బుధవారం, జులై 23, 2008

మా బడి లో..బజారయ్య..

బజారయ్య నేను ఆరో తరగతి వరకు చదివిన మా వీధి బడి లో ఉండే వాడు. మా బడికి వాచ్‌మన్, అటెండర్, క్లీనర్, రిక్షావాడు, ఇంటర్వల్ లో తినుబండారాలు అమ్ముకునే వ్యాపారి అన్నీ అతనే... చాలా చిత్రం గా అతని భార్య పేరు బజారమ్మ. పెళ్ళయ్యాక మార్చుకుందో లేకా బడి లో అంతా అలా ఆవిడ పేరు మార్చేసారో తెలీదు. బజారయ్య కి ఓ చేయి ఉండేది కాదు. మోచేతి నుండి కిందకి ఓ నాలుగు అంగుళాలు వుండేది. దాన్ని కదిలించ గలిగే వాడు, అప్పుడప్పుడూ దానినే గ్రిప్ కి ఉపయోగించుకునే వాడు. ఆ చెయ్యి ఎలా ఇరిగింది బజారయ్యా అని అడిగితే ఓ చిన్న నవ్వు నవ్వేసి "ఏదో లే ఏణూ అయ్యన్నీ ఇప్పుడెందుకు.." అనే వాడు. సాధారణమైన ఎత్తు, ఎప్పుడూ మాసిపోయిన తెల్లగడ్డం తో చూడటానికి ప్రత్యేకం గా కనిపించేవాడు. చాలా మంచి వాడు. స్కూల్ లో టీచర్లు కూడా చులకన చేయకుండా బాగా ఉండే వాళ్ళు అతనితో...

నివాసం ఉండటం కూడా మా బడి ఆవరణలోనే ఓ పక్కగా గుడిశ వేసుకుని ఉండే వాడు. అతను ఖాళీగా కూర్చుని ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు నిరంతరం ఏదో ఓ పని చేస్తూనే ఉండే వాడు. పైన చెప్పిన పనులే కాకుండా చిన్న చిన్న నాటు వైద్యాలు చిట్కా వైద్యాలు చేసే వాడు. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరనుకుంటా. వాళ్ళిద్దరూ గొడవపడటం కూడా నేనెప్పుడూ చూడలేదు. అతనికి తాగుడు లాంటి అలవాట్లు లేవు కానీ తర్వాత్తరవాత మా బడి లొ మనేసాక బీడీ తాగడం చూసాను. మా బడి లో ఉన్నపుడు మాత్రం ఎలాంటి అలవాట్లు లేకుండా బాగా ఉండేవాడు. బడికి శలవులు ఇచ్చినప్పుడు ఇళ్ళల్లో ఏవైనా పనులు చేయడమో ఆ మొండి చేత్తోనే రిక్షా తోలడమో, బండి మీద తినుబండారాలు, పళ్ళు లాంటివి వీధి వీధి లోను అమ్ముకోడమో ఇలాంటి పనులు ఏదో ఒకటి చేస్తూ కనిపించే వాడు. అంతలా కష్ట పడే వాళ్ళని దగ్గరగా చూడటం నాకు అదే ప్రధమం.

అతని చేతి గురించి రక రకాల కధలు ప్రచారం లో ఉండేవి. ప్రమాదం లో పోగొట్టుకున్నాడని కొందరు, ఒకప్పుడు అతనో పెద్ద రౌడీ అనీ గొడవల్లో చేతిని పోగొట్టుకున్నాడనీ కొందరు...ఇలా చాలా కధలు ఉండేవి.. కానీ వాటిలో నిజా నిజాలు నాకు తెలీవు. ఓ సారి చిన్నప్పుడు నాకు పేగు పడి కడుపు నొప్పి వస్తే ఇటుక రాయి పట్టీ ఆ మొండి చేతితోనె పొట్ట మీద రుద్ది నయం చేసాడు. మొదట అమ్మ వాళ్ళు అతనిని అడగడానికి ఆలోచించారు కానీ చుట్టు పక్కల వాళ్ళు బాగా చేస్తాడు, వెంటనే తగ్గిస్తాడు అని చెప్పడం తో అతనితోనే చేయించారు.

స్కూల్ ఇంటర్వెల్ సమయం లో లంచ్ బ్రేక్ సమయం లో నూగు జీళ్ళు, కొబ్బరి ఉండలు, పదిపైసల ఆకారం లో ఉండే న్యూట్రిన్ కొబ్బరి చాక్లెట్ లు. మరమరాలు, చెగోడీలు, రేగి పళ్ళతో చేసిన చెక్కలు, ఉప్పూ కారం అద్దిన పచ్చి మామిడి బద్దలు, జామ కాయలు, కోటప్ప కొండ తిరణాల టైం లో చెరుకు ముక్కలు. ఇలా ఏ సీజన్ పళ్ళు, తినుబండారాలు ఆ సీజన్ లో అమ్మే వాడు. మనం కొంచెం బుద్ది గా బొద్దుగా ముద్దుగా వుండటమే కాకుండా అమ్మా నాన్న వాళ్ళు దదాపు నాకు ప్రతీ రోజు డబ్బులు ఇచ్చే వాళ్ళు సో మనం అతని తినుబండారాలకి రెగ్యులర్ కష్టమర్ కూడా అవడం తో కాస్త ప్రత్యేకమైన అభిమానం చూపించే వాడు.

నేను స్కూల్ వదిలేసాక కూడా ఎప్పుడు రోడ్ మీద కనిపించినా "ఏం ఏణూ బాఉండావా... అమ్మా నాయన వాల్లు అంతా ఎట్టుండారు..." అని ఆత్మీయం గా పలకరించే వాడు. ఈ మధ్య కాలం లో అతనిని చూసి చాలా కాలం అయింది ఎక్కడ ఉన్నాడో మరి.

3 వ్యాఖ్యలు:

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.