శనివారం, జులై 12, 2008

వీరయ్య మాష్టారు...

నేను నరసరావుపేట వదిలి పిడుగురాళ్ళ లో 7 వ తరగతి జాయిన్ అయ్యాక మన చదువుకి గ్రహణం పట్టడం మొదలైంది కానీ అంతకు ముందు అంటే ప్రైమరీ స్కూల్ లో ఉండగా 6 వ తరగతి వరకూ నేను క్లాస్ లో అందరికన్నా చిన్న వాడ్ని చదువులో కాస్త చురుకైన వాడ్ని. మా వీధి బడి లో చాలా మంది మాష్టర్లకి నేను ప్రియ శిష్యుడ్ని. నేను మొదటి తరగతి నుండీ అదే బడిలో చదువుకునే వాడ్ని. మా బడి, మొదట్లో అంటే నేను ఒకటో తరగతి చదివేప్పుడు మా ఇంటి పక్కనే ఉండేది. అసలు నేను ఈ బళ్ళో పడటం వెనక ఓ చిన్న పిట్ట కధ ఉంది అది రేపు చెప్పుకుందాం లెండి...

నేను ఐదో తరగతి చివర్లో ఉన్నపుడనుకుంటా మా వీరయ్య మాష్టరు గారు మా స్కూల్ లో జాయిన్ అయ్యారు. 6 వ తరగతి వాళ్ళకి హిందీ చెప్పేవారు, నల్లని వొంటి రంగు... తెల్లని పంచే లాల్చి.. జేబులో ఎప్పుడూ ఓ చిన్ని అడ్రస్ ల పుస్తకం ఓ పెన్ను (ఈ జేబులో పెన్ను అలవాటు నేను ఈన దగ్గర నేర్చుకుని ఇంకా వదల లేదు ఇప్పటికీ నా జేబులో పెన్ను ఖచ్చితం గా ఉండాల్సిందే !! ) వీటన్నిటికీ తోడు మొహాన ఎప్పుడూ చెరగని చిరు నవ్వు... పక్కనే ఓ సైకిలు... అచ్చమైన బడి పంతులు గెటప్ లో ఉండే వారు. ఆయన ఒంటి రంగు వల్లనేమో మొహాన నవ్వు.. వేసుకునే బట్టలు చాలా ప్రత్యేకం గా తెలిసేవి...

ఎలాంటి వారైనా ఆయన్ని చూడగానే చేతులెత్తి నమస్కరించాల్సిందే అలా ఎప్పుడూ ప్రశాంతం గా ఉండేవారు ఆయన. మా మాష్టారు అంటే మాకందరికీ చాలా ఇష్టం, చాలా అరుదు గా ఎవర్నైనా కోప్పడేవారు ఆయనకి కోపం తెప్పించేంత పని చేసాడంటే వాడికి ఇంకో మాష్టరు చేతిలో ఐతే బడితె పూజే కానీ ఈయన గట్టి గా మందలించి వదిలేసే వారు. టీవీ లు వాటిలో దక్షిణ భారతం మొత్తానికి హిందీ నేర్పించిన రామాయణ్ మహాభారత్ లాంటి సీరియళ్ళు రాక ముందే నాకు కాస్త హిందీ వచ్చిందీ, దాని మీద ఆసక్తి కలిగింది అంటే అది ఆయన చలవే... మా మాష్టారు గారు పాఠం చెబుతుంటే ఎవరో ఒకరిద్దరు తప్ప క్లాస్ అంతా చాలా నిశ్శబ్ధం గా ఆసక్తి గా వినేవాళ్ళం.

శాయమ్మ టీచరు గారని ఒకావిడ ఉండే వారు, ఆవిడకి నేనంటే బోలెడు ఇష్టం అప్పుడప్పుడూ నా చేత పాటలు పాడించే వారు. ఓ సారి మంచి వర్షం పడుతున్న టైము లో నన్ను పాడ మంటే "గాలి వాన లో వాన నీటిలో పడవ ప్రయాణం...." అని పాడేసాను, అది ఆవిడకి తెగ నచ్చేసి అందరూ మెచ్చుకున్నారు కూడా దాంతో మనం సింగర్ గా సెటిల్ అయిపోయాం. అదేంటో నాకు ఆ వయసు నుండే విషాద గీతాలు ఇష్టం పైగా అవే బాగా పాడేవాడ్ని. ఇంజనీరింగ్ కి వచ్చాక కూడా పాటల పోటీ లో పాడరా అంటే "ఆస్తులు అంతస్తులు" సినిమా లో ఏసుదాసు గారు పాడిన "మిడిసి పడే దీపాలివి... మిన్నెగసి పడే కెరటాలివి..." అని ఓ అత్యంత విషాద గీతం ఎత్తుకున్నాను దాంతో మా క్లాస్ అమ్మాయిలు వీడేదో పేద్ద..భగ్నప్రేమికుడు లా ఉన్నాడు అని అనుకున్నారట, కొన్నాళ్ళయ్యాక నన్ను అడిగి అలాంటిదేమీ లేదని నిర్ధారించుకున్నార్లెండి.

సరే నేను ఆరో తరగతి కి వచ్చాక హిందీ మాష్టారు చెప్పింది చెప్పినట్లు టపీ మని పట్టేసే వాడ్ని దాంతో నేను మా వీరయ్య మాష్టారు గారికి కూడా ప్రియ శిష్యుడ్ని అయిపోయా. ఆయన క్లాస్ లోనే అందరితో చెప్పేవారు వీడు నా ప్రియ శిష్యుడు రా అని :-) మిగతా వాళ్ళు కూడా నన్ను రిఫర్ చేయాలంటే అంతే చెప్పేవారు ఓ రోజు "మీ ప్రియ శిష్యుడు పాటలు బాగా పాడతాడండీ.." అని ఎవరో చెప్పారు. తను నా చేత ఓ రెండు పాటలు పాడించుకుని విని నీకు ఈ పాటలు కాదు రా మంచి పాటలు నేర్పుతాను అని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళి మరీ ఈ కింది రెండు పాటలు నేర్పించారు. అప్పటి నుండీ ఈ పాటలు ఎప్పుడు విన్నా మా మష్టారే గుర్తొస్తారు.

"జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి...."
"దేఖ్ తెరే సంసార్ కి హాలత్ క్యా హొగయీ భగవాన్...కిత్‌నా బదల్ గయా ఇన్సాన్..."

ఈ రెండు పాటలు అప్పట్లో ఉదయం పూట అప్పుడప్పుడూ రేడియో లో వచ్చేవి తర్వాత "జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి...." పాటని రాక్షసుడు సినిమాలో మీరంతా వినే ఉంటారు కదా. ఈ రెండు పాటలతో పాటు వాళ్ళ ఇంట్లో తిన్న "మినప సున్నుండలూ... జంతికల రుచి కూడా ఎప్పటికీ మర్చి పోలేను :-)

నేను సాధారణం గా బళ్ళో ఆటలు పెద్ద గా ఆడే వాడ్ని కాదు అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ బలవంతం మీద కళ్ళద్దాలు ఎవరికైనా పట్టుకొమ్మని ఇచ్చి కబడీ ఆడేవాడ్ని. నేను చిన్నప్పుడు ఏం చేసినా కాస్త ప్రొఫెషనల్ గా చేయడానికి ప్రయత్నించే వాడ్ని లేండి అందుకే మా వాళ్ళంతా ఆకతాయిగా ఆడుతుంటే నేను పెద్ద పోటుగాడి లా చాలా పెద్ద ఆటగాడి లెవెల్ లో గొంతు గంభీరం గా మార్చేసి కబడి... కబడి... అని కూత పెడుతూ చాలా సీరియస్ గా ఆడే వాడ్ని. దాంతో మా వీరయ్య మాష్టారు ఎక్కడ వున్నా మా పిల్లల్లో ఎవడో ఒకడు వేళ్ళి "మాష్టారు మీ ప్రియ శిష్యుడు కబడీ ఆడుతున్నాడు రండి.." అని పిలుచుకు వచ్చే వారు. ఆయన కూడా కాదనకుండా వచ్చి చూస్తూ "భలే ఆడుతున్నావ్ రా..ఏ పని చేసినా అలా శ్రద్ద గా చేయాలి...." అని అంటూ ఎంకరేజ్ చేసే వారు.

ఆయన ప్రోద్బలం తోనే నేను పిడుగురాళ్ళ లో హిందీ ప్రాధమిక, మాధ్యమిక పరీక్షలు కూడా వ్రాసి సర్టిఫికేట్ సంపాదించాను కానీ ఆ తర్వాత మళ్ళీ ఊరు మారడం తో నా హిందీ చదువు అంతటితో ఆగిపోయింది. నేను పిడుగురాళ్ళ నుండి మళ్ళీ నరసరావుపేట వచ్చాక కాలేజి కోసం హాస్టల్ లో చేరేవరకూ ఊళ్ళో అప్పుడప్పుడూ కనపడి పలకరించే వాడ్ని కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని కలవడం కుదర్లేదు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. నిన్న ప్రఫుల్ల చంద్ర గారి तूतॊ ’మరీ’ है టపా లో హిందీ గురించి చూసిన దగ్గర నుండీ మళ్ళీ ఆయన జ్ఞాపకాలు పదే పదే వెంటాడుతుంటే కాస్త ఐనా ఊరట పొందుదాం అని ఇదిగో ఈ టపా వ్రాసేసాను.

18 వ్యాఖ్యలు:

 1. ఈ టపా చదివితే నాకు మా హింది మాస్టారు గుర్తొచ్చారు..ఆయనకి కూడా నేనంటే చాలా ఇష్టం ఉండేది.ఎందుకంటే హింది లో మనం ఎప్పుడు ఫస్టే...
  మీకో విషయం చెప్పనా..నేను పాటలు బాగా పాడేదాన్ని..ముఖ్యంగా..అప్పట్లో..దూరదర్షన్ లో వచ్చే ఈ పాట అంటే నాకు ప్రాణం..ఎంతో సుందర భారత దేశం ఇది మన దేశం సువర్ణకోశం..
  ఇంకా...ఋతురాగాలు కూడా పాడేదాన్ని..ఈ పాట..నా లైఫ్ నే మార్చింది...బోలెడు అభిమానులను తెచ్చిపెట్టింది...ఇక పోతే..జెండా వందనం రోజు విశాల భారత దేశం మనది హిమాలయాలకు నిలయమిది...ఈ పాట తప్పకుండా నాతో పాడించేవారు..మా హింది మాస్టారు ఒక పాట ఎప్పుడు పాడేమనేవారు నన్ను..ఎ మాలిక్ తెరే బందే..హం...ఎసె హోకె హమారే కరం....ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం...చాలా బాగుంటుంది...ఏదేదో రాస్తున్నానా..?అయ్యో..మరి ఏం చేసేది ..మీరు నాకు ఆ రోజులన్ని గుర్తు చేసారు..అందుకే ఇలా ....
  ఆ రోజులను...గుర్తు చేసినందుకు ధన్యవాదాలు చెప్తుంది...ఈ చిట్టి పిల్ల..మీను...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ గురువు గారి గురించి బాగా రాసారు.
  అలా ప్రోత్సహించే మాస్టారు దొరకడం చాలా అదృష్టం. శుభకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి...."

  ఈ పాట నేను చిన్నప్పుడు బడిలో పాడించేవారు. అప్పుడప్పుడూ పాడుకుంటా... ఆ బడి వదిలేసాక ఇప్పటి వరకు బయటెక్కడా వినలేదు :-(

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నాకూ మా ట్యూషన్ మాస్టారు గుర్తొచ్చారు. ఆయనకి అప్పటికే చాలా వయసు ఉండేది. అయినా ఓపిక గా నడుచుకుని, మా ఇంటికి వచ్చేవారు. ఆయనకి నశ్యం అలవాటు ఉండేది. ఆయనే నా చేత తెలుగు అక్షరాలు నేర్పించారు. (పేరేంటో.. మా అమ్మ కి కూడా తెలియదు. మేస్టారు! అంతే !!) ఆయన ఆ నస్యం డబ్బీ లాల్చీ జేబు లోంచీ తియ్యడం, మా పిల్లల కోసం హాస్యానికి కాసింత హావ భావాలు జోడించి, ముక్కు లో ఆ పొడి పెట్టుకుని పీల్చడం.. మధుర జ్ఞాపకాలు. అయితే, ఆయన ప్రైమరీ వరకే చెప్పగలిగే వారు. మేము పెద్దయ్యాక, వారి అబ్బాయి కనబడి, మాస్టారు పోయిన వార్త చెప్పారు. ఆ రోజు వరకూ ఆయన నడక తోనే ఊరంతా తిరిగి, ట్యూషన్ లు చెప్పేవారు. ఆయన నాకు ఒక సారి జ్వరం వస్తే, వడిసెం పట్టి వేసి, మంత్రం చదవడం నాకు గుర్తు ఉంది. మంత్రాలకి చింతకాయలు రాలతాయండీ అని నవ్వుతూ చెప్పేవారు. థాంక్స్ మీకు. మంచి పోస్ట్ రాసినందుకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వేణు గారు: మీరు నేను రాసిన "దశ తప్పిన బ్లాగావతారం" చదివారు కదా?? నన్ను అభినందించారు కూడా.. ఇప్పుడు మీ టపా చదివాకా.. ఆ టపాలో నేను రాసిన మొదటి పారా గుర్తువస్తుంది. ఒక అల వచ్చిపోయి.. ఇంకో అలకు దారి ఇచ్చినట్టుగా.. ఒకరి జ్ఞాపకాలు ఇంకొకరికి అనుభూతిగా మారడం.. I'm thoroughly enjoying!!

  These r the lines from my blog:

  బ్లాగ్ ప్రపంచంలో ఏదో జరుగుతూనే ఉంటుంది.. కొన్ని మనకు తెలుస్తాయి, మరి కొన్ని అసలు కనపడవు. ఒక టపా నుండి మొదలైన ఆలోచన వేలానువేల కోట్ల అడ్డంకులను అధిగమిస్తూ మరలా ఓ టపాగా రూపాంతరం చెందుతుంది. ఒక టపా ప్రకంపనలు ఒక టపాలో స్పందనగా సీతాకోకచిలుక రెక్కల టపటపలా మారే సందర్భాలు ఉన్నాయి. ఇది మానవ మానస ప్రయత్నమా... లేదా ఒక అద్వీతీయమైన శక్తి వీటి వెనుకుందా అంటే..
  You got to be part of blog world. kadaaa?? :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @మీనూ
  థాంక్స్...అయ్యో నువ్వు ఎంత ఎక్కువ వ్రాస్తే నాకు అంత సంతోషం :-) నీ జ్ఞాపకాలను ఇక్కడ మాతో పంచుకున్నందుకు మళ్ళీ ఓ సారి నెనర్లు.
  @ప్రపుల్ల చంద్ర గారు,
  నెనర్లండీ...మీ టపానే నా జ్ఞాపకాలని కదిలించి ప్రోత్సహించింది.
  @దిలీప్ గారు
  నెనర్లు, ఆ పాట రాక్షసుడు సినిమాలో ఉపయోగించారండీ. ఇక్కడ వినచ్చు
  @sujata గారు
  చాలా థాంక్స్ అండీ...మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు నెనర్లండీ...నిజమే కొందరు మాష్టర్లకు అదే పేరు గా స్థిరపడిపోతుంది. మీ మధురమైన జ్ఞాపకాలను నా టపా ద్వారా గుర్తు చేయ గలిగినందుకు నాకు సంతోషం గా వుంది.
  @పూర్ణిమా
  చాలా థాంక్స్ అండీ...అవును మీ టపా గుర్తుంది, ఈ మధ్య ఆ ధోరణి చాలా టపా లలో గమనించి నేను కూడా అనుకున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. "తను నా చేత ఓ రెండు పాటలు పాడించుకుని విని నీకు ఈ పాటలు కాదు రా మంచి పాటలు నేర్పుతాను అని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళి మరీ ఈ కింది రెండు పాటలు నేర్పించారు."
  చాలా సంతోషం. ఐతే మీరు త్వరలో మాకు ఒక మంచి ఆడియో టపాతో వీనుల వింది చేయనున్నారన్న మాట

  ప్రత్యుత్తరంతొలగించు
 8. పూర్ణిమ .. వ్యాఖ్య భావుకంగా బావుంది.
  ఏకాంతపు దిలీపు .. జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన. ఆకాశవాణిలో వస్తుండేది .. బహుశా ఆ బాణీ కట్టింది బాలాంత్రపు రజనీకాంతరావుగారు అయ్యుండొచ్చు. పరుచూరి శ్రీనివాస్ గారికి తెలుస్తుంది. సినిమాలో ఎలావుందో నాకు తెలీదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @కొత్తపాళీ గారు
  :-) హ హ అది ఆరో తరగతి లో అండీ బాల్యం లో గొంతు మధురం గా ఉంటుంది కదా, అప్పుడు రికార్డ్ చేసుకున్న కేసెట్ ఎక్కడో పడేసాను. ఇప్పటి గొంతు తో , అదీ సాధన లేకుండా పాడితే బ్లాగర్లు నా పై దండెత్తుతారు... అంతగా అనిపిస్తే... ఇక ఈ బ్లాగ్ లో టపాలు వెయ్యలేను పూర్తి గా మూసేద్దాం అని నిర్ణయించుకున్న రొజున ఆఖరి టపా గా పోస్ట్ చేస్తాలెండి :-)

  సినిమా లో "జయ జయ ..." పాట బాణీ ఏమాత్రం చెడ గొట్ట లేదండీ మా గురువు గారు నేర్పించినదీ నేను అప్పట్లో రేడియో లో విన్నదీ సినిమాలోనిదీ ఒకటే బాణీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. అలాంటి మంచి మేష్టార్లు దొరకడం అదృష్టమే!

  ప్రత్యుత్తరంతొలగించు
 11. వీరయ్య మష్టారు అని టైటిల్ చదవగానే, మా మాష్టారే మీకు కూడా వచ్చారేమో అనుకున్నా.కానీ హిందీ మాష్టారు అని చదివాక కాదని అర్ధమైంది. ఇలాంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కానీ మీరు వాటిని అక్షరబద్దం చేసి అందరినీ మళ్ళీ బాల్యానికి పట్టుకెళ్తున్నారు వేణూ..
  :)

  నాకూ ఇంచుమించుగా మీలాంటి జ్ఞాపకాలే ఉన్నాయి. తెలుగు, సోషల్, ఇంగ్లీష్, డ్రిల్ మాష్టార్లకి ప్రియ శిష్యుణ్ణి నేను. ఎందుకో చిన్నప్పటి నుంచి హిందీ మాత్రం ఎక్కలేదు. :(

  నాకు జీవితం మీద స్పూర్తి కలిగించింది, నన్ను అత్యంత ప్రభావితం చేసింది మాత్రం మా డ్రిల్ మాష్టారే. అవటానికి డ్రిల్ మష్టారైనా, బహుముఖ ప్రజ్ఞాని. స్పోర్ట్స్ లో నన్ను బాగా ప్రొత్సహించింది ఈ మాష్టారితో పాటు మా నాన్నగారు. ఎక్కడ టోర్నమెంట్ జరిగినా మా నాన్న గారు కూడా వచ్చి ఉత్సాహ పరిచేవాళ్ళు.

  పాటల విషయానికొస్తే, మా రవి ఏమో ఆకలిరాజ్యానికి, నేనేమో ప్రేమసాగరానికి ఫిక్స్ అయిపోయాం ! :P

  మీ జ్ఞాపకాల దొంతర విడదీస్తున్న కొద్దీ ఇలాంటి నిధి నిక్షేపాలు బయటపడుతూనే ఉంటాయి.

  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నా బ్లాగులో తెలుగు మాస్టార్లని గుర్తు చేసుకుంటున్న సమయంలోనే మీరిక్కడ మీ హిందీ మాస్టార్ని గుర్తు చేసుకున్నారు. చూడబోతే అందరూ ఒక్కసారే చదువుకునే రోజుల్లోకెళ్లిపోయినట్లున్నారు. పూర్ణిమ అన్నట్లు ఒక టపాలో ప్రకంపనలు చాలా చోట్ల స్పందనగా మారుతున్నట్లున్నాయి.

  మీ వీరయ్య మాస్టారి గురించి చదివితే నాకు మా హిందీ మాస్టారు పున్నయ్య గారు గుర్తొచ్చారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @Venu గారు మీ ప్రోత్సాహం చూస్తుంటే నాకు రోజుకో టపా వ్రాసేయాలని ఉందండీ... చాలా చాలా థాంక్స్... నిజమేనండీ డ్రిల్లు మాస్టార్లు కొంత మంది బహుముఖ ప్రజ్ఞాశాలులుంటారు. అన్నట్లు ప్రేమ సాగరం గురించి గుర్తు చేసి ఇంకో జ్ఞాపకాన్ని కదిలించారు దాని గురించి కూడా త్వరలో టపా వ్రాస్తాను...

  @అబ్రకదబ్ర గారు నెనర్లండీ..
  మీ తెలుగు మాష్టారి గురించి ఇప్పుడే చదివానండీ బావుంది...ఎంతైనా బాల్యాన్ని మించిన ఆనందమైన రోజులు ఉండవు కదండీ అందుకే అంతా అలా ఓ రౌండ్ వేసి వస్తున్నట్లున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నాకూ మా హి0దీ టీచర్ గారు గుర్తొచ్చారు.ఆవిడకి నేన0టే చాలా ఇష్ట0.ఆవిడ దగ్గరే నేను ప్రాధమిక,మధ్యమ,రాష్ట్ర,ప్రవేశిక ,..ఇలా ఏవేవో కట్టేసాను.అప్పట్లో నేను హి0దీ కి0గ్ ని.అ0దరికీ బిల్డప్ కోస0 హి0దీ పాటలు వినడ0,హి0దీ సినిమాలు చూడడ0 చేసేదాన్ని.కానీ మనకు పుస్తకాలు చదవడమ్ వరకే హి0దీ వచ్చు.పరీక్షలప్పుడు జూనియర్స్ కి హి0దీ ప్రశ్నలకి నేనే సొ0త కవిత్వ0లో సమాధానాలు చెప్పేస్తూవు0డేదానిని.అది ఆ టీచర్ గారికి తెలిసిపోయి[నా శైలిని బట్టి]క్లాసుకి పిలిపి0చుకుని వాళ్ళము0దు తిట్టి తరువత పెర్సనల్ గా మెచ్చుకునేవారు.ఏమిటీ....ఇప్పుడు మాట్లాడు అ0టారా.....అ0త సీన్ నహీహై.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఇ0కో విషయ0 చెప్పడమ్ మరిచా...మాది ఆర్ ఎస్ ఎస్ స్కూలు అవ్వడ0 వల్ల దేశభక్తి గీతాలు చాలా ఎక్కువ పాడేవాళ్ళ0.మా క్లాసు పిల్లల0 కొ0తమ0ది ఒక మాష్టారితో కలిపి ఒక పాట రాసి ట్యూను కూడా కట్టాము.నాకిష్టమయిన పాట "తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా","జయ జయ ప్రియ భారత","మనదేశ గాధ వినరా మన జాతి చరితమిదిరా"

  ప్రత్యుత్తరంతొలగించు
 16. రాధికా గారు "తరతరాల చరిత్ర పిలుపు" మీరు స్కూల్ లొ ట్యూన్ కట్టార.. ఎందుకు అంటే మేము చాలా సార్లు పాడాము ఆ పాట???

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @ రాధిక గారు నెనర్లు
  హ హ మొత్తం మీద హిందీతో బాగానే ప్రయోగాలు చేసారనమాట. మీ జ్ఞాపకాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  @ చైతన్య గారు వ్యాఖ్యకు నెనర్లు
  రాధిక గారు ఓ పాటకి ట్యూన్ కట్టానన్నారు కాని "తరతరాల చరిత్ర పిలుపు" అన్న పాటకి కట్టాను అని అనలేదండీ. మధ్య లో ఉన్న dot మిస్ అయినట్లున్నారు మీరు.

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.