు ఆడేవాడ్ని అనమాట మరి మనకి కళ్ళద్దాలున్నాయ్ కదా సో వీటికే పరిమితం, అసలా అద్దాల మూలం గా నాకు సైకిలు నేర్చుకోడానికి కూడా కుదిరేది కాదు. అమ్మ భయపడి నేర్చుకోనివ్వలేదు మనకీ పెద్ద ఇష్టం లేదనుకోండి అది వేరే విషయం. ఇంకా ఆకాశం లో కొంగలు ఎగురుతుంటే గోళ్ళు ఇలా గట్టి గా పట్టుకుని ...కొక్కిరాయి... అని ఏదో చెప్పే వాళ్ళం అలా చేస్తే కొంగలు వాటి తెల్ల రంగుని మన గోళ్ళకి ఇచ్చి వెళ్తాయంట. నిజం గానే కొంగలు వెళ్ళాక చూస్తే గోరు మొదట్లో తెల్ల గా మచ్చ కనిపించేది తెగ మురిసి పోయే వాళ్ళం :-) నొప్పి పుట్టేలా గోటిని నొక్కి పట్టుకుంటే తెల్ల మచ్చ పడక చస్తుందా...

అవనమాట కొన్ని నా చిన్ననాటి కబుర్లు.
మళ్ళీ మరో టపా లో మరిన్ని కబుర్లతో కలుద్దాం అంత వరకూ శలవా మరి....

--మీ వేణు.

7 వ్యాఖ్యలు:

 1. హ్హహ్హహ్హ చాలా బావున్నాయండీ.. మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి....
  నేను చాలాసార్లు తిన్నాను, లేత తాటి ముంజెలు!!!..
  కొంగల ఆట, దాదాపు మీరు చెప్పిన ఆటలన్నీనూ... మేము కూడా ఆడేవాళ్ళం... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ పుల్లని ఇసుకలో దాచిపెట్టే ఆట మనకూ ప్రీతిపాత్రమే నండోయ్! "చికుచికు పుల్లా...చిటారి పుల్లా..." అంటూ దాస్తూ, రాగాలు కూడా తీసేవాళ్ళం. ఆ రోజులే వేరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివస్తుతి అంటే .. బాలూ గారు పాడిన లింగాష్ఠకమే కదా?
  అదైతే నాకు కూడా చాలా ఇష్ఠం !
  :)

  మీ కబుర్లు వింటుంటే .. నాకు కూడా మీ కాలనీ వీధుల్లో తిరుగుటూ అన్నీ మీ కళ్ళతో చూస్తున్నట్టుంది. చాలా బాగా వ్రాస్తున్నారు వేణూ ...

  నేను పుట్టి పెరిగింది కూడా పల్లెటూరే. చిలకలూరిపేట్ దగ్గర 'గణపవరం ' మా ఊరు.

  ఇప్పుడు చాలా మారిపోయింది కానీ, చిన్నతనం లో అచ్చమైన పల్లెటూరులా ఉండేది.

  తాటి ముంజెల విషయానికి వస్తే.. మా 'పాడి చేను ' లో 10 తాడి చెట్లు వరసగా ఉండేవి. నాకు ఎక్కడం రాదు కాని, మా మామయ్య ఎక్కి దింపేవాడు. అలా లేత ముంజెల్ని వేలితో తీసి తింటుంటే..అబ్బా అలా ఎన్నేసి తినేవాళ్ళమో ! ఎక్కువ తినేస్తే కడుపు నొప్పి వస్తుందని ఒక మామిడికాయ తినమనేవాళ్ళు.

  అలా తినేసిన తాటి కాయలతో బండి చేసుకుని, వాటిని ఒక పుల్లతో నెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం !

  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @మేధ
  నెనర్లు, ఓ కొంగల ఆట కూడా ఆడేవారా :-)
  @మహేష్
  అవునండోయ్ నేను పాట గురించి చెప్పడం మర్చిపోయాను.
  @Venu
  నెనర్లు, అవునండీ శివస్తుతి అంటే శివాష్టకం, విశ్వనాథాష్టకం, లింగాష్టకం, బిళ్వాష్టకం ఈ నాలుగూ కలిపి ఉంటాయ్. ఇదిగో ఈ లంకె లో వినచ్చు http://www.telugufm.com/Modules/music/MovieDetail.aspx?mid=10119
  తాటి కాయల బండి, సైకిలు టైరు ఆట కూడా సూపర్, భలే గుర్తు చేసారు.

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.