గురువారం, జులై 31, 2008

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే !!

ఓ నాల్రోజులు గా ఎందుకో ఈ పాట పదే పదే గుర్తొస్తుంది. ఈ పాట సాహిత్యమో లేదా mp3 నో దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఓ నెల క్రితం సుజాత(గడ్డిపూలు) గారు కూడా ఈ పాట గుర్తు చేసుకోడం చూసాను. మొత్తం మీద నా కలక్షన్ నుండి తవ్వి తీసి సాహిత్యం తో పాటు వినడానికి లింక్ కూడా ఇస్తే అందరూ మరో సారి ఈ మధురమైన పాట ని ఆస్వాదిస్తారు, తెలియని వాళ్ళకి పరిచయం చేసినట్లూ ఉంటుంది అని ఈ రోజు ఈ పాట ఇక్కడ మన అందరి కోసం. పాలగుమ్మి గారి సాహిత్యం వేదవతీ ప్రభాకర్ గారి గానం తో ఈ పాట చాలా హాయైన అనుభూతినిస్తుంది.

Amma Donga Ninnu C...


సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథ్
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్
గానం : వేదవతీ ప్రభాకర్

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. ||2||
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ఊ..ఊ..ఉ..
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను... చూడకుంటే.. నాకు బెంగా...

||అమ్మ దొంగా||

కధ చెప్పే దాకా కంట నిదుర రాకా...
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా...
కధ చెప్పే దాకా నన్ను కదలనీక....
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...

||అమ్మ దొంగా||

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...||2||

||అమ్మ దొంగా||

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి...

||అమ్మ దొంగా||

28 వ్యాఖ్యలు:

 1. మంచి పాటపెట్టారు. ఇది మా అమ్మాయి కోసం రోజూ రాత్రి పాడుతోండేవాడిని. ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
  నిలువలేక నా మనసు నీ వైపే లాగితే... అన్న దగ్గర కొద్దిగా టచీగా అనిపించేది. మాఊరు ఒక్కసారి పోయిరావాలి అన్న పాట కూడా ఉంటే పెట్టండి. సరిగమలు గారు అడిగారు కానీ ఊరుమారాక ఇంకా నా కేసెట్ల కట్లు విప్పలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్రీకాంత్ గారు,
  పాట చాలా బావుంది. వింటుంటే ఎంతో హాయిగా ఉంది. కాకపొతే ఇది ఏ సినిమా లోదే తెలియడం లేదు కాస్త చెబుతారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కెవ్వ్వ్వ్వ్ ! ఐ లవ్ యూ ! చాలా థాంక్స్ అండీ.. కూడలి తెరవగానే.. మీ పోస్ట్ టైటిల్ చదివి ఇటు దూకేను. చాలా చాలా చాలా థాంక్స్.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ పాట వింటుంటే నాకు మా అయిదేళ్ల పాపాయి అప్పుడే అత్తగారింటికి వెళుతున్నట్టు ఫీలై కన్నీళ్ళొస్తాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చిన్నప్పటి దూరదర్శన్ గుర్తుకు తెచ్చారు. మంచి పాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. పాలగుమ్మి వారు కూడా వారి అమ్మాయిని కాపురానికి పంపి దిగులుతో వ్రాశారని ఈ పాటకి ఒక కధ..
  ఈ పాట మీకు సురస.నెట్ లో తేలికగా దొరికిఉండాలే

  ప్రత్యుత్తరంతొలగించు
 9. వేదవతీ ప్రభాకర్ గారు ఈ మధ్య UK లో ఉన్న ఏకైక తెలుగు చానెల్ "మన తెలుగు" చానెల్ లో ప్రత్యక్షమయ్యే సరికి ఎంత ఆనందమేసిందో. ఆ ఊపులో వారు పాడిన పాటలను వెతికితే పది దొరికాయి. అవి వినటానికి ఇక్కడ చూడండి. ఎక్కడ నుంచి download చేసుకున్నానో గుర్తులేదు. వెతికి మళ్ళీ ఇక్కడ పెడతా, అంతవరకు విని ఆనందించండి.

  http://www.surasa.net/music/lalita-gitalu/#vedavati


  వేదవతీ ప్రభాకర్ గారు దూరదర్శన్ లో పాడిన ఆ రోజులలోనే పద్మనో లేక పద్మజ గారో ఒక ఆమె (చాల సన్నగా ఉండి, ఒంటి పేట ముత్యాల గొలుసు వేసుకొని చెయ్యి ఊపుతూ) మంచి లలిత గీతాలు పాడే వారు, ఆమె ఎవరికైనా గుర్తున్నారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. mm (బుంగ మూతి + అలక )

  నేను లింకు వెతికి, నా సంగతులు అన్నీ చెప్పి వ్యాఖ్య రాసేసరికి నా కంటే ముందు టైం స్టాంపుతో ఊకదంపుడుగారు చిన్న మాటతో అదే సమాచారం ఇచ్చేశారు.

  నేనోల్ల, నేనోప్ప :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చాలా థాంక్స్ .. అసలు ఈ పాట కోసమే వేదవతి ప్రభాకరా. ఆవిడ కోసమే ఈ పాటా అనిపించేది తరచూ దూరదర్శన్‍లో వింటుంటే. సాహిత్యం కూడా ఇచ్చినందుకు మరో సారి శతకోటి నమస్సులు. పద్మజ నా క్లాస్‍మేట్. స్కూల్లో అందరం ఏడిపించేవాళ్ళం. గాలికి ఎగిర్రిపోతావని.వాళ్ళ అమ్మగారు హై లోనే సంగీత పాఠశాల నడిపిస్తున్నారు. పద్మజ పెళ్ళై అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పాడుతూ కనపడలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. చాలా మంచి పాట.
  "ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె", ఇది వినగానే ఆడపిల్ల ఉన్నవాళ్ళకి ఎవరికైనా అప్రయత్నంగా దిగులు మొదలవుతుంది..
  శ్రీకాంత్ గారు, అదే చేత్తో "మాఊరు ఒక్కసారి పోయిరావాలి" పాట కూడా వెతుకుదురూ!!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఈ పాట అప్పట్లో ALL INDIA RADIO లో చాల చాల పాపులర్ అయిన పాట. TV లు ఆంధ్రా లో రాక మునుపే పాపులర్ అయిన పాట. www.surasa.net ఇంకా ఎన్నో ఎన్నెన్నో పాత పాటలు, పద్యాలూ, రేడియో పాటలు, పాఠాలు వినవచ్చు. అదొక సంగీత సముద్రం. ఎన్నో విలువైన, వేరే ఎక్కడా దొరకని సంగీత గని. నిర్వాహకులు ఎంతో అభినందనీయులు. వారి ఋణం తీర్చు కోలేనిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. అందరికీ నెనర్లు, సమయాభావం వలన వెంటనే జవాబివ్వలేకపోయినందుకు క్షంతవ్యుడ్ని. (దూరదర్శన్ టెర్మినాలజీ అనిపిస్తుందా:-)

  @ సత్య సాయి గారు నెనర్లు
  అవునండీ నాకైతే మొదటి చరణం లో పాపాయి అల్లరి రెండవ చరణం లో అమ్మ బెంగ మూడవ చరణం లో అమ్మ మనసు అన్నీ చక్కగా ఇమిడాయనిపిస్తుంది పాట విన్న ప్రతీ సారి.

  @ కల గారు నెనర్లు
  ఈ పాటికి మీకు అర్ధం అయి ఉంటుంది. ఈ పాట సినిమా లోది కాదండీ లలితగీతం వేదవతీ ప్రభాకర్ గారి లలిత గీతాలు కేసెట్ దొరుకుతుంది లేదంటే surasa.net లో కూడా వినచ్చు. ఈవిడే పాడిన జోజోముకుంద అనే ఆల్బం raaga.com లో వినచ్చు అందులో కొన్ని పాటలు బాగానేవుంటాయ్.

  @ Sujata గారు నెనర్లు
  బాగా ఆనందించారనమాట అన్ని చాలా లు ఎందుకండీ... నాకు చాల ఇష్టం ఈ పాట అందుకే వెంటనే కూర్చుని సాహిత్యం రాసుకున్నాను.

  @ teresa గారు నెనర్లు

  @ సుజాత గారు నెనర్లు
  నిజమే నండీ పాట పాడిన విధానం కూడా అలా ఉంటుంది.

  @వికటకవి గారు నెనర్లు

  @ మీను నెనర్లు

  @ ఊకదంపుడు గారు నెనర్లు
  ఓ అవునా !! అయి ఉంటుందండీ అందుకే అంత చక్కగా వ్రాయగలిగారేమో... సురసా లో ఉంది కానీ ఇక్కడ వినడానికి లింక్ ఇవ్వడం కుదరలేదండీ అందుకే నా దగ్గర ఉన్న mp3 esnips లో పెట్టి Widget add చేసాను. పాట చదువుతూ వినచ్చు అని :-)

  @ భావకుడన్ గారు నెనర్లు
  సురస లింక్ ఇచ్చినందుకు నెనర్లు వేదవతి గారి జోజోముకుందా ఇంకా కొన్ని పాటలు రాగ.కాం లో కూడా వినచ్చండీ. అందులో క్వాలిటీ ఇంకా బావుంటాయ్ పాటలు ఇంత గొప్పగా ఉండవ్ కాని చాలా సినిమా పాటల కన్నా మేలు.

  :-) అలా బుంగమూతి పెట్టి అలిగితే ఎలా :-) ఈ సారి ఊకదంపుడు గారి చాన్స్ మీరుకొట్టేయండి.

  @ ఆనందం గారు నెనర్లు

  @ జ్యోతి గారు నెనర్లు
  వేదవతి గారి గురించి బాగా చెప్పారండీ... అయ్యో నమస్సులు ఎందుకండీ... పద్మజ గారి వివరాలు చెప్పినందుకు నెనర్లు

  @సిరిసిరిమువ్వ గారు నెనర్లు
  మీ టపా లో చూసినప్పటి నుండీ ఆ పాటకోసం వెతుకుతూనే ఉన్నానండీ దొరకడం లేదు. ఈ నెలలో ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితం గా సంపాదిస్తాను. వచ్చిన వెంటనే టపాయించేస్తా...

  @krishnarao గారు నెనర్లు
  నిజమేనండీ సురస నిర్వాహకులు అభినందనీయులు. chimatamusic.com అని ఇంకోటి ఉంది అక్కడ కూడా అన్ని 70'స్ 80'స్ పాటలు వినచ్చు చాలా మంచి పాటలు ఉంటాయ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. లలితగీతాలు ఈమధ్య ఎక్కడా వినిపించడమే లేదు. అంతర్జాలంలో కూడా ఎన్నెన్నో రేడియోలున్నాయి. వాళ్లు కూడా వినిపించడంలేదు. 'నా కలెక్షన్ నుంచి తవ్వి తీసి' అన్నారు - ఇంకా తవ్వమని, తీస్తూవుండమని ప్రార్థన. ఆమధ్య ఒకసారి సత్యసాయిగారన్నట్టున్నారు ఈ లలితగీతాల తవ్వకం మొదలుపెట్టాలనే ఆలోచన వుందని. మీరిద్దరూ కలిస్తే కొన్ని మరుగున పడిన స్వతంత్రమైన మంచి పాటలు వినే అవకాశం మాకూ కలుగుతుంది. మీరోసారి ఈ టపా చూడండి - ఆచార్యుల బ్లాగు లోనిది: http://satyasodhana.blogspot.com/2007/03/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @ రానారె గారు నెనర్లు
  నా కలక్షన్ అంటే పాత కొత్త పాటల mp3 లు అన్నీనండీ కాని అన్నీ సరిగా అర్గనైజ్డ్ గా లేవు జ్ఞాపకం వచ్చినవి వెతికి టపా లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక ప్రస్తుతం లలిత గీతాలు అంటారా ఇదంతా రీమిక్స్ ల యుగం లలిత గీతాల కోసం వెదకడం సాహసమే..

  అన్నట్లు నా దగ్గర చాలా mp3 లు పాతబంగారం అనే చోటనుండి తీసుకున్నవే. ఇక్కడ చాలా మంచి పాటలు ఉన్నాయి. వీళ్ళు 2000 తర్వాత పాటలు అసలు లోడ్ చేయరు కేవలం అంతకు ముందు వచ్చిన పాటలు మాత్రమే ఉంటాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. అవును వేణూ,
  రీ మిక్స్ యుగంలో లలిత గీతాల కోసం వెదకటం సాహసమే! అప్పట్లో అమ్మ దొంగా పాటతో దీటుగా ప్రాచుర్యం పొందిన పాట ద్వారం లక్ష్మి పాడిన 'పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు "! పెద్ద పెద్ద కళ్ళేసుకుని ఆమె పాడుతుంటే ఎంత కమ్మగా ఉండేదో ఆ పాట! అది నా ఫేవరెట్ పాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. what a coincidence sujata gAru, I am just typing the lyriks for "poovuleri teve" for my next post :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 19. భావకుడన్ గారు,
  వేదవతీ ప్రభాకర్ గారు మరో గాయని ( ఛాయాదేవి?) తో కలిసి కొన్ని మంచి లాలిపాటలు పాడారు. దూరదర్శనంలో ఇవి తరచు ప్రసారమౌతూ ఉండేవి. విశేషమేమంటే, ఇందులో కొన్ని లాలిపాటలు ఆడ శిశువు కోసమై ఉన్నాయి. జో జో ముకుందా 1,2 లలో ఇవి లేవు.
  కాస్త వెతికి పెట్టి పుణ్యం కట్టుకుందురూ.
  భవదీయుడు
  ఊకదంఫుడు

  ప్రత్యుత్తరంతొలగించు
 20. ఈ టపా మిస్ అయ్యాను. భగవాన్ గారి బ్లాగులోంచి లింకు పట్టుకొని ఇక్కడ తేలాను.

  ఈ పాట సాహిత్యం గురించి నా బ్లాగులో మా అమ్మాయి కవితకు చంద్రమోహన్ గారు వ్రాసిన కామెంటులో ఉటంకించారు కూడా.

  అప్పటినుంచీ చూస్తున్నాను.
  ఇది చదువుతుంటే చాలా టచింగా ఉంది. సుజాత గారన్నట్లు మా 9 ఏళ్ల పాపకు అప్పుడే అప్పగింతలు పెడుతున్నట్లు ఉంది.

  ఈ పాటను మాకాలేజీలో ఒక అమ్మాయి చాలా ఆర్ధ్రంగా పాడేది. అప్పట్లో రాగాన్నే తప్ప భావాన్ని ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు చేయగలుగుతున్నాను.

  థాంక్యూ వెరీ మచ్

  బొల్లోజు బాబా

  ప్రత్యుత్తరంతొలగించు
 21. Venu Garu - Can I please know where you have posted the lyrics for Poovuleri Teve .. I too recollect only the memory of Dwaram Lakshmi singing that song so lovely on Doordarshan way back in 1990s.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. Hello Lallu Yadav గారు, ద్వారం లక్ష్మి గారి పాట నాకు దొరకలేదండీ... వేదవతి గారు పాడిన పూవులేవి తేవే చెలి పాట ఈ బ్లాగ్ లోనే ఉంది లింక్ ఇదిగో.
  పూవులేవి తేవే

  ఒక వేళ ఇది పని చేయక పోతే ఈ పక్కన ఉన్న ముఖ్యవిభాగాలలో లలితగీతాలు మీద క్లిక్ చేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.