శుక్రవారం, జులై 18, 2008

నేనూ నా చదువూ...

అలా కాన్వెంట్ భారి నుండి తప్పించుకుని మా బడి లో చేరాక, మొదట్లో కొంచెం మారాం చేసినా తర్వాత్తరవాత అక్కడ ఫ్రెండ్స్ తయారవ్వడం తో బాగానే బడికి వెళ్ళే వాడ్ని. చిన్నప్పుడు అమ్మ నాన్న చదవమని చెప్పే వాళ్ళు కానీ మరీ కూర్చో పెట్టి రుద్దే వారు కాదు. పైగా అప్పటి లో టీవీ లు ఉండేవి కాదు కదా సో రేడియో లు లేదా సినిమాలు ప్రధాన వినోద సాధనాలు. మనకి ఆటల మీద అంత ఇష్టం ఉండేది కాదు కాబట్టి బుద్ది గా ఇంట్ళోనే ఉండేవాడ్ని. మా ఇంట్లో రేడియో ఉన్నా కూడా దానికేసే కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవాల్సిన పని లేదు కాబట్టి ఒక పక్కన అది మోగుతున్నా అది వింటూ అమ్మా నాన్న నాతో ఆడుకోడమో, కధలు, కబుర్లు చెప్పడమో... ఆటలతోనే అప్పుడప్పుడూ చదువు ఎంత ముఖ్యమో కూడా చెప్పడమో చేసేవారు. టీవీ వచ్చాక అందరమూ సిరియస్ గా దానికేసి చూడటమే కానీ కనీసం ఒకరికేసి ఒకరం కూడా చూసుకునే వాళ్ళం కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. నా అదృష్టం కొద్దీ నేను 10 వ తరగతికి వచ్చే వరకు మా ఇంట్లో టివీ లేదు. ఆ తర్వాత నేను ఇంట్లో లేను :-) (హాస్టల్ లో ఉన్నా అని అర్ధం లెండి).

కాన్వెంటు కి వెళ్ళడానికి పడిన కష్టాలు అంటే గుర్తున్నాయ్ కానీ మా బడి లో మొదటి 2-3 తరగతులు అసలు ఎలా గడిచాయో కూడా గుర్తు లేదు. సరదాగా జరిగి పోయేవి రోజులు నాకు కొంచెం చదవడం వచ్చాక ప్రతి నెల చందమామ, బాలమిత్ర, బుజ్జాయి లాం
టి కధల పుస్తకాలు తెచ్చేవారు. ఇవే కాకుండా విక్రమార్కుడి కధలు, వెర్రి వెంగళప్ప కధలు, బోజరాజు కధలు, లాంటి చిన్న చిన్న పుస్తకాలు కూడా తెచ్చే వాళ్ళు. అప్పట్లో తెలుగు పుస్తకాలు అద్దెకి ఇచ్చే షాపులు ఉండేవి మీకు గుర్తున్నాయా... చందమామ లాంటి పుస్తకాల నుండి పెద్ద పెద్ద నవలలు నేను చెప్పిన బేతాళ కధలు లాంటివి డిటెక్టివ్ పుస్తకాల సైజు లో ఉండే పుస్తకాలు కొన్ని, ఇంక మధుబాబు లాంటి వాళ్ళ పుస్తకాలు కూడా ఉండేవి. నాకు అవి చదవడానికి అనుమతి ఉండేది కాదు లెండి ఏ పుస్తకమైన ముందు అమ్మ అక్కడక్కడా చదివి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ నేను చదవడానికి ఉండేది కాదు. నేను అమ్మని పోరగా పోరగా 7వ తరగతి సెలవుల్లో మల్లాది గారి "నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త" నవల చదవనిచ్చింది. అదే నే చదివిన మొదటి నవల.

నేను హైస్కూల్ కి వచ్చాక చదువు మీద కొంచెం ధ్యాస తగ్గింది కదా అప్పుడు అమ్మ నాకు కంపెనీ ఇచ్చేది తనూ ఏదో ఒక పుస్తకం వీక్లీనో మంత్లీనో లేదంటే ఓ నవలో పట్టుకుని నాతో పాటు తనూ చదువుతూ కుర్చునేది. అమ్మకి ఉన్న ఇంకో అలవాటు తింటూ చదవడం తను ఒకో రోజు అన్నమో ఒకో సారి శలవు రోజుల్లో ఉదయం టిఫిన్ తినేప్పుడు కూడా చదివేది :-) నాన్న అప్పుడప్పుడూ విసుక్కునే వారు ఏవిటా తిండి అని. నేను 9 చదివుతున్నపుడు మా ఇంట్లో ఒక double cot bed ఉండేది అది నా పాలిటి బద్ద శత్రువు నాకు దాని మీద కూర్చుని చదవడం ఇష్టం కానీ అదేం మాయో తెలీదు అప్పుడే ఓ గంట సేపు యోగా చేసి వచ్చినా సరే ఆ మంచం మీద కూర్చుని పుస్తకం తీయగానే వేళ తో సంబంధం లేకుండా పగలు రాత్రి ఉదయం మధ్యాన్నం ఎప్పుడైనా సరే నిద్ర అలా ముంచుకొచ్చేది. దాంతో అమ్మ ఒకో సారి తిట్టి దాని చుట్టు పక్కల ఉండద్దు అని దూరం గా కూర్చో పెట్టి చదివించేది.

అసలు నేను చిన్నప్పుడు చదవడం భలే వింత గా ఉండేది.
ఎప్పుడో మా తాత గారు నన్ను చందమామ కధలు పెద్ద గా చదివి పెట్టమని అడిగినపుడు తప్ప నేను ఎప్పుడూ మనసులో చదువుకునే వాడ్ని. ఇంకా చదువుకునేప్పుడు చాలా చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసే వాడ్ని. గోడ పక్కన కింద పడుకుని కాళ్ళు ఇంచు మించు శీర్షాసనం వేసిన రేంజ్ లో పైకి గోడ మీదకి చాపి గుండెల మీద పుస్తకం పెట్టుకుని చదువుకునే వాడ్ని. ఒకో రోజు మంచం మీద పడుకుని కింద నేల మీద పుస్తకం పెట్టుకుని దాని మీదకి వాలిపోతూ చదివే వాడ్ని. ఇంకో రోజు కింద పడుకుని కాళ్ళు మోకాళ్ళ వరకు మంచం మీద పెట్టుకుని చదివే వాడ్ని. అమ్మ తిడుతూండేది అలా పిచ్చి పిచ్చి వేషాలేస్తే పేగు పడి కడుపు నొప్పి వస్తుంది రా... అని... అయినా మనం వింటే కదా ఓ రోజు నిజం గానే పేగు పడి కడుపు నొప్పి వస్తే అప్పుడు మా స్కూల్ లో ఉండే బజారయ్య వచ్చి ఇటుకరాయి కట్టి పొట్ట మీద రుద్ది ఏదో చేసి తగ్గించాడు. అతని గురించి మనం ఇంకో టపా లో చెప్పుకుందాం లెండి.

అసలు వీటన్నింటి కన్నా అద్భుతమైన అయిడియా అంటే నేను మా ఇంట్లో మధ్య గది లోనో లేకా ఒకో సారి వరండాలోనో పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం అని ఏమీ ఆలోచించకుండా ఇంట్లో గోడ పక్కన గొడుగు వేసుకుని ఎవరికి కనపడ కుండా ఆ గొడుగు కింద కూర్చుని చదువుకునే వాడ్ని. మొదటి సారి నన్నలా చూసిన మా ఇంట్లో వాళ్ళు కాస్త ఖంగారు పడిన మాట వాస్తవమే కానీ తర్వాత ఎలాగో అలా చదువుతున్నాడు కదా అని వదిలేసారు. సీజనల్ గా అప్పుడప్పుడూ ఇలాంటి పనులు చేస్తుండే వాడ్ననమాట. స్కూల్ ఇంటి పక్కన ఉన్నంత కాలం బాగానే సాగింది కానీ నేను నాలుగు లొ ఉన్నపుడు అనుకుంటా మా ఇంటికి కొంచెం దూరం గా మార్చేసారు. అప్పుడు మళ్ళీ కొంచెం కష్టాలు మొదలయ్యాయ్ కానీ అలవాటైన బడి కావడం తో బాగానే వెళ్ళే వాడ్ని. మన మూడ్ బాలేపోతే అమ్మకి ముప్పై నాలుగు వంకలు పెట్టేవాడ్నిట కట్టుకున్న చీర బాలేదనో పెట్టుకున్న జుట్టు ముడి నచ్చలేదనో....అలా జుట్టు ముడి వేసుకుంటే నన్ను స్కూల్ దగ్గర వదిలి పెట్టడానికి రానిచ్చే వాడ్ని కానంట.

కొన్ని రోజులకి ఫ్రెండ్స్ తో కలిసి నా అంతట నేనే వెళ్ళడం అలవాటు చేసుకున్నా... ఒక్కడ్నే వెళ్ళడానికి కూడా పెద్ద గా భయపడే వాడ్ని కాను కాని మనకి కుక్కలు అంటే భయం ఎక్కువ చిన్నప్పటి నుండీ ఇప్పటికీ పెంపుడు కుక్కలైనా సరే పక్కన ఉంటే కొంచెం ఇబ్బంది పెడుతుంటా
యి. అప్పుడు చిన్నతనం కదా కొంచెం ఖంగారెక్కువ అల్లంత దూరాన కుక్కని చూసి ఇక్కడ పరుగు లంకించుకో బోయి కింద పడి పోయి మోకాళ్ళకి దెబ్బలు తగిలించుకునే వాడ్ని అలా ఎన్ని సార్లు జరిగిందో. ఇంకా ఒకో రోజు దారి వెంట కుక్కలేమీ కనపడక పోతే అప్పుడు రక రకాల ఆటలు గుర్తొచ్చేవి. పైన వేలాడే కరెంట్ తీగ ల నీడలు రోడ్ మీద పడతాయి కదా. ఆ తీగల నీడలనే గాలి లో రెండు కర్రల మధ్య మోళీ వాడు కట్టే తాడు లా ఊహించుకుని... రెండు చేతులు గాల్లో పెట్టి బుజాన సంచి వేలాడేసుకుని రోడ్ మీద ఆ నీడలపై బేలన్స్ చేస్తూ నడిచేవాడ్ని. అలసట తెలీకుండా ఉండటానికి మనం కనిపెట్టిన ఆట అది. కానీ ఓ రోజు మా ఇంటి దగ్గర అలా నడుస్తుంటే మా ఇంటి ఓనరు గారమ్మాయి డాబా మీదనుండి చూసి గాట్టి గా నవ్వింది పైగా అప్పుడే దాన వీర శూర కర్ణ సినిమా చూసి ఉన్నానేమో..." భరింప రాని అవమానము... హా హతవిధీ..!! హా హతవిధీ..!! అనుకుని అప్పటి నుండి ఆ ఆట ఆపేయాల్సొచ్చింది.

మరిన్ని కబుర్లతో మరో రోజు కలుద్దాం. అంత వరకు శలవా మరి...
--వేణు.

15 వ్యాఖ్యలు:

 1. >>మా ఇంట్లో మధ్య గది లోనో లేకా ఒకో సారి వరండాలోనో పట్ట పగలు మిట్ట మధ్యాన్నం అని తేడా లేకుండా ఇంట్లో గోడ పక్కన గొడుగు వేసుకుని ఎవరికి కనపడ కుండా ఆ గొడుగు కింద కూర్చుని చదువుకునే వాడ్ని.

  ఇది మాత్రం ulti...!!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా బాగుంది. బహుశా అందరి జీవితాల్లో ఇలాంటి అనుభవాలుంటాయేమో!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Hi venu,
  medha garu cheppinadi daanitho paatu
  మా ఇంటి ఓనరు గారమ్మాయి డాబా మీదనుండి చూసి గాట్టి గా నవ్వింది పైగా అప్పుడే దాన వీర శూర కర్ణ సినిమా చూసి ఉన్నానేమో..." భరింప రాని అవమానము... హా హతవిధీ..!! హా హతవిధీ..!!
  idi kuda adirindi.Nice post.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. భలే ఉన్నాయండీ మీ పోస్టులు ! నేను అస్తమానూ మంచం కింద దూరి చదువుకునేదాన్ని. అక్కడే నిద్ర పోయేదాన్ని. నా స్థావరం అక్కడే అని అందరికీ తెలుసు. ఇంట్లో ఎక్కడా కనపడక పోతే, మంచం కింద దొరుకుతానని తెలుసు ! మా చెల్లి పుట్టాకా, దాని తో ఆటలు కూడా మంచం కిందా, టేబుల్ కిందా నే ! ఆ రోజులన్నీ గుర్తు చేస్తున్నారు !

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నేను చదువుకోవాలంటే రేడియో లోనో, టేప్ రికార్డర్ లోనో మంచి మంచి పాత హింది, లేదా తెలుగు పాటలు వినిపిస్తూ ఉండాలి. అప్పుడు నేను వాటిని డామినేట్ చేస్తూ పైకి చదువుతానన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీ టపా చదువుతుంటే చాలా విషయాలు నావిలాగే ఉన్నాయి !!!!
  నేను కూడా చదివేప్పుడు మీరు చెప్పిన భంగిమలలోనే చదివేవాడిని :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. బావున్నాయ్ మీ అనుభవాలు.

  -- విహారి

  ప్రత్యుత్తరంతొలగించు
 8. భలే భలే.........
  మీ భంగిమలు బావున్నాయి. నా స్కూల్ డేస్ బాగా గుర్తు చేసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఓ! భలే అనుభవాలు మీవి.
  నేనయితే ఎప్పుడూ గదికి బోల్టు వేసి చదవాల్సిందే... ఎందుకంటే అలాగయితే బాలమిత్రలూ, చందమామలూ, టింకిల్ లూ చదువుకోవచ్చుగా :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నేను కూడా మీరు చెప్పిన భంగిమలలోనే ....ippaTikii alaane...

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @మేధ గారు,
  నెనర్లు

  @మహేష్ గారు,
  నెనర్లు

  @క్రాంతి గారు,
  నెనర్లు

  @Sujata గారు నెనర్లు
  మీరు చదువుకునే ప్లేస్ భలే ఉందండీ...

  @సుజాత గారు నెనర్లు
  నాకు కూడా పాటలు వింటూ చదువుకోడం అలవాటండీ మొదట్లో ఇంట్లో తిట్టే వారు కానీ తరవాత దాని వల్ల ఎక్కువ టైం ఫోకస్ చేసి చదువుతున్నా అని గమనించి వదిలేసారు.

  @ప్రపుల్ల చంద్ర గారు
  నెనర్లు... మీ జ్ఞాపకాలని గుర్తు చేయగలిగినందుకు సంతోషం

  @విహారి గారు
  నెనర్లు

  @శ్రీవిద్య గారు
  నెనర్లు

  @ప్రవీణ్ గారు
  నెనర్లు, మీ ప్లాన్ బావుందండీ...

  @రాధిక గారు
  నెనర్లు... నాకు కూడా ఇప్పటికీ ఇంట్లో ఇలానే చదవడం అలవాటండీ...

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మీ జ్ఞాపకాల పూలవానలో తడిచిపోయాను
  ఎన్నో మధుర స్మృతుల ఆనాటి వానచినుకులు మరలా కురిసాయ్.
  థాంక్యూ
  బొల్లొజుబాబా

  ప్రత్యుత్తరంతొలగించు
 13. బాబా గారు మీ కామెంట్ కూడా మీ కవిత లా అందం గా వుందండీ.. నెనర్లు..

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నాకు చిన్నప్పటినుంచీ ఏదోకటి చదూతుండటమే ఇష్టం. అందుకు రీసన్ ఒక బ్లాగు రాస్తానులే. అందులోనూ పెద్ద మంచం మీద మంచి దిండు పెట్టుకుని అలావెల్లికిలా పడుకుని చదూతుంటే ... ఆ ఫీలింగే వేరు. అలా పడుకుని హోం వర్క్ చేయలేముకదా అందుకనే ఏనాడూ చెయ్యలేదు.

  మీ శీర్షాసనాలూ అవీ బాగున్నాయి. మీ బలన్సింగ్ ఆటలాగా నేను రాళ్ళని కాలితో తంతూ సైడ్ కెనాల్లో పడితే 4, ఎగిరి పడితే 6, అని ఆడేవాడిని. చెప్పుల గతా ... మన డబ్బులు కాదుగా...

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @ గీతాచార్య గారు నెనర్లు
  అవునండీ భలే గుర్తు చేసారు, నేను కూడా అలా ఒక రాయినో దేన్నో టార్గెట్ చేసి ఇంటికి వెళ్ళే వరకు కొట్టుకుంటూ వెళ్ళేవాడ్ని. ఒక వేళ పొరపాటున ఏ కాలవలోనో పడిపోతే అయ్యో అని తెగ ఫీలింగ్ మళ్ళీ :-)
  మరి త్వరగా వ్రాసేయండి చదువు గురించిన టపా...

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.